Thursday, September 4, 2025

నిత్య యవ్వనమే’ సాధు సందేశం!


.
నేను ఒక ఏడాది క్రితం నా ఫేస్ బుక్ వాల్ పై మృత్యువు గురించి రాసిన ఒక కవితకు స్పందిస్తూ సాధు సుబ్రహ్మణ్య శర్మ ఇలా కామెంట్ చేసారు.
 
“As age increases try to become younger. Don't await death. let death take one unawares while fully immersed in executing a huge project , as in a battlefield!-- Sadhu Sarma.” (వయసు పెరిగే కొద్దీ పడుచువారయ్యేందుకు ప్రయత్నించండి. చావుకోసం ఎదురుచూడవద్దు. ఏదో ఒక పెద్దకార్యంలో పూర్తిగా నిమగ్నమై ఉండగా చావు మనకే తెలీకుండా వచ్చి మనల్ని లాక్కెళ్ళిపోవాలి, యుద్ధరంగంలో లాగ- సాధుశర్మ)

సాధుశర్మ పరిపూర్ణ జీవితం ఆస్వాదించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమించారు. తన చుట్టూ ఉన్న పిల్లలను ప్రోత్సహించారు. 90 ఏళ్ళు వయసులో కూడా ఈ ప్రపంచాన్ని మార్చటానికి కొత్తకొత్త తాత్త్వికభూమికల గురించి అన్వేషిస్తూ, తాను కనుగొన్న సత్యాలను ప్రపంచంతో పంచుకొంటూ జీవించారు. పైన ఆయనే చెప్పినట్లు మరణించే సమయంలో కూడా ఏదో పెద్దప్రోజెక్టును ఊహిస్తూ ఉండి ఉంటారు
 
శ్రీ సాధు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సాధు లక్ష్మీనరసింహ శర్మ శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు 6-3-1932న జన్మించారు. వీరి ప్రాధమిక చదువు బళ్ళారిలోను, కాలేజి చదువు అనంతపురం, హైదరాబాద్ లోను జరిగాయి. వీరు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖలో వివిధ హోదాలలో పనిచేసి, చివరకు జెనరల్ మేనేజర్ ఇన్ చార్జిగా 1990, మార్చి 31న పదవీవిరమణ చేసారు. 2025, జూలై 18న 93 ఏళ్ళ వయసులో కాకినాడలోని స్వగృహంలో పరమపదించారు.
శ్రీ సాధు సుబ్రహ్మణ్య శర్మ గొప్ప మేధోసంపన్నులు, వారి జ్ఞానదాహం అపారమైనది. ఒక వ్యక్తి కవిత్వం, చరిత్ర, భాషాసంబంధ పరిశోధన, తత్త్వశాస్త్రం వంటి వివిధ రంగాలలో వారు చేసిన ప్రామాణిక రచనలు అసాధారణమైనవి. ఇది వారి అసామాన్య ప్రతిభ, బహుముఖీన పాండిత్యానికి, అవిశ్రాంత శ్రమకు నిదర్శనం.

వీరి రచనలు

“సాధువాడిమాట-నవసహస్రాబ్ది బాట” అనే మకుటంతో సమకాలీన అంశాలు, నైతిక విలువలపై రాసిన పద్యాలు. కాలవాహిని పేరుతో కవిత్వం సాధుబాల శిక్ష - అక్షరాలు దిద్దనవసరం లేకుండా తెలుగును బోధించేందుకు రచించిన పాఠ్యపుస్తకం.
New Frontiers of Philosophy for an Alternate model of society or the Human Manifesto. ఈ పుస్తకంలో మానవజాతి ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్ధిక, రాజకీయ పర్యావరణ సంక్షోభాలను చర్చించారు. ప్రాచీనభారతదేశ తత్త్వసారాన్ని ఆధునిక సమాజానికి అన్వయిస్తూ చేసిన ప్రతిపాదనలు ఇవి. సమకాలీన సమాజాన్ని, మానవజీవనాన్ని పునర్నిర్మించే దిశలో ఒక గొప్ప మేధావి చేసిన ఆలోచనలు ఇవి.

