Saturday, August 14, 2021

తెరిగాథ : బౌద్ధ భిక్షుకిల ప్రాకృత గాథలు - పార్ట్ 1

 తెరిగాథ : బౌద్ధ భిక్షుకిల ప్రాకృత గాథలు - పార్ట్ 1

.
బుద్ధునికి సమకాలీనులు స్వయంగా ఆయనవద్దే శిష్యరికం చేసిన తొలి బౌద్ధ సన్యాసినులు చెప్పుకొన్న స్వీయానుభవ కవితలు థేరిగాథలు. థేరీ అంటే సన్యాసిని/భిక్షుకి/భిక్షుణి అని అర్ధం. ఈ గాథలు BCE ఆరోశతాబ్దంలో వ్రాయబడినా చాలాకాలం మౌఖికంగా ఉండి BCE 80 లో పాలి భాషలోకి గ్రంధస్థం చేయబడ్డాయి. మొత్తం 494 థేరీ గాథలను 73 మంది వివిధ థేరీలు రచించారు. వీరిలో బ్రాహ్మణులు 21 మంది, క్షత్రియులు 27, వైశ్యులు 17, శూద్రులు 8 మంది అని Peggy Kim Meill గుర్తించాడు
.
CE ఆరోశతాబ్దంలో ధర్మపాలుడు థేరీగాథలకు వ్యాఖ్యానం వ్రాసాడు. ఇది ప్రపంచ సాహిత్యంలోనే తొలి కవితాసంకలనం మరీ ముఖ్యంగా స్త్రీలు వ్రాసిన సంకలనం.
థేరీ లందరూ సమాజంలో వివిధ సామాజిక స్థాయిలనుంచి వచ్చారు. రాజమాతల నుండి వేశ్యలవరకూ భిన్న నేపథ్యాలను కలిగి ఉన్నారు. వీరందరికీ బౌద్ధం ఏ విధంగా మానసిక ధైర్యాన్ని, జీవనేచ్ఛని, జ్ఞానాన్ని ఇచ్చిందో వీరే వివిధ గాథలలో చెప్పుకొన్నారు. వీరు తొలితరం బౌద్ధులు. థేరీగాథలు 2600 సంవత్సరాల నాటి సమాజాన్ని స్త్రీ దృక్కోణంలోంచి మనకు చూపిస్తాయి. శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఒక వ్యాసంలో అన్నట్లు క్రీస్తుపూర్వపు 6 వ శతాబ్దమంతా ఈ థేరీ గాథల కవితాసంకలనంలో కనిపిస్తుంది.
థేరీ ల జీవన విధానం
.
సంఘారామంలోకి స్త్రీలను బుద్ధుడు మొదట్లో అనుమతించలేదు. ఒకనాడు ప్రజాపతి గౌతమి (ఈమె బుద్ధుని పెంచిన పినతల్లి) కపిలవస్తులో బుద్ధుని వద్దకు వెళ్ళి “ఓ తధాగతా! అన్ని బంధాలను పరిత్యజించి, బౌద్ధధర్మాన్ని ఆచరించటానికి స్త్రీలు కూడా సంఘంలోకి రావాలనుకొంటున్నారు, వారిని అనుమతించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను” అని అడుగగా తధాగతుడు అంగీకరించలేదు. మరో సందర్భంలో ప్రజాపతి గౌతమి - కేశఖంఢన చేసుకొని, కాషాయ వస్త్రాలను ధరించి, ఉబ్బి, దుమ్ము గొట్టుకుపోయిన పాదాలతో బుద్ధుడిని వైశాలి నగరంలో కలుసుకొని స్త్రీలకు ప్రవేశం కల్పించమని మరలా ప్రార్ధించింది.
తధాగతుడు మొదట్లో అంగీకరించకపోయినా పదే పదే అభ్యర్ధనల అనంతరం – కొన్ని ప్రత్యేకమైన కట్టుబాట్లతో స్త్రీలను సంఘంలోకి అనుమతించాడు. బిక్షుకిలు (సన్యాసినులు) సంఘంలో ద్వితీయ శ్రేణి జీవనాన్ని సాగించేలా ఈ కట్టుబాట్లు ఉన్నాయని వీటిని తొలగించమని ప్రజాపతి గౌతమి చాలా సందర్భాలలో తధాగతుని కోరినట్లు కొన్ని గాథలలో కలదు- మరీ ముఖ్యంగా ఎంతపెద్దవయసు సన్యాసినులైనా అత్యంత పిన్నవయస్కుడైన సన్యాసికి కూడా ఎదురుపడినపుడు సాష్టాంగవందనం చేయాలనే మొదటి సూత్రాన్ని.
