Tuesday, December 26, 2023

విస్మృత సామ్రాజ్యాన్ని వెలికితీసిన పండితుడు -జేమ్స్ ప్రిన్సెప్


జేమ్స్ ప్రిన్సెప్ ఈస్ట్ ఇండియా కంపనీ వ్యాపారి జాన్ ప్రిన్సెప్ కుమారుడు. జాన్ ప్రిన్సెప్ 1771 లో భారతదేశం వచ్చి నీలిమందు వ్యాపారం చేసి బాగా డబ్బు గడించాడు. ఇతను 1787 లో ఇంగ్లాండుకు తిరిగి వెళిపోయి కంపనీ వ్యాపారిగా స్థిరపడ్డాడు. పార్లమెంటు సభ్యుడు కూడా అయ్యాడు. తరువాత వ్యాపార ఒడిదుడుకులవల్ల నష్టాలపాలయ్యాడు. భారతదేశంతో జాన్ ప్రిన్సెప్ కు ఉన్న వ్యాపార సంబంధాలను ఉపయోగించుకొని తన సంతానానికి ఈస్ట్ ఇండియా కంపనీలో వివిధ హోదాలలో ఉపాధులు ఏర్పాటు చేసాడు. ఇతని పదవ సంతానంగా (ఏడవ కొడుకు) జేమ్స్ ప్రిన్సెప్ 20, ఆగస్టు, 1799 న బ్రిస్టల్ లో జన్మించాడు. కొంతకాలం ఆర్కిటెక్ట్ విద్య అభ్యసించాడు. భారతదేశ టంకశాలలో నాణ్యత పరిశీలించే అధికారి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిసి జాన్ ప్రిన్సెప్, ఇతనిని లండన్ రాయల్ మింట్ లో నాణాల నాణ్యత పరిశీలించే అధికారిగా పనిచేసే రాబర్ట్ బింగ్లీ వద్ద ఆ విద్యలో తర్ఫీదు పొందమని పంపించాడు. అలా జేమ్స్ ప్రిన్సెప్ నాణాల నాణ్యత పరిశీలించే నైపుణ్యాన్ని పొంది, 1819 లో భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపనీ కలకత్తా టంకశాలలో నాణ్యత అధికారిగా ఉద్యోగాన్ని పొందాడు.

జేమ్స్ ప్రిన్సెప్, హూగ్లి అనే ఓడలో ప్రయాణించి 15, సెప్టెంబరు 1819 న కలకత్తా నేలపై అడుగుపెట్టాడు. అప్పటికే ఇండియాలో పనిచేస్తున్న ఇతని సోదరులు విలియం తోబి, హెన్రి తోబిలు జేమ్స్ ప్రిన్సెప్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. కలకత్తా టంకశాలలో ఇతనిని HH Wilson కు సహాయకుడిగా నియమించారు. (Colin Mackenzie మరణించాక అతను సేకరించిన సుమారు లక్షపేజీల రాత ప్రతులను, పదివేలకు పైగా నాణాలు ఇతర సేకరణలను క్రోడీకరించి కేటలాగ్ చేసిన వ్యక్తే ఈ HH Wilson). కలకత్తా వచ్చిన కొత్తలో, జేమ్స్ ప్రిన్సెప్ కొన్ని Asiatic Society [1] మీటింగులకు హాజరై అవి తనకు పెద్దగా ఆసక్తి కలిగించలేదని తండ్రికి రాసిన ఒక ఉత్తరంలో తెలిపాడు. స్థానిక ప్రముఖులైన ద్వారకానాథ్ టాగూర్ (రవీంద్రనాథ్ టాగూర్ తాతగారు), రాజా రామమోహన్ రాయ్ లను కలుసుకొన్నాడు. ఆధునిక రసాయిన శాస్త్రంలో జేమ్స్ ప్రిన్సెప్ కు ఎక్కువ అభిరుచి ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఒప్పించి కలకత్తాలో ఒక ఆధునిక సైన్స్ లాబొరేటరీని స్థాపింపచేసి Salt, Opium, Nitre లాంటి వివిధ పదార్ధాల లక్షణాలపై ప్రయోగాలు చేయాలని భావించేవాడు. Asiatic Society మీటింగులో ఒకనాడు జేమ్స్ ప్రిన్సెప్ “ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు” అనే అంశంపై చేసిన ప్రసంగం ఆనాటి కలకత్తా సమాజంలోని ఉన్నతవర్గాలలో ఇతనికి గొప్ప పేరు తెచ్చింది.

1. బెనారస్ లో ఉద్యోగం

బెనారస్ లో కొత్తగా స్థాపించిన టంకశాలకు జేమ్స్ ప్రిన్సెప్ ను 1820లో అధికారిగా నియమించటం జరిగింది. కలకత్తానుండి 800 మైళ్ళ దూరంలో ఉన్న బెనారస్ కు పడవపై బయలుదేరి నవంబరులో చేరుకొన్నాడు. బెనారస్ టంకశాలలో నాణ్యతాధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. కొత్తగా నిర్మించిన తన అధికారిక నివాసం ఆకర్షణీయంగా లేదని కొన్ని ఆర్కిటెక్చరల్ మార్పులు చేయించాడు జేమ్స్ ప్రిన్సెప్. ఈ మార్పులు బెనారస్ లో విధులు నిర్వహిస్తున్న ఇతర యూరోపియన్ అధికారులకు తెగనచ్చేసాయి. జేమ్స్ ప్రిన్సెప్ భవన నిర్మాణ సామర్ధ్యం పట్ల గౌరవాభిమానాలు పెరిగాయి. ఆర్కిటెక్చర్ కు సంబంధించి ఇతనిని సలహాలు అడగసాగారు. తన అధికారిక నివాసంలో సైన్సు ప్రయోగాలకొరకు ఒక లాబొరేటరీని ఏర్పాటుచేసుకొన్నాడు. ఈ ప్రయోగశాలలో జేమ్స్ ప్రిన్సెప్ -నాణెముల కొరకు లోహములు కరిగించే కొలిమిలో ఉష్ణోగ్రతను ఖచ్చితంగా గణించే Pyrometer అనే పరికరాన్ని, ఒక వడ్లగింజలో వెయ్యోవంతు బరువు తూచగల సున్నితపు త్రాసుని కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణల వల్ల జేమ్స్ ప్రిన్సెప్ కు 1828 లో Royal Society లో శాస్త్రవేత్తలకు లభించే ఫెలోషిప్ లభించింది.

జేమ్స్ ప్రిన్సెప్ తెల్లవారు జామునే నిద్రలేచి బ్రేక్ పాస్ట్ సమయానికి ఆఫీసుపనులన్నీ ముగించుకొని, మూడు మైళ్ళ దూరంలో ఉన్న టంకశాలకు వెళ్ళి అక్కడ తనిఖీలు నిర్వహించి, పనులు పురమాయించి, ఎండవేడిమి పెరగకుండా ఉదయం పదిగంటల సమయానికల్లా తన బంగ్లాకు చేరుకొనేవాడు. ఇక రోజంతా ఖాళీ. తనకు నచ్చిన పనులు చేసుకొనే వెసులుబాటు చిక్కేది. ఆ విధంగా చిక్కిన సమయంతో బెనారస్ లో జేమ్స్ ప్రిన్సెప్ అనేక పనులు చేయగలిగాడు. అవి

1. రెండేళ్లపాటు శ్రమించి బెనారస్ పట్టణ మేప్ ను చిత్రించాడు.
2. స్థానిక యురోపియన్లు, ఈస్ట్ ఇండియా కంపనీ ఉమ్మడి వ్యయంతో ఒక చర్చి నిర్మాణం గావించాడు.
3. 1823 లో కంపనీకి అధికలాభాలు వచ్చిన సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచటానికి నిధులు ఇస్తాం ప్రతిపాదనలు ఇవ్వండి అని అధికారులను కోరింది. అలా బెనారస్ అభివృద్ధి కమిటీకి జేమ్స్ ప్రిన్సెప్ సెక్రటరీ. నగర సుందరీకరణలో భాగంగా భవనాలకు హాని కలుగకుండా రోడ్లు వెడల్పు చేసే ప్రతిపాదనలు పంపి ఆ పనులను స్వయంగా పర్యవేక్షించాడు.
4. బెనారస్ లో గుంటలు, పల్లపు ప్రాంతాలు అధికం. వానాకాలంలో వాటిలో నీరు చేరి పట్టణం అంతా మురికిగా అపరిశుభ్రంగా మారేది. దీనికి పరిష్కారంగా నగర సుందరీకరణ నిధులతో మురుగు నీరు పారటానికి భూగర్భ సొరంగాన్ని తవ్వించాడు. ఈ సొరంగం పట్టణంలో అనేక ఏడంతస్తుల భవనాలకు క్రిందుగా, వాటి పునాదులకు ఏ మాత్రం నష్టం కలగకుండా నిర్మింపచేసి పలువురి మన్ననలు పొందాడు.
5. బెనారస్ ప్రజలు ఇతనికి కొంత భూమిని కానుకగా ఇవ్వగా, దానిని చదును చేసి, స్థానికి మార్కెట్ నిర్వహించుకొనటానికి తిరిగి దానంగా ఇచ్చివేసాడు. పట్టణ మధ్యలో ఉన్న ఆ స్థలం అప్పటికే ఎంతో విలువైనది కాగా జేమ్స్ ప్రిన్సెప్ ఆనాటికి ఒక సాధారణ కంపనీ ఉద్యోగి.
6. బెనారస్ లో ఔరంగజేబు నిర్మించిన ఒక మసీదు (ఆలంగిరి మసీదు) శిథిలావస్థకు చేరగా జేమ్స్ ప్రిన్సెప్ దాని పునాదులను బలపరచి పునర్నిమింపచేసాడు.
7. బెనారస్, కలకత్తా రహదారిపై ఒక ధనవంతుడైన హిందూ వ్యాపారి తానే ఖర్చులు పెట్టుకొంటాను అనే కోరికపై, Karamnasa నదిపై లక్షరూపాయిల వ్యయంతో ఒక వంతెనను నిర్మించాడు. మొదట్లో కంపనీ ఇంజనీర్లు అక్కడి నేల మంచిది కాదని, వరదల వల్ల కొట్టుకొనే పోయే ప్రమాదం ఉందని వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆ నదిని హిందువులు దాటటం ప్రమాదమని, ఒక బ్రాహ్మణుని వీపున కూర్చుని మాత్రమే ఆ నదిని దాటాలని, స్థానికులలో ఒక విశ్వాసం ఉండేది. వంతెన కడితే అలా ఆ నదిని దాటించే బ్రాహ్మణులు తమ ఆదాయం కోల్పోతారనే కారణం వల్ల కూడా ఆ వంతెన నిర్మాణానికి కొందరు అభ్యంతరం పలికారు. ఇన్ని ప్రతికూలతల మధ్య జేమ్స్ ప్రిన్సెప్ వారందరినీ ఒప్పించి వంతెన నిర్మించి అది భారీ వరదలను కూడా తట్టుకొని నిలబడగలదని నిరూపించాడు.
8. మొదటిసారిగా బెనారస్ పట్టణ జనాభా లెక్కలు తీయించాదు.
9. ప్రిన్సెప్ అద్భుతమైన చిత్రకారుడు. బెనారస్ వీధులు ఘాట్ ల చిత్రాలను స్వయంగా గీసి 1825 లో ఇంగ్లాండుకు పంపగా వాటిని Illustrations of Benares పేరుతో పుస్తకరూపంలో ముద్రించారు కాశీ విశ్వనాథుని ఆలయంలోపలికి కొంతమేరకు చొచ్చుకొని కట్టిన చారిత్రాత్మక జ్ఞానవపి మసీదు చిత్రం జేమ్స్ ప్రిన్సెప్ లిఖించినదే.

2. కలకత్తాకు బదిలీ

గవర్నర్ విలియం బెంటింగ్ కలకత్తాలోని టంకశాలను విస్తరింపచేసి, బెనారస్ లోని టంకశాలను మూసివేయించటంతో జేమ్స్ ప్రిన్సెప్ 1830 లో బెనారస్ నుంచి కలకత్తాకు బదిలీ చేయబడ్డాడు. అప్పటికి కలకత్తాలో జేమ్స్ ప్రిన్సెప్ సోదరుడు విలియమ్ తోబి Palmer & Co పేరుతో నడుపుతున్న ఒక ఫైనాన్స్ కంపనీ మూడు మిలియన్ రూపాయిల మేరకు దివాళాతీయటంతో అతని ఆస్తులన్ని ప్రభుత్వం జప్తుచేసి వేలంవేసింది. దానితో రోడ్డునపడ్డ తోబి కుటుంబాన్ని తనవద్దే ఉంచుకొని పోషించసాగాడు జేమ్స్ ప్రిన్సెప్.
Salt water lake canal పనులను పర్యవేక్షించి తిరిగి వస్తుండగా గుర్రంనుంచి పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరి, తిరిగి కోలుకోక, 1830 లో జేమ్స్ ప్రిన్సెప్స్ మరొక సోదరుడైన థామస్ మరణించాడు, కలకత్తా చుట్టూ ఉండే కాలువలను బాగుపరచి జలరవాణాకు ఉపయోగపడేలా చేసే ప్రొజెక్టు అది. సోదరుని మరణంతో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. గవర్నరు విలియం బెంటింగ్ సూచనతో ఆ పనిని ప్రిన్సెప్స్ చేపట్టి పూర్తి చేసాడు.
జేమ్స్ ప్రిన్సెప్ 1830 లో లూసీ అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె మరొకరిని ఇష్టపడుతున్నదని తెలిసి తన ప్రేమను వెల్లడించక హృదయంలోనే దాచుకొని, చాలాకాలం పెళ్ళిచేసుకోకుండా
ఉండిపోయాడు. చాన్నాళ్ల తరువాత, 25 ఏప్రిల్, 1835 న బెంగాల్ ఆర్మీ కల్నెల్ కూతురు Harriet ను వివాహం చేసుకొన్నాడు. వీరికి ఒక కొడుకు, కూతురు కలిగారు. కొడుకు చిన్నతనంలోనే చనిపోయాడు.

3. ఆసియాటిక్ సొసైటీ కి దిశానిర్ధేశం

1831 లో తన పై అధికారి HH Wilson సలహామేరకు Asiatic Society లో మెంబరుగా చేరాడు.
Asiatic Society లో చేరగానే జేమ్స్ ప్రిన్సెప్ ని ఆకర్షించినవి అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకొని ఉన్న కొన్ని వేల పాత నాణాలు. ఇవన్నీ కంపనీ ఆధీనంలో ఉన్న బారతదేశపు వివిధ ప్రాంతాలలో తవ్వకాలద్వారా లభించిన నాణాలు. వీటిని ఆయాప్రాంతాల కంపనీ అధికారులు పరిశోధనల నిమిత్తం కలకత్తాలోని ఆసియాటిక్ సొసైటీ కి పంపించే వారు. వీటిలో అనేక బంగారునాణాలు కూడా ఉండేవి. వీటన్నిటిని జేమ్స్ ప్రిన్సెప్ అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. శాస్త్రీయదృక్ఫథంతో Numismatics ని చూడనారంభించాడు. ఆ నాణాలను క్రోడీకరించి వాటిని పెర్షియన్, బాక్ట్రియన్, హిందూ, గ్రీకు, సింహళ అంటూ వివిధ రకాలుగా వర్గీకరించి అనేక వ్యాసాలు రాసాడు.

