Showing posts with label బుడుగోయ్ విమర్శపై సమాధానం బొల్లోజు బాబా. Show all posts
Showing posts with label బుడుగోయ్ విమర్శపై సమాధానం బొల్లోజు బాబా. Show all posts

Tuesday, April 13, 2010

బుడుగోయ్ గారి పాద పద్మములకు ........ బొల్లోజు బాబా

బుడుగోయ్ గారి బ్లాగులో నా గురించి వ్రాసిన బొల్లోజు బాబా గారి దివ్య సముఖమునకు... అన్న పోస్టుకు
ఈ సమాధానాన్ని బుడుగోయ్ గారి బ్లాగులో ప్రచురించటానికి బ్లాగర్ ఎర్రర్ (bX-6rscy0)వస్తుంది. కామెంట్ పోస్ట్ అవ్వటం లేదు. కనుక ఇలా పోస్ట్ చేస్తున్నాను.


బుడుగోయ్ గారికి
ముందుగా ధన్యవాదములు. బ్లాగ్లోకంలో నా పేరుతో మొదటి సారిగా ఒక పోస్టు వ్రాసినందుకు :-)

ఒకె ఇక విషయానికి వస్తే

మీరు నా నెరుడా కవితానువాదంపై చేసిన విమర్శ పట్ల నాకు అభ్యంతరాలేమీ లేవు. నేను అక్కడే ఆవిషయాన్ని స్పష్టం చేసాను. ఇక మీది అహంకార ధోరణి అని ఎందుకు అనిపించింది అంటే మీరు వాడిన ఒక వాక్యం
అది

మిగ్లినవి మరోసారి సరిచూసుకొని తిరిగి ప్రచురించండి.

ఒక సారి ప్రచురించేసాకా (బ్లాగులోనో/పత్రికలోనో) మరలా సరిచూసుకొని ప్రచురించమనటానికి మీరెవరు. విమర్శకులు విమర్శించాలంతే. ఉచిత సలహాలు అవసరమా?. దానిని ఇక రచయిత విచక్షణకు వదిలివేయాలి.
(అప్పట్లో నేచేసిన కామెంటు పూర్తిగా కనిపించటం లేదు బహుసా నా బ్రౌజర్ ప్రోబ్లమేమో. అందుకే నా మెయిల్ బాక్సులోంచి మరలా కాపీ పేస్టు చేసాను తాజాగా .)

మీకిచ్చిన సమాధానపు కామెంటు ఆఖరి వాక్యం లో-- నా జ్ఞానమో/అజ్ఞానమో అలానే ఉండనివ్వండి. :-) అని అన్నాను. నా దృష్టిలో ప్రచురించేసాకా అది ఇక నాది కాదు. ఫలానా బుడుగోయ్ అయ్యవారు చెప్పారు కదాని దానిని మార్చి తిరిగి ప్రచురించటం అంత అవమానకరం మరొకటి ఉండదు నా దృష్టిలో. నా రాతల్లో చాలామంది స్పెల్లింగ్ మిస్టేకులు చెపుతూంటారు. వాటిని కూడా నేను అలానే ఉంచేస్తుంటాను మార్చటం ఇష్టం లేక. . (ఒకటి రెండు సందర్భాలు మినహా అదీ బ్లాగు మొదలెట్టిన మొదట్లో)
నా ఉద్దేశ్యం let my ignorance also be known to others అనే.
మీ బ్లాగులోనే జరిగిన ఇస్మాయిల్ నిబద్ద అనిబద్ద కవిత్వం గురించిన చర్చలో చివరకు మీరు నన్ను సంబోదించిన తీరు (మా ప్రాంతంలో మహాప్రభో అని సంభోదించటం అవమానకరం) వల్ల మీ అభివ్యక్తి కొంచెం పంజెంట్ గా ఉంటుందని అనిపించింది.
ఇక చివరి అభియోగం

అఫ్సర్ గారు ఈనాడు మీచేత కానీ నా చేతకానీ కవి అని కితాబులిప్పించుకోవలసిన స్థితిలో లేరు. తెలుగు సాహిత్యానికి ఆయన కంట్రిబ్యూషన్ తక్కువేమీ కాదు. గత పాతిక సంవత్సరాల తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తున్న వారికి తెలుస్తుంది వారి స్థాయి.

