Tuesday, November 18, 2014

సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్

ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్నశ్రీ సోమసుందర్ గారు నిత్యయవ్వనుడు, నిత్యోత్సాహి. తెలుగు సాహిత్యక్షేత్రంలో కురువృద్దుడు. వయసు 90 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని తన ఉఛ్వాస నిశ్వాసాలుగా వెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు.

శ్రీ సోమసుందర్ గారు కవిగా, కధకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతోగత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు. సాహితీక్షేత్రంలో వీరు సహస్రబాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా అగుపిస్తారు.

జననం - విద్యాభ్యాసం
శ్రీ సోమసుందర్ గారు తూర్పుగోదారి జిల్లా అన్నవరం సమీపంలో ఉన్న శంఖవరం అనే గ్రామంలో శ్రీ కాళూరి సూర్యప్రకాశరావు, శ్రీమతి వెంకాయమ్మలకు 18-11-1924న అష్టమ సంతానంగా జన్మించారు. తన పినతల్లిగారైన శ్రీమతి ఆవంత్స వెంకాయమ్మగారికి సంతానం లేకపోవటం వలన చిన్నతనంలోనే శ్రీ సోమసుందర్ గారు వారింటికి దత్తుకు వెళ్లారు. ఆవిధంగా కాళ్ళూరి అనే ఇంటి పేరు ఆవంత్సగా మారింది.

తనను దత్తత తీసుకున్న వారికి మెండైన సాహిత్యాభిలాష కలిగిఉండటంవల్ల, చిన్నతనం నుంచే సంస్కృత కావ్యాలు, శతకాలు, అమరకోశం వంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం వీరికి కలిగింది. కానీ విధి వశాత్తు వీరి దత్తత తల్లితండ్రులు వీరికి పదేళ్ళ వయసుండ గానే పరమపదించారు. అయినప్పటికీ వీరి చిన్నారి మనసుపై ఆ పుణ్య దంపతులు వేసిన సాహిత్య ముద్ర మాత్రం అలానే నిలిచిపోయింది. వీరి ప్రాధమిక విద్యాభాసం అంతా పిఠాపురంలోనే జరిగింది. 1943 లో కాకినాడ పి.ఆర్.కళాశాలలో ఉన్నత విద్య నభ్యసించారు.


దేశ భక్తి

ఆ కాలం లో స్వాతంత్ర్యం కోసం జరిపే పోరాటానికి ఆ బాలగోపాలమూ ఉత్తేజితమై సర్వం త్యజించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపేవారు. శ్రీ సోమసుందర్ గారు కూడా అప్పుడు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు. 1942 లో విద్యార్ధులను కూడదీసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెచేసారు. వీరి చర్యలకు ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం వీరిని లాకప్పులో పెట్టి, రోజూ స్టేషనుకు వచ్చి సంతకం చేయాలన్న షరతుపై విడుదల చేసింది.

శ్రీ సోమసుందర్ గారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు పోలీసుదెబ్బలకు తీవ్రంగా గాయాలపాలయ్యారు. అప్పుడు వ్రాసిన వీరి మొదటి గీతంలో ఎంతటి గొప్ప దేశ భక్తి ఉందో గమనించండి.

రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ...........

ఇక్కడ తన శరీరాన్ని కాకుల్ని గద్దలనూ తినివేయమంటున్నారేమిటా అనుకోవచ్చు కానీ అది అనన్యమైన దేశభక్తిగా గ్రహించాలి, ఎందుకంటే తను చనిపోయిన తరువాత తన శరీరం కూడా బ్రిటిష్ వారికి దక్కకూడదనే తీవ్ర స్వాతంత్ర్య కాంక్ష. (ఇది వారు స్వయంగా చెప్పిన విశ్లేషణ).

వీరు స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్ధి నాయకుడిగా, కమ్యూనిష్టు పార్టీ సభ్యునిగా తనదైన గొప్పపాత్రను పోషించారు. సామ్రాజ్య వాద శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 1954 వరకూ వీరు కమ్యూనిష్టు పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించారు. తరువాత తరువాత రాజకీయాలు, సాహిత్య వ్యాసంగము ఏకకాలంలో నిర్వహించటం వలన , తనకెంతో ప్రీతిపాత్రమైన సాహిత్యానికి తగిన న్యాయం చేయలేకపోతున్నానని ఆత్మపరిశీలన చేసుకొని, క్రమక్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు.

