కొప్పర్తి “విషాద మోహనం” – పదచిత్రాలు, ప్రతీకలు, శిల్పం
గుప్పెట్లోని వజ్రం వేళ్ళ సందుల్లోంచి కాంతి
పుంజాల్నిప్రసరింపచేసినట్లుగా కొప్పర్తి “విషాద మోహనాన్ని” తెరిస్తే ఆర్ద్రతా
కవిత్వపుటత్తరులు హృదయాన్ని కమ్ముకొంటాయి.
భిన్న భావాల సంఘర్షణ వల్ల నూతన పోకడలు పురుడుపోసుకొన్న 90 వ దశకం, తెలుగు కవిత్వానికి
సంబంధించి అత్యంత సంక్లిష్టమైన కాలం. మహోదృతంగా ఎగిసిన విభిన్నవాదాల గదులలో కవులు
తమను తాము బంధించుకొని కవితల్లుకొన్న కాలమది. అలాంటి నేపథ్యంలో కొప్పర్తి
మానవత్వపు మైదానాలపై స్వేచ్ఛగా విహరిస్తూ స్వీయానుభవాలని విశ్వానుభవ గీతాలుగా
మార్చి పలికించిన సంగీతమే ఈ “విషాద మోహనం”. ఇందులో మొత్తం 41కవితలున్నాయి. వేటి కవి వస్తురీత్యా
వైవిద్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కవితలలోని ప్రతీకలు నవ్యంగా, శిల్పం అద్బుతంగా, పదచిత్రాలు సౌందర్యంతో నిండి
ఉంటాయి.
“వస్తువు గురించిన నిబద్దతా భావం ఎపుడు
వెనుకబడుతుందో అపుడు రూపం, అనుభూతి, శిల్పం మొదలైన విషయాలు
ముందుకు వస్తై” అన్న అజంతా మాటలు కొప్పర్తి
కవిత్వానికి చక్కగా సరిపోతాయి. ఎందుకంటే ఈ కవి సిద్దాంతాలను తలకెత్తుకోక
జీవితంలోంచి కవిత్వానుభవాలను ఏరుకొన్నాడు. తన అనుభూతిని చక్కని
ప్రతీకలు, పదచిత్రాలతో రసాత్మకంగా
చెప్పటం వల్ల శిల్పం పాఠకుని మదిలో సమగ్రంగా ఆవిష్కరింపబడింది.
పదచిత్రాలు
ఒక ఆలోచననో, ఆవేశాన్నో, దృశ్యాన్నో, అనుభూతినో లేక అన్నింటినో క్లుప్తతతో, గాఢతతో, వైచిత్రితో చేసే వర్ణననే
పద/భావచిత్రమని అంటారు. వైయక్తికమైన అనుభూతిని
కళాత్మకంగా, ప్రయోజనవంతంగా వ్యక్తీకరించటా నికి
పదచిత్రాలు అత్యున్నతమైన సాధనాలు. ఈ సంకలనంలో అనేక పదచిత్రాలు
ఆయా కవితావస్తువులను ప్రకాశవంతం చేస్తూంటాయి.
ఆత్మీయులను రైలెక్కించి వీడ్కోలు పలకడంలోని
విషాదం దానిని అనుభవించేవారికే తెలుస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఇలాంటి సందర్భం ఒక
అనివార్యత. అలాంటి సందర్భాలలో గుండెల్లో
ఉప్పొంగే ఆర్థ్రత ఉన్నప్పటికీ బయట మాత్రం వాతావరణం (పరిస్థితులు) పొడిపొడిగా
ఉంటుందన్న వాస్తవాన్ని ఓ కవితలో కొప్పర్తి ఇలా పట్టుకొంటాడు.....
రైళ్ళు లేని ఎదురెదురు
ప్లాట్ ఫార్మ్ లు
నీళ్ళు లేని కాలువ గట్లవుతాయి
ఇద్దరమూ ఎండిన చెట్లల్లె
నిలబడతాం
వాతావరణం వేడిగా ఉండటాన్ని
గమనించిన నువ్వు
ఒక చిన్ననాటి జ్ఞాపకాన్ని
గొడుగులా విప్పుతావు. (ఎంతెంత దూరం)
1996 లో కోనసీమలో వచ్చిన తుఫాను వల్ల కొబ్బరితోటలు
సర్వనాశనం అయ్యాయి. ఆ సంఘటనను వర్ణిస్తూ వ్రాసిన
“వీర గాధ” అనే కవితలో
సముద్రంతో యుద్దం చేయటానికే
కోనసీమ
కొబ్బరిచెట్ల సైన్యాన్ని
పెంచింది.
