Wednesday, March 29, 2023

ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు - పార్ట్ 2

(పార్ట్ 1 తరువాయి బాగం)
.
ఏ మతమైనా వ్యాప్తిలోకి రావాలంటే ప్రజల భాషలో దాని బోధనలు ఉండాలి. ఈ సూక్ష్మాన్ని ఎరిగిన జైన బౌద్ధమతాలు తమ బోధనలను ప్రాకృతభాషలో ప్రచారం చేసుకొన్నాయి. ఈ క్రమంలో జైనం ధార్మిక బోధనలే కాక ఇతర శాస్త్ర, సాహిత్య విషయాలను కూడా సామాన్య ప్రజల/ స్థానిక భాషల్లో లిఖించటం ద్వారా సమాజంపై తన ముద్రను బలంగా వేసింది. దక్షిణభారతదేశ చరిత్రలో జైన వాజ్ఞ్మయాన్ని విస్మరించలేము. జైనంతో పాటు వారి వాజ్ఞ్మయం కూడా చాలామట్టుకు నాశనం చేయబడింది. ఈ క్రమంలో తమిళనాట జైనుల నిర్మూలనం జరిగినప్పటికీ వారి వాజ్ఞ్మయాన్ని మాత్రం సంగం సాహిత్యంగా తమిళులు భద్రపరచుకోవటం వల్ల నేడు వారిది అతి ప్రాచీనభాష, ప్రాచీన సంస్కృతి అంటూ ప్రకటించుకొనే వీలు కలిగింది. తెలుగు నాట మాత్రం జైనంతో పాటు జైన వాజ్ఞ్మయం కూడా ధ్వంసమైంది . దీనివల్ల నన్నయకు పూర్వం శతాబ్దాల పాటు గొప్ప సాహిత్యం ఉన్నప్పటికీ (ముఖ్యంగా జైన వాజ్ఞ్మయం) నన్నయను ఆదికవిగా ప్రతిష్టించుకోవలసి వచ్చింది.
.
2. పామరుల భాష అని నిరాదరణకు గురైన ప్రాకృతం
.
ఏడవ శతాబ్దానికి చెందిన సంస్కృత కవి దండి - సంస్కృతం, ప్రాకృతం, అపభ్రంశ (Mixed) అని మూడు భాషలను గుర్తించాడు. పదవ శతాబ్దపు సంస్కృత ఆలంకారికుడైన రాజశేఖరుడు ఈ మూడింటికి పైశాచి భాషను కలిపి నాలుగు భాషలను ప్రస్తావించాడు. అంతే కాక కావ్యపురుషునికి సంస్కృతం శిరస్సుగా, ప్రాకృతం చేతులుగా, అపభ్రంశం నడుముగా, పైశాచి భాష పాదాలుగా ఉంటాయని వర్ణించాడు (Language of snakes by Andrew Ollett ). ఈ వర్ణన ద్వారా భాషలు చాతుర్వర్ణాల వలె భిన్న స్థానాలలో ఒకనాడు ఎలా ఉంచబడ్డాయో అర్ధమౌతుంది.
పైశాచిని మృతుల భాష అంటారు. బహుశా ఇది అనార్యుల మాతృభాష కావొచ్చు. దండి, ఇంకా సంస్కృత వ్యాకరణకారులైన కాత్యాయన, పతంజలి వంటివారు సంస్కృతం కానిదంతా అపభ్రంశమేనని తీర్మానించారు.
ఇదే సమయంలో పాలి, పైశాచి, మగధి, మహారాష్ట్రి, కామరూపి, అపభ్రంశ, శౌరసేని, గాంధారి లాంటి అనేకరూపాలలో ప్రాకృతభాష ప్రజల భాషగా ఉంటూ సమాంతరంగా సహజీవనం చేస్తూ, గొప్ప సాహిత్యాన్ని ఉత్పత్తి చేసింది.
ప్రాకృతభాషలో వ్రాయబడిన గ్రంధాలలో గాథాసప్తశతి (1వ శతాబ్దం), సర్వశేనుని హరి విజయ (4వ శతాబ్దం), ప్రవరసేనుడి సేతుబంద (5వ శతాబ్దం) ఉద్ద్యోతనుని కువలయమాల (8 వ శతాబ్దం), వాక్పతి రాజు గౌదావహ (8 వ శతాబ్దం), కౌతూహలుని లీలావాయి (8వ శతాబ్దం), జినేశ్వరుని గాథాకోశః (12 వ శతాబ్దం) మొదలగునవి ముఖ్యమైనవి.
ప్రాకృతభాష పట్ల పండితవర్గాలలో చులకన భావం ఉండేది అనటానికి దుష్టాంతంగా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.
గుణాడ్యుడు