సాహితీ ప్రయాణం
వీరు ఫోర్తు ఫారం చదువుతున్న రోజుల్లో పద్య ప్రక్రియపై మోజు కలిగి, చందస్సును క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. ఈ ప్రక్రియలో ప్రతీ రోజూ అభ్యాసం కొరకు తాను వ్రాసిన వివిధ పద్యాలను మిత్రులకు, ఉపాద్యాయులకు చూపేవారు. 1943 వరకూ కూడా భావకవిత్వం వీరికి తారసపడలేదు. భావకవిత్వాన్ని చదివిన తరువాత వీరు తనదైన వచనా శైలిని అలవరచుకొన్నారు. వీరు కమ్యూనిష్టు కార్యకర్తగా పనిచేసారు కనుక ఆ భావజాలం వీరి కవిత్వంలో అంతర్లీనంగా జాలువారుతుంది. వీరి కవిత్వానికి మానవుడే ప్రాతిపదిక, సమాజమే నేపధ్యం..

వజ్రాయుధం నుండి ఆమ్రపర్ణి వరకూ సుమారు ఆరున్నర దశాబ్ధాల పాటు శ్రీ సోమసుందర్ చేసిన కవితాయానంలో సమాజ సంకుల సమరమే అన్ని కోణాల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఈ కవి మానవుని విస్మరించి, ఆకాశంలో విహరించిన సందర్భాలు కనపడవు.

వీరు 1969-73 ల మద్య కాకినాడకు మకాం మార్చి ' కళా కేళి " అనే సాహిత్య పత్రికను నడిపారు. (వీరు పిఠాపురంలో నివసిస్తున్న ఇంటి పేరు కూడా "కళాకేళి నికేతన్””") ఈ ప్రక్రియలో వీరు కొంత ఆర్ధికంగా నష్టపోయి, కొంత భూమిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. ఈ కాలం మినహా మిగిలిన జీవితకాలమంతటిలో, వీరు ప్రతిఏటా ఒకటో రెండో పుస్తకాలు చొప్పున రాస్తూనే ఉన్నారు.

1975 లో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి కళా ప్రపూర్ణ అవార్డును పొందినపుడు, వారి అభిమానులు కాకినాడలో సన్మానం జరిపారు. దానికి విచ్చేసిన దేవులపల్లి, వీరికి ప్రత్యేకంగా కబురు పెట్టించి కాకినాడ రప్పించుకొన్నారు. ఆ రోజు జరిగిన సభకు శ్రీ సోమసుందర్ అధ్యక్ష్యత వహించారు. ఆ సభలో దేవులపల్లి ఒక చీటిపై " మీరు నా కవిత్వంపై విమర్శనాత్మక పుస్తకం వ్రాయాలి" అని కోరారు. దానిని పైకి మైకులో చదవమని దేవులపల్లి కోరగా వీరు మైకు తీసుకొని "మీ సాహిత్యం పై నేను పుస్తకం వ్రాయటం నాకు సాద్యమా? "అని అడిగారు. దానికి దేవులపల్లి మరలా మరో చీటిపై " మీరు వ్రాయగలరు, మీకా సమర్ధత ఉంది వ్రాయండి ఇది నా ఆజ్ఞ అనుకోండి" అని వ్రాసి ఇచ్చి, దాన్ని కూడా చదవమని సైగ చేసి చెప్పారట. ఆవిధంగా ఆవిర్భవించిన గ్రంధమే "క్రిష్ణశాస్త్రి కవితాత్మ".

తెలుగు విమర్శనా సాహిత్యంలో ఇంతటి ఉత్తమ విమర్శ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారి కవితాత్మను పట్టుకొన్న గొప్ప పుస్తకమిది. కృష్ణ శాస్త్రి గారి పై వ్రాసిన పుస్తకాలలో ఒకదానికి ప్రైజు ఇవ్వదలచి పోటీ పెడితే, పోటికి పంపించబడ్డ 15 పుస్తకాలలో శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన "కృష్ణ శాస్త్రి కవితాత్మ" అనే ఈ పుస్తకం మొదటి బహుమతి గెలుచుకోవటం వీరి సునిశిత పరిశీలనా శక్తికీ, రచనా పటిమకు నిదర్శనం.

