Saturday, September 12, 2020

Imported post: Facebook Post: 2020-09-12T23:11:31

చరిత్రలో కన్యాశుల్కం వివాహవ్యవస్థ సమాజంలో అతి ముఖ్యమైనది. ఒక యువకుడు గృహస్థాశ్రమ దశలో భార్యతో కలిసి ధార్మికవిధులను, తన ఫూర్వీకులకు సంబంధించిన కర్మకాండలను నిర్వహిస్తూ జీవించాలని వేదాలలో చెప్పబడింది. స్త్రీ పురుషులిద్దరకూ సమాన హోదా ఇవ్వబడింది. అర్ధాంగి అనే మాట అప్పటిదే. భార్యాభర్తలిరువురు ఒకేదేహంలోని ఇద్దరు వ్యక్తులు కనుక, భర్తచనిపోతే ఇంకా సగభాగం బ్రతికే ఉన్నట్లే, అట్టి భర్తృహీనకు భర్తఆస్తిలో హక్కు ఉంటుందని స్మృతులు చెప్పాయి. స్త్రీల పట్ల ఆనాటి చట్టాలు చూపిన సమానత్వమది. మధ్య యుగాలకు వచ్చేసరికి సమాజంలో స్త్రీ స్థానం తారుమారు అయ్యింది. పురుషాధిక్య సమాజంలో ఒక విలాస వస్తువుగా మారింది. రాజులు, సంపన్నవర్గాలు అంతఃపుర స్త్రీల (Harem) పేరిట వేలకొలది యువతులను తమ ఆధీనంలో ఉంచుకోవటం; బహుభార్యత్వము; చట్టబద్ద వ్యభిచార గృహాలకు అవసరమైన స్త్రీలకొరకు పెద్దఎత్తున సమాజంలో యువతుల అపహరణాలు జరుగుతూ ఉండటం - లాంటి వివిధ కారణాల వల్ల ఒక సమయంలో స్త్రీల సంఖ్య విపరీతంగా పడిపోయింది. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలలోని యువకులకు పెండ్లాడాలంటే ఆడపిల్లలకు కరువు ఏర్పడింది. ఈ కాలంలోనే కన్యాశుల్కం అనే ఆచారం వచ్చిఉంటుంది. కన్యాశుల్కం ఆచారం అంటే ఆడపిల్లల తండ్రులకు కొంత ధనం చెల్లించి వారి అమ్మాయిలను పెండ్లిచేసుకోవటం. అలా చెల్లించిన ధనానికి కన్యాశుల్కం/ఓలిసుంకం/ఓలి మర్యాద అని వివిధ పేర్లు. . పదహారో శతాబ్దంలో Linschoten అనే డచ్ వ్యాపారి ఆంధ్రదేశాన్ని సందర్శించినపుడు "ఇక్కడ ఆడపిల్లలకు 7 సంవత్సరాలలోపు, మగపిల్లలకు తొమ్మిది సంవత్సరాలలోపు వివాహాలు అయిపోతాయి. అమ్మాయిలకు యుక్తవయసు వచ్చిన పిదప మాత్రమే కాపురానికి పంపించటం జరుగుతూన్నది" అన్నాడు. మనుస్మృతిలో స్త్రీ వివాహ వయస్సు 12 లేదా 18 సంవత్సరాలుగా చెప్పబడింది. యజ్ఞయాగాదులు, పితృదేవతల కర్మకాండలు ఇతర పూజాదికాలు సతీ సమేతంగా నిర్వహించవలసి ఉంటుంది కనుక ముప్పై ఏండ్ల వయసు ఉన్న పురుషుడు, తన ధార్మిక విధులు నిర్వహించటానికి అత్యవసర పరిస్థితులలో 8 ఏండ్ల బాలికను వివాహమాడవచ్చునని మినహాయింపు ఇచ్చింది (Olivelle 2005, p. 194). లౌకిక వ్యవహారాలను నిర్వహించటానికి స్త్రీలకు కనీసం 12 సంవత్సరములు, పురుషులకు 16 సంవత్సరములు ఉంటేనే వారు అర్హులని