
నెత్తిన దిగే మేకుల్లాంటి బూతు మిళితపు ఆజ్ఞల్లో
నేల చూపుల కళ్ళు స్రవించే నెత్తుటిబూడిదలో
సముద్రపొడ్డున గవ్వలేరుకోవాల్సిన
బాల్యమంతా క్షతగాత్రుని రోదనయినపుడు....
చందనపు పూతక్రింద చంద్రుని వెన్నెలతో
పోటీ వచ్చే మేని ఛాయై శోభిల్లవలసిన
యవ్వనాన్నంతా గోరింటాకు చేసి
విటుల కండరాల కోరలకు అద్దే పరిస్థితుల్లోనో లేక
కండరాల్ని సముద్రం చేసే ప్రయత్నంలోనో
రొచ్చుగుంటయిన దేహంతో
అంటించబడ్డ క్రొవ్వొత్తిలా (ఎవరంటించారు?)
యవ్వనం రాత్రికి రాత్రి హతమైనప్పుడు......
కాలం ఊయలీకరించాల్సిన జీవితం
బాధల వృక్షానికి శిలువవేయబడి
గాయాల్ని శ్వాసిస్తుంటే......
మీరాశించే పరిణతి మాకెక్కడ సాధ్యం?
మీరు శాసించే నాగరికత మాకెక్కడ లభ్యం
అందుకే పచ్చబొట్ల వలువల్ని ధరించి
తిరిగి భవిష్యత్తులోకే మా పయనం
బొల్లోజు బాబా
(8-11-91 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన నా కవిత.
అందులో ఇంకా కొంచెం ఫ్రెష్ నెస్ ఉన్నట్లు అనిపించి పోష్టు చేస్తున్నాను. )