సైన్యం
చీకటి నదిని దాటుతూ ఉండగా
ముట్టడి జరిగింది.
తెల్లారేటప్పటికి
వీరులు నేలకొరిగారు. (వీరగాధ)
కనుచూపు మేర క్రమపద్దతిలో వరుసలలో కనిపించే
కొబ్బరి చెట్లు కవాతు చేసే సైనికులుగా కనిపించటం ఒక నూతన ఊహ. సముద్రానికి చేరువలో ఉండే
చవుడు భూములలో కూడా కొబ్బరిమొక్కలు పెరగడం ఒక రకంగా సముద్రంతో యుద్ధం చేయటం
వంటిదే! అలాంటి కోనసీమ రాత్రికి
రాత్రి సూపర్ సైక్లోన్ కారణంగా నేలకొరగటం, పై పదచిత్రంలో సూటిగా స్ఫష్టంగా ఒదిగిపోయింది.
కవికూడా మామూలు మనిషే. అందరిలాగే అనేకానేక సంసారిక, దైనందిక సమస్యలను నిత్యం
దాటుకొంటూ సాగవలసిందే. ఈ క్రమంలో ఒక్కోసారి అతని
ప్రాధాన్యతలలో కవిత్వం వెనక్కు నెట్టబడుతూంటుంది. కొంతకాలం గడిచాకా కవిత్వం
మరలా అతన్ని తనలోకి ఆహ్వానిస్తుంది. అలాంటి ఓ పునరాగమన
సందర్భాన్ని కొప్పర్తి అద్భుతమైన పదచిత్రాలలో బంధించాడు.
మళ్ళీ ఇన్నాళ్ళకు కవిత్వం
రాయడం
సుదీర్ఘంగా సాగిన చీకటి
రాత్రి ప్రయాణంలో
ఒక్కోక్క నక్షత్రాన్ని
తెంపుకొంటూ వచ్చి
ఒక్కసారిగా
ఒక వేకువను
సృష్టించుకున్నట్లుగా ఉంది //
ఇపుడు
ఎక్కడికో ఎగిరిపోయిన పక్షి
రెక్కలల్లార్చుకొంటూ తిరిగొచ్చి
నాభుజం మీద వాలినట్లుంది.
నన్ను మళ్ళా శస్త్రధారుణ్ణి
చేసినట్లుంది. (పునరాగమనం)
ఈ కవితలో కవిత్వం లేని కాలాన్ని చీకటి రాత్రితో
పోల్చటం, కవి శస్త్రధారుడు అని అనటం
ద్వారా కవిత్వానికి కొప్పర్తి ఇచ్చిన స్థానాన్ని అర్థం చేసుకొనవచ్చును.
భార్యా భర్తలిరువురూ ఉద్యోగస్తులయినపుడు వారి
పిల్లల మనస్థితికి “తెరచియుండు వేళలు” అనే కవిత అద్దం పడుతుంది. ఇందులో .....
తొమ్మిదింటికి తలుపు వేయబోయే
ముందు
నాన్న ఫాను ఆపేస్తాడు
తాళాలు వేసి ముగ్గురమూ గేటు
బయటకు చేరేసరికి
ఇంట్లో ఫాను పూర్తిగా
ఆగిపోయి
సింబాలిక్ గా మూడుదారులుగా
చీలిపోతుంది
ఒకటి అమ్మను ఆఫీసుకు
రెండోది నాన్నను బ్యాంకుకు
మూడోది నన్ను స్కూలుకు
లాక్కెళ్ళి పోతాయి. (తెరచియుండు వేళలు)
ఇక్కడ ఫానురెక్కలు మూడుదారులుగా చీలిపోవటం అనే
పదచిత్రం అత్యంత శక్తివంతంగా సందర్భాన్ని కళ్లకు కడుతుంది. పిల్లగాని స్వరంలో చెప్పిన ఈ
కవితలో - సాయింత్రం వరకూ నాకు
ఇల్లుండదు. అవునులే ఎపుడు పడితే అప్పుడుండటానికి ఇల్లు లాడ్జికాదు కదా, ఇంటికి కూడా “తెరచియుండు వేళలు” నిర్ణయమైపోయాయి కదా - అనిపించటంలోని వ్యంజన, ఉమ్మడికుటుంబాలను
చేజార్చుకొంటూన్న మన సమాజానికి చెంపపెట్టు వంటిది.
కాంక్షాతీరాల అన్వేషణలో దూరదేశాలకేగి, అమ్మానాన్నలను చుట్టపుచూపుగా
చూడటానికని, పుట్టిన ఇంటికి ఎవరో
పంపినట్లు వచ్చే వ్యక్తుల గురించి వ్రాసిన “ఆపేక్ష సిద్దాంతం” అనే కవిత కరుణరసార్థ్రంగా
సాగి గుండెల్ని పిండుతుంది.