ఆరేళ్ళ కాలంలో రాసిన ఆ వ్యాసాలను, జేమ్స్ ప్రిన్సెప్ మరణానంతరం Essays on Indian Antiquities, Historic, Numismatic and Palaeographic, James Prinsep, అంటూ రెండు వాల్యూముల పుస్తకాలుగా తీసుకొని వచ్చారు.

1832 లో HH Wilson ఆక్స్ ఫర్డ్ లో సంస్కృతం బోధించడానికి కలకత్తాను విడిచి వెళిపోయాకా జేమ్స్ ప్రిన్సెప్ కలకత్తా టంకశాలకు ప్రధానాధికారిగా, ఆసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడు.

టంకశాల అధికారిగా విధులు చేపట్టాక జేమ్స్ ప్రిన్సెప్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు-అంతవరకూ ముద్రిస్తున్న వెండిరూపాయిలకు బదులు మొదటి సారిగా రాగి రూపాయి నాణాలను తీసుకురావటం. ఈ రాగి నాణానికి ఒకవైపు బ్రిటిష్ చక్రవర్తి విలియం IV యొక్క శిరస్సు, మరొకవైపు ఈస్ట్ ఇండియా కంపనీ పేరు కలదు. జేమ్స్ ప్రిన్సెప్ స్వయంగాఈ నాణాన్ని డిజైన్ చేసాడు. ఇది 1835 నుండి చలామణిలోకి వచ్చింది. ఈ నాణాలను ముద్రించటానికి మొదటి సారిగా ఆవిరి యంత్రాన్ని వినియోగించాడు.

జేమ్స్ ప్రిన్సెప్ ఆసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం, సొసైటీ పేరును Asiatic Society of Bengal గా మార్పు చేసాడు. ఈ సొసైటీకి Asiatick Researches పేరుతో ఒక అధికారిక పత్రిక ఉండేది. అదే కాలంలో Gleanings of Science అనే ఒక పత్రిక మూతపడే స్థితికి వచ్చింది. జేమ్స్ ప్రిన్సెప్ Asiatick Researches మరియు Gleanings of Science అనే ఈ రెండు పత్రికలను విలీనం చేసి Journal of the Asiatic Society of Bengal (JASB) అనే కొత్త పేరుతో కొనసాగించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక చరిత్రకారులకు భారతదేశ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే తమ పరిశోధనా పత్రములు పంపమని, JASB ని వేదికగా చేసుకొమ్మని పిలుపునిచ్చాడు.

కలోనియల్ పీరియడ్ లో భారతదేశం ఇంకా ఇతర ప్రాంతాలనుంచి అనేక చారిత్రిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన కొన్ని వేల లోతైన పరిశోధనా వ్యాసాలు ఈ జర్నల్ లో ప్రచురించబడ్డాయి. భారతదేశ చరిత్రను అభూతకల్పనలతో కాక శాస్త్రీయంగా మదింపు వేయటంలో ఈ పత్రిక పాత్ర ఎనలేనిది. ఈ సొసైటీ నేటికీ The Asiatic Society పేరుతో కొనసాగుతున్నది.

ఆసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా దాని అధికారిక జర్నల్ కు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించే క్రమంలో, జేమ్స్ ప్రిన్సెప్ లోని జ్ఞానతృష్ణ రెక్కలు తొడిగి విహరించటం ప్రారంభించింది. దేశం నలుమూలలనుంచి అనేక శాసన ప్రతులు, నాణాలు, శిల్పాల నకళ్ళు ఇతర ఆర్కియలాజికల్ ఆవిష్కరణలు నిత్యం సొసైటీకి రిపోర్టుల రూపంలో అందేవి. గొప్ప మేధావులు తమ పరిశోధనలను జర్నల్ కు ప్రచురణకొరకై పంపేవారు. వారి అందరితో ప్రిన్సెప్ కు పరిచయాలు కలిగాయి. ఈ నేపథ్యంలో జేమ్స్ ప్రిన్సెప్ లో భారతీయ ప్రాచీన విజ్ఞానం చరిత్ర పట్ల ఎనలేని ఆసక్తి మొదలైంది. తనకాలాన్ని, మేధను భారతదేశ పాచీనచరిత్రను అధ్యయనం చేయటానికి వెచ్చించాలని నిర్ణయించుకొన్నాడు.

జేమ్స్ ప్రిన్సెప్ అంతవరకూ సమాజానికి అందించిన సేవలు ఒక ఎత్తు అయితే, అర్ధంకాకుండా ఒక మిస్టరీగా ఉన్న బ్రాహ్మి లిపిని అర్ధం చేసుకోవటం మరొక ఎత్తు. ఈ పనివల్ల జేమ్స్ ప్రిన్సెప్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా వినుతికెక్కాడు.

4. ప్రాచీన భారతదేశ చరిత్రకు తాళంచెవి బ్రాహ్మి లిపి

కొందరి అసూయ, ద్వేషం కారణంగా మృతప్రాయంగా మారిన ఒక లిపిని జేమ్స్ ప్రిన్సెప్ తిరిగి బతికించాడు. రోసెట్టా స్టోన్ పురాతన ఈజిప్షియన్ సంస్కృతి గురించిన మన అవగాహనను మార్చినట్లు, బ్రాహ్మి లిపిని అర్ధం చేసుకోవటం ద్వారా వందలసంవత్సరాలుగా దాచబడిన ప్రాచీన భారతదేశ చరిత్ర ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

కొందరి అసూయ ద్వేషం కారణంగా విస్మృతమైన ఒక మహా సామ్రాజ్యాన్ని జేమ్స్ ప్రిన్సెప్ తిరిగి సజీవంగా నిలిపాడు. అశోక చక్రవర్తి అఖండ భారతదేశ నిర్మాత. కాశ్మీరు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేష్, తమిళనాడుల వరకూ ఇతని సామ్రాజ్యం విస్తరించిఉంది. తన రాజ్య సరిహద్దుల వద్ద తన శాసనాలు వేసిన స్తంభాలను పాతించాడు. అయినప్పటికీ ఇతని పేరు హిందూదేశ చరిత్రలో కనిపించదు. ఏ పురాణాలూ ఇతన్ని కీర్తించవు. ఏ రాజవంశావళులు ఇతనికి సరైన స్థానం ఇవ్వవు. అలాంటి అశోకచక్రవర్తి పేరును మరలా చరిత్రలో తిరగరాయించిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్.
కొందరి అసూయ ద్వేషం కారణంగా నేలపొరల్లోకి నెట్టబడిన ఈ దేశ వారసత్వమైన బౌద్ధమతం మరలా పునరుజ్జీవం పొందటంలో జేమ్స్ ప్రిన్సెప్ పాత్ర విస్మరింపరానిది.

పై మూడు పనులు భారతదేశ చరిత్రకు జేమ్స్ ప్రిన్సెప్ ఇచ్చిన కాన్కలు. 18వ శతాబ్దం వచ్చేసరికి దేశంనలుచెరగులా కనిపించే అశోకుని స్తంభాలు, శాసనాలు దానిలో ఉండే భాష , ఎక్కడ తవ్వినా బయటపడే బౌద్ధ విగ్రహాలపట్ల ఎవరికీ అవగాహన ఉండేది కాదు. స్వతహాగా జిజ్ఞాసకలిగిన కొందరు ఈస్ట్ ఇండియా కంపనీ అధికారులు వీటిగురించి తెలుసుకోవాలని ప్రయత్నించినా అశోకస్తంభం భీమసేనుడి గధ అని, దానిపై అర్ధంకాని రాత బ్రహ్మ రాత అని, బుద్ధుని విగ్రహాలు విష్ణుమూర్తి పదో అవతారమనీ కానీ బౌద్ధం ఒక దారితప్పిన మతమని పొంతనలేని సమాధానాలు వచ్చేవి తప్ప సరైన వివరాలు ఎవరూ చెప్పే వారు కాదు. బ్రాహ్మి లిపిని డెసిఫర్ చేయటం ద్వారా ఈ మొత్తం అజ్ఞానాన్ని బద్దలుగొట్టాడు జేమ్స్ ప్రిన్సెప్.
***
భారతదేశములో లిపి అనేది కనీసం సింధులోయనాగరికత నుంచి కనిపిస్తుంది (3300 BCE to 1300 BCE). లిపి వేరు భాషవేరు. ఇంగ్లీషు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ లాంటి భాషలు రోమన్ లిపిలో రాస్తారు. హింది, సంస్కృతం, మరాఠి, నేపాలి, సింధి లాంటి భాషలు దేవనాగరి లిపిలో రాస్తారు. అదే విధంగా పాలి, గాంధారి, మాగధి భాషలు బ్రాహ్మి లిపిలో రాసేవారు.
ప్రాచీన భారతదేశంలో BCE 5వ శతాబ్దమునుంచి బ్రాహ్మి లిపి వాడుకలో ఉంది. ఈ లిపిని భారతదేశ మూలవాసుల లిపిగా చెబుతారు. BCE 3 వ శతాబ్దం, అశోకుడు కాలంలో ఇది ఉఛ్ఛస్థితిలో ఉంది. అందుకనే అశోకుని శాసనాలు అన్నీ బ్రాహ్మి లిపిలో ఉన్నాయి. ప్రాచీన బ్రాహ్మిని అశోక బ్రాహ్మి అంటారు. ఈ లిపిని అప్పట్లో సామాన్యులు కూడా చదవగలిగేవారు. (see. Child learning brahmi, Terracotta sculpture from BCE 2 centuary) కానీ క్రమేపీ ఈ లిపి నుండి తమిళబ్రాహ్మి, గుప్త బ్రాహ్మి, కళింగ బ్రాహ్మి, భట్టిప్రోలు బ్రాహ్మి లాంటి అనేక స్థానిక రూపాలు రావటం వల్ల CE4 వ శతాబ్దము నాటికే ప్రజలు క్రమేపీ మూలరూపమైన అశోకబ్రాహ్మి లిపిని మరచిపోయారు.

నాలుగో శతాబ్దంలో భారతదేశంలో ప్రయాణించిన చైనా యాత్రికుడు ఫాహియాన్, పాటలిపుత్రలోని బ్రాహ్మిఅశోక స్తంభంపై ఉన్న విషయాలు అంటూ ఎవరో స్థానికులు చెప్పిన ఏవేవో సంబంధం లేని కథలను నమోదు చేసాడు. అంటే ఆ సమయానికే బ్రాహ్మి లిపిని చదవగలిగే పరిస్థితిలేదని భావించాలి. [2]. ఏడవ శతాబ్దపు హుయాన్ త్సాంగ్ కూడా అశోక స్తంభాలను వర్ణించాడు తప్ప వాటిపై బ్రాహ్మి లిపిలో ఉన్న విషయాలను చెప్పలేదు. [3]
****

ఫిరోజ్ ఖాన్ తుగ్లక్ (1309-1388) హర్యానలోని తోప్రా వద్ద 42 అడుగుల పొడవు ఉన్న ఒక అశోక స్తంభం చూసి ఆశ్చర్యపడి, దాన్ని ఢిల్లీకి తీసుకొని రమ్మని ఆదేశించాడు. దాన్ని 42 చక్రాల భారీ వాహనంపై యమున నదీ తీరం వద్దకు చేర్చగా, అక్కడినుంచి పడవలమీద డిల్లీకి తరలించారు. ఆ స్తంభంపై ఉన్న వాక్యాలకు అర్ధం ఏమిటో తెలుసుకోవాలని ఫిరోజ్ ఖాన్ భావించాడు. కొందరు పండితులను పిలిపించి వాటిని చదవమన్నాడు. ఆ పండితులు ఆ స్తంభం భీమసేనుడి చేతి కర్ర అని; భారత యుద్ధం ముగిసాక దాన్ని తోప్రా లో విడిచిపెట్టాడని; దానిపై “ఈ స్తంభాన్ని ఫిరోజ్ ఖాన్ అనే చక్రవర్తి వచ్చి కదిపే వరకూ దాన్ని ఎవరూ కదిలించలేరు” అనే వాక్యాలు ఉన్నాయని చెప్పారట. ఇది ఆ పండితుల మోసకారితనమే కాక, బ్రాహ్మిలిపి చదవగలిగే వారు పండితులలో కూడా ఎవరూ లేరనే విషయాన్ని తెలియచేస్తుంది.

18 వ శతాబ్దం వచ్చేసరికి భారతదేశ చరిత్రను తెలుసుకోవటానికి ఎంతో మంది యూరోపియన్స్ ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా వారి కాలాన్ని, మేధను వెచ్చించే వారు. వీరికి ప్రాచీన శాసనాలు కొరుకుడు పడేవి కావు. ముఖ్యంగా బ్రాహ్మి లిపిలో ఉన్న శాసనాలు. ఈ నేపథ్యంలో Charles Wilkins 1781 లో 9వ శతాబ్దానికి చెందిన ఒక బ్రాహ్మి శాసనాన్ని చదవగలిగాడు. కానీ ఈ బ్రాహ్మి లిపి ఆధునిక బెంగాల్ లిపితో ఎంతో సారూప్యం కలిగి ఉండటంతో అది సాధ్యమైంది కానీ మరీ ప్రాచీన అశోక బ్రాహ్మిని అర్ధం చేసుకోవటంలో ఈ ముందడుగు ఏమాత్రమూ ఉపయోగపడలేదు. (బ్రాహ్మి లిపి కాలానుగుణంగా మారటం వల్ల నేటి మన తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలి, దేవనాగరి లాంటి సమస్త భారతీయ లిపులు ఆవిర్భవించాయి. ఈ మార్పుల వల్ల మూల అశోకలిపికి ఇవి దూరం జరిగిపోయాయి). Charles Wilkins ను ఆదర్శంగా తీసుకొని బ్రాహ్మిలిపిపై William Jones కొంత కృషిచేసినా అది ఫలించలేదు.
****
మరో మూడు దశాబ్దాల వరకూ బ్రాహ్మి లిపిని అర్ధం చేసుకోవటంలో ఏ పురోగతి రాలేదు. ఆ తరువాత 1834 లో జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మిలిపిపై పనిచేయటం ప్రారంభించి 5 ఏళ్ళలో వివిధ దశలలో దాన్ని పూర్తిగా డెసిఫర్ చేయటం జరిగింది.

ఎ. మొదటి దశ

జేమ్స్ ప్రిన్సెప్స్ బెనారస్ లో పనిచేస్తున్న సమయంలో ఒకనాడు అలహాబాదు కోటను సందర్శించాడు. కోటవెలుపల ఎండ,వానలకు మగ్గుతున్న ఒక పెద్ద స్తంభాన్ని చూసాడు. దానిపై ఉన్న అక్షరాలు శిథిలమైపోతున్నాయి. ఆ అక్షరాలలో మొఘల్ చక్రవర్తి జహంగిర్ పేరును గుర్తించి, ఇది చారిత్రికంగా విలువైన స్తంభం అయి ఉంటుందని భావించి అలహాబాదులోనే పనిచేస్తున్న TS Burt అనే అధికారిని ద్వారా, ఆ స్తంభంపై ఉన్న శాసనాల నకలును తెప్పించుకొని అధ్యయనం చేసాడు.

