Thursday, January 8, 2009
విశ్వకవి రవీంద్రుని స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదం 201-326
ఇది మూడవ భాగము . ఇందులో 201-326 వరకు పద్యపాదాలుంటాయి.
201
కందిరీగ తన తేనెటీగ మిత్రుల గూడు
ఇరుకైనదని భావిస్తుంటే
దాని తేనెటీగ మిత్రులు చిన్న ఇల్లు
కట్టుకొమ్మని సలహా ఇస్తున్నారు.
202
"నీ అలలను నేను నిలువరించలేను" ఒడ్డు అంది నదితో
“నీ పాదముద్రలను నా హృదిలో నిలుపుకోనీ"
203
చిన్నారి పుడమి ఘోషలో, దినం
సమస్త లోకాల మౌనాన్ని మింగేసింది.
204
గాలి లోని అనంతాన్ని,
నేలపైని సౌందర్యాన్ని,
రెంటిలోని కవిత్వాన్ని
గీతం పలికిస్తున్నది.
దాని పదాలు, నడయాడే అర్ధాలు,
తేలియాడే సంగీతము.
205
సూర్యుడు పశ్చిమాన కృంగిపోయే వేళ
తన ఉదయపు తూరుపు
మౌనంతో ఎదురుగా నిలుచుంటుంది.
206
నాలోకానికి నన్ను నేను తప్పుగా చూపించుకొని
దాన్ని నా విరోధి గా చేసుకోకుండా చూడు ప్రభూ!
207
పొగడ్త నన్ను సిగ్గుపరుస్తుంది.
కానీ నేను దాన్ని రహస్యంగా యాచిస్తూంటాను.
208
ఏ వ్యాపకమూ లేనప్పటి నా నిర్వ్యాపకం
తన ప్రశాంత లోతులలో కలత చెందకుండు గాక!
మౌన జలాల సముద్ర తీర సాయింత్రంలా.
209
కన్యామణీ!
నీ ముగ్ధత్వం తటాకపు నీలిమ వలె
తత్వ లోతుల్ని ఆవిష్కరిస్తోంది.
210
శ్రేష్ఠత్వం ఒంటరిగా రాదు
సపరివార సమేతంగా విచ్చేస్తుంది.
211
ఈశ్వరుని కుడి చేయి బహు మృధువైనది
కానీ ఎడమచేయి బహు కౄరమైనది.
212
నా ఉదయపు తారలకు
అర్ధంకాని భాషలో మాట్లాడుతో
అపరిచిత తరువుల లోకి
నా సాయింత్రం అరుదెంచింది.
213
రాత్రి చీకటి తిత్తి
సువర్ణోదయంగా పగిలింది.
214
అల్పవిషయాలైన పొగమంచు, ఆవిర్లకు
ఆశ ఇంద్రధనుసు రంగులద్దుతుంది.
215
తన సుమాలనే తిరిగి
మానవుని కాన్కలుగా పొందటానికై
ఈశ్వరుడు కాచుకొని ఉన్నాడు.
216
నా శోకపుటాలోచనలు
తమ పేర్లేమిటని అడుగుతో
నన్ను వేధిస్తున్నాయి.
217
ఫలాల సేవలు విలువైనవి
పుష్పాల సేవలు ఇంపైనవి.
కానీ నా సేవ!
వినమ్ర భక్తి నీడలో కొలువుండే
ఆకుల చాకిరీ వలే ఉంచు, ప్రభూ!
218
సోమరి గాలులలో తన తెరచాపను
విప్పుకుంది నా హృదయం,
సాంత్వనిచ్చే ఏదో దీవికై.
219
జనులు కౄరులు, కానీ
మానవుడు దయాళువు.
220
నన్ను నీ పాత్రికను చేసుకొని
నా నిండుతనాన్ని స్వీకరించు, ప్రభూ!
221
మర్త్యలోకం తనప్రేమను తిరస్కరించినందుకు
ఎవరో అమర్త్యుడు చేసే రోదనే, ఈ తుఫాను.
222
మృత్యువు ఒక పగులు కాదు
అందుకే ప్రపంచం కారిపోదు.
223
పోగొట్టుకొన్న ప్రేమలతో జీవితం
మరింత సుసంపన్నమయింది.
224
మిత్రమా! నీ హృదయం,
సూర్యోదయంతో కలిసి వెలుగుతోంది.
సూర్యాస్తమయపు ఏకాకి హిమగిరిలా.
225
మృత్యు జలసూత్రం
జీవితపు నిశ్చల జలాలను
ఆటాడిస్తూంటుంది.
226
నీవు తప్ప మరేమీ లేని వారు
వారు తప్ప మరేమీ లేని వారిని చూసి
నవ్వుకొంటున్నారు, ప్రభూ!
227
స్వీయ సంగీతం లోనే
జీవనోద్యమానికి విశ్రాంతి.
228
పదఘట్టనలు భూధూళి ని
మాత్రమే రేపగలవు
పంటలను కాదు.
229
రాత్రి వేళ సాగర కెరటాలపై
సంతకం చేయకుండానే అంతరించే
కాంతి తళుకుల వంటివి మన పేర్లు.
230
గులాబీని చూసే కళ్లున్న వాడిని
ముళ్లనీ చూడనివ్వండి.
231
పక్షి రెక్కలను స్వర్ణంతో అలంకరించిచూడండి.
ఇక అది ఎప్పటికీ ఆకాశాన ఎగరదు.
232
అపరిచిత జలాలలో కూడ
మన ప్రాంతపు కలువ అంతే అందంగా
వికసిస్తోంది, మరో పేరుతో.
