Thursday, April 9, 2020

ఇస్మాయిల్ సాహితీ పురస్కార సభ



పురస్కార గ్రహీత స్పందన

(ఇస్మాయిల్ పురస్కార సభలో నేను చేసిన ప్రసంగ పాఠం )

నా కవిత్వం పై మంచి మాటలు చెప్పిన రవిప్రకాష్ గారికి, శిఖామణి గారికి, దేవదానం రాజు గారికి, వీరలక్ష్మి దేవి గారికి ముందుగా నా నమస్సులు.

ఇస్మాయిల్ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన ఇస్మాయిల్ మిత్రమండలి సభ్యులకు మరీ ముఖ్యంగా శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను. ఈ అవార్డు నాకు ఎంతో ఉత్తేజాన్ని ప్రోత్సాహన్ని కలిగిస్తున్నది. వారికి నా ధన్యవాదములు.

మా నాన్నగారు శ్రీ బొల్లోజు బసవలింగంగారు మంచి సాహిత్యాభిలాషి, కవి, నాటకరచయిత. “సువర్ణశ్రీ” అనె కలం పేరుతో అనేక నాటకాలు వ్రాసారు. ఆ కారణంగా మా ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన వాతావరణం ఉండేది. డిగ్రీ విద్యార్ధిగా ఉన్నప్పుడు నా కవితలు కాలేజ్ మాగజైన్స్ లో వచ్చేవి. అప్పుడప్పుడూ పత్రికలలో కూడా పడేవి. అలా నా సాహిత్యయానం మొదలైంది.
ఇస్మాయిల్ గారి కవిత్వాన్ని చాలా ఇష్టంగా చదువుకొని ఆనందించిన వారిలో నేనూ ఒకడిని.
నేను పిజి. చదువుతున్నప్పుడు 1991 లో ఇస్మాయిల్ గారిని కలిసాను. నా కవిత్వం చూపించాను. అప్పుడు మాట్లాడుకొన్న మాటలు పెద్దగా గుర్తులేవు కానీ వారు "నీ కవిత్వంలో స్పార్క్ ఉంది కానీ తేలికైన పదాలు వాడి క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నించు" అన్నవారి మాటలు మాత్రం గుర్తు ఉన్నాయి. నేను వారిని కలుసుకోవటం అదే మొదలు తుదీ కూడా.

ఇస్మాయిల్ గారిని “కవుల కవి” గా అభివర్ణిస్తూ ఇదివరలో నేను వ్రాసిన ఒక వ్యాసాన్ని ఈ వాక్యాలతో ముగించాను అవి......

"ఉవ్వెత్తున లేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్ గారు కవిత్వం వెలువరించారు. రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు. ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, చెల్లి రామ్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, రవూఫ్, అఫ్సర్, యాకూబ్ భవదీయుడు వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి. అలా ఇస్మాయిల్ కవుల కవిగా కీర్తిశేషులయ్యారు."

వెలుతురు తెర, స్వేచ్ఛావిహంగాలకు కలిపి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పుస్తకాల కు అద్భుతమైన ముందు మాటలు వ్రాసిన శ్రీ శివారెడ్డి గారిని, శ్రీ వీరభద్రుడు గారిని ఈ సందర్భంగా స్మరించుకొంటాను. నిజానికి స్వేచ్ఛా విహంగాలను నేను 2008 లోనే నేను అనువదించి నా బ్లాగులో పోస్ట్ చేసాను. దీన్ని పుస్తకంగా తీసుకొవద్దామనుకొన్నప్పుడు భద్రుడుగారు ముందు మాట వ్రాస్తే బాగుంటుందని భావించి వారిని అడిగాను. ఒకానొక దశలో వారు ముందుమాట వ్రాస్తేనే పుస్తకంగా తీసుకొని వద్దాం లేకపోతే వద్దు అని కూడా అనుకొన్నాను. భద్రుడు గారు చక్కటి ముందు మాట ఇచ్చారు. దానికన్నా ముందుగా నా ఈ అనువాదంలో దొర్లిన దుష్టసమాసాలను, కొన్ని చోట్ల అన్వయదోషాలను చెప్పి వాటిని సరిదిద్దుకోమని సూచించటం వారి ఔదార్యానికి చిహ్నం. ఆ పుస్తకం కవర్ పేజ్ కూడా భద్రుడి గారు స్వయంగా చిత్రించిన ఒక పెయింటింగ్ . ఆ పెయింటింగ్ ను ముమ్మిడి చిన్నారి అందమైన కవర్ పేజ్ గా డిజిటైజ్ చేసారు.
స్టేజ్ పై కూర్చొన్న శ్రీ రవిప్రకాష్ గారు, శిఖామణి గారు, శ్రీ దాట్ల దేవదానం రాజు గార్లతో నా సాహితీ జీవితం పెనవేసుకొని ఉంది.