ఇంత సుదీర్ఘకాలంగా మీరు సాహిత్యాన్ని ఎలా సృష్టించగలుగుతున్నారని అడిగినప్పుడు వారు చిరునవ్వు నవ్వి " రాయలేకుండా ఉండలేక. ఏమీ రాయకపోతే ఆరోజు దుర్దినంగా ఉంటుంది" అన్న వారి మాటలను బట్టి, వారు కవిత్వం వ్రాయటం ఒక పూవు సుగంధాలను విరజిమ్మినట్లు, చెట్లు వసంతాన్ని ధరించటం లాగా ఒక సహజ లక్షణమా అని అనిపించక మానదు
శ్రీ సోమసుందర్ గారు జీవితమే కవిత్వం అని నమ్మి, జీవితాన్నే కవిత్వానికి అంకితం చేసిన వ్యక్తి, శతాధిక గ్రంధ కర్త. కొందరు కవులు తాము వ్రాసిన ఒకటి రెండు రచనలతో వచ్చిన కీర్తితో జీవితాన్ని వెళ్లదీస్తారు. కానీ శ్రీ సోమసుందర్ గారి రచనలు అసంఖ్యాకం. దేని ప్రతిభ దానిదే, దేని సౌరభం దానిదే. ్సామాన్య మానవుడిని కవిత్వంలో ఆవిష్కరించటానికై వీరు కవిత్వాన్ని నిత్యాగ్నిహోత్రంగా పాటించారు.

ఆరున్నర దశాబ్ధాల వీరి సాహితీయాత్రలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, ప్రళయాలు, కరువులు, ఎన్నో కనిపిస్తాయి. జాతి చైతన్యాన్ని కవితా చైతన్యంగా సమర్ధ వంతంగా తర్జుమా చేసిన అభ్యుదయ కవిగా శ్రీ సోమసుందర్ గారికి తెలుగు సాహిత్యంలో సాటి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

వీరు సాహిత్యజీవితంలో అందుకోవలసిన శిఖరాలు అందుకోలేదని నిర్ధ్వంద్వంగా చెప్పవచ్చును. అకాడమీ ప్రైజులు, అవార్డులు వీరి దరి చేరకపోవటానికి కారణం శ్రీ సోమసుందర్ గారు ఎన్నడూ రాజకీయనాయకుల దగ్గర, అధికార పీఠాల్లో ఉన్నవారిదగ్గర తలవంచి నిలబడలేదు.

వ్యక్తిత్వం
శ్రీ సోమసుందర్ అభ్యుదయ కవి. తెలంగాణా ఉద్యమాన్ని కోస్తా ప్రాంతం నుండి సమర్ధించి కవిత్వం వెలువరించిన మహామనీషి శ్రీ సోమసుందర్ గారు. అప్పట్లో " ఖబడ్దార్ హే నిజాం పాదుషా .... ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురని " గర్జించిన సాహసి.

శ్రీ సోమసుందర్ గారి వ్యక్తిత్వంలో మరొక విశిష్టమైన అంశం ఏమిటంటే వీరు చాచే నిష్కల్మష స్నేహ హస్తం. వీరి సమకాలీనులలో ఎవరికైనా ఏదైనా అవార్డు వచ్చినట్లయితే వారిని అభినందిస్తూ వ్యాసమో, పుస్తకమో వ్రాసి ఆ అవార్డేదో తనకే వచ్చినంత ఆనందించటం వీరి కల్మషమెరుగని మనస్సుకు అద్దం పడుతుంది.

వీరు ఎందరో కవులను ప్రోత్సహించారు. అలనాటి ఓలేటి శశాంక మొదలు ఈ నాటి అరుణ్ బవేరా వరకూ.

ఇస్మాయిల్, మిరియాలరామకృష్ణ, మల్లిక్, చందుసుబ్బారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ వంటి చాలా మందిని వీరు వెన్ను తట్టి ముందుకు నడిపించారు.