ఇక కవిత్వమంటారా - మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అకవిత్వం అనేదే ఒక బ్రహ్మ పదార్ధం. నేను అకవిత్వం అనుకొన్న దాంట్లోంచి గొప్ప గొప్ప ప్రతీకల్ని చూపించగా విస్మయపడ్డ సందర్భాలెన్నోఎదుర్కొన్నాను. నేను గొప్ప కవిత్వం అనుకొన్న వాటిలోని అసంబద్దతల్ని, వ్యాకరణ దోషాల్ని పట్టి చూపించారు మా గురువుగారు చాలా సార్లు.
కనుక కవిత్వం అనేది ఇలాగే ఉండాలని రూల్సేమీ లేవని భావిస్తాను. మీకు నచ్చనంత మాత్రాన మీరు వాడిన పదాల ఘాటు మరీ ఇంతిలా ఉండాలా అనేది నా బాధ.మీరు వాడిన పదాలు
ఊరి చివర — బ్లాగ్లోకంలో ఆహా ఓహోలు చూసి కొన్నాను. i cant believe everyone is going gaga about this book. i found it big bore and i dont think author (cringe to call him poet) knows what is poetry inspite of publishing 4th book.\

ఆయనసలు ఓ కవి అని చెప్పటాని మీరు సిగ్గు పడుతున్నారా? నాలుగో పుస్తకం వేసేసినా ఆయనకు కవిత్వం గురించి తెలియదా?
ఇవసలు మర్యాదకరమైనా వ్యాఖ్యలా? విమర్శ పేరుతో మరీ ఇంత అహంకారం ప్రదర్శించటం మీకు ఉచితం కాదు. (ఇక్కడ ఆయన పెద్దకవా చిన్న కవా అన్న ప్రస్తావన నేను తేవటం లేదు).

కవి అనేవాడు తనకు కలిగిన భావావేశాన్ని అక్షరాలలోకి ఒంపుతాడు. దాన్ని అందుకొనేవారు అతనికెప్పుడూ ఉంటారు. మొత్తం పాఠకులందరితరపునా (ముందుగానే చెప్పాను ప్రతీ కవితకు తగిన రీడర్స్ ఉంటారు మీరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా) వకాల్తా తీసుకొని తీర్మానాలు చేయటానికి మీరెవరు?. విమర్శకునిగా మంచి చెడ్డలు చెప్పండి చాలు. అవమానించొద్దు. కవి అస్థిస్త్వాన్ని ప్రశ్నించటం ఔచిత్యం అనిపించుకోదు అహంకారమవుతుంది.

మీరు కొంపతీసి ప్రముఖుల జాబితాలో ఉన్నారా అని అడిగారు. ఆ భ్రమలైతే నాకు లేవు. మీకేదో అనుమానం ఉన్నట్లుంది -- మీరు నా కవితను విమర్శించినందుకు మీపై ఇలా కక్ష కట్టి తిరిగి మీపై దుష్ప్రచారం చేస్తున్నానని ..... మీరు అలా అనుకొంటూ ఉంటే దానికి I cant help.

ప్రముఖులమీద మీకు ఈ fixation ఏమిటి? అని మీరడిగితే నేనేమీ సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఏమిచెప్పగలను? ప్రముఖుల మీదేమిటి కవిత్వం రాసే అందరిమీదా నాకు ఫిక్సేషనే. వీలైతే బ్లాగులోకంలో నేను చేసిన కొన్ని వేల కామెంట్లలో నేను ఘాటుగా విమర్సించిన (చిన్నవారినుంచి ప్రముఖుల దాకా) కామెంట్లేమైనా ఉన్నాయేమో గమనించండి. ఎందుకంటే బహుసా కవిత్వం రాసే వారే కరువవుతున్న కాలంలో ఒక మంచి వాక్యమో ఒక మంచి పదచిత్రమో కనపడితే సంబరంగానే ఉంటుంది. (కంప్యూటర్లో టైపుచేయగలిగిన వాళ్ళందరూ రాస్తున్నదంతా కవిత్వమే నన్న భ్రమలు నాకూ లేవు)

ఇక మీ ఈ పోస్టులో కూడా నాకు అహంభావం గా అనిపించిన మరో పారా గ్రాఫు

ఇది మన తెలుగులో ఒక సాంప్రదాయం. ఎడాపెడా అనువాదాలు చేయడం. ఒక నలభై, యాభై అవగానే ఓ పుస్తకం అచ్చు వేయడం, స్నేహితులతో ఒక ముందు మాట, రెండు సమీక్షలు రాయించడం, అమాయక పాఠకులు అదేదో బ్రహ్మపదార్థమని కొని చదువుకొని బోర్లా పడడం. ఇవన్నీ మొగ్గలో తుంచేయడానికే కటువుగా తిరుగు సమాధానమివ్వాల్సి వచ్చింది.