ఆ స్తంభాన్ని స్థానికులు భీముని గధ అని పిలుచుకొంటారు. దీనిపై భిన్నకాలాలో ముగ్గురు చక్రవర్తులు వేయించిన మూడు శాసనాలు ఉన్నాయి. మొదటిది అశోకుడు బ్రాహ్మిలిపిలో వేయించిన శాసనం. రెండవది సముద్రగుప్తుడు (c. 335–375 CE) తన విజయాలను నమోదుచేస్తూ సంస్కృతంలో వేయించిన ప్రశస్థి శాసనం. మూడవది జహంగీర్ పర్షియన్ భాషలో వేయించిన శాసనం. పై మూడు శాసనాలలో బ్రాహ్మి లిపిలో ఉన్న మొదటి శాసనం గురించి Note on Inscription No.1 of the Allahabad Column అనే పేరుతో జేమ్స్ ప్రిన్సెప్1834 లో ఒక వ్యాసం రాసి దాదాపు బ్రాహ్మి లిపి పై ఏర్పడిన ముప్పై ఏళ్ళ నిశ్శబ్దాన్ని ఛేదించాడు. [4]


ఈ వ్యాసంలో జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మి లిపి లక్షణాలను కొన్ని ప్రతిపాదించాదు.

1. బ్రాహ్మి లిపి abugida రకపు లిపి అని గుర్తించాడు. అబుగిడా లిపి అంటే - అక్షరాలకు గుణింతాలు, ఒత్తులు ఉంటూ, ఇతర అక్షరాలతో కలిసి సంయుక్తాక్షరాలను ఏర్పరచే లక్షణం కలిగిఉండటం. మన తెలుగు భాష అలాంటిదే. (ఇంగ్లీషు అలా కాదు ఏ అక్షరానికి ఆ అక్షరమే లెక్క.)
2. పై శాసనంలో ఒక్కొక్క అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో లెక్కించాడు. ఒక్కో అక్షరం ఐదు రూపాలలో ఉన్నట్లు గుర్తించాదు. కింద ఇచ్చిన ఫొటోలో 𑀫 (మ) అనే అక్షరం 32 సార్లు వచ్చిందని, దాని ఇతర రూపాలు 𑀫𑀸 (మా) 3 సార్లు, 𑀫𑁂 (మే) 11 సార్లు రావటాన్ని బట్టి ఈ అక్షరాల మధ్య ఒక పాటర్న్ ను గమనించాడు. అది సంస్కృతం కంటే ప్రాకృతబాషకు దగ్గరగా ఉందని భావించాడు.

3. బ్రాహ్మి లిపిలో అచ్చులు హల్లులు ఉంటాయని చెప్పాడు
.
బి. రెండవ దశ
.
మొదటి దశలో జేమ్స్ ప్రిన్సెప్ ఆ శాసనంలోని అక్షరాలను గుర్తించగలిగాడు. వాటి పేటర్న్ ను గ్రహించాడు. వాటిని ఎలా పలకాలో తెలియదు. అలహాబాదు శాసనం పై జేమ్స్ ప్రిన్సెప్ రాసిన వ్యాసాన్ని చదివిన Hodgson తాను ఇదివరలో నేపాల్ సమీపంలోని Mathiah and Radhai అనే గ్రామాలనుంచి సేకరించిన కొన్ని శాసనాలుకూడా ఇదే విధంగా ఉన్నాయని భావించి వాటి నకళ్ళను పంపించాడు.

అలహాబాదు, Mathiah and Radhai, ఫిరోజ్ షా (ఢిల్లి) స్తంభ శాసనాలు మొత్తం మూడు బ్రాహ్మి శాసనాలు ప్రిన్సెప్ వద్ద ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి కొన్ని కొత్త విషయాలను గమనించి 1834 లో మరొక వ్యాసాన్ని రాసాడు [5] . దానిలో-

1. త 𑀢𑀸 అనే అక్షరానికి య 𑀬𑀸 అనేఅక్షరం జతపరచినపుడు 𑀢𑁆𑀬𑀸 త్య అనే సంయుక్తాక్షరం ఏర్పడుతుందని గుర్తించాడు. (See Table)

2. ఈ మూడు శాసనాలు 𑀤𑁂𑀯𑀦𑀫𑁆𑀧𑀺𑀬𑁂 𑀧𑀺𑀬𑀤𑀲𑀺 𑀮𑀚 అనే వాక్యంతో ప్రారంభమౌతున్నాయని గమనించాడు. ఆ వాక్యాలను “దేవనంపియే పియదసి లజ” అని చదవాలని; దాని అర్ధం Beloved of the Gods, King Priyadarsin అని; అది అశోక చక్రవర్తిని సూచిస్తుంది అని ప్రిన్సెప్ కే కాదు అప్పటికి ఎవరికీ తెలియదు. అయినప్పటికీ ఆ వాక్యం గురించి ప్రిన్సెప్ ఇలా ఊహించాడు – “అది అనేక విజయాలు సాధించిన రాజు పేరు కావొచ్చు; లేదా మతసంబంధమైన వాక్యం కావొచ్చు; బౌద్ధులకు లేద బ్రాహ్మణులకు ముఖ్యమైన వాక్యం కావొచ్చు” ఈ మూడు ఊహలు దాదాపు సరైనవే.

సి. మూడవ దశ

ఆ తరువాత రెండేళ్లపాటు ఏ రకమైన పురోగతి లేదు. 1836 లో Christian Lassen అనే నార్విజియన్ స్కాలర్ ఇండో బాక్ట్రియన్ రాజు Agathocles (BCE 190) వేయించిన ద్విభాషా నాణాలపై ఒక వ్యాసం రాసాడు [6].
అలెగ్జాండర్ భరతఖండంలోని కొన్ని పశ్చిమ ప్రాంతాలను జయించి వాటిని పరిపాలించుకొమ్మని తన సైన్యాధికారులకు అప్పగించి వెనుతిరిగాడు. అలా గాంధారలో విడిచి వెళ్ళిన సైన్యాధికారుల సంతతి ఈ Agathocles రాజు. ఇతను వేయించిన నాణెంపై ఇతని పేరు ఒకవైపు Basileōs Agathokleous (King Agathocles) అని గ్రీకులోను, మరొకవైపు 𑀅𑀕𑀣𑀼𑀓𑁆𑀮 𑀭𑀸𑀚 (Agathukla raja) బ్రాహ్మిలోను ఉన్నాయి. Lassen కు గ్రీకు వచ్చు కనుక గ్రీకు లిపిని బట్టి బ్రాహ్మిలో ఉన్న అక్షరాలను పోల్చగలిగాడు.

1. ఇది చదివిన ప్రిన్సెప్ కు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇతను అప్పటికే ప్రాచీన నాణాల అధ్యయనంలో అథారిటీగా పేరుతెచ్చుకొన్నాడు. ఇతనివద్ద ఉన్న అనేక ద్విభాషానాణాలను Lassen తరహాలో మరలా పరిశీలించి మరికొన్ని బ్రాహ్మి అక్షరాలను అర్ధం చేసుకోగలిగాడు.

2. సాంచి దానశాసనాలు అన్నింటిలో చివర  𑀤𑀸𑀦𑀁 అక్షరాలు ఉన్నట్లు గమనించాడు. ఇవి బహుశా “దానం” అనే పదాన్ని సూచించవచ్చని సరిగానే ఊహించాడు ప్రిన్సెప్. అలా మరో రెండుఅక్షరాలను గుర్తించాడు [7] .

3. బ్రాహ్మి లిపి కొద్దికొద్దిగా తనని తాను తెరుచుకోవటం మొదలైంది. ప్రతిశాసనంలో మొదటి వాక్యం దేవనంపియే పియదసి లజ” అని ఉండటం ప్రిన్సెప్ ను ఆశ్చర్యానికి గురిచేసేది. ఇతను రాజు అయితే ఇతని రాజ్యం భరతఖండమంతటా విస్తరించి ఉందని అర్ధమయింది కానీ దేవానంప్రియ పేరుతో ఏ రాజు పేరు హిందూ పురాణాలలోకానీ, రాజుల వంశానుక్రమణికల్లో కానీ ఎక్కడా ఎంతవెతికిన కనిపించలేదు.

4. ఆ రాజు ఎవరు అనే దానికి సమాధానం - శ్రీలంకలో 3 వ శతాబ్దంలో పాలిభాషలో రచింపబడిన దీపవంశ అనే గ్రంథంలో లభించింది. దీపవంశ గ్రంథాన్ని శ్రీలంకలోని బ్రిటిష్ అధికారి George Turnour అనువదించాడు. అందులో “Piyadassi … who, the grandson of Chandragupta, and own son of Bindusara” అనే వాక్యాన్ని పరిశీలించమని అతనే స్వయంగా ప్రిన్సెప్ కు పంపించాడు. దాన్ని వివరిస్తూ George Turnour స్వయంగా ఆసియాటిక్ జర్నల్ లో ఒక వ్యాసం రాసాడు [8]. అలా దేవనంపియే పియదసి అనే వాక్యం అశోక చక్రవర్తిని సంబోధిస్తున్నదని నిర్ధారణ అయింది [9] .

5. బ్రాహ్మి లిపికి పాలి భాషతో ఉన్న సంబంధాన్ని గ్రహించిన జేమ్స్ ప్రిన్సెప్, పాలి భాష తెలిసిన రత్న పౌల అనే సహాకుడినిపెట్టుకొని బ్రాహ్మి లిపిని సంపూర్ణంగా డెసిఫర్ చేసాడు. ఆ తరువాత బ్రాహ్మికి దగ్గరగా ఉండే ఖరోష్టి లిపిని కూడా పరిష్కరించాడు.

6. 1837 లో ప్రిన్సెప్ ఫిరోజ్ షా స్తంభంపైన ఉన్న మొత్తం ఏడు అశోకశాసనాలను పూర్తిగా పరిష్కరించి ఆసియాటిక్ జర్నల్ లో ఒక పత్రం ప్రచురించాడు [10]

7. అప్పటికి నలభై ఏళ్ళుగా అసియాటిక్ సొసైటీ లైబ్రేరీలో పడి ఉన్న గయ వద్దలభించిన రెండు అశోకుని శాసనాలను జేమ్స్ ప్రిన్సెప్ పరిష్కరించి 1837 లో ప్రచురించాడు [11]. ఇది అశోకుడి మనవడైన ధశరధ అనే మగధ రాజు వేయించిన శాసనము.

8. వివిధ శాసనాల ఆధారంగా అశోకుని పాలనలో జరిగిన ప్రముఖ ఘట్టాలను గుర్తించాడు.

9. ప్రిన్సెప్ వివిధ శాసనాలను పరిష్కరించుకొంటూ వెళుతున్న దశలో అన్నిచోట్లా మొదటి వాక్యం “దేవనంపియే పియదసి లజ” (Beloved of Gods, king Piyadasi) అంటూ మొదలై చివరి వాక్యం “హవం అహ” (Thus spake) తో ముగిస్తుందని గమనించాడు. ఈ రెండు వాక్యాలను కలపితే సంపూర్ణ అర్ధం ఇలా వస్తుంది. Thus spake King Piyadasi, Beloved of the Gods. (దేవునిచే ప్రేమించబడిన రాజు, పియదాసి ఇలా అన్నాడు)
***
.
5. అర్ధాంతర నిష్క్రమణ
.
1838 నుంచి జేమ్స్ ప్రిన్సెప్ ఆరోగ్యం క్షీణించసాగింది. మొదట్లో విపరీతమైన తలనొప్పి జ్వరం వచ్చేది. ఇతని వైద్యుడు అది Bilous affection (పైత్యసంబంధి) గా భావించి అలా మందులు ఇచ్చాడు. ఏమాత్రం మెరుగుదల రాలేదు.

వాతావరణ మార్పు జరిగితే ఆరోగ్యం కుదుటపడొచ్చుననే ఆశతో జేమ్స్ ప్రిన్సెప్ తన పరిశోధనా ప్రణాళికలన్నీ హఠాత్తుగా నిలుపుచేసి ఇంగ్లాండుకు బయలుదేరాడు. సముద్రప్రయాణం, ఉప్పుగాలి ఇతని ఆరోగ్యాన్ని మరింత క్షీణింపచేసింది. బాగా కృశించిన స్థితిలో ఇంగ్లాండు చేరాడు. ఒక ఏడాదిపాటు తన సోదరి వద్ద ఉన్నాడు మెదడుకు సంబంధించిన వ్యాధి ముదిరిపోవటంతో 22 ఏప్రిల్, 1840 న నలభయ్యవ ఏట తుదిశ్వాస విడిచాడు.

ఇతను భారతదేశంలో గడిపిన ఇరవై సంవత్సరాలు గొప్ప ఫలవంతమైనవి.

జేమ్స్ ప్రిన్సెప్ మరణవార్త విన్న మిత్రులు చాలా విచారించారు. అందరూ పూనుకొని జేమ్స్ ప్రిన్సెప్ స్మారకార్థం గంగానది ఒడ్డున జేమ్స్ ప్రిన్సెప్ పేరిట ఒక చక్కని భవనాన్ని నిర్మించారు. ఇది నేటికీ కలకత్తాలో ఒక పర్యాటక ప్రదేశంగా నిలిచి ఉంది. అతని పరిశోధనా పత్రాలన్నీ పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు. National Portrait Gallery (బ్రిటిష్ ప్రముఖుల చిత్రాలు కలిగి ఉండే లైబ్రేరీ) ఇతని కాంశ్య పతకాన్ని ఏర్పాటుచేసారు.

నిరంతరమైన జిజ్ఞాస, మొక్కవోని దీక్ష, ఎదురైన సమస్యను పరిష్కరించాలనే తపన, కఠోర శ్రమ తో కూడిన జేమ్స్ ప్రిన్సెప్ వ్యక్తిత్వం ఏనాటికీ ఆదర్శనీయమే. ఒక భాషను అవగతం చేసుకోవటంలో ఇతను చేసిన కృషి అసామాన్యం. దాదాపు రెండువేల సంవత్సరాలపాటు విస్మృతికి గురయిన అశోకచక్రవర్తిని, భరతఖండం దాదాపు అంతటా విస్తరించిన అతని సామ్రాజ్యాన్ని ప్రపంచానికి తెలియచేసిన జేమ్స్ ప్రిన్సెప్ కృషి చరిత్రలో నిలిచిపోయింది.

సుమారు పదిహేనువందల ఏండ్లపాటు మరుగునపడి, కల్పనలతో కట్టుకథలతో నింపబడిన భారతదేశ సాధికారిక చరిత్రను వెలికి తీసిన జేమ్స్ ప్రిన్సెప్ నిజంగానే ప్రాతఃస్మరణీయుడు.