బౌద్ధాన్ని స్వీకరించిన స్త్రీలు సన్యాసుల వలె చైత్యాలలో నివసించాలి. ఒక్కొక్కరికి మూడు కాషాయ వస్త్రములు, ఒక బిక్షాపాత్ర, సూది దారం, నీటినివడకొట్టుకొనే పాత్ర, ఒక చాకు ఇవ్వబడతాయి. బిక్షుకిలకు ఇవి కాక బహిష్టుసమయంలో ధరించే మొలపట్టీ అదనం. వీరు నివసించే గదులు సామాన్యంగా మట్టితో కానీ, వెదురుతో కానీ నిర్మించబడి ఉంటాయి. నివాసాలకు సమీపంలో వీరి వసతి ఉండాలి. వీరు ఊరిలో సంచరిస్తూ, బుద్ధుని బోధనలు ప్రవచిస్తూ అన్నం, బార్లీ, గోధుమలు, పండ్లు, కూరగాయలను మాత్రమే భిక్షంగా గ్రహించాలి. నెయ్యి, పాలు, తేనె, పెరుగు, మాంసము లాంటివి నిషిద్ధము. ఒక ప్రాంతంలో కనీసం 5 మంది భిక్షుకీలు ఉన్నప్పుడే సంఘం ఏర్పడాలి.
***
థేరిగాథలు పాలిభాషనుండి ఇంగ్లీషులోకి 1909 లో అనువదించబడ్డాయి. ఈ గాథలు గానానికి వీలుగా పాటలుగా, సత్సంగంలో చెప్పుకొనే కథలుగా ఉండేవి. ప్రతీ గాథ క్రింద దానిని రచించిన వారి పేరు ఉంటుంది. వీరు నిజంగా ఆ గాథలను రచించిన కవయిత్రులా, అసలు వారు స్త్రీ లేనా అనే ప్రశ్నలు రాకమానవు. దీనికి సమాధానంగా- ఇతర బౌద్ధ రచనలలో ప్రస్తావించబడిన 20 మంది స్త్రీ భిక్షుకుల పేర్లు ఈ 73 మంది పేర్లతో సరిపోలుతుండటం; ఈ థేరీగాథలలో చెప్పిన వివిధ జీవితానుభవాలలో 40 కథలు ఆనాటి సమకాలీన బౌద్ధ గ్రంధాలలో కూడా ఉండటాన్ని బట్టి థేరీగాథలు కల్పితగాథలు కాకపోవచ్చని, వాటిని వ్రాసిన వ్యక్తులు చారిత్రిక స్త్రీలేనని పండితులు నిర్ధారించారు .
***
చంద (Chanda) ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీ. ఈమె చిన్నవయసులోనే మహమ్మారివల్ల (ahiwataka-roga- శ్వాసవలన అంటుకొనే వ్యాధి. మొదట బల్లులు, పాములకు వచ్చి క్రమేపీ కుక్కలు పిల్లులు, చివరకు మనుషులకు కూడా సోకే ప్రాణాంతక వ్యాధి) కుటుంబాన్ని బంధువులను కోల్పోయింది. ఒక అనాధగా మారింది. ఇల్లులేదు, ఉపాధి లేదు. వీధులలో యాచించి బ్రతకాల్సిన స్థితి ఈమె తన దీనస్థితి నుంచి జ్ఞానమార్గం వైపు ఎలా ప్రయాణించిందో ఒక గాథరూపంలో ఇలా నిక్షిప్తం చేసింది.
ఒకప్పుడు నేను చాలా పేదరాలిని, విధవను,
సంతానం, బంధువులు, స్నేహితులు లేరు.
తిండిలేదు, సరైన దుస్తులు లేవు.
భిక్షా పాత్ర, చేతకర్ర ధరించి ఇల్లిల్లూ తిరుగుతూ
చలిలో, గాడ్పులలో ఏడేళ్ళపాటు బిచ్చమెత్తుకొని జీవించాను.
ఒకనాడొక సన్యాసినిని చూసి నాకు బౌద్ధదీక్ష ఇవ్వమని అడిగాను
ఆమె నన్ను ఆదరించింది.