కౌటిల్యుని అర్ధశాస్త్రం చెప్పింది. మన ప్రాచీన ధర్మశాస్త్రాలలో ఎక్కడా Linschoten వర్ణించినట్లు అమ్మాయిలకు ఏడు సంవత్సరాల వయసులోపు చేసే బాల్య వివాహాల ప్రసక్తి లేదు. మధ్యయుగాలలో ఏర్పడిన సామాజిక పరిస్థితుల వల్ల బాల్యవివాహాలు అనేవి ఒక రకంగా కరువు కాలంలో "ముందస్తు ఒప్పందాల" వంటివి అని భావించవచ్చు. ఈ కన్యాశుల్క ఆచారం వల్ల ఒకనాటి మధ్యతరగతి యువకులు ఎలా నలిగిపోయారో కొన్ని శాసనాల ద్వారా తెలుస్తున్నది. *** విజయవాడ మల్లేశ్వర ఆలయంలో క్రీశ. 1553 నాటి ఒక శాసనములో- కొండపల్లినుండి రాజమహేంద్రవరం వరకూ ఉన్న ప్రజలందరూ (తెలగాలు?) పెండ్లికొడుకు తరపువాళ్ళైతే "ఓలి మర్యాద" గా 21 బంగారు మాడలు, పెండ్లికూతురు తరపువాళ్ళు 12 వెండి మాడలు ఇచ్చిపుచ్చుకోవాలని; పెండ్లికూతురుకి రెండవపెండ్లి అయితే మగపెళ్ళివారు పన్నెండు వెండిమాడలు, రెండు బంగారు మాడలు ఇవ్వాలని దీన్ని ఎవరు తప్పినా హీనవాదులు" అని ఉన్నది. (శా.నం. 337 of 1892). మగ పెండ్లివారు అధిక మొత్తాన్ని ఆడపెండ్లివారు నామమాత్రంగా కానుకలు ఇచ్చిపుచ్చుకోవటం గమనించవచ్చు. అప్పట్లో ఇలా జరిగే బాల్య వివాహాలకారణంగా చిన్న వయసులోనే స్త్రీలు వైధవ్యం పొందేవారు. అలాంటి వారికి పునర్వివాహం చేయటానికి ఎలాంటి ఆక్షేపణా ఉండేదికాదు. అలాంటి వివాహాలకు తక్కువ ఓలి ఉండేది. నిర్ధిష్టమైన కట్నకానుకలను నిర్ణయించటం ద్వారా ఆనాటి సంఘం తన సభ్యుల హెచ్చుతగ్గుల్ని క్రమబద్దం చేయటానికి ప్రయత్నించేదని అర్ధమౌతుంది. *** పూర్వం రాజుల ప్రాపకం పొందిన వారికి రాజు కొన్ని గ్రామాలను దానం చేసేవాడు. వారు ఆ గ్రామాలు కట్టే పన్నులను వసూలు చేసుకొంటూ జీవనం సాగించేవారు. తమ మగపిల్లలకు వివాహం చేయవలసిన సందర్భాలలో తమకు హక్కుకలిగిన గ్రామాలను కన్యాశుల్కం క్రింద దానం చేసేవారని శాసనాలలో కనిపిస్తుంది. విజయనగర రాజుల పాలనలో క్రీశ. 1379 నాటి శాసనంద్వారా నంబి ఇరవ శెట్టియార్ తనకు హక్కుభుక్తంగా ఉన్న పసింగైపల్లి అనే గ్రామాన్ని తనమనవడైన కేశవ శెట్టియార్ కు వివాహం నిమిత్తం ఆచంద్రతారార్కం ఉండేలా దానం ఇచ్చాడు. అంటే మనవడి పెండ్లి ఖర్చులను తాత భరించినట్లు అర్ధం చేసుకోవాలి. ఆచంద్రతారార్కం అంటే ఒక రకంగా ఆ గ్రామంపై తనకు ఉన్న అన్ని హక్కులను ఒదులుకొన్నట్లే. (Epigraphia carnatica, Inscriptions of Bangalore District Vol IX, pn 102) క్రీశ. 1404 నాటి ఒక శాసనములో అచ్చప్ప కొడుకు విత్తప్ప అనే వ్యక్తి "తన