“శయనిస్తున్న అతనెలా ఉన్నాడు? యోధునిలాగా లేక కవిలాగ? హ్మ్...... కవిత్వ యోధునిలా” --- జె.డి. రోబ్
ఓ మాస్టారికి ఒక కిళ్ళీ కొట్టు వద్ద ఖాతా ఉండేది. అయిదేళ్ళు గడిచాకా, ఓ మిత్రుడు ఆ కొట్టు యజమానికి ‘ఈ మాస్టారే ప్రముఖ కవి అద్దేపల్లి రామమోహనరావు” అని పరిచయం చేసాడు. ఆ కొట్టు యజమాని ఓ బైండు చేసిన పుస్తకాన్ని తీసి చూపిస్తూ మనస్సు బాగోనప్పుడల్లా ఈ పుస్తకాన్ని చదువుతుంటానని చెప్పాట్ట. ఆ పుస్తకం పేరు “అంతర్జ్వాల”. అది శ్రీ అద్దేపల్లి రచన. ఒక కవికి ఇంతకు మించిన పురస్కారం ఏ అకాడమీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఇవ్వగలవు?
యాభై ఏళ్ల సాహితీప్రస్థానంలో సుమారు 30 పుస్తకాల్ని వెలువరించి, ఆరు వందలకు పైగా ముందుమాటలు వ్రాసి, వివిధ సభల్లో రెండువేలకు పైగా అద్యక్షోపన్యాసాలు ఇచ్చి, ఎన్నో వందల పుస్తకాలను సమీక్షించి, కొన్ని వందల తెలుగు గజల్స్ ను వ్రాసి, గానం చేసి- తెలుగు సాహితీలోకంలో ఒక కవిత్వయోధునిలా జీవించిన శ్రీ అద్దేపల్లి రామమోహనరావు జీవిత చరమాంకంలో కూడా ఒక యోధునిలానే నిష్క్రమించారు.
గత మూడునెలలుగా ఆయన అస్వస్థతకు గురయ్యారని కాకినాడ సాహితీమిత్రుల మధ్య గుసగుసలుగానే ఉండింది. కానీ ఇంత త్వరగా విడిచిపోతారాని ఎవరూ అనుకోలేదు.
తన అనారోగ్యం గురించి ఎవరికి తెలియనివ్వలేదు శ్రీ అద్దేపల్లి. ఎవరినీ ఎక్కువగా కలిసే వారు కాదు. గతమూడునెలలుగా ఎవరైనా ఆయనను కలిసినా అస్వస్థత ప్రస్తావన లేకుండానే మాట్లాడేవారు. ఇవతలి వ్యక్తికి తెలిసినా, ఆయన ధోరణిని బట్టి, తెలియనట్టుగానే మాట్లాడాల్సివచ్చేది. అలాగని నిర్వేదంలో పడిపోయారా అంటే అదీకాదు, మరణానికి వారంరోజుల ముందు వరకూ కూడా స్వయంగా ఆటో ఎక్కి రేడియేషన్ చేయించుకొని వచ్చిన వ్యక్తి. ఒక సాహితీ మిత్రునికి ఫోన్ చేసి, ఈ సంవత్సరం ఎలాగైనా “సాహితీ స్రవంతి” పత్రికను ప్రారంభించాలి అని దిశానిర్ధేశం చేసిన వ్యక్తి శ్రీ అద్దేపల్లి. “మీరు రేడియేషన్ చేయించుకొన్నారు కదా జాగ్రత్తగా ఉండాలి” అని కుటుంబసభ్యులొకరు అన్నప్పుడు, “అన్ని సిట్టింగులు అయిపోయాయి, రేడియేషన్ అన్న మాట ముగిసిపోయిన అధ్యాయం, ఇకదాని గురించి మాట్లాడకండి” అని వారికే తిరిగి ధైర్యం చెప్పిన వ్యక్తిత్వం శ్రీ అద్దేపల్లిది. మరణాన్ని కూడా ప్రశాంతంగా స్వీకరించాలంటే గొప్ప రుషిత్వం ఉండాలి.
కవిగా, విమర్శకునిగా, వక్తగా, వ్యక్తిగా ఆయన పోషించిన వివిధ పాత్రలను తెలుసుకోవటం ద్వారా శ్రీ అద్దేపల్లి చేసిన సాహిత్యకృషిని అర్ధం చేసుకొనవచ్చును.