వీరికి రెండు పార్శ్వాలు. ఒకటి రచనా వ్యాసంగం. రెండవది తన రచనల్లో దేన్నైతే ప్రవచించారో దానికోసం నిరంతర పోరాటం. దానిలో భాగంగా శ్రీ సోమసుందర్ గారు ప్రతీ ఏటా ఐదుగురు కవులకు ఆరువేల రూపాయిల నగదు బహుమతిని, తాను నెలకొల్పిన సోమసుందర్ లిటరరీ ట్రస్టు ద్వారా అందచేస్తున్నారు.

2006 లో వీరి ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఆధునిక మహిళా సాహిత్య సదస్సు జరిపారు. దానికి రాష్ట్రం నలుమూలలనుంచీ అనేక మంది కవయిత్రులు విచ్చేసి పాల్గొన్నారు.

పాత కొత్త తరాల వారధి
1953 వరదలకు చలించిపోయిన సోమ సుందర్ గారు వ్రాసిన గోదావరి జలప్రళయం అనే కావ్యంలోని కొన్ని కరుణ రస ప్రధాన పద్య పాదాల ను చూస్తే వీరి కవితా శక్తిని గుర్తించవచ్చును.

ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమన్యాయమే తల్లీ...

2004 లో వీరు రచించిన అక్షర నాదం అనే కవితా సంపుటిలోని కొన్ని పద చిత్రాల ను గమనించినట్లయితే వీరి ప్రతిభ, వీరేవిధంగా రెండు తరాలకు వారధిగా ఉన్నారనే విషయం సుస్ఫష్టమౌతుంది.

గ్లోబలైజేషన్ తో ఈ భూమి రజస్వలై
నవవరాన్వేషణలో మిటకరిస్తుంది......
హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ తో
అవతరించిన క్లోనింగ్ కోడె దూడ
' అంబా" అని అరవడం
గ్రాంధికమని నిషేదిస్తుంది. (నేటిని ఏటికి విడిచి అనే కవితనుంచి )


నేడు నా ముని వాకిట
పూచిన గులాబి పరిమళం నిండా
బాంబుల విషధూమం నింపింది పడమటి గాలి (సమరం కాదిది మరణం అనే కవితనుంచి )

ఇన్ని జంత్ర స్వరాల నాదాలలోంచి
ఎన్ని వెన్నెల మైదానాలు - ఎలా తెరుచుకున్నాయి?
దూరంలో మసకబారిన కొండలు
బూడిద బుంగలు (బితోవెన్ సంగీతంపై వ్రాసిన మూన్ లైట్ సొనాటా అనే కవిత నుంచి)

వంకవంకల వయ్యారాలతో
తల్లిలా పవళించిన ఏటి ఒడిలో
నిటారుగా నిలచిన కొబ్బరి తోట....
రేగిన జుత్తుతో ఊరికే మారాంచేసే
పిల్లవాడి వెర్రి ఊగిసలాట...... (ఏటి వడిలో కొబ్బరి తోట అనే కవిత నుంచి)


వీరి కవిత్వంలో సరళత, అదే సమయంలో అర్ధ గాంభీర్యతా , ఉదత్తమైన లోతైన భావాలు, మానవత్వపు పరిమళాలు పుష్కలంగా పొర్లాడుతూంటాయి.

బానిసల దేశం, గోదావరి ప్రళయం, రక్తాక్షి, హిరోషిమా, రక్షరేఖ, సీకింగ్ మై బ్రోకెన్ వింగ్, వంటి వీరి రచనలలో ఆయా సంఘటనలకు, సందర్భాలకు ఒక కవి తన హృదయమంతటితోనూ స్పందించిన విధానాన్ని దర్శించవచ్చు.

అంధురాలికోసం బిథోవెన్ సృష్టించిన వెన్నెల, సౌరాష్ట్రంలో జరిగిన నరమేధం, ఎన్నటికీ పూర్తికాని సోమశిల ప్రోజెక్టూ, ఖుజరహో శిల్ప విన్యాసం, సొమాలియాలో అన్నార్తులూ, సైగల్ గానమాధుర్యం ఇవీ వీరి కవితా వస్తువులు. వీటిలో ఏ ఒక్కటీ కూడా ఈ మట్టిని , గాలిని విడిచి సాము చెయ్యవు.

