కాశి నేల ఎంతో మంది ఆథ్యాత్మిక వేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి తమ వచనాలను బోధించారు. కాశిలో సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతో మంది యువకులు దేశం నలుమూలలనుండి వచ్చేవారు. తాను రాసిన పద్యాలలో దోషాలున్నాయని పండితులు పరిహసించటంతో పట్టుదలతో ఇల్లువిడిచి కాశీ వెళ్ళి సంస్కృతం నేర్చుకొని వచ్చినట్లు తన ఆత్మకథలో చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి చెప్పుకొన్నారు. ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్రచరిత్ర తెలుగులో మొట్టమొదటి ట్రావెలాగ్. గతించిన పెద్దల అస్థికలు కాశీలో నిమజ్జనం చేయటం హిందువులకు ఒక పుణ్యక్రతువు. సంసారాలను త్యజించి సన్యసించినవారు కాశీ మఠాలలో చేరేవారు. జీవిత చరమాంకంలో కాశీలో శివైక్యం చెందితే జన్మరాహిత్యం పొందుతామనే ఆశతో ఎంతో మంది వృద్ధులు కాశీయాత్ర చేసేవారు.
.
1. కాశీకి ఉన్న వివిధ పేర్లు
కాశీ అంటే కాంతి నగరం అని అర్ధం. ఈ పేరు కనీసం మూడు వేల సంవత్సరాలనుండి వాడికలో ఉంది. కాశీ సమీప ప్రాంతంలో బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసినట్లు ఒక జాతకకథలో ఉంది. కాశీ రాజ్యానికి వారణాసి రాజధాని అని, దీని చుట్టూ అరవై మైళ్ళ పొడవుకల బలమైన గోడలు ఉన్నాయని మరో జాతక కథ చెబుతుంది. “వారణాసి” అంటే వారణ, అసి అనే రెండు నదుల సంగమ ప్రదేశం అని. ఈ రెండు నదులు వెళ్ళి గంగలో కలుస్తాయి.
ఈశ్వరుడు ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ చేజార్చుకోను (అ విముక్త) అని అన్నాడట అందుకు ఈ ప్రాంతానికి “అవిముక్త” అనే పేరు కూడా ఉన్నదని ఐతిహ్యం. నిజానికి గుప్తుల కాలంలో కాశీలో అవిముక్తేశ్వరుడు, విశ్వేశ్వరుడు అని రెండు ఈశ్వరాలయాలు ఉండేవి. కాల క్రమేణా జరిగిన విరూపాల కారణంగా అవిముక్తేశ్వరుని ఆలయం కాలగర్భంలో కలిసిపోగా విశ్వేశ్వర ఆలయం మాత్రమే మిగిలింది. ఈశ్వరుడు ఈ ప్రాంతంలొ శాశ్వతనివాసం ఉంటాడు కనుక కాశికి “రుద్రవాస” అనే పేరు వచ్చింది. కాశీలో ఎక్కడైనా శవదహనం చేయవచ్చు కనుక కాశీకి “మహాస్మశాన” అనే పేరు కూడా కలదు
.
కాశి అంటే నగరంగా మారిన భారతీయ ఆత్మ. కాశీ ఇరుకిరుకు సందులలో తిరగటం అంటే మరో లోకంలో, మరో కాలంలో, మరో మనుషుల మధ్య సంచరించటం. ఒక హిందువునికి కాశీ అంటే ఈశ్వరుని శాశ్వత నివాస స్థలం. కాశి అంటే కాంతి. కాశి అంటే జన్మరాహిత్యాన్ని ఇచ్చే మోక్షం. సాహిత్య, ఇతిహాస, పురాణాల పరంగా కాశీ ఎంతగొప్పదని చెప్పుకొన్నప్పటికీ, కాశీ రాజకీయ చరిత్ర మాత్రం అంత సులభంగా లభించదు.
2. విదేశీయులు చేసిన కాశీ వర్ణనలు
• 1584 లో Ralph Fitch అనే ఆంగ్లేయుడు కాశీలో ప్రయాణిస్తూ కాశీని ఇలా వర్ణించాడు
…… ఈ ప్రాంతం Gentiles (క్రైస్తవులు కానివారు) తో నిండి ఉన్నది. విగ్రహారాధకులు. చాలా ఆలయాలు ఉన్నాయి. సింహాలు, కోతులు, నెమలులు, స్త్రీ పురుష విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు నాలుగేసి చేతులు ఉన్నాయి.
• 1668 లో Tavernier అనే ఫ్రెంచి వ్యాపారి కాశీలో బిందుమాధవ స్వామి ఆలయంలో జరిగిన హారతి కార్యక్రమాన్ని ఇలా వర్ణించాడు. Tavernier వర్ణించిన బిందుమాధవ స్వామి ఆలయం ఇప్పుడు లేదు.
……...ఆలయ ద్వారం తెరచారు. ఒక తెరను తొలగించగా అందరూ దేవుని విగ్రహాన్ని చూస్తూ నేలపై మూడుసార్లు పడుకొని లేచారు. భక్తులు తెచ్చిన పూలను పూజారికి ఇవ్వగా అతను వాటిని విగ్రహానికి తాకించి తిరిగి ఇచ్చివేసాడు. తొమ్మిది ఒత్తులు ఉన్న ఒక దీపాన్ని భక్తుల వద్దకు తేగా వారందరూ దానికి నమస్కరించారు….