ఇస్మాయిల్ గారి కవిత్వమార్గం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక పాయగా అనుకొంటే, శ్రీ రవిప్రకాష్ గారి కవిత్వం ఆ పాయలో ప్రయాణించే ఏడుతెరచాపల ఓడలాంటిదని నేను భావిస్తాను.
ఇరవై యేళ్ళ క్రితం రవి ప్రకాష్ గారు యానాం కలక్టరుగా పనిచేసే కాలంలో వారి క్రింద నేను టీచర్ గా పనిచేసాను. కవిగా వారికి నేను పెద్దగా తెలియక పోవచ్చు కానీ ఒక కవి అయిన అధికారి క్రింద పని చేస్తున్నానన్న స్పృహ నాకు ఉండేది. అప్పట్లో రామ్, శిఖామణి , నేను వారి అధికార నివాసంలో వారి ఆధ్వర్యంలో ఒక గొలుసు కవిత వ్రాసినట్లు గుర్తు.

శిఖామణి గారు నా సాహితీ గురువు. 1991 లో ఆంధ్రజ్యోతి ఈ వారం కవిత గా నా కవిత వచ్చినప్పటినుంచి ఏనాడూ ఆయన నా చేయి విడువకుండా ఇంతవరకూ నన్ను నడిపించుకొని వచ్చారు.

“ఒక కవిత నిన్ను పదేళ్ళు బతికిస్తుందని” శివారెడ్డి గారు అంటారు. ఆ తరువాత నేను చాన్నాళ్ళు కవిత్వం వ్రాయకపోయినప్పటికీ- యానాంలో ఏ సభజరిగినా, ఆ సభల్లో నేను లేకపోయినా సరే “బాబా మంచి కవి, ఈ మధ్య వ్రాయటం లేదు ఎందుకో” అంటూ నాగురించి ప్రస్తావించేవారు. యానాం కవులు తీసుకొచ్చే కవిత్వసంపుటులకు వ్రాసిన ముందుమాటలలో నా పేరును ప్రస్తావించేవారు. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా కట్టలకొద్దీ కవిత్వ పుస్తకాలు తెచ్చి చదవమని ఇచ్చేవారు.

అప్పట్లో నా కవితలను శిఖామణి గారికి దిద్దమని పంపించేవాడిని. సూచనలు చేసే వారు. ఒక కవితను ….. “తలలు తెగిపడతాయి”…. అన్న వాక్యంతో ముగించాను. తొంభైలలో విస్త్రుతంగా వచ్చిన విప్లవ కవిత్వ ప్రభావం అది. ఆ వాక్యాన్ని పెన్సిల్ తో రౌండ్ చేసి పక్కన “ఏంటిదీ” అని వ్రాసారు శిఖామణి. ఆలోచించగా ఆ వాక్యంలోని కృతకత్వం అర్ధమైంది. నేను నడవాల్సిన బాట ఏమిటో నాకు తెలిసింది. అప్పటినుంచి ఆ బాటను వీడలేదు. ఒక క్రాస్ రోడ్స్ లో ఉన్న నాకు మార్గాన్ని చూపించిన వ్యక్తిగా శిఖామణీగారి పట్ల నాకు ఎంతో గౌరవం.