అవార్డులు
వీరు 1979 లో సోవియట్ లాండ్ నెహ్రూబహుమతి పొందారు. రాజాలక్ష్మీ ఫౌండేషను అవార్డు, పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు. 2008 సంవత్సరానికి గానూ ఎన్టీఆర్ స్మారక జాతీయ పురస్కారం వీరిని వరించి వన్నెకెక్కింది.

శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి ఇంతవరకూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాకపోవటం ఆశ్చర్యకరం. ప్రభుత్వ పరంగా వీరికి జరిగిన అన్యాయం పెరుమాళ్ల కెరుక. కవిత్వం సోమసుందర్ కెరుక.


వీరి రచనల పట్టిక
వీరింతవరకూ 77 పుస్తకాలు రచించారు. చాలా పుస్తకాలు అనేక పునర్ముద్రణలు పొందాయి.
వీరు ప్రస్తుతం తన స్వీయచరిత్ర రెండవ భాగాన్ని వ్రాస్తున్నారు.

ఈమద్య ప్రచురించిన వీరి పుస్తకం పేరు " దేశి సారస్వతము-సమాజ వాస్తవికత. " దేశి సాహిత్యంలో ఉండే సామాజిక స్పృహపై వ్రాసిన విశ్లేషణాత్మక గ్రంధం.
వజ్రాయుధం: నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వ్రాసిన కవితాసంకలనం. 1946 అక్టోబరు 26న దొడ్డి కొమరయ్య మరణంపై వ్రాసిన ఖబడ్ధార్ అనే కవితతో ఇది మొదలవు తుంది. ఈ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించింది. 1956 లో శ్రీసంజీవరెడ్డి ప్రభుత్వం నిషేదాన్ని ఎత్తివేసింది. ఇది ఇప్పటికి 5 ముద్రణలు పొందింది. అనంతపురం యూనివర్సిటీ వారు దీనిని టెక్ట్స్ బుక్ గా పెట్టుకొన్నారు.
కాహళి : ఇవి ఆంధ్రరాష్ట్ర ఉద్యమ సమయంలో వ్రాసిన కవితలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమిస్తున్న సమయంలో వారానికి ఒకటి చొప్పున "జ్వాల" అనే వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. 1953 లో పుస్తక రూపంగా వచ్చాయి.
గోదావరి జల ప్రళయం: 1953 లో వచ్చిన గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో, శ్రీ సోమసుందర్ గారు రాజమండ్రి, అమలాపురం, కపిలేశ్వరం వంటి ప్రాంతాలను సందర్శించి అప్పటి గోదావరి భీభత్సాన్ని కరుణరసార్ధ్రంగా కవిత్వీకరించారు.
రక్తాక్షి : ఫ్యూడల్ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశత్వాలు, అమానుషత్వాలను కధా వస్తువుగా తీసుకొని చేసిన చందోబద్ద కావ్యం. ఈ కావ్య ప్రత్యేకత ఏమిటంటే ఆధునిక కాలంలో విశ్మరింపబడ్డ ప్రాచీన చందస్సును తీసుకొని రచించటం. ఉదా: శ్రీ వృత్తం, వనితా వృత్తం వంటివి. రక్తాక్షి కావ్యంలో రెండు భాగాలు ఉంటాయి. 1. సచితానందం 2. రక్తాక్షి
మేఘరంజని: 1954 లో వెలువడ్డ కధాకావ్యం. దీర్ఘ వచన పద్యం. మొత్తం ఆరు చాప్టర్లు ఉంటాయి.
