Friday, August 20, 2021

తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 3

 తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 3

.
వ్యభిచారం అనేది అతిప్రాచీన వ్యవస్థీకృత వ్యాపారం. థెరి గాథలకు ధమ్మపాలుడు చేసిన వ్యాఖ్యానంలో ఒక వేశ్య సంపాదించిన ధనంలో సగం ఆమెకు చెందగా మిగిలిన సగం వేశ్యావాటిక నిర్వహించేవారికి చెందుతుంది అంటాడు. దానిని బట్టి సుమారు రెండున్నరవేల సంవత్సరాల క్రితపు గణికావ్యవస్థ ఆర్ధిక అంశాలు కొంతమేరకు అర్ధమౌతాయి.
.
విమల ఒక గణిక కూతురు. వేశ్యాగృహంలోనే పుట్టి పెరిగింది. ఒకనాడు ఈమె బుద్ధుని ప్రియశిష్యుడైన మొగ్గల్లన అనే భిక్షుకుడిని చూసి అతన్ని ఆకర్షించి వశపరచుకోవాలని ప్రయత్నించింది. అతను ఈమెను తృణీకరిస్తూ – “నీవు చర్మం కప్పుకొన్న పెంటకుప్పవు; గడ్డల వక్షోజాలు ఉన్న దయ్యానివి; నీ నవరంద్రాలలో దుర్వాసనా స్రావాలు ప్రవహిస్తున్నాయి; శుచిని కోరుకొనేవారు పెంటను ఎలాగైతే తప్పించుకొంటారో నీ శరీరాన్ని అలాగే తప్పించుకొంటారు” అంటూ అవమానిస్తాడు. అతని మాటలు విమలలోని అహంకారాన్ని చంపివేసి, ఆమెను బౌద్ధసన్యాసినిగా మారేలా చేసాయి.
విమల థెరీగా మారాక వ్రాసుకొన్న గాథ ఇలా ఉంది.
.
యవ్వనం
కాంతులీనే చర్మం
వంకలేని దేహాకృతి
అతిలోక సౌందర్యం
అపరిమితమైన పేరు ప్రఖ్యాతులతో
కనులు మూసుకొనిపోయి
ఎవరూ నా కంటికి కనపడేవారు కారు
అందంగా అలంకరించుకొని
వేశ్యాగృహం బయట వేటగత్తెలా నిలుచుని
వలలో చిక్కుకొన్న మగవాళ్ళని చూసి నవ్వుకొనేదాన్ని
నేడు
శిరోముండనం
కాషాయ వస్త్రాలు
భిక్షుకజీవనం
అన్ని బంధాలను తెంచుకొని
చెట్టు నీడలో ఉన్నాను నేను
లోలోపల బడబాగ్ని చల్లారింది
నా జీవితంలోంచి
దేవుళ్ళను, మగవాళ్ళను తరిమేసాను (72-76)
.
పై గాథలో చివరి వాక్యం కీలకమైంది. అంతటి విప్లవాత్మక భావాలను నేడు వ్యక్తీకరించే పరిస్థితులు ఉన్నాయా అనేది సందేహాస్పదమే!
***
బుద్ధుడు సన్యసించకపూర్వం సిద్ధార్ధునిగా ఉన్నప్పుడు అంతఃపురంలో అతనితో సన్నిహితంగా మెసిలిన వారిలో పన్నెండు మంది బౌద్ధభిక్షుణిలుగామారి ధమ్మమార్గంలో ప్రయాణించారు. సిద్ధార్ధుని అంతఃపుర స్త్రీలు ఎంతమంది అనేదానికి ఎక్కడా వివరాలు దొరకవు. ఒక కథనం ప్రకారం సిద్ధార్ధుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినప్పుడు శాక్యులు ఒక్కో కుటుంబంనుంచి ఒక్కో యువతిచొప్పున మొత్తం నలభైవేలమందిని సిద్ధార్ధుని అంతఃపురానికి పంపించారట. ఈ ఉదంతం సిద్ధార్ధుని మగటిమిని చెప్పటానికే అని సులువుగానే అర్ధమౌతుంది. సిద్ధార్ధుని సమకాలీనుడైన బింబిసారునికి 500 మంది అంతఃపుర స్త్రీలు ఉండటాన్ని బట్టి సిద్ధార్ధుని స్త్రీజనం కూడా అంతే సంఖ్యలో ఉండేవారని ఊహించవచ్చు.