బొల్లోజు బాబా


Foot Notes
[1] ఆసియా ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, భాషలు, శాస్త్రీయ విజ్ఞానము లాంటి అంశాలపై పరిశోధనలు జరిపే లక్ష్యంతో బ్రిటిష్ లాయర్, ఓరియంటలిస్ట్, విలియం జోన్స్ 15 జనవరి 1784 న Asiatic Society అనే సంస్థను స్థాపించాడు.
[2] Ashoka in Ancient India, Nayanjot Lahiri pn 300
[3] Asoka and the Decline of the Mauryas, 2012 Romila Thaper, Preword Asoka pn 8
[4] Note on Inscription No.1 of the Allahabad Column, Journal of Asiatic Society of Bengal, Vol III 1834, pn.114
[5] ‘Note on the Mathiah Lath Inscription’, JASB, Vol. III, 1834.
[6] Volume 5 of JASB in 1836
[7] J. Prinsep, ‘Note on the Facsimiles of Inscriptions from Sanchi near Bhilsa, taken by Captain Ed. Smith, and on the Drawings of the Buddhist Monument, presented by Captain W. Murray’, JASB, Vol. VI, 1837
[8] George Turnour, ‘Further Notes on the Inscriptions on the Columns at Delhi, Allahabad, Betiah, etc’, JASB, Vol. VI, 1837.
[9] నిజానికి అశోకుని పేరుకలిగిన శాసనం, 1915 లో కర్ణాటక, మస్కి అనేచోట దొరికింది. ఇందులో “దేవానాం పియ అశోక” అని ఉంది. అదే విధంగా 1954 లో మధ్యప్రదేష్ , గుజ్జర వద్ద లభించిన మరొక శాసనంలో “దేవానం పియదసి అశోకరాజ” అని ఉంది..
[10] Interpretation of the Most Ancient of the Inscriptions on the Pillar called the Lat of Firuz Shah, near Delhi, and of the Allahabad, Radhia and Mattia Pillar or Lat Inscriptions which agree herewith’, JASB, Vol. VI, 1837.
[11] James Princep,Facsimiles of Ancient Inscriptions’, JASB, Vol. VI, 1837
.
References
1. Essays On The Antiquities Of India James Prinsep, Vol. I
2. Ashoka in Ancient India, Nayanjot Lahiri
3. Asoka and the Decline of the Mauryas, 2012 Romila Thaper
4. Ashoka, The search for a lost emperor' by Charles Allen
5. The search for the Buddha : the men who discovered India's lost religion by Allen, Charles
6. Journal of Asiatic Society of Bengal different Volumes
7. Inscriptions of Asoka vol I, by E. Hultzsch,
8.The archaelogy of South Asia, from Indus to Asoka, by Robin Conigham and Ruth Young
9. allthingsindology.wordpress
10. wiki





























Monday, December 18, 2023

Bharhut స్తూపంపై ఉన్నది రామాయణ ఘట్టమా?


"Bharhut స్తూపంపై చెక్కిన దశరథ జాతక కథ ద్వారా రాముని కథ BCE రెండో శతాబ్దం నుంచి భారతదేశంలో ప్రబలంగా ఉంది" అనే వికీ వాక్యం ఆకర్షించింది. ఎందుకంటే రామునికి సంబంధించిన ఐకనోగ్రఫీ CE 5/6 శతాబ్దాలనుంచి లభిస్తుంది. అంతక్రితపు స్పష్టమైన శిల్పాలు కానీ చెక్కుడు రాళ్ళు కానీ కనిపించవు. ఈ నేపథ్యంలోంచి చూసినపుడు పై వాక్యం ఆశ్చర్యం కలిగించకమానదు.
***

1. దశరథ జాతకకథ.
.
BCE మూడవ శతాబ్దపు దశరథ జాతకకథలో దశరథ రాజుకు రామ పండిత, లక్ష్మణ అనే ఇద్దరు కొడుకులు సీతాదేవి అనే ఒక కూతురు, మరొక భార్య వల్ల భరతుడు అనే కొడుకు కలరు. తండ్రి ఆజ్ఞపై రామపండితుడు అరణ్యవాసానికి వెళ్ళగా, భరతుడు అన్నగారైన రామపండితుడిని వెతుక్కుంటూ వెళ్ళి, రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు. తండ్రికి ఇచ్చిన పన్నెండేళ్ళు గడువు పూర్తికానందున రాజ్యానికి రాలేనని, తన పాదుకలను ఇచ్చి భరతుడినే రాజ్యపాలన చేయమని కోరతాడు రామపండితుడు. వనవాసం పూర్తయ్యాక రామపండితుడు తండ్రి రాజ్యాన్ని చేపట్టి పదహారు వేల ఏండ్లపాటు పరిపాలించాడు.
పై బౌద్ధ జాతక కథలో సీతాపహరణ ఘట్టం లేదు. రావణుడు లేడు. రామరావణ యుద్ధం, ధర్మసంస్థాపన లాంటివి కూడా లేవు.
***

2. స్త్రీని అపహరించుకొనిపోతున్న యక్షుడు
.
కౌశాంబి లో దొరికిన BCE ఒకటవ శతాబ్దానికి చెందిన ఎర్రమట్టి ఫలకపై, ఒక యక్షుడు ఒక స్త్రీని ఎత్తుకొని పోతున్నట్లు ఉంది. ఈ ప్రతిమలో - ఆ స్త్రీ యక్షుని కబంధ హస్తాలలోంచి తప్పించుకోవటం కొరకు పెనుగులాడుతున్నట్లు కనిపిస్తుంది. చెట్ల ఆకుల మధ్యలోనుంచి ఒక కోతి తొంగి చూస్తుంటుంది. ఆ స్త్రీ కర్ణాభరణం ఒకటి నేలపై పడి ఉంది. దుష్ప్రవర్తన కలిగిన పురుషులు, స్త్రీలను ఎత్తుకుపోవటం అనేది ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో కనిపించే ఒక నెరేటివ్.
ఈ ఎర్రమట్టి ఫలకలో చిత్రించిన "యక్షుడు స్త్రీని అపహరించుకు పోయే ఘట్టం" రామాయణంలోని సీతాపహరణంతో సరిపోలుతుంది. మరీ ముఖ్యంగా అపహరణ సమయంలో సీతామాత వానరములను చూసి వాటికి లభించేటట్లు ఆభరణాలను జారవిడవటం.
ఈ నెరేటివ్ ఆకాలపు ఏదో ఒక జానపద కథ అయి ఉండవచ్చు. లేదా నేడు లభించని ఏదో బౌద్ధ జాతకకథ అయినా కావొచ్చు.
***
CE 500 లో అప్పటికే జనశృతిలో ఉన్న రామాయణ గాథను లిఖితరూపంలోకి తీసుకురావటం జరిగింది. [1] అంటే BCE మూడో శతాబ్దపు దశరథ జాతక కథను, BCE ఒకటో శతాబ్దపు "yakṣa abducting a woman" అనే కథను, ప్రేరణగా తీసుకొని దానికి ధర్మ సంస్థాపనను వెన్నుగా నిలిపి, అనూచానంగా వస్తున్న రామాయణ ఐతిహ్యాన్ని కావ్యంగా లిఖించి ఉంటారు.
ఆనాటినుంచి రామాయణ కథ భారతదేశ నలుచెరగులా విస్తరించి దేశప్రజలందరిని కలిపి ఉంచే ఒక ఉమ్మడి భాషగా, ఈ నేల జీవనవాహినిగా, ఒక ఉమ్మడి ఆత్మగా రూపుదిద్దుకొంది.
***
.
"Bharhut స్తూపంపై చెక్కిన దశరథ జాతక కథ ద్వారా రాముని కథ BCE రెండో శతాబ్దం నుంచి భారతదేశంలో ప్రబలంగా ఉంది" అనే వికిపీడియాలోని వాక్యం Mandakranta Bose (2004) రాసిన The Ramayana Revisited అనే పుస్తకంలోనిది. ( The earliest Sculptural evidence of Rama theme can be traced to the depiction of the Dasaratha Jataka in the reliefs of Bharhut, dating from second centuary BCE. పే.337 ).
రామాయణానికి ప్రాచీనత కల్పించటానికి తీసుకొన్న ఒక పోలిక అది. Bharhut స్తూపంపై లభిస్తున్న ఒక చెక్కుడు శిల్పం (కన్నింగ్ హామ్ ప్లేట్ నం. 27) దశరథ జాతక కథతో పోలుతున్నది అని మొదటగా ప్రతిపాదించినది భారతదేశ పురావస్తు శాస్త్ర పితామహుడిగా పేరొందిన అలెగ్జాండర్ కన్నింగ్ హామ్.
ఆ చెక్కుడు శిల్పంలో ఉన్నది దశరథ జాతక కథ అనే ప్రతిపాదన తప్పు అని, ఆ ప్లేట్ ఇంకా గుర్తించవలసి ఉంది అని భావిస్తున్నానని రష్యన్ ప్రొఫసర్ von Oldenburg అప్పట్లోనే అభిప్రాయపడ్డాడు.
ఆ చెక్కుడు శిల్పంలో ఉన్నది దశరథ జాతక కథ కాదని అది మహాబోధి జాతక కథ అని E. HULTZSCH, అనే చరిత్రకారుడు Jātakas of Bharaut అనే వ్యాసంలో వెల్లడించాడు. [2]
****

3. Bharhut స్తూప చెక్కుడు శిల్పంపై ఏముంది?
.
ఈ శిల్పంపై ఒక కుక్క, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.
ఒక వ్యక్తి సన్యాసి దుస్తులు ధరించి ఒక చేతితో గొడుగు, పాదుకలు మరొక చేతితో ఏదో సంచి తగిలించిన దండము పట్టుకొని ఉంటాడు.
మరొకవైపున రాజదుస్తులు, ఆభరణాలు ధరించిన స్త్రీ, పురుషులు ఉన్నారు.
శిల్ప మధ్యంలో ఒక కుక్క కూర్చుని ఉంది.
పై శిల్పంలో సన్యాసి దుస్తులలో ఉన్న వ్యక్తి,, రాముని పాదరక్షలు తీసుకొని వెళుతున్న భరతుడు అని; రాజ దుస్తులు ధరించిన స్త్రీపురుషులు- సీత, రాములు అని; వనవాసంలో ఉన్న సీతారాముల వద్దకు భరతుడు వచ్చి రాజ్యపాలన చేపట్టమని కోరగా, శ్రీరాముడు
సున్నితంగా తిరస్కరించి తన పాదుకలను ఇచ్చిన దశరథ జాతకఘట్టం అని, కన్నింగ్ హామ్ అనుమానపడుతూనే చెప్పాడు. (recognizable at the first glance అంటాడు)
ఆ శిల్పం లో ఉన్న వ్యక్తులు రాముడు సీత, భరతుడు కాదని, అదసలు రామాయణ ఘట్టమే అనటానికి ఈ కారణాలు చెప్పుకోవచ్చు.
మొత్తం శిల్పంలో రాముని వెంటే నిత్యం ఉండే లక్ష్మణుడు లేడు. వనవాస సమయంలో సీతా రాములు సన్యాసి దుస్తులలో ఉంటారు తప్ప రాజ దుస్తులలో కాదు. భరతుడు సన్యాసి దుస్తులలో ఉండడు. రామాయణంలో కుక్క పాత్ర లేదు.

4. మహాబోధి జాతకకథ: 

Bharhut స్తూపంపై లభించిన శిల్పంలో ఉన్నది రామాయణ ఘట్టం కాదని అది మహాబోధి జాతక కథ అని E Hultzsch అభిప్రాయపడ్డాడు.
బెనారస్ ను పాలించే రాజు చెంతకు బోధి అనే పేరుకల ఒక సన్యాసి వచ్చాడు. అతని జ్ఞానాన్ని గుర్తించిన రాజు, బోధిని తన రాజ్యంలో ఉండిపొమ్మని కోరాడు. బోధి రాకవల్ల ప్రజలు సుఖశాంతులతో జీవించసాగారు. రాజుగారి పెంపుడు కుక్క బోధికి ఎంతో దగ్గరయింది. బోధికి వస్తున్న మంచి పేరు పట్ల మంత్రులకు అసూయపుట్టింది. రాజుకు చెడ్డమాటలు చెప్పి బోధికి మరణ శిక్ష విధింపచేసారు. ఆ సంగతి తెలియని బోధి రాజమందిరానికి వచ్చినప్పుడు, ఆ పెంపుడు కుక్క అరుస్తూ బోధికి రానున్న ప్రమాదాన్ని సూచించింది. అది గ్రహించిన బోధి తన కుటీరానికి వెళ్ళి, తనకు కావలసిన గొడుగు, చెప్పులు, దండము, దుస్తుల మూటను తీసుకొని ఆ రాజ్యాన్ని విడిచి వెళిపోదామని నిశ్చయించుకొన్నాడు. ఈ లోపులో రాజు గారు తన తప్పు తెలుసుకొని బోధి వద్దకు వచ్చి క్షమాపణ కోరి అతనిని రాజ్యం వీడి వెళ్ళొద్దని ప్రార్ధించి తన గురువుగా స్వీకరించాడు.
పైన చెప్పిన శిల్పంలోని గొడుగు, పాదుకలు, దండం, దుస్తుల మూట ధరించిన సన్యాసి, మహారాజు, రాణి, కూర్చుని ఉన్న కుక్క వంటి ఆకృతులను బట్టి అది మహాబోధి జాతకకథ అని ఇట్టే పోల్చుకోవచ్చు. [3] [4]

****

Bharhut చెక్కుడు ఫలకకు రామాయణానికి ఏ రకమైన సంబంధంలేదు. కాగా ఆ చెక్కుడు ఫలక BCE రెండో శతాబ్దానికి చెందిన రామాయణ ఘట్టమని, రాముని శిల్పరూపం అంతటి ప్రాచీన కాలం నుంచీ లభిస్తున్నదని చెప్పటం అబద్దపు ప్రచారం. ఎందుకు చేస్తున్నారు అంటే CE ఐదో శతాబ్దం నుంచి మాత్రమే కనిపించే రామాయణ ఐకనోగ్రఫీ ని BCE రెండో శతాబ్దం వరకూ వెనక్కి నెట్టే ప్రయత్నమేనని అనుమానం కలగక మానదు. హిందూమతం వేల, లక్షల సంవత్సరాల క్రితానిది అని చెప్పే అనేక Textual ఆధారాలు చూపగలరు తప్ప Non Textual శిల్పశాస్త్ర లేదా ఆర్కియలాజికల్ ఆధారాలు లభించవు. భారతదేశంలో నేడు ఎక్కడ తవ్వినా ఇబ్బడిముబ్బడిగా లభించే ఆర్కియలాజికల్ ఋజువులన్నీ బౌద్ధజైనాలకు చెందినవి. హిందూమత ఋజువులు CE ఆరో శతాబ్దం తరువాతనుండి లభ్యమౌతాయి. అవికూడా బౌద్ధజైన మూలాలను కలిగి ఉండటం పరిపాటి.
 
అదే విధంగా మూడవ శతాబ్దపు నాగార్జునకొండ వద్ద లభించిన కొన్ని చెక్కుడు ఫలకలలో దశరథ జాతక కథ అని అంటారు కాని అది కూడా అనుమానాస్పదంగానే అనిపిస్తుంది.
 
