Friday, October 11, 2024

సనాతన ధర్మం అంటే ఏమిటి? - కొన్ని చర్చనీయాంశాలు

హిందూమతాన్ని జీవన విధానంగా చాలామంది నిర్వచించారు. భిన్న సంస్కృతుల, విశ్వాసాల సమ్మేళనంగా హిందూమతం చెప్పబడుతూ వచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా హిందుత్వ వాదులు హిందూ మతాన్ని ఏకసదృశ భావజాలంగా; ఉత్తరభారతదేశపు వైష్ణవమతాన్ని హిందూమతంగా తీర్చిదిద్దుతూ వస్తున్నారు. దీనికి వీరు ఎంచుకొన్న పదం “సనాతన ధర్మం”

హిందూమతాన్ని ప్రాధమికస్థాయిలో హిందు విద్యార్ధులు అర్ధం చేసుకొనటం కొరకు “సనాతన ధర్మ” అనే పేరుతో ఒక వాచకాన్నీ సెంట్రల్ హిందూ కాలేజ్, బెనారస్ వారు 1904 లో ముద్రించారు. దానిలోని అంశాలను క్లుప్తంగా ఈ వ్యాసం/సీరిస్ చర్చిస్తుంది.

ఈ పుస్తకంలో మూడు పార్టులు ఉన్నాయి. మొదటి పార్టు లో హిందూమతమౌలిక భావనలు. ఇది మరలా ఆరు చాప్టర్లుగా ఉంది. రెండవ పార్టులో సనాతన ధర్మము- హిందూ ఆచార్యవ్యవహారములు. దీనిలో ఏడు చాప్టర్లు ఉన్నాయి. మూడవ పార్టులో సనాతన ధర్మము-, నైతిక బోధనలు. పార్ట్ I, పార్ట్ II లలో అనేక విభేదించే అంశాలు ఉన్నాయి. పార్ట్ III లో అభ్యంతరకర అంశాలు పెద్దగా ఏమీ లేవు.

****


పార్ట్ I – హిందుమత మౌలిక భావనలు

వేదాలను అనుసరించే మతం వైదికధర్మం లేదా సనాతన ధర్మం. ధర్మ అంటే విశ్వాసాలు. ప్రజలను కలిపిఉంచే విశ్వాసాలు.

ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వర్ణవేదము అనేవి నాలుగు వేదాలు వీటినే శృతులు అంటారు. వైదికధర్మాన్ని అవలంబించేవారికి వేదాలే ప్రామాణ్యము. శృతుల ఆధారంగా రాసిన గ్రంధాలను స్మృతులు అంటారు. ఇవి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, శంఖలిఖిత స్మృతి, పరాశర స్మృతి. ఇవి కాక పురాణాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు కూడా సనాతన ధర్మంలో అంగాలు.

(శృతులలో ఆర్యులవలస, వారు అనార్యులను ఏ విధంగా తుదముట్టించారు లాంటి వివరాలు కలవు. చూడుడు: పురాణాలు మరోచూపు, డా. విజయభారతి.

స్మృతులు ప్రజలను ఎక్కువతక్కువ వర్ణాలుగా విభజించి, శూద్రులు, అతిశూద్రులపట్ల జన్మ ఆధారిత వివక్షను చూపాయి. )

చాప్టర్ I- బ్రహ్మమొక్కటే

సనాతన ధర్మములో పరమాత్మ ఒక్కడే బ్రహ్మన్. అతను నిరాకారుడు, నిర్గుణుడు. ఈయనే ఈ చరాచర సృష్టికి కారణము. మన శరీరములో ఉండే ఆత్మ పరమాత్ముని అంశ.

చాప్టర్ II - అవతారాలు

సృష్టి ఆరంభంలో పరమాత్మ- బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులను సృష్టించాడు. వీరు ఈ లోకానికి సృష్టి, స్థితి లయకారకులు.

ఈ లోకంలో ఎప్పుడైతే ధర్మానికి హానికలుగుతుందో అప్పుడు విష్ణువు అవతారపురుషుడై జన్మించి దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షిస్తాడు. ఇవి- మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అంటూ పది అవతారాలు.

(ఈ అవతారాలలో సంహరింపబడిన శంఖాసురుడు, హిరణ్యాక్షుదు, బలి, రావణుడు లాంటివారు అనార్యరాజులని వారిని నిర్మూలించటాన్ని అవతారకథలుగా ఆర్య పండితులు రాసుకొన్నారని ఒక వాదన కలదు. బుద్ధుడిని కూడా ఒక అవతారంగా చెప్పటం విస్తరణనైజంగా అన్వయిస్తారు)

చాప్టర్ III-పునర్జన్మ

ప్రాణిలో ఉండే జీవాత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును పొందుతుంది. దీనినే పునర్జన్మ అంటారు. జీవాత్మ కోరికలు తీర్చుకోవటం కొరకు నిరంతరంగా పునర్జన్మ పొందుతూ ఉంటుంది. కోరికలను జయించి, దైవచింతన చేస్తూ జీవించినట్లయితే జీవాత్మ ఆ పరమాత్మలో లీనంఅవుతుంది. ఇక తిరిగి పునర్జన్మ ఉండదు. దీనినే మోక్షం అంటారు.

(ఇవన్నీ విశ్వాసాలు. ఆత్మకు పునర్జన్మకు ఏ రకమైన శాస్త్రీయనిరూపణలు చేయలేం. అందుకే చార్వాకులు- దేహంలో ఉండే చైతన్యమే ఆత్మ. వేరుగా ఆత్మలేదు. దేహంలోంచి ప్రాణం పోవటమే మోక్షం. కనుక మోక్షం కొరకు ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చెయ్యక్కరలేదు” అంటూ రెండువేల ఏండ్లక్రితమే ఈ భావనలను ఖండించారు.)

చాప్టర్ IV- కర్మ

కర్మ అంటే మనం చేసే ప్రతి చర్య ఆలొచన, మాట. ఇవి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చేడుఫలితాలు కలుగుతాయి. కర్మ అనేది పునర్జన్మతో ముడిపడి ఉంటుంది. మనం ఈ జన్మలో చేసే మంచి కర్మల ఆధారంగా వచ్చేజన్మలో సుఖసంతోషాలను, చెడుకర్మల ఆధారంగా కష్టాలను అనుభవిస్తాము.

(సంచితకర్మలు, పునర్జన్మలు లాంటివి విశ్వాసాలు. సాక్ష్యాలు చూపించలేం. కర్మ భావన అనేది ఈ జన్మలో జరుగుతున్న విషయాలకు గతజన్మలో చేసిన కర్మలే కారణం అనే వాదన ఒక జాతిలో స్వేచ్ఛా సంకల్పం, వ్యక్తిగత ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రజల మధ్య విభజనలు, హెచ్చుతగ్గుల పట్ల వారు ఏ పోరాటమూ చేయక అన్యాయాన్ని నిష్క్రియంగా స్వీకరించేలా చేస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే నిరాశావాద ధోరణి ప్రబలుతుంది. నిజానికి వర్ణవ్యవస్థ ద్వారా 80% ప్రజలను బానిసలుగా రెండువేల సంవత్సరాలుగా కిక్కురుమనకుండా తొక్కిపెట్టటానికి దోహదపడిన మంత్రాంగంలో కర్మ సిద్ధాంతం ఒకటి)

చాప్టర్ V-దానధర్మాలు

యజ్ఞయాగాదులలో దానధర్మాలు చేయటం సనాతన ధర్మములో ఒక ధార్మిక విధి

చాప్టర్ VI-భూలోకము, స్వర్గలోకము

మనము నివసించే లోకము భూలోకము. ఇది మన కంటికి కనిపిస్తుంది. మన కంటికి కనిపించని లోకములు చాలా ఉన్నాయి. వేదాల ప్రకారం 14 లోకాలున్నాయి. మనిషి మరణించాకా అతని ఆత్మ స్వర్గలోకం చేరుతుంది. అతను చేసుకొన్న పుణ్యం కొద్దీ అక్కడ ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉండి తిరిగి మానవజన్మ ఎత్తటానికి భూలోకం చేరుతుంది.