హాల చక్రవర్తి (1 వ శతాబ్దం) వ్యవహార భాష ప్రాకృతం. ఒకరోజు హాలుడు తన రాణితో జలక్రీడలాడుతున్నప్పుడు, నీటిని తనపై జల్లుతూంటే “దేవా మోదకైస్తాడయ” (సంస్కృతంలో-మా+ఉదకై+తాడయ=నీళ్ళతో కొట్టొద్దు) అన్నదట రాణి. అది విన్న రాజు ఆ మాటను (ప్రాకృతభాషలో మోదకాలు = లడ్డులు) తప్పుగా అర్ధం చేసుకొని లడ్డూలు తెప్పించి వాటిని రాణిపై విసిరాడట వేడుకగా. ఈ చర్యకు రాణి నవ్వి, సంస్కృతం రాకపోవటం పట్ల అవమానకరంగా మాట్లాడటంతో సిగ్గుపడిన హాలుడు, సభఏర్పాటు చేసి తనకు సంస్కృతం ఎవరు నేర్పుతారు అని సభాసదులను అడుగగా, గుణాడ్యుడు అనే పండితుడు నేను మీకు ఆరేండ్లలో సంస్కృతం నేర్పగలను అన్నాడట. శర్మవర్మ అనే మరో పండితుడు నేను ఆరునెలల్లో నేర్పగలను ప్రభూ, అనగా గుణాడ్యుడు దానిని అవమానంగా భావించి- శర్మవర్మతో “నీవు ఆరునెలలలో నేర్పగలిగితే, నేను సంస్కృత భాషను వదులుకొంటాను అని ప్రతిజ్ఞచేశాడట.
శర్మవర్మే ఈ పంతంలో గెలవటంతో, గుణాడ్యుడు సంస్కృత భాషను వదిలేసి పైశాచీ భాష నేర్చుకొని ఏడులక్షల శ్లోకాలతో కూడిన బృహత్కథను రచించాడు.
గుణాడ్యుడు ఈ రచనను హాలునికి సమర్పించమని తన శిష్యులకిచ్చి పంపగా, పైశాచీ భాషా! ఏడు లక్షల శ్లోకాలా! అంటూ హేళనగా హాలుడు వారిని తిప్పిపంపించగా గుణాడ్యుడు ఆ వార్త విని మిక్కిలి దుఃఖించి కావ్యంలోని ఒక్కో శ్లోకాన్ని అడవిలో ఉండే మృగాలకు, పక్షులకు వినిపించి చాలామట్టుకు కావ్యాన్ని అగ్నికి ఆహుతి చేసాడట. శిష్యుల కోరికపై లక్షశ్లోకాల భాగం మాత్రం మిగిల్చాడట గుణాడ్యుడు. (హాలుడే తప్పుతెలుసుకొని వచ్చి అభ్యర్ధించినట్లు మరో కథనం కలదు). దాన్నే సోమదేవసూరి సంస్కృతంలోకి కథాసరిత్సాగరం పేరుతో అనువదించాడు. బృహత్కథలో నేటికి మిగిలి ఉన్న ఒక కథాభాగం అది.
ఇలాంటిదే మరో ఉదంతం
ఆచార్య హేమచంద్రుడు జైన మతానికి చెందిన పదకొండవ శతాబ్దపు కవి పండితుడు. ఇతను కుమారపాలుడనే రాజు చరిత్రను ప్రాకృతభాషలో రచించి, దానిని ఆయనకు వినిపిద్దామని రాజసభకు వెళ్ళాడు. ఇతని రాకను ముందే గ్రహించిన మంత్రి ఆ రాజుతో “ఈ జైనులు బౌద్ధులు, ప్రాకృతం చదువుతూంటారు. అంతా పామర విషయాలు. సంస్కృతం దేవతల భాష, ప్రాకృతం పిశాచాల భాష. దేవరవారు పొద్దుటే సంస్కృతం వింటే శుభస్కరం, అదే ప్రాకృతం వినటం అశుభం” అని నూరిపోసి హేమచంద్రునికి రాజదర్శనం జరగకుండా అడ్డుపడ్డాడట. (ప్రాకృత గ్రంథ కర్తలూ, ప్రజాసేవాను – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి)
మరో ప్రాకృత కథ ఇలా సాగుతుంది. ఉజ్జయినీ నగరంలో సిద్ధసేనుడు అనే ఒక జైన యువకుడు తన చుట్టూ సంస్కృతానికి గౌరవమూ, మన్ననా ఉండటము, ప్రాకృతానికి ఆదరణ లేకపోవటాన్ని గమనించి “మీరు అనుమతి ఇస్తే జైన గ్రంధాలను సంస్కృతంలోకి మార్చుతాను” అని తన మఠాధిపతిని అభ్యర్ధించాడు. అలా చేయటం మహాపాపం అని దానికి ప్రాయశ్చిత్తంగా ఆ యువకుడిని పన్నెండేళ్ళపాటు జైన సంఘం నుండి వెలివేసారట. దీంతో అతను ప్రాకృతాన్ని వదిలిపెట్టి సంస్కృతం లో చేరిపోయాడట.
సంస్కృతం నాగరీక భాషగా స్థిరీకరణ జరుగుతున్న సమయంలో సంస్కృతానికి దక్కిన గౌరవం, ఇతర ప్రాకృత/స్థానిక/ సంస్కృతేతర భాషలకు దక్కలేదని అవి ఏ రకంగా నిరాదరణకు గురయ్యాయో పై ఉదంతాలద్వారా అర్ధమౌతుంది.
.
3. సంస్కృత భాషోదయం
శాతవాహనులు ప్రాకృతాన్ని ప్రోత్సహిస్తూ సంస్కృతాన్ని అంతవరకూ తొక్కిపెట్టి ఉంటారని అందుచేతనే..........
(ఇంకా ఉంది)

బొల్లోజు బాబా



No comments:

Post a Comment