శ్రీ అద్దేపల్లి కి ప్రాచీన సాహిత్యంపై గొప్ప పట్టు ఉండేది . మొదట్లో చందోబద్దమైన కొన్ని వందల పద్యాల్ని రచించారు. 1960 లో తొలికవిత కృష్ణాపత్రికలో అచ్చయింది. కాలక్రమేణా తాను విశ్వసించే హేతువాద దృక్ఫధం, అభ్యుదయత, ప్రగతిశీల భావాలకు వచనకవిత్వమే సరైనదని అనుకొని వచన కవితామార్గాన్ని ఎంచుకొన్నారు. ప్రపంచీకరణ ప్రభావం వలన చిధ్రమౌతున్న మానవజీవనంపై కవిత్వం వ్రాసిన తొలి తెలుగుకవి శ్రీ అద్దేపల్లి. వీరి కవిత్వ సంపుటాలలో అంతర్జ్వాల (1970), రక్త సంధ్య (1978), గోదావరి నా ప్రతిబింబం (1992), పొగచూరిన ఆకాశం, సంఘం శరణం గచ్చామి, మెరుపు పువ్వు, గీటురాయి వంటివి ప్రముఖమైనవి. మినీ కవితల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి గొప్ప ప్రాచుర్యాన్ని కలిగించారు శ్రీ అద్దేపల్లి. తెలుగులో అనేక వందల గజల్ లను రచించి వాటిని గొప్ప రాగయుక్తంగా ఆలపించి అనేక సభలను రంజింపచేసేవారు. వీరి అనేక కవితలు వివిధ భాషలలోకి అనువదింపబడ్డాయి. కవిగా శ్రీ అద్దేపల్లి తెలుగు సాహితీలోకంలో ఎప్పటికీ చిరస్మరణీయుడే.
విమర్శకునిగా శ్రీ అద్దేపల్లి పాత్ర గణనీయమైనది. శ్రీశ్రీ మహాప్రస్థానంపై వీరి మొదటి విమర్శనా గ్రంధం వచ్చి పలువురి ప్రసంశలు పొందింది. ఈ వార్తవిన్న శ్రీశ్రీ యే స్వయంగా “సరోజినీ ఈ విషయం విన్నావా, నా పుస్తకం మీద సమీక్షా గ్రంధం వస్తోంది” అని చెప్పటం ఒక మధురమైన ఘట్టం. కుందుర్తి వచన కవితా వైభవం, స్త్రీవాద కవిత్వం-ఒక పరిశీలన, మహాకవి జాషువా కవితా సమీక్ష, తెలుగు కవిత్వంపై ఆధునికత, అభ్యుదయ విప్లవ కవిత్వాలు- సిద్దాంతాలు, శిల్పరీతులు వంటివి శ్రీ అద్దేపల్లి వెలువరించిన వివిధ విమర్శనా గ్రంధాలు. మంచిని విస్తారంగా చర్చించి, చెడును సూచనప్రాయంగా ఎత్తిచూపటం శ్రీ అద్దేపల్లి విమర్శనా శైలి.
వక్తగా శ్రీ అద్దేపల్లి సమకాలీన సాహితీవేత్తలెవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటారు. సభలకు ఎవరైనా పిలిస్తే దూరభారాలకు వెరవకుండా, తప్పనిసరిగా హాజరయ్యి, ఆ సంస్థలకు, అక్కడి యువకవులకు ఎంతో స్పూర్తిని, ఉత్తేజాన్ని నింపే గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేవారు. రిజర్వేషన్ దొరకకపోతే జనరల్ భోగీలో ప్రయాణించైనా సరే, వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకొనేవారు శ్రీ అద్దేపల్లి. ఈ లక్షణాన్ని గుర్తించిన తెలుగు సాహితీలోకం శ్రీ అద్దేపల్లికి “సాహితీ సంచార యోధుడు” అన్న బిరుదును ఇచ్చి సత్కరించింది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై లోతైన అవగాహనతో వీరు చేసే అనర్ఘళమైన ఉపన్యాసాలు, చక్కని ఉటంకింపులతో, చలోక్తులతో సాగి సభికులను రంజింపచేసేవి. వీరు గత ముప్పై ఏళ్ళుగా ఇచ్చిన ఉపన్యాసాలు రెండువేలకు పైమాటే.
వ్యక్తిగా శ్రీ అద్దేపల్లి స్నేహశీలి, నిరాడంబరుడు, భోళాశంకరుడు, నిరంతర సాహితీకృషీవలుడు. సమయపాలన విషయంలో శ్రీ అద్దేపల్లి నిక్కచ్చిగా ఉండేవారు. వీరు అద్యక్ష్యత వహించిన సభలలో కాలం తూకం వేసినట్టు నడిచేది. తనకన్నా చిన్నవారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి కవిత్వంలోని గుణగణాలను విప్పిచెప్పి ప్రోత్సహించేవారు. ఎవరైనా మంచి వాక్యం వ్రాస్తే భలే ఉంది అంటూ వెన్నుతట్టి మెచ్చుకొనేవారు. శ్రీ అద్దేపల్లి అద్యక్షత వహించిన ఒక సభలో నేను నా కవిత వినిపించి వెళిపోతుంటే, నన్ను ఆపి --- బొల్లోజు బాబా కవిత్వం వాచ్యంగా ఉండదు ధ్వని ప్రధానంగా ఉంటుంది, ఇప్పుడు చదివిన కవితా పంక్తులలోని సొబగులు ఇవి అంటూ విశ్లేషించి, అభినందించటం--- నేను ఎన్నటికీ మరచిపోని ఒక తీపి జ్ఞాపకం.
తెలుగు కవిత్వయోధుడు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ.......
భవదీయుడు
బొల్లోజు బాబా
14/01/2016
(ఈ వ్యాసం ముందుగా సారంగ పత్రికలో ప్రచురింపబడింది)
14/01/2016
(ఈ వ్యాసం ముందుగా సారంగ పత్రికలో ప్రచురింపబడింది)