***

రాముని ఆలయాలు CE ఐదో శతాబ్దం నుంచి ఉన్నట్లు శాసనాధారాలు లభిస్తున్నప్పటికీ, నేడు అవి కనిపించవు. ప్రస్తుతం దేశంలో అత్యంత పురాతనమైన రామమందిరం చత్తిస్ గడ్, రాయ్ పూర్ లో ఉన్న రాజీవ లోచన ఆలయంగా గుర్తించారు. ఇది CE ఏడో శతాబ్దానికి చెందింది.


[1] valmiki.iitk వాల్మికి రామాయణ పేరుతో ఉన్న వెబ్ సైట్
[2] Journal of the Royal Asiatic Society , Volume 44 , Issue 2 , April 1912
[3] Barhut Book II, Jataka Scenes by Benimadhab Barua, 1934, pn. 147 లో 27 వ ఫలకంలో ఉన్నది దశరథ జాతకం కాదని, అది Hultzsch చెప్పినట్లు మహాబోధి జాతక కథ అని Benimadhab Barua అభిప్రాయపడ్డారు.
[4] The Jataka or Stories of the Buddha's former birth, Vol 5, Edited by E.B. Cowell, pn 119

బొల్లోజు బాబా



Friday, December 15, 2023

Jyoti Krishan Verma కవిత్వం

.
Jyoti Krishan Verma ప్రముఖ హిందీ కవి. Khule Aakash Mein, Meethe Pani ki Matkiyan అనే రెండు సంపుటులను వెలువరించారు. ఇతని కవితలు వివిధ పత్రికలలో, సంకలనాలలో చోటు చేసుకొన్నాయి.
.
1.
భూమి
ప్రపంచంలో
అత్యంత చిన్న కవిత
ఎవరైనా రాయాలనుకొంటే
అది ఇలా రాయాలి
భూమి
Earth


2.
యుగాల క్రితం
మానవుడు
కవిత్వం రాయని
కాలమొకటి ఉండేది.
అందుకనే బహుశా
చరిత్రకారులు
దానిని
రాతియుగం అని
పిలిచి ఉంటారు
Eons Ago


3.
దుఃఖం
.
నీటి యొక్క
అతిపెద్ద దుఃఖం
దాని కన్నీళ్ళు
ఎవరికీ
కనిపించకపోవటమే
Grief


4.
ప్రేమ
నీవు చెట్టు
కొమ్మ, ఫలము అయితే
నేను
నీ వేర్లుగా ఉండాలని
కోరుకొంటాను
Love

 
5.
నది
.
ఎండిపోయిన నది వేదన తెలుసా మీకు?
తెలియక పోతే
ఒకసారి సముద్రాన్ని అడుగు
దాహానికి, తృప్తికి మధ్య
దూరాన్ని చెరిపేయడానికి
ఎంతకాలంగా అది రోదిస్తుందో.
River


6.
శిఖరం
ఎన్నో యుగాలుగా నిలబడి ఉన్న
పర్వతం
ఎవరైనా వచ్చి
తనని అధిరోహించి
దాని ఏకాకితనాన్ని దూరం చేస్తారని
ఆశిస్తుంది
ఎదురుచూపుల్లో దాన్ని కళ్ళు
శిలలైపోయాయి
దాని దేహం ఏనాడో
రాతిగా మారిపోయింది
Mountain


Original: Jyothi Krishan Verma
Translated from Hindi into English by Basudhara Roy


తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

భిన్నమతాలలో కుబేరుడు


వేదమతంలో కుబేరుడు దొంగలు, నేరస్థుల అధిపతిగా చెప్పబడ్డాడు. (శతపథబ్రాహ్మణ).
బుద్ధిజంలోని కుబేరుడిని జంభాల అంటారు. ఇతని ఎడమ చేతిలో ముంగిస లేదా నాణెముల సంచి ఉంటుంది. నాణెముల సంచి, ముంగిసలు అనేవి, సంపదలను కాపలాకాసే పాములను జయించినందుకు చిహ్నాలు. జంభాలుని కుడిచేతిలో నిమ్మకాయను (జంభర) కలిగి ఉంటాడు. బానపొట్ట, విలువైన ఆభరణాలు, పాదాలను పద్మం పై ఉంచటం ప్రతిమాలక్షణాలు.

బుద్ధిజంలో సంపదలను ఇచ్చే దైవంగా కుబేరుని కొలుస్తారు. కుబేరునికే వసుధ, పంచిక (Pancika), జంభాల అనే పేర్లు కూడా కలవు.ఇతనికి బంగారం అంటే అత్యంత ప్రీతిపాత్రం. అజంతా గుహనంబరు 1 అంతా కుబేరుడు కొలువున్న సభ గా M. Goloubew ప్రతిపాదించాడు.

హిందు, బౌద్ధ మతాలలో ఉన్నట్లుగానే కూడా సంపదలకు అధిపతిగా జైన మతంలో కూడా కుబేరుడు ఉన్నాడు. ఇతను శక్ర (ఇంద్రునికి) కోశాధికారి. ఒక చేతిలో గద, మరో చేతిలో డబ్బుల సంచి తో ఉన్న శిల్పం మధురా మ్యూజియంలో ఉంది. రాజస్థాన్ ఉదయపూర్ మ్యూజియంలో ఉన్న 8 వ శతాబ్దపు కుబేరుని శిల్పం కిరీటంపైన, వెనుకవైపున తీర్థంకరుల ప్రతిమలు గమనించవచ్చు.

మనుస్మృతి కుబేరుడుని లోకరక్షకుడు, వ్యాపారులను కాపాడే అధిపతి అని అంటుంది.యక్షులకందరకూ కుబేరుడు అధిపతి ఇతనికే ధనధ అని మరొపేరు. యక్షులకందరకూ కుబేరుడు అధిపతిహిందూ కుబేరుడు వైశ్రవసుని కుమారుడు కనుక వైశ్రవన అనే పేరు కలదు. ఇతను నరుడిని వాహనంగా కలిగి ఉంటాడు. ఉత్తర దిక్పాలకుడు

బొల్లోజు బాబా








Monday, December 4, 2023

నాగులు -ప్రాచీన భారతదేశ పాలకులు

ప్రాచీన భారతదేశాన్ని పాలించిన వారిలో నాగులు ముఖ్యమైన జాతి. సర్పారాధకులు. అనార్య, వేదపూర్వ, స్థానిక తెగలు. వీరిలో- Ahivritra, Ashwasena, Takshaka, Gonanda, Karkota, Brahmadutta, Sisunaga, Nanda, Andhra/satavahanas మొదలగు నాగజాతులు BCE 500 నుండి CE 500 వరకూ భారతదేశంలోని పలుప్రాంతాలను పాలించారు. వీరిని ”నాగులు” అని సంస్కృతంలో పిలవడానికంటే ముందు ఏ పేరుతో పిలువబడ్డారో తెలియరాదు.

సింధులోయ నాగరికత ప్రజలలో నాగారాధన ఉండేదని చెప్పే కొన్ని ముద్రలు లభించాయి.


1. సింధులోయ నాగరికత – నాగ ఆరాధన

భారతదేశానికి సంబంధించిన సామాజిక పరిణామక్రమంలో సింధులోయ నాగరికత (3300–1300BCE) అత్యంత పురాతనమైనది. ఈ కాలానికి చెందిన కొన్ని ముద్రలలో నాగ ఆకృతులు కనిపించటాన్ని బట్టి భారతీయ తాత్విక చింతనలో నాగారాధన అనేది ఒక ముఖ్యమైన భాగమని అని తెలుస్తుంది. ఒక ముద్రలో ఎద్దు తల కలిగిన ప్రధాన దైవానికి ఇరువైపులా ఇద్దరు భక్తులు చేతులుజోడించి నమస్కరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరి వెనుక ఒక్కో సర్పము నిలబడి వారి శిరస్సును కప్పుతూ ఉండటం గమనించవచ్చు.

మరొక ముద్రలో ఒక యోధుడు వృషభంతో ఆయుధంతో పోరాడుతూంటాడు. ఆ వృషభానికి వెనుక ఒక సర్పము తోకపై నిలుచుని ఉంటుంది. ఈ ముద్ర ద్వారా ఏం చెప్పదలచుకొన్నారో ఇతమిద్దంగా అర్ధం కాదు కానీ సర్పము ఒక ప్రధాన చిహ్నంగా ఉండటం నాగారాధన యొక్క ప్రాచీనతను బలపరుస్తుంది.

నాగశిల్పాలు దక్షిణభారతదేశంలో అడుగడుగునా కనిపిస్తాయి. సంతానం లేని స్త్రీలు పిల్లలు పుట్టాలని, అవివాహితులు వివాహం కావాలని మొక్కుకొని, కోరికతీరాక నాగశిల్పాలను దానం చేస్తారు. వీటిని ఎక్కువగా ఊరిపొలిమెరల వద్ద, ఆలయాలలో రావి చెట్టు కింద లేదా కోనేరు గట్టున ప్రతిష్టిస్తారు. ఈ శిలలపై నాగుపాము పడగవిప్పి, మెలికలు తిరిగి, తోకపై నిలుచున్నట్లు ఉంటుంది. లేదా జంటనాగులు పెనవేసుకొని ఉంటాయి. ఈ సంప్రదాయపు మూలాలు ఐదువేల సంవత్సరాల క్రితపు సింధులోయనాగరికతలో ఉండటం ఈ నేల పురాతనత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

2. వేదాలలో నాగుల ప్రస్తావనలు

ఋగ్వేదంలో వృత్రాసురుడు అనే వేదపూర్వుని కథ కలదు. ఇతనికి అహి అనే పేరు కూడాఉంది. వృత్ర అంటే ఆవరించుట అని అర్ధం అహి అంటే సర్పం అని. వృత్రాసురుడు వివిధ సందర్భాలలో దస్య, దాస, అసుర అనే పేర్లతో సంబోధించబడ్డాడు. ఈ వృత్రాసురుడు నదులను ఒక పెద్ద సర్పం వలే ఆవరించి వాటి ప్రవాహాన్ని నిలుపుచేసాడట. ఇంద్రుడు వృత్రుని తో హోరా హోరీ యుద్ధం చేసి, ఇతని ధాటికి తాళలేక మూర్చపోయాడు. వృత్రుడిని గెలవటం కష్టమని తలచిన ఇంద్రుడు, బ్రహ్మ సలహాతో అతనితో వెయ్యేండ్లపాటు స్నేహం చేసి దెబ్బతీసే అవకాశం కొరకు ఎదురుచూడసాగాడు. వృత్రుడు శివభక్తుడు. ఒకరోజు శివపూజమరచిన సమయంలో ఇంద్రుడు విష్ణువు సహాయంతో వృత్రుడిని సంహరించాడు.

స్థానిక జాతులు (అనార్యు/వేదపూర్వ/Indigenous people) వ్యవసాయం చేసేవారు. వృత్రునికి అహి(సర్పము) అన్న పేరు కూడా ఉంది కనుక ఇతను స్థానిక నాగజాతి నాయకుడు కావొచ్చు. వైదిక మతస్థులు (ఆర్య/Indo-Aryan) పశుపాలకులు.

ప్రవాహాలకు అడ్డుకట్టలు కట్టి నీరుమళ్ళించటం వ్యవసాయానికి అవసరం. నీటి ప్రవాహాన్ని అడ్డుకొంటున్నారనే కారణంతో స్థానిక నాగులను, వైదిక మతస్థులు శత్రువులుగా చూసేవారు. ఇంద్రుడు వేదసంస్కృతికి ప్రతినిధి కాగా వృత్రుడు స్థానికుడు.

ప్రపంచవ్యాప్తంగా లభించేసాహిత్యంలో వ్యక్తుల మధ్య యుద్ధాలు దేవుళ్లమధ్య యుద్ధాలుగా వర్ణించటం కనిపిస్తుంది. ఇంద్రుడు, వృత్రాసురుడుల మధ్య ఘర్షణ రెండు చారిత్రిక జాతుల మధ్య నీటివినియోగం కొరకు జరిగిన పోరాటంగా గుర్తించాలి.


3.వేదమత క్షీణత- నాగుల పాత్ర

వేదిక సమాజంలో మతపరమైన /ధార్మిక విషయాలను నిర్ణయించటానికి మనువును నియమించుకొనేవారు. ఇతను ఒకరకంగా మతపెద్ద. వేదికమతం ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో వరుసగా 14 మంది మనువులను నియోగించుకొన్నారు. ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరం అంటారు. మొదటి మనువు స్వాయంభువుడు కాగా పద్నాలుగవ మనువు ఇంద్రసావర్ణి. ఇతని కాలం BCE 950. మహాభారత యుద్ధం కూడా BCE 950 లో జరిగింది. నిజానికి పదిహేనవ మనువు నియామకం జరగాల్సి ఉంది. కానీ BCE 950 తరువాత వేదిక సమాజంలో పెనుమార్పులు రావటంతో పదిహేనవ మనువు నియామకం జరగలేదు. దీనికి మూడు కారణాలు ఊహించారు చరిత్రకారులు

1. మహాభారత యుద్ధం కారణంగా గొప్ప విధ్వంసం జరిగింది. వైదికమతాన్ని పోషించిన రాజవంశాలు నశించిపోయాయి. రాజాశ్రయం దూరమవటంతో వైదికమతం సమాజంలో తనపట్టును కోల్పోయింది. అలా సమాజంలో ఏర్పడిన ఖాళీని క్రమక్రమంగా నాగజాతి భర్తీచేయసాగింది.

2. మధ్య ఆసియానుండి ప్రాచీన భారతదేశంలోకి వచ్చిన వివిధ వలసలలో BCE 800-1000 మధ్యలో, పశ్చిమ ఆసియాపై అస్సీరియనులు పదే పదే చేసే దాడుల వలన అక్కడి ప్రజలు భారతదేశంకి వలస వచ్చారని Dr. Naval Viyogi అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు [1]. వీరి యుద్ధనైపుణ్యం గొప్పది అంతే కాక కొత్తగా వచ్చిన ఇనుపలోహ ఆయుధాలు వీరి బలం. వీరు వేద సంస్కృతిని వ్యతిరేకించారు. అప్పటికే స్థానికంగా ఉన్న నాగులతో వీరు కలిసిపోవటంతో నాగులు మరింత బలపడ్డారు. వేదకాలానంతర సమాజంలో వైదికమతం స్థానంలోకి నాగసంస్కృతి ప్రవేశించసాగింది.

3. వేదాలను బలంగా ఎదిరించిన జైన, బౌద్ధ శ్రమణ సంస్కృతి వృద్ధినొందింది. ఈ శ్రమణ సంస్కృతిని నాగులు ముందుగా అందిపుచ్చుకొని దానిని మరింత బలపరిచారు. ఈ కలయిక వేదమతానికి వ్యతిరేకంగా పనిచేసి దాని క్షీణతకు కారణమయ్యింది.