• 1824 లో Bishop Reginald Heber కాశీ ఆలయాలను కుతూహలం కొద్దీ చూడటానికి వెళ్ళాడు. అప్పటికి కంపనీ పాలన స్థిరపడింది కనుక ఇతనికి పూర్ణకుంభస్వాగతం లభించి ఉంటుంది.
……. నేను ఆలయంలోకి వెళ్ళగానే నా మెడలో పెద్ద పెద్ద పూలదండలు వెయ్యటం మొదలుపెట్టారు. వాటిని తొలగించటం అమర్యాద అని చెప్పటంతో తొలగించలేదు. కానీ పెద్ద పెద్ద దండలు మెడలో వేసుకొని తిరగటం ఇబ్బంది కలిగించింది. …
• Count Hermann Keyserling బెనారస్ గొప్పతనాన్ని ఇలా చెప్పుకొచ్చాడు
……… కాశీ పవిత్రమైనది. గంగానది ఉపరితలంపై తారాడే ఆథ్యాత్మికత, దైవప్రకటన నేను చూసిన ఏ చర్చిలోనూ నాకు సాక్షాత్కరించలేదు. క్రిష్టియన్ మత బోధకుడు అవ్వాలనుకొనే ప్రతిఒక్కరు ఈ గంగానదీ తీరంపై ఒక సంవత్సరం పాటు తన ధార్మిక అధ్యయనం సాగించాలి అప్పుడే అతనికి దైవభక్తి అంటే ఏమిటో తెలుస్తుంది.
.
3. కాశీనగర ప్రాచీనత
కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణ నదీ తీరంపై ఉన్న రాజ్ ఘాట్ వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదోశతాబ్దానికి చెందిన కోట గోడలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు లభించాయి. అవిముక్తేశ్వర భట్టారక అని పేరు కల ఆరవ శతాబ్దానికి చెందిన ఒక ముద్ర లభించింది. ఇది బహుశా కాశిలోని అవిముక్తేశ్వర ఆలయ ప్రధాన అర్చకుని ముద్ర/సీల్ కావొచ్చును. దీనిపై త్రిపుండ్రాలు, నెలవంక స్పష్టంగా గమనించవచ్చును
***
సిద్ధార్ధ గౌతముడు గయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధునిగా అవతరించాక, రెండువందల మైళ్ళు నడుచుకొంటూ కాశీ సమీపంలోని ఒక గ్రామాన్ని చేరుకొని అక్కడ తన ఐదుగురు శిష్యులకు మొదటిసారిగా ధర్మోపదేశం చేసాడు. ఆ ప్రదేశమే కాశికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నేటి సారనాథ్. సారనాథ్ పన్నెండో శతాబ్దం వరకూ అతి పెద్ద బౌద్ధ క్షేత్రం గా ఉండేది.
జైన మతం కూడా కాశీ తో సన్నిహిత సంబంధాలు కలిగిఉంది. జైన మత ప్రభోధకులను తీర్థంకరులు అంటారు. వీరిలో ఏడవ తీర్థంకరుడైన సుపార్శ్వుడు; క్రీపూ ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఇరవై మూడవ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు కాశీలో జన్మించినట్లు జైన రచనలద్వారా తెలుస్తుంది. బుద్ధుని సమకాలీనుడైన జైన మహావీరుడు అనేక మార్లు కాశీని దర్శించి తన బోధనలను అందించాడు. కాశీ లో పార్శ్వనాథునికి ఒక ఆలయం కూడా ఉండేది. ప్రముఖ జైన రచయిత, జిన ప్రభసూరి “ఇద్దరు జైన తీర్థంకరులకు జన్మనిచ్చి, పవిత్రగంగాజలాలతో ప్రకాశించే కాశి ఎవరికి నచ్చదు?” అని కాశీ గొప్పతనాన్ని స్తుతించాడు.
బౌద్ధ, జైనాలు వేదాలను తిరస్కరించాయి. వేదాలను అంగీకరిస్తూ, జీవితానికి అర్ధాన్ని, మోక్ష మార్గాన్ని ప్రభోదించటానికి సాంఖ్య, యోగ, మిమాంశ, వేదాంత, న్యాయ, వైశేషిక లాంటి అనేక దర్శనాలను వైదిక ధర్మం భిన్న జ్ఞాన మార్గాలుగా నిర్మించుకొంది. ఒకరితో ఒకరు వాదించుకొంటూ, చర్చించుకొంటూ వేదాల పరిధిలో ఈ దర్శనాల నీడలో తమ ఆథ్యాత్మిక జ్ఞానానికి పదునుపెట్టుకొనేవారు. ఈ కార్యకలాపాలన్నింటికి కాశీ కేంద్రంగా ఉండేది. దేశం నలుమూలలనుంచి విద్యార్ధులు అధ్యయనం కొరకు, పండితులు గోష్టులకొరకు కాశీ వచ్చేవారు.
