Friday, January 31, 2025

పున్నిక థేరీ గాథ

గతకొద్దిరోజులుగా జరుగుతున్న కుంభమేళా సందర్భంగా రెండు వేల ఏండ్లక్రితం పున్నిక అనే బౌద్ధ భిక్కుణి నదిలో పవిత్రస్నానం చేస్తున్న ఒక బ్రాహ్మణుడితో చేసిన సంవాదన గుర్తుకువస్తోంది పదే పదే.
.
థేరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు
.  
[పున్నిక:]
నేను నీళ్ళు మోయు దాసిని
యజమానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి
ఎంతచలిలోనైనా నేను నదిలో దిగకతప్పదు
ఓ బ్రాహ్మణుడా!
కాళ్ళుచేతులు వణికే ఇంతచలిలో
నీవు దేనికి భయపడి నీటిలో మునుగుతున్నావు?

[ఉదకసుద్ధిక:]
పున్నికా! నీకు అన్నీ తెలుసు
నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది
దుష్కర్మలనుండి విముక్తులను చేస్తుంది

[పున్నిక:]
నీటిలో మునిగితే
పాపవిముక్తి జరుగుతుందని ఎవరన్నారు?
ఒక అంధుడు మరొక అంధునికి దారిచూపినట్లు.
అదే నిజమైతే
కప్పలు, తాబేళ్ళు, నీటిపాములు, మొసళ్లు లాంటి
జలచరాలన్నీ స్వర్గార్హత పొందిన పుణ్యజీవులేనా!.
జంతువులను వధించువారు, వలలు వేసేవారు,
ఉచ్చులు పన్నేవారు, దొంగలు, హంతకులు, దుర్మార్గులు
ఈ నీరు నెత్తిపై చల్లుకొంటే వారి వారి పాపాలు తొలగి
పుణ్యాత్ములౌతారా?
ఈ నీటికే పాపాలను తొలగించే శక్తే ఉంటే
పుణ్యాలను కూడా తీసుకుపోగలదు కదా!
అప్పుడు నీవు రెండిటినుండి విముక్తుడవు అవుతావు.
పాపభీతితో ఎముకలు కొరికే చలిలో స్నానం చేస్తూ
నీ శరీరాన్ని కష్టపెట్టుకోకు

[ఉదకసుద్ధిక:]
ఓ వనితా!
నేను తప్పు మార్గంలో వెళుతున్నాను
నీవు నన్ను ఉత్తమ మార్గం లోకి మళ్ళించావు
ఈ వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు

[పున్నిక:]
వస్త్రాన్ని నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు.
దుఃఖం అంటే భయం ఉన్నప్పుడు
దుష్కర్మలు చేయవద్దు చీకట్లోనైనా లేదా వెలుగులోనైనా
చెడ్డపనులు చేసి వాటినుంచి పారిపోయినప్పటికీ
వాని తాలూకు దుఃఖం నుంచి తప్పించుకోలేవు.
దుఃఖం నుండి విముక్తి పొందాలంటే
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించు
ఉపదేశాలను ఆచరించు. మంచి జరుగుతుంది.
 
[ఉదకసుద్ధిక:]
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించాను
ఉపదేశాలను ఆచరించాను. మంచి జరిగింది.
ఒకప్పుడు నేను బ్రాహ్మణసంతానాన్ని మాత్రమే
నేనీనాడు త్రివిద్యలను అభ్యసించి పరిశుద్ధుడనైన
నిజమైన బ్రాహ్మణుడను.
***
(థేరీగాథలు పుస్తకం నుంచి)
.
పున్నిక ఒక దాసి కూతురు. ప్రతిరోజు నదికి పోయి గృహావసరాలకు నీరు తీసుకొని వచ్చే అంబువాహిని. దాదాపు రెండున్నరవేల ఏండ్లక్రితం పున్నిక, ఉదకశుద్ధిక అనే బ్రాహ్మణుడితో నదీ స్నానం వెనుక ఉండే మూఢత్వాన్ని గురించి చేసిన సంభాషణ పై థేరీగాథలో గమనించవచ్చు. ఇది ఆనాటి ప్రజలలో ఉండిన మత పరమైన అవగాహన.
నీళ్ళలో నివసించే చేపలు, తాబేళ్ళు కూడా పుణ్యజీవులేనా? దుర్మార్గులు ఈ నీళ్ళు చల్లుకొంటే వారి పాపాలు పోతాయా అని వేసిన ప్రశ్నలు నేటికీ విలువైనవి.
అంత తార్కికంగా ఆలోచించిన అదే ప్రజలు నేడు పర్వదినాల పేరిట తొక్కిసలాటకు గురయి మరణిస్తున్నారు. అశోక చక్రవర్తి వేయించిన 1 వ నంబరు శాసనంలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేదించాడు. బహుశా మతం అనేది వ్యక్తిగతంగా సాధన చేయాల్సిన అంతర్యానం తప్ప సామాజికంగా గుంపులు గూడి ఆరాధించాల్సిన విషయం కాదని అశోకుని అభిప్రాయం కావొచ్చు.
అలాంటి ప్రజలలో ఉండిన శాస్త్రీయ ఆలోచనలను చంపేసి, జాతిమొత్తాన్ని నిర్వీర్యం చేసి అంధకారం వైపు, మూఢనమ్మకాలలోకి నడిపించారు గత వెయ్యేళ్ళుగా.
.
బొల్లోజు బాబా



Tuesday, January 28, 2025

రాజ్యాంగ రచన -డా. అంబేద్కర్ మహాసయుడు.


.
భారతరాజ్యాంగ నిర్మాణంలో 299 మంది సభ్యులు పాల్గొన్నారని వారిలో డా. బి. ఆర్. అంబేద్కరు ఒకరని; నిజానికి రాజ్యాంగాన్ని 1947 లోనే బి.ఎన్. రావు రచించాడని దానినే డా. అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ ముందు ప్రవేశపెట్టాడని; భారత రాజ్యాంగ నిర్మాతగా డా.అంబేద్కర్ పాత్ర పరిమితమని- అంటూ కొంతమంది సనాతనులు ప్రతి రిపబ్లిక్ డే రోజునా అబద్దాలను వండివార్చటం పరిపాటి.
***
రాజ్యాంగ సభ (Constituent Assembly) అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఈ సభ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946లో ఏర్పడింది. దీని ప్రధాన లక్ష్యం స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడం. ఈ సభ అధ్యక్షుడైన డా. రాజేంద్రప్రసాద్, భారత ప్రభుత్వ అధికారి, న్యాయకోవిదుడు బి.ఎన్ రావును రాజ్యాంగ ప్రాధమిక డ్రాఫ్ట్ ను/ముసాయిదా తయారు చెయ్యమని కోరాడు.
ఆ మేరకు బి.ఎన్. రావు వివిధ దేశాలు పర్యటించి, ఆ యా దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని మంచి అంశాలను క్రోడీకరిస్తూ ఒక నివేదికను తయారు చేసి అక్టోబరు 1947 లో స్వతంత్రభారత ప్రభుత్వానికి సమర్పించాడు. (దీన్ని ఆర్చైవ్స్ లో Constitution in the making పేరుతో చదువుకొనవచ్చును) ఇది ఒకరకంగా రాజ్యాంగానికి ప్రాధమిక ఔట్ లైన్. ఇక్కడితో బిఎన్ రావు పాత్ర ముగిసిపోయింది. 1948 లో బి.ఎన్ రావు యునైటెడ్ నేషన్స్ లో భారత ప్రతినిధిగా, 1952 వరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జ్ గా పని చేసారు. భారతదేశంలోనే లేరు.
బి.ఎన్ రావు తయారు చేసిన నివేదిక ను రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించబడిన డా. అంబేడ్కర్ కు ఇచ్చారు. దీనిని డా. అంబేద్కర్ దాదాపు తిరగ రాసి 299 మంది సభ్యులున్న Constituent Assembly ముందు చర్చించటానికి ప్రవేశపెట్టారు.

రాజ్యాంగాన్ని నిర్మించటం కొరకు జరిగిన చర్చలను Constituent Assembly Debates అంటారు. ఇవి డిశంబరు 9 1946 నుండి నవంబరు 26, 1949 మధ్య జరిగాయి.
.
బి.ఎన్ రావు ప్రతిపాదించిన రాజ్యాంగ ఫ్రేమ్ వర్క్ నివేదికకు (1947) డా. అంబేద్కర్ తుదిరూపు దిద్దిన (1950) రాజ్యాంగానికి గల వ్యత్యాసాలను ఈ విధంగా గుర్తించవచ్చు.
 
1. 240 ఆర్టికిల్స్ ను 390 ఆర్టికిల్స్ గా డా. అంబేద్కర్ విస్తరించారు.
 
2. ప్రజలమధ్య సోదరభావం సమైక్యత పెంపొందించటానికి రాజ్యాంగ ప్రవేశికలో సౌభ్రాతృత్వం అనే పదాన్ని డా. అంబేద్కర్ చేర్చారు

3. బిఎన్ రావు ప్రణాళిక 1935 నాటి భారతప్రభుత్వ చట్టాలపై ఎక్కువగా ఆధారపడింది. డా. అంబేడ్కర్ రాష్ట్రాలు, కేంద్రాల అధికారాలను, పరిధులను స్పష్టంగా నిర్వచించారు. కేంద్రం బలంగా ఉండేందుకు అనేక మార్పులు చేసారు. అత్యవసర సమయంలో దేశంలో ప్రాధమిక హక్కులు రద్దుచేసి ఎమర్జెన్సీ విధించే హక్కు కేంద్రానికి కల్పించారు.

4. బిఎన్ రావు ప్రణాళికలో ప్రాథమిక హక్కులు పరిమితంగా ప్రస్తావించబడ్డాయి. డా.అంబేద్కర్ తుది రాజ్యాంగం వాటిని విస్తరించి పునర్నిర్మించింది, ముఖ్యంగా వివక్షకు వ్యతిరేకంగా రక్షణలు కల్పించింది. అంటరానితనాన్ని రద్దు చేసింది. ప్రాధమిక హక్కుల పునరుద్ధరణ కొరకు ఏ పౌరుడైనా సుప్రీమ్ కోర్టు తలుపు తట్టటం అనే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. (ఆర్టికిల్ 32) దీన్ని రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్ అని డా. అంబేద్కర్ వర్ణించారు.
 