(ఇవన్నీ విశ్వాసాలు. ధర్మాధర్మములు, పాప పుణ్యములు, స్వర్గ నరకములు, అదృష్ట దురదృష్టములు అగోచరములు కనుక లేవు అని వీటిని చార్వాకులు ఏనాడో ఖండించారు. అంతే కాదు స్వర్గప్రాప్తి కొరకు యజ్ఞయాగాదులలో పశువులను బలి ఇవ్వటం పట్ల -యజ్ఞంలో హింసించబడే పశువుకు స్వర్గప్రాప్తి లభించేటట్లయితే తండ్రినే హింసించి చంపి నేరుగా స్వర్గానికి పంపొచ్చు కదా అని ప్రశ్నించారు)

పార్ట్ II – సనాతన ధర్మము- హిందూమత ఆచార వ్యవహారములు

చాప్టర్ I – సంస్కారములు

సనాతన ధర్మంలో ప్రతిఒక్కరు జీవితకాలంలో వివిధ దశలలో నిర్వర్తించాల్సిన విధులను సంస్కారాలు అని పిలిచారు. గౌతమ ధర్మసూత్రలో ఇవి 40 రకాలు అని చెప్పబడ్డాయి. కానీ కాలక్రమేణా 16 మాత్రమే మిగిలాయి. వీటిని షోడశ సంస్కారములు అంటారు. అవి 1. గర్భాధానము, 2. పుంసవనము/మగబిడ్డ కలగాలని చేసే పూజ 3. సీమంతము, 4. జాతకర్మ 5. నామకరణము, 6. నిష్క్రమణము, 7. అన్నప్రాశనము, 8. చౌలము/పుట్టువెంట్రుకలు 9. ఉపనయనము, 10. మహానామ్నీ వ్రతము, 11. మహావ్రతము, 12. ఉపనిషద్వ్రతము, 13. గోదానము, 14. కేశాంతము, 15. సమావర్తనము 16. వివాహము.

(పై సంస్కారములలో ఉపనయనము ముఖ్యమైనది. ప్రాచీనకాలంలో ఆర్య అనార్య జాతులందరికీ ఉపనయన సంస్కారం ఉండేది. క్రమేపీ ఇది శూద్రులకు నిరాకరింపబడింది. ఉపనయనం ఉండటం ఒక గౌరవ సూచనగాను, లేకపోవటం దాసత్వం గాను మారిపోయింది. ఇది సమాజాన్ని నిలువునా చీల్చింది ఉపనయనం ఉన్న పైమూడు వర్ణాలు అధికులుగాను, ఉపనయనం లేని శూద్రులు వారి సేవకులుగాను మిగిలిపోయారు. అంతే కాక సమాజంలో ఉపనయనం అయినవారికి మాత్రమే వేదాధ్యయన అర్హత, ఆస్తి హక్కు ఉండేది. ఉపనయనం లేకపోవటం వల్ల శూద్రులు సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా సర్వం కోల్పోయి పై మూడు వర్ణాలకు బానిసలుగా చరిత్రలో మిగిలిపోయారు. ఉపనయనం చేయించే అర్హత బ్రాహ్మణులు తమవద్దే ఉంచుకొన్నారు. ఎవరైనా బ్రాహ్మణులు శూద్రులకు ఉపనయనం చేయిస్తే వారిపై ఆంక్షలు ఉండేవి. అబ్రాహ్మణులు ఎవరైనా ఉపనయనం చేయించినా అది చెల్లదు. ఆ విధంగా శూద్రులు దాదాపు పరాజితులుగా మిగిలిపోయారు. ఇక అతిశూద్రులైతే ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా బహిష్కృతులు. (రిఫరెన్స్: Selected works of Dr. B. R. Ambedkar).

ఇలాంటి నేపథ్యంలో కూడా కొన్ని శూద్రకులాలు నేడు జంధ్యాన్ని ధరించే హక్కు కలిగి ఉన్నారంటే వారి పూర్వీకులు ఎన్నెన్ని పోరాటాలు చేసి ఆ అర్హతను పొందారో ఆశ్చర్యం కలిగిస్తుంది.)

చాప్టర్ II- శ్రాద్ధం

మనిషి మరణించాక చేసే కర్మను శ్రాద్ధం అంటారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ మొదట ప్రేతలోకము వెళుతుంది. బ్రతికుండగా చేసిన కర్మలను అనుసరించి అక్కడ యమకింకరులు పెట్టే బాధలను అనుభవిస్తుంది. చనిపోయిన పదవరోజున పిండములు పెట్టినచో వాటిని తిని, ఆ జీవాత్మ ప్రేతలోకమునుండి పితృలోకము వెళుతుంది. పితృలోకములో నుండి చేసుకొన్న పుణ్యములను అనుసరించి శుద్ధిపడి స్వర్గలోకమునకు వెళుతుంది. ఇదే మనిషి మరణము తరువాత ఆత్మ సంచరించే క్రమము. కనుక వారసులు బ్రాహ్మణుడు చెప్పినట్లు శ్రాద్ధకర్మలు చేయకుంటే వాని జనకులు స్వర్గలోకప్రాప్తి లేక పితృలోకములోని పూర్వీకులను కలుసుకోలేక ప్రేతలోకంలో యమకింకరులచే బాధింపబడుతూ ఉంటారని సనాతన ధర్మము చెబుతుంది.

(ఇవన్నీ విశ్వాసాలు. ఈ ప్రక్రియను అనాదిగా అనేకమంది ఖండిచారు. శ్రాద్ధము మరణించినవారికి చేరేటట్లయితే, దూరదేశమేగిన వారికి ఇంటినుంచే భోజనం పంపవచ్చు కదా! ఇక్కడ ఇచ్చిన దానము పై లోకములలోని వారికి చేరేటట్లయితే, మేడ క్రింద ఇచ్చిన దానము మేడపై ఉండేవారికి చేరుతుందా! మరణించిన వ్యక్తి వేరేలోకాలకు వెళితే బంధువులను చూడటానికి ఒకసారైనా తిరిగి రాడేమి? ప్రేతకార్యాదులు కొందరకు ఒకరకమైన జీవనోపాధి- అంటూ చార్వాకులు ఏనాడో శ్రాద్ధకర్మలు అనేవి బ్రాహ్మణులకు సంపాదనామార్గం అని తూర్పారపట్టారు. నిన్నమొన్నటి వేమన “పిండములను జేసి పితరుల దలపోసి/కాకులకును బెట్టు గాడ్దెలార/పెంట దినెడు కాకి పితరు డెట్లాయెరా” అంటూ సూటిగా ప్రశ్నించాడు.)

