“ప్రాచీనగాథలు” పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట. ఇవి వివిధ కావ్యాలలోంచి తీసుకొన్న మొత్తం 500 పైన గాథలకు తెలుగు అనువాదం. ఇటీవల కొన్ని గాథలను రీల్స్ గా పోస్ట్ చేసినపుడు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తకాన్ని ఛాయావారు ప్రచురించారు. ప్రాచీన గాథలు పుస్తకం అమజాన్ లో లభిస్తుంది. లింక్ మొదటి కామెంటులో ఉంది. దయచేసి ఆదరించగలరు
బొల్లోజు బాబా
*****
మనవి మాటలు
గాథ అనగా ఉత్తమమై, ఉదాత్తమై, రసానుకూలమైన ఒక సంఘటన అని నిర్వచించారు గాథాసప్తశతిని తెలుగుచేసిన శ్రీ గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి. ఈ పదాన్ని వివిధ ముక్తక కావ్యాలలోని పద్యాలకు కూడా వర్తింపచేయటం ఆక్షేపణీయం కాదని తలచి, ఈ పుస్తకంలోని వివిధ పద్యాలను గాథలుగా పేర్కొనటం జరిగింది.
చాన్నాళ్ళక్రితం సప్తశతిగాథలను చదివినపుడు వాటిలోని కవిత్వానికి ఆకర్షితుడనై కొన్ని గాథలను అంశాలవారిగా విభజిస్తూ అనువదించాను. ఆ తరువాత సప్తశతి గాథలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ కొన్ని వ్యాసాలు రాసాను. చరిత్రపట్ల ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ప్రాచీన సాహిత్యం కొత్తకొత్త కోణాలలో దర్శనమివ్వటం మొదలైంది, ముఖ్యంగా ప్రాకృత సాహిత్యం. గౌడవహో, వజ్జాలగ్గం, కువలయమాల, లీలావాయీ, సేతుబంధ లాంటి వివిధ ప్రాకృత కావ్యాలలోని చారిత్రిక అంశాలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాసాను. రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం రాసిన థేరీగాథలు, వాటి చారిత్రిక నేపథ్యం పట్టి కుదిపాయి. వాటిని అనువదించి 2022 లో పుస్తకరూపంలో తెచ్చాను.
ఇదే క్రమంలో ప్రేమస్వరాలు పేరుతో తిరుక్కురల్ నుంచి కొన్ని, అమరశతకం నుంచి కొన్ని గాథలను అనువదించాను. ప్రాచీన సాహిత్యంలో ఋతువర్ణనలు పేరుతో వ్యాసపరంపర రాస్తున్న సమయంలో నాకు ‘సంగం కవిత్వం’ పరిచయం అయింది. స్వచ్ఛమైన మానవానుభవాలు అవి. ఆ గాథలలోని చరిత్ర, ఉద్వేగాలు గొప్ప ఊహాతీత లోకంలోకి తీసుకొని వెళతాయి. సంగం కవిత్వం ఈ పుస్తకపు మొదటి అధ్యాయం, నా సరికొత్త మోహం.
చివరి అధ్యాయం ‘నానావిధ’ పేరుతో వివిధ సందర్భాలలో చేసిన ప్రాచీన గాథల అనువాదాలు. వీటిలో కొన్ని పదహారవ శతాబ్దానికి చెందిన గాథలు కూడా ఉన్నాయి.
నిజానికి సప్తశతి, ఇతర కావ్యాలపై నేను రాసినవి వాటిలోని చరిత్రను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు. కానీ ఈ పుస్తకంలో గాథలన్ని ఒకచోటికి చేర్చి, విశ్లేషణా అంశాలను పుస్తకం చివర నోట్సు రూపంలో ఇచ్చాను. కవిత్వాన్ని, వచనాన్ని వేరుచేయాలనే ఉద్దేశంతో.
***
కవి తను జీవించిన కాలానికి ప్రతినిధి. ఈ ప్రాచీన కవులు తమ కాలాన్ని ఇలా నిక్షిప్తం చేసారు. శాసనాలలో దొరికే చరిత్రలో పేర్లు, తారీఖులు మాత్రమే ఉంటాయి. సాహిత్యంలో కనిపించే చరిత్రలో ప్రజలు రక్తమాంసాలతో సంచరించటం గమనించవచ్చు. ఈ గాథలలో ఎక్కువ భాగం శతాబ్దాల క్రితం జీవించిన సామాన్యుల జీవితాలను ప్రతిబింబిస్తాయి. వారి కష్టాలు సుఖాలు, ఆశలు నిరాశలు, సమాజం, సంస్కృతి, ఆచార వ్యవహారాలను తెలియచేస్తాయి. ఈ రచనలో కొంతమేరకు ఆనాటి subaltern జీవితాన్ని కూడా గుర్తించవచ్చు. సాధారణత్వమే ఈ గాథలకు అంతస్సూత్రం.
ఏ అనువాదము అంతిమం కాదని విశ్వసిస్తాను. ఈ అనువాదాలను మూల విధేయంగా ఉంటూనే భాషాంతరం చేయటంలో శక్తిమేరకు ప్రయత్నించానని అనుకొంటాను. సహృదయులు అర్థం చేసుకొంటారని ఆశిస్తాను.
ఈ పుస్తకరచనలో శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, సవరణలు ఈ రచనను మెరుగుపరిచాయి. వారికి నేను ఋణపడి ఉన్నాను. వారు ఈ పుస్తకానికి రాసిన చక్కని విశ్లేషణాత్మక ముందుమాటకు ఎంతో కృతజ్ఞుడను.
లభించు చోటు
భవదీయుడు
బొల్లోజు బాబా
No comments:
Post a Comment