233
హృదయం దృష్టిలో దూరమంటే
దిగంతాలు కలుసుకొనే చోటే!
234
చందమామ కాంతి ఆకాశమంతటికీ
మచ్చలు తనకు మాత్రమే!
235
దీన్ని ఉదయమనకు లేదా
నిన్నటి పేరేదో పెట్టి తిరస్కరించకు.
మొదటి సారిగా చూసే అనామక
నూత్న శిశువులా దీన్ని స్వీకరించు.
236
జ్వాలకు సహోదరులైన
పొగ పటాటోపంతో నింగికీ
బూడిద నేలనూ చేరాయి.
237
"నీ హృదయంలో ఎప్పటికీ నన్నుంచుకోవూ?”
అంది వాన చినుకు మల్లియతో రహస్యంగా.
"అయ్యోరాత" అని నిట్టూర్చి, మల్లియ నేలరాలింది.
238
పిరికి ఆలోచనల్లారా
నన్ను చూసి భయపడకండి.
నేనో కవిని.
239
కీచురాళ్ల శబ్ధాలతో నా హృదయపు
పలచని నిశ్శబ్ధం నిండిపోయింది.
మసక వెన్నెల మేళం.
240
తారాచువ్వలు నింగికి లేస్తూ
నక్షత్రాలను చేసిన పరిహాసం
వాటివెనుకనే నేలను చేరింది.
241
నా దైనందిక కిక్కిరిసిన యాత్రల నుండి నన్ను
సాయింకాలపు ఏకాంతంలోకి నడిపించావు .
దాని అర్ధం కోసమై, నిశ్చల రాత్రంతా
అలా ఎదురుచూస్తూనే ఉన్నాను, ప్రభూ.
242
ఈ జీవితం ఓ సముద్ర యానం.
మనం ఒకే ఇరుకు ఓడ లో కలుసుకుంటాం.
మృత్యువనే తీరాన్ని చేరి
మన మన భిన్న లోకాలలోకి వెళిపోతాం.
243
భ్రమలనే తన నదులలో
సత్య ప్రవాహం పారుతూంటుంది.
244
కాలసంద్రంలో ఒకానొక మధురఘడియకై
నా హృదయం ఇంటిబెంగ పెట్టుకొంది.
245
పుడమి ప్రతిధ్వనించే
ఉదయకాంతే, పక్షిపాట.
246
“నను ముద్దిడేంత స్వాతిశయమా నీకు"
ఉదయకిరణాలు అడిగాయి వెన్నముద్దను.
247
"నిన్నే గానం చేస్తూ పూజించటమెలా?"
సూర్యుని అడిగింది ఓ చిన్ని పూవు.
'స్వచ్ఛమైన నీ నిశ్శబ్ధం ద్వారా"
బదులిచ్చాడు సూర్యుడు.
248
మనిషి ఒక జంతువు అనుకొంటే
మృగం కన్నా హీనుడు అతను.
249
కరిమబ్బుల్ని కాంతి ముద్దిడగా
అవి దేవలోక సుమాలైనాయి.
250
పిడి మొద్దుగా ఉందని కత్తి అంచు
పరిహాసమాడకుండు గాక!
251
రాత్రి మౌనం ఒక సుదూర దీపంలా
తన పాలపుంత కాంతితో వెలుగుతోంది.
252
జీవితమనే సుందర ద్వీపం చుట్టూ
రేయింబవళ్ల అనంత మృత్యుగీతం
సాగరమై ఉబుకుతోంది.
253
ఈ పర్వత శ్రేణి ఓ పుష్పంలా లేదూ?
తన రేకల గిరులతో సూర్యకాంతిని పీల్చుకొంటో!
254
అవాస్తవం అంటే
తప్పుడు భాష్యం చెప్పబడ్డ వాస్తవం,
తప్పుడు చోట చేయబడ్డ వక్కాణింపు.
255
హృదయమా! నీ సౌందర్యాన్ని
ప్రాపంచిక చలనాలలో దర్శించు.
జలాలనూ, గాలిని ప్రతిబింబించే పడవలా.
256
కళ్ళు తమ అద్దాలకు గర్విస్తున్నాయట
తమ దృష్టికి కాక.
257
నేను నాదైన ఈ చిన్న ప్రపంచంలో నివసిస్తూ,
దాన్ని త్యజించటానికై సంకోచిస్తూ ఉంటాను, ప్రభూ!
నన్ను నీ లోకంలోకి తోడ్కొని నా సర్వస్వాన్ని
సంతోషంగా కోల్పోయే స్వేచ్ఛనీయవా, దేవా!
258
అధికారంలో పెరిగినంతమాత్రాన
అబద్దం ఏనాటికీ సత్యంగా ఎదగలేదు.
259
శుభదినపు హరిత ప్రపంచాన్ని
తన గాన కెరటాలతో తాకేందుకు
నా హృదయం ఉవ్విళ్ళూరుతోంది.
260
ఒడ్డున పెరిగే గడ్డిపోచా నక్షత్రాలను ప్రేమించు.
నీ స్వప్నాలు సుమాలుగా వికసిస్తాయి.
261
ప్రభూ!
నీ సంగీతం ఒక కరవాలం వలె ఈ బజార్ల
రణగొణ ధ్వనులను సమూలంగా చీల్చేయనీ.
262
ఈ గలగలలాడే ఆకులు, నా హృదయాన్ని
చిన్నారి శిశువు చేతివేళ్లలా స్పృశిస్తున్నాయి.
263
నా హృదయ విషాదం
తన పెండ్లి కుమార్తె మోము తెరవంటిది.