చాప్టర్ III - శౌచం

శారీరిక శుభ్రతను శౌచం అంటారు. ఆరోగ్యము, శక్తి, వ్యాధులనుండి రక్షణ కొరకు దేహాన్ని శుచిగా ఉంచుకోవటం అవసరం. మనం తీసుకొనే ఆహారం శుభ్రంగా ఉండాలి.

తాజా ఆకుకూరలు, పళ్ళు, పప్పుదినుసులు, ధ్యాన్యాలు, దుంపలు లాంటి ఆహారాలలో జీవశక్తి ఉంటుంది. వాటిని తీసుకోవటం వల్ల ఆ శక్తిని మనమూ పొందగలము. అన్నిరకాల మాంసములు అశుచియైనవి ఎందుకంటే వాటిలోని జీవశక్తి తరిమివేయబడినది. అది కుళ్ళిపోవుతున్న ఆహారము. శాకాహారముతో పెరిగిన దేహముకన్నా మాంసాహారముతో పెరిగిన దేహము త్వరగా శిథిలమౌను.

(శారీరిక శుభ్రత, ఆరోగ్యపుటలవాట్లు మంచివి. వీటిని అందరూ పాటించాలి. ఇక శుచి పేరిట ఆహారపుటలవాట్లను నియంత్రించటం వ్యక్తిగత స్వేఛ్ఛను హరించటమే. ప్రజల ఆహారపద్దతులు ఆర్థికస్థోమత, అవసరాలు, ప్రాధాన్యతలు, పోషక ఆవశ్యకతలు, సాంస్కృతిక ఆచారాలపై ఆధారపడి ఉంటాయి. ఒకరకమైన ఆహారం ఉత్తమమైనది, మరొకటి చెడ్డది అని మతం చెప్పటం వివక్షాపూరితం. ఇది సమాజంలో నైతిక అంతస్తులను సృష్టిస్తుంది. మాంసం తినే వ్యక్తులలో ఇది ఆత్మన్యూనత కలిగిస్తుంది. తాముతక్కువ స్థాయి వ్యక్తులమని వారిని న్యూనపరుస్తుంది. సనాతన ధర్మం చేసే ఈ బోధ ఒకరకమైన మోరల్ పోలీసింగ్. అవాంఛనీయం. ఈ రోజు సమాజంలో బీఫ్ తినే వారిపట్ల కొనసాగున్న వివక్ష హింసకు మూలాలు ఇక్కడ ఉన్నాయి.)

చాప్టర్ IV – పంచ ఋణాలు

ప్రతిరోజు ప్రతిఒక్కరు ఐదుఋణాలను తీర్చుకొంటూ ఉండాలి. అవి ఋషిఋణం, దైవ ఋణం, పితృఋణం, మనుష్యఋణము, భూతఋణము. వీటికొరకు అర్పణలు చేయాలి.

రోజు ఏదేని పవిత్రగ్రంథంలోని కొంతభాగాన్ని చదువటం ద్వారా ఋషి/వేదఋణం; దేవతలకు హోమంచేయటం లేదా పూజించటం ద్వారా దైవరుణం;పూర్వీకులకు తర్పణ వదలటం ద్వారా పితృఋణం;అతిధిని ఆదరించటం ద్వారా మనుష్యఋణము; భోజనం చేసే ముందు కొద్దిగా ఆహారము క్రిమికీటకాలు, బిచ్చగాళ్ళకొరకు పక్కన ఉంచటం ద్వారా భూతఋణాన్ని తీర్చుకోవాలి.

(మనం ఈ సమాజం నుంచి ఎన్నో తీసుకొంటాం. వాటికి కృతజ్ఞతగా మనం కూడా ఈ సమాజానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవలసి ఉంటుంది. ఈ పంచఋణాలు అలాంటి pay back ప్రక్రియ. చాతుర్వర్ణాలలో చదువుకొనే హక్కు మొదటి మూడు వర్ణాలకే ఉంది. శూద్రులకు, అతిశూద్రులకు చదువుకొనే హక్కు కాదు కదా వేదాలను వినే అర్హత కూడా లేదు. అంతే కాక ఏవర్ణమైనా స్త్రీలకు కూడా వేదాధ్యయనం నిషిద్ధము. కనుక ఋషిరుణం అనేది మొదటిమూడువర్ణాల పురుషులు మాత్రమే తీర్చుకోగలరు.. రెండో రుణం తీర్చుకోవటంలో భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తగా బ్రాహ్మణుడి అవసరం ఉంటుంది. ఇక మిగిలిన ఋణాలను తీర్చుకోవటం తల్లిదండ్రులపట్ల, సాటిమనిషిపట్ల, పంచభూతాల పట్ల ప్రేమ కలిగి ఉండటంగా బావించవచ్చు)

చాప్టర్ V - ఆరాధన

ప్రతిఒక్కరు ప్రతిదినం దేవుని ఆరాధించాలి. ఈశ్వరుడు, నారాయణుడు, దుర్గ, లక్ష్మి వినాయకుడు, కృష్ణుడు ఎవరైనా కావొచ్చు. వారివారి పెద్దలు చెప్పిన కులాచారముల ప్రకారం లేదా ఎవరైనా గురువు చెప్పినట్లు - ఇష్టదైవంయొక్క చిన్న విగ్రహమో, పటమో పెట్టుకొని శత లేదా సహస్రనామావళి పఠిస్తూ ఈ ఆరాధన చేయవచ్చును.

(మనలోని బహుళఆరాధనా పద్దతులకు పైన చెప్పిన సనాతన ధర్మమే కారణము. చెట్టు, జంతువు, రాయి రప్ప, ముక్కోటి దేవతలు, ఆథ్యాత్మిక బోధకుడు ఎవరిని కావాలంటే వారిని తమ ఇష్టదైవాలుగా చేసుకొని ఆరాధన జరుపుకోవటం సనాతన ధర్మంలో భాగం. ముస్లిమ్ పీర్లను, దర్గాలను దర్శించుకోవటం, క్రిష్టియన్ మేరీమాతకు కొబ్బరికాయలు కొట్టి, తలనీలాలు సమర్పించుకోవటం లాంటివి భారతదేశ నలుమూలలా కనిపించే ఒక సాధారణ సనాతన సంప్రదాయం. ఒకరే దైవం, ఒకటే ఆరాధన పద్దతి అని ప్రచారించటం సనాతనధర్మానికి విరుద్ధం, ఇది ఒకరకంగా క్రిష్టియన్, ఇస్లామ్ మతాలను అనుకరించటం.)

చాప్టర్ V - ఆశ్రమాలు

సనాతన ధర్మం ప్రకారం మనిషి తన జీవితాన్ని నాలుగు దశలలో జీవించాలి. అవి బ్రహ్మచర్యము (విద్యార్ధిదశ), గార్హస్థ్యము (కుటుంబజీవనం), వానప్రస్థము (పిల్లలు పెద్దవాళ్ళయ్యాక బాధ్యతలు వారికి అప్పగించి అరణ్యంలో నివసించటం), సన్యాసము (పూర్తిగా అథ్యాత్మిక జీవనం). వీటిని వర్ణాశ్రమధర్మములు అంటారు.