Dialectics of Evolution, Systems Approach and New frontiers of Philosophy అనే పేరుతో 2015 లో రచించారు. 590 పేజీలు. దీనిని Partridge India వారు ముద్రించారు. చరిత్రను ఒక కొత్త తాత్విక దృష్టితో ఎలా చూడాలో ఈ పుస్తకంలో సుబ్రహ్మణ్య శర్మ వివరించారు. మరింత శాంతిమయ భవిష్యత్తు, శ్రేయస్సుతో కూడిన సమాజాన్ని సాధించేందుకు ఒక విన్-విన్ వ్యూహాన్ని దీనిలో ప్రతిపాదించారు. చరిత్రలో సామాన్యమానవుడు కేవలం విధేయతకలిగిన వస్తువుగానే ఉన్నాడని అతను మరింత తెలివైన పాత్రపోషించాలి అని అంటారు.
 
మేటి భారతదేశం - మన చరిత్ర మూలాలను అన్వేషిస్తూ వ్రాసిన విశ్లేషణాత్మక 770 పేజీల గ్రంధం. Fight for peace and struggle for an Ideal society అనే పుస్తకంలో ఆధునిక సమాజం, హింస యుద్ధాలనుండి ఎలా విముక్తి చెంది శాంతివైపు ప్రయనించాలో చర్చించారు.
బంకోలా నవల. సాధు సుబ్రహ్మణ్య శర్మ తెలుగు పాఠకులకు ఎక్కువగా తెలిసింది బంకోలా నవల ద్వారా. బంకోలా అంటే లైట్ హౌస్ అని అర్ధం.
 
అది విదేశీయులు వ్యాపారనిమిత్తమై వచ్చి దేశరాజకీయాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకొంటున్న కాలం. స్వదేశీయులు మూడురకాలుగా విడిపోయారు. ఈ మార్పుని తమకు అనుకూలంగా మలచుకొని బాగుపడాలనుకొన్నవారు. రాజెవ్వడైతే మాత్రం నా కష్టమే కదా నాకు దిక్కు అనుకొని తటస్థంగా ఉండిపోయినవారు. రాబోతున్న ఉపద్రవాన్ని పసిగట్టి సమాజాన్ని అప్రమత్తం చేయటానికి ప్రయత్నించిన ఆలోచనా పరులు మరోపక్క.
 
వీరందరి మధ్యా సంఘర్షణ ఫలితంగా జరిగిన నాటకీయపరిణామాలే బంకోలా నవల.
కథానాయకుడు భైరి, ఓడల యజమాని నరసింహనాయకర్ కొడుకు. భైరి ఆలోచనాపరుడు, ఆంగ్లేయ స్నేహితుల నుంచి ప్రపంచ విజ్ఞానం గ్రహిస్తాడు, బ్రిటిష్ రాజకీయ ఆధిపత్య ఆలోచనలను గుర్తిస్తాడు. యానాం ఫ్రెంచివారి వద్ద గుమస్తాగా పనిచేస్తూ వారి దాష్టీకాలను ఎదిరించి గొడవపడతాడు. మంజరి అనే వేశ్యద్వారా విదేశీయుల దోపిడీని తెలుసుకొని ఢిల్లీ సుల్తానును కలిసి విదేశీయులను నిలువరించమని కోరటానికని ఢిల్లీ వెళతాడు. అక్కడ ఎవరూ ఇతని మాట ఖాతరు చేయకపోవటంతో తిరిగి కోరంగి వచ్చేస్తాడు. మరదలు పరదేశిని పెళ్ళాడి వ్యాపారంలో విజయం సాధిస్తాడు. అయితే బ్రిటిష్ వ్యతిరేక భావాలతో ఉన్నందుకు భైరి కొడుకును బ్రిటిష్ వారు హతమారుస్తారు. చివరకు, 1789 డిసెంబర్ 10న వచ్చిన కోరంగి సునామీలో భైరి, పరదేశి కొట్టుకుపోయి మరణించటంతో నవల ముగుస్తుంది.