నాపై కరుణ చూపి నన్ను గొప్ప జీవిత ధ్యేయం వైపు నడిపించింది.
నేను ఆమె బోధనలు శ్రద్ధగా విన్నాను, ఆచరించాను
నేడు ఏ మాలిన్యమూ నా హృదయాన్ని తాకలేదు. (122-126)
.
పై గాథలోని చందా కు దీక్ష ఇచ్చిన స్త్రీ పేరు పతాచర (Patacara). ఈమె ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. జీవితం నిండా దుర్భరమైన కష్టాలు. పతాచర యుక్తవయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులను కాదని, ఇంటిలో పనిచేసే ఒక సేవకునితో లేచిపోయి పెళ్ళిచేసుకొంది. గర్భం ధరించి పురుడు కోసం పుట్టింటికి వెళదామని బయలుదేరగా మార్గం మధ్యలోనే నొప్పులు వచ్చి దారిపక్కనే ప్రసవిస్తుంది. రెండో గర్భానికి కూడా అలాగే జరుగుతుంది. భర్త పాముకాటుకు గురై మరణిస్తాడు. పుట్టింటికి పోదామని బయలుదేరగా మార్గ మధ్యంలో వరదలో కొట్టుకుపోయి పెద్దకొడుకు, గద్ద ఎత్తుకుపోగా చిన్నకొడుకు మరణిస్తారు. పుట్టింటి వెళ్ళగా అక్కడ తల్లిదండ్రులు వానలకు ఇల్లుకూలి మరణించి ఉంటారు. ఇన్ని బాధలు ఒకేసారి మీదపడటం వల్ల ఆమె మతిస్వాధీనం తప్పిపోతుంది. అంతటి దుఃఖంలో ఆమె బుద్ధుని నీడలో చేరుతుంది. తధాగతుని బోధనలతో ఆమె స్వస్థపడి ధమ్మప్రచారంలో శేషజీవితాన్ని సాగిస్తుంది.
స్వయంగా జీవిత సర్వస్వాన్ని కోల్పోయిన ఈ పతాచర, సంతానాన్ని కోల్పోయిన కొంతమంది మహిళలను ఒకనాడు ఇలా ఓదార్చిందట….
.
“అయ్యో నా కుమారుడా” అని మీరు రోదిస్తున్నారు
వచ్చింది ఎవరో, పోయింది ఎవరో మీకు తెలియదు
ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు
ఇదంతా మానవ దుఃఖం
దీన్ని అర్ధం చేసుకొంటే
అతను రావటం పోవటం గురించి మీరు బాధపడరు.
మీరు అడగకుండా అతను వచ్చాడు
మీతో చెప్పకుండా వెళ్ళిపోయాడు
మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు
ఎక్కడినుంచో ఇక్కడకు వచ్చాడు,
కొద్దిరోజులున్నాడు
ఒక దారిలో వచ్చి మరోదారిలో వెళ్ళిపోయాడు
వచ్చాడు వెళ్ళాడు. ఇందులో బాధపడటానికి ఏముందీ?
.
(ఈ మాటలు విన్న తరువాత పుత్రులను కోల్పోయిన ఆ స్త్రీలు ఇలా అనుకొన్నారట)
.
ఆమె నా గుండెల్లో గుచ్చుకొన్న బాణాన్ని
నా పుత్రశోకాన్ని బయటకు లాగేసింది
నిన్నటివరకూ ఆ శోకం నన్ను కబళించింది
నేడు అది పోయింది.
నేను విముక్తమయ్యాను
బౌద్ధ ధర్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించి
జ్ఞానమార్గంలో జీవిస్తాను (127-132)
.
(ఇంకావుంది)
సోర్స్:
Poems of the first Buddhist women by Charles Hallsey
THE FIRST BUDDHIST WOMEN By Susan Murcot
గాధల అనువాదం, వ్యాఖ్యానం
బొల్లోజు బాబా

No comments:

Post a Comment