(ఆధునిక కాలంలో ఇలా జీవించలేం కానీ ఈ ఈ దశల వెనుక కల ఉద్దేశాలను గుర్తించటం ముఖ్యం. ఈ దశలను గుర్తించిననాడు జీవితంపట్ల వివిధ వయస్సులలో చేయాల్సిన విధులు తెలుస్తాయి. నిష్కామ కర్మతో జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించే అవకాశం కలుగుతుంది. )

చాప్టర్ VI – చాతుర్వర్ణాలు

సనాతన ధర్మం ప్రకారం మనుషులు నాలుగు వర్ణాలుగా విభజించబడ్డారని పురుషసూక్తములోని “ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృతః/ఊరు తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో మజాయత" అనే శ్లోకం వివరిస్తుంది. బ్రాహ్మణుడు మహాపురుషుని ముఖంనుండి, క్షత్రియుడు భుజాలనుండి, వైశ్యుడు తొడలనుండి, శూద్రుడు పాదాల నుండి ఉద్భవించారని అర్ధం.

(మానవ జీవనాన్ని నేరుగా ప్రబావితం చేసే ధర్మశాస్త్రాలు/సూత్రాలు పై శ్లోకం ఆధారంగా రచించబడినాయి. మనుస్మృతి, యాజ్జవల్క్య స్మృతి, నారద స్మృతి లాంటివి ధర్మశాస్త్రాలు కాగా, ఆపస్తంబ ధర్మసూత్రం, బౌధాయన ధర్మసూత్రం, గౌతమ ధర్మసూత్రం లాంటివి ధర్మ సూత్రాలు. ఇవన్నీ BCE రచనలు. వివిధ యుగాలలో వివిధ స్మృతులు వర్తిస్తాయి. ప్రస్తుత కలియుగంలో పరాశరస్మృతి అమలులో ఉంటుందని చెబుతారు. ఇతరస్మృతులకు దీనికి పెద్ద తేడా కనిపించదు. వాదనకొరకు అలా చెబుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాలుగు వర్ణాలు. ఈ వర్ణాలలో ముందున్న వర్ణం జన్మతా తరువాత వర్ణం కన్నా ఉన్నతమైనది.

1. బోధన, అధ్యయనం, యజ్ఞాలు నిర్వహించటం, దానధర్మాలు పొందటం బ్రాహ్మణుల చేయవలసిన పనులు. ఈ పనులను ఇతర వర్ణాలవారు చేయరాదు. క్షత్రియులు పాలన, వైశ్యులు వ్యాపారము, శూద్రులు పై ముగ్గురికి సేవలు చేయుట వారి వారి కర్మలు. వైశ్య, శూద్రులు తమ వర్ణ ధర్మములు తప్పితే లోకం అలజడి పాలవుతుంది కనుక వారు ధర్మములను పాటించే విధంగా రాజు జాగ్రత్తలు తీసుకోవలెను. (మను :8418)

2. శూద్రులు పై మూడు వర్ణాల వారికి సేవ చేయాలి. ఎంత పై స్థాయి వర్ణానికి సేవలందిస్తారో అంత ఎక్కువ శ్రేయస్సు వారు పొందెదరు.

3. శూద్రులు ఉపనయనానికి, వేదాధ్యయనానికి అర్హులు కారు.

4. సనాతనధర్మంలో భిన్న వర్ణాలు ఎలాజీవించాలో చెప్పిన నియమాలు ఇలా ఉన్నాయి. – బ్రాహ్మణుడు క్షత్రియుల్ని దూషిస్తే యాభైపణాలు, వైశ్యుల్ని దూషిస్తే ఇరవై ఐదు పణాలు, శూద్రుణ్ణి దూషిస్తే పన్నెండు పణాలు శిక్ష విధించాలి. అదే ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. మను: 8.270).

బ్రాహ్మణుడిని పేరుని హేళనగా పలికితే శూద్రుని నోట్లో కాల్చిన మేకు దూర్చాలి. (మను 8.272). బ్రాహ్మణునికి ధర్మంగురించి చెప్పే శూద్రుని చెవుల్లో, నోట్లో మరిగే నూనె పొయ్యాలి

(8.272). ఉన్నతకులాల వారిని నీచకులస్థుడు ఏ అవయవంతో అయితే గాయపరుస్తాడో దానిని నరికివేయాలి. (8.279)

తక్కువవర్ణస్థుడు వాడు ఎక్కువ వర్ణస్థుని సరసన కుర్చీపై కూర్చునేందుకు ప్రయత్నిస్తే వారి పిరుదులపై కత్తి గాట్లు పెట్టించాలి. (8.281). అతడు ఒకవేళ ఉమ్మివేస్తే పెదాలను, ఉచ్చపోస్తే పురుషాంగాన్ని, ఆపాన వాయువు వదిలితే మలద్వారాన్ని కోయించాలి (మను 8.282).

ఈ సృష్టిలో సమస్తం బ్రాహ్మణుని సొత్తే. తన ఉత్తమమైన జన్మ వలన బ్రాహ్మణుడు అన్నింటికీ తీసుకోవటానికి అర్హుడే (మను: 1:100)

బ్రాహ్మణుడు ఎంతనీచుడైనప్పటికీ వాని యెడల సకల గౌరవమర్యాదలు చూపాలి (మను: 9.319)

రాజు న్యాయనిర్ణయం కొరకు బ్రాహ్మణుడిని లేదా క్షత్రియుడిని, లేదా వైశ్యుడిని వినియోగించవచ్చు కానీ శూద్రునికి న్యాయనిర్ణేతగా వ్యవహరించే అవకాశం ఏ మాత్రం ఇవ్వరాదు. (కాత్యా: 67)

ఇక ఈ చాతుర్వర్ణాలకు వెలుపల ఉన్నవారు (అతి శూద్రులు మాలమాదిగలు/చండాలురు/వర్ణబాహ్యులు) అయితే సనాతనధర్మ వర్ణవ్యవస్థలో అసలు మనుషులే కారు. వర్ణబాహ్యులను దస్యులు అంటారు. వీరి నివాసం గ్రామం వెలుపల ఉండాలి. వీరు శవాలపై కప్పిన దుస్తులను ధరించాలి. పగిలిన మట్టిపాత్రలలో భుజించాలి. ఇనుప ఆభరణాలు మాత్రమే వేసుకోవాలి. వీరు ఊరిలో కాని పట్టణాలలో కానీ తిరుగరాదు. (మను: 10.54). శవాలను మోసుకుపోవటం, నేరస్తులను వధించటం వీరి విధులు. ఒక చండాలుడు ఉద్దేశపూర్వకంగా తన స్పర్శ ద్వారా ద్విజకులాలను తాకి మైలపరిస్తే వానికి మరణదండన విధించాలి. (విష్ణు: 5.104). స్త్రీ స్వాతంత్రమర్హతి అంటూ స్త్రీకి జీవితపర్యంతమూ స్వేచ్ఛలేకుండా చేసి పురుషునిపై ఆధారపడి జీవించాలని మనుధర్మశాస్త్రం చెప్పింది (9.2)

ధర్మశాస్త్రాలలోని పై నియమాలను గమనిస్తే, ఒకనాటి భారతదేశంలోని 80% ప్రజలు ఈ వర్ణవ్యవస్థ వలన ఎంతటి దుర్భర పరిస్థితులలో జీవించారో అర్ధమౌతుంది. సనాతనధర్మంలోని చాతుర్వర్ణ వ్యవస్థ భారతీయ సమాజాన్ని జన్మ ఆధారిత సమూహాలుగా విభజించి, 90 శాతం ప్రజలను 10 శాతం ప్రజలకు బానిసలుగా చేసింది. ఈ 90% ప్రజలకు ఆర్ధిక, రాజకీయ, విద్య, ఆథ్యాత్మిక మానవహక్కులను తిరస్కరించింది. ఈ దుర్నీతి ద్వారా సమాజంలో బ్రాహ్మణాధిక్యత స్థాపించబడి, పురాణాలు, ఇతిహాసాలలోని పిట్టకథల ద్వారా అది మరింత స్థిరపరచబడింది.