రాత్రి అది తొలగింపబడేందుకై
ఎదురుచూస్తోంది. (ఇది 98 పద్యమే)
264
చిరు కుసుమం
దుమ్ములో పడి ఉంది.
అది సీతాకోక చిలుక మార్గాన్ని
వెంబడించిందట.
265
దారుల ప్రపంచంలో నేనున్నాను. రాత్రి వచ్చి,
నీ లోకమనే ఇంటితలుపు తెరుస్తుంది, ప్రభూ!
266
నీ సమక్షంలో పాటలు పాడాను.
ఆ సాయింత్రపు గాలివాన దారిలో
నీ దీపాన్ని మోసుకుంటో సాగిపోనీ, ప్రభూ!
267
నా ప్రియతమా!
నిన్ను నా ఇంటిలో ఉండమనలేదు.
నా అనంత ఏకాంతంలోకి రమ్మంటున్నాను.
268
చావు జీవితానికి చెంది ఉంది పుట్టుకలానే.
అడుగు తీసి వేయటమే నడకైనట్లు.
269
పూవులు, సూర్యకాంతులతో నీ గుసగుసల
సారాంసం లీలగా తెలుసుకొన్నాను.
మృత్యువు, బాధలతో నీ సంభాషణల జ్ఞానాన్ని
భోధించవా ప్రభూ!
270
ఉదయచుంబనానికి రాత్రి పూవు ఆలస్యమైంది.
వణుకుతూ, నిట్టూరుస్తూ, నేలరాలింది.
271
సమస్త శోకాలలోనూ నాకు
జగన్మాత జోలపాట వినిపించును.
272
నా మట్టి నేస్తమా!
నీ తీరానికి నేనో అపరిచితుడనై వచ్చాను.
నీ గృహంలో ఓ అతిధి వలె వశించాను.
ఓ మిత్రుని వలె శలవు తీసుకొంటున్నాను.
273
తారల నిశ్శబ్ధపుటంచున మెరిసే
సూర్యాస్తమయానంతర తళుకులా
నా నిష్క్రమణానంతరం నా ఆలోచనలు
నిను చుట్టుముడతాయి.
274
సాయింకాల విశ్రాంతి నా హృదయంలో కాంతులీనుతోంది.
ఎన్నో ప్రేమరహస్యాలను, ఆరాత్రి నా చెవిలో తెలిపింది.
275
చీకటిలో ఉన్న శిశువును నేను.
రాత్రి దుప్పటి లో చేతులు చాచి
నీకై తడుముకొంటున్నాను, తల్లీ!
276
నా దిన చర్య పూర్తయింది.
నా మోము నీ ఒడిలో దాచుకొని
స్వప్నించనీ, తల్లీ!
277
కలిసున్నంత సేపూ
దీపం వెలుగుతూనే ఉంటుంది.
విడిపోయే సమయానికే
అది కొండెక్కుతుంది.
278
ఓ ప్రపంచమా!
“ప్రేమికుడు" అన్న ఒక్క పదాన్ని
నా పార్ధివ దేహ మౌనంపై ఉంచెదవా!
279
ఈ లోకాన్ని ప్రేమించినపుడే
దానిలో జీవించగలం.
280
మృతులకు అమరకీర్తిని
మనుజులకు అమృత ప్రేమను
కరుణించు ప్రభూ!
281
ఉదయాంతాన తల్లిని చూసి నవ్వి
నిదుర మత్తు ఇంకా వదలక
మరలి పరుండిన శిశువు లా
నిను నే దర్శించాను, ప్రభూ.
282
నేను మరల మరల మరణిస్తాను.
283
ప్రభూ, నేను జనసందోహం మధ్య నడుస్తున్నపుడు
మేడ మీంచి వినిపిస్తున్న నీ దరహాసాన్ని చూసాను.
రణగొణ ధ్వనుల్ని మరచి, నీ గానంలో మునిగిపోయాను.
284
ద్రాక్షరసంతో నింపబడిన పాత్రికలా
జీవితం ప్రేమతో నిండి ఉన్నది.
285
వాళ్ళు వారి వారి దీపాలను వెలిగించుకొని
తామే వ్రాసుకొన్న గీతాలను
తమ ఆలయాల్లో గానం చేస్తున్నారు.
కానీ పక్షులు,
నీవు కరుణించిన ఉదయకాంతిలో
నీ నామాన్నే గానం చేస్తున్నాయి.
నీ నామమే బ్రహ్మానందము కాదూ!
286
నీ నిశ్శబ్ధం నడుమ నన్ను నడిపించి
గీతాలతో నా హృదయాన్ని నింపేయి, ప్రభూ!
287
మతాబు వెలుగుల లోకాన్ని
కోరుకొనే వారిని అలానే జీవించనీ.
నా హృదయం మాత్రం
నీ నక్షత్రాలకై నిరీక్షిస్తున్నది, ప్రభూ!
288
నా జీవితాన్ని ప్రేమవేదన పెనవేసుకొని
లోతు తెలియని సంద్రంలా గానం చేసింది.
ప్రేమానందం తన పూవనంలో పరిమళించే
కోయిల పాటలను పాడి వినిపించింది.
289
నీ ఇచ్ఛ అదే అయితే దీపాన్ని నిలిపివేయి ప్రభూ,
నేను నీ అంధకారాన్ని తెలుసుకొని, ప్రేమించాలి కదా!
290
దినాంతాన నేను నీముందు నిలుచున్నపుడు
నీవు నా గాయాల మచ్చలను చూస్తావు,
నేను గాయపడి, స్వస్థత పొందానని గ్రహిస్తావు.
291
ఏదో ఒకనాడు మరో ప్రపంచపు సూర్యోదయాన
నీ ముందు మోకరిల్లి నేను నీ పాటలను ఆలపిస్తాను.