పిచ్చినాన్న
ఇంతజీవితమూ చూసినా
సముద్రంలో కలిసిన నదీ జలం
తిరిగిరాదని తెలీక
ఎండిపోయిన నదిలా
ఎదురుచూస్తున్నాడు//
ఇంట్లో అన్ని నదుల్నీ, ఉపనదుల్నీ మింగేసి
సముద్రమై హోరెత్తుతున్నావు
నువ్విప్పుడిక వాళ్ల దాహం
తీర్చలేవు. //
నువ్వు నగరం ముక్కవి.
వొఠి పరాయివి. (ఆపేక్ష సిద్దాంతం)
ఈ కవితావస్తువు చాలా సున్నితమైనది. ఎందుకంటే ఆధునిక కాల
పరిస్థితులను బట్టి ఉద్యోగం కోసం పుట్టిన ఊరినీ, బంధుజనాలనీ వదిలిపెట్టటం తప్పని సరి
అయిపోయింది. ఈ ప్రక్రియలో తమ ఎదుగుదలకు కారణమైన మూలాలను విస్మరించి విర్రవీగటం
లోని అమానవీయతను కొప్పర్తి ఈ కవితలో చాలా సమర్ధవంతంగా అక్షరీకరించాడు.
ఎందుకు బ్రతకాలి అని ప్రశ్నించుకొనే కంటే ఎలా
బ్రతకాలి అని ప్రశ్నించుకోవాలని అంటారు. ఎందుకంటే “ఎందుకు” అనే ప్రశ్నను ఎక్కువ దూరం
తీసుకెళ్ళలేం కనుక. కానీ ఈ కవి నేత్రం, బ్రతుకులోని సౌందర్యాన్ని “ప్రాణం ఒక ప్రశ్న” అనే కవితలో దర్శించిన తీరు
విస్మయపరుస్తుంది. ఇందులో ఒక చోట....
బతకటం ఒక విలాసం, ఒక హొయలు
ఒక లాలస, ఒక సాహసం
బ్రతకటం ఒకానొక విషాద మోహనం .............. అని
ప్రకటిస్తాడు.
చావు బతుకుల మధ్య
కొట్లాడుతున్న మనిషిని
మరొక్క క్షణమైనా
బ్రతికించాలి
ఆ ఒక్క క్షణం బ్రతుకు కోసం
మానవాళి సమస్తం సర్వశక్తులూ
ధారపోయాలి
ఒక్క క్షణం అదనంగా బ్రతికి
చేసేదేమిటి అన్న ప్రశ్నకు
ఒక్క క్షణం అదనంగా
ప్రపంచాన్ని
బ్రతికించటమేనన్నది సమాధానం. (ప్రాణం ఒక ప్రశ్న)
జీవితం పట్ల, జీవన సౌందర్యం పట్ల, ప్రాణం విలువ పట్ల కవికి
ఉన్న విశ్వాసం, నమ్రతలు ఈ కవితలో నయాగరా
జలపాతాలై ఉరకటం గమనించవచ్చు. కవిత ముగిసినా ఆ హోరు హృదయంలో ప్రతిధ్వనించక
మానదు చాలాసేపటి వరకూ.
అన్ని పరీక్షలలో కెల్లా తెలుగు పరీక్షంటే
విద్యార్ధులకు ఒక ఆటవిడుపు. ఇదే విషయాన్ని చక్కని పదచిత్రం ద్వారా
కొప్పర్తి ఇలా అంటాడు.
అన్ని పరీక్షలు బెంచీ మీదే
కూచుని రాసినా
ఒక్క తెలుగు పరీక్షరోజున
మాత్రం
అమ్మవొడిలో
కూచున్నట్లనిపిస్తుంది. (పరీ క్షా సమయం)
ఈ సంకలనంలోని అనేక కవితలలో ఆవిష్కరింపబడిన
పదచిత్రాల సౌందర్యం కొప్పర్తిని మంచి “పదచిత్ర కవి” అని నిరూపిస్తాయి.
ప్రతీకలు
“అనిర్వచనీయమైన
భావవ్యక్తీకరణమే కవిత్వమైతే పదాలు వాటి సామాన్యార్ధాల నుంచి విముక్తం కావాలి” – మాకినీడి సూర్యభాస్కర్. ఒక వస్తువును చెప్పి మరొక
వస్తువును అనుభూతికి తేవటం ప్రతీక లక్షణం. అనుభూతి ప్రధానమైన
కవిత్వానికి ప్రతీకలు ప్రధాన సాధనాలు. కొప్పర్తి కవిత్వంలో అనేక ప్రతీకలు
నర్మగర్భంగా భావాన్ని అనుభూతికి రప్పిస్తూంటాయి.