వివాహఖర్చులకొరకు" కౌదవల్లి అనే గ్రామాన్ని 300 బంగారునాణాలకు (Hon coins), నరశింహదేవ కుమారుడైన శుంగప్పకు విక్రయించినట్లు కలదు. (Epigraphia carnatica, Inscriptions of Bangalore District Vol VIII, pn 190). క్రీశ. 1424 నాటి శాసనములో ఆళ్వప్రభు బొమ్మియక్క అనే వ్యక్తి బోవన్న అయ్య అనే ఆలయపూజారికి కొంతభూమిని "తన వివాహ నిమిత్తం" విక్రయించినట్లు కలదు. (ibid p 199) పై శాసనముల ద్వారా మగపిల్లల వివాహం అనేది ఖర్చుతో కూడుకొన్నదని, కన్యాశుల్కధనం కొరకు ఆస్తులు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అర్ధమౌతుంది. "ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెండ్లాడితే ఇంటి కుండలన్నీ పగలకొట్టిందట" అనే సామెతలో ఆనాటి మధ్య, దిగువమధ్యతరగతి పెండ్లికొడుకులు సామాజికంగా ఎదుర్కొన్న వ్యధంతా దాగిఉన్నది. ( ఈ సామెతలోని body shaming కి ఈ రచయిత వ్యతిరేకం) *** మెకంజీ సేకరించిన గ్రామ కైఫియ్యతులలో వివిధ కులాలలో అమలులో ఉన్న కన్యాశుల్క ప్రస్తావనలు కలవు. ఇవి భిన్న కులాలకు భిన్న విలువలతో ఉండటాన్ని గమనించవచ్చు. * వక్కలిగర్ కులస్థులలో ఓలి మర్యాద 12 వరహాలు. వితంతువు అయితే 6 వరహాలు. * తెలుగు బానాజిగర్ కులస్థులలో పెండ్లికూతురికి ఓలి 8 వరహాలు. పెళ్ళి నిశ్చయమయ్యాక, జ్యోతిష్యుడు నిర్ణయించిన సమయానికి పెండ్లికుమారుని బృందం పెండ్లికుమార్తె ఇంటికి వెళ్ళి ఆ ధనాన్ని ఇస్తారు. ఆ మరుసటి రోజు ఆ దంపతులను ఊరంతా ఊరేగించి వివాహం జరిపిస్తారు. * కుంభకార కులాలలో ఓలి మర్యాద 3 వరహాలు. మేనరికాలకు మొదటి అవకాశం ఇవ్వాలి. పెండ్లికూతురు వితంతువు అయితే ఓలి మర్యాద 1 వరహా. * వడ్డెరలలో ఓలి 2 వరహాలు, మారుమనువు అయితే 1 వరహా. వీరి ముహుర్తాలను జోగినిలు నిర్ణయించెదరు. (ref: Summaries of the Mackenzie collection vol II) కన్యాశుల్కం అనేది ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే చెందిన ఒక దురాచారంగా తెలుగునాట స్థిరపడిపోయింది. కానీ ఈ ఆచారాన్ని ఆనాటి సమాజంలోని ఇతర కులాలు కూడా పాటించేవని మెకంజీ కైఫియ్యతులద్వారా అర్ధమౌతుంది. *** విజయనగర రాజు ప్రతాపదేవరాయలు చెంగల్పట్టు, మంగాడు అనే గ్రామంలో స్థానికులతో కలసి వేయించిన ఒప్పంద శాసనము చాలా ఆసక్తికరం. దీనిలో వివాహసందర్భంగా ఆ గ్రామానికి చెందిన భూములను స్థానికేతరులకు సంక్రమింపచేయరాదని ఉన్నది. (శా.