ఈ రచనలో సుబ్రహ్మణ్య శర్మ ఆ కాలపు సామాజిక సంఘర్షణను నేపథ్యంగా తీసుకోవటం వల్ల ఇది గొప్ప చారిత్రిక నవలగా రూపుదిద్దుకొంది. తెలుగులో ఈ కాలానికి సంబంధించి సామాన్యుల జీవితాలను ప్రతిబింబించే సాహిత్యం పెద్దగా లేదు. ఆ లోటు ఈ పుస్తకం తీర్చటంతో తెలుగు పాఠకులు దీనిని అపూర్వంగా ఆదరించారు. తెలుగువారు గర్వించదగిన గొప్ప తాత్త్విక రచనలను సుబ్రహ్మణ్య శర్మ చేసారు. వాటిపట్ల తెలుగునాట పెద్దగా చర్చ జరగకపోవటం నిజంగా బాధాకరం.
ఇవే కాక జహిశత్రుల మహాబాహో - మెట్టవేదాంతాన్ని విడనాడి శాస్త్రీయ మార్గం అవలంబించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపే రచన. History of Freedom Struggle. శ్రీసాధు సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రతిపాదించిన "స్వల్ప సంకేతాలతో సకల భాషలను వ్రాసే విశ్వజనీన లిపి" కి సోమనాథ కళాపీఠం వారు "స్వచ్ఛంద భాషా సేవా పురస్కారం" ను 2010 లో ప్రదానం చేసారు. ఈ విశ్వజనీన లిపి లాంటివి ఇంకా అముద్రితాలే.
 
సాధు సుబ్రహ్మణ్య శర్మ సాధు ప్రైవేట్ లైబ్రేరిని స్థాపించి స్కూల్ విద్యార్ధుల కొరకు స్వయంగా నడిపారు. పిల్లలు ఆటలు ఆడుకోవటానికి ఒక ఇల్లును అద్దెకు తీసుకొని అన్ని రకాల ఆటవస్తువులను వారికి అందుబాటులో ఉంచారు. నిత్యయవ్వనంతో జీవించటమే ఆ గొప్ప తత్త్వవేత్త మనకిచ్చిన సందేశం.
 
(ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజ్ లో ప్రచురింపబడింది ఎడిటర్ గారికి, మెహర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)

బొల్లోజు బాబా



ఫ్రెంచి ఇండియా పాస్ పోర్టు



పాండిచ్చేరి భారతదేశంలో విలీనం కాకముందు అక్కడి ప్రజలు సమీప భారతభూభాగాలోకి వెళ్లాలంటే గుర్తింపు పత్రాలు చూపించాల్సి వచ్చేది. నేటి పాస్ పోర్ట్ లు లాగా. ఇవి లేకపోతే పాండిచేరి నుంచి వెలుపలికి రావటానికి లేదు.

అప్పట్లో మా నాన్నగారు శ్రీ బొల్లోజు బసవలింగం గారు పాండిచేరి Calve College లో Brevet చదువు తున్నారు (equivalent to higher secondary).
 
యానాం రావటానికి 20, ఏప్రిల్ 1954 న ఫ్రెంచి ప్రభుత్వం మానాన్నగారికి ఇచ్చిన పాస్ పోర్ట్ ఇది. (గమనిస్తే దానిలో నేషనాలిటి "ఫ్రెంచ్" (francaise)అని ఉంటుంది. ఫ్రెంచి వారు వెళ్ళిపోయే ముందు ఇక్కడి ప్రజలకు తమ నేషనాలిటి నిలుపుకొంటారా భారతదేశంలో కలిసిపోతారా అని option ఇచ్చారు. అలా చాలామంది ఫ్రెంచినేషనాలిటి ఉంచుకున్నారు. అడగని వారు డిఫాల్ట్ గా భారతీయులుగా మారిపోయారు. మానాన్నగారు మాతృదేశాభిమానంతో తీసుకోలేదు. ఆనాటి బ్రిటిష్ వారు రాత్రికి రాత్రి జంప్ అయిపోయారు.)

