Wednesday, October 12, 2011

23 జనవరి, 1757 న బొబ్బిలి కోటలో ఏం జరిగింది?


           బొబ్బిలికథ ఆంధ్రనాట జనపదుల నోట అమరత్వం పొంది ప్రసిద్ధిగాంచిన గాధ.  దీనిని సి.పి. బ్రౌన్ 1832 లో మల్లెశం అనే జానపద కళాకారుడు పాడుతూండగా  వ్రాతరూపంలోకి తీసుకొచ్చాడు.  బుర్రకథ, హరికథ, నాటకం, సినిమా వంటి అనేక కళారూపాలలో బొబ్బిలియుద్ధం జీవంపోసుకొని తరతరాలుగా  ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.  ఆ వీరగాథ వర్ణణ ఈ విధంగా ఉంటుంది.

           బొబ్బిలి రాజు రంగారావుకు విజయనగర రాజైన విజయరామరాజుకు మధ్య శతృత్వం ఉండేది.  విజయరామరాజు కోరిక మేరకు, ఫ్రెంచి సేనాని బుస్సీ 23 జనవరి, 1757 న బొబ్బిలికోటను ముట్టడించాడు.  ఈ ముట్టడిలో బొబ్బిలి సైన్యం ఓడిపోయింది.  కోట లోపలకు శతృసైన్యం ప్రవేశించేలోపల బొబ్బిలి వీరులు తమ భార్యలను, తల్లులను, గర్భిణీస్త్రీలను, పిల్లలను, ముసలివారిని మొత్తం సుమారు పదివేలమందిని ప్రాణత్యాగం గావించి చివరకు వారుకూడా యుద్ధంలో మరణించారు.  కొంతమంది మంటల్లో దూకి, మరికొందరు కత్తులతో పొడుచుకొని, శత్రువుల తుపాకీలకు ఎదురెళ్ళి ఇంకొందరూ ఆత్మహత్య చేసుకొన్నారు. దీనికి ప్రతీకారంగా మూడురోజుల అనంతరం, బొబ్బిలివీరుడు తాండ్రపాపారాయుడు విజయరామరాజును చంపి పగతీర్చుకొన్నాడు.

              బొబ్బిలి యుద్ధం జరిగిన నాలుగేళ్ల అనంతరం, 1861 లో  రాబర్ట్ ఓర్మె వ్రాసిన MILITARY TRANSACTIONS OF THE BRITISH NATION IN INDOSTAN అనే పుస్తకంలో ఈ యుద్ధవివరాలు  మరియు  1832 బ్రౌన్ కథనం కూడా  జనబాహుళ్యంలో ఉన్న బొబ్బిలివీరగాధ రూపానికి దగ్గరగానే ఉంటాయి.  కానీ బొబ్బిలియుద్ధం జరిగిన రెండునెలలతరువాత వ్రాయబడ్డ ఒక రికార్డులో మాత్రం మరోలా ఉంది.


    26 మార్చి, 1757 న ఆనందరంగపిళ్ళై వ్రాసుకొన్న డైరీలో బొబ్బిలి యుద్ధం గురించి జనబాహుళ్యంలో చలామణీలో ఉన్న దానికి విరుద్దంగా ఈ విధంగా వర్ణించబడింది.  (రి.  వాల్యూం 10 - పేజీలు 334-337).

.............. బుస్సీ బొబ్బిలి కోటను ముట్టడించినపుడు, కొద్దిమంది బొబ్బిలివీరులు కోటనుండి బయటకు వచ్చి ప్రతిఘటించగా బుస్సీ సేనలు వెనుతిరిగాయి.  దీనికి ఆగ్రహించిన విజయరామరాజు తన సేనల్ని కోటవైపు మళ్ళించాడు.  వారికి బుస్సీ సేనలు  సహాయపడ్డాయి.  భీకరమైన యుద్ధం జరిగింది.  ఆ యుద్ధంలో ఇరువైపులా 8-9 వేల మంది చనిపోయారు.  కోటచుట్టూ ఉన్న కందకం రక్తంతో నిండిపోయింది.  కోట వశమయినపుడు విజయరామరాజుతో బుస్సీ “కోటలో ఒక్క చిన్న శిశువుని ప్రాణాలతో ఉంచినా ఒక శత్రువుని మిగుల్చుకొన్నట్లే” అన్నాడు.  ఆ మాటలకు విజయరామరాజు కోటలో ప్రతిఒక్కరినీ చంపివేయమని తన సైనికులను ఆజ్ఞాపించాడు.  వారు ఆ విధంగానే కోటలోని స్త్రీలను, గర్భిణులను, పిల్లలను మొత్తం పదివేలమందిని హతమార్చారు, రంగారావుతో సహా.   అలా చేయటం యూరోపియన్ పద్దతి అని వర్ణించటం జరిగింది.  గాయపడిన రంగారావు తమ్ముడికి వైద్యం చేయించమని బుస్సీతో విజయరామరాజు చెప్పాడు.  కోటపై ఫ్రెంచి జండా ఎగరవేయబడింది.  సైనికులు విజయోత్సవం చేసుకొన్నారు.  ఒకరికొకరు చక్కెర తినిపించుకొన్నారు............

            బొబ్బిలి యుద్ధం జరిగిన రెండునెలల తరువాత వ్రాయబడిన పై విషయాలు విశ్వసనీయంగానే అనిపిస్తాయి.  ఎందుకంటే మిగిలిన అంశాలైన ఎంతమంది సైనికులు పాల్గొన్నారు, కోట నిర్మాణం, ఎంతమంది చనిపోయారు, తేదీలు సమయాలు, వివిధ వ్యక్తుల వివరాలన్నీ ఒర్మె మరియు బ్రౌన్ కథనాలతో సరిపోతున్నాయి.   అంతేకాక రంగపిళ్ళైకి అనేకమంది గూఢచారులు, వార్తాహరులు ఉండేవారట.  ఏదైనా ఒక విషయాన్ని ఇద్దరు ముగ్గురు దృవీకరిస్తేకానీ  పిళ్ళై నమ్మేవాడు కాదు.

           ఒక వేళ బొబ్బిలియుద్ధం రంగపిళ్ళై చెప్పినట్లు నడిచిఉన్నట్లయితే మొత్తం ఉదంతానికి ఆయువుపట్టయిన సామూహిక ఆత్మహత్యలు అసత్యం అవుతాయి.  శతృవులు జరిపిన ఊచకోతను సామూహిక ఆత్మహత్యలుగా ప్రచారించుకోవటం ఒక రాజకీయ ఎత్తుగడలా అనుకోవాల్సివస్తుంది.

(నేను రచించిన “ఫ్రెంచిపాలనలో యానాం” అనే పుస్తకంలోని “ఆనంద రంగపిళ్ళై డైరీలలో యానాం ప్రస్తావన” అనే చాప్టరు నుంచి)

బొల్లోజు బాబా


3 comments:

  1. చరిత్రకు వెలుగు చూపే చక్కటి వివరణ బాబా గారూ బావుంది.

    ReplyDelete
  2. చాలా బాగుంది సార్!చిన్నప్పుడు మనం విన్న కస్తూరి రంగయ్యా పాట ఈ ఆనందరంగ పిళ్ళై గురించి అని ఇప్పుడు తెలిసింది.

    ReplyDelete