Monday, August 29, 2022

శ్రావణమాసపు వానలు

.
కొలనులో బాతొకటి
నీటిలో బుడుంగున మునిగింది
కంగారుపడిన ఓ కప్ప
తామరాకుపైకి గెంతింది
ఈ సవ్వడికి
తామరపూవుపై వాలిన
తుమ్మెద గాలిలోకి లేచింది
దాని రెక్కల కదలికలకు
అంతవరకూ
స్తబ్దుగా ఉన్న ఋతుపవనాలు
తమ ప్రయాణం ప్రారంభించాయి


నీటిలోంచి బాతు పైకి లేచేసరికి
శ్రావణమాసపు వానజల్లులు


బొల్లోజు బాబా

Kursi Nashin సర్టిఫికేట్



Kursi Nashin సర్టిఫికేట్
.
ఇటీవల సోషల్ మీడియాలో 1887 లో జారీచేసిన kursi nashin సర్టిఫికేట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. kursi nashin అంటే సదరు వ్యక్తి బ్రిటిష్ అధికారుల ఎదుట కుర్చీలో కూర్చొనే అర్హత కలిగిఉన్నాడంటూ ఇచ్చే సర్టిఫికేట్. ఎక్కడినుంచో వచ్చిన బ్రిటిష్ వాడు మనగడ్డపై మనల్ని కుర్చీలో కూర్చోనివ్వలేదు; ఇది వాళ్ళ జాత్యాహంకారం అంటూ చాలా ఆవేశంగా వాదిస్తున్నారు కొంతమంది. ఆ వాదనలో చారిత్రిక అవగాహన లేకపోవటం, రేసిజం తప్ప మరొకటి కనిపించదు.
ఈ kursi nashin వ్యవస్థను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టలేదు. ఇది భారతదేశంలో మొఘల్ పాలననుంచీ నడిచిన ఒక వ్యవస్థ. నిజానికి ఇది పురప్రముఖులకు ఇచ్చే బిరుదులాంటిది.
kursi nashin అనేది మొఘలుల పాలనలో రాజ దర్భారులో కూర్చునేందుకు ప్రముఖులకు ఇచ్చె ఒక అధికారిక అనుమతి.
మొఘలుల రాజ దర్భారులో కూర్చోవటానికి అర్హత కలిగిన వారిని దర్భారీలు అంటారు. వీరి సంఖ్యపరిమితం. వీరికి అర్హతను బట్టి కుర్చీలు కేటాయించేవారు. ప్రతీ కుర్చీకి నంబరు ఉంటుంది. దర్భారీలు తమకు కేటాయించిన కుర్చీలలో మాత్రమే కూర్చోవాలి. చక్రవర్తికి దగ్గరగా ఉండే కుర్చీలలో రాజ్యంలోని అత్యంత ప్రముఖులు కూర్చుంటారు. కొత్తగా దర్భారీ హోదా పొందినవారికి చివరి వరుసలో కుర్చీలు కేటాయించబడేవి. అలా ఆ కుర్చీల అమరికలో ఒక అధికార వరుసక్రమం ఉంటుంది.
ముందువరుసలోని దర్భారీలు మరణించినా లేక వారు తమ పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నా వారి స్థానంలోకి వెనుక వరుసలలోని వ్యక్తులు ముందుకు జరిగి దర్భారీ అంతస్తులో పైకి చేరతారు.