ధర్మశాస్త్రాలలోని ఈ అరాచకనియమాలను ఖండిస్తూ డా. అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా తగలపెట్టారు. అదొకబలమైన symbolic gesture. రాజ్యాంగంలో ప్రజలందరికీ సమానహక్కులు కల్పించాడు. అతిశూద్రులు సామాజికంగా పైకిరావటానికి కొన్ని సదుపాయాలు కల్పించాడు.

రాజ్యాంగం అమలులో ఉన్న ఈ కాలంలో ధర్మశాస్త్రాలు ఎవరు పాటిస్తున్నారని వాదనకొరకు చిలకపలుకులు వల్లిస్తారు. సనాతన ధర్మంలోని వర్ణవ్యవస్థ ప్రజల మనస్సులలో బలంగా నాటిన కుల వివక్ష, వర్ణాధారిత ఆధిపత్య ధోరణులు స్త్రీలపట్ల పక్షపాతవైఖరి, దాడులు, హత్యలు లాంటివి నిత్యం వార్తల్లో అందరం వినేవే అని అంగీకరించరు.

పార్ట్ III – సనాతన ధర్మము, నైతిక బోధనలు

(ఈ రకపు బోధనలు మనం ఎలాంటి మంచిమనుషులుగా ఉండాలి, మన చుట్టూ ఉన్నవరితో ఎలా వ్యవహరించాలి లాంటి విషయాలను తెలియచేస్తాయి. సనాతనధర్మం పేరిట నైతికబోధనలు అనే విభాగంలో చెప్పిన నైతికత, ధర్మం, మానవత్వం లాంటి అంశాలు సార్వజనీనాలు. ఒక్క హిందూమతానికే పరిమితం అయ్యే అంశాలు కావు. వీటి కారణంగా సమాజానికి మేలే తప్ప కీడు జరగలేదు. క్లుప్తంగా వాటిగురించి)

చాప్టర్ I
నైతికత అంటే ఇతరులతో, ఇతర జీవులతో ఎలా వ్యవహరిస్తామనేదే మన నైతికత. సమస్తజీవుల క్షేమం కోరుకోవటమే సరైన నైతిక జీవనం. మంచి ప్రవర్తనను సదాచారం అంటారు. ధర్మ , అర్ధ, కామ మోక్షాలు జీవనాదర్శాలు. ప్రతిఒక్కరు తన కాలాన్ని వీటికి సరైనవిధంగా కేటాయించాలి.

చాప్టర్ II
మనుషులందరిలో పరమాత్మ ఉంటాడని, అతను ఒక్కడే అని నమ్మినపుడు ఎదుటివ్యక్తికి చేసిన హాని, తనకు తాను చేసుకొంటున్న హాని అని గుర్తించవచ్చు. లోకస్సమస్తా సుఖినోభవంతు అనే భావన.

చాప్టర్ III
తప్పు ఒప్పులు తెలుసుకొని జీవించటం ఉత్తమ జీవనం. భగవంతుని సంకల్పానికి అనుగుణంగా నడవటం ఒప్పు, వ్యతిరేకంగా నడవటం తప్పు అని శృతులు చెబుతున్నాయి.

చాప్టర్ IV
సనాతనధర్మం ప్రకారం- నిర్భయత, స్వచ్ఛత, వివేకం, దాతృత్వం, ఇంద్రియాల నియంత్రణ, త్యాగం, నిజాయితి, జాలి, వినయం, చంచలత్వం అహంకారం దురాశలేకపోవటం లాంటి లక్షణాలు ఉత్తమ నైతిక విలువలు, దైవగుణాలు అని చెప్పబడ్డాయి. వీటికి వ్యతిరేక గుణాలు అసురగుణాలు.

చాప్టర్ V
మనుషులందరూ ఒక్కడే ఉన్న పరమాత్మకు లోబడి ఉన్నప్పుడు పరస్పర స్వీయత్యాగం, సామరస్య సంబంధాల స్థాపన జరుగుతుంది. ఇదే యజ్ఞ ఫలము.

చాప్టర్ VI
ఈశ్వరుడే ఆలోచన, శక్తి, ఆనందము. మనిషి అతని సృష్టే కనుక అతనుకూడా ఈ లక్షణాలను కలిగి ఉంటాడు. అంతర్లోచనం ద్వారా ఈ శక్తులను మనిషి పొందగలడు.

చాప్టర్ VII
మనిషి ఉద్వేగాలను జయించగలగాలి. ఇది కష్టసాధ్యం. మనస్సు కోర్కెలు, ఆనందాల వెంటపడుతుంది. ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. దేవతలను, ద్విజులను, గురువులను నిత్యం పూజించాలి. ఇతరులకు హానికలిగించరాదు. అదే ఉత్తమజీవనం.

చాప్టర్ VIII
ప్రతిఒక్కరికి పైన దేవుడు, రాజు, తల్లిదండ్రులు, గురువు, పెద్దవయసు వారు ఉంటారు. వీరు మనకంటే పెద్దలు. వీరిని నిత్యం, భక్తితో, విధేయతతో ప్రేమతో కొలుస్తూ ఉండాలి. అట్లు కానిచో పతనమవ్వటం ఖాయం.

చాప్టర్ I‍X
భార్యభర్తలు, స్నేహితులు, సోదరులు, అతిధి వంటి సమానస్తుల మధ్య ప్రేమ, అంగీకారం, స్నేహభావం ఉండాలి.

చాప్టర్ X
మనకంటా చిన్నవారిపట్ల మమకారంతో, దయతో, సహనంతో ఉండాలి. వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవాలి.

చాప్టర్ XI
వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు ద్వేషరహితంగా, భావోద్వేగాలకు గురికాకుండా పరస్పర సౌమ్యతతో, సహనంతో జీవించాలి.

ముగింపు

హిందుమతంలో భిన్న ఆరాధనా విధానాలు ఉంటాయి. ఒక్కో కులానికి ఒక్కో కులదైవం, కులాచారం, కుల కట్టుబాట్లు ఆ కులస్థులను నడిపిస్తాయి. హిందూమతం అంటేనే భిన్నత్వం. వివిధ సాంస్కృతిక, నైతిక, సామాజిక అంశాల కలబోత హిందు మతం. వీటన్నిటినీ సనాతన ధర్మం అనే మూసలో ఒదిగించాలని జరుగుతున్న ప్రయత్నం ఇప్పటికే చాలాదూరం వచ్చేసింది.