నిను అప్పటికే నేను చూసి ఉంటాను, ప్రభో!
మట్టి కాంతిలోనో, మానవ ప్రేమలోనో!
292
ఆనాటి మేఘాలు
వర్షించటానికో, లేక తుఫాను సృష్టించటానికో కాక
నా సాయింసంధ్యాకాశాన్ని వర్ణమయం చేసేందుకు
అలా తేలుతూ వస్తున్నాయి.
293
సత్యబీజాల వ్యాప్తిని విచ్ఛిన్నం చేసే
గాలివానను, సత్యమే స్వశక్తితో ఎదిరిస్తోంది.
294
రాత్రి వచ్చిన గాలివాన ఈ ఉదయాన్ని
స్వర్ణ శాంతి కిరీటంతో అలంకరించింది.
295
సత్యం చివరిమాటను వెంటేసుకొచ్చినట్లు అగుపిస్తుంది
కానీ, తుదిపలుకు, మలిపలుకుకు జన్మనిస్తుంది.
296
కీర్తి క్షయింపలేని సత్య ధారి
ఎంతటి ధన్యజీవి!
297
ప్రభూ, నన్ను నీకు అర్పించుకొన్ననాడు
నీ నామమాధుర్యంతో నాహృదయం నిండిపోయింది.
పొగమంచు కరిగినపుడు, బయటపడ్డ భానోదయంలా!
298
ఈ మౌన రాత్రిలో
అమ్మ అనురాగము
పిల్లవాని అల్లరి పగలు
దాగి ఉన్నాయి.
299
మానవుడు నవ్వినపుడు ఈ లోకం హర్షించింది.
పరిహసించినపుడు అది భీతినొందింది.
300
మానవుడు జ్ఞానంతో
తన బాల్యాన్ని తిరిగి పొందేదాకా
ఈశ్వరుడు ఎదురుచూస్తాడు.
301
ప్రభూ!
ఈ లోకం నీ ప్రేమ రూపమని గ్రహించనీ
అపుడు
నాప్రేమ కూడా పాలుపంచుకొంటుంది.
302
నా హృదయపు శిశిర దినాలపై
నీ సూర్యోదయం నవ్వులు చిందిస్తోంది.
నా వసంతాగమనం పట్ల రవంత
అనుమానం లేకుండా!
303
ఈశ్వరుడు
తన ప్రేమలో అశాశ్వతాన్ని ముద్దు చేస్తూంటాడు
మానవుడు అనంతం కొరకై వెతుకుతూంటాడు.
304
నిష్ఫల వత్సరాల ఎడారి ఇసుకలలో
మోక్ష తరుణం కోసమై నీవు సాగెదవు.
305
ఈశ్వరుని మౌనం మానవ ఆలోచనలను
మాటలుగా ఫలింపచేయును.
306
నిత్య పధికుడా! నా పాటల దారిలో
నీ పాదముద్రలను పోల్చుకొనినావా?
307
నీ ఘనతను నీ పిల్లలమైన మాలో పొందుపరచిన
నిన్ను సిగ్గు పడేటట్లు మమ్ము చేయనీయకు ప్రభూ!
308
దినం సంతోషరహితంగా ఉంది.
కారు మబ్బుల క్రింది కాంతిపుంజం
తన పాలిన బుగ్గలపై కన్నీళ్లులతో
శిక్షింపబడిన బాలునివలె ఉంది.
గాయపడ్డ ప్రపంచ రోదనను గాలి వినిపిస్తోంది.
కానీ నాకు తెలుసు నేను నా మిత్రుని
కలుసుకోవటానికై వెళుతున్నానని.
309
ఈ రాత్రి, కొబ్బరాకులు గలగల మంటున్నాయి.
సాగరం ఎగసి పడుతోంది.
చందమామ ఈ ప్రపంచపు హృదయ రాజ్ఞి యైంది.
ఏ తెలియని దిగంతాలనుంచి ఈ బాధించే
ప్రేమ రహస్యాన్ని నీవు తీసుకొచ్చావూ!
నా మౌనంలోకి.
310
నేను స్వప్నిస్తున్నాను. ఒక నక్షత్రాన్ని, ఒక వెలుతురు ద్వీపాన్ని. నేనచటే పుడతానట, నా జీవిత కాల తపస్సు అచటే ఫలించునట, శరత్కాల సూర్యకాంతిలో పండిన వరిచేనులా!
311
నిరర్ధక మూగ సమూహాలు నీ ఘనతను
శ్లాఘిస్తూ జపించిన మధుర కీర్తనలా అన్నట్లు
వానలో తడచిన మట్టి వాసన లేచింది, ప్రభూ!
312
ప్రేమ ఎప్పుడైనా ఓడిపోవచ్చునన్న నిజం
మనమెప్పటికీ ఆమోదించలేని ఒక సత్యం.
313
మన జీవాత్మ ఆర్జించిన సంపదను
మృత్యువు దోచుకుపోలేదనీ
ఆత్మైశ్వర్యం ఆత్మలోనే ఉన్నదనీ
ఒక నాటికి తెలుసుకొంటాము.
314
వసివాడని నా గతకాల పూలను సజ్జలో వేసుకొని.
ఈశ్వరుడు నా సాయింసంధ్యలోకి ప్రవేశించేను.
315
నా జీవన తంత్రులన్నీ శ్రుతి చేయబడినపుడు
నీ ప్రతీ స్పర్శకూ, ప్రేమ సంగీతం పెల్లుబుకుతుంది, ప్రభూ!
316
సత్యనిరతుడనై ఉండేట్లు కరుణించు ప్రభూ!