అలా యానాం వచ్చిన వీరు ఫ్రెంచి పాలన నుండి యానాం విమోచనోద్యమంలో శ్రీ దడాల రఫెల్ రమణయ్య నాయకత్వంలో పాల్గొన్నారు. ఫ్రెంచి పోలీసు దెబ్బలు తిన్నారు. 13, జూన్ 1954 న ఉద్యమ నాయకులు కలక్టర్ బంగ్లాను ముట్టడించి యానాం భారతావనిలో విలీనమైందని ప్రకటించారు.
 
"యానాం విమోచనోద్యమం" నా మొదటి పుస్తకం. ఆనాటి నాయకులను రికార్డు చేసే ఉద్దేశంతో రాసింది. మొదటి కామెంట్లో డౌన్ లోడ్ లింకు కలదు.
 
"ఫ్రెంచిపాలనలో యానాం" పేరుతో రాసిన యానాం కలోనియల్ చరిత్ర పుస్తకం డౌన్ లోడ్ లింక్ రెండవ కామెంటులో కలదు.
 
ఇదే సబ్జెక్టుపై రాసిన "ఫ్రెంచి ఇండియా స్వాతంత్ర్యపోరాట యోధుడు - శ్రీ దడాల రఫెల్ రమణయ్య" పుస్తకం కావలసిన వారు పల్లవి పబ్లిషర్ శ్రీ నారాయణ గారి నంబరులో 9866115655 సంప్రదించగలరు.

పొట్టచేత పట్టుకొని బయటకు వచ్చేసినా నేను పుట్టిన ఊరిపై రాసిన మూడు పుస్తకాలు ఇవి.

బొల్లోజు బాబా




ప్రాచీన గాథలు review



Manasa Chamarthi gaaru, ఎంతమంచి కాన్క. శ్రద్ధగా చదివి చెప్పే వాక్యాల పరిమళం గొప్ప సౌందర్యాన్ని కలిగి ఉంటాయి ఇలా...
Loved every line. Thank you so much madam.
బొల్లోజు బాబా
*****

బెంగళూరులో ఈ నెలలో వాన పడని రోజే లేదనుకుంటాను! ఆఫీసు పనులను దాటుకుని సాయంకాలాల్లో కాస్త బయటికి వచ్చి చూస్తే, ఆకాశమంతా నల్లటి మేఘాలు బరువుగా కదులుతూ కనపడుతూనే ఉన్నాయి. ముసురుకునే చీకట్ల మధ్య ఎక్కడో దూరాల్లో చిన్న తెలిమబ్బు...దాని నుండి పాకే మృదువైన కాంతి. గాలుల్లో సన్నగా వణికించే చలి. ఈ మధ్యాహ్నమూ అలాగే కుండపోతగా వాన కురిసి వెలిసింది. బాల్కనీలో వానకు తడిసి తీవెల నుండి రాలిపడ్డ సన్నజాజుల రెక్కలు. శ్రావణ మాసపు సౌందర్యానికి సెలవురోజు సోమరితనం తోడైంది, విశ్రాంతిగా వెనక్కు సోలిపొమ్మని చెబుతూ వీధిలో ఎవరింటి నుండో పాత హిందీ పాటలు. నా చేతిలోనేమో బొల్లోజుబాబా గారి ప్రాచీన గాథల సంకలనం. తెరిచానా...