4. బౌద్ధంలో నాగజాతి

బౌద్ధ, జైనాలలో నాగులు ప్రముఖంగా ప్రస్తావించబడ్డారు. హిందూఇతిహాసాలు, పురాణాలు ఒక్క ఆదిశేషుడిని తప్ప, ఇతర నాగులను- అసురులు, దస్యులు, రాక్షసులు, దానవులు, దైత్యులు అంటూ వివిధ పేర్లతో సూచిస్తూ న్యూనపరుస్తాయి. బౌద్ధ సాహిత్యం అలాకాక నాగులను గొప్ప గౌరవంతో వర్ణిస్తాయి. బుద్ధుని గొప్ప భక్తిప్రపత్తులతో నాగులు కొలిచారు. బౌద్ధ సాంస్కృతిక, ధార్మిక పరిణామంలో నాగులు, నాగినినులు ప్రముఖమైన పాత్ర పోషించారని వివిధ శిల్పాలద్వారా అర్ధమౌతుంది. ఆనాటి సమాజంలో నాగజాతి నెరపిన పాత్రకు ఆర్కియలాజికల్ ఆధారాలు బౌద్ధశిల్పాలలో దొరుకుతాయి.

***
సిద్ధార్థుడు జన్మించినపుడు మొదటిస్నానం చేయించటానికి అవసరమైన నీటిని నంద, ఉపనంద అనే సర్పరాజములు ఆకాశంనుండి కలశాలతో అందించారని లలితవిస్తార గ్రంథంలో ఉన్నది. ఈ సంఘటనను తెలిపే శిల్పాలు అమరావతి, సాంచీ స్తూపాలలో లభించాయి. ఈ ఉదంతం ద్వారా నాగులు బుద్ధుడు జన్మించినప్పటినుంచే ఆయనతో బంధాన్ని కలిగి ఉన్నారని తెలుపుతుంది
***
బోధివృక్షం క్రింద జ్ఞానోదయం అయిన అనంతరం ఉపవాసాన్ని ముగించేందుకు - బుద్ధభగవానునికి సుజాత అనే భక్తురాలు ఒక బంగారు పాత్రలో క్షీరాన్నం ఇచ్చింది. బుద్ధుడు నైరంజన నదిలో స్నానమాచరించి ఒడ్డుపై కూర్చున్నాడు. ఆ నది నాగులకు ఆవాసము. అచ్చట కొలువున్న నాగరాజు కుమార్తె బుద్ధభగవానుడు కూర్చునేందుకు ఒక బంగారు ఆసనాన్ని వేసింది. దానిపై కూర్చుని క్షీరాన్నాన్ని తిని ఖాళీపాత్రను నదిలోకి విడిచిపెట్టాడు. ఆ పాత్రను సాగరుడనే నాగరాజు తన నివాసంలో పూజామందిరంలో పెట్టుకొందామని తీసుకొని వెళుతుండగా, ఇంద్రుడు ఒక గద్దరూపంలో వచ్చి ఆ భిక్షాపాత్రను ఎత్తుకుపోవటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించకపోవటంతో ఇంద్రుడు తన నిజరూపాన్ని ధరించి బుద్ధభగవానుడు క్షీరాన్నం తిన్న పాత్రను తనకు ఇవ్వమని ప్రాధేయపడి దాన్ని దక్కించుకొని-స్వర్గంలో ఆ పాత్రను గొప్ప ఆనందోత్సాహాలతో ప్రతిష్టించి ప్రతిఏటా ఉత్సవము జరిపించసాగాడు. బుద్ధుడు కూర్చున్న బంగారు ఆసనాన్ని నాగరాజు కుమార్తె భద్రపరచి నిత్యంపూజలు జరిపించేది.

బౌద్ధం ప్రారంభదశలలో భిక్షాపాత్ర, వజ్రాసనము చిహ్నాలు బుద్ధునికి మారు రూపాలుగా పూజలందుకొన్నట్లు అనేక శిల్పాలలో కనిపిస్తుంది. బోధగయలో అశోకుడు నిర్మించాడని చెప్పబడే ఒక వజ్రాసనము నేటికీ ఉన్నది. అదే విధంగా బుద్ధుని భిక్షాపాత్రగా భక్తులు విశ్వసించే ఒక రాతిపాత్ర కాబూల్ నేషనల్ మ్యూజియం లో కలదు.

పై కథనం ద్వారా నాగజాతి బుద్ధుని పట్ల ప్రదర్శించిన అవ్యాజమైన భక్తి ప్రపత్తులు తెలుస్తాయి.

***
బుద్ధభగవానుడు బోధి వృక్షం కింద తపస్సు చేసుకొంటున్న సమయంలో భీకరమైన గాలులతో కూడ కుంభవృష్టి కురవసాగింది. ముచిలిందుడనే నాగరాజు భగవానునికి శీతవాతాదులవల్ల బాధ కలగకూడదని, తన దేహంతో ఆయనను చుట్టి, తలపై పడగలను విప్పి, ఏడురోజులపాటు సంరక్షించాడు. వాన తగ్గాక, ముచిలింద నాగరాజు తథాగతుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరించి మూడు సార్లు ప్రదక్షణం చేసి వెనుతిరిగాడు.

***
బుద్ధుడు పరినిర్వాణం పొందినపుడు అతని దేహ అవశేషాల కొరకు ఆనాటి సమకాలీన ఎనిమిది మంది రాజులు యుద్ధానికి దిగారట. ద్రోన అనే బ్రాహ్మణుడు (Brahmin Drona) మధ్యవర్తిత్వం వహించి అవశేషాలను ఎనిమిది సమ భాగాలుగా చేసి ఇవ్వటంతో యుద్ధం ఆగిందని “మహాపరి నిర్వాణ సూత్ర” గ్రంథంలో చెప్పబడింది. ఆ ఎనిమిది అవశేషాలను ఆయా రాజ్యాల ప్రధాన పట్టణాలకు పంపి స్తూపాలను నిర్మించారు. అవి- రాజగృహ, వైశాలి, కపిలవస్తు, అల్లకప్ప, రమగ్రమ, పావ, కుశినగర్, వేతాదిప లు.

ఆ తరువాత బుద్ధుని ధాతువులు ఉన్న 8 స్తూపాలను అశోకుడు తెరచి ఆ ధాతువులను విభజించి వాటిపై 84 వేల స్తూపాలను నిర్మించదలిచాడు. ఏడు స్తూపాలను తెరచి వాటిలోని ధాతువులను సేకరించగలిగాడు అశోకుడు. నేపాల్ వద్ద ఉన్న Ramagrama స్తూపాన్ని తెరవటానికి ప్రయత్నించగా ఆ స్తూపాన్ని పరిరక్షిస్తున్న “నాగ” పేరుగల రాజు అభ్యంతరం తెలియచేసాడు. అశోకుడు నాగ రాజు విశ్వాసాలను గౌరవించి ఆ ఎనిమిదవ Ramagrama స్తూపాన్ని తెరవలేదు. ఈ మొత్తం ఉదంతం అమరావతి స్టోన్ స్లాబ్ (relief )చెక్కుడు శిల్పం గా చెప్పబడింది. ఈ శిల్పంలో- ఐదు తలలు కలిగిన మూడు సర్పాలు స్తూపాన్ని చుట్టుకొని దానికి రక్షణగా కల్పిస్తుంటాయి; స్తూపానికి ఇరువైపులా నాగరాజ దంపతులు ఉన్నారు; నాగరాణి చేతులు జోడించి స్తూపానికి నమస్కరిస్తుండగా, నాగరాజు పూలగుత్తినిచేత ధరించి ఉంటాడు, యజ్ఞోపవీతం ఉంది; స్తూపం దిగువన నాగినిలు శిరస్సు వంచి ప్రార్థిస్తుంటారు.

ఎలాపత్ర అనే నాగరాజు బుద్ధునిబోధనలను పాటించాడు. తధాగతుని నిర్వాణం అనంతరం ఎలాపత్ర బుద్ధ ధాతువులను దక్కించుకొన్నాడని హ్యుయాన్ త్సంగ్ తన యాత్రా కథనంలో వర్ణించాడు.

***
బుద్ధుడు సింహళద్వీపం వెళ్ళినపుడు అక్కడ మహోడరుడను నాగరాజు పాలిస్తూ ఉన్నాడు. బుద్ధుడు బౌద్ధ ధర్మమును ప్రచారం చేసి ఎనుబది కోట్ల నాగులను బౌద్ధులుగా మార్చాడని రత్నాకరి, రాజావళి బౌద్ధ చరిత్ర లాంటి బౌద్ధ సాహిత్యంలో చెప్పబడింది.

5. జైనం లో నాగులు


కామత్ అనే ఒక యోగి కట్టెలను మండిస్తూ యాగాన్ని నిర్వహిస్తుండగా, అలా మంటలతో యాగం నిర్వహించటం వల్ల జీవరాశి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని- అప్పటికి తీర్థంకరునిగా ఇంకా మారని పార్శ్వనాథ యువరాజు ఆ కామత్ ను వారించాడు . అలా మండుతున్న ఒక కట్టెలోంచి వేడిని తాళలేక రెండు పాములు బయటకు వచ్చి చనిపోయాయి. ఇవి తదుపరి జన్మలో నాగలోకంలో ధరణేంద్ర, పద్మావతి గా తిరిగి జన్మించాయి. కామత్ కూడా మేఘాలను శాసించే మేఘమాలిగా జన్మించాడు.

పార్శ్వనాథ యువరాజు ముప్పై ఏండ్లవయసులో ఈ లోకాన్ని పరిత్యజించి పార్శ్వనాథునిగా అవతరించాడు. ఒకనాడు ఈయన తపస్సు చేస్తున్నపుడు మేఘమాలి భీకరమైన వర్షాన్ని, ఉరుములను తీవ్రమైన వరదను పంపించి తపోభంగం కావించాలని ప్రయత్నించాడు. నాగలోకపు రాజు అయిన ధరణేంద్రుడు ఆ ఉత్పాతం నుండి పార్శ్వనాథుని పైకి లేపి, తన పడగలతో గొడుగుపట్టి కాపాడాడు. అందుకు గాను పార్శ్వనాథుడు ఆమెకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. ఏదేని తీర్థంకరుని తలపై ఏడు పడగల సర్పం ఉంటే ఆ విగ్రహం పార్శ్వనాథునిదని ఇట్టే గుర్తించవచ్చు. ధ్యానం చేసుకొనే జైన తీర్థంకరులను సంరక్షించే దైవంగా సర్పానికి గౌరవ స్థానం ఇచ్చింది జైనమతం

6. బ్రాహ్మణవాద పురాణాలు -నాగజాతి

డా. అంబేద్కర్ బౌద్ధధర్మాన్ని స్వీకరించేటపుడు చేసిన నాగపూర్ ప్రసంగంలో- “బౌద్ధధర్మాన్ని తొలుత ప్రచారం చేసిన వారు నాగులు. వీరు ఆర్యులతో ఎన్నో యుద్ధాలు చేసారు. నాగజాతిని సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నంలో ఆర్యులు నాగులను మంటల్లో వేసి తగలబెట్టగా మిగిలిన వారి సంతతే మనం” అన్నారు

బ్రాహ్మణవాదం, బౌద్ధానికి మద్య మతపరమైన వైరుధ్యాలుండటంతో అవి ఒకదానినొకటి ఘర్షించుకొంటూ మనుగడసాగించాయి. నాగులు బౌద్ధాన్ని స్వీకరించారు. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా చరిత్రలో పోరాడారు.

గుప్తుల పాలనలో బుద్ధిజం రాజాదరణకోల్పోయింది. బ్రాహ్మణవాదం ప్రోత్సహించబడింది. CE 335 లో సముద్రగుప్తుడు పాలన చేపట్టాక అత్యుత, నాగసేన వంటి ప్రముఖ నాగవంశ రాజులు పదమూడు మందిని నిర్మూలించాడు[1]. సంఘజీవనంలో కులాధారిత ఫ్యూడల్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. బౌద్ధమతాన్ని పోషించిన Craftguilds నాశనం చేసాడు. ఇక ఎప్పటికీ కోలుకోలేని విధంగా భారతదేశ ఆర్ధికవ్యవస్థ, రక్షణ వ్యవస్థల వెన్ను విరిచాడు. ఆ కారణంగా దేశప్రజలు బానిసత్వంలోకి, పేదరికంలోకి, అసమానతలలోకి, వెలివేతలలోకి బలవంతంగా నెట్టబడ్డారు. భారతదేశ చరిత్రలో అప్పటినుంచి చీకటిరోజులు ప్రారంభమైనాయి. విజేతలు రాసిన చరిత్ర కనుక గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణించారు. గుప్తులకాలంలో వివిధ బ్రాహ్మణవాద పురాణాల రచన ప్రారంభమై పదోశాతాబ్దంవరకూ కొనసాగింది. ఈ పురాణాలు-అంతవరకూ ప్రధాన ఆరాధనా విధానాలుగా కొనసాగిన బౌద్ధ, జైన, చార్వాక దర్శనాలను ఖండిస్తూ, కొన్నిచోట్ల వాటిలోని ముఖ్య అంశాలను అప్రాప్రియేట్ చేసుకొంటూ కథలు, కల్పనలతో నిండి ఉంటాయి.

ఈ బ్రాహ్మణవాద పురాణాలలో బౌద్ధాన్ని ఆదరించిన నాగవంశ రాజులను- రాక్షసులుగా, పరాజితులుగ, బానిసలుగా, అసురులుగా వర్ణించారు. పురాణాలను, ఇతిహాసాలను పూర్తి కల్పనలుగా కొట్టిపడేయలేం. ఇవి ప్రతీకాత్మకంగా చెప్పబడిన చారిత్రిక అంశాలు అయిఉండే అవకాశాలు ఎక్కువ. ఈరోజు మనం గతంతో డిస్ కనక్ట్ అయి పోవటంవల్ల ఇవి పూర్తి ఊహాజనితాలుగా అనిపించటం సహజం.

***
మహాభారత కథలో ఉద్దేశపూర్వక నాగజాతి హనన ప్రయత్నాలు రెండు కనిపిస్తాయి. ఒకటి జనమేజయుడు సర్పయాగం చేసి నాగజాతిని అంతమొందించటం. రెండు ఖాండవవన దహనం ద్వారా అక్కడ నివశించే నాగజాతిని నిర్మూలింపచూడటం.

కశ్యపమునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు. కద్రువ అండములు పగిలి వేయిమంది పిల్లలు సర్పములుగా జన్మించారు.. అండములు ఎంతకీ పగలకపోవటంతో ఉత్సుకత ఆపుకోలేక వినత ఒక అండాన్ని పగలగొట్టగా, ఆ గుడ్డులోంచి సగమే తయారైన శిశువు వచ్చాడు. ఇతను సూర్యుని రధసారధి అయిన అనూరుడు. రెండవ గుడ్డునుండి వచ్చినవాడు గరుత్మంతుడు.

