Showing posts with label ఆత్మహత్య. Show all posts
Showing posts with label ఆత్మహత్య. Show all posts
Thursday, August 7, 2008
పక్కింటబ్బాయి ఆత్మహత్యాయత్నం
మా పక్కింటబ్బాయి
నిన్న రాత్రి ఆత్మహత్యాయత్నం చేసాట్ట.
" పరామర్శించటానికై" వెళ్లా
ఏరా అబ్బాయ్ ఏంజరిగిందీ అంటే
మధుకలశం విష పాత్రికైందన్నాడు.
సైకత సౌధాలను గాలిమొమ్ము తన్నుకుపోయిందన్నాడు.
కనిపించని గోడలకు గుద్దుకొని ఆలోచనలు
ముక్కముక్కలై రాలిపోయాయన్నాడు.
అలా వాడు ఏవేవో అంటూనే ఉన్నాడు.
నేనేం మాట్లాడలేదు.
వాడి భుజంపై చేయివేసి
" పదరా అబ్బాయ్ అలా లోకం చూసొద్దాం"
అంటూ బయటకు తీసుకొచ్చాను.
***********
తల టైరుక్రింద కొబ్బరికాయై " ఠాప్" మని పగలగా
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
ఓ మనసు అప్పటికే సహగమనం చేసేసింది.
మృతుని కూతురి లేత యవ్వనాన్ని అద్దెకు తిప్పటానికై
అప్పటికే కొన్ని కళ్లు పధకాలు రచిస్తున్నాయి.
దగ్ధ భోగీ లోంచి దింపిన, పచ్చికట్టెలా పూర్తిగా కాలని
దేహాలు ప్రశాంతంగా పవళిస్తూ ఉన్నాయి. పక్కనే
ఓ తల్లి తన కొడుకు దేహం కోసం వెతుకులాట.
కాలిన కొడుకు దేహాన్ని అప్పటికే లక్ష సార్లు చూసినా
పోల్చుకోలేక పోవటం ఓ జీవిత కాల విషాదం.
ఇంతకాలం ఆ వృద్ధదంపతులకు చేతికర్రై పరిమళించిన
కొడుకును కాన్సర్ కౌగిలించుకోగా
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
చూపులులేని నాలుగు ముసలి నేత్రాలు,
నేత్రాలు లేని రెండు మొహాలు, మొహాలు లేని రెండు దేహాలు
అవి కోల్పోయిన కూడు, గూడు, గుడ్డా.
ఆ దేహాల్లోకి మెల్లగా నల్లని ఒంటరితనం ఎగబాకుతుంది.
సరిహద్దుల్లో వేయిపిరంగులు పేల్చిన
యోధుణ్ణి ఒక్క బుల్లెట్ ముద్దాడింది.
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
ఒక కుటుంబం రెక్కతెగిన పిట్టలా
గిరికీలు కొడుతూ నేలకూలింది.
శోక కాంతిలో ఒక జాతి మొత్తం,
ఒత్తి కింది మైనంలా ద్రవిస్తూనే ఉంది.
రేప్ అనంతరం పైశాచికంగా చంపబడ్డ విద్యార్ధిని
దేహం ప్రశాంతంగా పవళిస్తూ ఉంది. పక్కనే
ఆకాశమంత ఆక్రోశాన్ని, సముద్రమంత బాధనీ
జ్వలింపచేసుకొన్న హృదయ చితి ఇంకా కాలుతూనే ఉంది.
నక్షత్రాలన్ని అశ్రుబిందువుల్ని
రాల్చుకున్న నేత్రాలు నెరళ్లు తీసి
నెరనెరలో దిగులు మొలకలు లేస్తూనే ఉన్నాయి.
************
పార్ధివ దేహాలెప్పుడూ
ప్రశాంతంగా పవళిస్తూనే ఉంటాయిరా అబ్బాయ్.
నడిచే దేహాలు మాత్రం- ఆ అకస్మిక వియోగ
విషాదంలో ప్రయాణిస్తూనే ఉండాలి.
హఠాన్మరణం వెనుకే ఇంత విషాదం ఉన్నప్పుడు
బలవన్మరణం వెనుక ఇంకెంత ఉంటుందో తెలుసా నీకు?
నీ బాధల్నీ, దైన్యాన్ని, పగిలిన హృదయాన్ని
మరొకరిలోకి బట్వాడా చేస్తున్నావన్న విషయం నీకు తెలియదు.
నీ ఆక్రోశాన్ని, ఆవేదనను, భాధ్యతలనీ, జ్ఞాపకాలని
నీవు చేసిన శూన్యాన్ని
నీ వాళ్లు జీవితాంతం మోసుకు తిరగాల్సిఉంటుంది.
**********
మా పక్కింటి అబ్బాయి పశ్చాత్తాపం
వాని కళ్లను నీళ్ల మడుగు చేసింది.
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)