5. డా. అంబేద్కర్ న్యాయవ్యవస్థను స్వతంత్రంగా నిలబెట్టారు. ప్రజల ప్రాధమిక హక్కులను రక్షించటానికి దానికి విస్త్రుతమైన అధికారాలను ఇచ్చారు.
 
6. బిఎన్ రావు ప్రణాళికలో పెద్దల ఓటు హక్కు లేదా ఎన్నికల ప్రక్రియలను స్పష్టంగా నిర్వచించలేదు. అంబేద్కర్ బృందం సార్వత్రిక పెద్దల ఓటు హక్కు మరియు ఎన్నికల యంత్రాంగాల కోసం ఒక బలమైన స్వతంత్ర వ్యవస్థను ప్రతిపాదించింది.
 
7. బిఎన్ రావు ప్రణాళిక భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు స్పష్టమైన నిబంధనలను రూపొందించలేదు. అంబేద్కర్ ఆధ్వర్యంలోని తుది రాజ్యాంగం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ఆవశ్యతను, అవకాశాలను గుర్తించింది.

8. ఆర్టికిల్ 39 ద్వారా సమానపనికి సమాన వేతనచట్టాన్ని మరింత విస్త్రుతపరచారు డా. అంబేడ్కర్. అదే విధంగా ఆర్టికిల్ 45 ద్వారా 14 ఏళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటం రాష్ట్రాల బాధ్యత చేసారు.

9. బిఎన్ రావు ప్రణాళికలో వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించమని ఉంది. దీన్ని డా.అంబేద్కర్ మరింత విస్తరించి ఎస్సి, ఎస్టీ లకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు.
 
10. అత్యయిక పరిస్థితులలో దేశం ఏం చెయ్యాలనేది బి.ఎన్ రావు ప్రణాలికలో సూచించలేదు. దీన్ని 352, 356, 360 లాంటి ఆర్టికిల్స్ ద్వారా కేంద్రం దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకొని యుద్ధం, అంతర్గతకల్లోలాలు వంటి అత్యయిక పరిస్థితులను సరిదిద్దే అవకాశం కల్పించారు డా. అంబేద్కర్

11. రాజ్యాంగ సభ ఈ ముసాయిదాను సుమారు మూడేళ్ళపాటు చర్చలు జరిపి తుది రాజ్యాంగాన్ని ఆమోదించింది. దాదాపు ఈ చర్చలన్నిటిలో డా. అంబేద్కర్ పాల్గొన్నారు. సభ్యుల సందేహాలకు వివరణలు ఇచ్చారు. అభ్యంతరాలు చెప్పిన చోట వేల కొలదీ తగిన సవరణలు చేసి ఒప్పించారు. ఆ విధంగా రాజ్యాంగ తుది రూపం డా.అంబేద్కర్ మేధో శ్రమఫలితమే.
 
పై అంశాలను గమనిస్తే- ఈ రోజు ఏదైతే మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం అని అనుకొంటున్నామో దానిని డా. అంబేడ్కర్ రూపొందించినట్లు అర్ధమౌతుంది. ఇది సామాన్యపౌరుడిని వివక్ష, దోపిడి, దౌర్జన్యాలనుండి నుండి రక్షిస్తుంది. ఈ రోజు ఈ హక్కులను కాలరాయటం జరుగుతోంది. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించటం కూడా పైన పొందుపరచిన అంశాలను తొలగించటానికే అని అనుమానించే పరిస్థితులు ఉన్నాయి.
***
రాజ్యాంగ సభ 165 సార్లు కూర్చుని రాజ్యాంగం ఎలా ఉండాలో చర్చించింది. అనారోగ్యంతో ఉండికూడా వీటిలో సుమారు 150 సమావేశాలకు డా.అంబేడ్కర్ హాజరయ్యారు. తుది మెరుగుల కొరకు ముసాయిదాను మూడుసార్లు సభ్యుల ముందు ప్రవేశపెట్టారు.
రాజ్యాంగ సభ సభ్యులు మొత్తం 7635 మార్పులు సూచించగా 2473 మార్పులను డా. అంబేద్కర్ అంగీకరించి తదనుగుణంగా సవరణలు చేసారు. తిరస్కరించిన సూచనలకు, చేసిన మార్పులకు స్వయంగా సమాధానం ఇచ్చారు.
 
ఈ Constituent Assembly చర్చలన్నీ నేడు 6756 పేజీల డాక్యుమెంటుగా లభిస్తున్నాయి. ఈ డాక్యుమెంటులో డా. అంబేడ్కర్ పేరు 4524 సార్లు రాగా బి.ఎన్ రావు పేరు 35 సార్లు మాత్రమే ఉండటాన్ని బట్టి డా. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో పోషించిన పాత్ర స్పష్టమౌతుంది.
రాజ్యాంగ సభలో డా. అంబేద్కర్ రోజూ 9-10 సార్లు లేచి నిలబడి తన అభిప్రాయాలను సమర్ధించుకోవటమో లేక సమాధానం ఇవ్వటమో చేసారని, కొన్ని సార్లు రోజుకు 25-26 సార్లు కూడా సభలో తన గళాన్ని వినిపించేవారని ఈ Constituent Assembly చర్చల ద్వారా అర్ధమౌతుంది.
తుది రాజ్యాంగ ప్రతి 1949 లో కమిటీ సభ్యుల ఆమోదం పొంది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణదశ, దాన్ని ఆమోదించటంలో రాజకీయంగా డా. అంబేడ్కర్ కు జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన మద్దతును విస్మరించలేం.
***
రాజ్యాంగ రచనలో పాల్గొన్న 299 మంది సభ్యులలో డా. అంబేద్కర్ ఒకరని, రాజ్యాంగాన్ని బి.ఎన్ రావు రూపొందించగా డా. అంబేద్కర్ క్రెడిట్ తీసుకొన్నారని సనాతనులు దుష్ప్రచారం చేస్తారు.
రాజ్యాంగ సభ సభ్యులలో ఒకరైన టీ.టీ. కృష్ణమాచారి, ఒక సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంకితభావం గురించి మాట్లాడుతూ ---"రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి ఎంపిక చేసిన ఏడుగురు సభ్యులలో ఒకరు రాజీనామా చేశారు, ఒకరు మరణించారు, ఒకరు అమెరికాకు వెళ్ళారు, ఒకరు స్వరాష్ట్రంలో తన పనితో బిజీగా ఉన్నారు, ఇద్దరు ఢిల్లీ నుండి దూరంగా నివసిస్తున్నారు, మరొకరు ఆరోగ్య కారణాల వల్ల మినహాయించబడ్డారు, డాక్టర్ అంబేద్కర్ ఒక్కరే భారాన్ని మోయవలసి వచ్చింది" అని అన్నారు.
 
డా.అంబేడ్కర్ సమకాలీనుడు, రాజ్యాంగరచనలో పాల్గొన్న ఒక వ్యక్తి అన్నమాటలు. ఇవేవీ ఈ సనాతనులకు కనిపించవు.
 
నేడు వీరు డా. అంబేద్కర్ కృషిని తగ్గించాలని చూడటానికి కారణాలు - డా.అంబేడ్కర్ ప్రాచీన ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా, ప్రజలందరకూ సమాన హక్కులు, విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించటం మరీ ముఖ్యంగా ఈ దేశాన్ని హిందూరాజ్యంగా కాక స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు అనుగుణంగా నిర్మించు కొనేందుకు ఒక బలమైన రాజ్యాంగాన్ని ఇవ్వటం, అది సామాన్యులు, నిరుపేదల పట్ల పక్షపాతంతో ఉండటం. వీటిని జీర్ణించుకోలేక సనాతనులు నిత్యం ఈ శతాబ్దపు దార్శనికుడిపై బురద జల్లుతున్నారు.
 
బొల్లోజు బాబా

Tuesday, December 24, 2024

డా. అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు?

భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దటంలో నెహ్రూ, డా. అంబేద్కర్ లు పరస్పరం సహకరించుకొంటూ పోషించిన పాత్ర అనన్యసామాన్యమైనది. డా. అంబేద్కర్ కు రాజకీయపరంగా నెహ్రూ ఇచ్చిన మద్దతుతో గొప్ప ఆధునిక విలువలు కలిగిన రాజ్యాంగం రూపుదిద్దుకొంది. డా. అంబేద్కర్,పండిత నెహ్రూల సంస్కరణాభిలాషకు హిందూకోడ్ బిల్ అద్దం పడుతుంది. మతవాదులు ఈ బిల్లును తీవ్రంగా అడ్డుకొన్నారు. ఈ మతవాదుల దూకుడుకు నెహ్రూ కూడా రాజకీయంగా కొంత తగ్గవలసి వచ్చింది. 1949 నుంచి దాదాపు రెండేళ్లపాటు పార్లమెంటులో హిందూకోడ్ బిల్లుపై చర్చలు జరిగాయి. కొలిక్కి రాలేదు.

ఈ బిల్లును పార్లమెంటులో డా. రాజేంద్ర ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జి, పట్టాభి సీతారామయ్య పండిత్ గోవింద మాలవ్య, బిహారీలాల్ భార్గవ, దుర్భంగా మహరాజా లాంటి వారు వ్యతిరేకించారు. పార్లమెంటు వెలుపల హిందూ మతగురువులు, ధార్మిక నాయకులు ఈ బిల్లును తీవ్రంగా తూర్పారపట్టారు.
 