సోమరసం-సుందరకాండ: ఇది తాత్విక చింతనామయ కావ్యం. ఏమిటీ లోకం, ఏమిటీ భాదలు వంటి ప్రశ్నలు, వాటికి కవి కనుగొన్న సమాధానాలతో ఈ కావ్యం రచింపబడింది.
మిణుగురులు: అద్బుతమైన పదచిత్రాలతో కూడిన ఆధునిక కవితాసంకలనం.
అనలకిరీటం: 1975 లో వెలువడిన కవితా సంపుటి. Progressive and Revolutionary భావాల Concealed expressions తో కూడిన కవితల పుస్తకం. (శ్రీ సోమసుందర్ గారి మాటలలో)
వెన్నెలలో కోనసీమ : 1977 లో అమలాపురంలో ఆవిష్కరింపబడిన గీత సంపుటి. సంగీతానికి అనుకూలంగా ఉండే గీతాల రచన. ఈ గీతాలలో చాలావాటిని రేడియోలలో పాటలుగా పాడారు.
రాలిన ముత్యాలు: మిని కవితల ఉద్యమానికి ముందే లఘుకవితల పేరిట వ్రాసినటువంటి చిన్ని చిన్ని కవితలు.
మాఊరు మారింది: శ్రీసోమసుందర్ గారు ఎమర్జన్సీని బలపరిచారు. ఈ విషయం శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారిని కలవరపరచి, వీరితో భేటీ అయి అయిదురోజులపాటు చర్చించగా, వీరు ఎమర్జన్సీ కి వ్యతిరేకంగా తన భావాలను మార్చుకొని, ఒక స్టేట్ మెంట్ ఇవ్వటం జరిగింది. ఆ భావ పరిణామక్రమంలో వ్రాసిన 7 భాగాల కావ్యమే మావూరు మారింది. దీనిలో ప్రణాళికల ద్వారా గ్రామాలే విధంగా మారాయి అని వివరిస్తూ వ్రాసినటువంటి కావ్యం.
ఆగతనికి శుభారంభం : వచన కవితలు
బృహత్కావ్యాలు (నాలుగు సుదీర్ఘ కవితలు): నాలుగు దీర్ఘకావ్యాలు. సుమారు 300 పేజీల పుస్తకం. ఈ పుస్తకంలో అక్షయతరంగిణి, కాలం వీలునామా, ముక్తఛ్ఛాయ, అరచే లోయలు అనే నాలుగు దీర్ఘ కవితలు ఉంటాయి. దీనిలో ముక్తఛ్చాయ లో మననుంచి మన నీడ విడిపోవటం, అసలు మననీడ అంటే ఏమిటి అనే విషయాలపై తాత్విక, భౌతిక చింతనలతో కూడిన భావాలుంటాయి.
ఒక్క కొండలో వేయి శిల్పాలు: 120 పేజీల దీర్ఘ కవితల సంకలనం
ఆంగ్ల సీమలో ఆమని వీణలు (యాత్రా సాహిత్యం): 1983 లో వీరు ఆంగ్లసీమలో చేసిన ప్రయాణ విశేషాలతో కూడిన ట్రావెలాగ్.
గంధ మాదనం: రచనా కాలం 1995/96. హనుమంతుడు సీతను అన్వేషించటానికి వెళ్లినపుడు మద్యలో మకాంచేసిన పర్వతం పేరు గంధమాదనం. జీవితం యొక్క అన్వేషణకు గ్రంధాలయం ప్రాతిపదిక అనే భావనతో వ్రాసిన దీర్ఘకావ్యం.
చేతావని: చేతావని అంటే వార్నింగ్ (1994). బాబ్రిమసీదు కూల్చినపుడు వ్రాసిన దీర్ఘ కావ్యం. 50 పేజీలు.
దోనా పాలా: ఇది ఒక ప్రదేశం పేరు. గోవా ప్రయాణంలో వ్రాసిన కవితలు.
రక్షరేఖ: బాబ్రి మసీదు కూలగొట్టిన తరువాత బొంబాయిలో (ముంబాయి) మతకలహాలు చెలరేగాయి. ఇలాంటి మతకలహాలు పాకిస్తాను విడిపోయినప్పుడు కూడా జరగలేదు. వాటికి స్పందిస్తూ వ్రాసినటువంటి దీర్ఘ కవితా సంపుటి.
హృదయంలో హిరోషిమా: 1997 లో హీరోషిమా ఉదంతాన్ని స్మరించుకొంటూ వ్రాసిన కవితలు.