కద్రువకు జన్మించిన వేయిమంది సర్పములు- శేషుడు, వాసుకి, ఐరావతము, తక్షకుడు, కర్కాటకుడు, ధనుంజయుడు, కాళియుడు, మణినాగము, పూరణుడు, పింజరకుడు, ఏలాపాత్రుడు మొదలనవారు. వీరిలో శేషుడు తప్ప మిగిలినవారు వివిధ పురాణాలలో అనేక రకాలుగా పరాజితులైనట్లు వర్ణించబడ్డారు. వీటన్నిటినీ నాగ సంస్కృతిపై బ్రాహ్మణవాదం జరిపిన దాడులుగా, అణచివేతగా అర్ధం చేసుకోవాలి. ఓడినవారి చిహ్నాలు విజేతలు గ్రహించటం ఒక ఆచారం. అలా నాగచిహ్నం అయిన సర్పం – విష్ణువు శయనించే శేషపాన్పు అలా బ్రాహ్మణవాద మతం లోకి వచ్చి చేరిఉంటుంది.

***
కద్రు కొడుకు కాళీయుడు. ఇతను గరుడునితో చేసిన యుద్ధంలో ఓడిపోయి కాళింది అనే మడుగులో తలదాచుకొన్నాడు. మడుగులోని నీరు కాళీయుని వల్ల విషపూరితమవుతుందనే కారణంతో కృష్ణుడు కాళీయుడిని మర్ధించి ఓడించాడు. కాళీయుడు అతని భార్యలు శ్రీకృష్ణుని శరణువేడగా, అతనిని కాళింది నుంచి రమణక ద్వీపానికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడ గరుడుని వల్ల తనకు ప్రమాదం ఉందని కాళీయుడు చెప్పగా, “నీ శిరస్సుపై నా పాదముద్రలు (Spectacle marks on hood) ఉన్నాయి కనుక వాటిని చూసి గరుడుడు నీకు హాని కలిగించడు” అని అభయం ఇవ్వటంతో కాళీయుడు కాళింది మడుగును ఖాళీ చేసి రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు.

ఈ కథ ఎంత హృద్యంగా అనిపించినప్పటికీ నాగులను ఒకచోటినుంచి మరొక చోటికి వెళ్ళగొట్టి తనకు విధేయులుగా చేసుకోవటం అనే విషయం అంతర్లీనంగా ధ్వనిస్తుంది.

***
మహాభారత యుద్ధం తరువాత జరిగిన కథ సర్పయాగం. అభిమన్యునికి, ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షితుడు. ఇతను శాపవశాత్తూ తక్షకుడనే సర్పము కాటు చేత మరణించాడు. పరీక్షితుని కుమారుడు జనమేజయుడు. తన తండ్రిని చంపినందుకు ప్రతీకారముగా ఇతను నాగులందరిని అంతరింపచేయటం కొరకై సర్పయాగం తలపెట్టాడు. సర్పయాగం అంటే లోకంలోని పాములను అగ్నిలో కాల్చి నశింపచేయటం. మంత్రాలకు పాములన్నీ వచ్చి యజ్ఞగుండంలో పడి చనిపోతూ ఉన్నాయి. సర్పయాగ లక్ష్యం తక్షకుడు. అతను ఇంద్రుని శరణుకోరటంతో ఇంద్రునితో సహా వచ్చి యజ్ఞగుండంలో పడి నశించే సమయంలో- ఆస్తీకుడు అనే ఋషి వచ్చి జనమేజయుని సమాధానపరచి అతని చేత సర్పయాగం మానిపించాడు. అలా నాగజాతి సమూల హననం నివారించబడింది.

భారత యుద్ధ అనంతరం ఏర్పడిన అరాజక వ్యవస్థ వల్ల ఉత్తరపశ్చిమ భారతదేశంలో నాగుల సంఖ్య పెరిగింది. ఈ సమయానికి సరస్వతి, గంగ నదుల మధ్య భూభాగమైన పౌరవరాజ్యాన్ని, అర్జునుడి మనవడు పరీక్షితుడు పాలిస్తున్నాడు. గాంధార ప్రాంతంలో బలంపుంజుకొన్న నాగులు, ఈ పరీక్షితుని ఓడించి ఉంటారు. దీనికి ప్రతిగా పరీక్షితుని కుమారుడు జనమేజయుడు నాగవంశాన్ని నిర్మూలించటానికి చేసిన జాతిహననం ప్రయత్నమే ఈ సర్పయాగం కావొచ్చు. ఇదొక ప్రతీకాత్మక కథనం. కాగా, ఈ కథ విన్నవారికి సకలసంపదలు కలుగుతాయని, సర్పబాధలు తొలగుతాయని బ్రహ్మణవాద కవులు ప్రచారించుకొన్నారు.

***

శ్వేతకి అనే మహారాజు వందేళ్లపాటు చేసిన ఒక బృహత్తర యజ్ఞంలో పోసిన ఆజ్యం అరగక అగ్నిదేవునికి అజీర్తి చేసింది. బ్రహ్మదేవుని పరిష్కారం అడుగగా, దివ్యఓషదులు అలాగే దేవతలకు శత్రువులైన కొన్ని జంతువులు ఉన్న ఖాండవ వనాన్ని దహించితే నీకు స్వస్థతకలుగుతుంది అని చెప్పాడు. ఖాండవవనం నాగులకు నాయకుడైన తక్షకుడు, తన అసంఖ్యాకమైన అనుచరులతో ఉండే నివాస స్థలం. అగ్నిదేవుడు అర్జునుని సహాయంతో ఖాండవవనాన్ని దహించసాగాడు. అగ్నికీలలలో దహించబడుతూ అనేక సర్పములు ప్రాణభీతితో పరుగులు పెట్టాయి. వాటిని అర్జునుడు తన బాణములతో సంహరించాడు. తక్షకుని భార్య, కొడుకు అశ్వసేనుడు ఖాండవవనంలో చిక్కుకొన్నారు. వారిని కూడా అర్జునుడు చంపబోతే గురితప్పి వారు ప్రాణాలు దక్కించుకొన్నారు. ఈ మొత్తం హననానికి లక్ష్యమైన తక్షకుడు ఆ సమయంలో ఖాండవవనంలో కాక మరొకచోట ఉండటం వల్ల ప్రాణాలు దక్కించుకొన్నాడు.

పై ఉదంతం మొత్తం బ్రాహ్మణవాదమతానికి, నాగజాతికి మధ్య జరిగిన ఘర్షణ. జాతిహనన ప్రయత్నం. ఖాండవవనంలో దేవతలకు శత్రువులైన కొన్ని జంతువులు ఉంటున్నాయని బ్రహ్మ దేవుడు అన్న వాక్యం నాగుల గురించే. బ్రాహ్మణీయ సాహిత్యం నాగులను శత్రువులుగాను, జంతువులుగాను చూసింది. ఖాండవదహనం చేసి ఆక్రమించిన నాగుల రాజ్య స్థానంలో, పాండవులు అక్కడ ఇంద్రప్రస్థ అనే నగరాన్ని నిర్మించటం నాగుల అణచివేతలో భాగం. బహుసా ఈ కారణంతోనే నాగులు మహాభారతయుద్ధంలో కౌరవులతరపు పోరాడారు.

***
మానస శివుని కుమార్తె. ఈమె పార్వతీదేవికి జన్మించలేదు. నాగుల తల్లి అయిన కద్రు ఆడపిల్లలు లేరు అని చింతిస్తూ చెక్కిన ఒక శిల్పంపై శివుని వీర్యం పడటం వలన ఈమె జన్మించినది అని ఐతిహ్యం. ఈమె సోదరుడు పేరు వాసుకి. ఈమెకు జరత్కారుడు అనే ఋషితో తో పెండ్లి జరిగింది. మానస కోపధారి కావటంచే భర్త, తండ్రి, పార్వతి ఆమెను విడిచిపెట్టేసారు.

మానసాదేవి జరత్కారుడుల కొడుకు ఆస్తీకుడు. జనమేజయుడు తలపెట్టిన సర్పయాగం వల్ల నాగవంశం అంతరించిపోతున్న సమయంలో ఈ ఆస్తీకుడు జనమేజయుడిని తన పాండిత్యంతో మెప్పించి అంతవరకూ జరుగుతున్న సర్పహవనాన్ని నిలుపు చేయించాడు. అలా నాగజాతి అంతరించిపోకుండా కాపాడాడు.

బెంగాలులో మానసను భక్తితో కొలుస్తారు. ఈమెకు రూపం లేదు. సర్పాకృతిని కానీ చెట్టుకొమ్మను కానీ మానసాదేవిగా భావించి పూజిస్తారు. ఈమె పాముకాటునుండి కాపాడేదేవతగా, కాలక్రమేణా మసూచికి, ఆటలమ్మ వ్యాధులను నయంచేసే దేవతగా పూజింపబడుతున్నది.

సామాన్య జనులలో నాగ సంప్రదాయం ఎలా చొచ్చుకొని పోయిందో మానస కథ తెలియచేస్తుంది. నాగులలో వాసుకి, శేషుకి వంటివారు మంచి నాగులుగా వినుతినెక్కి, బ్రాహ్మణవాద సాహిత్యంలో గౌరవప్రదమైన పాత్రలు పొందారు. కశ్యప, కద్రుల పుత్రులలో పెద్దవాడయిన శేషుకి తమ్ముళ్లతో కలవక విడిగాఉంటూ భక్తి ప్రపత్తులతో జీవించేవాడు. ఇతని నడవడికను మెచ్చిన బ్రహ్మదేవుడు, ఈ భూమిని సంరక్షించే అనంతునిగా, విష్ణుమూర్తి శయనించే తల్పంగా ఉండే వరాలు ఇచ్చాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను సర్పాలలో వాసుకిని అంటాడు

వాసుకి నాగలోకానికి రాజు. శేషుని తమ్ముడు. పరమశివుని మెడను అలంకరించే అర్హత పొందాడు. అలా కొందరు మంచి సర్పాలకు ప్రతీకగా మిగిలితే తక్షకుడు చెడు సర్పానికి ప్రతీకగా చిత్రించబడ్డాడు. బహుశా ఆనాటి సమాజంలో ఒకే సమూహంలో భిన్న దృక్ఫథాలు కలిగి ఉండటానికి వీరు ఉదాహరణ.

***
బ్రాహ్మణవాద సాహిత్యంలో అనేకమంది వీరులు నాగకన్యలను పెండ్లాడినట్లు ఉంటుంది. ఇది బహుశా ఓడించిన రాజ్యాలకు చెందిన కన్యలను గెలిచిన రాజులు తమ అంతఃపురకాంతలుగా స్వీకరించటం కావొచ్చు. అర్జునుడు నాగకన్య ఉలూచిని పెండ్లాడాడు. కాశి రాజైన బ్రహ్మదత్తుడు నాగి ని పెండ్లాడాడు. రాముని తనయుడు కుశుడు కుముదావని అనే నాగకన్యను పెండ్లాడాడు. జరత్కారుడు వాసుకి చెల్లెలు మానసను పెండ్లాడాడు.

చారిత్రికంగా అయితే- సముద్రగుప్తుని కొడుకు చంద్రగుప్త II, కుబేర నాగ పేరుకల నాగ రాణిని పెండ్లాడాడు. పల్లవ వంశమూలపురుషుడైన అశ్వత్థామ నాగ కన్యను వివాహమాడాడని తొమ్మిదో శతాబ్దపు రాయకోట దాన శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ వివాహాలన్నీ Indo-Aryan జాతులు స్థానిక జాతులతో కలిసి కరిగిపోవటాన్ని సూచిస్తాయి.

***
7. శాసనాలలో నాగుల ప్రస్తావనలు

ప్రాచీన భారతదేశ ఆర్కియాలజి శోథనలలో ఇబ్బడిముబ్బడిగా నాగుల ప్రస్తావనలు లభిస్తాయి.

భారతదేశములో నాగారాధన ఉండేదని క్రీస్తుపూర్వపు గ్రీకు చరిత్రకారుడు Aelian ప్రస్తావించాడు. BCE 600 నుండి 300 మధ్య నాటి నాగ ముద్రలు కలిగిన అనేక పంచ్ మార్క్ డ్ నాణాలు లభించాయి.

తక్షశిల వద్ద లభించిన క్రీ.పూ మూడు/నాలుగవ శతాబ్దాలకు చెందిన నాణాలపై సర్పచిహ్నం ఉన్నది. ఇది చతురశ్రాకారపు నాణెం. దీనిపై త్రిరత్న చిహ్నము, స్తూపం, క్రింది భాగాన మెలికలు తిరిగిన సర్పచిహ్నము కలదు. (ఫొటో)

అలహాబాదుకు 30 కిమీ దూరంలోని Kosam (జైన కోశాంబి) వద్ద లభించిన క్రీపూ 200 నాటి పర్వత రాజు వేయించిన నాణాలపై సర్ప ముద్రలు కలవు[2].

BCE 150 నుంచి 100 మధ్యలో అయోధ్యను పాలించిన విశాఖదేవ, ధనదేవ, కుముదసేన[3] రాజులు వేయించిన నాణాలలో సర్పముద్రలు కలవు. కుముదసేనుడి నాణంపై ఒకవైపు నంది, సర్పముద్ర, మరోవైపున బుద్ధుని త్రిరత్న చిహ్నము గమనించవచ్చు. (చూడుడు ఫొటో)

కుషానుల తరువాత మధురను పాలించిన వీరసేనుడు (175-180 AD) నాగజాతికి చెందిన రాజు. ఇతను వేయించిన నాణాలపై నాగగుర్తులు కలవు[4].

***
BCE రెండో శతాబ్దంలో శాతవాహన చక్రవర్తి మొదటి శాతకర్ణి భార్య నాగనిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. ఈ శాసనంలో ఆనాటి నాగదేవతా ఆరాధనను nagavaradayiniya అనే వాక్యం సూచిస్తుంది. ఇదే శాసనంలో సైన్యాద్యక్షుడు పేరు nakayiro. నాగనిక, నాగవరదాయిని, నాగాయిరో లాంటి పేర్లను బట్టి శాతవాహనులు తాము బ్రాహ్మణులమని చెప్పుకొన్నప్పటికీ నాగవంశమూలాలను కలిగి ఉన్నారని తెలుస్తుంది.

CE 113 లో ఖరోష్టి భాషలో వేయించిన ఒక గాంధార శాసనంలో- థెరా నోర (Thera Nora) అనే వ్యక్తి నాగుల కొరకు ఒక చెరువును తవ్వించినట్లు ఉంది థేరనొరా ఒక గ్రీకు దేశస్థుడు. అప్పట్లో గ్రాంధార ప్రాంతంలో బుద్ధిజాన్ని స్వీకరించిన గ్రీకు, బాక్ట్రియన్ దేశస్థులు అధికసంఖ్యలో ఉండేవారు.[5]

CE మొదటి శతాబ్దాలలో మధురనుండి నాగ ఆరాధనకు సంబంధించి అనేక శాసనాలు దొరికాయి. ఒక నాగశిల్పం క్రిందిభాగంలో – మొక్కుకున్న విధంగా సంతానం కలిగినందుకు తలనీలాలు సమర్పించుకొని నాగశిల్పాన్ని ప్రతిష్టించినట్లు ఉంది.[6] . పిల్లలు లేకపోతే నాగ ప్రతిమలను దానం చేస్తానని మొక్కుకోవటం నేటికీ ఒక ఆచారంగా కొనసాగుతున్నది.

