Sunday, April 20, 2025

ప్రాచీనభారతదేశ విద్యావిధానం

ప్రాచీన భారతదేశ విశ్వవిద్యాలయాలు అంటూ కాషాయ రంగు అఖండభారతదేశపు ఫొటో ఒకటి సనాతన హిందూ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. దానిపై 12 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 11 విశ్వవిద్యాలయాలు బౌద్ధులకు చెందినవి కాగా 1 జైనులకు చెందినది. విశ్వవిద్యాలయాలంటే కులమతాలకు అతీతంగా విద్యనందించే కేంద్రాలు. ఇవి కాక ఇంకా సుమారు 15 వివిధ విద్యా కేంద్రాల పేర్లు కలవు. ఇవి హిందూమతానికి చెందిన గురుకులాలు, మఠాలు,. వీటిలో బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.

I. ఆ ఫోటోలోఉన్న బౌద్ధ విశ్వవిద్యాలయాలు

1. తక్షశిల (BCE 6వ శతాబ్దం – CE 5వ శతాబ్దం): ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోని పురాతన ఉన్నత విద్యా కేంద్రాలలో ఒకటి. ఇది బౌద్ధ కేంద్రంగా చక్రవర్తి అశోకునిచే అభివృద్ధి చేయబడింది. (తక్షశిల BCE15 వ శతాబ్దంలో స్తాపించబడింది అని ఫొటోలో ఉంది. అది తప్పు)

2. నలందా (CE 5 –CE 12 వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న నలందా ఒక ప్రఖ్యాత బౌద్ధ విహారంతో కూడిన విశ్వవిద్యాలయం. బౌద్ధ తత్వశాస్త్రం, తర్కం, ఇతర విభాగాల అధ్యయనానికి ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనిని గుప్త చక్రవర్తి కుమారగుప్త I ఐదవ శతాబ్దంలో స్థాపించాడు. ఇది 10,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. హ్యుయాన్ త్సాంగ్ ఇక్కడ చదువుకొన్నాడు.

3. తెల్హారా (CE 1 –CE 12 వ శతాబ్దం): నలందా సమీపంలో ఉన్న మరో బౌద్ధ విద్యాకేంద్రం. 1వ శతాబ్దం CE నుంచి ఉన్నదని పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది పాలరాజుల పోషణలో ఉంది.

4. పుష్పగిరి (BCE 3 –CE 12 వ శతాబ్దం): ఒడిశాలోని పుష్పగిరి, పురాతన కళింగ రాజ్యంలో ఒక ప్రముఖ బౌద్ధ విశ్వవిద్యాలయం. అశోకచక్రవర్తి దీనికి పోషకుడిగా ఉన్నాడు.

5. విక్రమశీల (CE 8 - 12 శతాబ్దం). స్థాపకుడు: పాల చక్రవర్తి ధర్మపాలుడు. ఇదిముఖ్యంగా వజ్రయాన బౌద్ధ విద్యకు ప్రసిద్ధి. టిబెట్ విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా చదువుకొనేవారు.

6. రత్నగిరి (CE 6– 12 శతాబ్దం): ఒడిశాలోని రత్నగిరి, ఒక బౌద్ధ విహారంతో కూడిన ప్రముఖ విద్యా కేంద్రం. దీనిని అశోకుడు స్థాపించి ఉండొచ్చని ఒక అభిప్రాయం కలదు, అయితే 6వ శతాబ్దం నుండి భౌమకర వంశం పాలకుల పోషణలో ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది.

7. ఓదంతపురి (CE 8–12వ శతాబ్దం): బీహార్‌లో ఉన్న ఓదంతపురి ఒక ముఖ్యమైన బౌద్ధ మహావిహారం. ఇది బౌద్ధ విద్యకు ప్రముఖ కేంద్రంగా ఉండి, గరిష్ఠంగా 12,000 మంది విద్యార్థులను కలిగి ఉండేది. దీనిని పాల చక్రవర్తి గోపాల I, 8 వ శతాబ్దంలో స్థాపించాడు.
8. సోమపుర (CE 8 – 12 వ శతాబ్దం): ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న సోమపుర మహావిహారం ఒక పెద్ద బౌద్ధ విద్యా కేంద్రం, దీనిని పాల రాజు ధర్మపాలుడు 8వ శతాబ్దం చివరలో స్థాపించాడు.

9. నాగార్జునకొండ (CE 2– 6వ శతాబ్దం): ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాగార్జునకొండ, ఇక్ష్వాకు వంశం (2వ నుండి 4వ శతాబ్దం వరకు) కాలంలో ఒక ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రంగా ఉంది. బౌద్ధ తత్వవేత్త నాగార్జున పేరు మీద దీనిని నామకరణం చేశారు. ఇది మహాయాన బౌద్ధానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఆచార్యనాగార్జునుడు ఆధ్వరంలో నెలకొల్పిన బౌద్ధవిద్యాలయం 5 అంతస్థులతో 1500 గదులు కలిగి ఉన్నదని చైనా యాత్రికుడు ఫాహియాన్ (ఐదో శతాబ్దం) పేర్కొన్నాడు.

10. జగద్దాల: 11వ శతాబ్దంలో పాల వంశాధిపతులచే స్థాపించబడిన బౌద్ధ విద్యాలయం.

11. బిక్రమపురా: బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాచీన బౌద్ధ విద్యాలయం. సమాచారం తక్కువ. పాల వంశ పాలనలో అభివృద్ధి చెందింది.

12. వల్లభి (CE 6– 12 శతాబ్దం): గుజరాత్‌లోని వల్లభి, జైన అధ్యయనాలకు కీలక కేంద్రంగా ఉండేది. దీనిని మైత్రక వంశ రాజు భట్టారకుడు 6వ శతాబ్దంలో స్థాపించాడు.

ఇవి కాక ఆ ఫొటోలో ఉన్న మిగిలినవి అన్నీ హిందూ మతానికి చెందిన వేదాధ్యయన కేంద్రాలు. వీటిలో తర్కం, వేదాలు ఉపనిషత్తులు, సంస్కృతవ్యాకరణం, వేదాంతబోధన, జ్యోతిషం, ధర్మశాస్త్రాలు బోధించబడేవి. ఇవి బ్రాహ్మణులకొరకు, బ్రాహ్మణులచే నడపబడిన విద్యాకేంద్రాలు. వీటిలో శూద్రులకు కానీ అతి శూద్రులకు కానీ ప్రవేశం లేదు.

వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయం చుట్టుపక్కల ఉండే గురుకులాలు; కాశ్మీర్ లో శంకరాచార్యులు ప్రతిష్టించిన శారదాపీఠం; ఉజ్జయినిలో ఖగోళశాస్త్రాధ్యయన కేంద్రం; భోజుడు స్థాపించిన భోజ్ శాల; వేదాంత బోధన కొరకు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రింగేరి పీఠం; శైవ వైష్ణవ వేదాంత కేంద్రమైన కాంచిపురం; కేరళలోని సంస్కృత విద్యలు గరిపే త్రిస్సూర్; ద్వైత సిద్ధాంతాన్ని బోధించే ఉడిపి వైష్ణవ మఠం; తమిళనాడులోని వేద వాఙ్మయానికి కేంద్రమైన ఎన్నాయిరం.; హిందూ ధర్మశాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కేరళ లోని కంథల్లార్ శాల; రాష్ట్రకూటుల కాలంలో వేదాధ్యయనం కొరకు స్థాపించబడిన మన్యఖేత మొదలగునవి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో విస్తరించిన హిందూ విద్యాకేంద్రాలు ఇవి చాలామట్టుకు గురుకులాలు మిగిలినవి సన్యాసి మఠాలు.
***
.
II. ప్రాచీన భారతదేశ విద్యా వ్యవస్థ

ప్రాచీనభారతదేశంలో శ్రమణ సంస్కృతితో బౌద్ధ, జైనాలు ఒకవైపు బ్రాహ్మణమతం (హిందూ) మరోవైపు ప్రజల జీవనవిధానాన్ని శాసించాయి. ఈ రెండు మార్గాలు భిన్న తాత్వికపునాదులు కలిగినవి. వాటి విద్యావ్యవస్థలు కూడా భిన్నమైన లక్ష్యాలతో పనిచేసాయి.

1. బౌద్ధమతంలో విద్యావ్యవస్థ:

దీనిలో బుద్ధుని బోధనలు, అష్టాంగమార్గం, బౌద్ధ గ్రంథాలు, తర్క శాస్త్రం, వైద్యం, ఆయుర్వేదం, తత్త్వశాస్త్రం, నీతి, ఆచరణాత్మక జ్ఞానం, పాళి భాష, వ్యాకరణం వంటి అంశాలను విద్యార్ధులకు నేర్పేవారు.

నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసుకొని, నిర్ధిష్ట పాఠ్యాంశాలు, లక్షలాది పుస్తకాలు కలిగిన గ్రంథాలయాలతో బౌద్ధ విద్యాసంస్థలు అంతర్జాతీయ విద్యార్ధులను ఆకర్షించేవి. నలందాలో చైనా, టిబెట్, కొరియా, మంగోలియా దేశాలనుంచి విద్యార్ధులు వచ్చి విద్యను అభ్యసించేవారు. ఫాయియాన్, హ్యుయాన్ త్సాంగ్, ఇ-త్సింగ్ (Yijing) వంటి వారు ఎందరో అలా నలంద విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.

ఈ విశ్వవిద్యాలయాలు ప్రధానంగా బౌద్ధపాఠ్యాంశాలు బోధించినప్పటికీ, వైదిక, జైన మతాలకు చెందిన అంశాలను కూడా అందిస్తూ సెక్యులర్ గా వ్యవహరించేవి.

నలందాలో విద్య ఉచితంగా అందించబడేదని; విద్యార్ధుల ప్రతిభను బౌద్ధగురువులు క్షుణ్ణంగా పరీక్ష చేసి ప్రవేశం ఇచ్చేవారని; ఈ పరీక్షలో పదిమందిలో 8/9 మంది విఫలమయ్యేవారని హ్యుయాన్ త్సాంగ్ రాతలద్వారా అర్ధమౌతుంది. విశ్వవిద్యాలయాలను రాజులు పోషించేవారు.
బౌద్ధం చాతుర్వర్ణాలలోని హెచ్చుతగ్గులను తీవ్రంగా ఖండించింది. గంగ, యమున సరయు, మహి లాంటి నదులు సముద్రాన్ని చేరగానే తమ పేర్లను, అస్తిత్వాలను ఎలాగైతే కోల్పోతాయో అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలకు చెందిన వారెవరైనప్పటికీ దమ్మాన్ని ఆచరించటం మొదలుపెట్టగానే వారి వారి వర్ణాలను కోల్పోతారు అని వినయపిటక లో బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు.

బౌద్ధ విద్యావ్యవస్థలో కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా ప్రజాస్వామిక పద్దతులలో అందరనూ చేర్చుకొనేవారు. విద్యార్ధులను బౌద్ధికంగా, నైతికంగా, శారీరికంగా ధృఢంగా, సంపూర్ణంగా అభివృద్ధి చెందేలా చేయటం బౌద్ధవిద్యయొక్క లక్ష్యంగా ఉండేది.

ఉపాలి (క్షురక), సునీత (చండాల), సోపాక (చండాల), శివాలి (శూద్ర) ఆనంద, మాతంగ (చండాల) లాంటి శూద్ర, అతి శూద్ర జాతులకు చెందిన పలువురు విద్యనభ్యసించి గొప్ప బౌద్ధ గురువులుగా పేరు తెచ్చుకొన్నారు.

బౌద్ధ విశ్వవిద్యాలయాలు భారీస్థాయిలో ఉండేవి. నలందాలో ఏకకాలంలో రెండువేలమంది గురువులు బోధించటానికి, పదివేలమంది విద్యార్ధులు చదువుకోవటానికి సరిపడా తరగతి గదులు, నివాసగదులు, వంటగదులు ఉండేవంటే అది ఎంత పెద్దదో అర్ధం చేసుకొనవచ్చును. లక్షలకొలది రాతప్రతులు కలిగిన గ్రంథాలయాలు ఉండేవి.