వీరందరి వాదన ఒకటే – ఈ బిల్లు హిందూ ధర్మశాస్త్రాలపై ఆధారపడి లేదని, పాశ్చాత్యప్రభావంతో కూడిన చట్టం అని, ఇది మన సంస్కృతిని సంప్రదాయాలను మార్చటానికి ప్రయత్నిస్తున్నదని. వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డ హిందూ సామాజిక ఆచారవ్యవహారాలకు ఈ బిల్లులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. అంతేకాక మతవిషయాలపై పార్లమెంటుకు చట్టాలు చేసే యోగ్యత లేదని మతవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో- డిశంబరు 11, 1949 న వెయ్యిమంది సనాతనవాదులు పండిత గోవింద మాలవ్య నాయకత్వంలో పార్లమెంటును ముట్టడించారు. (ఆంధ్రపత్రిక డిశంబరు 13, 1949)

ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి పునఃపరిశీలన చేయటానికి డిశంబరు 19, 1949 న పార్లమెంటులో జరిగిన ఓటింగులో పదకొండు మంది మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓట్ చేయటాన్ని బట్టి హిందూ కోడ్ బిల్లు ఏ మేరకు సనాతనులనుండి ప్రతిఘటనను ఎదుర్కొందో అర్ధం చేసుకొనవచ్చును. (ఆంధ్రపత్రిక డిశంబరు 20, 1949)

సెలక్ట్ కమిటీ రెండేళ్ళ పాటు పరిశీలించిన అనంతరం కూడా హిందూ కోడ్ బిల్ పార్లమెంటులో ఆమోదం పొందలేదు.
 
హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందనందుకు డా. అంబేద్కర్ సెప్టెంబరు 27, 1951 న లా మినిస్టర్ గా రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖలో "పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే హిందూ న్యాయశాస్త్ర సవరణ బిల్లు నెగ్గవచ్చుననే నమ్మకంతో ఇంతవరకూ పనిచేసానని, ఆ ఉద్దేశంతోనే బిల్లులోనుంచి "వివాహం విడాకులు" భాగాన్ని ప్రత్యేకించటానికి కూడా అంగీకరించానని, ఇప్పుడు ప్రభుత్వము దానిని పూర్తిగా చంపివేసినందున రాజీనామా చేస్తున్నానని" డా. అంబేద్కర్ తెలియచేసారు. (ఈ లేఖలో డా. అంబేద్కర్ ప్రభుత్వ ఇతరవిధానాలతో తాను వ్యతిరేకిస్తున్నట్లు ఎక్కడా చెప్పి ఉండలేదు. - అక్టోబరు 13 1951 ఆంధ్ర పత్రిక)
 
పండిత నెహ్రూ ఈ లేఖకు ఆరోజే జవాబిస్తూ "హిందూ న్యాయసవరణ బిల్లు ఉపసంహరించబడి నందుకు డా. అంబేద్కర్ పొందిన ఆశాభంగాన్ని తాను గుర్తించినట్లూ, అయితే విధీ, పార్లమెంటు నియమాలూ తమకు ప్రతికూలించినట్లు, ఆ బిల్లు నెగ్గనిదే నిజమైన అభివృద్ధి ఉండదు కనుక దానికోసం ఇంకా తాను పాటు పడబోతున్నట్లూ తెలియచేసాడు.

హిందూ మహాసభ, జన సంఘ్, రామ రాజ్య పరిషద్ లాంటి మతవాద పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా, కాంగ్రెస్ లోని కొందరు మతవాదులు కూడా వారితో జతకలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన పట్టాభిసీతారామయ్య “ఈ బిల్లు విషయంలో జాగ్రత్తగా నడవకపోయినట్లయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింటుంది” అని నెహ్రూను హెచ్చరించాడు. ఇలాంటి తీవ్ర ప్రతికూలతల మధ్య బిల్లును ఆమోదింపచేయటం పండిత నెహ్రూ చేతిలో కూడా ఉండకపోవచ్చు. ఈ పరిణామాలు డా.అంబేద్కర్‌ను తీవ్రంగా నిరాశపర్చాయి.

హిందూ కోడ్ బిల్ లో ఏముంది?

హిందూ సమాజంలోని కుటుంబ, వివాహం, వారసత్వం వంటి వ్యక్తిగత చట్టాలను క్రోడీకరించి ప్రవేశపెట్టిన ఒక సమిష్టి చట్టాల సముదాయాన్ని హిందూ కోడ్ బిల్ అంటారు. హిందూకోడ్ బిల్ ఒక విప్లవాత్మక చట్టం. హిందూ కుటుంబం, వివాహం లాంటి అంశాలు ఎలా ఉండాలనేది హిందూ ధర్మ శాస్త్రాలు ఏనాడో నిర్ణయించాయి. కానీ వాటిలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, స్వేచ్ఛ ఉండదు. లింగ, కుల వివక్షలు ఉంటాయి. వాటిని తొలగించి మానవ సంబంధాలను ఆధునిక భావనలకు అనుగుణంగా నిర్వచించి, హిందూ సమాజాన్ని స్వేచ్ఛ, సమానత్వాలకు సిద్ధం చేయటం హిందూకోడ్ బిల్ ముఖ్య ఉద్దేశం.

ఈ బిల్లును సంప్రదాయ మత వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ ధర్మశాస్త్రాలు నిర్ధేశించినట్లు హిందువులు జీవిస్తారని; ధార్మిక విషయాలలో చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని అంటూ ఆందోళనలు చేసి హిందూ బిల్ ను అడ్డుకొన్నారు.
హిందూ బిల్ లో ప్రతిపాదించిన అంశాలను గమనిస్తే, డా. అంబేద్కర్ ఎంతటి దార్శనికత కలిగిన మనిషో, ధర్మశాస్త్రాల నిర్ధేశించినట్లుగా హిందూ కుటుంబం నడుచుకోవాలి అంటూ మతవాదుల ఎంతటి మూర్ఖపు వాదన చేసారో అర్ధమౌతుంది.

హిందూ కోడ్ బిల్---

1.బాల్యవివాహాలను నిషేదించింది. వివాహవయస్సు నిర్ణయించి, వధూవరుల పరస్పర అంగీకారంతో వివాహం జరగాలని చెప్పింది.
2.కులాంతర, మతాంతర వివాహాలను అనుమతించింది
3.స్త్రీలకు దత్తత తీసుకొనే హక్కు కల్పించింది
4.స్త్రీలకు విడాకులు ఇచ్చే హక్కు కల్పించబడింది. (ఈ క్లాజుకి భారతీయ సమాజం కుప్పకూలిపోతుందని పార్లమెంటులో మతవాదులు గగ్గోలు పెట్టారు)
5.విడాకులు తీసుకొన్న మహిళ జీవన బృతిగా మనొవర్తిపొందే హక్కు కల్పించింది
6.బహుబార్యత్వాన్ని నిషేదించింది
7.కుమార్తెలకు, కుమారులతో సమానంగా తండ్రి ఆస్తిలో హక్కు కల్పించింది. పెద్ద కొడుకుకు మాత్రమే ఆస్తిలో హక్కు కలిగి ఉండే ఆచారాన్ని నిషేదించింది.
8.స్త్రీలు ఆస్తిని కొనుగోలు చేసే హక్కు కల్పించింది
9.తండ్రితో సమానంగా పిల్లలకు తల్లి సహజ సంరక్షకురాలిగా ఉండే హక్కు కల్పించింది
10 స్త్రీలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి

పైన చెప్పిన అంశాలన్నీ స్త్రీ స్వేచ్ఛ, సాధికారికతకు సంబంధించిన అంశాలు. భారతదేశం రెండువేల సంవత్సరాలుగా పాటించిన సామాజిక విలువలకు ఇవి పూర్తిగాభిన్నమైనవి, కొత్తవి.
ధర్మశాస్త్రాలలో బాల్య వివాహాలు ఉంటాయి. కులాంతర వివాహాలు చేసుకోరాదు. స్త్రీలకు తండ్రి ఇచ్చిన స్త్రీధనంపై హక్కులు తప్ప మరే విధమైన ఆస్తి హక్కులు లేవు. భర్త దేశాంతరాలు పట్టిపోయినా, నపుంసకుడైనా విడాకులు కోరవచ్చు తప్ప మరే ఇతరకారణాలతో కాదు. మనోవర్తి లేదు. బహుభార్యత్వం ఉంది. పెద్దభార్య పెద్ద కొడుకే ఆస్తికి వారసుడు. స్త్రీపురుషులు సమానులు కాదు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కుమారుని సంరక్షణలో ఉండాలని స్త్రీకి స్వాతంత్రం లేదని మనుధర్మశాస్త్రం చెప్పింది.

ధర్మశాస్త్రాలలో చెప్పిన అంశాలు భారతీయ సంస్కృతి అని, వాటిని రాజ్యాంగంలో పొందుపరచాలని మతవాదులు పోరాడారు. ప్రజాస్వామిక లక్షణాలతో ఉన్న హిందూకోడ్ బిల్ ను వ్యతిరేకించారు. బిల్లును పార్లమెంటులో ఓడించారు. లౌకిక ప్రజాస్వామిక విలువలు కలిగిన దేశాన్ని నిర్మించాలని కలలు కన్న డా. అంబేద్కర్ ను తీవ్ర నిరాశకు గురిచేశారు. నిరసనగా డా. అంబేద్కర్ లా మంత్రిగా రాజీనామా చేసారు. స్వతంత్ర భారతదేశంలో ఒక అంశాన్ని విభేదిస్తూ చేసిన మొట్టమొదటి రాజీనామా ఇది.

ముగింపు

ఆ తదనంతరం 1955-56 మధ్య ఈ బిల్లును- the Hindu Marriage Act, Hindu Succession Act, Hindu Minority and Guardianship Act, and Hindu Adoption and Maintenance Act అనే పేర్లతో దఫదఫాలుగా చట్టాలుగా చేయటం జరిగింది. నేడు భారతీయ మహిళ స్వేచ్ఛగా, సాధికారంగా జీవనం సాగిస్తున్నదంటే డా. అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్ మరియు దాన్ని సాకారం చేసిన పండిత నెహ్రూ దృఢ సంకల్పమే కారణం.
****
రాజ్యాంగం ఆర్టికిల్ 44 లో ప్రజలందరకూ ఒకటే వ్యక్తిగత చట్టాలు అమలుకావాలంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) తీసుకురావలసి ఉంటుందని రాసుకున్నాం. భారతదేశం వైవిధ్యభరితమైనదని మైనారిటీలకు సంబంధించి వారు కోరుకుంటే UCC లోకి రావచ్చని పండిత నెహ్రూ అప్పట్లో వ్యాఖ్యానించారు.