శ్రీ దాట్ల దేవదానం రాజు గారు నిరంతర చైతన్యానికి ప్రతీక. వారి అవిరళ సాహితీ కృషి నాకెంతో స్ఫూర్తి నిస్తుంది. 2008 లో నా మొదటి కవితాసంపుటి “ఆకుపచ్చని తడిగీతం” పుస్తకానికి అద్భుతమైన ముందుమాట వ్రాసారు. అప్పట్లో ఎప్పుడు కలిసినా “పుస్తకం ఎప్పుడు తెస్తావు” అంటూ ముల్లుగర్ర పుచ్చుకొని గుచ్చినట్లు ప్రశ్నించేవారు. ఆ పుస్తకావిష్కరణకు ఎంతో దూరంలో ఏదో ముఖ్యమైన పని ఉన్నప్పటికీ నాకోసం చాలా వేగంగా స్కూటరు నడుపుకొంటూ, ఆయాసపడుతూ ఆయన రావటం నాకింకా జ్ఞాపకాలలో పదిలంగానే ఉంది. ఆ రోజు సభలో నా పుస్తకాన్ని గొప్పగా పరిచయం చేసారు.

ఇన్నేళ్ళ నా సాహితీయానంలో నా వెన్నంటి ఉన్న నా భార్య శ్రీమతి సూర్యపద్మ, నా సోదరుడు శ్రీబొల్లోజు దుర్గాప్రసాద్ లు నా పై చూపించే ప్రేమకు నేను బద్దుడను.
నాకు ఈ అవార్డు రావటం పట్ల నాకన్నా ఎక్కువ సంతోషాన్ని వ్యక్తం చేసిన సహృదయులు శ్రీగనారాగారికి నా ధన్యవాదములు.

నా పుస్తకాలు అన్నింటికీ చక్కని ముఖచిత్రాలను అందించే నా బాల్యమిత్రుడు చిన్నారికి, ఎంతో శ్రమకోడ్చి సభకు వచ్చిన నా మిత్రులకు, పెద్దలకు నా ధన్యవాదములు.

నా కవిత్వాన్ని చదివి మంచి చెడ్డలను చర్చించే మిత్రులు శ్రీచెల్లి రాం, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ, శ్రీ అద్దేపల్లి ప్రభు, శ్రీ జోశ్యుల కృష్ణబాబు శ్రీ అవధానుల మణిబాబు, శ్రీవత్స రామకృష్ణ, శ్రీమార్ని జానకీరామ్, శ్రీమతి పద్మజావాణి, డా.శైలజగారు, శ్రీ సీతారామరాజు, శ్రీ మురళి కృష్ణ, సాహితీస్రవంతి సభ్యులు, పెద్దలు, ఇంకా అంతర్జాలంలో ప్రోత్సహించే మిత్రులందరకూ నా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

ఇంత గొప్ప గౌరవాన్ని, సన్మానాన్ని నాకు కలిగించిన ఇస్మాయిల్ మిత్రమండలి వారికి, ముఖ్యంగా శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి గారికి, జగన్నాధరావు గారికి, రారెడ్డి గారికి మరియు ఇస్మాయిల్ గారి కుటుంబ సభ్యులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. .

థాంక్యూ ఆల్.