మీకు తెలుగు సాహిత్య రంగంపై పూర్తిగా అవగాహన లేదన్న విషయం పై పారాగ్రాఫు తెలియచేస్తుంది. ఈ రోజు తెలుగు కవిత్వసంకలనాలని కొనే నాధుడు కనపడటం లేదు. ఇదే విషయం చాలా చాలా చోట్ల ఉదాహరణలతో చెప్పాను. ఈ నాటికీ శ్రీశ్రీ, తిలక్, గురజాడ కిష్ణశాస్త్రిలను పట్టుకొనే పబ్లిషర్లు వేళ్లాడుతున్నారు. ప్రముఖ కవుల సంకలనాలే వందల్లో కూడా అమ్ముడు పోవటం లేదు. ఇక అక్కడక్కడా వెలువడుతున్న సంకలనాలన్నీ ఆయా కవుల చేతి చమురు తప్ప మరొకటి కాదు. కవితా సంకలనాలు అనేవి కవుల మధ్య పంచిపెట్టుకొనే కరపత్రాలు గా మారాయి అంటే అతిశయోక్తి కాదీవాళ. కవితా అనే పేరుతో అద్భుతమైన సాహితీ విలువలు కలిగిన ఒక పత్రిక ఆర్ధికవనరులు లేక మూతపడింది. మరికొన్ని చోట్ల కొంతమంది కవులు నెలకు చీటిల మాదిరిగా డబ్బులు దాచుకొని ఆడబ్బుతో ఏడాదికి ఒక కవి యొక్క సంకలనాన్ని లాటరీ పద్దతిన ఎంపిక చేసుకొని, తీసుకువస్తున్నారన్న విషయం మీకు తెలుసా?

ఒక సంకలనం తీసుకురావటం అంటే, nothing but becoming poorer by a twenty thousand అంతే అంతకు మించేమీ లేదు. మిత్రులలోను, బంధువులలోను "కవిగారు" అని పిలిపించుకోవటం అనే దురదకు చెల్లించాల్సిన మూల్యం అది. అంతకు మించి ఈ ఆంధ్రదేశంలో కవులకు జరుగుతున్న మర్యాద ఇంకేమీ లేదు. (నేను మాట్లాడుతున్నది వందమందిలో తొంభై అయిదు మంది గురించి). ఇక మిగిలిన ఆ అయిదుగురు కూడా they happend to be poets thats all. వారు కవులు కాకపోయినప్పటికీ ఇప్పుడు దక్కుతున్న గౌరవాలు దక్కించుకోగల సమర్ధులే.
మరో విషయం గమనించారోలేదో నేడు కవులుగా చలామణీ అవుతున్న వారందరూ దాదాపు, పత్రికోద్యోగులో, లేక యూనివర్సిటీ తెలుగు ప్రొఫసర్లో. కవిత్వం వారికో వృత్తి . దేవరాజు మహారాజు గారు ఈ మధ్యే ప్రపంచ కవుల అనువాదాల సంకలనాన్ని తీసుకొచ్చారు "నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది" అని. అవి ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయో మీకు తెలుసా? వీలైతే తెలుసుకోవటానికి ప్రయత్నించండి.

కవిత్వ రచన, దానిపై వచ్చే సమీక్షలు అన్నీ -- పాపం అమాయక రీడర్ని బోర్లా వేయటానికే అన్న భ్రాంతి నుండి బయటపడండి అర్జంటుగా వాస్తవ పరిస్థితులు అలా లేవు.

చివరి వాక్యంలో----ఇవన్నీ మొగ్గలో తుంచేయడానికే కటువుగా తిరుగు సమాధానమివ్వాల్సి వచ్చింది. ---- అని అనటంలోనే మీ స్థానాన్ని మీరెంత హైప్ చేసుకొంటున్నారో అర్ధం అవుతుంది. దీన్ని ఖచ్చితంగా అహంకారమనే అంటాను నేను.

బహుసా ఈ సందర్భంలో మీరు ఒక బోర్లా పడ్డ "కొనుగోలు దారుడు" అవ్వటం ఆ కవి చేసుకొన్న దురదృష్టం.
ఇక కో హం చర్చలో మీ కామెంటులోని టోన్ నాక్కొంచెం ఘాటుగా అనిపించింది. అంత క్రితమే పైన ఉటంకించిన మీ మరో కామెంటు చదివి రావటం జరిగింది. వెరసి నేచేసిన కామెంటు అది.....

వీలైతే నాలుగు మంచి మాటలు చెప్పండి, తప్పొప్పులు సూచించండి, భావాలతో విభేదించండి. అంతే తప్ప, డిరోగేటరీ వ్యాఖ్యలు చెయ్యటం సంస్కారం అనిపించుకోదు, అవాకులు చెవాకులు అవుతాయి తప్ప.

ఎక్కడో జయప్రభ అంటుంది "వాడు ఒకానొక విమర్శకుడు, నేను ఒకే ఒక జయప్రభను" అని -- గుర్తుపెట్టుకోండి సాహిత్యంలో విమర్శకులస్థానం అదే.

అయినప్పటికీ
మీపై నా అభిప్రాయం మరోసారి ......
తెలివైన వ్యక్తే కానీ అభివ్యక్తే ఒకోసారి పచ్చిమిరపకాయ నిలువునా చీరి ముక్కులో దూర్చినట్టుంటుంది."

చాలా రోజుల తరువాత నెట్ లో కొన్ని గంటలు కూర్చోబెట్టారు. :-)
బొల్లోజు బాబా