ఈ సంకలనంలో “నది ప్రవహించే దారిలో......” అనే కవిత ఆసాంతం
ప్రతీకాత్మకంగానే ఉంటుంది.
మనం లేనప్పుడు నది
ప్రవహించింది
మనం ఉండనప్పుడూ నది
ప్రవహిస్తుంది
మనం ఉండీకూడా లేనప్పుడు నది
మనలోకి ప్రవహిస్తుంది
మనం లేకుండా కూడా
ఉండగలిగినప్పుడు మనమే ప్రవహిస్తాం
ఒక పాటలా ప్రవహిస్తాం
ఒక టైగ్రిస్ లా నైలులా
సింధులా
యుగ సంధ్యల్ని తాకుతూ
ప్రవహిస్తాం. (నది ప్రవహించే దారిలో...)
పై కవితలో మనం అనేది మానవునికి ప్రతీక. మానవప్రయాణాన్ని
నదితో పోల్చటం జరిగింది. ఈ రెంటినీ నేరుగా కాక
ప్రతీకలుగా తీసుకోవటం వల్ల ఈ కవిత గొప్ప తాత్వికతతో నిండింది. మనిషి తన ఒంటరి అస్తిత్వన్నుండి, "మానవజాతి" అనే సమస్త అస్తిత్వంలోకి ఎలా వ్యాపించాలో
అద్భుతంగా ఆవిష్కరించబడిందీ కవితలో. కవిత్వంలో ప్రతీక
గొప్పతనాన్ని వివరించటానికి ఈ కవిత ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
ఈ కవి వృత్తిరీత్యా చరిత్ర అధ్యాపకుడు కావటంచే
వివిధ కవితలలో అనేక చారిత్రకాంశాలు ప్రతీకలుగా పొదగబడ్డాయి. “కవి తాత్వికుడే కాదు
చరిత్రకారుడు కూడా కావల్సిందే” అని ఊరూ వాడా అనే కవితలో అనటం ద్వారా కవికి
చరిత్రపట్ల అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తాడు. చరిత్రగమనంలో ఎదురయిన
మైలురాళ్ళని, ఎగుడుదిగుళ్ళని, సామాన్యుని అస్థిత్వాన్ని
అద్బుతమైన ప్రతీకలతో అక్షరబద్దం చేసిన మరో తెలుగు కవి లేడనటం అతిశయోక్తి కాదు. ఈ సంపుటిలోని “చిత్రలిపి” కవిత భారతదేశ చరిత్రకు ఒక
మొజాయిక్ పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఒక మహా అరణ్యాన్ని నలభై
పంక్తులలో మొలిపించటం ధ్వని వల్లే సాధ్యపడింది.
భూమి పుత్రుడి మీద నుంచి
మూడు పాదాలు బలంగా
నడిచివెళ్లిన చిహ్నాలు కనిపిస్తాయి ... అనటంలో ఆర్య అనార్య సిద్ధాంతాన్ని, వేదాలు శ్రామికుని విస్మరించటాన్ని
సూచిస్తున్నాడీ కవి.
ఒక్కడు మాత్రం
ప్రశ్నించి కోపించి దుఃఖించి
శాసించి
పద్యాలల్లుకుంటూ దిశమొలతో
సాగిపోతాడు .... సాహిత్యం ద్వారా
సంఘాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన వారిలో వేమనను మించిన వారుండరు. దురాచారాల్ని,మూఢనమ్మకాల్ని పురాణాల
వైరుధ్యాల్ని, వేదాంతపు డొల్లతనాన్ని, మానవ బలహీనతల్ని వేమన తన
పద్యాలతో ఖండించి, ప్రశ్నించి సాగిపోయిన వైనం
తెలుస్తుందీ పంక్తులలో.
ఓడలు సముద్రాలమీద రహదార్లను
గీస్తాయి
చిరుజల్లు తుఫానౌతుంది
రైతులు పాలికాపులై, పాలెకాపులు కూలీలౌతారు
కానీ ఓడలు మాత్రం బండ్లు
కావు .... ఈ పాదాలలో బ్రిటిష్
వారు ఓడలపై చిరుజల్లుగా వచ్చి తుఫానై కబళించటం ధ్వనిస్తున్నాడు కవి. తరువాత పాదంలో ఉత్పత్తి
రంగానికి సంబంధించి జరిగిన పునర్వవస్థీకరణ చెప్పబడింది. ఓడలు బండ్లు కాలేదనటం లో
ధనవంతులు ఇంకా ధనవంతులయ్యారన్న చారిత్రిక సత్యం ఉంది.
