Wednesday, January 13, 2021

Imported post: Facebook Post: 2021-01-13T13:35:12

Publishing a volume of verse is like dropping a rose-petal down the Grand Canyon and waiting for the echo అంటారు కానీ ఈ రోజు నా పుస్తకపు ప్రతిధ్వనిని విన్నాను. శ్రవణానందకరంగా, హృదయోల్లాసంగా. Narukurti Sridhar గారు థాంక్యూ అనేది చాలా చిన్నమాట. సాధారణంగా సొంతంగా ముద్రించుకొన్నప్పుడు రెండుమూడు వందల కాపీలను మిత్రులకు పోస్ట్ చేస్తాను. ఓ వందమంది రెస్పాండ్ అవుతారు. ఓ పాతికముప్పై మంది పుస్తకంలోని మంచి చెడ్డలు చర్చిస్తారు. ఓ పది పదిహేను మంది చిన్నవో పెద్దవో పరిచయవ్యాసాలు రాస్తారు ప్రేమతో. ఇదీ ఇంతవరకూ జరిగిన నా సాహిత్యప్రయాణం. నా ఇటీవలి మెకంజీ కైఫియ్యతులు పుస్తకాన్ని పల్లవి ప్రచురణల వారు ముద్రించారు. మిత్రులకు పంచిపెట్టే అవకాశం లేదు. పుస్తకం ఎవరు చదువుతున్నారో వారి అభిప్రాయాలు ఏమిటో తెలియని పరిస్థితి. పుస్తకాల ముద్రణలో మంచి అభిరుచికలిగిన సహృదయులు, పల్లవి ప్రచురణల అధినేత శ్రీ ఎస్వి నారాయణగారిని రెస్పాన్స్ ఎలా ఉంది అని మొదట్లో అడిగాను. పరవాలేదు అన్నారు . మరలా అడగటానికి భయమేసింది ఏం చెబుతారో, ఏం వినాలో అని. కానీ వారిద్వారా చేరవలసిన వారికి నా పుస్తకాలు చేరుతున్నాయి. ఇది వ్యక్తిగా నేను చెయ్యలేని పని. మొన్న ఏలూరు నుంచి ఒక డాక్టరుగారు ఫోన్ చేసి మీ పుస్తకంలోని కావలి సోదరులపై వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. నేను ఏలూరు సాహిత్యచరిత్ర వ్రాస్తున్నాను ఈ వ్యాసం ఎంతో ఉపయోగకరంగా అనిపించింది అన్నారు. సంతోషం వేసింది. నిజానికి చరిత్రపుస్తకాలు రాయటం చాలా శ్రమతో కూడుకొన్నది. "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకానికి మూడేళ్ళు పట్టింది. కోవిడ్ లాక్ డౌన్ వల్ల ఈ పుస్తకం ఏడాదిన్నరలో పూర్తయింది. అయినా ఎన్నో స్పృశించలేని అంశాలుంటాయి. నా శక్తి ఇంతే అని అంగీకరించటానికి సంకోచించను. ఇదిగో ఈ భోగి పూట శ్రీథర్ గారి వ్యాసం చదవటం పెద్దపండుగలా ఉంది నాకు. నామీదనాకు నమ్మకాన్ని, తెలుగుపాఠకుల అభిరుచిపై గౌరవాన్ని పెంచే మీ ఈ వాక్యాలకు మరొక్కసారి మీకు ధన్యవాదములు శ్రీథర్ గారు. బొల్లోజు బాబా *** . కైఫీయత్తులు – నా యురేకా మూమెంట్ . . కైఫియత్తు ల గురించి ఎన్నాళ్ళనుంచో వింటున్నా, చదవాలనే ఉద్దేశ్యం మాత్రం ఆ పుస్తకం మీద ఉన్న మా తూర్పు గోదావరి జిల్లా పేరు, మ్యాప్ చూసిన తర్వాతే కలిగింది. రచయిత ‘బొల్లోజు బాబా’ గారి మీద నాకు కొంత అభిమానం ఉంది. సరళంగా , గాఢమైన భావంతో ఉండే ఆయన కవితలు , అనువాదాలు , ఏ విషయాన్నయినా చదివించ గలిగేలా ఉండే శైలి నాకిష్టం. కైఫియత్ అనే ఉర్దూ పదానికి ‘ సంగతులు , విశేషాలు ‘ అని అర్థం. స్థానికులు వారి గ్రామ చరిత్ర, సరిహద్దులు దేవాలయ భూములు , పాలకుల వివరాలు లాంటివి తాళపత్ర గ్రంథాలపై రాసుకుని భద్రపరుచుకునే వారట. వాటిని ‘దండెకవిలెలు’ అనేవారు.