పేరు చివర నాగ అని ఉన్న జయనాగ, మహానాగ, నాగ బహుతికియ, నాగదిన, నాగదత్త, నాగవతి, నాగపియ, నాగసేన లాంటి అనేక పేర్లు వివిధ శాసనాలలో కనిపిస్తాయి.

సముద్రగుప్తుని CE 350 నాటి అలహాబాదు ప్రశస్థి శాసనంలో గనపతినాగ, నాగశేన అనే ఆర్యావర్త నాగ రాజుల పేర్లు కనిపిస్తాయి. విదిశ, మధురలలో గణపతినాగ నాణాలు కనిపించాయి. సముద్రగుప్తుని కొడుకు చంద్రగుప్త II, కుబేర నాగ పేరుకల నాగ రాణిని పెండ్లాడాడు.

CE మొదటి నాలుగు శతాబ్దాలలో భారతదేశంలోని చాలా భూభాగం నాగ కల్ట్ ప్రభావంలో ఉండేదని. ఉత్తర భారతదేశంలో మధుర, విదిశ రాజ్యాలను నాగులు పాలించారు. నాణాలను కూడా విడుదల చేసారు[7].

కాశ్మీరులో సాగిన నాగవంశ పాలనవివరాలు ఎనిమిదోశతాబ్దపు నీలమతపురాణం అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది.

దక్షిణాపథంలో పదోశతాబ్దం వరకూ కొన్ని నాగవంశాలు తమ ప్రాబల్యాన్ని నిలుపుకొన్నాయి. నాగవంశానికి చెందిన రాజులమని – కాశ్మీర, మణిపూర్, నాగపూర్, చోళులు, పల్లవులు లాంటి అనేక రాజవంశాలు తమనుతాము సంబోధించుకొన్నాయి.

కాశ్మీరరాజులు తాము కర్కోటక నాగరాజు సంతతి అని నాగపూరు రాజులు తాము పుండరీక నాగరాజు సంతతి అని చెప్పుకొనేవారు. ఎల్లోరా గుహలు, నాగార్జునకొండ, ధూళికట్ట వద్ద లభించిన బౌద్ధ శిల్పాలలోనాగరాజు ప్రతిమలు విస్తారంగా లభించాయి. నాగరాజుకు తలపై ఐదు పడగలు, నాగినికి ఒకపడగా ప్రతిమా లక్షణాలు. నాగ శిలలు, నాగకల్లులు దేశమంతటా కనిపిస్తాయి. పిల్లలు కలగటానికి, పెండ్లి అవటానికి నాగదేవతకు మొక్కుకొని నాగాకృతులు ఉన్న శిలలను దేవాలయాలలో దానం ఇవ్వటం ఒక సంప్రదాయం.

8. ఆంధ్రదేశం నాగుల దేశం

బౌద్ధసాహిత్యం ప్రకారం ఆంధ్రదేశం నాగులదేశం. శంఖపాల (SanKapala) జాతకకథలో, కృష్ణాతీరం (Kannabenna) నాగలోకమని చెప్పబడింది. అమరావతి బౌద్ధ స్తూపశిల్పాలలో తలపై సర్పం పడగ కలిగి ఉన్న స్త్రీ, పురుష రూపాలు అనేకం కనిపిస్తాయి. మూడో శతాబ్దపు బౌద్ధ రచన అయిన Gandavyuha లో మంజుశ్రీ దక్షిణాపథంలోని ధాన్యకటక లో నివసిస్తూ అక్కడ నివసించే నాగులను పెద్దసంఖ్యలో బౌద్ధంలోకి మార్చాడని ఉన్నది.

నల అనే నాగరాజు కృష్ణానదీ తీరంలో ఉన్న Maherika అనే చోట నివసించేవాడని సింహళ కథనం Mahavamsa లో చెప్పబడింది. థాయిలాండ్ ప్రాచీన Siamese సాహిత్యం క్రిష్ణా డెల్టాను నాగభూమిగా వర్ణించింది.

దీపావళి అమావస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ జరుపుకోవటం తెలుగువారి ఆచారం. ఈ పండుగను ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కొంతమేరకు కర్ణాటక, తమిళనాడులలో జరుపుకోవటం అనేది తెలుగు వారికి అనాదిగా నాగులతో ఉండిన చారిత్రిక సంబంధాన్ని తెలియచేస్తుంది.

9. ముగింపు - జన్యు శోధనలు

భారతఉపఖండంలోకి ప్రధానంగా మూడు విడతలుగా జరిగిన వలసల వలన ఇది జనావాసంగా మారింది.

65 వేలఏండ్లక్రితం “Out of Africa” వలస ద్వారా ఆఫ్రికానుంచి ప్రపంచంలోని పలు చోట్లకు ఆఫ్రికా ప్రజలు విస్తరించారు. ఇది మొదటి వలస. అలా భారతదేశంలోకి వచ్చిన “మొదటి భారతీయులు” నేటి భారతదేశ జనాభాలో 50-65% వరకూ ఉన్నారు.

రెండవ వలస 9000-5000 వేల ఏండ్ల క్రితం మధ్య ఇరాన్ పీఠభూమినుంచి వచ్చిన Iranian Agriculturalists. వీరు భరతఖండలోకి వ్యవసాయాన్ని తీసుకొనివచ్చారు. వీరి వల్ల బార్లి, గోధుమ వ్యవసాయం భారతదేశంలో విస్తరించింది. సింధులోయ నాగరికత అభివృద్ధిచెందింది.

ఇక మూడవ విడత వలస వలన భారతదేశ సాంస్కృతిక సామాజిక రాజకీయ రంగాలలో పెనుమార్పులు వచ్చాయి. IVC (సింధులోయ నాగరికత) ఆర్కియలాజికల్ తవ్వకాలలో భాగంగా హర్యానలోని రాఖిఘర్ ఇంకా ఇతర సింధులోయనాగరికత సైట్లు వద్ద లభించిన అవశేషాలపై జరిపిన DNA పరీక్షలు, ఆధునిక జన్యుశోధనల, భాషా అధ్యయనాల ద్వారా తెలుసుకొన్న విషయాలు ఇవి.[8]

1. భారతీయ ఉపఖంఢంలోకి మూడవ విడత వలస ద్వారా c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి Yamnaya Steppe pastoralist లు భారతదేశంలోకి ప్రవేశించారు . వీరు పశుపాలకులు. వీరు తమతో pre-Sanskrit and pre-Indo-Aryan భాషలను తీసుకొని వచ్చారు. వీటినుంచి సంస్కృతం, ఇతర కొన్ని భారతీయ భాషలు ఆవిర్భవించాయి.

మధ్యఆసియాప్రాంతపు భాష అయిన జెండ్ అవిస్టా భాషకు సంస్కృత భాషకు అనేక సామ్యాలు ఉండటం కూడా ఈ రకపు వలసలను ధృవపరుస్తుంది. (See picture). ఈ వలస వచ్చినవారు మొదట జెండ్ అవిస్తా భాషను మాట్లాడేవారని, భరతఖండంలోకి ప్రవేశించాక తమ మూల జెండ్ అవిస్టా భాషను సంస్కృత భాషగా సంస్కరించుకొన్నారు. ఈ క్రమంలో వీరు తమతో పాటు పూర్వ మూల జెండ్ అవిస్టా లిపిని మధ్య ఆసియానుండి తెచ్చుకోకపోవటంతో సంస్కృత భాషకు మొదట్లో బ్రహ్మి లిపి, తరువాత శారద లిపి క్రీశ 7 వ శతాబ్దం నుంచి దేవనాగరి లిపిని వాడుకోవటం జరిగిందని భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

2. సింధులోయ నాగరికత c1900 BCE నాటికి క్షీణించి పోయింది. రాఖిఘర్ వద్ద లభించిన సింధులోయనాగరికతకు చెందిన అవశేషాలనుండి సేకరించిన DNA- పైనచెప్పిన రెండు వలసల ప్రజలైన Iranian agriculturalists లతో అతి స్వల్పంగా సారూప్యతను కలిగి ఉండగా, Yamnaya Steppe pastoralists ల DNA తో ఏ రకమైన సారూప్యత కలిగిలేదు. అంటే సింధులోయ నాగరికత ప్రజలు పై రెండు వలసలతో నిమిత్తం లేకుండా భారతదేశంలోనే అనాదిగా మనుగడ సాగిస్తూ వచ్చిన స్థానిక జాతులుగా భావించాలి.

3. c2000 BCEలో వచ్చిన Yamnaya Steppe pastoralist ప్రజల జన్యువులు ఆ తరువాతి కాలంలో భారతదేశ ప్రజలలో విస్తరించిన విధానం ఆసక్తికరం.

a. ఈ Steppe పురుషుల జన్యువులు స్థానిక పురుషల జన్యువులను తొలగించటం ద్వారా సమాజంలోకి వచ్చి చేరాయి. అంటే Steppe pastoralist పురుషులు, indigenous పురుషులను ఓడించి లేదా నిర్మూలించి వారి స్త్రీలను గ్రహించటం ద్వారా తమ జన్యువులను సంతానం రూపంలో జనాభాలో ప్రవేశపెట్టారు.[9]. Steppe pastoralist migrant పురుషులు, indigenous పురుషుల మధ్య ఘర్షణలు జరిగాయనటానికి ఇది సంకేతం.

b. మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- Steppe ancestry ని సూచించే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బ్రాహ్మణులలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. [10] ఈ Steppe ancestry కి మార్కర్ గా ఉండే జన్యువు అత్యధికంగా 72.22 శాతం పశ్ఛిమబెంగాలు బ్రాహ్మణులలో కనిపించింది. ఇతర రాష్ట్రాలలో ఈ జన్యువు ఉనికి శాతం ఇలా ఉంది.


ఉత్తరప్రదేష్ బ్రాహ్మణులు - 67.7%
బీహారి బ్రాహ్మణులు - 60.53%
హిమాచల్ బ్రాహ్మణులు -47.37 %
మహరాష్ట్ర బ్రాహ్మణులు – 43.33%
చిత్ పవన్ బ్రాహ్మణులు – 40.00%
సౌరాష్ట్ర బ్రాహ్మణులు - 39.1%
మధ్యప్రదేష్ బ్రాహ్మణులు – 38.1%
పంజాబ్ బ్రాహ్మణులు – 35.71%
గుజరాత్ బ్రాహ్మణులు – 32.81%

దక్షిణ రాష్ట్రాల బ్రాహ్మణులలో ఈ జన్యువు సుమారు 30% శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు.

ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.

Steppe ancestry అనేది భారతీయ సమాజంలో అగ్రకులాలుగా పేరుగాంచిన బ్రాహ్మణులలో గణనీయంగాను, దళిత బహుజన గిరిజనులలో స్వల్పంగాను ఉన్నట్లు పై పరిశోథన ద్వారా తెలుస్తుంది. దళిత బహుజనులలో Steppe ancestry ని సూచించే జన్యువులు తక్కువగా ఉండటం వారు ఈ నేలపై సింధులోయ నాగరికత కాలంనుంచీ నివసిస్తున్న స్థానికులని స్పష్టమౌతుంది. భారతీయసమాజంలో అనాదిగా అగ్రకులాలుగా ఉన్న బ్రాహ్మణులలో Steppe ancestry ని సూచించే జన్యువులు అధికంగా ఉండటం వారి స్థానికేతర మూలాలను పట్టిచూపుతుంది. వీరినే ఆర్యులు అని Aryan Migration Theory చెప్పింది. ఆధునిక జన్యు పరీక్షలు కూడా ఇదే విషయాన్ని ధృవపరచటం గమనార్హం.

ఇక పై జన్యు పరిశోధనావిష్కరణలు ప్రాచీన భారతదేశంలో నాగజాతి పరిణామక్రమంతో స్పష్టంగా సరిపోలుతాయి.

1. నాగులు, సింధులోయ నాగరికతనుంచీ ఏ వలసలచే ప్రభావితం కాని భారతదేశ మూలనివాసులు. వీరు నేడు Steppe ancestry జన్యువులు పెద్దగా కనిపించని దళితబహుజనులు కావొచ్చు

2. ఈ నాగులను అణచివేసినట్లు లేదా నాగస్త్రీలను పెండ్లాడినట్లు బ్రాహ్మణవాద సాహిత్యంలోను, ఇతర శాసనాలలోను అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఈ దృగ్విషయం, జన్యు పరీక్షలలో చెప్పిన Steppe pastoralist పురుషులు స్థానిక పురుషులను జయించి/నిర్మూలించి వారి స్త్రీలను చేపట్టి ఉంటారనే ప్రతిపాదనతో సరిపోలుతుంది.

3. బౌద్ధాన్ని, జైనాన్ని పూర్తిగా నిర్మూలించటం ద్వారా, నాగ రాజులను సంహరించటం ద్వారా Steppe pastoralist/ఆర్యులు నాగులపై ఆధిపత్యం పొందారు. ఇక చివరగా వారిని దుష్టులుగా, రాక్షసులుగా చిత్రీకరించి, బానిసలుగా కులవ్యవస్థలో ఇరికించి, వారి సాంస్కృతిక చిహ్నాలైన నాగారాధన, నాగచిహ్నాలను కైవసం చేసుకొంది బ్రాహ్మణవాద మతం. “నాగజాతిని సమూలంగా తుడిచిపెట్టే ప్రయత్నంలో ఆర్యులు నాగులను మంటల్లో వేసి తగలబెట్టగా మిగిలిన వారి సంతతే మనం” అని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినది దీనిగురించే.



సంప్రదించిన పుస్తకాలు


1. Nagas, The Ancient Rulers of India, thier Origin and History, Dr. Naval Viyogi
2. The Nagas in Indian History and Culture, TV Mahalingam
3. Indian Serpent-Lore, J.PH. Vogel
4.Development of snake worship in ancient India, PhD thesis by Rao, Josyula Nageswara
5.The Disguises of the Demon,Wendy Doniger, Editor
6. The Triumph of the Snake Goddess, Kaiser Haq
7. పురాణాలు మరోచూపు, బి. విజయభారతి
8. Journal of the Asiatic Society of Bengal, vol 49
9. V. A. Smith, Catalogue of the coins of the Indian Museum, pp. 148-150
10 Early Indian Religions, by Banerjee, pn102.
11.. అంతర్జాలం



[1] Nagas, the ancient rulers of India, their origin and history, Dr. Naval Viyogi p.n 173.
[2] V. A. Smith, Catalogue of the coins of the Indian Museum, pp. 155
[3] Pn. 138, Journal of the Asiatic Society of Bengal, vol 49
[4] V. A. Smith, Catalogue of the coins of the Indian Museum, pp. 148-150
[5] Early Indian Religions, by Banerjee, pn102.
[6] Ibid pn 103
[7] Early Indian Religions p.n 114
[8] 1. V. Shinde, V. Narasimhan et al. “An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers” (_Cell_ 179, 1-7, Oct 17, 2019)
2. Vagheesh M. Narasimhan et al., "The formation of human populations in South and Central Asia" (_Science_, Sep 5, 2019)
[9] Steppe migrants “were more successful at competing for local mates than men from the local groups”
[10] https://en.wikipedia.org/wiki/Y-DNA_haplogroups_in_populations_of_South_Asia