UCC తీసుకొస్తే ముస్లిములకు ఉండే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవటం, 16 ఏళ్ళకే వివాహ వయస్సు లాంటి హక్కులను కోల్పోతారు. ట్రిపుల్ తలాక్ హక్కు ఇప్పటికే తొలగించారు. ముస్లిమ్ సమాజాన్ని ఏదో చేసేయ్యాలని హిందుత్వవాదులు UCC తీసుకొస్తామని పదే పదే ప్రకటనలు చేస్తుంటారు.
నిజానికి UCC వల్ల హిందూ సమాజం కూడా గణనీయంగానే ప్రభావితమౌతుంది. హిందూ కోడ్ బిల్ భారతదేశపు హిందువులలో ఉండే భిన్నత్వాన్ని గౌరవిస్తుంది. UCC వస్తే సిక్కులు కృపాణం ధరించటం, కొన్ని చోట్ల గిరిజనులు ప్రత్యేక వివాహ చట్టాలను కలిగి ఉండటం, హిందూ ఉమ్మడికుటుంబం పేరిట పొందే ప్రత్యేక టాక్సు మినహాయింపులు వారసత్వ హక్కులు, గోవా లాంటి ప్రాంతాలలో హిందువులు పొందే కొన్ని ప్రివిలేజస్, ఉత్తరాఖాండ్ లాంటి చోట హిందువులు పాటించే విభిన్నమైన ఆచారాలు లాంటివి కోల్పోవలసి ఉంటుంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని 2018 లో లా కమిషన్, గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కలిగిన భారత దేశంలో UCC సాధ్యంకాదు వాంఛనీయం అసలే కాదు అని రిపోర్ట్ ఇచ్చింది.

బొల్లోజు బాబా



















ప్రాచీన గాథలు పుస్తకంపై డా. సుంకర గోపాల్ స్పందన

ఇదే ఆకాశం ,ఇదే నేల మీద వందల ఏళ్ళ క్రితం ఏం జరిగిందో అప్పటి మనుషులు వారి తాలూకా జీవనం ,జీవన సౌందర్యం ఎట్లా ఉండేదో ఊహించుకుంటే భలే ఉంటుంది. బహుశా ఎన్ని సౌకర్యాలు అప్పుడు ఉండకపోవచ్చు.ప్రకృతి ఉంది. నది ఉంది.చంద్రుడు ఉన్నాడు. చుక్కలు ఉన్నాయ్. తాజాతనంతో కూడిన గాలి ఉండవచ్చు. చేలల్లో, వీధుల్లో, నదీతీరాల్లో,ఋతువుల మధ్య ,కొండల మీద, వాళ్ళు ఎలా బతికారో పేరు తెలియని కవులు రికార్డ్ చేశారు. అప్పటి ప్రపంచ సౌందర్యాన్ని భౌతికంగానూ, మానసికంగానూ ఈ ప్రాచీన గాథలు మన హృదయాల్లోకి పంపుతాయి. చదువుతూ చదువుతూ ఉంటే మన ముందు అప్పటి వాతావరణం లీలగా కనిపిస్తుంది. మనల్ని అక్కడికి ప్రయాణింప చేస్తాయి.సంగం కవిత్వం దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యమని వేరే చెప్పక్కర్లేదు.హాలుని గాథా సప్తశతి లోని గ్రామీణ ప్రజల సాంఘిక జీవనంతో పాటు , స్త్రీ పురుష సంబంధాలు , ప్రకృతి వర్ణనలు మనల్ని అలోచింపచేస్తూనే, ఆనందింపచేస్తాయి. ఇట్లా వజ్జా లగ్గము ,కువలయ మాల ,సేతుబంధ, అమర శతకం,ఋతు వర్ణనలు ఇంకా మరి కొన్ని వాటితో కలిపి 11 అంశాలను ప్రాచీన గాధ లుగా బొల్లోజు బాబా
అనువాదం చేశారు. అయితే ఇందులో భీముని భాగం అనువాదాలు మూలానికి దగ్గరగా ఉన్నాయనిపిస్తోంది. అనువాదకుడు వాటిని ఎంతవరకు లోపలకి తీసుకున్నాడనేది ,వాటిని చదువుతూ ఉన్నప్పుడు

అర్థం అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రాచీన గాథలు చదువుతుంటే అద్భుతమైన కవిత్వ అనుభూతి సహృదయ పాఠకుడు పొందగలడు. అట్లాంటి అనుభూతిని నాకు ప్రసారం చేసిన బాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని కొని చదవడం ద్వారా మన డబ్బు వృధా కాదు.
 
ముచ్చట గా మూడు అనువాదాలు

నా ఇంటి స్తంభాన్ని ఆనుకొని నిలిచి
"నీ కొడుకు ఎక్కడ "అని అడుగుతున్నావు
వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు
అతనికి జన్మనిచ్చిన ఈ గర్భం ఒక కొండ గుహ
పులి కొంతకాలం ఇక్కడ నివసించి వెళ్ళిపోయింది
ఎక్కడో ఏదో యుద్ధ భూమిలో అతను నీకు దొరుకుతాడు
(పురనానూరు-86)

ఊరి పెద్ద కూతురు చాలా అందగత్తె
ఊరిలోని మగాళ్ళందర్నీ
దేవతలుగా మార్చేసింది
ఎవరు రెప్పలు మూయరు
ఆమెను చూస్తున్నప్పుడు( గాథా సప్తశతి)

ఓ వేటగాడా
ఒక బాణం సరిపోతుంది కదా
ఎందుకు పొదిలోంచి మరొకటి తీస్తున్నావు
మా ఇరు దేహాలలో ఉండేది ఒకే ప్రాణం (వజ్జా లగ్గము)

డా. సుంకర గోపాల్



Saturday, December 14, 2024

ప్రాచీన గాథలు- అనువాద కవిత్వం


ప్రాచీన గాథలు.

ప్రాచీన గాథలు పుస్తకం కావలసిన వారు 7989546568 నంబరు లేదా chaayabooks com వెబ్సైట్ వద్ద పొందవచ్చును.

పేజీలు 254, ఆఫర్ ధర 250/- రూపాయలు, ఫ్రీ షిప్పింగ్.

అమజాన్ లో లభించు లింకు



బొల్లోజు బాబా







Friday, November 29, 2024

ప్రార్థనా మందిరాల వివాదం: చట్టం, సమాజం, సమతుల్య దృక్పథం


ఇటీవలి కాలంలో మసీదులు, దర్గాలు, చర్చిల కింద శివలింగాలు ఉన్నాయని, వాటిని తవ్వి బయటపెట్టాలని, హిందువులకు ఆ ప్రదేశాల్లో పూజలు చేసుకోవటానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసే వాదనలు పెరుగుతున్నాయి. ఈ వాదనలు సాధారణంగా మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉండటం గమనార్హం.

ఈ రకమైన ప్రచారాల వెనుక అసలైన ఉద్దేశాలు ఏమిటి?

మతసామరస్యానికి చెక్ పెట్టడం: దేశంలో ఇప్పటికే మెరుగులేని స్థితిలో ఉన్న మతసామరస్యాన్ని పూర్తిగా చెరిపేయడం.

ప్రజల దృష్టిని మళ్లించడం: అసలు చర్చించాల్సిన ముఖ్యమైన ఆర్థిక, సామాజిక సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చి, నిరర్థకమైన వాదనలపై దృష్టి పెట్టించడం.

రాజకీయ లబ్ధి: మెజారిటీ మతాన్ని దేశపు అధికారిక మతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించడం.

చట్టం ఏమంటుంది?

1991లో భారతదేశ పార్లమెంట్ ప్రవేశపెట్టిన Places of Worship Act ప్రకారం,

1947, ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలం ఏ మతానికి చెందుతుందో, అది ఆ మతానికి మాత్రమే చెందుతుంది.

ఈ చట్టం ప్రకారం, ఎటువంటి ప్రార్థనా స్థలాన్నీ ఇతర మతాలకు మార్చడం నిషిద్ధం.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి.

చట్టం రామజన్మభూమి వివాదానికి మినహాయింపు ఇచ్చింది, కానీ దేశంలోని ఇతర అన్ని ప్రార్థనా స్థలాలకు ఈ చట్టం వర్తిస్తుంది.

చట్టాన్ని దాటి బయటకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితి

నేడు కొన్ని వర్గాలు చట్టాన్ని అవమానిస్తూ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను హిందూ మతంలోకి మార్చాలని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి. ఈ చర్యలు సమాజంలో విభజన, ద్వేషాన్ని పెంచడం తప్ప మరేమీ చేయవు.

ఈ తవ్వకాల పరిణామాలు

మన దేశం గొప్ప వైవిధ్యానికి నిలయం. మతం, సంస్కృతి, సంప్రదాయాలలోనూ ఈ వైవిధ్యం ప్రస్ఫుటమవుతుంది.

చరిత్రపరమైన సమస్య: తవ్వకాల్లో హిందూ మతానికి సంబంధించిన వస్తువులు మాత్రమే బయటపడతాయనే నమ్మకానికి ఆధారాలు లేవు.

సామాజిక విబేధం: ఇటువంటి చర్యలు వివిధ మతాల మధ్య విభేదాలను మరింతగా పెంచుతాయి.

సంస్కృతికి వ్యతిరేకం: వైవిధ్యానికి మించిన విలువ మనకు లేదు. మన దేశ సౌందర్యం ఈ వైవిధ్యంతోనే నిలబడింది.

మనకు కావాల్సినది ఏమిటి?

అన్ని మతాలకు సమానమైన గౌరవం, సమాన హక్కులు కల్పించడమే భారత రాజ్యాంగం మూలసిద్ధాంతం.

మతసామరస్యం: ప్రతి మతాన్ని గౌరవించడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం మన బాధ్యత.

చరిత్రను సరిదిద్దడం కాదు: చరిత్రను ఆధునిక రాజకీయ అవసరాలకు ఉపయోగించడాన్ని నిరోధించాలి.

ముగింపు

ఇటువంటి అనవసర వాదనలు మన దేశ బలం అయిన వైవిధ్యాన్ని దెబ్బతీయవచ్చు. మతసామరస్యాన్ని, మన సంప్రదాయ విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చట్టాన్ని గౌరవించడం, వివేకంతో నడుచుకోవడం, విభేదాలను పక్కన పెట్టి సమైక్యతను బలపరచడం అత్యవసరం.