సంస్కృత వ్యాకరణకర్త పతంజలి, ఆది శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, తులసీదాసు, కబీర్ దాసు, వంటి మహామహులందరు కాశీతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అంతే కాదు హిందూ ధర్మంలోని వివిధ శాఖలుగా నేడు గుర్తించబడుతున్న, మధ్వ, వల్లభ, తాంత్రిక గోరక్ నాథ, యోగిని, అఘోర, వీరశైవ, కబీర్ పంత్ వంటి అనేక కల్ట్ లపై కాశీ ప్రభావం ఉంది.
***
Faxian (ఫాహియాన్-405 CE) సారనాథ్ వారణాసి మీదుగా వెళ్లానని తన రాతలలో ప్రస్తావించాడు.
***
కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ప్రధమంగా ఎవరు నిర్మించారు అనేదానికి నిర్ధిష్టమైన శాసన ఆధారాలు లభించవు. రాజ్ ఘాట్ వద్ద లభించిన ఆర్కియాలజీ ఆధారాలనుబట్టి క్రీస్తుపూర్వమే కాశిలో ఒక శివాలయం మనుగడలో ఉందని భావించాలి.
విశ్వనాథుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లు అయిదో శతాబ్దానికి చెందిన వైన్యగుప్తుని పేరు ప్రముఖంగా ఇటీవల వినిపిస్తుంది.
వైన్యగుప్తుడు గుప్తవంశానికి చెందిన రాజు. (507 CE) . ఇతను వివిధ శాసనాలలో శైవునిగా, వైష్ణవునిగా, బౌద్ధాన్ని ఆదరించిన రాజుగా చెప్పబడ్డాడు. ఇతను 500 CE - 508 CE మధ్య కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లు బి.హెచ్.యు ప్రొఫసర్ Rana P.B. Singh ప్రతిపాదించారు కానీ ఈ ప్రతిపాదనకు సరైన ఆధారాలు చూపించలేదు.
***
ఏడో శతాబ్దంలో వచ్చిన హ్యుయాన్ త్సాంగ్ వారణాసిని ( Polonisse) ఇలా వర్ణించాడు .
....... వారణాసి మూడుమైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు తో పశ్చిమం వైపున గంగానదిని కలిగిన నగరము. జనభా సాంద్రత ఎక్కువ. వివిధ ఘాట్లతో నగరపు అంచులు దువ్వెన పళ్ళవలె ఉన్నాయి.
ఎక్కువమంది ప్రజలు సంపన్నులు, మర్యాదస్తులు, విద్యాధికులు. వారి ఇండ్లలో విలువైన వస్తువులు ఉన్నాయి. వాతావరణం వ్యవసాయానికి అనుకూలం. అన్నిచోట్లా పచ్చని చెట్లు దట్టంగా విస్తరించి ఉన్నాయి.
కాశిలో ముప్పైకి పైగా బౌద్ధారామాలు, మూడువేలమంది భిక్షుకులు ఉన్నారు. వందకుపైగా దేవ ఆలయాలు (Hindu), పదివేలకుపైగా దేవ భక్తులు ఉన్నారు. వీరు ప్రధానంగా మహేశ్వరుని పూజిస్తున్నారు. కొంతమంది శిరోముండనం కావించుకొని, మరికొందరు పిలకలతో, ఇంకొందరు దిగంబరంగా, మరికొద్ది మంది ఒంటినిండా బూడిదపూసుకొని ఉన్నారు.
వారణాసి లోని ప్రధాన మహేశ్వర ఆలయంలో రాగితో చేసిన 100 అడుగుల ఎత్తైన మహేశ్వర విగ్రహం, ఎంతో అందంగా సహజంగా, రాజసం ఉట్టిపడుతూ ఉన్నది
వారణాసికి ఉత్తర తూర్పుభాగాన అశోకుడు నిర్మించిన 100 అడుగుల ఎత్తైన ఒక స్థూపం ఉన్నది. ఇది అద్దంలా మెరుస్తూ గొప్ప పనితనంతో ప్రకాశిస్తున్నది. (1665 లో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ స్తంభం పైకి 35 అడుగుల ఎత్తుతోను, భూమిలోకి మరో ముప్పై అడుగులపైబడి కూరుకుపోయి ఉన్నదని వర్ణించాడు. ఇది అప్పటికి లాట్ భైరవ ఆలయంలో భైరవ స్థంభంగా పూజలందుకొంటున్నది. 1860 లో Sherring అనే చరిత్రకారుడు లాట్ భైరవ స్థంభం అశోక స్థంభమని, లాట్ భైరవాలయం ఒకప్పటి బౌద్ధారామమని గుర్తించాడు - రి. Banaras, City of Light by Eck, Diana P.no 250)
వారణాసికి పది లీల దూరంలో జింకలవనం పేరిట ఒక సంఘారామం కలదు (సారనాథ్- సారంగ=జింక. ఆరు లీలు = 1మైలు ). అనేక అంతస్తులతో, అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారుతున్న దీనిలో 1500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ 200 అడుగుల ఎత్తైన విహారం కలదు. దీని పైకప్పు బంగారు తొడుగు కలిగి ఉంది. వంద వరుసలలో గదులు నిర్మించబడి ఉన్నాయి. ప్రతి వరుస వద్ద ఒక బంగారు బుద్ధుని విగ్రహం కలదు. విహార మధ్యలో ఆరడుగుల ఎత్తైన బుద్ధుని కాంస్యవిగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంది.