అపుడు చావు అనే సత్యం నాకు భోధపడుతుంది.
317
అవమానింపబడిన మనిషి విజయం కోసం
మానవ చరిత్ర ఓపికగా నిరీక్షిస్తోంది.
318
పంటకోసిన ఒంటరి పొలాల పై పడే
ఉదయపు మౌన రవికిరణాలలా
నా హృదయంపై ఈ క్షణం, నీ తీక్షణ
దృక్కులు ప్రసరిస్తున్నాయి ప్రభూ!
319
ఎగసిపడే ఈ వెర్రికేకల సంద్రంలో
సురాగాల ద్వీపం కొరకై నే నిరీక్షిస్తున్నాను.
320
అనిర్వచనీయమైన
చీకటిపై సూర్యాస్తమయం
గానం చేసిన గంభీర కీర్తన తోనే
రాత్రి ఆలాపన మొదలైంది.
321
నేను కీర్తి శిఖరాన్నధిరోహించాను.
ఆ నిష్ఫలఎత్తు, శీతగాలులలో మరుగులేకుండెను.
నన్ను నడిపించు మార్గదర్శీ!
ఎక్కడైతే జీవితపు ఫలాలు ఆత్మ జ్ఞానముగా పరిపక్వమౌతాయో,
అట్టి ప్రశాంత లోయల్లోకి
చీకటి పడేలోపు నన్ను తీసుకు వెళ్ళు.
322
సాయింకాల మసక వెలుతురులో ఈ ప్రపంచం వింతైన సొబగులద్దుకొంది.
తరువుల మూలాలు చీకట్లో కలసి పోయాయి.
చెట్ల అగ్రాలు శిరా మరకల వలెనున్నాయి.
ఉదయం వరకూ ఆగి నీ నగర సౌందర్యాన్ని
వెలుగులో చూస్తాను, ప్రభూ!
323
నేను బాధపడ్డాను. నిరాశచెందాను. మృత్యువుని చూసాను.
నీ ఘనమైన లోకంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది ప్రభూ!
324
నాజీవితములోని కొన్ని ప్రదేశాలు ఖాళీగానూ, మౌనంగానూ ఉండేవి.
నా తీరికలేని రోజులకు గాలినీ, వెలుతురునీ అందించిన ఆరుబయళ్లవి.
325
నన్ను పట్టుకొని నా మృత్యువుని నిలుపుచేసే
నా అసంపూర్ణ గతంనుండి నన్ను విముక్తుడిని చేయి ప్రభూ!
326
నీప్రేమలో నాకు విశ్వాసము కలదనెడి మాటే నా చివరిమాట.
బొల్లోజు బాబా
Tuesday, January 6, 2009
విశ్వకవి రవీంద్రుని స్ట్రే బర్డ్స్ కు తెలుగు అనువాదం 101-200
పూర్ణిమ గారికి, సుజాత గారికి, ఆత్రేయగారికి, మెయిల్ పంపిన కొత్త పాళీగారికి, సుఅనానిమస్ గారికి, గిరీష్ గారికి, ధన్యవాదములు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
ఇది రెండవ భాగము. ఇందులో 101-200 వరకు పద్యపాదాలుంటాయి.
101
ధూళి నిత్యం పరాభవాల్ని పొందుతుంది.
బదులుగా తన సుమాలను సమర్పించుకొంటుంది.
102
పూలు సేకరించటానికై ఆగి పోకు
నడుస్తూనే ఉండు. అపుడు
వాటంతటవే నీ మార్గం
పొడవునా వికసిస్తూంటాయి.
103
వేళ్లు భూమిలోకి విస్తరించిన కొమ్మలు
కొమ్మలు గాలి లోకి చొచ్చుకొన్న వేళ్లు.
104
సుదూర వేసవి సంగీతం
తన పూర్వ కులాయాన్ని అన్వేషిస్తూ
చలికి గజగజ లాడుతుంది.
105
నీ జేబులోని అర్హతలను ఎరువిచ్చి
నీ మిత్రుని అవమానించకు.
106
వృద్దతరువు చుట్టూ పట్టిన నాచులా
అనామక దినాల స్పర్శ
నా హృదయాన్ని అంటి పెట్టుకొనే ఉంది.
107
ప్రతిధ్వని తన మూలాన్ని వెక్కిరిస్తుంది
అదే తన మాతృక అని నిరూపించటానికై.
108
ఈశ్వరుని ప్రత్యేక దీవెనలు తమకున్నాయని
శ్రీమంతులు చెప్పుకొంటూంటే
ఆయన తలదించుకొన్నాడు.
109
నా దీపం ఇంకా వెలిగింపబడలేదు.
నా నీడ నా మార్గం పైనే పడుతోంది.
110
తన మౌన కోలాహలాన్ని
నిమజ్జనం చేయటానికై
మనిషి రణగొణ ధ్వనుల
సమూహంలో దూరాడు.
111
అలసటలో ముగిసేది మృత్యువు మాత్రమే
సంపూర్ణ ముగింపు అనంతంలోనే ఉంది.
112
సూర్యుడు ఉత్త వెలుగు దుస్తులనే
ధరించి ఉన్నాడు.
మేఘాలు మాత్రం మెరుపుల
పటాటోపం ప్రదర్శిస్తున్నాయి.
113
చేయి చాచి తారలను అందుకోయత్నించే
పిల్లల కేకల వలే ఉన్నాయి పర్వతాలు .
114
ప్రేమరాహిత్యపు రహదారి
సమూహంలో కూడా ఒంటరిదే.
115
అధికారం తన తుంటరి పనులను శ్లాఘించుకొంటోంది.