2. బ్రాహ్మణమతంలో విద్యావ్యవస్థ:

బ్రాహ్మణమతం విద్యను బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం చేసింది. వైశ్యులు, క్షత్రియులు కొన్ని మినహాయింపులతో కొంతమేరకు నేర్చుకొనవచ్చును కానీ వేదాధ్యయనం చేయటానికి బ్రాహ్మణులకు మాత్రమే అర్హత. శూద్రులు కనీసం వేదాలను వినరాదని, వింటే చెవిలో కరిగించిన సీసం పోయాలంటూ అతి క్రూరమైన ఆంక్షలను బ్రాహ్మణులు స్మృతులరూపంలో రాసుకొన్నారు. శూద్రులు విద్యను నేర్చుకోకూడదని ఆంక్షలు విధించారు. అతిశూద్రులైతే స్మృతులప్రకారం అసలు మనుషులేకారు. ఏకలవ్యుడు, శంబుకుని కథలు ఆనాటి సమాజంలో శూద్రులు విద్యనేర్చుకొంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుపుతాయి.

వేదాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం, ఖగోళశాస్త్రం, తత్త్వశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ధర్మశాస్త్రాలు మొదలగునవి హిందూ విద్యాసంస్థలలో పాఠ్యాంశాలుగా ఉండేవి.

గురుకులాలు (ఒక బ్రాహ్మణ గురువు నేతృత్వంలో నడపబడే పాఠశాల), మఠాలలో (సన్యాస కేంద్రాలు) హిందూ వేదాంత విద్య నేర్పబడేది. బట్టీవేయడం ద్వారా వేదాలను అధ్యయనం చేసేవారు. హిందూ విద్య బౌద్ధవిద్య వలే కేంద్రీకృతమై ఉండేది కాదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఒక గురువు గురుదక్షిణ తీసుకొని విద్యను అందించే చిన్నచిన్న పాఠశాలలు. ఇవి బౌద్ధ విశ్వవిద్యాలయాలయాల వలే వ్యవస్థీకృతంగా విశాలమైనవి కావు.

హిందూ విద్యాకేంద్రాలు బ్రాహ్మణులచే బ్రాహ్మణులకొరకు ఏర్పాటుచేసుకొని, విద్య అనేది సమాజంలో బ్రాహ్మణ వర్గానికి మాత్రమే పరిమితంచేసి, శూద్రవర్గానికి విద్యను దూరం చేసిన ఒక దుర్మార్గ వ్యవస్థ.

III. ముగింపు

ప్రాచీన భారతదేశంలోని బౌద్ధ విశ్వవిద్యాలయాలు సామాజిక సమానత్వం, జ్ఞాన ప్రసరణ ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులను కలిపే కేంద్రాలుగా నిలిచాయి. కాగా బ్రాహ్మణ విద్యావ్యవస్థ కుల ఆధారిత ఆంక్షలతో సామాజిక విభజనను మరింత బలపరిచింది. ఈ రెండు వ్యవస్థల చారిత్రక భిన్నత్వాన్ని గుర్తించాలి. చరిత్రను నిజాయితీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బౌద్ధ విశ్వవిద్యాలయాలు సర్వసమాజ సమైక్యతకు చిహ్నాలుగా నిలిచి అందరూ సమానమేనని నిరూపించగా హిందూ గురుకులాలు ప్రత్యేక వర్గ ప్రయోజనాలను కాపాడాయి.

ఎనిమిదవ శతాబ్దంలో ఉద్యోతన సూరి అనే జైనాచార్యుడు రాసిన కువలయమాల అనే గ్రంథంలో వేదాధ్యయనం చేస్తున్న కొద్దిమంది విద్యార్ధులను ఎద్దేవా చేస్తూ…......"వీరు వేదాలను భట్టీయం వేస్తున్నారు; బలమైన కండలు తిరిగిన దేహంతో నిత్యం వ్యాయామం చేస్తూ లెక్కలేనితనంతో హింసాత్మక ధోరణితో జీవిస్తున్నారు; వీళ్ళంతా నైతికవిలువలు లేని మూర్ఖుల సమూహం" అని అన్నాడు ----- హిందూమతం ఇంకా పూర్తిగా స్థిరీకరింపబడని కాలంలో వేదాలను అధ్యయనం చేస్తున్న హిందు విద్యార్ధుల పట్ల జైనుడైన ఉద్యోదనసూరి చేసిన ఈ వ్యాఖ్యలు చారిత్రికంగా విలువైనవి. (రి. Kuvalayamala, Part II, A.N. Upadhye, Pn. 124)

బ్రాహ్మణులకు తప్ప సమాజంలో ఎవరికీ ఉపయోగపడని హిందూ విద్యాకేంద్రాలను, కుల లింగ బేధాలకు అతీతంగా ప్రపంచంలోని అందరికీ సమానంగా విద్యను అందించిన బౌద్ధ విశ్వవిద్యాలయాలతో కలిపి చెబుతూ సనాతనవాదులు గొప్పలు పోవటం, ఎవరికో పుట్టిన బిడ్డను సొంతబిడ్డగా చెప్పుకోవటంలాంటిది. చరిత్రను వక్రీకరించటమే.

బొల్లోజు బాబా



Thursday, April 10, 2025

ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?



ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?

సుమారు 9.4 లక్షల ఎకరాలతో వక్ఫ్ భూములు, ఆర్మీ (18 లక్షల ఎకరాలు) రైల్వేల (12 లక్షల ఎకరాలు) తరువాత దేశంలో మూడవ అతిపెద్ద మొత్తానికి చెందిన ఆస్తిగా నిలిచింది.

ఈ 9.4 లక్షల ఎకరాల వక్ఫ్ భూములలో సుమారు 2 లక్షల ఎకరాలలో స్మశానాలు, 1 లక్ష ఎకరాలలో మసీదు, దర్గాలు, యాభైవేల ఎకరాలలో స్కూళ్ళు, 5.9 లక్షల ఎకరాలు వ్యవసాయ సంబంధ, ఇతర భూములు గాను ఉన్నాయి.

ఈ భూములలో సుమారు 18 వేల మదరాస స్కూల్స్, 350 వరకూ కాలేజీలు, 100 వరకూ హాస్పటల్స్ నడుస్తున్నాయి.

ఇతరమతాలు కలిగి ఉన్న భూముల వివరాలు ఇలా ఉన్నాయి.

వక్ఫ్ భూములు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఆధీనంలో ఉంటాయి కనుక వాటి లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. హిందూమతానికి చెందిన ఆలయభూములు అలాకాక వివిధ రాష్ట్రాల ఆధీనంలో ఉంటాయి. కనుక ఆయా రాష్ట్రాల లెక్కల ఆధారంగా దేశంలో హిందు ఆలయాలకు చెందిన భూములు సుమారు 15 నుండి 20 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇదే నిజమైతే దేశంలోనే అథ్యధికంగా భూములు కలిగి ఉండటంలో హిందూమతం మొదటి స్థానంలో ఉంటుంది.