***
ఆరో శతాబ్దం వరకూ కాశీ లో శివుడు, విష్ణు, కృష్ణ, వాసుదేవ, బలరామ, స్కంద, సూర్య, శక్తి, దుర్గ, కాళి, చాముండ, చండిక, వినాయక లాంటి భిన్న దేవతారాధన పద్దతులు ఉన్నట్లు పురావస్తుతవ్వకాలలో లభించిన విగ్రహాలు ద్వారా తెలుస్తున్నది.
ఆరోశతాబ్దంలో గుప్తుల పాలన ముగిసేనాటికి వైష్ణవం, శైవం, శాక్తేయం, సూర్యారాధన లాంటి ప్రధాన ఆరాధనా విధానాలు రూపుదిద్దు కొన్నాయి.
***
Hye Cho (హే షో) ఇతను బౌద్ధాన్ని అధ్యయనం చేయటం కొరకు 724-727 CE ల మధ్య భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు. కాశీ విశేషాలను హే షో ఇలా వర్ణించాడు
…. ఒక స్థూపంపై బుద్ధుని తొలి బోధనలు విన్న ఐదుగురు శిష్యుల ప్రతిమలను చూసాను. ( వారు కౌండిన్య, అశ్వజిత్, వష్ప, మహానమ, భద్రిక)
ఒక భారీ స్థంభంపై నాలుగు సింహ ప్రతిమలు ఉన్నాయి. ఆ స్థంభం చాలా పెద్దది. ఐదుగురు వ్యక్తులు పక్కపక్కన నుంచునేటంతటి వ్యాసం కలిగి ఉంది. (ఇదే నేటి మనదేశ రాజ ముద్ర. Hye Cho వర్ణించిన స్థంభం నేడు సారనాథ్ మ్యూజియం లో ఉన్నది)
***
పదకొండు, పన్నెండు శతాబ్దాలలో కాశిని కేంద్రంగా చేసుకొని పాలించిన Gahadavala రాజులు వేయించిన శాసనాలు అనేకం కాశి సమీపంలో లభించాయి. గాహదవాల వంశీకులు తమనితాము గొప్ప శివభక్తులుగా చెప్పుకొన్నారు. ఈ వంశంలోని గోవిందచంద్ర (1114-1155) విష్ణువుని ఆరాధించగా, ఇతని ఇద్దరు రాణులు బౌద్ధాన్ని ఆదరించారు. సారనాథ్ స్థూపానికి చివరి మరమ్మత్తులు చేయించినది ఈ రాణులే. చంద్రదేవ అనే గాహదవాల రాజు కాశీలో ఆదికేశవ విగ్రహాన్ని ప్రతిష్టించి, అనేక కానుకలు సమర్పించుకొన్నట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది.
4. కాశీ ఆలయాల విధ్వంసాలు- పునర్నిర్మాణాలు
1194 లో మహమ్మద్ ఘోరి సేనాని కుతుబుద్దిన్ ఐబెక్ కాశిని ఆక్రమించుకొని గాహాదవాల వంశానికి చెందిన జయచంద్రుని శిరచ్ఛేధనం గావించి, అక్కడి బౌద్ధ, హిందూ, ఆలయాలను ధ్వంసం చేసాడు. అలా గాహాదవాల వంశం ఘోరమైన పరాజయంతో నమసిపోయింది.
కాశి హిందూ పుణ్యక్షేత్రంగా క్రమక్రమంగా విస్తరిస్తున్నప్పటికీ సారనాథ్ కూడా ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా సమాంతరంగా చాలాకాలం మనుగడ సాగించింది. కుతుబుద్దిన్ ఐబెక్ సేనలు కాశిని, సారనాథ్ ను నేలమట్టం చేసాక, కాశి క్రమేపీ కోలుకొంది కానీ సారనాథ్ కు రాజాదరణ లేకపోవటంతో కోలుకోలేక కాలగర్భంలో కలిసిపోయింది.
***
ఐబెక్ విధ్వంసానంతరం కాశీ నగరం మధ్యలో విశ్వరూప అనే బెంగాలు రాజు విశ్వేశ్వరుని పేరిట ఒక విజయస్తంభాన్ని నిలబెట్టినట్లు 1212 లో వేయించిన ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది.
కాశీ విశ్వనాథుని ఆలయసమీపంలో పద్మ సాధు అనే భక్తుడు పద్మేశ్వర ఆలయాన్ని (విష్ణువు) నిర్మించినట్లు 1353 నాటి ఒకశాసనంలో కలదు. ఇదే సమయంలో మణికర్ణికా ఘాట్ వద్ద మణికర్ణికేశ్వరుని ఆలయనిర్మాణం జరిగింది.
సికిందర్ లోడి (1489-1517) హయాంలో మరొకసారి కాశి ఆలయాలపై దాడి జరిగింది. ఆ తరువాత ఎనభై ఏండ్లపాటు ఏ రకమైన ఆలయాల నిర్మాణాలు జరగలేదు కాశిలో.
ఇదే కాలానికి చెందిన నారాయణభట్టు అనే పండితుడు విశ్వనాథ ఆలయ శిథిలాలను చూసి, దుఃఖపడి, తన త్రిస్థలసేతు (కాశి, గయ, ప్రయోగ స్థలాలు) అనే గ్రంధంలో (1585) శివ భక్తులను ఇలా ఓదార్చాడు…
.