ఆస్తి పంపకాలు జరుగుతాయి
తెలుపుకూ నలుపుకూ
తేడాలేకుండా పోతుంది
పాతబస్తీలు చుండూరులు
ఫలితాన్ననుభవిస్తాయి
దేశవిభజనానంతరం స్వపరిపాలన వచ్చినా
సామాన్యుని జీవితంలో వచ్చిన మార్పేమీ లేదని కవి ప్రకటన. అదే దోపిడీ, అదే దాష్టీకం, అదే దౌర్జన్యం ల ఫలితంగా
పాతబస్తీలు, చుండూరులు వంటి సంఘటనలు
జరుగుతున్నాయన్న తన ఆవేదనను ప్రతీకలతో చెపుతున్నాడు కవి.
ప్రతీకాత్మకంగా కొప్పర్తి వ్రాసిన మరో కవిత “సింధు నది” ఇందులో సింధుదేశంలో
ప్రవహించిన అయిదునదుల గురించి వర్ణిస్తూ ఒక్కోనదినీ ఒక్కో వర్ణానికి ప్రతీకగా
తీసుకోవటం అబ్బురపరుస్తుంది.
వాటిలో ఒకటి సూర్యుడికి
అర్ఘ్యమైంది
ఒకటి నెత్తురై ప్రవహించింది
ఒకదాని మీద సరుకుల ఓడలు
లంగరెత్తాయి
ఒకటి చెమట కాల్వగా బీడుల్ని
మాగాణుల్ని చేసింది.
ఇంకిపోయిన ఐదోదిప్పుడు
ఊటలు ఊటలుగా ఉబికి యేరై
పరవళ్ళు తొక్కుతోంది
ఇప్పుడా ఐదూ సంగమించి
ఒక మహా ప్రవాహం కావాలి. (సింధు నది)
పై పంక్తులలో నాలుగు నదులు చతుర్వర్ణాలకు
ప్రతీకలై నిలువగా, తొంభైలలో దళితచైతన్యం
ఉత్తుంగ తరంగంలా వెల్లి విరిసిన సందర్భాన్ని – అయిదోనది పరవళ్ళు తొక్కుతోందంటూ వర్ణించాడీ
కవి. అంతే కాక ఆ అయిదు నదులూ
సంగమించి ఒక మహా ప్రవాహం కావాలనటం ద్వారా సరిహద్దులు చెరిపేసి “మనిషితనం” భూమికగా ఉండే మరో
ప్రపంచాన్ని స్వప్నిస్తున్నాడు.
ప్రతీకల వినియోగం ఒక్కోసారి కత్తిమీద సాము
వంటిది. కవి తన మనసులో భావనలకు తనవైన
ప్రతీకలు వేసుకొంటూ పోతే, ఆ కవిత అతనికి అర్ధమౌతుంది
కానీ పాఠకునికి అర్థంకాదు. కానీ ఈ సంకలనంలోని వివిధ కవితలలో
కనిపించే అనేక ప్రతీకలు, ఆయా వాక్యాల వెనుక ఉండే
అర్ధాలను ముందుకు తీసుకొచ్చి కవి ఆలోచనల్ని పాఠకుని హృదయంలో దీపంలా వెలిగిస్తాయి.
శిల్పం
సంవిధానం, స్వరం, దృక్కోణం, నేపథ్యం, తర్కం, క్లుప్తత, నవ్యత వంటివి కవిత్వ శిల్పాన్ని నిర్ణయిస్తాయి.
వీటిని ఉన్నత స్థాయిలో కలిగి ఉన్న కవిత్వం అనర్ఘ శిల్పాన్ని కలిగి ఉన్నట్లే. ఈ
సంకలనంలోని కవితలలో చక్కని సంవిధానం, కరుణ నిండిన స్వరం, మానవీయ దృక్కోణం, చకితుల్ని చేసే తర్కం, భావాంతం పదాంతం ఒకే చోట
కలుసుకొనేంత క్లుప్తతా పుష్కలంగా ఉండటంచే ప్రతీ కవితా చదువరికి కవిత్వ హాయిని
కలిగిస్తుంది. అనుభూతి ఐక్యత కలిగించటం
ద్వారా వాని హృదయంలో అనుకంప రగిలిస్తుంది.