భవదీయుడు
బొల్లోజు బాబా
















"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటి

"మూడో కన్నీటిచుక్క" కవిత్వ సంపుటిపై ప్రముఖ విమర్శకులు శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు వ్రాసిన సమీక్ష. ఈ వ్యాసం పాలపిట్ట, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమైనది. వెంకటేశ్వర రెడ్డి గారికి గుడిపాటి గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.
***
కాడైపోతున్న వ్యవస్థరాల్చిన “మూడో కన్నీటిచుక్క”
ఒక కవిని అంచనా వేయాలంటే జీవితంలో ఆ కవి తోడిపోసిన జీవ చైతన్య వాక్యాలను బట్టి, గీటురాయిపై కెక్కించి నాణ్యతను చెప్పాల్సి వుంటుంది. కవికి వస్తువుతో పాటు దృశ్యం వీటితోపాటు అనుభవం, అనుభూతినందిస్తుంది. సమాజంలో విస్తరించి ఉంటున్న మౌనగానాన్ని, మౌన సందేశాన్ని ఒడిసిపట్టలేని కవి, వస్తువు మూలాల్ని స్పర్శించలేడు. కవి బహిర్ యాత్రతో పాటు అంతర్ యాత్రను చేయాల్సివుంటుంది. కవి కాళ్ళతోనే కాదు, కళ్ళతోనూ పయనిస్తూ, చెవులతోనే కాదు హృదయంతోను వింటూ, నిదర్శనాన్వితమైన విశాల దృష్టితో స్వశక్తితో పదబంధాలను కూర్చుకున్నప్పుడే, ఆ కవి తనదైన ముద్రతో కనిపిస్తాడు, సాహిత్యలోకంలో రాణిస్తాడు. ఆ కవి ఒక నవ్యచైతన్య కేతనాలను ఎగురవేయగలడు. కవిత్వం రాయడమంటే సమాజాన్ని చదవడమేననే దృష్టి, దృక్పథంతో జ్వలిస్తూ, అక్షరాలకు ఆయుస్సు పోయడమే. కాలం ఒడిలో కన్ను తెరిచిన కవిని కాలప్రవాహపు ఒరిపిడే ఆయన కవిత్వానికి మార్మికతను తాత్త్వికతను అద్దుతుంది. కవి ఆత్మశోధనలోంచి వెలువడిన భావధార పాఠకుణ్ణి తేలిగ్గా ఓన్ చేసుకుంటుంది. పై లక్షణాలను, లక్ష్యాలుగా, మార్గాలుగా చేసుకుంటూ వో సామాజిక శాస్త్రజ్ఞుడిగా, పరిశోధనాత్మకమైన కవిత్వాన్ని “మూడో కన్నీటిచుక్క” గా వెలువరించిన కవి, విమర్శకుడు బొల్లోజు బాబా.
ఈయన కవిత్వంలో సరళమైన భాష లోతైన భావాలు పాఠకుణ్ణి వెచ్చవెచ్చని ఆలోచనా కదలికల్లోకి నెడతాయి. తొలికవిత “ఒక దుఃఖానికి కొంచెం ముందు…” తో రైతు బాధ, వ్యధ, జీవితంలో జరుగబోయే పరిణామం ఎంత చక్కగా చెప్పాడో చూడండి.
“అప్పటికింకా అతను
చెట్టుకొమ్మకు పిడికెడు మట్టై వేలాడలేదు” అంటారు. పిడికెడు మట్టై వేలాడడం అంటే శవమైపోవడమే కదా! రైతు “ఎండిన పంటను ఓదారుస్తున్నాడు” అంటే మండే గుండెలను తమాయించుకోడానికి యత్నించడమే.
“ఇసుక నిండిన హృదయం” అంటే డ్రై అయిపోయిన గుండెలే కదా! కవిత్వాన్ని వచనంగా జారిపోనీయకుండా ప్రతి వాక్యానికి కవిత్వాంశను అద్దాడు