తమిళనాడులో 4.78 లక్షల ఎకరాల ఆలయ భూములు కలవు. ఆంధ్ర ప్రదేష్ లో 4 లక్షల ఎకరాలు, తెలంగాణలో 87 వేల ఎకరాలు, కర్ణాటకలో 15 వేల ఎకరాలు, ఒడిసాలో 12 వేల ఎకరాలు, బీహార్ లో 22 ఎకరాల భూములు కలిగి ఉన్నాయి. పెద్దరాష్ట్రాలైన ఉత్తర ప్రదేష్, రాజస్తాన్, మహరాష్ట్రాలలో దేవాలయ భూములు ఏ మేరకు ఉన్నాయో అధికారిక గణాంకాలు లేవు. దేశవ్యాప్తంగా మొత్తంమీద 15 నుండి 20 లక్షల ఎకరాల హిందూ ఆలయభూములు ఉన్నాయని భావించవచ్చు.

హిందూ ఆలయభూములలో 13 వేల స్కూల్స్, 800 వరకూ కాలేజీలు, 300 వరకూ హాస్పటల్స్ నడపబడుతున్నాయి.

క్రిస్టియన్ మతానికి చెందిన భూములు దేశంలో సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాలు ఉండవచ్చునని ఒక అంచనా. ఇది ప్రధానంగా వ్యవసాయేతర భూమి. దేశంలో భారతప్రభుత్వం తరువాత అత్యధిక వ్యవసాయేతర భూమి కలిగిన వ్యవస్థగా చర్చ్ ని చెబుతారు.

చర్చ్ కి చెందిన భూములలో చర్చ్ లు, సెమెటరీలు కాక 14 వేల స్కూళ్ళు, 300 కాలేజీలు, 2500 హాస్పటల్స్ ఉన్నాయి.
ఇదే విధంగా బౌద్ధులకు 50,000 ఎకరాల వరకు భూములు, సిక్కుల వద్ద 2 లక్షల ఎకరాల వరకూ భూములు ఉన్నాయి.

ఇక వ్యక్తులవద్ద చూసినట్లయితే ఆదాని గ్రూప్ కు 16 వేల ఎకరాలు, DLF వద్ద 15 వేల ఎకరాలు, రిలయన్స్ వద్ద 9 వేల ఎకరాల భూములు ఉన్నాయి.

***

కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. కేంద్ర వక్ఫ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.

ఇక వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ కమిటీలో తప్పనిసరిగా హిందువులు కూడా ఉండాలని ఇటీవల పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం రాజకీయ ప్రేరేపిత చర్య కావచ్చు. దేశంలో మరే ఇతర మతసంస్థల ఆస్థులకు సంబంధించిన కమిటీలలో అన్యమతానికి చెందిన సభ్యులు ఉండరు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాధికారులైన కలక్టరు కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఆ ఆలయ కమిటీకి ఎక్స్ అఫిషియో మెంబరుగా ఉన్నప్పుడు- ఒకవేళ ఆ అధికారులు వేరే మతానికి చెందినవారైనప్పటికీ కమిటీలో ఉంటారు తప్ప కావాలని “కొందరు సభ్యులు తప్పని సరిగా వేరేమతానికి చెందిన వారై ఉండాలి” అనే క్లాజ్ తో ఏ ఆలయ బోర్డు కానీ ఎండో మెంటు కమిటీ కానీ ఏర్పడదు. ఉదాహరణ టిటిడి బోర్డులో అందరూ హిందువులే మెంబర్లుగా ఉంటారు. ఇతరులకు స్థానం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఒక్క క్లాజుతోనే వక్ఫ్ బోర్డ్ సవరణలు వివాదాస్పదం అవుతున్నాయి.

బొల్లోజు బాబా

(పై గణాంకాలు ఎఐ ద్వారా సేకరించినవి. సరైన ఆధారాలతో విభేదించవచ్చు)

Wednesday, April 9, 2025

ప్రాచీనగాథలు ముందుమాట



“ప్రాచీనగాథలు” పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట. ఇవి వివిధ కావ్యాలలోంచి తీసుకొన్న మొత్తం 500 పైన గాథలకు తెలుగు అనువాదం. ఇటీవల కొన్ని గాథలను రీల్స్ గా పోస్ట్ చేసినపుడు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తకాన్ని ఛాయావారు ప్రచురించారు. ప్రాచీన గాథలు పుస్తకం అమజాన్ లో లభిస్తుంది. లింక్ మొదటి కామెంటులో ఉంది. దయచేసి ఆదరించగలరు

బొల్లోజు బాబా

*****

మనవి మాటలు

గాథ అనగా ఉత్తమమై, ఉదాత్తమై, రసానుకూలమైన ఒక సంఘటన అని నిర్వచించారు గాథాసప్తశతిని తెలుగుచేసిన శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఈ పదాన్ని వివిధ ముక్తక కావ్యాలలోని పద్యాలకు కూడా వర్తింపచేయటం ఆక్షేపణీయం కాదని తలచి, ఈ పుస్తకంలోని వివిధ పద్యాలను గాథలుగా పేర్కొనటం జరిగింది.

చాన్నాళ్ళక్రితం సప్తశతిగాథలను చదివినపుడు వాటిలోని కవిత్వానికి ఆకర్షితుడనై కొన్ని గాథలను అంశాలవారిగా విభజిస్తూ అనువదించాను. ఆ తరువాత సప్తశతి గాథలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ కొన్ని వ్యాసాలు రాసాను. చరిత్రపట్ల ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ప్రాచీన సాహిత్యం కొత్తకొత్త కోణాలలో దర్శనమివ్వటం మొదలైంది, ముఖ్యంగా ప్రాకృత సాహిత్యం. గౌడవహో, వజ్జాలగ్గం, కువలయమాల, లీలావాయీ, సేతుబంధ లాంటి వివిధ ప్రాకృత కావ్యాలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాసాను. రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం రాసిన థేరీగాథలు, వాటి చారిత్రిక నేపథ్యం పట్టి కుదిపాయి. వాటిని అనువదించి 2022 లో పుస్తకరూపంలో తెచ్చాను.