వేగంగా వెళ్ళే రైలు ఢీ కొట్టటం వల్ల మరణించిన ఓ
శ్రామిక స్త్రీ శవం రైలు ఇంజను ముఖభాగంలో వేలాడుతూ దాదాపు ఇరవై కిలోమీటర్లు
ప్రయాణించిన సంఘటనపై వ్రాసిన “అంతిమ యాత్ర” అనే కవితలో
హఠాత్తుగా నిలపగల శాస్త్రం
ఇంకా పట్టుబడనప్పుడు
రైలును వేగంగా నడిపే హక్కు
ఎవరిచ్చారని ప్రశ్నిస్తే
ఎవరు జవాబిస్తారు?...... (అంతిమ యాత్ర) అని ప్రశ్నిస్తాడు
కొప్పర్తి. ఈ వాక్యాలలోని తర్కం మొత్తం
కవితకు వెన్నెముక వంటిది. విడిగా ఈ ప్రశ్న అర్ధరహితంగా
అనిపించవచ్చు. కానీ కవితా నేపథ్యంలోంచి
చూస్తే కవి అంతరంగం అర్ధమౌతుంది. ఇదే ప్రశ్న ఇటీవల జపాన్ లో జరిగిన అణు
రియాక్టర్ల ప్రమాదానికి కూడా అన్వయార్హమే.
మనస్పర్ధల వల్ల తల్లిదండ్రులు విడిపోయాకా వారి
సంతతి ఎదుర్కొనే ఆలోచనల సంఘర్షణని “సహజ హక్కు” అనే కవిత అత్యద్బుతంగా మనముందుంచుతుంది.
అమ్మకు ఆత్మాభిమానం/నాన్నకు అహంకారం – అన్న ఎత్తుగడలోనే కవిత
దిశానిర్ధేశనం జరిగిపోయినా, “నాకు నాన్న కూడా కావాలనే సహజ
హక్కును/ ప్రకటిస్తున్నాను/ నాకు నాన్ననిచ్చే బాధ్యత నాన్నదే నంటున్నాను/ నాన్న
తనను తాను నాకిచ్చుకోవటంలో/ తనపాత్ర ఏమిటో తేల్చమని అమ్మను నిలదీస్తున్నాను” అనటం ద్వారా కుటుంబాన్ని
ఏర్పరచటంలో భార్యా భర్తల సమిష్టి బాధ్యతను స్పష్టపరుస్తున్నాడు కవి. “ఇద్దరూ తూర్పు పడమరలల్లె
నిలబడి/ ఎగరేసుకొనే సూర్యబంతి నవ్వాలినేను/
నవ్వాలి నేను – అనే ముగింపు వాక్యాలు కవితను
పరిపుష్టం చేస్తాయి. ఎత్తుగడ, నడక, ముగింపులు ఉత్తమంగా ఉండటం
వల్ల శిల్పం చక్కగా అమరింది.
She repeats her self అనే కవితలో వస్తువుకు సరిపడే
విధంగా సైక్లిక్ గతిలో కవితను నడిపించటం కవికి శిల్పంపై ఉన్న శ్రద్ధ ను పట్టి
చూపుతుంది.
తొంభైయవ దశకంలో నక్సలైట్లకూ పోలీసులకూ జరిగిన
పోరాటంలో ఇరుపక్షాలకూ చెందిన అనేకమంది అసువులు బాసారు. ఆనాటి తెలుగు కవిత్వం కూడా
సాయుధమై తుపాకులు, మందుపాతరలూ అవసరానికి మించే
పేల్చింది.
ఈ నేపథ్యంలోంచి కొప్పర్తి వ్రాసిన “అసలు నక్క” అనే కవిత మందుపాతరవల్ల మరణించిన ఒక
పోలీసు పక్షాన నిలబడి, ఒక విలక్షణమైన దృక్కోణాన్ని
ఆవిష్కరించి శిల్ప విశిష్టతను సంతరించుకొంది. ఇందులో
పేలింది పాతరైతే
ప్రతిధ్వని వెక్కిళ్ళై
వినిపిస్తుందనుకోలేదు ......... అంటూ ఆ పోలీసు
భార్య రోదనను రికార్డు చేస్తుంది.
ఎగజిమ్మిన మట్టి
ఉయ్యాలలో ఊగుతున్న
పదిహేడురోజుల
పసితనం కళ్ళల్లో పడింది చూడు
......... అంటూ నెలకూడ నిండని
మృతునిబిడ్డ కళ్ళల్లో పడ్డ విధ్వంశ శకలాలను చూపుతుంది.