నం.354 of 1908). ఈ శాసనం ఆనాటి గ్రామసంఘాలయొక్క కట్టుబాటును తెలియచేస్తుంది. బహుసా ఆడపిల్లల తండ్రులు తమకూతురికి కన్యాశుల్కంగా ఇవ్వబడిన భూముల యాజమాన్యహక్కులను పదిలపరచుకొనే ప్రయత్నంలో ఆ గ్రామంలో ఏవో ఘర్షణలు జరిగి ఉంటాయి. కన్యాశుల్కమంటే ఆడపిల్లలను అమ్ముకోవటంగానే ఒకనాటి సమాజం చూసిందని అనుకోవాలి. *** కన్యాశుల్క ఆచారం గురించి అప్పట్లోనే ప్రజలలో నిరసన ఉండేదనటానికి కూడా ఒక శాసనం ఆధారంగా నిలుస్తుంది. ఆనాటి సమాజ చైతన్యాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక శాసనమిది. క్రీశ 1425, వీరప్రతాప దేవరాయలు పాలనలో పడైవీడు ప్రాంతానికిచెందిన కన్నడ, తమిళ, తెలుగు బ్రాహ్మణులందరూ కలసి ఒక తీర్మానం చేసుకొన్నారు. దీనిప్రకారం "వారి కుటుంబాలమధ్య జరిగే వివాహాలు కన్యాదాన పద్దతిలో మాత్రమే జరుపుకొనేటట్లు, పెండ్లికూతురుతండ్రి ధనాన్ని స్వీకరించినా లేక పెండ్లికొడుకుతండ్రి ధనాన్ని ఇవ్వచూపినా వారిని కులం నుండి వెలివేయటం జరుగుతుందని; ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు కన్యాదానపద్దతి వివాహమే అనుమతించబడినదని; దీన్ని అతిక్రమించేవారు రాజదండనకు పాత్రులు అని వ్రాసుకొని సంతకాలు పెట్టుకొని, ఆ తీర్మానాన్ని తమిళనాడులోని వెల్లూరు వద్దకల విరించిపురం ఆలయగోపురం లోపలిగోడపై ఒక శాసనంగా వేయించారు. (శా.నం.49 of 1887) ఈ శాసనం ద్వారా ఒకప్పుడు ప్రజాసమూహాలు తమకు సంబంధించిన ఆచారవ్యవహారాలను ప్రజాస్వామ్యయుతంగా రూపొందించుకొని దానికి కట్టుబడి ఉండేవారని తెలుస్తుంది. శాసనం దిగువ దీనికి ఒడంబడిన గ్రామపెద్దల వివరాలు, వారి ఊరిపేర్లతో సహా ఉన్నాయి. ఇది ఒకరకంగా పెద్దమనుషుల ఒప్పందం లాంటిది. అది రాజామోదం పొందటం గమనార్హం. ఈ అమరిక ఇతరప్రాంతాలకు విస్తరించినట్లు లేదు. *** మధ్యయుగాలలో మధ్యతరగతి వర్గాలు వివాహం చేసుకోవాలంటే భరించాల్సిన మరో కష్టం పెండ్లి సుంకం. అప్పట్లో సాధారణంగా పెళ్ళిళ్ళు ఆలయాలలో జరిగేవి. అలా చేసుకొన్నందుకు అప్పటికి అమలులో ఉన్న చట్టాలప్రకారం పెండ్లి సుంకం చెల్లించాలి. దీన్ని ఆడ మరియు మగ పెండ్లి వారు ఇరువురూ కట్టవలసి ఉంటుంది. పెండ్లి సుంకం వసూలు చేయటం చోళులకాలం నుంచి ఉన్నది. పెండ్లి సుంకం కాక వివాహ సందర్భంలో జరిపే ఉరేగింపు, పెళ్లిపందిరులు, వివాహవేడుకలు, పల్లకి యాత్రలకు వంటి వివిధ అంశాలకు విడి విడి పన్నులు వసూలుచేసేవారు. రొంపిచర్ల, వేణుగోపాల స్వామి ఆలయంలో క్రీశ. 1264 నాటి ఒకశాసనములో, ఆ ఆలయములో వివాహము జరుపుకొన్నందుకు