ఇదే క్రమంలో ప్రేమస్వరాలు పేరుతో తిరుక్కురల్‌ నుంచి కొన్ని, అమరశతకం నుంచి కొన్ని గాథలను అనువదించాను. ప్రాచీన సాహిత్యంలో ఋతువర్ణనలు పేరుతో వ్యాసపరంపర రాస్తున్న సమయంలో నాకు ‘సంగం కవిత్వం’ పరిచయం అయింది. స్వచ్ఛమైన మానవానుభవాలు అవి. ఆ గాథలలోని చరిత్ర, ఉద్వేగాలు గొప్ప ఊహాతీత లోకంలోకి తీసుకొని వెళతాయి. సంగం కవిత్వం ఈ పుస్తకపు మొదటి అధ్యాయం, నా సరికొత్త మోహం.

చివరి అధ్యాయం ‘నానావిధ’ పేరుతో వివిధ సందర్భాలలో చేసిన ప్రాచీన గాథల అనువాదాలు. వీటిలో కొన్ని పదహారవ శతాబ్దానికి చెందిన గాథలు కూడా ఉన్నాయి.

నిజానికి సప్తశతి, ఇతర కావ్యాలపై నేను రాసినవి వాటిలోని చరిత్రను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు. కానీ ఈ పుస్తకంలో గాథలన్ని ఒకచోటికి చేర్చి, విశ్లేషణా అంశాలను పుస్తకం చివర నోట్సు రూపంలో ఇచ్చాను. కవిత్వాన్ని, వచనాన్ని వేరుచేయాలనే ఉద్దేశంతో.

***

కవి తను జీవించిన కాలానికి ప్రతినిధి. ఈ ప్రాచీన కవులు తమ కాలాన్ని ఇలా నిక్షిప్తం చేసారు. శాసనాలలో దొరికే చరిత్రలో పేర్లు, తారీఖులు మాత్రమే ఉంటాయి. సాహిత్యంలో కనిపించే చరిత్రలో ప్రజలు రక్తమాంసాలతో సంచరించటం గమనించవచ్చు. ఈ గాథలలో ఎక్కువ భాగం శతాబ్దాల క్రితం జీవించిన సామాన్యుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి కష్టాలు సుఖాలు, ఆశలు నిరాశలు, సమాజం, సంస్కృతి, ఆచార వ్యవహారాలను తెలియచేస్తాయి. ఈ రచనలో కొంతమేరకు ఆనాటి subaltern జీవితాన్ని కూడా గుర్తించవచ్చు. సాధారణత్వమే ఈ గాథలకు అంతస్సూత్రం.

ఏ అనువాదము అంతిమం కాదని విశ్వసిస్తాను. ఈ అనువాదాలను మూల విధేయంగా ఉంటూనే భాషాంతరం చేయటంలో శక్తిమేరకు ప్రయత్నించానని అనుకొంటాను. సహృదయులు అర్థం చేసుకొంటారని ఆశిస్తాను.

ఈ పుస్తకరచనలో శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్‌ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, సవరణలు ఈ రచనను మెరుగుపరిచాయి. వారికి నేను ఋణపడి ఉన్నాను. వారు ఈ పుస్తకానికి రాసిన చక్కని విశ్లేషణాత్మక ముందుమాటకు ఎంతో కృతజ్ఞుడను.


లభించు చోటు



భవదీయుడు

బొల్లోజు బాబా



Monday, April 7, 2025

ఎమర్జెన్సీ- ఆరెస్సెస్ పాత్ర

శ్రీమతి ఇందిరాగాంధీ భారతరాజ్యాంగంలోని ఆర్టికిల్ 352 ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇది 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగింది. ఈ సమయంలో పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛ, న్యాయస్వాతంత్రం నిలిపివేయబడ్డాయి. ఎమర్జన్సీకి నేడు యాభయ్యవ సంవత్సరం నడుస్తోంది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ అత్యంత వివాదాస్పదమైన ఘట్టం. 

ఇందిరాగాంధి లోక్ సభ ఎన్నిక చెల్లదని ఇచ్చిన కోర్టు తీర్పును తప్పించుకోవటానికి, ప్రత్యర్ధులను జైళ్ళలో పెట్టించటానికి ఎమర్జెన్సీ విధించింది అని నేటికి ఆరెస్సెస్ దాని రాజకీయముఖమైన బిజెపి పార్టీ ఆరోపణలు చేస్తాయి.  

ఇందిరాగాంధి ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో లోక్ సభలో చేసిన ప్రసంగపాఠాలు Press Information Bureau ఆర్చైవ్స్ రూపంలో ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆధారంగా- ఎమర్జెన్సీ విధించటానికి గల కారణాలలో RSS పాత్ర ప్రధానంగా ఉన్నట్లు అర్ధమౌతుంది. RSS నాయకత్వంలో నడిచే జనమోర్చ వల్ల దేశప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లనుందని దానిని తప్పించటానికే ఎమర్జెన్సీని విధించినట్లు ఆమె ప్రసంగ పాఠాల ద్వారా తెలుస్తుంది.

****

1. ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు

1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధం కారణంగా దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. 1973లో ప్రపంచ చమురు సంక్షోభం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. 1974లో రైల్వే ఉద్యోగుల సమ్మె వల్ల దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. 1973లో గుజరాత్‌లో విద్యార్థులు చేపట్టిన "నవనిర్మాణ ఉద్యమం" హింసాత్మకంగా మారింది. దీని ఫలితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ, మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ఆందోళనలు కొనసాగాయి.

1974లో బీహార్‌లో జయప్రకాశ్ నారాయణ్ "సంపూర్ణ క్రాంతి" (సంపూర్ణ విప్లవం) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారి, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగింది. ఇందిరా గాంధీ ఈ ఉద్యమాలను దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆందోళనలుగా, అంతర్గత భద్రతకు విఘాతకరంగా అభివర్ణించారు. ఈ అల్లర్లలో వందల మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ సంఘటనల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఇందిరా గాంధీ గుర్తించారు. దేశం అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆమె భావించారు. ఈ నేపథ్యంలో 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువడింది.