- బొల్లోజు బాబా

Saturday, November 2, 2024

స్వీయ అస్తిత్వం వైపు ....మురళీ కృష్ణ కవిత్వం


సుంకర గోపాల్, పాయల మురళికృష్ణ, అనిల్ డానీ, పుప్పాల శ్రీరాం, కంచరాన భుజంగరావు, లండ సాంబమూర్తి, బాల సుధాకర్ మౌళి, అవధానుల మణిబాబు, మానస చామర్తి, ఎమ్.ఎమ్. మహేష్, సురేంద్రదేవ్ చెల్లి (వీళ్ళు- ఈ సమయాన నాకు తడుతున్న పేర్లు) తెలుగు సాహిత్య రంగాన్ని మెరిపిస్తున్న యువకవి గళాలు. వీరి అభివ్యక్తి నవ్యం, వీరి వస్తు వైవిధ్యం అనంతం. వీరు కవితను నడిపించే శైలి వినూత్నం. ఇప్పటికే కొన్ని భవిష్యత్ కళాత్మక వ్యక్తీకరణ పుటలపై తమ పేర్లు లిఖించుకొన్నారు.
వీరిలో ముగ్గురు ఇప్పటికే శిఖామణి యువపురస్కారాలు అందుకొన్నారు. ఉత్తరాంద్ర కవిత్వ పాయ శ్రీ పాయల మురళీ కృష్ణ నేడు యానాంలో శిఖామణి యువపురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా నన్ను సభకు మురళిని పరిచయం చేయమన్నారు.
సమయం తక్కువ ఉంటుందని ఓ రెండు కవితలను తీసుకొని విశ్లేషించుదామని అనుకొన్నాను. పెద్ద సభ. ఒక కవిత చదవటానికే పరిమితం కావలసి వచ్చింది. నా సాహితీ గురువు శ్రీ శిఖామణి నాకు ఇచ్చిన అవకాశం ఏదైనా నాకు మహదవకాశమే. మొత్తం ప్రసంగ పాఠం. ఇది.
****

స్వీయ అస్తిత్వం వైపు ....మురళీ కృష్ణ కవిత్వం
.
పాయల మురళి కృష్ణ ఉత్తరాంధ్ర జీవితాన్ని ప్రతిభావంతంగా గానం చేస్తున్న యువకవి. ఇతని కవిత్వం సార్వజనీన మానవ ఉద్వేగాలను పదునుగా పలికిస్తాయి. తన ప్రాంతపు విధ్వంసం, పోరాటాలు, జీవన గాయాలు ఇతని కవితావస్తువులు. సమాజం పట్ల నిబద్దత కలిగిన కవి. పదాలతో, ప్రతీకలతో, భావచిత్రాలతో కవితను గొప్ప నేర్పుతో అల్లుతాడు మురళీ కృష్ణ.
శీతాకాలపు తెల్లవారు జామున…. అనే కవిత మురళి కవితా తత్వాన్ని సంపూర్ణంగా ఇముడ్చుకొన్న కవితగా నేను భావిస్తాను. ఈ కవిత శీతాకాలపు పొగమంచును ఒక ఉపమానంగా తీసుకొని, మానవజీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సమస్యలను, ఆశలను వర్ణించింది. చివరకు సూర్యుడు ఉదయించటం ద్వారా సమస్యలను అధిగమించటం అనే ఆశావహ దృక్ఫథంతో కవిత ముగుస్తుంది.

శీతాకాలపు తెల్లవారు జామున….
.
తనమీద వ్యర్థంగా పడేస్తున్న
పాలిథీన్ సంచులు సమస్తాన్ని
గుండచేసి
నేల గాలిలోకి విసిరేసిందా
అన్నట్లుందీ పొగమంచు.
పల్లెను బంధించిన
కంపెనీలన్నీ కలిసికట్టుగా విసర్జిస్తున్న విషంలా
దేహాన్ని చుట్టుముట్టిన చలి
రోడ్డెక్కి ప్రయాణిస్తే చాలు
మింగేద్దామా అన్నట్టు ఎదురుచూస్తున్న మృత్యువు
కళ్ళపై మసక మసకగా
ముసుగులేస్తోంది
ఈ శీతాకాలపు తెల్లవారు జామున
ఎవరో ఆలమందల్ని రోడ్డుమీడకి తోలినట్లు
ఎక్కడికక్కడే అడ్డుతగులుతున్న మంచు తెరలు
ఎదురెదురు వాహనాలు
ఒకదానికొకటి
లాంతర్లు నుదిటిమీద కెక్కినట్లు
చిరుచీకట్లో కాంతులు చిమ్ముతున్నాయి
అడుగడుక్కీ
అవరోధాలు ఎదురవుతున్నప్పుడు
ఆగిపోకుండా సాగిపోవటం
అపాయమే కావొచ్చు
కానీ
కాసింత దూరంలో రానున్న వెలుగు
ఎందుకో నిలువనివ్వదు.
రోడ్డుపక్కనే పడి ఉన్న ఊరకుక్క కళేబరం
వెదజల్లుతున్న దుర్గంధం
ఇంకా చీకటిని గుర్తు చేస్తూనే ఉంది
నిరంతరాయంగా వెళ్తుంటే
ఓ ప్రభాతం ఎదురొచ్చింది
ప్రసరించే రవికిరణాలు
మంచుబిందువుల్ని పటాపంచలు చేసాయి.
అడ్డుతెరలు నమసిపోయి
రహదారి ఎప్పటిలాగే సాధారణం.
అప్పుడనిపించింది
నవజీవన యానంలో
మనసుకి మనసుకీ మధ్య
అడ్డుగోడల్లా నిలిచే
పగా ప్రతీకారాలనే పొగమంచు కురుస్తున్నప్పుడు
రవికిరణాల్లాంటివే కదా కవిత్వాక్షరాలని….


ఏం చెబుతున్నాడు ఈ కవితలో మురళి కృష్ణ

1.శీతాకాలపు పొగమంచు: పొగమంచును పాలిథీన్ సంచులను గాలిలో విసిరేసినట్లు కవి పోలుస్తున్నాడు. ఈ వర్ణన ద్వార మనిషి వాతావరణాన్ని కాలుష్యం చేసినట్లు సూచిస్తున్నాడు.

2.విషపు చలి: పల్లెలో కార్పొరేట్ సంస్థలు విస్తరించి కలుషిత వాతావరణం విషం లా మనిషిని చుట్టుముడుతుందని అంటున్నాడు.

3.రోడ్డుపై మృత్యువు ఎదురుచూస్తుంది: రోడ్డుపై ప్రయాణించే ప్రతి వ్యక్తి వేసే ప్రతి అడుగులో మృత్యువు ఎదురుపడుతుందని హెచ్చరిస్తున్నాడు. రోడ్డుపై ప్రయాణం జీవితానికి ప్రతీక.

4.వెలుగు-ఆశ: వెలుగులు ప్రసరించే రవి కిరణాలే జీవితానికి, కవిత్వానికి ఆశ అని చెబుతున్నాడు.
ఎంతో సరళంగా కనిపిస్తున్నా లోతైనా తాత్వికతను కలిగిన కవిత ఇది.
***

శ్రీ మురళి కృష్ణ బాధ్యత కలిగిన ఒక ఉపాధ్యాయుడు. ప్రతీ ఉపాధ్యాయ కవి తన వృత్తి గురించి ఏదో సందర్భంలో కవిత్వం రాసే ఉంటారు. అలా రాయటం ఒక అనివార్యత. ఒక ఉపాధ్యాయుని కోణం నుండి బడిని, పిల్లలను వారి ఆనందాలను, ఒక ఉపాధ్యాయుని రోజువారీ అనుభవాలను, అతని బాధ్యతలను ఈ కవిత వ్యక్తీకరిస్తుంది.
.
ఈ రోజేం కథ చెప్తారు మాస్టారు!

ఎన్ని విషాదాలనైనా
ఒకపసినవ్వు కడిగి పారేస్తుంది
బడి ప్రాంగణంలో మాత్రమే
బ్రతుకు కల్మష రహితమై కనిపిస్తుంది
ఊరో పెద్దోల్లంతా
పనిగట్టుకొని చెప్పే ఉన్నవీ లేనివీ వినీ వినీ***
మోడు బారిపోతున్న మనిషితనం
ప్రతీ ఉదయం చిలుకలు వాలిన చెట్టులా పులకించే బడిలో
మళ్లీ చివుర్లు తొడుగుతుంది
చదివిన కతల్నీ
నేర్చిన పాటల్ని
పాల బువ్వలా మార్చి
తరగతి గదికి తీసుకెళ్తే
గింజలు తెచ్చిన తల్లి పక్షి చుట్టూ
చేరిన పిల్లల్లా
చిన్నారులంతా నా చుట్టూ
సందేహాలన్నీ
చిట్టి చిట్టి తీగల్లా మారి అల్లుకుంటుంటే
నేను సమాధానాల పందిరా విస్తరిస్తాను
గొంతు మోసుకెళ్ళిన
జంతువుల అరుపుల్నీ
పిట్టల కిలకిలల్నీ
సంచిలోని బొమ్మల అట్టముక్కల్నీ
అన్నీ ఒక్కొక్కటీ విప్పి
పసి కళ్ళల్లో కేరింతల దీపాలు వెలిగించుకోవాలి
అక్షరాలకీ అంకెలకీ
గులకరాళ్ళనీ, చింతపిక్కల్నీ తొడిగింపజేసి
ఆటల్లోనూ పాటల్లోనూ
అభ్యసనాన్ని పూయింపచేయాలి
పేదరాశి పెద్దమ్మలోకీ
అందాల రాకుమారుడిలోకి
పేరు మరచిన ఈగలోకి పరకాయ ప్రవేశం చేసుకుంటూ
పరమానందయ్యగాను
తెనాలి రామలింగడి గాను
మర్యాద రామన్నగానూ
రకరకాలుగా పరిచయం కావాలి
విరామంలో
వేమన పద్యాన్ని అంకెల ఆటనీ కావాలి
“మేకా నిన్ను చంపుతా” నంటూ
పులిలో క్రౌర్యాన్ని చూపించాలి
ఇప్పుడు బడి బాటలోకి
పెద్దోళ్ళెవరూ రానవసరం లేదు
కాన్వెంటు ఆటో ప్రకటన
ఇక్కడ తప్పని సరిగా మూగబోవాలి
బడి చివరిగంట తరువాత
బడి భవనం, నేనూ ఇద్దరం నిస్సహాయులమే
రేపటి ఉదయం వరకూ
రెక్కలు తెగిన పక్షులమే
ఉదయం తొమ్మిదౌతోంది
అదిగో నా బడి పిల్లలంతా
బడికి నాకన్నా ముందే వచ్చి
తప్పిపోయిన నా బాల్యాన్ని
వెదికి పట్టుకొచ్చి పదిలంగా అప్పజెప్పే
జీవన మాధ్యమాల్లా పలకరించారు
“ఈ రోజేం కథ చెబుతారు మాస్టారు…?”