చాలా సందర్భాలలో ఈ కుర్చీ హోదా వంశపారంపర్య హక్కుగా పొందేవారు. కొన్ని సందర్భాలలో గొప్ప ప్రతిభవల్ల పై అంతస్తులలోకి చేరటం జరిగేది. ఉదాహరణకు హైదరాబాద్ జిల్లా దర్భారులో (పాకిస్తాన్ లోని ) Makhdum of Hala అనే పీర్ సూఫీ సాధువు జనాదరణ/రాజాదరణ పొంది- 1880 లో దర్భారు కుర్చీ 71వ స్థానం నుండి క్రమంగా ఏడవ స్థానానికి చేరుకొన్నాడు.
ఈ మొత్తం వ్యవస్థను kursi nashin అనేవారు. దర్భారీలుగా సాధారణంగా సామంతులు, ధనిక వ్యాపారులు, పండితులు, మతాచార్యులు, కవులు ఉండేవారు.
ప్రముఖ ఉర్దూ కవి మిర్జా గాలిబ్ (1796-1869) 1840 లో ముఘల్ దర్బారులో కూర్చొనే అర్హత పొందిన ఒక kursi nashin. ఈ వ్యవస్థను హిందూరాజులు కూడా పాటించేవారు. రాజ సభలో ప్రముఖులు తప్ప ఇతరులు అందరూ నిలుచునే ఉండాలి. ఎవరైనా సరే వెళిపోయేటపుడు రాజుగారికి తమ వీపును చూపించరాదు. రాజు చూసేవరకూ తలదించుకొనే ఉండాలి. రాజుగారి కళ్ళలో కళ్ళుపెట్టి చూడరాదు. ఇవి ఆనాటి రాజ సభలోని ఫ్యూడల్ కట్టుబాట్లు.
బ్రిటిష్ పాలన వచ్చాకా దర్భారులు పోయాయి. కలక్టరేట్ ఆఫీసులే అధికార కేంద్రాలు. అవే అనధికార దర్భారులు. బ్రిటిష్ అధికారులు పాత పద్దతినే కొనసాగించారు.
జిల్లా కలక్టర్ తన ఆఫీసులో స్థానికంగా ముఖ్యులైన వారికి స్థానం కల్పించి వారికి kursi nashin సర్టిఫికేట్లు జారీచేసేవాడు. జిల్లాలో kursi nashin సర్టిఫికేట్ల సంఖ్య పరిమితంగా ఉండేది. అది పొందటం గొప్ప గౌరవచిహ్నం. వీరిలోంచే కొంతమందిని ఎంపికచేసి వైస్రాయ్ ని, గవర్నరుని కలవటానికి అనుమతించేవారు.
అప్పట్లో వ్యక్తులు తమ పేర్ల వెనుక kursi nashin అని రాసుకొనేవారు ఒక హోదాలాగ.
ఇరవయ్యవ శతాబ్దం వచ్చాక ప్రజాస్వామ్య పద్దతులు అమలులోకి వచ్చి, క్రమేపీ ఈ సంప్రదాయం అంతరించిపోయింది.
నేడు kursi nashin సర్టిఫికేట్లు లేవు కానీ అనుమతిలేకుండా ఒక కలక్టరు లేదా ఒక ఎమ్మెల్యే, ఎంపి ల ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చొనే సాహసం ఎవరూ చేయలేరు. అపాయింట్ మెంట్ లేనిదే అసలు లోనికే అనుమతించరు. ఒకనాటి kursi nashin సర్టిఫికేట్ లాంటివే నేటి విఐపి పాసుల పద్దతి.
బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Mirza Ghalib Malik Ram
2. Sufi Saints and State Power - The Pirs of Sind, 1843 1947, by Sarah Ansari
3. In an Indian district; an enlarged ed. of Police notes by G.G.B. Iver