రాలే పండుటాకులు, కదిలే మేఘాలూ నవ్వుకొన్నాయి.
116
సూర్యకాంతిలో పుడమి
వసంత మోహినిలా ఉందీవేళ.
ఒక ఆదిమ పల్లె పదాన్ని
విస్మరింపబడ్డ స్వరంతో అది
ఝుంకారం చేస్తోంది.
117
తాను పెరిగే మహా ప్రపంచంతో
సమాన విలువను కలిగి ఉంది గడ్డిపరక .
118
స్వప్నం మాట్లాడే భార్య
నిద్ర మౌనంగా భరించే భర్త
119
వర్ణము తప్పుతున్న పగలుని ముద్దిడి
చెవిలో రహస్యంగా అంది రాత్రి.
"నేను మృత్యువుని, నీ తల్లిని, నీకు నూతనోదయాన్నీయబోతున్నాను"
120
నిశి రాతిరీ!
దీపమార్పిన నా ప్రియురాలి స్పర్శలా
నీ సౌందర్యం నాకు తెలుస్తోంది.
121
నేమోసుకు తిరిగే నా ప్రపంచం
నా వైఫల్యాల లోకాలన్నింటినీ
క్షేమంగానే చూసుకొంటూంది.
122
మిత్రమా,
ఈ సాయింత్రపు వేళ సాగర తీరాన కూర్చొని
అలలను ఆలకించినపుడు నీ ఘనమైన ఆలోచనల
మౌనాన్ని దర్శించగలిగాను.
123
చేపను గాల్లోకి ఎగరేసుకుపోవటం
ఒక దయాపూరిత చర్య అని భావిస్తుంది పక్షి.
124
చంద్రునితో సూర్యుడు పంపించిన
ప్రేమలేఖలకు తన జవాబును
గరికపై కన్నీళులతో రచించింది - రాత్రి.
125
ఉత్తముడు జన్మత: బాలుడే
తన ఘనమైన బాల్యాన్ని
ప్రపంచానికిచ్చేసి వెళ్ళి పోతాడు.
126
నీటి నృత్య హేల మాత్రమే
గులక రాళ్లకు నునుపుదనాన్నిస్తాయి.
సమ్మెట దెబ్బలు కావు.
127
తేనీగలు మకరందాన్ని గ్రోలి
తమ కృతజ్ఞతను ఝుమ్మనిపిస్తో సాగిపోతాయి.
సొగసరి సీతాకోక చిలుకకు తెలుసు
పూవులే తనకు ఋణపడ్డాయన్న విషయం.
128
వాచాలిగా ఉండటం సులభమే
సంపూర్ణ సత్యావిష్కరణకై
కాచుకొని ఉండలేనపుడు.
129
“నీ విలాసమెచటా? అని
సాద్యం అడిగింది అసంభవాన్ని.
"దుర్భలుల స్వప్నాలలో"
జవాబు వచ్చింది.
130
అన్ని తప్పిదాలకూ
నీ తలుపులు మూసివేస్తే
సత్యం నిను చేరజాలదు.
131
నా హృదయ విషాదం వెనుక
ఏవో గుసగుసలు వినబడుతూన్నాయ్
-చూడలేకున్నాను.
132
శ్రమే విశ్రాంతికి వ్యాపకం.
సాగర నిశ్చలత
కెరటాలై పడిలేస్తూంటుంది.
133
ప్రేమలో పత్రం పుష్పమౌతుంది
ఆరాధనలో పుష్పం ఫలమౌతుంది.
134
కొమ్మల్ని ఫలింపచేసినందుకు
మట్టి లోని వేళ్లు పారితోషకాన్ని కోరవు.
135
ఈ వర్షించే సాయింకాలపు గాలి అలజడి రేపుతోంది.
ఊగే కొమ్మలను చూస్తూ,
ఈ అద్భుతాల పట్ల అలా ఆలోచిస్తూ ఉండి పోయినాను.
136
వేళ కాని చీకట్లలో మేల్కొని
అరుస్తూ, క్రీడించే మహా శిశువువలె
ఉంది ఈ నడి రేయి తుఫాను.
137
తుఫాను యొక్క ఒకే ఒక
చెలికత్తెవైన ఓ సంద్రమా
నీ ప్రియుని వెంబడిస్తూ నీవు రేపే
కెరటాలెంత నిష్ఫలమైనవి.
138
“నా శూన్యతకు నాకు సిగ్గేస్తుంది" పదం అంది పని తో
“నిన్ను చూస్తుంటే నేనెంత పేదరాలినో
నాకు తెలుస్తూంది" పని అంది పదంతో
139
కాలం అంటే పరివర్తన మనెడి ఐశ్వర్యం
కానీ, గడియారపు ప్రహసనంలో అది
ఉత్త మార్పే తప్ప ఐశ్వర్యం అవుట లేదు.
140
వాస్తవాల దుస్తులు సత్యానికి
చాలా బిగుతుగా ఉంటాయి.
కల్పన అనే దుస్తులు దానికి ఎంతో హాయి.
141
ఓ మార్గమా!
అక్కడకీ, ఇక్కడకీ ప్రయాణించేపుడు
నీ పట్ల నాకు విసుగు కలిగేది.
ఇప్పుడు నువ్వు నన్ను అన్ని చోట్లకూ
తీసుకువెళుతున్నావు కదా!
నీ ప్రేమలో బంధింపబడ్డాను.
142
నా జీవితపు తెలియని చీకట్లలో
ఆ అనంతనక్షత్రాలలో ఒకటి
నన్ను నడిపిస్తుందని భావించనీ, ప్రభూ!
143
మగువా!