ధూప ఛ్చాయ: నక్సలైట్లు రైలుపెట్టిని కాల్చివేస్తే దాన్ని నేపధ్యంగా తీసుకొని వ్రాసిన దీర్ఘకావ్యం.
జీవన లిపి : 120 పేజీల సంపూర్ణ కావ్యం. మానవుడు విప్లవానికై జరిపేకృషి అనే అంశంపై వ్రాసిన దీర్ఘకావ్యం.
సీకింగ్ మై బ్రోకెన్ వింగ్ :దేశంలో అతివాద పార్టీలన్ని (left wing) విడిపోతున్నాయి. దాన్ని సింబలైజ్ చేస్తూ వ్రాసిన అన్వేషాత్మకమైన దీర్ఘ కవిత.
సోమసుందర్ కధలు : 1984 లో ప్రచురింపబడిన శ్రీ సోమసుందర్ గారి బానిసల దేశం వగైరా కధలు.
బుద్దదేవ్ బోస్: శ్రీ బుద్దదేవ్ బోస్ అనే ఆయన ప్రముఖ బెంగాలీ కవి. వీరి మోనోగ్రాఫ్ మరియు కొన్ని కవితల యొక్క అనువాదాలతో కూడిన రచన.
లియోనార్డో డావిన్సీ: డావిన్సీజీవిత చరిత్ర. ఆయనను ఒక సంపూర్ణ మానవునిగా దర్శింపచేసే పుస్తకం.
హంసధ్వని: భారతీయ ఆధునిక సంగీతకారుల జీవితచిత్రణలు. (బిస్మిల్ల, బడేముల్లా తదితరులు).
కాజీ నజ్రుల్ ఇస్లాం: శ్రీ ఖాజీ, బెంగాలీ విప్లవకవి. వీరి కవిత్వాన్ని, జీవితాన్ని ఈ పుస్తకంద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.
కాళిదాసు రామకధ: రచనా కాలం 1990 లు. రఘువంశంలో కాళిదాసు చెప్పిన రామకధకు, వాల్మీకి రామకధకు గల సునిశితమైన వ్యత్యాసాలను తెలుపుతూ వ్రాసిన విశ్లేషాత్మక పుస్తకం.
రుధిరజ్యోతిర్ధర్శనం: శ్రీరంగం నారాయణ బాబు కవిత్వం లోతు పాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చూపించిన గొప్ప విమర్శనాత్మక గ్రంధం.
జాతికి జ్ఞాన నేత్రం: శ్రీకొడవటిగంటి కుటుంబరావు రచనలపై చేసిన విశ్లేషణాత్మకమైన గ్రంధం.
కవిత్వం కాలాతీత కాంతిరేఖ: ఆధునిక కవిత్వానికి ఉండవలసిన లక్షణాలపై సూత్రీకరణ చేస్తూ వ్రాసిన విశ్లేషణాత్మకమైన 200 పేజీల గ్రంధం.
ఆధునిక కావ్య ప్రకాళిక: ఇతరుల పుస్తకాలకు వ్రాసిన పీఠికలలో కొన్నింటిని ఏర్చి కూర్చి చేసిన సంకలనం.
అమృత వర్షిణి: తిలక్ కవిత్వంపై వ్రాసిన విమర్శనాత్మక వ్యాసావళి.
సాహిత్యంలో సంశయ కల్లోలం: విరసం ఆవిర్భవించిన కొత్తలో విజయనగరం నుంచి చిత్తూరుదాకా ప్రయాణించి సభలు జరిపి, ఆ సభల్లో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు ఇచ్చిన సమాధానాల సంకలనం. ఆ ఆ ప్రదేశాలలో వారి సందేహాలను చిన్న చిన్న స్లిప్పులపై తీసుకొని, వాటికి సమాధానాలను పత్రికా ముఖంగా ఇచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించి ఈ పుస్తకంగా ప్రచురించారు.
అక్షర సుమార్చన: తిక్కన, వేమన ఇత్యాదులపై వ్రాసిన వ్యాసావళి. శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్య గారికి అంకితమీయబడినది.