సరిగ్గా చూడు
మెచ్చి నక్కతోలు కప్పేసరికి
పిల్లి నిజంగా తాను
నక్కేననుకొని యుద్ధానికి వచ్చింది
పిల్లికీ పిల్లికీ
పోరుపెట్టి అసలు నక్క వినోదం చూస్తోంది. ........... అంటూ సామాజిక
రాజకీయ వాస్తవాన్ని మనముందుంచి, “పోరాటం రాజ్యంతో అయితే, యుద్ధం / పోలీసులతోనా?” అని సూటిగా స్పష్టంగా
ప్రశ్నిస్తుంది. అసలు నక్కను పట్టి
చూపుతుంది. ఈ కవిత ద్వారా ఈ కవి సామాజిక
బాధ్యత మానవీయమైనదని తెలుస్తుంది.
అధిక శాతం కవులు ఒక భావ ప్రవాహంలో చిక్కడి, కొట్టుకుపోతున్నప్పుడు, దానికి ఎదురీది నిలబడి
వారిని భావసమీక్ష చేసుకొమ్మని చెప్పగలిగే కవులు సాహిత్యానికి సమాజానికీ చాలా చాలా
అవసరం. ఇలాంటి సందర్భం “ఒక నోస్టాల్జియా గురించి” అనే కవితలో కనిపిస్తుంది. దళిత కవిత్వం ప్రారంభ దశలో
కొప్పర్తి....
వాడే
మొన్న రాజ్యాంగం రాసాడు
నిన్న పద్యాలల్లాడు
ఇవ్వాళ వచన కవిత్వం
రాస్తున్నాడు
ఊరువాడా ఏకమయ్యే వర్షమై
కురుస్తున్నాడు ... (ఊరూ వాడ – 1993) అంటూ ఆహ్వానించి
మమేకమయ్యాడు. కానీ దళితకవిత్వ పరిణామ
క్రమంలో ఒకానొక దశలో తిట్లూ, పురాణ ప్రతీకల విధ్వంశం, బూతులు లంకించుకోవటం
చోటుచేసుకొన్నాయి. ఇటువంటివి అవాంఛనీయమన్న
స్పృహతో అలాంటి ధోరణుల్ని ఖండిస్తూ రాసిన ఒక కవితలో...
అవును
నువ్వెన్ని చెప్పినా
సాతాను దేవుడు కానట్లే
బూతు కవిత్వం కాదు
కవిత్వ వనంలో బూతెప్పుడూ
నిషిద్ధ ఫలమే//
భాషమీద అలగడం అంటే
తరాల కిందట మనిషి
శబ్దాన్ని మాటగా మార్చటానికి
చేసిన
యుగాల పెనుగులాటను
అవమానించటమే. .... (ఒక నాస్టాల్జియా
గురించి – 1995)
వెల్లువలో కొట్టుకుపోకుండా స్వంత స్వరాన్ని, నిబద్దతను క్షీరనీర న్యాయంతో
ప్రదర్శించగలగటం లోతైన అవగాహనా, ఎత్తైన ఆలోచనలు ఉన్న కవికే సాధ్యపడుతుంది.
కొప్పర్తి కవిత్వంలో కనిపించే మరో విశిష్టమైన
అంశం కధనాత్మక శైలి. ఈ సంపుటిలో ద్విపాత్రాభినయం, శిక్షాస్మృతులు, ఆపేక్షసిద్ధాంతం, ఎంతెంతదూరం, అంతిమయాత్ర, సహజహక్కు, పవర్ కట్ వంటి కవితలు కధన
పద్దతిలో (Narrative
Poetry) సాగుతాయి.
కవితాత్మకంగా చెప్పిన కధ పాఠకులను సరసరా లోనికి లాక్కొంటుంది. చదువరికి మంచి
పఠనానుభవాన్నిస్తుంది. ఆధునిక కవిత్వంలో కధన కవిత్వం శ్రీశ్రీ నుంచీ కనిపిస్తుంది.
దురదృష్టవశాత్తూ విమర్శకులు ఇలాంటి కవిత్వాన్ని చిన్నచూపు చూడటం శోచనీయం. కధనకవిత్వ పద్దతి తక్కువ
రకానికి చెందిందని ప్రముఖ విమర్శకులు తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం.
కవిత్వానికి పాఠకులు తగ్గి, కధకు పెరుగుతున్న ఈ తరుణంలో-
శుద్దకవిత్వం పేరిట అస్ఫష్టతను, అస్తిత్వవాద కవిత్వంపేరిట శుష్కవచనాన్ని
నెత్తికెత్తుకోవటం మాని కధనాత్మక కవిత్వాన్ని ప్రోత్సహించవలసిన అవసరం నేడు ఎంతైనా
ఉంది.