ముస్లిం పాలనలో వాటిని కైఫియత్ లు అనే పేరుతొ వ్యవహరించడం మొదలయ్యింది. చిన్నప్పుడు ‘ మన పొలం ఎక్కడినుంచి ఎక్కడికో ఎలా తెలుస్తుంది?’ అని నేను అడిగిన ప్రశ్నకి మా తాత గారు ఇచ్చిన సమాధానం ఇప్పటికీ నాకు గుర్తు. ’ మనకేమి తెలుస్తుందిరా .. కరణం గారు ఎంత చెపితే అంత’ అని. ఆ కరణం గారి దగ్గరే ఈ వివరాలు ఉండేవి. బహుశా ఊరుమ్మడి విషయాలు కూడా వారిదగ్గరే ఉండేవేమో. నా చిన్నప్పుడు మా ఊరిలో ఒక మట్టి కోట ఉండేది. దానిలో అప్పుడప్పుడూ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు చేస్తూ ఉండేవారు. ‘దానిని ఎవరు కట్టించి ఉంటారు?’ అని బహుశా ఊరిలో సగం మందిని అడిగి ఉంటాను. చాలా మంది ‘ఎప్పుడో రాజుల కాలం నాటిది ..మనకేం తెలుస్తుందిరా కరణం గారికే తెలియాలి ‘ అనేవాళ్ళు. అయితే నాకు ప్రశ్నించే వయసు వచ్చేటప్పటికే కరణం గారు కాలం చేయడం వల్ల నా సందేహం అలాగే ఉండిపోయింది . ఈస్టిండియా కంపనీ లో సర్వేయర్ గా పనిచేసిన మెకంజీ శాసనాలు,దండెకవిలెలు,ప్రాచీన ఆలయ చిత్రాలు , నాణాలు మొ.గు వాటిని విస్తారంగా సేకరించాడు. అలా సేకరించిన వాటి ద్వారా భారతీయుల చరిత్రను తెలుసుకోవచ్చని నమ్మాడు. తన దగ్గర పనిచేసే వారిని గ్రామ కరణాలు,పెద్దల దగ్గరికి పంపించి వాటిని సేకరించి ఆ విశేషాలతో వ్రాత ప్రతుల్ని తయారు చేయించాడు. హిందువులకి చరిత్రను రికార్డు చేసుకునే అలవాటు లేదనుకునే బ్రిటిష్ వారు ఆ కైఫీయత్తులు చూసి ఆశ్చర్యపడ్డారట. నిజానికి తూర్పు గోదావరి జిల్లా కి సంబంధించి పది కైఫీయత్తులు మాత్రమే లభ్యం . ఎక్కువగా రాయలసీమ కి సంబంధించినవే ఉన్నాయి. గొలుసుకట్టు రాతలో ఉన్న వీటిని రచయిత సరళమైన భాషలోకి మార్చి సామాన్య పాఠకులు చదువుకునేలా చేసారు. కైఫియత్తుల లోని విషయాలని యథాతధంగా ఇస్తూ , ఫుట్ నోట్స్ లో మాత్రం చారిత్రక విషయాలతో అనుసంధానించడానికి ప్రయత్నించారు. విజయనగరం, పిఠపురం , రాజమహేంద్రవరం , పెద్దాపురం , సామర్లకోట ,కోరుకొండ సంస్థానాల చరిత్ర , వేంగీ చాళుక్యులు, రెడ్డి రాజుల పాలనా కాలం నాటి చారిత్రక విశేషాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ కైఫియత్తుల ని చరిత్ర అనుకోవచ్చా? స్థల పురాణ కథలు కూడా చేరిపోవడంతో వీటిని