సమాజంలో ఉన్నత వర్గాలకు చెందినవారు కీర్తి ప్రతిష్టలకొరకు అంతఃపురంలో అనేకమంది స్త్రీలను ఉంచుకొనేవారు. వీరిలో వివాహం చేసుకొన్నవారిని భార్యలు/రాణులుఅని, విలాసం కొరకు ఉంచుకొన్నవారిని ఉంపుడుగత్తెలని (గణికలు) పిలిచేవారు. ఈ గణికలు రాజుగారికి ఛత్రం, వింజామర ధారిణులుగా, పానపాత్ర అందించటానికి, సింహాసనం, రథాదుల వద్ద సహాయకారులుగా ఉండాలి అని చాణుక్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడింది. ఈ ఉంపుడుగత్తెలకు వెయ్యినుంచి మూడువేల పణాల వరకూ ఖజానా నుంచి జీత భత్యాలు ఇచ్చేవారు. ఈ గణికా వృత్తి నుండి విముక్తమవ్వాలంటే ఇరవై ఐదు వేల పణాలు చెల్లించి స్వేచ్ఛనొందవచ్చు. గణికాపుత్రునికైతే పన్నెండువేల పణాలు చెల్లించాలి. వయసు దాటిపోయిన గణికలు కోశాగారంలో కానీ, వంట శాలలో కానీ పనికి కుదరవచ్చు. రాజుగారు చెప్పిన పురుషుని వద్దకు వెళ్ళని గణికకు వెయ్యి కొరడా దెబ్బలు లేదా ఐదువేల పణాల జురిమానా వరకూ విధించేవారు. ఇదీ అనాటి రాజ స్త్రీజనుల జీవన స్థితిగతులు.
గౌతమ బుద్ధుని పూర్వజీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన కొద్దిమంది అంతఃపురవాసినుల గాథలు ఇవి.
(తధాగతుడు ఒకనాటి తన గణిక అయిన తిస్సాతో ఇలా అంటున్నాడు)
.
తిస్సా!
సాధనను సాధన చేయి
నిన్ను అనుబంధాలు కబళించనీయకు
సంకెళ్ళ నుంచి విముక్తమవ్వు
ఈ లోకంలో నిష్కల్మషంగా జీవించు (5)
.
(తధాగతుడు ఉపాసమతో అనే మరో గణికతో ఇలా అంటున్నాడు)
ఉపాసమా
ఈ ప్రవాహాన్ని నీవు దాటాలి
ఇది మృత్యుమార్గం, అత్యంత కష్టమైనది
ఉపాసమా! నీవు ఇప్పటికే
అన్ని ప్రలోభాలని జయించావు
కొద్దిగా ఓరిమితో ఉండు
ఇదే నీ చివరి జన్మ (10)
.
సంఘ
నేను నా ఇంటిని
నా కొడుకుని, నా పశుసంపదను
నేను ఇష్టపడే వాటన్నిటినీ
త్యజించాను
నా అజ్ఞానం పటాపంచలైంది
నేను కోర్కెలను జయించాను
నా దాహం తీరింది
ఇప్పుడు ఎంతో శాంతిగా ఉంది నాకు
సంఘ సిద్ధార్ధుని అంతఃపుర స్త్రీ అని చెప్పినప్పటికీ - ఆమె పశులకాపరిగా స్వతంత్ర జీవనం సాగించినట్లు, కుటుంబాన్ని కలిగి ఉన్నట్లు పై గాథ ద్వారా అర్ధమౌతుంది.
థేరీలు రాజమాత నుండి వేశ్యల వరకూ వివిధ సామాజిక స్థాయిల నుండి వచ్చారు.
(ఇంకా ఉంది)
గాథల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా
.
Ref.
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot

No comments:

Post a Comment