“అప్పటికింకా అతని భార్యలో
సగభాగం ఖననం చేయబడలేదు
కళాయి పోయిన అద్దంలో
చూసుకొంటూ నుదిటిపై
సూర్యబింబమంత కుంకుమ దిద్దుకొంటోంది”
హిందు ధర్మంలో భార్యలో కొన్ని చిహ్నాలు భర్తవిగా గోచరిస్తాయి. కొన్ని ఆనవాళ్ళు ఈమెకు భర్త ఉన్నాడు అనే విషయం ప్రపంచానికి చెప్పకనే చెప్తుంటాయి. “అందుకనే కవి సంప్రదాయ సూత్రాన్ని పట్టుకొని “అప్పటికింకా అతని భార్యలో సగభాగం ఖననం చేయబడలేదు” అనగలిగాడు. “కళాయి పోయిన అద్దం” రైతు పేదరికాన్ని పట్టిస్తుంది. రైతు పేదరికంలోకి దిగిపోయాడు అనకుండా వివర్ణమైన ఒక వస్తువును పాఠకుని ముందుకు తెచ్చి రైతు పేదరికాన్ని అర్ధమయ్యేలా చేశాడు. అభివ్యక్తిలో మార్మికతను చొప్పించి రాయడం ఈ కవి ప్రత్యేకత. రైతుల ఆత్మహత్యల గూర్చి అద్భుతంగా ఈ కవిత చెప్పబడింది.
“నాలుగు స్తంభాలు” అనే కవితలో దేశవిధ్వంశకర శక్తుల్ని గూర్తి ఎంతో తేలిగ్గా “సీరియస్ నెస్స్” ఉన్నట్లు కాకుండా “క్యాజువల్” గా మనం సాధారణ మాటలు మాట్లాడుకొన్నట్లుగా చెప్పాడు.
“మొన్నో నలుగురు వ్యక్తులు
కొండపై రాత్రి విందు చేసుకొన్నాకా
ఉదయానికల్లా కొండ మాయమైందట
ఆ నలుగురే నదీ విహార యాత్ర జరిపిన మర్నాటికల్లా
నదీ, నదీ గర్భపు ఇసుకా అదృశ్యమయ్యాయని/ ఆశ్చర్యంగా చెప్పుకొన్నారు”
ఈ కవితలో కనిపించే ఆ నలుగురు ఎవరు? ప్రకృత సహజ సంపదను దోచుకొనే మహానుభావులే కదా! కొండమీద వారు విందు చేసుకున్నారు అంటే కొండలో దాగున్న ఖనిజ సంపదను దోచుకొనే పన్నాగంతోనే ఆ నల్గురు అక్కడ చేరారని అర్ధం. అట్లే నదిని, నదీ జలాలను, పండ చేలను దోచుకొని ధ్వంసం చేయడమే వారి ప్రధాన వ్యాసంగం. కవిత ముగింపు ఎంత అద్భుతంగా అల్లాడో చూడండి.
“ఇంతలో
‘అలా జరగటానికి వేల్లేదు’ అంటూ
రోడ్డుపై ఒకడు గొణుక్కుంటూ
గాల్లో ఏవో రాతలు వ్రాసుకొంటూ
అడ్డొచ్చిన నన్ను తోసుకొని సాగిపోయాడు
ఎలా జరగడానికి వీల్లేదటా?
అని ఆలోచించాను” అంటూ సామాజిక విధ్వంశక మూలాలను మొదట కనిపెట్టేది మేధావులైన కవులు అని చెప్తాడో కవి. తరువాత ఈ అంశం ప్రజల్లోకి వెడుతుంది. “అవునవును/ నాకూ అన్పిస్తోంది/ ఖచ్చితంగా అలా జరగటానికి వీల్లేదు” అంటూ జనం గొంతు కలపడాన్ని చివర చెప్తాడు కవి. జనంలో చైతన్యాన్ని రగిల్చేది నిజమైన కవిత్వంగా ఈ కవి భావిస్తాడు.
“నాన్నతనం” అనే కవితలో కొత్తకోణంలో నాన్నను ఆవిష్కరించాడు కవి. అందరూ అమ్మను, అమ్మతనాన్ని పుంఖాను పుంఖాలుగా రాశారు. ఈ కవి నాన్న కాపురాన్ని ఎట్లా ఈదుతాడో, ఏ విధంగా కుటుంబానికి సేవ చేస్తాడో గొప్పగా ఆవిష్కరించాడీ కవి. నాన్నని మనమేవిధంగా గుర్తించవచ్చునో చెప్తూ-