మనం ఎన్నెన్ని ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ బడిప్రాంగణంలోకి ప్రవేశించగానే అవన్నీ ఒక్క పసినవ్వు కడిగిపారేస్తుంది అనే ప్రారంభం ఈ కవికి తన వృత్తి పట్ల ఉన్న పవిత్రభావనను తెలియచేస్తుంది.

ఈ కవితలో విద్యార్ధులు తెల్లని పలకలుగా, తల్లిపక్షి చుట్టూ చేరే పక్షి పిల్లల్లా, పందిరిని పెనవేసుకొనే చిట్టి తీగెల్లా కనిపిస్తారు.

ఉపాధ్యాయుడు- పరమానందయ్యగా, తెనాలి రామలింగడుగా, మర్యాదరామన్నగా, వేమన పద్యంగా, పులీమేకా ఆటలో పులిగా, మిమిక్రీ కళాకారునిగా, మెజిషియన్ గా రకరకాల వేషాలు కడతాడు. ఇవన్నీ ఉదరపోషణార్ధం కాదు, పసి "హృదయపోషణార్ధం".

ఇక బడి అంటే ఎన్ని విషాదాలనైనా కడిగేసే పవిత్ర స్థలం అట. తప్పిపోయిన కవి బాల్యాన్ని వెతికి పట్టుకొని బలవంతంగా అప్పజెప్పే జీవన మాధ్యమం అట.

ఈ కవితలో ఉపాధ్యాయుడి పాత్ర, విద్యపట్ల కవికి ఉన్న సానుకూల దృక్ఫథం, విద్యార్ధులపట్ల ఉన్న అనుబంధం లాంటివాటిని గొప్ప భావోద్వేగ పూరితంగా ఆవిష్కరించారు శ్రీ మురళీ కృష్ణ.
****
ఈ మూడవ కవిత మురళి కృష్ణ రానున్న కవితా సంకలనంలోనిది.

దారిపక్క ఉన్న ఒక చెట్టుకు వేలాడుతున్న ఒక దృశ్యాన్ని ఆధారం చేసుకొని నిర్మించిన ప్రతీకాత్మక కవిత “ఒక చెట్టు – పగిలిన అద్దం.
.
ఒక చెట్టు- పగిలిన అద్దం

దారి పక్క ఏకాంత శోకంలా ఓ చెట్టు
దాని కొమ్మకు వేలాడుతున్న పగిలిన అద్దం
వెళ్తూ వెళ్తూ ఆ అద్దాన్ని చూస్తే
ఏం కనిపించొచ్చు
రాత్రంతా ఎడతెగక కురిసిన చీకటికి
గొడుగు పట్టిన గుడ్డ ముక్క కింద
వెలుగుతున్న ఒంటరి దీపమొక్కటి తప్ప
సౌకర్యమంటే తెలియని నగ్న జీవనం
ఈ చదును చేయబడ్డ మట్టిమీద లిఖించిన
బతుకు సంతకం కనిపిస్తుందా
వలతో కట్టిన దడిలో
జడివానకు నిలవలేక
రెక్కబలం లేని పక్షులు రాల్చిన
పింఛాల అంచున మొలిచిన కన్నీటి బిందువులు
ప్రతిబింబించే దుఃఖం కనిపిస్తుందా
రెండు తపేలాలు మూడు గిన్నెలతో
కాలాన్ని ఈదుతున్న ఆ కుటుంబం
ఆకాశం విసిరిన అగ్గిశకలం సాక్ష్యంగా
భద్రతపై ఎక్కుపెట్టిన ప్రశ్నార్ధకాల్లాంటి
దేహాల చెల్లాచెదురుతనం కనిపిస్తుందా
ఒకవేళ
ఇవేవీ కనిపించలేదూ అంటే
అద్దంతప్ప ఏ పగుల్లూ కనిపించనట్టే
****

దారిపక్క ఏకాంత శోకంలా ఓ చెట్టు అనే ప్రారంభంతోనే ఒంటరితనం, నిరాశాభరిత జీవితాన్ని స్ఫురింపచేస్తాడు కవి.

అద్దం పగిలిపోయినప్పుడు ఏ దృశ్యాలను చూపుతొందో ఒక్కో పదచిత్రాన్ని పేర్చుకొంటూ వెళతాడు.

రాత్రంతా ఎడతెగక కురిసిన చీకటి, ఒంటరి దీపం, మట్టిమీద లిఖించిన సంతకం, రెక్కబలం లేక పక్షులు, రెండు తపేలాలు, మూడు గిన్నెలతో కాలాన్ని ఈదే కుటుంబం, ప్రశ్నార్ధకాలలాంటి దేహాలు….. ఇవంట కనిపించే దృశ్యాలు.

ఈ దృశ్యాల వెనుక ఉన్న దుఃఖం, కష్టం, బాధా, అసమానతలు చూడ లేని చూపు చూపే కాదని చెబుతున్నాడీ కవి.
****

ఇతని కవిత్వంలో ఉత్తరాంధ్ర నేల పల్లవిస్తుంది. దుఃఖం పలుకుతుంది. పల్లెల్లో ఎండిపోయిన చెరువు; అంతర్ధానం అయిపోతున్న పాట;ఊరి మురికిని శుభ్రం చేసే సర్విసింగ్ సెంటర్;ఊరందరకీ సౌభాగ్యాన్ని పంచిపెట్టిన తాత మలారం సంచి; ప్లాస్టిక్ చేస్తున్న విధ్వంసం; సాయింత్రాన్ని ధ్వనించే పిచ్చుకలు; ఊరి మర్రిచెట్టు స్థానంలో మొలిచిన సెల్ ఫోన్ టవర్ లాంటి ఎన్నో వస్తువులు చక్కని కవితలుగా పోత పోసుకున్నాయి ఈ సంపుటిలో.

శ్రీ పాయల మురళీ కృష్ణ శిఖామణి యువ పురస్కారాన్ని అందుకొంటున్న ఈ సందర్భంగా అతనిని అభినందిస్తున్నాను. ఈ అవార్డుకి ఇతనిని ఎంపిక చేయటం సరైన నిర్ణయమని భావిస్తున్నాను. రెండవ పుస్తకం త్వరలోనే తీసుకురావాలని ఆకాంక్షిస్తూ......
ప్రేమతో

బొల్లోజు బాబా





Friday, November 1, 2024

వరహావతారం-గోళాకార భూమి

వరాహావతార శిల్పాలు గుప్తుల కాలంలో చెక్కబడ్డాయి. ఉదయగిరి గుహలలోని 4 వ శతాబ్దపు వరాహ అవతార పానెల్ లో గుప్తరాజులను విష్ణుమూర్తి/పృధ్వీపతి గా పోలుస్తూ ఉత్తరభారతదేశంలో గుప్తుల రాజ్యాధికారాన్ని స్థిరపరచే ఒక పొలిటికల్ మెటఫర్ అని జయస్వాల్ లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
 
భూమి నీళ్ళల్లో మునిగి ఉన్నప్పుడు వరాహావతారం ఎత్తి విష్ణుమూర్తి ఆ భూమిని పైకి తీసాడు. ఈ సందర్భంగా హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. భూమిని స్త్రీగా చెబుతూ వరాహస్వామి ఆమెను పెళ్ళి చేసుకొని ఉద్ధరించాడని పురాణ కథనం. అంటే అంతవరకూ భూమి హిరణ్యాక్షుడు అనే రాజుది అని, అతనిని సంహరించటం ద్వారా అతని రాజ్యాన్ని/భూమిని సొంతం చేసుకొన్నాడని అర్ధం వస్తుంది.
 
దేవాసుర యుద్ధాల ప్రయోజనం ఒకటే భూమి ఆక్రమణ, అధికార విస్తరణ, బడుగువర్గాల అణచివేత అంటారు డా. బి. విజయభారతి గారు. వరాహావతారం కూడా అలాంటిదే.
గుప్తులపాలనలో హిందూమతం రాజ్యమతంగా ఆదరణపొందింది. అందుకనే పండితులు గుప్తుల పాలనను స్వర్ణ యుగం అంటారు.
 
ఈ ప్రాచీన వరహావతార శిల్పాలలో భూమి గుండ్రంగా ఉండదు. వరాహస్వామి భూదేవి రూపంలో ఉన్న స్త్రీ మూర్తిని చేతులతో ఎత్తుకొన్నట్లు ఉంటుంది.

ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి- భూమి గుండ్రంగా ఉంటుందని ప్రపంచం అర్ధం చేసుకొన్నాక వరహావతారం గుండ్రని భూమిని ఎత్తుతున్నట్లు శిల్పాలు చిత్రాలు లిఖించారు. గోళాకార భూమిని ఎత్తుకొన్న వరాహ శిల్పాలు 18 వ శతాబ్దానికి ముందు లేవు. అలా గోళాకార భూమిని ఎత్తుకొన్నట్లు చూపటం చిత్రకారుల తప్పు కాదు. అది కళ.
 
కానీ, ఇటీవల సనాతన వాదులు గుండ్రటి భూమిని ఎత్తుకొన్న వరాహావతార శిల్పం ఫొటోని చూపించి మన పూర్వీకులకు వేలసంవత్సరాలకు పూర్వమే భూమి గుండ్రంగా ఉండేదని తెలుసని. మన సనాతనధర్మ గొప్పతనానికి ఈ శిల్పమే సాక్ష్యమని ప్రచారం చేసారు. అది మోసం.
తీరా చూస్తే అది బాలాసోర్ లో 2009 లో నిర్మించిన జగన్నాథ ఆలయశిల్పం.
 
