Monday, August 29, 2022
Kursi Nashin సర్టిఫికేట్
Kursi Nashin సర్టిఫికేట్
.
ఇటీవల సోషల్ మీడియాలో 1887 లో జారీచేసిన kursi nashin సర్టిఫికేట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. kursi nashin అంటే సదరు వ్యక్తి బ్రిటిష్ అధికారుల ఎదుట కుర్చీలో కూర్చొనే అర్హత కలిగిఉన్నాడంటూ ఇచ్చే సర్టిఫికేట్. ఎక్కడినుంచో వచ్చిన బ్రిటిష్ వాడు మనగడ్డపై మనల్ని కుర్చీలో కూర్చోనివ్వలేదు; ఇది వాళ్ళ జాత్యాహంకారం అంటూ చాలా ఆవేశంగా వాదిస్తున్నారు కొంతమంది. ఆ వాదనలో చారిత్రిక అవగాహన లేకపోవటం, రేసిజం తప్ప మరొకటి కనిపించదు.
ఈ kursi nashin వ్యవస్థను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టలేదు. ఇది భారతదేశంలో మొఘల్ పాలననుంచీ నడిచిన ఒక వ్యవస్థ. నిజానికి ఇది పురప్రముఖులకు ఇచ్చే బిరుదులాంటిది.
kursi nashin అనేది మొఘలుల పాలనలో రాజ దర్భారులో కూర్చునేందుకు ప్రముఖులకు ఇచ్చె ఒక అధికారిక అనుమతి.
మొఘలుల రాజ దర్భారులో కూర్చోవటానికి అర్హత కలిగిన వారిని దర్భారీలు అంటారు. వీరి సంఖ్యపరిమితం. వీరికి అర్హతను బట్టి కుర్చీలు కేటాయించేవారు. ప్రతీ కుర్చీకి నంబరు ఉంటుంది. దర్భారీలు తమకు కేటాయించిన కుర్చీలలో మాత్రమే కూర్చోవాలి. చక్రవర్తికి దగ్గరగా ఉండే కుర్చీలలో రాజ్యంలోని అత్యంత ప్రముఖులు కూర్చుంటారు. కొత్తగా దర్భారీ హోదా పొందినవారికి చివరి వరుసలో కుర్చీలు కేటాయించబడేవి. అలా ఆ కుర్చీల అమరికలో ఒక అధికార వరుసక్రమం ఉంటుంది.
ముందువరుసలోని దర్భారీలు మరణించినా లేక వారు తమ పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నా వారి స్థానంలోకి వెనుక వరుసలలోని వ్యక్తులు ముందుకు జరిగి దర్భారీ అంతస్తులో పైకి చేరతారు.
చాలా సందర్భాలలో ఈ కుర్చీ హోదా వంశపారంపర్య హక్కుగా పొందేవారు. కొన్ని సందర్భాలలో గొప్ప ప్రతిభవల్ల పై అంతస్తులలోకి చేరటం జరిగేది. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లా దర్భారులో (పాకిస్తాన్ లోని ) Makhdum of Hala అనే పీర్ సూఫీ సాధువు జనాదరణ/రాజాదరణ పొంది- 1880 లో దర్భారు కుర్చీ 71వ స్థానం నుండి క్రమంగా ఏడవ స్థానానికి చేరుకొన్నాడు.
ఈ మొత్తం వ్యవస్థను kursi nashin అనేవారు. దర్భారీలుగా సాధారణంగా సామంతులు, ధనిక వ్యాపారులు, పండితులు, మతాచార్యులు, కవులు ఉండేవారు.
ప్రముఖ ఉర్దూ కవి మిర్జా గాలిబ్ (1796-1869) 1840 లో ముఘల్ దర్బారులో కూర్చొనే అర్హత పొందిన ఒక kursi nashin. ఈ వ్యవస్థను హిందూరాజులు కూడా పాటించేవారు. రాజ సభలో ప్రముఖులు తప్ప ఇతరులు అందరూ నిలుచునే ఉండాలి. ఎవరైనా సరే వెళిపోయేటపుడు రాజుగారికి తమ వీపును చూపించరాదు. రాజు చూసేవరకూ తలదించుకొనే ఉండాలి. రాజుగారి కళ్ళలో కళ్ళుపెట్టి చూడరాదు. ఇవి ఆనాటి రాజ సభలోని ఫ్యూడల్ కట్టుబాట్లు.
బ్రిటిష్ పాలన వచ్చాకా దర్భారులు పోయాయి. కలక్టరేట్ ఆఫీసులే అధికార కేంద్రాలు. అవే అనధికార దర్భారులు. బ్రిటిష్ అధికారులు పాత పద్దతినే కొనసాగించారు.
జిల్లా కలక్టర్ తన ఆఫీసులో స్థానికంగా ముఖ్యులైన వారికి స్థానం కల్పించి వారికి kursi nashin సర్టిఫికేట్లు జారీచేసేవాడు. జిల్లాలో kursi nashin సర్టిఫికేట్ల సంఖ్య పరిమితంగా ఉండేది. అది పొందటం గొప్ప గౌరవచిహ్నం. వీరిలోంచే కొంతమందిని ఎంపికచేసి వైస్రాయ్ ని, గవర్నరుని కలవటానికి అనుమతించేవారు.
అప్పట్లో వ్యక్తులు తమ పేర్ల వెనుక kursi nashin అని రాసుకొనేవారు ఒక హోదాలాగ.
ఇరవయ్యవ శతాబ్దం వచ్చాక ప్రజాస్వామ్య పద్దతులు అమలులోకి వచ్చి, క్రమేపీ ఈ సంప్రదాయం అంతరించిపోయింది.
నేడు kursi nashin సర్టిఫికేట్లు లేవు కానీ అనుమతిలేకుండా ఒక కలక్టరు లేదా ఒక ఎమ్మెల్యే, ఎంపి ల ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చొనే సాహసం ఎవరూ చేయలేరు. అపాయింట్ మెంట్ లేనిదే అసలు లోనికే అనుమతించరు. ఒకనాటి kursi nashin సర్టిఫికేట్ లాంటివే నేటి విఐపి పాసుల పద్దతి.
బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Mirza Ghalib Malik Ram
2. Sufi Saints and State Power - The Pirs of Sind, 1843 1947, by Sarah Ansari
3. In an Indian district; an enlarged ed. of Police notes by G.G.B. Iver
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment