Sunday, April 12, 2026

గ్రామదేవత గొంతెమ్మ వృత్తాంతం

గొంతెమ్మ/గొంతాలమ్మ భారతంలోని కుంతీదేవి అంశ అని జానపదుల విశ్వాసం. ఆంధ్రమహాభారతంలో కుంతీదేవిని గొంతి అని సంబోధించడం అనేకచోట్ల కనిపిస్తుంది.
దళిత వర్గాలు 'గొంతెమ్మ' లేదా 'గొంతాలమ్మ' పేరుతో కుంతీ దేవిని తమ ఇలవేల్పుగా పూజించడం వెనుక అనేక జానపదగాథలు, సామాజిక పౌరాణిక అంశాలు ఉన్నాయి.
అగ్రవర్ణాల వారు కుంతీదేవిని తప్పు చేసిన శాపగ్రస్తురాలిగా భావించి దేవతగా అంగీకరించలేదు. కానీ, దళిత కులాల వారు (ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో) అట్లతద్దెను కుంతీదేవి పండుగగా ఘనంగా జరుపుకుంటారు.

దళితుల ఇలవేల్పు కావడానికి గల వివిధ ఐతిహ్యాలు
.
1. పంటల పండుగ (నేదునూరి గంగాధరం గారి కథనం): కుంతీదేవి పెంచిన ఒక ఆంబోతు రైతుల పంటలను పాడుచేయగా, ఆమె అలా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుంది. పశువులను హింసించకుండా ప్రేమగా చూసుకునే దళితుల చేలల్లోనే తిరగమని ఆ ఎద్దుకు సూచిస్తుంది.
మాలవారి చేనులో మసలుమా ముద్దూల నందన్న
మాలోరు మంచోరు మక్కువతో కొలుస్తారు ముద్దూల నందన్నా…...... అంటూ ఆ ఎద్దుకు కుంతీదేవి చెప్పిందట! ఈ సందర్భంగా పశువులను, వ్యవసాయాన్ని రక్షించే ఈ పండుగ ఒక 'పంటల పండుగ'కు ప్రతీక.

2. ధర్మరాజు శాపం (సురవరం ప్రతాపరెడ్డి గారి వివరణ): కురుక్షేత్ర యుద్ధం ముగిశాక, కర్ణుడు తన సొంత అన్న అనే రహస్యం తెలుసుకున్న ధర్మరాజు తీవ్రంగా బాధపడతాడు. ఈ విషయాన్ని ముందే చెప్పకుండా యుద్ధానికి కారణమైనందుకు కోపించి, తల్లి కుంతీదేవిని 'మాలల దేవత'గా మారమని శపిస్తాడు. అప్పటినుండి ఆమె దళితుల ఇలవేల్పు అయ్యిందని చెబుతారు.

3. కోయ గిరిజనుల విశ్వాసం: కుంతి కుమారుడైన భీమసేనుడు ఒక నర్తకిని ప్రేమించాడని, ఆ ఇద్దరికీ పుట్టినవారే తమ వంశీకులని (కోయలని) వారి నమ్మకం. అడవులు నరికే సమయంలో గొంతాలమ్మ తమకు అండగా నిలిచిందని వారు భావిస్తారు.

సమాజంలో కర్ణుడిలాగే తాము కూడా తిరస్కారానికి గురయ్యామని భావించే దళిత వర్గాలు, అగ్రవర్ణాలచే దూరం చేయబడిన కుంతీదేవిని తమను ఆదరించే 'కన్నతల్లి'గా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. (అంతేకాదు ధర్మరాజు, అర్జనుడు, భీమసేనుడు నకులుడు, సహదేవుడు లాంటి పేర్లు ఎక్కువగా దళితులకే ఉండటం గమనార్హం)

పండుగ ఆచారాలు - "సాగనంపు":

కృష్ణా, గోదావరి జిల్లాల్లో దసరా లేదా అట్లతద్దె సమయంలో పది రోజుల పాటు ఈ గొంతాలమ్మ పండుగ చేస్తారు.
రేగడి మట్టిలో పాలుపోసి పిసి గొంతెమ్మ బొమ్మను తయారు చేసి పూజిస్తారు.
పదవ రోజున గొంతెమ్మ బొమ్మతో పాటు నంది, కప్ప బొమ్మలను కూడా దళిత వాడల్లో తెల్లవార్లూ ఊరేగించి, ఊరి బయట విడిచిపెడతారు (లేదా నదిలో కలుపుతారు). ఇలా సాగనంపడాన్ని "సాగనంపు" ఉత్సవం అంటారు. (రి. కృష్ణాజిల్లా గ్రామదేవతలు, డా. జి వి పూర్ణచందు)

*****
శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు సేకరించిన జానపద వీరగాథలలో గొంతెమ్మ కథ పేరుతో ఒక వీరగాథ ఈ విధంగా సాగుతుంది.

గొంతెమ్మ కథ (గవరమ్మ గాజులు) - సారాంశం
రేణుకాదేవి కుమార్తె గవరమ్మ ఈడుకు రాగానే, ఆమె అన్నలైన జంపయరాజు, పరశురాముడు తండ్రి జమదగ్ని కలిసి ఆమెను పురుషుల గాలి తగలకుండా అడవిలో ఒక ప్రత్యేకమైన 'లక్కసిరి మేడ' కట్టించి, అక్కడ ఏడుగురు దాదుల కాపలాలో ఉంచారు.
కార్తిక మల్లన్న రాక: గోనెలకోటను పాలించే సిద్ధమాశెట్టి (విచిత్ర వీరరాజు), తరిదేవి దంపతులకు ఏడుగురు కుమారులు. వారిలో చిన్నవాడు కార్తిక మల్లన్న. సిద్ధమాశెట్టి దంపతులు తమ కుమారుడికి గవరమ్మను ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి రేణుకాపురి వచ్చారు. కానీ జంపయరాజు, పరశురాముడు అందుకు ఒప్పుకోకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.
మాయా గాజుల బత్తుడు: తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న కార్తిక మల్లన్న, ఎలాగైనా గవరమ్మను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అతను గాజుల వ్యాపారి (గాజుల బత్తుడు) వేషం వేసి, 'మరల గాజులు' (చూస్తే మోహం కలిగించే మాయా గాజులు) తీసుకుని రేణుకాపురి వెళ్లాడు. ఆ గాజుల కేక విన్న గవరమ్మ, అవి కావాలని పట్టుబట్టింది. మొదట తల్లి ఎల్లమ్మ (రేణుకాదేవి) నిరాకరించినా, గవరమ్మ అన్నం నీళ్లు మానేయడంతో చివరకు ఆ గాజుల బత్తుడిని లక్కసిరి మేడకు రప్పించింది.

అపహరణ: మేడలోకి వెళ్లిన కార్తిక మల్లన్న గవరమ్మకు గాజులు తొడిగి, తన మాయా గాజులతో ఆమె మనసు మార్చేశాడు. గవరమ్మ అతనిపై మక్కువ పెంచుకుంది. మల్లన్న ఆమెను ఒక సంచిలో మూటగట్టుకుని, ఎల్లమ్మ దగ్గర డబ్బు కూడా తీసుకుని అక్కడి నుండి తప్పించుకున్నాడు.
జంపయరాజుతో పోరాటం: ఈ విషయం తెలిసిన జంపయరాజు వారిని వెంబడించాడు. కానీ మార్గమధ్యంలో అలసిపోయి నిద్రపోతున్న జంపయరాజును, గవరమ్మ సలహాతో మల్లన్న బంధించి, అతని గుండెలపై పెద్ద బండరాయిని పెట్టి వెళ్ళిపోయాడు. పరశురాముడు తన 'మైలపురి డేగ' సహాయంతో అన్నను రక్షించి, కోపంతో గోనెలకోటపై దండెత్తాడు.
పరశురాముడి శాపం: సిద్ధమాశెట్టి కుమారులు వేషాలు మార్చుకుని పరశురాముడిని చంపాలని చూసినా, డేగ హెచ్చరికతో పరశురాముడు వారిని బంధించి శిక్షించాడు. చివరకు గవరమ్మ వచ్చి తన తమ్ముడిని బ్రతిమాలింది. తనతో చెప్పకుండా లేచిపోయినందుకు కోపించిన పరశురాముడు, గవరమ్మను మాల మాదిగల ఇళ్లలో 'గొంతిదేవి' (గొంతాలమ్మ) గా పుట్టమని, కార్తిక మల్లన్నను 'నందిగాడు' గా పుట్టమని శపించాడు. వారిద్దరినీ ఆ కులాల వారు పూజిస్తారని చెప్పాడు. (రి. తెలుగు వీరగాథ కవిత్వం, తంగిరాల వెంకట సుబ్బారావు)

ముగింపు:

‘గొంతెమ్మ’ లేదా ‘గొంతాలమ్మ’ ఆరాధన అనేది కేవలం ఒక పౌరాణిక పాత్రకు పరిమితమైన పూజ కాదు; అది శతాబ్దాలుగా సామాజిక తిరస్కారానికి గురైన వర్గాల సాంస్కృతిక ప్రతిఘటనకు ఆత్మగౌరవానికి ప్రతీక. అగ్రవర్ణాల పురాణ సాహిత్యం కుంతీదేవిని కొన్నిచోట్ల శాపగ్రస్తురాలిగానో, పొరపాటు చేసిన తల్లిగానో చిత్రించి దూరం పెట్టినప్పటికీ, దళిత,జానపద వర్గాలు ఆమెను తమ ఇంటి ఆడపడుచుగా, కన్నతల్లిగా అక్కున చేర్చుకొన్నాయి. అగ్రవర్ణ సమాజం ఎవరినైతే తక్కువ చేసి చూస్తుందో, వారిని దళితవాడలు తమ ‘ఇలవేల్పు’గా మార్చుకుని గౌరవించడం ఇక్కడి విశేషం.

కర్ణుడు, అర్జనుడు ఇరువురూ బతికి ఉండాలనే అసాధ్యమైన కోరిక కుంతీదేవి కోరింది కనుక నెరవేరే అవకాశంలేని కోరికలను సూచించటానికి గొంతెమ్మ కోరికలు అనే నానుడి స్థిరపడింది.
మహాభారతంలోని కుంతీదేవి వ్యధ అయినా, జానపద వీరగాథల్లోని గవరమ్మ కష్టాలైనా... ఇవన్నీ అణగారిన వర్గాల దైనందిన జీవన పోరాటంతో మమేకమైపోయాయి. అందుకే, పాండవుల పేర్లను తమ పేర్లుగా పెట్టుకోవడమే కాకుండా, ‘గొంతెమ్మ’ పండుగను తమ ఆస్తిగా మలుచుకున్నారు. ఎద్దులను ప్రేమించడం, ప్రకృతిని (మట్టి బొమ్మలు కప్పలు) పూజించడం లాంటి అంశాలు ఈ పండుగలో అంతర్లీనంగా ఉన్న శ్రమజీవుల తాత్వికత

బొల్లోజు బాబా

Friday, April 3, 2026

కొన్ని మౌలిక ప్రశ్నలు.....

శ్రీ మందకృష్ణ మాదిగ లేవనెత్తిన ప్రశ్నలు సామాన్యమైనవి కావు. అవర్ణులైన ప్రతి సామాజికవర్గమూ అడగాల్సిన ప్రశ్నలు అవి.

1. అన్ని వర్గాలవారు దేవుడిని పూజించినపుడు ఒక్క బ్రాహ్మణ వర్గం మాత్రమే పురోహితులుగా ఎందుకున్నారు? ఈ ప్రశ్న శతాబ్దాల క్రితమే మా శిల్పులు వేసారు. తామే తమ కాళ్ళకింద తొక్కి చెక్కిన శిల్పానికి ప్రాణప్రతిష్ట చేసాము అనే మిషతో ఆ తరువాత దానిని తాకనివ్వకుండా నిషేదించటాన్ని ప్రశ్నించారు.

ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలనలో కోర్టుకేసులు కూడా నడిపి, బ్రాహ్మణులతో పాటు సమానంగా విశ్వబ్రాహ్మణులు కూడా అర్చక హక్కులు తెచ్చుకొన్నారు. ఆ వాదప్రతివాదనలన్నీ పుస్తకరూపంలో లభిస్తున్న "1818 డిసెంబర్ 15నాటి చిత్తూరు జిల్లా అదాలత్ తీర్పు" ద్వారా నేడు తెలుసుకోవచ్చు.

ఈ తీర్పు ద్వారా పూజలు, వివాహాలు, ఉపనయనాలు, ప్రాణ ప్రతిష్ఠ, గర్భగుడి అర్చనలు లాంటి హక్కులు విశ్వబ్రాహ్మణులు కూడా పొందారు. ఈ క్రమంలో ఎన్నెన్ని ప్రతిఘటనలు చవిచూసారో 1821, 1843-44 నాటి రివ్యూ పిటిషన్లు, బందరు కేసు, సేలం (1840), గుంటూరు జిల్లా (1912) విశ్వబ్రాహ్మణుల కేసుల ద్వారా తెలుస్తుంది.

చారిత్రికంగా బ్రాహ్మణాధిపత్యాన్ని ధిక్కరించి కులనామాన్ని విశ్వబ్రాహ్మణగా మార్చుకొని (శాసనాలలో పంచానము వారు అని ఉంటుంది) వేదాధ్యయనం చేసి, జంద్యం ధరించి, పౌరోహిత్యం చేసి వారికి బలంగా ఎదురు నిలిచిన సామాజిక వర్గం విశ్వబ్రాహ్మణ వర్గమే కావొచ్చు. ఈ మార్గంలో వారు ఎంత హింసను ఎదుర్కొని ఉంటారో అనేది కూడా సులభంగా ఊహించవచ్చు.
ఇదంతా చరిత్ర. కాలక్రమేణా బ్రాహ్మణాధిపత్య రాజకీయాలవల్ల ఈ హక్కులు చాలామట్టుకు క్షీణించాయి.