మోసం, అబద్దాలతో ఎంతకాలం ఇలా మోసగిస్తారు ఈ సనాతనధర్మ అబద్ద ప్రచారకులు

బొల్లోజు బాబా


Thursday, October 31, 2024

పెరియార్ పోరాట ఫలితం మొదటి రాజ్యాంగ సవరణ, కుల ఆధారిత రిజర్వేషన్లు


మద్రాస్ ప్రొవిన్స్ లో బ్రిటిష్ వారి పాలనలో 1928 నుంచీ వెనుకబడిన తరగతులకు కమ్యునల్ జి.వొ అమలులో ఉండేది. దీని ప్రకారం అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ దక్కేది.
 
భారత రాజ్యాంగం 26, జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది.  1951 లో చంపకం దొరైరాజన్ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ- తన కూతురికి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ వైద్య విద్యలో సీటు రాలేదని, ఆమె కన్నా తక్కువ మార్కులు వచ్చిన ఒక వెనుకబడిన తరగతికి చెందిన మరొక విద్యార్ధికి సీటు వచ్చిందని, ఇది రాజ్యాంగంలో 15 వ ఆర్టికిల్ ప్రకారము అందరూ సమానమే అనే సూత్రానికి అనుకూలంగా లేదని - మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసును శ్రీ ఎమ్. కె. నంబియార్ అనే ఆనాటి ప్రసిద్ధ లాయర్ వాదించారు. మద్రాస్ హైకోర్టు రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కనుక కులం ఆధారంగా కొందరికి రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునిచ్చింది.
 
ఈ తీర్పును మద్రాసు ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టుకూడా ఏడుగురు జడ్జిల ధర్మాసనం ద్వారా హైకోర్టు తీర్పునే సమర్ధించి “కులాధారిత రిజర్వేషన్లు” చెల్లవు అని తీర్పు ఇచ్చింది.
 
ఈ తీర్పుపై పెరియార్ ఆధ్వర్యంలో తమిళనాడు భగ్గున మండింది. నిజానికి కమ్యునల్ జివొ ను రూపొందించి అమలుచేయించింది 1928 లో పెరియారే. ఆ జివొ వల్ల ఎందరో అణగారిన కుటుంబాలకు చెందిన వారు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందటం చూసి పెరియార్ ఎంతో సంతోషించేవారు. స్వాతంత్ర్యం వచ్చాకా తన సొంత రాష్ట్రంలో అప్పటికే సుమారు పాతికేళ్ళుగా అమలులో ఉన్న రిజర్వేషన్లు ఆగిపోవటం పట్ల పెరియార్ తీవ్రమైన ఆవేదన చెందారు.
యావత్ తమిళ ప్రపంచం అతని ఆవేదనను, ఆగ్రహాన్ని పంచుకొంది. రానున్న ప్రమాదాన్ని పసిగట్టింది. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలతో తమిళనాడు మొత్తం అట్టుడికి పోయింది. ప్రపంచంలో తమిళులు ఉన్న ప్రతీచోటా ఈ తీర్పు పట్ల వ్యతిరేకత పెల్లుబికింది.
సమాన హక్కు పేరుతో అణగారిన వర్గాలు ఇతరులతో సమానం అయ్యే హక్కును కాలరాస్తున్న రాజ్యాంగంపట్ల తన నిరసనను తెలియచేసాడు పెరియార్.
 
పెరియార్ చేస్తున్న ఉద్యమంవెనుక ఉద్దేశాలను, రాజ్యాంగం వల్ల ఏర్పడిన చిక్కుముడిని అర్ధం చేసుకొన్న జవహర్ లాల్ నెహ్రూ ఆనాటి లా మినిస్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ ను పిలిచి రాజ్యాంగంలోని 15 వ ఆర్టికిల్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను సవరించే ప్రక్రియ చేపట్టవలసినదిగా కోరాడు.
 
నెహ్రూ సూచన మేరకు డా. బి.ఆర్ అంబేద్కర్ 15 వ ఆర్టికిల్ లోకి 15(4) పేరుతో ఒక సవరణ ప్రతిపాదించారు. ఇది రాజ్యాంగానికి చేసిన తొలి సవరణగా చరిత్రకు ఎక్కింది. (దీనితో పాటు మరొక రెండు కూడా ఉన్నాయి)

ఈ సవరణ “దేశప్రజలందరూ సమానమే. అణగారిన వర్గాలను ఇతర వర్గాలతో సమానం చేసే కార్యక్రమాలలో మాత్రం ఈ అందరూ సమానమే అనే క్లాజు వర్తించదు” అని చెబుతుంది.
ఈ 15(4) ఆర్టికిల్ సవరణ ప్రతిపాదించే సందర్భంగా జరిగిన పార్లమెంటు డిబేట్స్ లో ఈ బిల్లును సమర్ధిస్తూ ఇలా మాట్లాడారు.
 
జవహర్ లాల్ నెహ్రూ: అనేక కారణాల వల్ల ఇప్పుడు ఉన్న తరాన్ని నిందించలేం. ముందు తరాలకి బాధ్యత ఉంది. అనేకమంది ప్రజలు ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది ఒక విషయంలో ముందు ఉన్నా అనేక విషయాలలో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన వారిని మనం ప్రోత్సహించాలి. వారికొరకు ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి.
 
ఎవరో ఒక పెద్దమనిషి అంటున్నాడు- “భారతదేశంలో 80% మంది వెనుకబడిన వారే. ఎంతమందినని ప్రోత్సహిస్తారు?” అని. 80% మంది స్థితి అలా ఉంటే ఏమీ చెయ్యకుండా వారిని అలాగే ఉంచటం పరిష్కారం కాదుకదా?. వారికి అవకాశాలు కల్పించాలి- ఆర్ధిక అవకాశాలు, విద్యా అవకాశాలు లాంటివి. ఎదగనివ్వాలి వారిని.

డా. బి.ఆర్. అంబేద్కర్: ఒక జడ్జ్ ఇచ్చిన తీర్పును పాటించటానికి బద్దుడను కానీ దానిని గౌరవించటానికి బద్దుడను కాను. ఒక కులానికో/సమూహానికో రిజర్వేషన్లు ఇచ్చినపుడు, అది దక్కనివారు మరొక కులానికో సమూహానికో చెందినవారై ఉంటారనేది సత్యం. ఈ దేశంలో కొంతమంది ప్రజలను మినహాయించకుండా రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు.
 
***

1951 జూన్ లో రాజ్యాంగానికి చేసిన 15(4) సవరణ వల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వెనుకబడిన బలహీనవర్గాలవారికి రిజర్వేషన్లు ఇచ్చే వెసులుబాటు కలిగింది.
 
ఈ సవరణే చేయకపోతే భారతదేశంలో చంపకం దొరైరాజన్ (1951) సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం ఏనాటికీ వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఉండకపోయేవి.

అలాజరగకుండా చూసిన పెరియార్, నెహ్రూ, డా. అంబేద్కర్ లు చిరస్మరణీయులు.
ఈ రోజు సనాతన వాదులు నరనరాన విషం నింపుకొని వీరిని నిత్యం దూషించటానికి ఉండే చాలా కారణాలలో ఆఘమేఘాలమీద చేయించిన పై రాజ్యాంగ సవరణ ఒకటి.
 
దానికి కారణమైన పెరియార్ పై రాజ్యాంగాన్ని తగలపెట్టాడని, కూతురిని పెళ్ళిచేసుకొన్నాడని లాంటి వికృతమైన అభియోగాలు చేస్తారు వీళ్ళు. పెరియార్ రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లని తగలపెట్టటం నిజమే. ఇది రాజ్యాంగం వలన కలుగుతున్న ఇబ్బందులను తెలియచెప్పటానికి చేసిన ధిక్కారం. దానికి జైలు శిక్ష కూడా అనుభవించారు పెరియార్.
 
ఇక కూతుర్ని పెళ్ళి చేసుకొన్నాడనేది అసత్యం. పెరియార్ కి 54 ఏళ్ళ వయసులో మొదటిభార్య మరణించింది (1933). విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదని, తన ఉద్యమం ఆగిపోకూడదని 1948 లో తన 68 వ ఏట పెరియార్, పార్టీ కార్యకర్తగా ఉన్న పొన్నియమ్మ అనే ముప్పై ఏండ్ల వయసు కల ఒక మహిళను పెండ్లాడాడు.

ఈమె పెరియార్ కన్నా వయసులో చిన్నదే తప్ప పెరియార్ కూతురూ కాదు, మనవరాలూ కాదు. ఒక సాధారణ పార్టీ కార్యకర్త. ఈమె పాతికేళ్ళ వయసులో పెరియార్ బాగోగులు చూసేందుకు పార్టీ పరంగా నియమించబడిన కార్యకర్త. ఈమెకు ఏ రకంగాను పెరియార్ తో చుట్టరికం లేదు.
పెరియార్ హిందూమతాన్ని జీవితపర్యంతమూ చాలా తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాడు. కనుక సనాతన వాదులు కచ్చగట్టి పెరియార్ సొంత కూతురునినే పెండ్లాడాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి పెరియార్ కు సంతానమే లేదు. పెరియార్ సంపన్నుడు. ఆయన ఆస్థుల రక్షణ కొరకు, పార్టీ పురోగతికొరకు పొన్నియమ్మను పెండ్లి చేసుకొన్నాడు. అప్పట్లో అడాప్షన్ చట్టం లేదు. ఒక స్త్రీకి ఆస్తి ఇవ్వాలంటే భార్య మాత్రమే అర్హురాలు. లీగల్ కారణాలతో పెరియార్ 69 ఏండ్ల వయసులో 30 ఏండ్ల పొన్నియమ్మను పెండ్లిచేసుకోవలసి వచ్చింది.
 
శ్రీమతి పొన్నియమ్మ 1973 లో పెరియార్ మరణానంతరం పెరియార్ స్థాపించిన ద్రవిడ కజగం అనే పార్టీని చనిపోయే వరకూ నడిపించారు. పెరియార్ ద్వారా సంక్రమించిన ఆస్తులతో స్కూళ్ళను, అనాధాశ్రమాలను స్థాపించారు. 1978 లో శ్రీమతి పొన్నియమ్మ మరణించారు. చిల్లర డబ్బుల కొరకు నీతి లేని వాట్సాప్ సనాతన వాదులు పెరియార్ సొంత కూతుర్నే పెళ్లి చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఇది హేయం.