……..కాశీ విశ్వేశ్వరుని పురాతన స్వయంభు విగ్రహం పోయినప్పటికీ, మరో మూర్తిని మానవులే ప్రతిష్టించినప్పటికీ, ఈ కష్టకాలంలో దానినే మనం కొలుద్దాం. పాలకులు బలవంతులు కనుక, మూలవిరాట్టు లేకపోయినా ఆ పవిత్ర స్థలాన్నే సందర్శించుకొందాం, ప్రదక్షిణలు చేద్దాం, పూజించుకొందాం….
***
తొడర్ మల్ అనే రాజు 1585 లో పూర్వీక విశ్వనాథుని ఆలయానికి వందమీటర్ల దూరంలో కొత్తగా మరో ఆలయాన్ని నిర్మించాడు.
(పై వివరాలనుబట్టి ఔరంగజేబు (1669) కంటే ముందే స్వయంభు కాశీ విశ్వనాథుని విగ్రహం తొలగించబడిందని, దాని స్థానంలో మరొకటి ప్రతిష్టించబడిందని అర్ధమౌతుంది)
***
ఔరంగజేబు హయాంలో కాశీలోని కృత్తివాశేశ్వర, ఓంకార, మహాదేవ, మధ్యమేశ్వర, విశ్వేశ్వర, బిందుమాధవ, కాల భైరవ ఆలయాలు నేలమట్టం చేయబడ్డాయి. చాలాచోట్ల మసీదులు నిర్మించబడ్డాయి.
1659 లో కృత్తివాశేశ్వర ఆలయం విరూపం చేయబడింది. దాని స్థానంలో ఆలంగిరి మసీదు నిర్మించారు. దానికి సమీపంలో బెనారస్ రాజైన రాజా పత్నిమాల్ పంతొమ్మిదో శతాబ్దంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి కృత్తివాశేశ్వర ప్రతిమను పునప్రతిష్టించాడు.
1585 లో తొడర్ మల్ పునర్నిర్మించిన విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు ఆజ్ఞలతో 1669 లో విరూపం చేసి జ్ఞానవాపి మసీదును నిర్మించారు. ఆలయానికి చెందిన ఉత్తరంవైపు గోడను యధాతధంగా ఉంచేసారు.
పూర్వీక ఆలయంలోని జ్ఞానవపి (నుయ్యి) మాత్రం అలాగే ఉందని భక్తుల విశ్వాసం. కొందరు స్థానిక రాజులు విశ్వనాథ ఆలయం యొక్క మూల విగ్రహాన్ని భద్రపరిచారు. (ఇది బహుశా తొడర్ మల్ 1585 లో ప్రతిష్టించిన విగ్రహం కావొచ్చు)
ముస్లిమ్ పాలకులు ఎన్నిసార్లు కాశీ ఆలయాలను విధ్వంసం చేసినా అన్నిసార్లూ హిందువులు వాటిని పునర్నిర్మించుకొంటూనే ఉన్నారు.
1698 లో అంబర్ కు చెందిన బిషన్ సింగ్ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించటానికి ప్రయత్నించగా, జ్ఞానవాపి మసీదు సరిహద్దులు ఎంతవరకూ ఉన్నాయి అనే సమస్య తలెత్తి పని ముందుకు సాగలేదు. బిషన్ సింగ్ తెలివిగా జ్ఞానవాపి మసీదు చుట్టూ ఉన్న ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కొనుగోలు చేసాడు. అలా సేకరించిన స్థలాలలో ముస్లిములవి కూడా ఉన్నాయి.
1772 లో మరాఠారాజైన మల్హర్ రావ్ హోల్కర్ జ్ఞానవపి మసీదును తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నించి విఫలమైనాడు.
మల్హర్ రావ్ హోల్కర్ కొడుకు ఖండేరావు హోల్కర్. ఇతని భార్య అహల్యబాయ్ హోల్కర్. మామగారు, భర్త, కొడుకు మరణించాక అహల్యబాయ్ హోల్కర్ రాజ్య పగ్గాలను చేపట్టింది. దేశంలో ఆసేతు హిమాచల పర్యంతం అనేక ఆలయాలను, ధర్మసత్రాలను, నూతులను, ఘాట్ లను ఈమె నిర్మించింది. కాశి, గయ, సోమనాథ, అయోధ్య, మథుర, హరిధ్వార్, కంచి, అవంతి, ద్వారక, బద్రినాథ్, రామేశ్వరం, పూరీజగన్నాథ ఆలయాల పునర్నిర్మాణం/జీర్ణోద్ధరణలో ఈమె పాత్ర ఉన్నదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.
పద్దెనిమిదోశతాబ్దంలో హిందూ మత ఔన్నత్యం నిలబెట్టటంలో రాణి అహల్యాబాయ్ హోల్కర్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనది.
1781 లో అహల్యబాయ్ హోల్కర్ జ్ఞానవాపి మసీదుకు దక్షిణం వైపున ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకొని కొత్తగా విశ్వనాథ ఆలయాన్ని నిర్మించింది. పద్దెనిమిదో శతాబ్దాంతానికల్లా ఈ ఆలయమే కాశీప్రధాన ఆలయంగా పూజలందుకోసాగింది. నేడు మనం చూస్తున్న కాశీ విశ్వనాథ ఆలయం ఇదే.