పురిపండా ఎత్తిన పులి పంజా: పురిపండా అప్పలస్వామి వారిపై వ్రాసిన వ్యాస సంపుటి.
నూరు శరత్తులు : 1990 లకి నూరేళ్ళు నిండిన (కృ.శా., విశ్వనాధ మొ.)వారిపై వ్రాసిన వ్రాసావళి.
ఆ తరం కవితా తరంగాలు: భావకవుల తరువాత వచ్చిన పఠాభి, పాలగుమ్మి పద్మరాజు, వంటి వారిపై వ్రాసిన వ్యాసావళి.
నారాయణ చక్రం: డా: సి. నారాయణ రెడ్డి కవిత్వంపై విశ్లేణాత్మకంగా వ్రాసిన గ్రంధం.
గోపుర దీపాలు : చలం పురూరవ పై వ్రాసిన పుస్తకం.
కృష్ణశాస్త్రి కవితాత్మ: కృష్ణశాస్త్రి కవిత్వంపై సమగ్ర విమర్శ.
గురజాడ గురుత్వాకర్షణ: గురజాడ పై వ్రాసిన పుస్తకం. పూర్రిచర్డ్ అనే మాటపై పరిశోధన ఉంటుంది.
శరచ్చంద్రిక : శ్రీ శ్రీ నుంచి కుందుర్తి వరకూ ఆధునిక కవులపై వ్రాసిన పరిశీలనాత్మక వ్యాసావళి.
ఉర్దూసాహిత్యంలో ఉన్నత శిఖరాలు: కబీర్ నుంచి ఖైఫీ అహ్మద్ దాకా ఉండిన గొప్ప గొప్ప కవులను గురించి పరిచయంచేస్తూ వ్రాసిన పుస్తకం.
శేషేంద్ర జాలం: శేషేంద్ర కవిత్వంపై వ్రాసిన వ్యాసావళి.
అగ్నివీణ ఆలాపించిన అణుసంగీతం: అనిసెట్టి సుబ్బారావు కవిత్వం పై వ్రాసిన విశ్లేషణాత్మక పుస్తకం.
కవితా కల్పవల్లి: ఆధునిక కవిత్వం-విమర్శనాత్మక విశ్లేషణ.
ఆగామి శతాబ్ధానికి ఆహ్వానం: వ్యాసాలు.
చరమ దశాబ్ది-కవితా రసాబ్ధి: 90 లలో కవిత్వంపై వచ్చిన వ్యాసావళి.
అక్షర నాదం: 2004 కవితా సంపుటి.
ఆమ్రపర్ణి: కావ్యం
జీవన లిపి: సంపూర్ణ కావ్యం
చిన్మయ లహరి: స్వీయ కవితా సంపుటి.
మనస్సంగీతం: పాటల సంపుటి.
విషవలయం: నాటకం. 1980 లలో అనేక పరిషత్తులలో బహుమతులు సాధించిన గొప్ప నాటకం
లేఖలుసినీనటుడు రమణారెడ్డికి శ్రీ సోమసుందర్ గారు వ్రాసిన లేఖలను నెల్లూరులోని వీరి అభిమానులు పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు.
నగరం నుంచి గగనం దాకా మనిషి: వివిధ పత్రికలలో చుట్టు-చూపు అనే పేరుతో వచ్చిన వ్యాసాలన్నింటిని సంగ్రహపరచి ప్రచురించిన పుస్తకం. సుమారు 250 పేజీలు.
మంది-మనిషి: వ్యాస సంపుటి .

శ్రీ సోమసుందర్ గారి వద్ద ప్రస్తుతం ఇంకా 10 పుస్తకాలవరకూ అముద్రితంగా ఉన్నాయి. త్వరలో వెలువరించాలన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

(91 వ పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగు సాహితీ మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో --- పాత పోస్టే మరో సారి)
బొల్లోజు బాబా

1 comment:

  1. ఏయేటికాయేడు తననుతాను అప్ డేట్ చేసుకున్నాడు కనుకనే
    ఎప్పటికీ ఆయన రచనలు నూతనంగా ఉన్నాయి .....
    అంతటి మహానుభావుడి గురింఛి చాలా బాగా వ్రాసిన మీరు మాత్రం తక్కువ వారా?

    ReplyDelete