బొల్లోజు బాబా



ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా - ముందుమాట

ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది. నిజానికి ప్రముఖ చరిత్రకారుడు శ్రీ కూచిభొట్ల కామేశ్వర రావుగారిని ఈ పుస్తకానికి ముందుమాట రాయమని అడిగి, పట్టణాల ఆవిర్భావం గురించి మీ మాటలో ప్రస్తావించండి అని కోరాను. అప్పటికే తీవ్ర అనారోగ్యకారణాలవల్ల కొన్ని ఆశీస్సులు మాత్రమే ఫోన్ లో డిక్టేట్ చేసారు.
ఆ కారణంగా, అర్బనైజేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో నేనే నా మనవిమాటలలో వివరించాను. ఈ వ్యాసం నాకెంతో ఇష్టమైనది. నిన్నచదివితే ఇంకా తాజాగానే అనిపించింది. కవర్ పేజ్ పై ఉన్నది ద్రాక్షారామ ఆలయాన్ని నిర్మించిన చాళుక్యభీముడు. బాక్ డ్రాప్ లో బిక్కవోలులో శంకోలు ధరించిన శివుడు.

ఈ పుస్తకం ఇప్పడు రెండో ముద్రణలో ఉంది. కావలసిన వారు, పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారిని, ఫోన్ నంబరు. 9866115655 లో సంప్రదించగలరు.
 
బొల్లోజు బాబా


ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా

మనవి మాటలు

వ్యవసాయంద్వారా ఆహారోత్పత్తుల మిగులు ఏర్పడ్డాక ప్రజలు ఒక చోట స్థిరంగా నివసించటానికి మొగ్గుచూపారు. జీవించటానికి అనువుగా ఉంటూ రాజకీయ, ఆర్ధిక, మతపరమైన ప్రాధాన్యత కలిగిన జనావాస ప్రాంతాలు క్రమేపీ పట్టణాలుగా రూపుదిద్దుకొన్నాయి. మెగస్తనీస్‌ ఆంధ్రులకు ప్రాకారాలు కలిగిన ముప్పై పట్టణాలు ఉన్నాయని చెప్పాడు. ఇవి ఎక్కడెక్కడ ఉండేవో నేడు గుర్తించటానికి ఏ రకమైన ఆధారాలు లభించవు.
 
శాసనాలలో జనసాంద్రత కలిగిన ప్రాంతాలు - నగర, పుర, పట్టణ అనే మూడురకాల పేర్లతో చెప్పబడ్డాయి. పర్వతాలవంటి భవనాలతో, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఊరును ‘‘నగరము” అని; తీరప్రాంతంలో ఉండే రేవుస్థలాన్ని ‘‘పట్టణము” అని; బలమైన కోటను కలిగి ఉన్న ఊరుని ‘‘పురము” అని చరిత్రకారులు నిర్వచించారు. పిఠాపురం, రాజమహేంద్రవరం లలో బలమైన కోటలు ఉండేవి కనుక వాటికి పిష్టపురి, జననాథపురం అనే పేర్లు ఉన్నాయని ఊహించవచ్చు కానీ ఈ విభజనను అంత ఖచ్చితంగా పాటించినట్లు కనిపించదు. రాజమహేంద్ర పట్టణం (EI Vol 5 p.32), పిఠా పట్టణం (శ్రీనాథుని పద్యం) లాంటి ప్రయోగాలు కూడా ఉండటం గమనార్హం.
 
ఒక ప్రాంతంలో ఏమేరకు పట్టణీకరణ జరిగిందో అనేది అది ఆ ప్రాంతపు రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అభివృద్ధికి, నాగరికతకు సూచిక. ఆయా పట్టణాల ఉత్థానపతనాలు ఆ ప్రాంత చరిత్రకు అద్దంపడతాయి.
 
భౌగోళికంగా వివిధ ప్రాంతాలను కలిపే రహదారులు; అన్ని వృత్తుల వారికి అవకాశాలు; ఆర్ధిక వ్యవస్థను నడిపించే ఏదైన ఒక ప్రముఖ దేవాలయం; ఓడరేవుల ద్వారా విదేశీ వ్యాపారం;ప్రజలకు రక్షణ; భిన్నమతాల మధ్య సహిష్ణుత; రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉండటం- లాంటివి పట్టణీకరణకు దోహదపడే అంశాలు.
 
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పట్టణీకరణపై ఆథ్యాత్మిక కేంద్రాల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ఆలయాలు సమాజంలో Money Circulate చేసే ఆర్దిక కేంద్రాలు. ఇవి గ్రామీణ ఎకానమీని అర్బన్‌ ఎకానమీని అనుసంధానం చేసేవి. దేవుని పేరుమీద జరిగే ఈ తతంగంలో అప్పటి సమాజంలోని దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ఏదోఒక పాత్ర ఇవ్వబడింది.
జిల్లాలో ప్రాచీన చరిత్ర కలిగిన ద్రాక్షారామ, సామర్లకోట, సర్పవరం, పిఠాపురం, బిక్కవోలు, పలివెల లో నెలకొని ఉన్న వివిధ ఆలయాలు ఆయా ప్రాంతాలు అభివృద్ధిచెందటానికి సహాయపడ్డాయి. బౌద్ధ, జైన మతాలకు సంబంధించి జిల్లాలో అనేక చోట్ల భారీ అవశేషాలు లభిస్తూండటాన్ని బట్టి ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ, జైన విశ్వాసులకు కూడా దర్శనీయస్థలంగా ఉండేదని భావించవచ్చు. ఒక ప్రాంతంలో నెలకొన్న ఆథ్యాత్మిక కేంద్రం మతాలకు అతీతంగా ఆ ప్రాంత పట్టణీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
 
ఆథ్యాత్మిక కేంద్రాల తరువాత జిల్లా పట్టణీకరణకు దోహదపడిన మరొక అంశం కోరంగి, ఆదుర్రు లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓడరేవులు. పట్టణాలలో నివసించే వృత్తికారులు, వర్తకులు వివిధ వ్యాపార శ్రేణులుగా (Guilds) సంఘటితమై ఈ ఓడరేవుల ద్వారా పెద్దఎత్తున విదేశీ వ్యాపారం జరిపేవారు. కోరంగి ఓడరేవు మాత్రమే కాదు ఒకప్పటి గొప్ప నౌకానిర్మాణ కేంద్రం కూడా. పిఠాపురం కూడా ఒకనాటి ఓడరేవు కావొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది.
 
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం కొంతకాలం కళింగరాజ్యానికి, రాజమహేంద్రవరం వేంగి రాజ్యానికి రాజధానులుగా ఉన్నాయి. అవికాక బిక్కవోలు, చాళుక్యభీమవరం, కోరుకొండ, కడలి, ముమ్మిడివరం, రంప లాంటి ప్రాంతాలు వివిధకాలాలలో రాజకీయ కేంద్రాలుగా ఉండటం వల్ల అవి పట్టణాలుగా మారి అభివృద్ధిపథంలో నడిచాయి.
 
వేంగి, కళింగ రాజ్యాలను కలిపే ప్రాచీన రహదారి జిల్లా లోని రామచంద్రపురం, బిక్కవోలు, పిఠాపురం, కొడవలి మీదుగా రామతీర్థం వైపు వెళుతుంది. ఇది సుమారు రెండువేల సంవత్సరాలనాటి జాతీయ రహదారి. ఆ విధంగా ఈ ప్రాంతం ఒకప్పటి ప్రముఖ ప్రాచీన రాజ్యాలతో అనుసంధానింపబడి ఉంది. ఈ లక్షణం కూడా పట్టణీకరణకు అనుకూలించే అంశము.
హిందు, బౌద్ధ, జైన విశ్వాసాలకు చెందిన అనేక ప్రాచీన క్షేత్రాలు జిల్లాలో కనిపిస్తాయి. బౌద్ధానికి సంబంధించి ఆదుర్రు, పిఠాపురం, గొల్లప్రోలు, కొడవలి, కాపవరం, తుని, రంపఎర్రంపాలెం, కోరుకొండ లాంటి ప్రాంతాలలో వివిధ భారీ బౌద్ధ అవశేషాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా ప్రాంతాల ప్రాచీన ప్రాధాన్యతను నిరూపిస్తాయి. అదే విధంగా జిల్లాలో జల్లూరు, కాజులూరు, ఆర్యావటం, పిఠాపురం, బిక్కవోలు, తాటిపాక, రాజోలు, రామచంద్రపురం లాంటి ప్రాంతాలలో ఒకప్పుడు జైనమతం వెలసిల్లినట్లు నేడు అనేక విగ్రహాలు బయటపడుతున్నాయి.
 
ఈ భిన్న మతాలు ఒకనాడు సమాంతరంగా సహజీవనం చేసినట్లుకూడా అర్ధమౌతుంది. ప్రజలు భిన్నవిశ్వాసాలకు సహిష్ణుత కలిగి ఉండటం మానవ నాగరికత, సంస్కృతుల ఔన్నత్యానికి ఉత్తమోత్తమ నిదర్శనం.
***
ఈ పుస్తకంలో తూర్పుగోదావరికి చెందిన ప్రాచీనపట్టణాల చరిత్రను చెప్పటానికి ప్రయత్నించాను. దీనిలో హుయాన్‌ త్సాంగ్‌ పిఠాపుర సందర్శన, గుణగ విజయాదిత్యుని చారిత్రిక స్థానం, బిక్కవోలు ఆలయ శిల్ప సంపద, కోరంగి సాంస్కృతిక అంశాలు లాంటివి విశిష్టమైనవి అని తలుస్తాను.
నిజానికి ప్రాచీనపట్టణాలు అనే అంశం చాలా లోతైనది. ఎంత చదివినా తరగని మెటీరియల్‌ అందుబాటులో ఉంది. వాటిని శక్తిమేరకు క్రోడీకరిస్తూ, సులభంగా అందించాలని నేను చేసిన ప్రయత్నం ఇది. నేను విస్మరించిన లేదా నా దృష్టికి రాని అనేక అంశాలు మిగిలే ఉంటాయి అన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉంటుంది.

భవదీయుడు
బొల్లోజు బాబా
అక్టోబరు 2021