ఇందిరాగాంధీ రాయబరేలి నియోజకవర్గం నుండి 1971 లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికకావటాన్ని ప్రత్యర్ధులు కోర్టులో సవాలు చేసారు. ఆమె ప్రభుత్వ యంత్రాంగాన్ని/వాహనాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించి దుర్వినియోగం చేసారని, పరిమితిని మించి ఎన్నికల ఖర్చు చేసారని; పార్టీ గుర్తయిన “ఆవుదూడ” చిహ్నం మతపరమైనదిగా ఉంది అని వివిధ అభియోగాలతో ఆమె ఎన్నికను రద్దు చేస్తూ, ఆమెను ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేదిస్తూ 1975 జూన్ 12 న అలహాబాద్ హైకోర్టు తీర్పుచెప్పింది. దీనిపై సుప్రీమ్ కోర్టుకు వెళ్ళగా అక్కడ ఆమెకు ప్రధానిగా కొనసాగేందుకు స్టే లభించింది తప్ప తీర్పురద్దు ఊరట లభించలేదు. 

జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జనతాపార్టీ, జనసంఘ్ (ఇది నేటి బిజెపి పూర్వరూపం), సమాజ్ వాద పార్టీ, భారతీయలోక్ దళ్ వంటి పార్టీలన్నీ కలిసి జూన్ 25, 1975న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఒక భారీ ర్యాలీని నిర్వహించి “సైన్యం, పోలీసులను ప్రధాని ఇందిర ఆదేశాలను పాటించవద్దని పిలుపునిచ్చాయి”. ఇలాంటి పరిస్థితులలో దేశంలో అరాచకత్వం పెచ్చరిల్లువచ్చునని తలచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కొరకు జూన్ 25, 1975 రాత్రి ఇందిర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. 

****

2. శ్రీమతి ఇందిరాగాంధి వాదన

తాను ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందో జూలై 22, 1975 న ప్రధానిహోదాలో శ్రీమతి ఇందిరాగాంధి లోక్ సభలో సుదీర్ఘంగా ప్రసంగించింది. ఆ ప్రసంగపాఠం Preserving our Democratic Structure, Prime minister explains reason for emergency పేరుతో ఆర్చైవ్స్ లో లభిస్తుంది. ఈ ప్రసంగంలో దేశాన్ని ఆరెస్సెస్ నుంచి కాపాడటానికే ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆ ప్రసంగపాఠంనుంచి కొన్ని ముఖ్యాంశాలు. 

• ఆరెస్సెస్ వారు తమ శాఖలలో యువతకు ఇచ్చే శిక్షణ, వారు బోధించే హింసను నేను ఖండిస్తున్నాను. 

• ఆరెస్సెస్, జనసంఘ్ ల ప్రధాన ఆయుధం అబద్దాలను ప్రచారం చెయ్యటం 

• ఫాసిజం అంటే అణచివేత మాత్రమే కాదు. ఫాసిజం అంటే అబద్దాలను సృష్టించి వాటిని విస్తృతంగా ప్రచారం చేయటం. 

• ఇది మా (కాంగ్రెస్) విధానం కాదు. మేము అసత్యాలను, అబద్దాలను నమ్మం. 

• “జర్మన్లు తమ జాతి సాంస్కృతిక స్వచ్చతను కాపాడుకోవటం కోసం తమదేశం నుండి యూదులను తరిమేసారు. ఈ అంశాన్ని భారతదేశం నేర్చుకోవలసి ఉంది” అని గోల్వాల్కర్ అన్నాడు

• 1969 అలహాబాదు అల్లర్లలో జనసంఘ్ నేత్రుత్వంలో ముస్లిములు, ముస్లిముల ఆస్తులపై దాడులు జరిగాయని ఎంక్వయిరీ రిపోర్టు తెలిపింది.  

• 1971 టెలిచెరి దాడులలో ముస్లిముల పట్ల హిందువులలో ద్వేషభావనలను రెచ్చగొట్టడంలో ఆరెస్సెస్ ముఖ్యమైన పాత్ర వహించిందని ఎంక్వయిరీ రిపోర్టు చెప్పింది. 

• “క్రైస్తవులు చూడటానికి ప్రమాదరహితంగా కనిపిస్తారు కానీ, వారు మతద్రోహులు మాత్రమే కాదు జాతి వ్యతిరేకులు కూడా” అని ఆరెస్సెస్ అన్నది.

• ఈ దేశంలో స్త్రీలకు ఓటుహక్కు కల్పించటం అనవసరం, వృధా ప్రక్రియ అని ఆరెస్సెస్ పత్రిక ఆర్గనైజర్ వ్యాఖ్యానించింది.

• సర్దార్ పటేల్ 1948 సెప్టెంబర్ 11న రాసిన లేఖలో ఇలా రాశారు: “ఆరెస్సెస్ వారి ప్రసంగాలన్నీ మతోన్మాద విషంతో నిండి ఉంటాయి. హిందువులను ఉత్సాహ పరచటానికి విషాన్ని వ్యాప్తి చెయ్యనవసరం లేదు. వారిని సంఘటిత పరచటం కొరకు నిరపరాధులు, అసహాయులైన స్త్రీలు, పురుషులు, పిల్లలపై ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం లేదు. ఈ చర్యల ఫలితంగా గాంధీజీ తన జీవితాన్ని బలిపెట్టవలసి వచ్చింది”. 

• ఈ రోజు అబద్దాలను సృష్టించి, ప్రచారం చేస్తూ, హింసను ప్రేరేపిస్తూ, భయోత్పాతం సృష్టించేది ఎవరో (ఆరెస్సెస్) అందరికీ తెలుసు వారు జనతా మోర్చతో జతకూడారు. (ఇందిరకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమి జనతామోర్చ. ఇదే తరువాత జనతాపార్టీగా ఏర్పడింది. దీనిలో జయప్రకాష్ నారాయణ్, మొరార్జి దేశాయ్, నిజలింగప్ప, వాజ్ పేయి, అద్వాని, జార్జ్ ఫెర్నాండేజ్, చరణ్ సింగ్ ప్రభృతులు ఉన్నారు). 

ప్రపంచవ్యాప్తంగా ఇన్ని అసత్యాలను, హింసను, నిందలను భరిస్తున్న ఒక్క నాయకుడి పేరుకానీ, ఒక్క దేశం పేరు కానీ చెప్పండి ఎవరైనా?

• 1967 లో ఒక సందర్భంలో జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ “ఈ దేశం సైన్యం నియంతృత్వపాలనలోకి వెళ్లాలి. దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవలసినదిగా సైన్యాన్ని కోరుతున్నాను” అని పిలుపునిచ్చారు. ఈ రోజు అదే నాయకులు మాకు ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో అంటూ ఉపన్యాసాలిస్తున్నారు. విపక్షాలు మీరందరూ జైళ్ళలో కాక ఇక్కడ ఉండి (పార్లమెంటులో) మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యం పనిచేస్తున్నదని అర్థం.