నా ప్రపంచాన్ని నీ సొగసరి
అంగుళులతో స్పృశించావు , అంతే
ప్రశాంతత సంగీతమై పల్లవించింది.
144
కాల శిధిలాల మధ్య ఒక విషాద స్వరం
గూడుకట్టుకొని ఉంది.
నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ - అది
రాత్రివేళల పాడుతూంటుంది.
145
జ్వలించే అగ్ని తన తేజస్సుతో నన్ను హెచ్చరించి
నివురు మూసిన నిప్పునుండి నన్ను రక్షిస్తుంది.
146
ఆకాశం నిండా నా నక్షత్రాలే
పాపం, నా ఇంటిలోని చిరుదీపం
వెలిగింపబడనే లేదు.
147
మృతపదాల ధూళి నీ దేహంపై పరుచుకుంది.
నీ ఆత్మను మౌనంతో కడిగివేయి
148
జీవితంలోని ఖాళీలలోంచి విషాద
మృత్యు సంగీతం వినిపిస్తూంది.
149
ఈ ఉదయాన
లోకంతన కాంతి హృదయాన్ని తెరచింది.
ఓ! నా మనసా ప్రేమ నింపుకొని రా
దానిని ఆహ్వానించేందుకు.
150
ఆకులతో కూడి
నా ఆలోచనలు గలగల లాడుతున్నాయి.
సూర్యకాంతి స్పర్శకు నా హృదయం గానం చేస్తోంది.
కాల చీకట్లలోకీ, వినీల విశ్వంలోకీ
ఈ అనుభవాలతో తేలుతూ
సాగుతున్నందుకు నాజీవితం సంతసిస్తూంది.
151
మహాబలుని శక్తి
పిల్లతెమ్మెరలో ఉంది.
తుఫానులో కాదు.
152
ఒక స్వప్నంలో ఈ ప్రపంచమంతా
చెల్లాచెదురై బాధ పెడుతూ ఉండింది.
మెలుకవ వచ్చేసరికి అవన్నీ నీలో చేరాయి.
నాకెంతో తేలికగా ఉంది , ప్రభూ.
153
“నా బాధ్యతను ఎవరు తీసుకొంటారు?"
అడిగింది అస్తమిస్తున్న రవిబింబం.
“నాకు చేతనైన సాయం చేస్తాను ప్రభూ"
అంది మట్టి దీపం.
154
తుంచిన రేకలతో
పుష్ప సౌందర్యాన్ని
పునర్నించలేవు, మిత్రమా!
155
నిదురించే పక్షుల్ని ఇముడ్చుకునే కులాయంలా
నీ స్వరాన్ని నిశ్శబ్ధం మోస్తూంటుంది.
156
ఉత్తములు నిర్భయంగా
అర్భకులతో కలసి నడుస్తారు.
మధ్యస్థులే దూరంగా ఉంచుతారు.
157
రహస్యంగా పూలను పుష్పించే రాత్రి
మెచ్చుకోళ్లను పగలుకు వదిలేస్తుంది.
158
తనకోరల చిక్కిన వారు
అటునిటు గుంజుకొనుట
కృతఘ్నతగా భావించును-అధికారం.
159
మన పూర్ణత్వానికి సంతోషించినపుడే
మన ఫలాల వియోగాన్ని స్వాగతించగలం.
160
వానచినుకులు భూమిని ముద్దాడి
రహస్యంగా ఇలా అన్నాయి.
"మేము ఇంటిబెంగ పెట్టుకొన్న నీ పిల్లలం తల్లీ
స్వర్గం నుండి నీకొరకై తిరిగొచ్చేసాం"
161
మంచుబిందువుల్ని పట్టుకొంటునట్లు నటిస్తూ
ఈగల్ని చిక్కించుకుంటూంది సాలెగూడు.
162
మోహమా!
నీవు వేదనా దీపాన్ని చేబూని
వచ్చినపుడు నీ మోము చూసి నీవే
బ్రహ్మానందమని పోల్చుకొన్నాను.
163
'నీ కాంతులు ఒకనాటికి అంతమౌనని విజ్ఞులు అనెదరు" మిణుగురు అంది నక్షత్రాలతో.
నక్షత్రాలు ప్రత్యుత్తరమీయలేదు.
164
సాయం సంధ్య వేళలో
ఉదయరాగపు విహంగం
నా నిశ్శబ్ధపు గూటికి చేరును.
165
నా మదిలోని ఆలోచనలు
ఆకాశంలోపక్షుల గుంపులా కదుల్తూన్నాయి.
వాని రెక్కల చప్పుడు నాకు వినిపిస్తోంది.
166
తనకు నీరందించటానికి మాత్రమే
నది ఉందని అనుకోవటం
కాలువకు ఎంత ఇష్టమో!
167
ప్రపంచం తన వేదనతో
నా హృదయాన్ని ముద్దాడి
బదులుగా గీతాల్ని కోరింది.
168
ఏది నన్ను వేదనకు గురిచేస్తున్నది
బయటకు రావాలని ప్రయత్నిస్తున్న జీవాత్మా లేక
లోనికి రావటానికై , మది తడుతున్న లోకాత్మ యా?
169
ఆలోచన తన పదాల్ని తానే
నెమరువేసుకుంటూ ఎదుగును.
170
ఈ నిశ్శబ్ధ ఘడియలో
నా హృదయ ఖాళీ పాత్రను ముంచాను.
నీ ప్రేమతో అది నిండింది, ప్రభూ.
171
పని ఉండనీ, ఉండకపోనీ
"ఎదో ఒకటి చేద్దాం" అనవలసివస్తే
వెంటనే తుంటరితనం చిగురిస్తుంది.
