Showing posts with label సాహిత్యం కవిత్వం ప్రకృతి. Show all posts
Showing posts with label సాహిత్యం కవిత్వం ప్రకృతి. Show all posts

Tuesday, November 15, 2011

మధ్యాహ్నపు నిదురలో ఓ స్వప్నం


ఎడారిలో నడుస్తున్నాను
కనుచూపు మేర చుట్టూ ఇసక
దాహంతో గొంతు మండిపోతూంది
ధూళిపడి కనులు మెరుగుతున్నాయి
గాలి వేడికి శ్వాస ఉక్కిరిబిక్కిరౌతూంది

దూరంగా
ఆకుపచ్చని దుస్తులు ధరించిన ఆమె
నా వేపు చేతులు చాచి
తన కౌగిలిలోకి ఆహ్వానిస్తోంది
ఆమెనుంచి వస్తూన్న అత్తరు వాసన దారిలో
దాహాన్ని ఓర్చుకొంటూ
వేడిని చీల్చుకొంటూ
బాధను అణుచుకొంటూ
కాల్చే ఇసుకలో నడుస్తున్నాను
పరిగెడుతున్నాను... తూలిపోతున్నాను

ఎంత పరిగెట్టినా
ఇద్దరిమధ్యదూరం తరగటం లేదు
అంతు లేని పరుగు ....
వేడి పరుగు ....
కాల్చే పరుగు ....
నెత్తుటి పరుగు.

*****
చల్లని చేతి స్పర్శకు
హఠాత్తుగా మెలకువ వచ్చింది
ఎదురుగా ఆమె మోము

ఇంతసేపు ఆమె ఒడిలో
నిద్రిస్తూ కలకంటున్నానా!

ఎంతసేపటినుంచి
నా బరువుని మోస్తూందామె?

బొల్లోజు బాబా