చరిత్ర అని చెప్పలేము కానీ , నమ్మశక్యం కాని విశేషాలని పక్కనబెడితే దీనిలో కచ్చితంగా చరిత్ర ఉందని నాకనిపించింది. ఎందుకంటే మా ఊరి కోట గురించి ఎంతమందిని అడిగినా దొరకని సమాధానం ఈ పుస్తకంలో ( కోరుకొండ కైఫియత్తులో ) దొరికింది. మా ఊరి కోటని వేమారెడ్డి నిర్మించాడట . బహుశా అది ఆరు వందల సంవత్సరాల క్రితం కావచ్చు. ఆ తర్వాత చాలా కాలానికి , బహుశా ఈస్టిండియా కంపనీ కాలంలో , మందపాటి రఘునాధ రాజు అనే జమిందారు ఆ కోటలోనే సర్కారు వారితో సంప్రదింపులు జరిపి కోరుకొండ పరగణాని సంపాదించుకున్నాడట . ఆయన కొడుకు తిరుపతిరాజు ఆ కోటని పెద్దది చేసాడట. మా ఊరిపేరు రహితాపురం అని ఉంది. చుట్టుపక్క ఊర్లన్నీ ఇప్పటి పేర్ల తోనే ఉన్నాయి . మా ఊరు మాత్రం కాలక్రమేణా రఘుదేవపురం అయింది. మా చిన్నప్పుడు (ఇప్పటికీ) వాడుకలో రైతాపురం అనేవాళ్ళం. బహుశా అది రహితాపురం నుంచే వచ్చి ఉంటుంది. ఆ కోరుకొండ కైఫియత్తు చదవడం నాకు ఒక ‘యురేకా’ మూమెంట్. ఉత్సాహం ఆపుకోలేక బాబా గారికి మెసేజ్ చేసాను. ఆయన నాకంటే ఎక్సైట్ అయ్యారు. ఈ పుస్తకంలో తూర్పు గోదావరి జిల్లా కైఫియత్తులతో బాటు , మెకంజీ జీవిత విశేషాలు , ఆయన సేకరించిన శాసనాలు, పుస్తకం చివర కొన్ని చారిత్రక వివరణలు ఉన్నాయి. అప్పటి తెలుగు వారి జీవన స్థితి గతులు , చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవవలసిన పుస్తకం. ఇది చదవడానికి తూర్పు గోదావరి వారే కానవసరం లేదు. ఒకవేళ తూర్పు గోదావరి వారయితే ,నాలా అదృష్టం కలిసొస్తే, మీ ఊరు చరిత్ర కూడా దొరకొచ్చు. ఈ పుస్తకం రాయడానికి రచయిత సంప్రదించిన పుస్తకాలు, వ్యాసాలు చూస్తే మతిపోతుంది. ఇది కేవలం Rs.200 లకే దొరకడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ విదేశీయులో అయితే ఇంత పరిశోధనకి కనీసం వంద డాలర్లు పెట్టి ఉండేవారు. మన దగ్గర ఉందని చెప్పుకోడానికైనా ఈ పుస్తకం కొనుక్కోవచ్చు. తాజాకలం: మెకంజీ ఆంధ్ర,కర్ణాటక, తమిళనాడు నుంచి కైఫీయత్తులు సేకరించాడు. కర్ణాటక, తమిళనాడు లలో సేకరించిన వాటిలో కూడా తెలుగులో రాయబడ్డవి ఉన్నాయట. బహుశా ఆంధ్ర దేశం నుంచి వెళ్ళిన తెలుగు వారే ఈ కైఫీయత్తులు రాయడం నేర్పించి ఉంటారని ఒక పరిశోధన ( ఆ విధంగా తెలుగు వాళ్ళని చరిత్ర ని రికార్డు చేయడంలో యూరోప్ వాళ్ళతో పోల్చవచ్చని నా ఇది..) ఈ పుస్తకం లో నాకు నచ్చిన విశేషాలతో ఇంకో రెండు పోస్ట్ లు రాస్తా.. ఇది పల్లవి పబ్లికేషన్స్ వారి ద్వారా దొరుకుతుంది. 9866115655 కి whatsup మెసేజ్ చేస్తే చాలు. by Sri. Narukurti Sridhar

No comments:

Post a Comment