అలాకాక ఆరెస్సెస్ నాయకత్వంలో విపక్షాలు విధ్వంస ప్రణాళికలు అమలుచేసి ఉన్నట్లయితే- అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడి నాశనం అయి ఉండేది. 

హింస, మతోన్మాద ద్వషానికి మారుపేరయిన ఆరెస్సెస్ కు తమ ప్రచారబాధ్యతలు అప్పచెప్పటం విపక్షాలకు ఏమేరకు సబబు? నక్సలైట్లు విప్లవసాధనకొరకు పూర్తిస్థాయిలో పనిచేయాలని పిలుపునివ్వటం ప్రజాస్వామ్యమా?

• మనకు ఆరెస్సెస్ చరిత్ర తెలుసు. అది ఎలా ఎదిగిందో, ఏ విధంగా ద్వేషాన్ని ప్రజల్లో రగిల్చిందో చూసాం. వారికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు. 

• ఆరెస్సెస్ నాయకులు తాము ప్రజాస్వామికవాదులుగా చెప్పుకొంటారు కానీ ముస్లిములు, క్రిస్టియన్లకు సమానహక్కులు లేవంటారు. మా (కాంగ్రెస్) ప్రజాస్వామ్యం అలా కాదు. ప్రజలందరకూ సమానహక్కులు ఉండాలి అంటుంది. ప్రతి పౌరుడూ ఈ దేశప్రజే. 

• చాలా సంవత్సరాల క్రితం నేను (ఇందిరాగాంధి) కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ముస్లిమ్ నాయకుని పేరు చెబితే అందరూ “ఒక ముస్లిమ్ ని హిందూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండతగడని” అన్నారు. అయినప్పటికీ చేసాం. ఇప్పుడు అలా ఎవరైనా అనగలరా? అదే విధంగా డా.జాకీర్ హుసైన్ ను రాష్ట్రపతిని గావించినపుడు కూడా ఇవే అభ్యంతరాలు వచ్చాయి. కానీ మేము ఆయనను ప్రెసిడెంటును చేయగలిగాం. ఈరోజు ఒక ముస్లిమ్ ప్రెసిడెంట్ అవలేడని అనగలరా? అలాగని వారికి వారి న్యాయమైన వాటా దక్కిందని చెప్పటానికి లేదు. మేము మూసుకుపోయిన తలుపులు తెరిచాం. చాలామంది అన్నారు అప్పట్లో ఆ తలుపులు తెరవటం అసాధ్యం అని. తెరుస్తాం అని చెప్పాం, తెరిచాం.

• ఈ రోజున హరిజనులకు (దళితులు) దక్కాల్సిన వాటా దక్కుతుందని చెప్పలేము కానీ ఇదివరకటి మీద వారి అవకాశాలు మెరుగయ్యాయని మాత్రం చెప్పగలం.   

*****

ఎమెర్జెన్సీ విధించటానికి గల కారణాలను వివరించే క్రమంలో ఇందిరా గాంధి ప్రధానంగా ఆరెస్సెస్ పేరును పదే పదే తీయటం గమనార్హం. 1975 జూన్ 27న, ఇందిరా గాంధీ అనేక ప్రపంచ నాయకులకు ఎమర్జెన్సీని ఎందుకు ప్రకటించారో వివరిస్తూ కేబుల్స్ పంపారు, అందులో ఆమె ఇలా పేర్కొన్నారు: "...జయప్రకాష్ నారాయణ్ మహాత్మా గాంధీ హత్యకు ప్రేరేపించిన, మతోన్మాద హిందూ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌తో కలిసిపోయారు...." అని. 

*****

3. Document of Surrender

ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అనేక మంది ఎబివిపి, ఆర్ఎస్ఎస్ సభ్యులను ఇందిరాగాంధీ అరెస్టు చేయించింది. చాలామంది తప్పించుకున్నారు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ దేవరస్‌ను జూన్ 30న నాగ్‌పూర్‌లో అరెస్టు చేశారు. 1975 జూలై 4న ప్రభుత్వం ఆరెస్సెస్ ను నిషేదించింది. స్వాతంత్ర్యానంతరం ఆరెస్సెస్ నిషేదం ఇది రెండవసారి. 1948 ఫిబ్రవరిలో గాంధి హత్యకు తదనంతర అల్లర్లకు బాధ్యులను చేస్తూ పటేల్ ఆర్ఎస్ఎస్‌ను మొదటి సారి నిషేధించి, సుమారు 25 వేలమంది దాని కార్యకర్తలను ఖైదు చేయించాడు.  

ఇందిరాగాంధి ప్రభుత్వం దేశంలోని సుమారు 44 వేలమంది ఆరెస్సెస్ కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్ళలో వేసింది. వీరిలో ఎనభైమంది వరకూ జైళ్ళలోనే మరణించారు. 

యారవాడ జైలునుంచి ఆరెస్సెస్ ఛీఫ్ బాలాసాహెబ్ దేవరస్ ఇందిరాగాంధికి క్షమాపణపత్రం రాసి విడుదల చేయమని కోరాడు. ఇందిర పట్టించుకోలేదు. జైలులో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తులను విడుదల చేయమని మరియు సంస్థపై నిషేధం ఎత్తివేయమని ఇందిరా గాంధీని అభ్యర్థించమని దేవరస్ వినోబా భావేకి ఉత్తరాలు రాసాడు. ఇంకా ఇతను మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్ బి చవాన్ ద్వారా ఇందిరతో రాజీ ప్రయత్నాలు చేసాడు. బెంగుళూరులో అద్వాని, అటల్ బిహారీ వాజ్ పేయి లు అరెస్టు చేయబడ్డారు. అటల్ అనారోగ్యకారణాలతొ పెరోల్ పై బయటకు వచ్చి ఎమర్జెన్సీ ముగిసేవరకూ స్వేచ్ఛగానే ఉన్నాడు. 

నవంబర్ 1976లో, మాధవరావు ములే, దత్తోపంత్ తెంగడి, మోరోపంత్ పింగ్లే నేతృత్వంలో 30 మందికి పైగా RSS నాయకులు ఇందిరా గాంధీకి లేఖ రాశారు, RSS కార్యకర్తలందరినీ జైలు నుండి విడుదల చేస్తే ఎమర్జెన్సీకి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.  