సనాతన ధర్మం అంటే అనాదిగా పాలకవర్గాలు ప్రచారం చేసిన బ్రాహ్మనిజం. దీనిలో వైవిధ్యం ఉండదు. ప్రజలు వర్ణాలుగా విభజించబడి ఉంటారు. అందరిలో పై మెట్టుపై బ్రాహ్మణుడు కూర్చుని ఉంటాడు. కింద మెట్లపై ఉన్నవారందరూ పైనున్న బ్రాహ్మణునికి సేవలు చేయాలి. ఈ మెట్లకు వెలుపల ఉన్న అతి శూద్రులకు అసలు ఈ ధర్మంలో స్థానమే లేదు. పంతొమ్మిదోశతాబ్దం వరకూ వారు అత్యంత హేయమైన, దుర్భర పరిస్థితులలో ఊరికిదూరంగా నివసించవలసి వచ్చింది. స్త్రీ కి శూద్రస్థానం ఇవ్వబడింది. సతి, బాల్యవివాహాలు లాంటి దురాచారాలతో స్త్రీలను సమాజంలో పిల్లలను కని ఇచ్చే యంత్రాలుగా చేసింది. సమానత్వం మృగ్యం. దీన్ని శ్రమవిభజనగా చెబుతారు కానీ డా. అంబేద్కర్ అన్నట్లు ఇది శ్రామికుల విభజన.

సనాతన ధర్మం మరొక గుణం విస్తరణనైజం. భిన్నఆరాధనా విధానాలను తనలో కలిపివేసుకొంటుంది. వాటికి తనకన్న కిందస్థానాన్ని కేటాయిస్తుంది. ఉదాహరణకు బహుజనుల దేవతలైన గంగమ్మ, మైసమ్మ, మరిడమ్మ లాంటి గ్రామదేవతలను బ్రాహ్మణీకరణ చేస్తుంది కానీ వాటికి హిందూ ప్రధాన దేవతల స్థాయి కల్పించదు. బహుజనుల ఆరాధనా విధానాలను కబళిస్తుంది. అక్కడి బహుజన పూజారులను తొలగించి వైదిక మంత్రాలు పూజావిధానాలు, బ్రాహ్మణపూజారులను ప్రవేశపెడుతుంది. తద్వారా బహుజనుల ఆరాధనావిధానాలలోని భిన్నత్వాన్ని తొలగించి ఏకసదృశ బ్రాహ్మణిజపు రూపాన్ని రుద్దుతుంది సనాతనధర్మం. హిందూమతం అంటే బహుళత్వం అనే మౌలికభావనను తొలగించి హిందూమతం అంటే బ్రాహ్మణుడే అనే అర్ధాన్ని కలిగిస్తుంది సనాతనధర్మం. సనాతనధర్మ భావజాలం, ఆచరణ కేవలం బ్రాహ్మణీయ ఆధిపత్యం కొరకే. సనాతన ధర్మంలో సోదరభావానికి, సమానత్వానికి స్వేచ్చకు వైవిధ్యానికి స్థానం లేదు. ఇది ఒకరకంగా మత ఫాసిజం.

గాంధి తన జీవితకాలంలో సనాతన ధర్మం అంటే హిందూ ముస్లిమ్ ఐక్యతగా నిర్వచించాడు. అతిశూద్రులు అనాదిగా హిందూమతం వెలుపల ఉన్నారు, వారు హిందువులే కారు అంటూ డా. అంబేద్కర్ పదునైన వాదనాపటిమతో అందరినీ ఒప్పిస్తున్న తరుణంలో అతిశూద్రులు కూడ హిందూంమతంలోని వారే అని గాంధీ వాదించాడు. అంబేద్కరైట్స్ దృష్టిలో నేటికీ పగవాడిగా మిగిలిపోయాడు. కులాలు ఉండలి కానీ కులవివక్ష ఉండకూడదు అని అన్నాదు. ఇవన్నీ సాఫ్ట్ సనాతన ధర్మం. దీనికి వ్యతిరేకంగా ఈ దేశం హిందువులనీ ఇక్కడ హిందువులే ప్రధాన పాత్రవహించాలని, అన్నిరంగాలలో వారే ఆధిపత్యం వహించాలని, హిందూయేతర వ్యక్తులు ఈ దేశం విడిచివెళ్ళిపోవాలని కోరుకునే అతివాద హిందుత్వం ఉండేది.

ఇలాంటి నేపథ్యంలోంచి నెహ్రూ, ఇందిరలు స్వతంత్ర్య భారతదేశాన్ని – భిన్నమతాలు స్వేచ్చగా మనుగడసాగించే లౌకికవాద రాజ్యంగా తీర్చిదిద్దారు. దళితులు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించి అన్నిరంగాలలో పురోగవ్రుద్ధి సాధించేలా కృషిచేసారు. ఇది గాంధీజీ స్వప్నించిన “ఈశ్వర అల్లా తేరె నామ్ సబకో సంమతి దే భగవాన్” భజన్ కు సాకారం.

ఈ దేశ భిన్నత్వాన్ని గౌరవిస్తూ దానిలోంచి సహిష్ణుత, సామరస్యాన్ని సాధించటమే “గాంధి-నెహ్రూ మోటిఫ్”. ఇది దేశ కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సమానం అంటుంది. మతాన్ని పాలననుంచి విడగొడుతుంది. దీన్నే శ్రీమతి ఇందిరాగాంధి కూడా కొనసాగించింది. ఈరకపు పాలన హిందుత్వవాదుల వాదనకు పూర్తిగా భిన్నం. హిందుత్వవాదులకు మతం ఆధారంగా ప్రజలను విడదీయాలి, ఆ వ్యవస్థలో మతపరమైన అధికారాలను బ్రాహ్మణులకు మాత్రమే కట్టబెట్టాలి. అతిశూద్రులు, స్త్రీలను తక్కువ సమానులుగా చెయ్యాలి. అది కావాలి అంటే “గాంధి-నెహ్రూ మోటిఫ్” ను ధ్వంసం చేయాలి. దానికి ఎన్నిరకాల అబద్దాలు ఆడాలో, ఎన్నిరకాల అసత్యాలు ప్రచారం చేయాలో అన్నీ తమ సోషల్ మీడియా జీతగాళ్లతో సనాతన ధర్మం ముసుగులో చేయిస్తున్నారు.

అలాగని మంచి లేదా అంటే మన సనాతనధర్మంలో మనిషిని మనిషిని అనుబంధం అనే దారంతో కుట్టే పండుగలు, షోడశ సంస్కారాలు, క్రమశిక్షన పెంచే స్వీయ ఆచారాలు, కష్టకాలంలో ధైర్యాన్ని జీవితం పట్ల నమ్మకాన్ని ఇచ్చే కులదేవతారాధన, వాటి సంబురాలు, సంగీతం, నాట్యం, సాహిత్యం, శిల్పం వంటి మన కళలు - ఇవన్నీ సనాతనధర్మపు పాటించదగ్గ విలువలే. అనూచానంగా ప్రతి ఒక్కరూ పాటించేవే. వీటిని రాజకీయంగా ఎవరూ ప్రచారం చేయక్కరలేదు. బలవంతంగా ఎవరితోటీ చేయించలేం కూడా.

అలా కాక- రాజకీయంగా సనాతన ధర్మం పేరిట ఇంత ప్రచారం, బలవంతం జరుగుతున్నదంటే అది హిందుత్వాని బలవంతంగా సనాతన ధర్మం పేరిట రుద్దేప్రయత్నం. హిందుత్వ బలపడటం అంటే వర్ణవ్యవస్థను, బ్రాహ్మణాధిక్యతను బౌద్ధికంగా బుర్రల్లో బిగించటం. ఇది 80 శాతం ఉన్న బహుజనులకు ఆమోదయోగ్యమా అనేది ఆలోచించుకోవాలి.