172
తన అనామక పుష్పాన్ని నాదని చెప్పుకోవటానికి
పొద్దుతిరుగుడు మొక్క సిగ్గుపడింది.
ఉదయించిన రవి , ఆ చిరుసుమాన్ని చూసి నవ్వి,
"సౌఖ్యమా, నా ప్రియతమా" అన్నాడు.
173
విధిలా నన్ను ముందుకు తోస్తున్నదెవరు?
నా వీపున స్వారీ చేస్తున్న నేనే.
174
సుదూర కొండల మాటున
దాగున్న మేఘాలు
నదుల నీటి పాత్రికలను
నింపుతోఉన్నాయి.
175
నడుస్తూన్నపుడు నా బిందెలోని నీరు
కొద్దికొద్దిగా చిందిపోయాయి.
ఇంటికి చేరేసరికి కొంచెమే మిగిలినయ్.
176
బిందె లోని జలం తళుక్కు మంటూంది.
సముద్రపు నీరు గంభీరంగా ఉన్నది.
సిద్దాంతాలు తేట పదాలలో ఉంటాయి.
పరమ సత్యం గొప్ప నిశ్శబ్ధాన్ని ధరించును.
177
నీ దరహాసం నీ పొలాలలోని సుమాలు.
నీ మాటలు నీ పర్వతాల సరుగుడు చెట్ల గుసగుసలు
నీ హృదయం మాత్రం
మేమందరమూ ఎరిగిన లలన.
178
అల్ప వస్తువులను నా ఆత్మీయులకై
విడిచిపెడతాను.
శ్రేష్టమైనవి అందరి కోసము.
179
మగువా!
నీవు ఈ ప్రపంచపు హృదయాన్ని
నీ అశ్రువుల లోతులతో చుట్టుముట్టావు
భూమిని ఆవరించిన సాగరంలా.
180
నవ్వుతో నను
పలకరిస్తున్నది సూర్యకాంతి .
దాని పాపిష్టి సోదరి యైన వాన
నామదితో ఊసులాడుతోంది.
181
ఉదయ సుమం రేకలు రాల్చుకొంది.
సాయింత్రానికల్లా అది
స్వర్ణ స్మృతి ఫలమైంది.
182
తన పాదముద్రల జ్ఞాపకాలను
నిశ్శబ్ధంగా ఆలకించే రాత్రిపూట
రహదారిని నెను.
183
సాయింకాలపు ఆకాశమంటే నాకు
ఒక గవాక్షం
ఒక వెలిగించిన దీపం
ఒక నిరీక్షణ.
184
మంచి చేయటంలో తలమునకలైన వానికి
మంచిగా ఉండే తీరికుండదు.
185
వానలు నిండుకున్న
శరత్కాల మేఘాన్ని నేను
నా నిండుతనమంతా
పండిన వరిచేలల్లో ఉంది.
186
వాళ్లు అసహ్యించుకొన్నారు, చంపేసారు.
ప్రజలు వారిని పొగిడారు.
దేముడు సిగ్గుపడి
ఆ జ్ఞాపకాలని హడావిడిగా
పచ్చగడ్డి క్రింద కప్పెట్టేసాడు.
187
బండగా కనిపించే కాలి వేళ్లు
ఒకప్పటి కోమలమైన చేతివేళ్లే.
188
చీకటి వెలుగు వైపుకు
ప్రయాణిస్తుంది. కానీ
అంధత్వం మరణం వైపుకు.
189
ఈ ప్రపంచం కుట్రపన్ని తనస్థానాన్ని
కైవసం చేసుకోగలదని
పెంపుడు కుక్కకు అనుమానం.
190
ఓ నా హృదయమా!
నిశ్చలంగా ఉండు, ధూళి రేపకు.
ఈ ప్రపంచం నిన్ను చేరే
మార్గాన్ని గుర్తించనీ.
191
వేగం పుంజుకొంటున్న బాణంతో
"నీ స్వేఛ్ఛ నాదేనంది" ధనుస్సు.
192
మగువా! నీ నవ్వులో
జీవిత జలసూత్రపు సంగీతముంది.
193
తర్కంతో కూడిన మనసంటే
అన్ని వైపులా పదునున్న కత్తివంటిది.
దాన్నుపయోగించే చేయి
నిత్యం రక్తమోడుతూంటుంది.
194
తన గొప్ప నక్షత్రాలకంటే
మానవుని చిరుదీపం మెరుగ్గా
వెలగడం ఈశ్వరునికి ఎంతో ఇష్టం.
195
సౌందర్య సంగీతంచే మచ్చికచేయబడ్డ
మహోగ్ర అరణ్య తుఫాన్ల లోకమే ఈ ప్రపంచం.
196
"నా హృదయం నీ చుంబనపు స్వర్ణ బరిణె"
రవితో అంది సాయంసంధ్యా మేఘం
197
బంధించాలనుకుంటే సౌందర్యం వాడిపోవచ్చు.
స్వేచ్ఛనిచ్చిననాడు అదే నిన్ను వరించవచ్చు.
198
చీకట్లో వినిపించే
చిమ్మెట రొద, వానచినుకు చిటపటలు
నా గతించిన యవ్వన స్వప్నాల గలగలలు.
199
అన్ని నక్షత్రాల్నీ కోల్పోయిన ఉదయపు ఆకాశంతో
“నా మంచుబిందువు పడిపోయిందని" ఓ సుమం
ఏడుస్తూ చెప్పుకొంటూంది.
200
"ఇది నా పూవు, నా చావు" అంటూ ఏడ్చుచున్నది
జ్వాలలో పగిలి కాల్తున్న కట్టె.