ప్రభుత్వం స్వచ్చందంగా లొంగిపోయే వ్యక్తుల కొరకు ఒక హామీ పత్రం తయారు చేసింది. దాని ప్రకారం ------------- ఖైదీ నైన నన్ను విడుదల చేసినట్లయితే నేను దేశ అంతర్గత భద్రతకు, ప్రజల శాంతికి విఘాతం కలిగించే పనులను చేయను. ఎమెర్జెన్సీకి విరుద్దమైన ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనను….. అంటూ సాగుతుంది. 

అలాంటి “Document of Surrender” ను సమర్పించి అనేకమంది నిర్బంధిత ఆరెస్సెస్ వ్యక్తులు జైళ్ళనుంచి విడుదలయ్యారు. 

****

4. ముగింపు

ఈ రోజు సంఘీయులు తాము ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రాణాలకు ఒడ్డి పోరాడామని, ఎమర్జెన్సీ అనేది ప్రజాస్వామ్యపు చీకటి రోజని ప్రచారించుకొంటారు. నిజానికి ఎమర్జెన్సీ విధించిందే సంఘీయుల్ని కట్టడి చేయడానికే అనేది ఇందిర వాదన. Document of Surrender పత్రాలను సమర్పించి ఆనాటి చాలామంది ఆరెస్సెస్ నాయకులు జైలు జీవితాన్ని తప్పించుకొన్నారు.

ఆరెస్సెస్ హిందువులను సంఘటితం చేసి, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలన్నది లక్ష్యంగా చేసుకొని దాని ఆవిర్భావం నుంచి కృషి చేస్తున్నది. అదే మా అంతిమ లక్ష్యమని చెప్పుకోవటానికి ఆ సంస్థ ఏనాడు తడబడలేదు. 

చరిత్రలో ఆరెస్సెస్ రెండు సార్లు 1948 లో ఒకసారి, 1975 లో రెండోసారి నిషేదానికి గురయ్యింది. ఈ రెండు సందర్భాలలోను ఈ సంస్థ తన లక్ష్యానికి చాలా దగ్గరగా రావటం గమనించవచ్చు. 1948లో గాంధీజీ హత్య నేపథ్యంలో నెహ్రూని ఒంటరిని చేసి, సమాజంలో ముస్లిముల పట్ల వ్యతిరేకత తారాస్థాయికి తీసుకువెళ్లి, దేశాన్ని హిందూ రాష్ట్రంలా మార్చే అవకాశం ఉండేది, కానీ నెహ్రూ యొక్క సెక్యులర్ దృక్పథం మరియు ఐక్యతపై నమ్మకం దానిని నిరోధించాయి.

ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రూ దేశాన్ని ఆ ప్రమాదం నుంచి రక్షించాడు. పటేల్ ద్వారా ఆరెస్సెస్ పై నిషేదం విధించి వేలమంది కార్యకర్తలను ఖైదుచేయించి “భిన్నత్వంలో ఏకత్వం” అనేది ఈ దేశ చిరునామాగా తీర్చిదిద్దాడు. 

1975 కి వచ్చేసరికి ఇందిర ఎన్నిక రద్దు నేపథ్యంలో- జయప్రకాష్ ద్వారా ఇందిరను దింపివేసి, సైనికుల ద్వారా రాజ్యాన్ని చేజిక్కించుకొని దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే రెండో ప్రయత్నం జరిగి ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఊహకు ఆరెస్సెస్ పై నిషేదం, భారత రాజ్యాంగంలో సోషలిస్ట్, సెక్యులర్ అనే భావనలను ప్రవేశపెట్టటం లాంటివి ఆధారాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన “సెక్యులర్” అనే పదం. దీన్ని మార్చితే తప్ప దేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయటానికి వీలవదు. దీన్ని మార్చటం కొరకే చార్సౌబార్ నినాదం అంటారు. ఆ మేరకు ఇందిరాగాంధీ అపరకాళికమాత్రమే కాదు క్రాంత దర్శి కూడా.  

ఈ రోజున బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎమర్జెన్సీ కాలంలో ఖైదుచేయబడిన ఆర్ఎస్సెస్ కార్యకర్తలకు, వారు క్షమాపణ పత్రం రాసి విడుదలైనప్పటికీ ప్రభుత్వం నెలకు పదివేలరూపాయిల పించను అందిస్తోంది. ఒక నేరేటివ్ ని ప్రజల సామూహిక జ్ఞాపకాలలోంచి చెరిపేసి మరొక ప్రత్యామ్నాయ నెరేటివ్ ని ఎంత బలంగా ముద్రించటానికి చేస్తున్న ప్రయత్నమో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. 

నేడు సంఘీయులు తమ వందేళ్ళ ప్రస్థానంలో లక్ష్యసాధనకు చాలా చేరువలోకి వచ్చారు. ఇది ఇందిర, నెహ్రూల కాలం కాదు. ఒకే దేవుడు (ఎక్కువగా ఉత్తరాది వైష్ణవం), ఒకే ఆరాధనా విధానం, ఒకే సంస్కృతి, ఒకే ఆహారం, ఒకే బాషతో ఉండే శిలాసదృశ సమాజం కావాలా లేక ఇష్టదేవతారాధనతో, భిన్న సంస్కృతులతో, భిన్న భాషలతో, భిన్న ఆరాధనా విధానాలతో, ప్రజలందరూ సామరస్యంతో ఉండే సమాజం కావాలా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.  


బొల్లోజు బాబా

(ఈ వ్యాసాన్ని రాయటానికి ఉపయోగపడిన వ్యాసాల లింకులు మొదటి కామెంటులో కలవు)


ఈ వ్యాసాన్ని రాయటానికి ఉపయోగపడిన వ్యాసాల లింకులు


1. https://economictimes.indiatimes.com/news/politics-and-nation/on-emergency-indira-gandhi-drew-comparison-between-nazis-and-rss/articleshow/69956572.cms

2. https://frontline.thehindu.com/politics/rss-emergency/article64760048.ece/amp/

3. https://theprint.in/opinion/rss-leaders-deserted-jayaprakash-resistance-during-indira-emergency/448294/

4. https://archive.pib.gov.in/archive/ArchiveSecondPhase/PRIME%20MINISTER/1975-JUNE-DEC-P.M-SPEECHES-EMERGENCY/PDF/PRI-1975-06-26_012.pdf

5. https://archive.pib.gov.in/archive/phase2/archiveministry.aspx?phase=3