ఈ రోజు రాజ్యాంగం శాసించిన ప్రకారం అన్ని వర్ణాలవారికి అర్చకత్వ అర్హతనిచ్చే వేదం నేర్పుతున్నారు. కానీ వారిని అర్చకులుగా తిరుపతి, అన్నవరంలాంటి ప్రధాన ఆలయాలలో నియమించటం లేదు. అలా ఎందుకు జరుగుతోందని ప్రతీ అవర్ణ సామాజిక వర్గమూ ప్రశ్నించాలి.


2. మరొక ప్రశ్న- ఎక్కడో పుట్టిన ఇస్లాం, క్రిష్టియానిటీలు విశ్వవ్యాప్తం అవ్వగా అంతకన్నా ప్రాచీనమైన హిందు మతం ఎందుకు విస్తరించలేకపోయింది?

అంతేకాదు ఇక్కడే పుట్టిన బౌద్ధం కూడా జపాన్ నుండి శ్రీలంకవరకూ విస్తరించి ఒక ప్రపంచ మతంగా స్థిరపడింది. ఈ మతాలలో లేనిది హిందూ మతంలో ఉన్నది ఒకటే- కులవ్యవస్థ. సాటి మతావలంబిని చంపేటంత ద్వేషాన్ని నూరిపోయటం ఈ కులవ్యవస్థ లక్షణం.
సాటిమనిషి పట్ల ఎంత వివక్ష చూపిందనటానికి మనుధర్మ శాస్త్రమే ప్రమాణం. ఇంకా చెప్పాలంటే ఓ పదిశాతం ద్విజులను మినహాయిస్తే మిగిలిన 90% జనాభాకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరాకరించి వారిని సేవకులుగా చేసింది కులవ్యవస్థ. ఇలాంటి అసమానత్వ లక్షణాలతో ఎలా విస్తరించగలదు?

ఈ శూద్ర అతిశూద్ర వర్గాలను హిందూమతంలోనే ఉండేలా చేసింది భక్తి, సూఫీ ఉద్యమాలు. నిజానికి ఈ ఉద్యమాలు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు. వాటిని సంస్కరణల పేరుతో హిందూమతం క్రమేపీ తనలో కలిపేసుకొంది.

దుర్మార్గమైన ఈ వివక్షను తట్టుకోలేక ఇతరమతాలలోకి వెళితే వివక్షను మరింత బలంగా అమలు చేయడం సమకాలీన విషాదం.

ఇది కేవలం పూజాధికారాల కోసం కాదని — సమానత్వం, గౌరవం, మనిషితనాన్ని తిరిగి సాధించుకునేందుకని ప్రతిఒక్కరూ గుర్తించాలి.

బొల్లోజు బాబా

Post Script Comments: 

1. అసలు ప్రశ్న — అవకాశం అందరికీ సమానంగా ఉందా లేదా? అని.
ఒక వ్యవస్థను పూర్తిగా త్రోసిపుచ్చడం కన్నా దాన్ని ప్రజాస్వామ్యీకరించడం (democratize)  ఒక సామాజిక విప్లవం.
“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదే” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.
డా. బాబాసాహెబ్ చెప్పినట్లు అసమానతలపై పోరాడటంలో దీన్ని కూడా భాగం గా చూడాలి అనుకొంటాను

2. నేను బ్రాహ్మణులను వ్యతిరేకించను, బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తాను. 
వేదాల ఆధారంగా, యజ్ఞాలు,  కులవ్యవస్థతో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రాచీన మత వ్యవస్థ ను బ్రాహ్మనిజం అంటారు.  బ్రాహ్మణిజాన్ని బ్రాహ్మణులు ఒక్కరే పాటించరు...శూద్ర అతిసూద్ర వర్గాలలో కూడా ఉంటుంది. ఇది సూక్ష్మ విషయం. చాలామందికి అర్థం కాదు. 

3 ఒక బ్రాహ్మణుడు కావాలంటే నేర్చుకొని బట్టలు నేయవచ్చు, కుండలు చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. అదే నేర్చుకొని నేతకాడు, కుమ్మరి పౌరోహిత్యం ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి.
రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. అలా నేర్చుకొన్న దళిత పూజారులను పెద్ద ఆలయాలో ఎందుకు నియమించటం లేదని మరో ప్రశ్న.
గుర్తుపెట్టుకోండి ...“ఇది మా దే – మీరు రావద్దు” అనే భావజాలాన్ని “ఇది అందరిదీ” గా మార్చడం కూడా మార్పే. దాన్ని పాటించటం పాటించకపోవడం మన ఇష్టం. తలుపు తెరవటమే విజయం. అంతవరకే.