నాలుగు రంగులు మిగిల్చే కవిత ~ బొల్లోజు బాబా, OCTOBER 6, 2016



Happy birthday Manasa chamarthi gaaru.
ఒక పాత పోస్టు
ఏ కవితైనా అది కవియొక్క స్వీయప్రకటన. దానాలుగు రంగులు మిగిల్చే కవిత ~ బొల్లోజు బాబా, OCTOBER 6, 2016నికి సృష్టికర్త కవే . ఆ కవితను చదువుతున్నంత సేపూ ఆ కవి మనస్సులో ఆ సమయంలో కదలాడిన భావాలే కాక, ఆ కవి హృదయసంస్కారం కూడా అంతర్లీనంగా కనిపిస్తూంటుంది. కొన్ని కవితలు తమవైన కొత్తలోకాల్ని సృష్టించి, మనల్ని చేయిపట్టుకొని వాటిలోకి తీసుకెళ్ళి అలౌకికానందాలను పంచుతాయి. కవితపూర్తయ్యాకాకూడా ఆ లోకంలోనే సంచరిస్తూ ఆ మథురభావనల్లో ఉండిపోతాం చాలాసేపు.
మానస చామర్తి వ్రాసిన “వర్ణచిత్రము” అనే కవిత చదివాకా ఎందుకో ఈ మధ్య వచ్చే కవిత్వానికి భిన్నంగా అనిపించింది.
ప్రకృతి జీవితంలోకి ఎలా ప్రవేశించాలని ప్రయత్నిస్తుందో అదే సమయంలో జీవితం ఆ సౌందర్యాన్ని పీల్చుకొని జ్ఞాపకాలుగా మలచుకొని భద్రపరచుకోవాలని ఎంతెలా ఆరాటపడుతుందో – అనే Conflict ను భలే గొప్పగా పట్టుకొందీ కవిత.
కొత్తరోజులన్నీ ఖాళీకాగితాలై అంటూ మొదలౌతుంది కవిత. ఎంత చక్కని భావన! గతకాలపు బరువులు లేకుండా తేలికగా ఎగిరే సీతాకోకచిలుకల్లా – కొత్తరోజులన్నీ తెల్లకాగితాలైతే, ఎన్నెన్ని వర్ణ చిత్రాల్ని చిత్రించుకోవచ్చో కదా అనిపించకమానదు. మంచి ఎత్తుగడకు ఉండే అడ్వాంటేజ్ ఇది. చదువరిని వేగంగా లోనికి లాక్కొంటుంది. డిసెంబరు పూవులు, ఆకుపచ్చని కొండలు, సూరీడు, చంద్రవంక అంటూ ఒక్కొక్క వర్ణచిత్రాన్నీ ఒక్కో పూలరేకలా విప్పుకొంటూ, కవిత ముగింపుకు వచ్చేసరికి ఒక రోజు కాలచక్రాన్ని పూర్తిచేస్తారు మానస గడుసుగా.
పసిమికాంతుల నెగురవేస్తూ, తెల్లగా నవ్విన చంద్రవంక, గొడుగులు పట్టే ఆకుపచ్చని కొండలు వంటి ప్రయోగాలు నవ్యమైన అభివ్యక్తి. హృద్యంగా ఉంది. What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself అంటాడు John Stuart Mill ఒక దృశ్యాన్ని చూసి చలించిన హ్రుదయం తన ఉద్వేగాల్ని తనంతతాను పదాలలోకి అనువదించుకొంటుంది సహజంగా. ఆ అనుభవం కొన్నిసార్లు పైకి ఆనందాన్నిమాత్రమే ఇచ్చేదిగా కనిపించినప్పటికీ హృదయాన్ని మార్ధవం చేసే శక్తిని లోలోపల కలిగిఉంటుంది.
హృదయసంస్కారాన్నివ్వటం కన్నా ఉత్తమోత్తమమైన సామాజికప్రయోజనం ఏముంటుంది? అందుకనే కదా కవిత్వాన్ని “హృదయసంబంధి” అని ఇస్మాయిల్ అన్నది.
“నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో” ఇలాంటి కవితలే “నాలుగు రంగులు మిగిల్చిపోతాయి” అనటానికి నేనేమాత్రం సందేహించను.
*
వర్ణ చిత్రం
-మానస చామర్తి
కొత్తరోజులన్నీ ఖాళీ కాగితాలై
రంగులద్దుకోవాలని నా ముందు
రెపరెపలాడతాయి.
తైలవర్ణచిత్రమేదో గీయాలని
తొందరపడతాయి వేళ్ళు.
వీచే గాలికి ఉబలాటంగా ఊగుతూ
ఖాళీ కాన్వాసు మీదకి ఎగిరి చూస్తూంటాయి
డిసెంబరు పూవులు
ఊదారంగు సముద్రం, పైనేమో నీలాకాశం
గరుడపచ్చ పూసలకు గొడుగులు పడుతున్నట్టు
ఆకుపచ్చాపచ్చని కొండలు
పసిమి కాంతుల నెగురవేస్తూ వెనుకొక లోకం
గీతలుగా మెదులుతూ చెదురుతున్న చిత్రం
పూర్తయ్యీ అవకుండానే
గుప్పెళ్ళతో కెంజాయలు రువ్వి
ఎర్రటి సూరీడెటో మాయమవుతాడా-
నల్లని రెప్పల తాటింపునాపి
నివ్వెరపాటుతో నిలబడిపోతుంది కుంచె
జీవితంలోని వర్ణాలనో
వర్ణాల్లోని జీవితాన్నో
జ్ఞాపకంగా నిల్పుకునే నేర్పు లేక
ఒళ్ళంతా ఒలకబోసుకుంటుంటే
అక్కడెక్కడి నుండో తొంగిచూసి
తెల్లగా నవ్విన చంద్రవంక
పెదాలపై నవ్వు ముద్దరై వెలుగుతుంది.
చిత్రం పూర్తవకపోతేనేం..?
చలిలోకి ముడుచుకునే వేళయ్యేసరికి
ఆనందం అర్ణవమయ్యీ,
సౌందర్యం అనుభవమయ్యీ,
తీరం వెంట తడితడిగుర్తులతో
అసంపూర్ణ చిత్రాలన్నీ పరుగులు తీస్తాయి.
నలుపొక్కటే మిగలాల్సిన ఈ లోకంలో,
నా బొమ్మలు నాలుగు రంగులు మిగిల్చి పోతాయి.