అహల్యబాయ్ వ్యక్తిత్వానికి అబ్బురపడిన వారెన్ హేస్టింగ్స్ 1781 లో విశ్వనాథ ఆలయానికి సరైన మార్గాన్ని, నౌబత్ ఖానా (ఢంఖా) ఏర్పాటుచేయమని స్థానిక అధికారి ఇబ్రహింఖాన్ ని ఆజ్ఞాపించాడు. ఈ ఆలయప్రాంగణంలో ఉన్న నూతికి జ్ఞానవాపి అని పేరు. ఈ నూతి నీరు జ్ఞానానికి ప్రతిరూపమని దీనిని ఈశ్వరుడే స్వయంగా తవ్వాడని భక్తుల విశ్వాసం.
5. వారణాసి తో మొఘల్ పాలకుల అనుబంధం
మొఘల్ పాలకుల మతవిధానం చాలా సంక్లిష్టమైనది. భారతదేశాన్ని ఏకీకృతం చేసి ఢిల్లీ కేంద్రంగా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాకా, భిన్న సామంతరాజులు తిరుగుబాటు చేయకుండా అదుపాజ్ఞలలో పెట్టుకోవటం చక్రవర్తి నిర్వహించాల్సిన రాజధర్మం. ఈ సామంతులలో ఎక్కువమంది హిందూ రాజులు. వీరిని నియంత్రించటానికి మతం ఒక బలమైన అంశంగా ఉండేది. ఈ క్రమంలో హిందూమతానికి ప్రధాన కేంద్రంగా ఉండిన వారణాసి తీవ్రమైన ఒడిదుడుకులకు గురవ్వక తప్పలేదు.
వారణాసిలో హిందూ ఆలయాలను ముస్లిమ్ పాలకులు విధ్వంసం చేసారు అనేది కాదనలేని చారిత్రిక సత్యమైనప్పటికీ, యుద్ధాలు లేని సమయంలో మొఘల్ పాలకులు వారణాసిలో ప్రదర్శించిన మత సహిష్ణుత కూడా అనేక ఉదంతాల ద్వారా చరిత్రలో నిలిచిపోయింది.
• Iltutmish (1211-36) పాలనలో విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణము, Alauddin Khilji (1296-1316) హయాంలో పద్మేశ్వర ఆలయనిర్మాణము జరిగాయి.
• హుమాయున్ వారణాసిలోని జంగంబడి మఠానికి నిర్వహణకొరకు మూడువందల ఎకరాల భూమిని దానమిచ్చాడు.
• అక్బర్ భారతదేశంలోని భిన్న మత సంస్కృతులను అర్ధంచేసుకొని గొప్ప సామరస్యతను ప్రదర్శించాడు. CE 567 లో కాశిలోని ఒక శిథిలాలయాన్ని అక్కడి గవర్నరు బయాజిడ్ బయాత్, ఒక మద్రాస (పాఠశాల) గా మార్చాడనే విషయం తెలుసుకొన్న అక్బర్, అతన్ని ఆ పదవినుంచి తొలగించి, ఆ ఆలయ పోషణకొరకు రెండు గ్రామాలను దానమిచ్చాడు.
• అక్బర్ హయాంలోనే తొడర్ మల్ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించాడు. రాజపుత్రులు అనేక ఘాట్ ల నిర్మాణాలు చేసారు. మాన్ సింఘ్ ఆలయాలు, ఘాట్లు, కోట నిర్మించాడు.
• జహంగీర్ పాలనలో వారణాసిలో 70 ఆలయాల నిర్మాణం జరిగింది. ఇదేసమయంలో వారణాసిలో ఇరవైముగ్గురు ముస్లిమ్ యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించి హిందూమతంలోకి మారిపోయిన ఉదంతం కూడా మధ్య ఆశియా యాత్రికుడు అమిర్ అలి బాల్కి తన రాతలలో పేర్కొన్నాడు. ఇది ఆనాటి మత స్వేచ్ఛను తెలియచేస్తుంది.
• షాజహాన్ (1627-58) తనని తాను సంప్రదాయక ముస్లిమ్ రాజు గా ప్రకటించుకొన్నాడు. పాత ఆలయాలను కూల్చరాదు కొత్త ఆలయాలను నిర్మించరాదు అనే షరియత్ నియమాన్ని ఇతను పాటించి పురాతన ఆలయాల జోలికి పోలేదు కానీ వారణాసిలో కొత్తగా నిర్మించిన 76 ఆలయాలను నేలమట్టం చేసాడు.
• షాజహాన్ పెద్దకొడుకు దారా షికో వారణాసిలో కొంతకాలం నివసించి సంస్కృతం నేర్చుకొని, 1656 లో 52 ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఈ అనువాదానికి Sirr-i Asrar (the great Secret) అని పేరు పెట్టాడు. ఈ ఉదంతం వారణాసిలో ఒకనాటి హిందూ ముస్లిమ్ ఐఖ్యతను ప్రతిబింబిస్తుంది.