ఒక బంగారు మాడ పెండ్లిసుంకము, 13 పోకలు, ఒక కట్ట తమలపాకులు స్వామివారికి సమర్పించుకోవాలని ఉన్నది. ఆలయమునకు పెండ్లి సుంకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ బాగోగులకై వెచ్చించేవారని నరసారావుపేట పమిడిపాడు వల్లభరాయ ఆలయంలో క్రీశ 1154 లో వేయించిన ఒక శాసనము ద్వారా తెలుస్తున్నది. (శానం.347 of 1915) మెకంజీ సేకరించిన సంజీవిపల్లె కైఫియత్తులో గండికోట ను ఏలుతున్న పెమ్మసాని తిమ్మనాయుని కాలంలో కర్నగొల్లలు పేదరికముచేత 101 మాడల పెండ్లిసుంకము చెల్లించలేక అవివాహితులుగా ఉండిపోతున్నారని, వారి దుస్థితిని గమనించిన సదాశివరాయలు పెండ్లిసుంకాన్ని 16 మాడలకు తగ్గించాడనే ఉదంతం కలదు. ఈ ఉదంతం ద్వారా పెండ్లిసుంకం సామాజికంగా ఏ విధమైన ప్రభావం కలిగించేదో స్పష్టమౌతుంది. (Summaries of the Mackenzie collection vol II p.no 182) పెండ్లి సుంకమును వివిధ శుభసందర్భాలలో ప్రజలకు కానుకగా ప్రభువులు రద్దుచేయటం జరిగేది. క్రీశ.1510 లో కృష్ణదేవరాయలు వేయించిన ఒక శాసనములో విజయనగర సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాలలో అన్నికులాల వారికి పెండ్లి సుంకము రద్దుచేసినట్లు ప్రకటించాడు. (శా.నం.387 of l904) *** క్రీశ. 1870 లో విశాఖపట్నానికి చెందిన G. Vedanthachary అనే మహాశయుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్రాసిన ఒక లేఖలో " ఈ కన్యాశుల్క దురాచారం వల్ల జరుగుతున్న బాల్యవివాహాల కారణంగా స్త్రీలు చిన్నవయసులోనే వితంతువులుగా మారుతున్నారని, ఈ ఆచారంపై నిషేదం విధించాలని" విన్నవించాడు. 1887 లో విజయనగర మహారాజు గారు చేయించిన ఒక సర్వేలో అక్కడ ఏటా 344 కన్యాశుల్క వివాహాలు జరుగుతున్నాయని, వధువులు ఎక్కువగా అయిదేండ్ల లోపుబాలికలు అని తేలింది. బహుశా ఈ సర్వే ఫలితాలు శ్రీ గురజాడ అప్పారావు గారు చూసే ఉంటారు. కన్యాశుల్కం నాటకం వ్రాయటానికి ప్రేరణ పొంది ఉండొచ్చు. ఆ తరువాతి క్రమంలో కన్యాశుల్కం బదులుగా వరకట్న ఆచారం పెచ్చరిల్లింది. నిజానికి స్త్రీలకు వివాహ సమయంలో స్త్రీ ధనం రూపంలో బహుమతులు ఇచ్చే పద్దతి అనాదిగా ఉన్న సంప్రదాయమే. అది ప్రేమతో, స్త్రీ స్వావలంబనను పెంచే ఆచారంగా అనుకోవచ్చు. కానీ నేటి వరకట్న డిమాండ్, వేధింపులు సామాజిక రుగ్మతలు. గత శతాబ్దంతో పోల్చితే పరిస్థితులు కొద్దికొద్దిగా మారుతున్నాయి. ఇదొక శుభపరిణామం. బొల్లోజు బాబా

No comments:

Post a Comment