“పార్కులో రెండు చేతుల్తో పీచు మిఠాయో
పల్లీల పొట్లాలో తీసుకెల్తూ కనిపించవచ్చు…..
“ఏ పేవ్ మెంటు మీదనో
స్కూలు బేగ్గో, షూసో కుట్టిస్తూ కంటపడొచ్చు….
పార్కు బెంచీపై కూర్చొని మిత్రులతో
కొడుకు సంపాదన, కోడలి మంచితనం
మనవల అల్లరిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ
కనిపిస్తుంది…. నాన్నతనం” అంటారు. నాన్న యౌవనంలో ఉన్నప్పటినుంచి వృద్ధాప్యంలోకి వచ్చిన దాకా ఆయన దినచర్యలను పూసగుచ్చినట్లు వర్ణిస్తాడు కవి.
“చిట్టికురువి” కవిత పర్యావరణ పరిరక్షణ మీద రాసిన కవిత. పచ్చదనం అంతరించిపోవడం, పిట్టలు రాలిపోవడం, దీనికి రాణమైన వస్తువులను ఉదహరించడం ద్వారా చెప్పాడు కవి. చివర పసిపాప హృదయం ఎంత ప్రేమలాలిత్యంగా అమాయకత్వంలో పొదవుకున్న మంచితనాన్ని పట్టిస్తుంది.
“ఒక చిన్నారి పిట్ట
నిలువ నీడలేక, దాహం తాళలేక
నేల కూలింది/ మానవుడు తయారుచేసిన
గొడ్డళ్ళన్నీ పిట్ట చుట్టూ చేరి
దీనంగా చూస్తున్నాయి…
రంపాలన్నీ
ఆ పిట్టకొరకు
కన్నీరు కారుస్తున్నాయి
బుల్ డోజర్లన్నీ పిట్టను బతికించమని
తొండాలెత్తి ప్రార్ధిస్తున్నాయి
అయినా మనిషి జాడ లేదు”
అంటూ మనిషి ఆయుధాలు సైతం కనికరం చూపుతున్నా పిట్టయెడల మనిషికి ఇసుమంత బాధలేదు. పసిపాప
“మెల్లగా నడుచుకొంటూ వచ్చి/
“చిట్టి కురివీ” నిన్నెవరు కొట్టారమ్మా”
అంటూ పిట్టను చేతిలోకి తీసుకుంది
వేళ్ల కొనలలోంచి జలపాతాల్ని పుట్టించింది
దాహం తీర్చుకొన్న పిట్ట
పాపచుట్టూ కాసేపు తిరిగి ఎటో ఎగిరిపోయింది” అంటూ పాప సహృదయతను ప్రేమను ఎత్తిచూపుతాడు కవి. ఇందులో మరో అంశం, గొడ్డళ్ళు, రంపాలు బుల్ డోజర్లు మానవుని చేతిలో ఆయుధాలు. వాటికి కూడా హృదయమున్నట్లు, స్పందించినట్లు చెప్పటం కవి చాతుర్యం. కాని మనిషికి హృదయంవున్నా ప్రకృతిమీద ప్రేమ లేదు, పశు పక్ష్యాదులమీద జాలి లేదు.
“మూడో కన్నీటిచుక్క” లో మొత్తం 78 కవితలున్నాయి. ప్రతి కవిత అనుభవాలను, అనుభూతులను ఆరవోసాయి. ట్రన్స్ పరెంటు చీకటిలా కనిపించినా, లోనవిషయం లోతుగా పాఠకుణ్ణి ఆకర్షిస్తుంది. సామాన్య స్పృహకు అతీతమైన చైతన్య స్థాయి కవిత్వంలో కనిపిస్తుంది. కవి కవిత్వంలో ఇంకిపోయి బయటకు వచ్చినట్లు సామాజిక తపన, అనుభూతి, లోకానుశీలన పుష్కలంగా కనిపిస్తుంటాయి. “మూడో కన్నీటిచుక్క” అందరూ చదువదగిన పుస్తకంగా భావిస్తూ కవిని అభినందిస్తున్నాను.
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
9948774243