బొల్లోజు బాబా



3 comments:

  1. అయిష్టంగా నైనా సనాతన ధర్మం మానవాళికి అందించిన కొన్ని గొప్ప విషయాలను ఏకరువు పెట్టారు. సంతోషం.

    అయితే సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం, బ్రాహ్మణ వ్యతిరేక భావనల వ్యాప్తి వ్యాసం ఉద్దేశ్యంగా కనబడుతుంది.

    1) వేదరాశిని పరమ పవిత్రంగా, పరమ ప్రామాణ్యంగా స్వీకరించడం, గోవులను మాతృ భావంతో వ్యవహరించడం, గోసంరక్షణ సనాతనధర్మంలో అతి ముఖ్యమైన అంశాలు.

    2) పునర్జన్మ సిద్ధాంతం హిందువులు విశ్వసిస్తారు. మరణానంతరం జీవాత్మ ప్రయాణం గురించి సనాతన ధర్మాన్ని ఆచరించేవారి విశ్వాసాన్ని చార్వాకులు అంగీకరించక పోతే పోనివ్వండి. సమాజం లో అందరూ ఏకాభిప్రాయం ఉండాలని లేదు కదా. ఇందులో బలవంత మేమీ లేదు.

    చాగంటి, సామవేదం వంటి సనాతన ధర్మ ఆచార్యుల ప్రవచనం అనేకమంది ఇష్టపడి సాత్విక ధార్మిక భావాలు అలవరచుకుంటున్నారు. ధర్మచార్యుల బోధనలతో హైందవ సమాజానికి ధర్మ మార్గ నిర్దేశ్యం చేస్తున్నారు. ప్రకృతిలోని అణువణువు లో పరమాత్మను దర్శించి ఆరాధించే దర్శనం సనాతన ధర్మం అందిస్తున్నది. అయితే

    కొంతమందికి రాం గోపాల్ వర్మ వంటి వారి భావాలు ఇష్టం కావచ్చు. ఎవరి స్వభావం అనుసరించి వారికి ఆయా మార్గాలు నచ్చుతాయి.

    3) ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం పట్ల సానుకూల భావన, స్వీకరించే వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య రీత్యా, మానవ శరీర నిర్మాణ రీత్యా, జీవ హింస దృష్ట్యా మాంసాహారం కంటే శాఖాహారం మంచిది అన్న విషయం అనేక పరిశోధన లలో తెలుస్తుంది. మానవాళి సాత్విక ఆహార అలవాట్లు దిశగా మళ్లటం మంచిదే కదా. హిందువులకు పరమ పవిత్రమైన గోమాత ను హింసించడం, గోమాంస భక్షణ చేయడం అత్యంత క్లేశం కలిగిస్తుంది. అందుకే రాజ్యాంగం లో కూడా గో సంరక్షణ కోసం ఇలా పొందుపరిచారు

    Article 48 of the Constitution of India States that the State shall endeavour to organise agriculture and animal husbandry on modern and scientific lines and shall, in particular, take steps for preserving and improving the breeds, and prohibiting the slaughter, of cows and calves and other milch and draught cattle.

    4) వర్ణ వ్యవస్థ : చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ: అని భగవద్గీత లో ఉంది. గుణము కర్మ బట్టి వర్ణ విభజన అని గీతాచార్యుడు తెలిపాడు. అయితే దేశ కాల పరిస్థితులను అనుసరించి వర్ణ వివక్ష జరిగి ఉండవచ్చు. ఒక్క భారత దేశం లోనే కాదు ప్రతి దేశం లో ప్రతి మతావలంబీకులలో కూడా ఏదో ఒక రూపంలో వివక్ష అనేది కనబడుతుంది. దానికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్తలు చేసిన పోరాటం కనబడుతుంది.
    మనుస్మృతి లోని అభ్యంతర కరమైన విషయాలను హైందవ సమాజం నిరాకరించింది. Most of Hindu society has moved on by reforming itself. A few leftist pseudo secular self declared intellectuals refuse to acknowledge this and try harp on non existent issues. రామానుజులు వంటి ఆచార్యులు గాంధీ, అంబేద్కర్ వంటి నాయకులు కృషి వల్ల చాలావరకు వర్ణ వివక్ష అనేది ప్రస్తుత కాలంలో తగ్గిపోయింది. దళితులకు స్వతంత్ర భారత రాజ్యాంగంలో అనేక రక్షణలు కల్పించ బడ్డాయి.

    నిజానికి అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం బ్రాహ్మణులు ఆర్థికంగా సామాజికంగా వివక్ష, దాడులకు గురి అవుతున్నారు. పౌరోహిత్యం వృత్తి లో ఉన్న వారు, డిల్లీ వంటి చోట రిక్షా నడుపుకునే బ్రాహ్మణులు, ఎటువంటి రిజర్వేషన్లు లేక చిన్న చితక పనులు చేసుకుంటున్న బ్రాహ్మణులు, ఆర్థికంగా, సామాజికం గా దుర్భర పరిస్థితుల్లో ఉన్న GC కులాల వారు మేధావులకు కనిపించరా ?

    GC Hindus and especially Brahmins are being discriminated against now.

    Contd.

    ReplyDelete
    Replies
    1. 5) పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడం అన్నది సనాతన ధర్మం లో ముఖ్య భాగం. ఏదో ఒక విధానం లో మరణించిన వారి పట్ల కృతజ్ఞతతో, వారికి ఆత్మ శాంతికోసం దాన ధర్మాలు, రిచువల్స్,ప్రార్థనలు చేయడం, అన్న సంతర్పణ చేయడం అన్ని మతాల లోనూ ఉంది. హిందువులలో వారి వారి సంప్రదాయం అనుసరించి శ్రాద్ధ కర్మలు నిర్వహించుకుంటారు. వారి విశ్వాసం పట్ల ఇతరులకు అభ్యంతరం ఎందుకు ?

      యోగి వేమన ఒక అవధూత స్థాయికి చెందిన వ్యక్తి. ఆయన చెప్పిన మాటను సందర్భం బట్టి అన్వయించుకోవాలి. ఆయన లాగా సర్వ సంగ పరిత్యాగి యైన వారికి ఆచార వ్యవహార నియమాలు వర్తించవు. సామాన్యులు ఆచారాలను కట్టుబాట్లను వదిలివేస్తే సమాజం పతనమౌతుంది.

      5) స్త్రీ మూర్తికి సనాతన ధర్మం అత్యున్నత స్థానం కల్పించింది. దైవాన్ని మాతృమూర్తి గా, శక్తి స్వరూపిణి గా భావన చేసి ఆరాధించే విధానం కేవలం సనాతన ధర్మం లో మాత్రమే ఉంది. స్వభావ, శారీరిక, సమాజ పరిస్థితుల దృష్ట్యా కొన్ని నియమాలు, ఆచారాలను ఏర్పరిచారు. అవి కాలానుగుణంగా మార్పులు చెందుతూ సంస్కరణలు జరిగాయి.

      6) పురుషసూక్తములోని “ బ్రాహ్మణో స్య ముఖమాసీత్ బాహూ రాజన్య: కృతః/ఊరూ తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్ర: అజాయత" అనే శ్లోకం వివరిస్తుంది. బ్రాహ్మణుడు మహాపురుషుని ముఖంనుండి, క్షత్రియుడు భుజాలనుండి, వైశ్యుడు తొడలనుండి, శూద్రుడు పాదాల నుండి ఉద్భవించారని అర్ధం.

      ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే సమాజం అనే పిరమిడ్ నిర్మాణం గోచరిస్తుంది. ఈ శ్లోకాన్ని కుల దృష్టితో చూడడం సరికాదు. శరీరం లోని అన్ని భాగాలు సమానమే. ముఖ్యమే.

      ధర్మాన్ని బోధించి నిలబెట్టేవారు, సమాజానికి మార్గ నిర్దేశనం చేసే వారు ఒక వర్గం. దేశాన్ని ప్రజలను రక్షించి క్రమ శిక్షణతో ఉంచే వారు, శత్రువులను, దుర్మార్గులను శిక్షించే వారు ఒక వర్గం. వ్యవసాయం, వర్తకం చేసి ప్రజలను పోషించే వారు ఒక వర్గం, వివిధ మార్గాలలో శారీరిక శ్రమ, కృషి చేస్తూ సమాజానికి పునాది వంటి వారు ఒక వర్గం. పాదాల నుంచి ఉద్భవించిన వారు అందరికన్నా ముఖ్యమైన వర్గం. కార్మిక వర్గం లేని సమాజం కుప్ప కూలిపోతుంది. ఏ దేవతకైనా గురువుకైనా పాదాలకు నమస్కరించడం, పూజ చేయడం సనాతన ధర్మంలో భాగం. అందువల్ల పురుష సూక్తం లోని పై శ్లోకాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

      సనాతన ధర్మం అందించిన మార్గంలో సాగడం సకల మానవాళికి శ్రేయస్కరం. స్మృతులు లేక శాస్త్రాలలో అందించిన గొప్ప సమాజ హితమైన ధార్మికమైన భావనలను స్వీకరించుదాము. ఆమోదయోగ్యం కాని అంశాలను వదిలి వెద్దాము. న అన్య: పంథా అయనాయ విద్యతే.

      నాకు చేతనైన విధంగా సనాతన ధర్మం పై మీ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాను. అందులో తప్పులుంటే అంగీకరించడానికి, మార్చుకోవడానికి సిద్ధం.

      Hope you read with open mind. Prejudice will blind one's vision.

      సర్వే జనా సుఖినోభవంతు 🙏




      Delete
  2. 1. అవన్నీ వ్యక్తిగత అంశాలు. మొత్తం సమాజం అలా చెయాలని కోరటం ఫాసిజం.
    2. పునర్జన్మ ఉందని నిరూపించి, దానిని నమ్మమని చెప్పాలి. లేకపోతే దాన్ని కూడా నమ్మాలా వద్దా అనే స్వేచ్చ ఇవ్వాలి. ఒక హిందువునే నేను నమ్మను. అనే స్వేచ్చా అతనికి ఇవ్వాలి. అతన్ని వ్యతిరేకించరాదు. ఇది వైయక్తి క భావన. అశాస్త్రీయమైనది.
    3. శాఖాహారంలోని మంచి చెడులను నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉండాలి. ఒకరు ఇది మంచిది ఇది ఆరోగ్యకరమైనది, శరీరనిర్మాణ రీత్యా మంచిది అని చెప్పటం ఫాసిజం. మరొకరెవరు చెప్పటానికి. నూటికి 90% మాంసాహారం తింటారు. వారివద్ద. శాఖాహారం మంచిది అని చెప్పటం అహంకారం>
    గోమాంస భక్షణ గురించి పై వ్యాసం చెప్పలేదు. లెని దాన్ని ప్రస్తావించటం వక్రీకరించటం.
    4. మనుస్మృతిలోని కులవ్యవస్థను నిరాకరించామని పీఠాధిపతులతో చెప్పించండి. వాళ్ళేమో కులాలున్నాయి. వడ్రంగి వంట చేయగలడా అంటూ లేకి వాదనలు చేస్తున్నారు. ముందు కులవ్యవస్థపై క్లారిటీ తెచ్చుకొని కామెంటు చెయ్యండి. మీ అభిప్రాయానికి విలువలేదు. పీఠాధిపతులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి కులాలు లేవు, వాటిని హిందూమతం తొలగించుకొంది. అవి రద్దు అయ్యాయి అని చెప్పాలి. అప్పుడు మీ వాదనకు విలువ.
    బ్రాహ్మణులు, మీడియా హౌసులలో, జుడిషియల్, సెక్రటేరియట్, డైరెక్టరేట్లలో ఎంతెంత మంది ఉన్నారో లెక్కలు తీసి మాట్లాడండి. మీ ఇంటిపక్కన అడుక్కుతినే బ్రాహ్మణుడు కాదు లెక్క. ముందు భారతదేశ అత్యున్నత స్థానాలలో ఉన్న బ్రాహ్మణుల లెక్క తీసి మాట్లాడండి. ఎంతకాలం ఇలా బ్లఫ్ చేస్తారు. పాకీ పనుల్లో ఉన్న బ్రాహ్మణులు కాదు, పై స్థాయిలో ఆక్రమించిన బ్రాహ్మణుల లెక్కలు చెప్పండి
    5. వాటిలో ఉన్న శాస్త్రీయతను చర్చించండి. రెండువేల సంవత్సరాల క్రితం చార్వాకులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మాత్లాడాలి. ఏదో వాళ్ళిష్టం వాళ్ళు చేసుకొంటారు అనే నంగనాచి మాటలు కాదు. ఇది బ్రాహ్మణుల ఉపాధా కాదా?
    6. స్త్రీమూర్తిని సతీసహగమనం చేయటం గౌరవమా? ఎక్కువ మాట్లాడకండి సిగ్గుఛేటు
    7. ఈ శ్లోకాన్ని కుల దృష్టితో చూడడం సరికాదు- హహ నేను ఉదహరించిన పుస్తకంలో కులదృష్టితోనే వ్యాఖ్యానించబడింది. ఆ పుస్తకం పేరు సనాతన ధర్మం. 1905 ప్రచురణ. ఇప్పుడు మీరొచ్చి కులదృష్టితో కాదు అంటూంటె…. ఎలా కనపడుతున్నరు ఎదుటివారు మీకు.? కాస్త మీ స్థాయి తెలుసుకొని మాట్లాడండి. లేదూ పీఠాధిపతులతో చెప్పించండి. కులాలు లేవు అని. మీ కంత సీన్ లేదు.
    8. మీరు తరతరాలుగా చేస్తున్న మోసాన్నే చేశ్తున్నారు. ఒక విమర్శను స్వీకరించే సంయమనం లేదు. ఎదుటివారి మీద ఇదంతా తప్పు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమే. మీ దృష్టిలో చార్వాకులు, వేమన,పెరియార్, డా. అంబేద్కర్ లాంటివారు ఊరికినే ఊసుపోక హిందూమతంపై విమర్శచేసారని, మీకు వారికంటే జ్ఞానులనీ మొత్తం మీకే తెలుసునని భావిస్తున్నారు. ఎందుకంటే మీరు బ్రాహ్మణులు కనుక. మీకు హిందూమతం మంచి చేస్తుంది కనుక అలామాట్లాడతారు. ఇద్ స్వార్ధ వాదన.
    మీరు బ్రాహ్మణులు కాకపోతే ఇలా మాట్లాడుతారా? ఒక్కసారి ఆలోచించుకొని చూడండి.
    కాకపోయినా ఇలాగే మాట్లాడుతాను అంటే మాత్రం మిమ్మలను మనిషిగా పరిగణిచక్కరలేదు అని అనుకోవచ్చు.

    ReplyDelete