• వారణాసికి సంబంధించి ఔరంగజేబు పాత్ర వివాదాస్పదమైనది. ఇతను తన 49 ఏళ్ళ పాలనలో చాలా సందర్భాలలో హిందువులపట్ల సహిష్ణుతతో ఉన్నాడు. వారణాసికి సంబంధించి- "కాశిలో కొద్దిమంది ముస్లిం అధికారులు అక్కడి పూజారులను వేధిస్తున్నట్లు, స్థానిక ఆలయాల వ్యవహారాలలో జోక్యం చేసుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి; అక్కడి హిందువులను కానీ, సంప్రదాయికంగా జరుగుతున్న ఆలయవ్యవహారాలను కానీ ఎవరూ భంగపరచవద్దని ఔరంగజేబు 1659 ఫిబ్రవరి 15 న జారీ చేసిన ఫర్మానాలో స్పష్టంగా పేర్కొన్నాడు.
1680 లో గంగానదీ తీరంపై నివసిస్తున్న భగవంత్ గోసాయిన్ అనే హిందూ భక్తుడిని వేధించవద్దని స్థానిక అధికార్లను మందలించాడు
బ్రాహ్మణులు, ఫకీర్ల ఇళ్ళు కట్టుకొనేందుకు వినియోగించమని 1687 లో రామ్ జీవన్ గోసాయి అనే భక్తునికి కొంతభూమిని దానంగా ఇచ్చాడు. ఇది మసీదుకు సమీపంలోని భూమి కావటం గమనార్హం.
1695 లో ఔరంగజేబు కాశిలోని కుమారస్వామి మఠానికి స్థలాన్ని దానంగా ఇచ్చాడు. అదే విధంగా జంగంబడి మఠానికి కూడా సహాయం చేసాడు. కాశిలోని కేదారేశ్వరుని ఆలయ పునర్నిర్మాణానికి తోడ్పడ్డాడు.
1669 లో విశ్వనాథ ఆలయధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న భూస్వాములు కొందరు తిరుగుబాటు చేసారు. వీరే 1666 లో ఖైదునుండి శివాజి తప్పించుకోవటంలో సహాయపడ్డారనే అనుమానంతో ఔరంగజేబు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని నేలమట్టం చేయమని ఆజ్ఞాపించాడని Aurangzeb, The Life and Legacy of India’s Most Controversial King అనే పుస్తకంలో audrey truschke అభిప్రాయపడ్డారు. (మధురలో జాట్లు తిరుగుబాటు చేసి ఒక మసీదు నిర్వహకుడిని హత్యచేసిన సందర్భంలో కూడా ఔరంగజేబు మధుర ఆలయాన్ని నేలమట్టం చేయమని అనుమతినిచ్చాడు).
కాశికి సంబంధించి ఔరంగజేబు కొన్నిసార్లు హిందు అనుకూల మరికొన్ని సార్లు ప్రతికూలంగాను ద్వంధ్వవైఖరి ప్రదర్శించాడనే సంగతి పై ఉదంతాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఆ కారణంగానే- ఔరంగజేబు చేసిన ఆలయవిధ్వంసాలను ఆనాటి రాజకీయ అవసరాలుగా గుర్తించాలి తప్ప అతని మతోన్మాద చర్యలుగా తీసుకోరాదని ప్రముఖ చరిత్రకారిణి మాధురి దేశాయ్ అభిప్రాయపడ్డారు. (రి. Benaras Reconstructed, Madhuri Desai, Pn. 6)
6. పునర్వైభవం
జ్ఞానవాపి మసీదు సమీపంలో అహిల్యాబాయి చేపట్టిన విశ్వేశ్వరుని ఆలయనిర్మాణం పూర్తయ్యాక దేశం నలుమూలలనుండి భక్తుల తాకిడి పెరిగింది. 1720 లో నిర్మించిన అన్నపూర్ణాదేవి ఆలయానికి చెందిన పూజారి పతాంకర్, పీష్వా రాజులను వేడుకొని అక్కడ నిత్యాన్నదానం జరిగే ఏర్పాట్లు చేసాడు. దీనితో విశ్వనాథ, ఇతర ఆలయాలకు విరాళాల వెల్లువ మొదలైంది. 1841 లో నాగపూర్ రాజు (Bhonslas of Nagpur) వెండి సామాగ్రి బహూకరించాడు. లాహోర్ కుచెందిన రంజీత్ సింగ్ విశ్వనాథ ఆలయగోపురానికి బంగారు పూత పూయించాడు. 1828 లో గ్వాలియర్ కు చెందిన బైజాబాయి సింధియా విశ్వనాథ ఆలయానికి ప్రాకారాలతో కూడిన మండపాలను కట్టించింది.
నేడు కాశిలో కనిపించే కట్టడాలన్నీ అక్బర్ పాలనతరువాత నిర్మించినవే కావటం ఆశ్చర్యం కలిగించక మానదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాశిలో కనీసం వెయ్యేళ్ళ పాతదైన నిర్మాణం లేకపోవటం కొన్ని శతాబ్దాలుగా జరిగిన విధ్వంసానికి అద్దం పడుతుంది. 1765 నాటి ఒక వారణాసి స్కెచ్ లో నగరం విశాలంగా ఎత్తైన భవనాలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్ని సార్లు నేలమట్టం చేసిన ఫీనిక్స్ పక్షిలా మరలా మరలా పైకి లేస్తూ వచ్చిందీ నగరం.