అభినందనలు

 మా యానాం పెద్దొర గారికి

అభినందనలు
బొల్లోజు బాబా


Wednesday, August 17, 2022

ఒక వెచ్చని హాయి....


రెక్కలు చాచుకొని వాలుతున్న రాత్రిని
మెల్లమెల్లగా తడుపుతోంది వాన
ఆకుల అంచులపై తడిచీకటి
తళతళా మెరుస్తోంది.
తప తప శబ్దాలు చేసుకొంటూ
పావురాల గుంపేదో మేడపై
వాలినట్లు వాన
కిటికీ రెక్కను గీరుతూ
నల్లని సంగీతం
వాన వెలసింది
సూర్యుడు ఉదయించాడు
పుడమిపై వెలుగు పరుచుకొంది
రాత్రంతా కురిసిన వానకు
తడిచి ముద్దయిన జీనువాయిపిట్ట
రెక్కలు దులపరించుకొని
నీరెండను లోలోనికి ఇంకించుకొంటోంది.
బొల్లోజు బాబా
Madhunapantula Satyanarayanamurthy, Mohan Babu and 88 others
78 comments
Like
Comment
Share

Tuesday, August 9, 2022

ఫ్రాగ్మెంట్స్



ఫ్రాగ్మెంట్స్
.
1.
రోజూ అంకెలు
మనప్రపంచాన్ని కత్తిరిస్తూ, అతికిస్తూ
సులభంగా మనకందించేందుకు నిత్యం
శ్రమిస్తూంటాయి
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం
పది అవతారాలు
15 ఎమ్.ఎమ్ కణితి
డబ్బై అయిదేళ్ల ఏళ్ల సంబరాలు.... అలా...
.
2.
చే బొమ్మ ఉన్న టీ షర్ట్స్ ధరిస్తాం
మన శ్రీ శ్రీ నో వరవరరావునో
తొడుక్కొందామన్న ఆలోచనే రాదు
విప్లవాన్ని కూడా కాపిటలిస్టే
ప్రచారం చేయాలి
.
బొల్లోజు బాబా