ఈదులాడి ఈదులాడి
దొరికిన ఆధారంతోనే
ఆ క్షారజలాల్ని మధించి
సాధించిన అమృతాన్ని తాగేవేళ
అబ్బే రిజర్వేషను బాపతురా
వీడి దగ్గర సరుకెక్కడుంటుంది
అనే మాటల ఘాతానికి హృదయం
కరంటు తీగలను తాకిన
గబ్బిలమై విలవిలలాడుతుంది.
ఆలోచనలు, ఆశయాలు మనసులూ
ముప్పేటల హారంలోని ముత్యాల్లా
పెనవేసుకుపోయినపుడు
తనువులు పరిణయ లాంఛనాన్ని పూర్తి చేసుకుంటే
"వర్ణ సంకరం, వర్ణ సంకరం" అనె గుసగుసలకు
గుండె దిగులు చెట్టై గుబులు
పుష్పాలు పూస్తూంటుంది.
బి. సి. అంటే ఎవరు నాన్నా?
అని కన్న కూతురడిగినపుడు ఏమని చెప్పను?
అద్దకం పనిలో రంగుల్లోని సీసం
బొట్లు బొట్లు గా ఎముకల్లో చేరి
నిర్వీర్యమయినవాడని చెప్పనా? లేక
బంగారాన్ని కొట్టి కొట్టి భుజం బంతిగిన్ని కీలు
అరిగిపోగా చేయి ఎత్తలేని స్థితిలో
పస్తులుంటున్న వాడని చెప్పనా?
ఆస్బెస్టాస్ రేణువులు ఊపిరితిత్తులను
తూట్లు పొడవగా దగ్గుతూ రొప్పుతూ
వాటినే తోలు తిత్తులుగా చేసి
కొలిమిని మండిస్తున్నవాడని చెప్పనా?
లోహ పాత్రల ఇంద్రజాలంలో
తన జీవనాధారం మాయమవగా
మట్టిగరుస్తున్న మృత్తిక కళాకరుడని చెప్పనా? లేక
సాయింత్రం తిరిగొస్తేనే బతికున్నట్టుగా
లెక్కింపబడే సముద్ర జాలరి దినదిన గండ జీవితానికి
పొడిగింపుగా మిగిలిన వారసుడని చెప్పనా?
ద్రోణాచార్యుడు ఒక వేలే అడిగాడు
కానీపారిశ్రామిక విప్లవాచార్యుడు కోరిన
వేల వేళ్ల యొక్క దేహాల సంతతి అని చెప్పనా?
ఏమని చెప్పాలి నాకూతురికి
బి.సి. అంటే ఎవరని చెప్పాలి?
నేనెవరు అంటే ఏమని ఆవిష్కరించాలి?
శ్మశానంలా తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీని ఈ సమాజానికి
తరతరాలుగా అందిస్తూనే ఉన్న ఈ జీవి
ఇపుడిపుడే రొట్టెలో భాగానికై చేయి చాచినందుకు ............
బొల్లోజు బాబా
(---నేనింతవరకూ తీసుకువచ్చిన ఈ రధాన్ని ముందుకు నడపండి. కనీసం ఉన్నచోటైన ఉంచండి తప్ప వెనక్కు మాత్రం నడిపించకండి -- అన్న డా. బి. ఆర్. అంబేద్కర్ మాటల స్ఫూర్తితో )