నిర్మాణంలో అంతర్లీనంగా కనిపించే తర్కం ఆ కవితను
దేదీప్యమానం చేస్తూంది. ఈ సంపుటిలో, నిరపేక్షం, యుద్ధమూ-శత్రువు, అణువిచ్ఛిన్నం, సహజ హక్కు వంటి కవితలలో
తర్కం పఠితను గుక్కతిప్పుకోనివ్వదు. మరీ ముఖ్యంగా నిరపేక్షం అనే
కవిత లో కనిపించే తర్కాధారిత నిర్మాణ కౌశలం విస్మయపరుస్తుంది.
మొదలూ లేదు చివరా లేదు
మొదలంటే రెండు చివరల మధ్య
నుండటమే
చివరంటే రెండు ఆరంభాల మధ్య
నిలవడమే ......... అంటూ మొదలయిన కవిత
మధ్యనుండటంలో
మధ్యన అన్నది నిజం కాదు ఉండటం ఒక్కటే నిజం
ఉండటం ఒక్కటే నిజమైనప్పుడు
లేకపోవడం కూడా నిజమే
అవుతుంది ........... అంటూ ముగుస్తుంది. కవిత ఎత్తుగడ చివరకు
వచ్చేసరికి దాదాపు యు టర్న్ తీసుకొంటుంది. ఇక మధ్య భాగం లో కనిపించే
పోలికలు, ప్రతీకలు అన్నీ విషయాన్ని
క్రమక్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కిస్తూ తారాస్థాయికి తీసుకెళ్ళి వదుల్తాయి. అద్భుతమైన శిల్పనైపుణ్యానికి
ఈ కవిత మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
కొప్పర్తి “విషాద మోహనం” చక్కని సాంద్రకవిత్వానికి చిరునామా గా
భావించవచ్చును. 2000 లో విడుదల చేసిన ఈ పుస్తకం
కొప్పర్తి రెండవ సంపుటి. మొదటి సంకలనం “పిట్ట పాడే పాట” 1991 లో విడుదలయ్యింది. రెండు
దశాబ్దాలుగా తెలుగు కవిత్వాన్ని పరిమళింపచేస్తున్న
కొప్పర్తి ఈ మధ్యే “తిలక్ పురస్కారాన్ని” అందుకొన్నారు. మూడవ సంపుటి త్వరలోనే
వెలువరిస్తారని ఆశిద్దాం.
(తిలక్ పురస్కారం అందుకొన్న
సందర్భంగా కొప్పర్తికి అభినందనలతో)
బొల్లోజు బాబా
మే, 2011
Nice
ReplyDeleteఈ సమీక్ష చదివినవారికి కవిత్వ పఠనమనే దాహం పుట్టుకొస్తుంది.
ReplyDeleteచాలా చాలా బాగా సమీక్షించారు.
ధన్యవాదములు.
బాబా గారూ,
ReplyDeleteకొప్పర్తిగారి విషాదమోహనం నిజంగా పఠితకి... రెండు అనుభూతులనీ మిగులుస్తుంది. నిజానికి "విషాదమోహనం" తెలుగుసాహిత్యంలో అద్భుతమైన ప్రతీకలు, తాత్త్విక చింతనా, పదచిత్రాలతో వచ్చిన ఒక గొప్ప కవితా సంకలనం. చిన్నారి జోళ్ళు రాత్రిలోపలపెట్టడం మరిచిపోయిన ఒక చిన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కరుణరసప్లావితమైన కవిత రాసారు ఆయన. ఎప్పటిలాగే మీ విశ్లేషణ నిక్కచ్చిగానూ, నిజాయితీగానూ ఉంది. ఈ పుస్తకానికి ఇంకా తగిన గుర్తింపు రాలేదేమో నని నేను భావిస్తున్నాను. మంచి రివ్యూ రాసినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు.
అభివాదములతో
where the book is available to purchase
ReplyDeletewhere the book is available to purchase
ReplyDeletethank you nasy garu, sunamu garu, vanaja gaaru for the comments
ReplyDeletekapila ram gaariki
i think this book is not available in the market. you may pl. contact sri. kopparthy garu in this id and ask for any reprints available.
kopparthyvrm@gmail.com
http://www.facebook.com/kopparthy.venkataramanamurthy?ref=ts&fref=ts
అన్నికవితలు గొప్పగా వున్నాయ్..పరిచయంలానే,...కొప్పర్తి గారికి అభినందనలు. మీకు ధన్యవాదాలండి,.
ReplyDeleteమీరు పాల పిట్టలో రాసిన సమీక్ష చదివినతర్వాత నేను ఈ పుస్తకం చదివాను .......... కవితలు బాగున్నాయి ,కొప్పర్తి మాస్టారు గారికి అభినందనలు, మీకు ధన్యవాదాలు సర్......
ReplyDeleteకాశీ రాజు