7. అల్లర్లు మత ఘర్షణలు
1809 లో జ్ఞానవాపి మసీదునుండి ముస్లిములను బయటకు పంపివేయాలనే నినాదంతో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగాయి. కాశిలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి . ఆనాటి మాజిస్ట్రేట్ Watson, జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించి ముస్లిములు అక్కడనుండి తొలిగిపోవాలని ఆదేశించమని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ March 28, 1810 న వ్రాసిన ఒక ఉత్తరంలో “ఆ మసీదు ఎలా కట్టారన్నది కాదు ముఖ్యం, దాన్ని ఎలా వినియోగించుకొంటున్నారన్నది ముఖ్యం, యధాతధ స్థితిని కొనసాగించటం సముచితం” అని వ్యాఖ్యానించటం గమనార్హం. (రి. thewire.in 27/MAY/2022)
1936 లో జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతం వక్ఫ్ బోర్డు కు చెందినదిగా ప్రకటించాల్సిందిగా ఆనాటి మసీదుకమిటీ కోర్టును అభ్యర్ధించగా కోర్టు ఆ కోర్కెను తిరస్కరించింది. 1942 లో మసీదు కమిటి మరలా అభ్యర్ధించగా కోర్టు జ్ఞానవాపి మసీదును అధికారికంగా మసీదుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. (AIR 1942 Allahabad 353).
1991 లో హిందువులు జ్ఞాన్ వాపి మసీదులో పూజలు చేసుకోవటానికి అనుమతి నివ్వమని కోర్టును కోరారు.
ప్రార్ధనాలయాలు 1947 నాటికి ఎవరి ఆధీనంలో ఉంటే వారివి గానే పరిగణించాలని, మార్పులు చేర్పులు చేయరాదంటు 1991 సెప్టెంబరులో కేంద్రప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది.
2006, 2010 లలో కాశిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లను మరచిపోలేం.
2021 లో ఢిల్లీకి చెందిన కొందరు మహిళలు, జ్ఞానవాపి మసీదులో ఉన్న శృంగార గౌరి దేవికి పూజలు నిర్వహించుకొనటానికి అనుమతినివ్వమని కోర్టును కోరారు. దరిమిలా ఏప్రిల్ 2022 న జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేసి సమర్పించమని కోర్టు స్థానిక అధికారులను ఆదేశించింది.
దీనితో మరొక సారి పాండోరా బాక్స్ తెరచుకొన్నట్లయింది.
.
8. ముగింపు
25/5/2022 నుండి మూడురోజుల పాటు నేను కాశిలో ఉన్నాను., జ్ఞానవాపి మసీదు ఎక్కడో దూరంగా ఉంటుందనుకొన్న నాకు విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా హిందు ఆలయానికి చెందిన గోడలతో దర్శనమిచ్చింది. ఎందుకో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను.
యుద్ధ సమయంలో యుద్ధోన్మాదంలో ఆలయాల విధ్వంసం ఒక సహజమైన ఉన్మత్తచర్యగా భావిస్తాను. మధ్యయుగాలలో ఒక రాజ్య ప్రధాన ఆలయాన్ని విరూపం చేయటం ద్వారా ఆ రాజ్యంపై విజయం సంపూర్ణమైనట్లు భావించే వారు. ఈ పనిని వివిధ హిందూ రాజులు కూడా చేసారు. అలా యుద్ధాలలో ఏదైనా ఆలయాన్ని విధ్వంసం చేస్తే యుద్ధానంతరం దానిని తిరిగి నిర్మించుకోవటమూ పరిపాటే. సోమనాథ ఆలయం ప్రతీ వందేళ్లకూ ఓసారి ధ్వంసం చేసినట్లూ దానిని తిరిగి నిర్మించుకొన్నట్లు అనేక చారిత్రిక ఆధారాలు లభిస్తాయి. భారతదేశ చరిత్రలో ఇదొక మెటా నెరేటివ్.
ఈ క్రమంలో మొఘలులు ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేస్తే దానిని తిరిగి నిర్మించకుండా ఆ ఆలయశిథిలాలపై మసీదులు నిర్మించేవారు. ఇదొక యుద్ధతంత్రంగా పాటించారు చాలాసార్లు. రాజు మతం మారితే ఆలయం కూడా మతం మార్చుకోవటం చరిత్రలో కోకొల్లలుగా జరిగింది. కాశిలో బిందుమాధవ స్వామి ఆలయంలాగ సమూలంగా తొలగించి మసీదు నిర్మించినట్లయితే అది వేరే సంగతి. కానీ పూర్వ ఆలయానికి సంబంధించిన కుడ్యాన్ని, పునాదులను యధాతథంగా ఉంచి నిర్మించటం వల్ల భావోద్వేగాలు చెలరేగటం సహజం. తటస్థంగా ఉండే సెక్యులర్ హిందువు కూడా ఆలయగోడలతో ఉన్న జ్ఞానవాపి మసీదును చూస్తే భావోద్వేగానికి గురికాక తప్పదు.
ఇరుపక్షాలూ పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవటం దేశ భవిష్యత్తుకు మంచిది అని భావిస్తాను, అలా జరగాలని ఆశిస్తాను.
బొల్లోజు బాబా