*
ప్రాయపు నాయకుల సరస సంభాషణల్లో మత్తుగా కురుస్తోంది వాన. యుద్ధానికి పోవలసిన సేనాధిపతి అంటున్నాడూ -
శాంతి నిండిన పూల కన్నులదానా!
"వాన వచ్చేలా ఉంది" అంటూ
నువ్వు నన్ను వెళ్ళనివ్వలేదు
నిన్ను విడిచి నేను రానేమోనని
యుద్ధ ప్రయత్నాన్ని
విరమించుకున్నాడు రాజు"

ఏమి వ్యాఖ్యానం కావాలీ పద్యాలకి? యుద్ధానికి వెళ్ళబోయే సేనాధిపతి, భార్యను శాంతి నిండిన పూల కన్నులదానా అని పిలవడంతో కవిత మొదలయ్యాక, ఇంకా రాని వర్షాన్ని నెపంగా చూపించి ఆ పడతి మగడిని యుద్ధానికే వెళ్ళనివ్వకుండా చేసిందని తెలిసాక, ఇతను రాడేమోనని, యుద్ధాన్నే విరమించుకున్న రాజుని తలచాక - ఇంకా ఏమి చెప్పుకోవాలి? ఆ ప్రేమ రుచి అనుభూతిలోకి తెచ్చుకుని సుఖించడమే తక్క!
*

వాన ఇంకా కురుస్తూనే ఉంది. ఎర్రమట్టినీ వాననీటినీ కలిపిన చందాన..ఇదిగో ఇలా...
నా తల్లి నీ తల్లి ఒకరికొకరు తెలియరు
నా తండ్రి నీ తండ్రి బంధువులూ కారు
కానీ నువ్వూ నేనూ
ఎలా ఒకరినొకరం కనుగొన్నాం?
మన హృదయాలు ఎర్రమట్టి వాననీరుల్లా
ఎలా ఒకదానిలో ఒకటి కరిగిపోయాయి?
*
అమాయకమైన ప్రేమ, అమాయకంగా తనవాడి చుట్టూ అల్లుకున్న లోకం ఈ కవితల్లో తారసపడినప్పుడల్లా నాకెందుకో పట్టరాని సంతోషం వేసింది. యే ఆర్భాటాలూ లేని పల్లె ప్రపంచాన్ని ప్రకృతిని ఈ కవితల్లో చూస్తే అట్లాంటి జీవితం ఇక దొరికేది ఇలాంటి పుస్తకాల్లోనేనని కూడా గుర్తొచ్చింది. ఈ కవితల్లో ధ్వని..ఆ కవిత చెక్కడంలో ఉన్న చతురత - కవిత్వమంటే మళ్ళీ మోజు పెంచింది.
-
తమ ప్రియులను కనీసం స్వప్నాలలో
దర్శించుకునే వారు ధన్యులు
నీవు నా పక్కన లేకుంటే కలలమాట అటుంచు
నిదురే రాదు నాకు.
*
ఈ జాణని చూడండి -
మగడెంత బ్రతిమాలినప్పటికీ
తన కోపం తగ్గలేదన్న విషయాన్ని
ఆమె బహునేర్పుగా చెప్పగలదు
ఏకాంత మందిరంలో కూడా
మగనికి మర్యాదలు చేస్తోంది.
*
లేత పెదవిని కొరకగా కోపంతో
"ఎంత ధైర్యం నీకు" అంటూ
ద్రాక్షలతల్లాంటి కనుబొమల్ని ముడివేసి
తర్జని ఆడిస్తూ కీచుగొంతుకతో హెచ్చరించే
కోడెవయసు చిన్నదాని నుండి
దొంగిలించిన ముద్దే అమృతం
సాగరాన్ని మథించిన దేవతలు
ఉత్త వెర్రివాళ్ళు.
*
కలహించు, రాజీపడు, సంగమించు
అవన్నీ ప్రేమ దయతో అనుగ్రహించే వరాలు
**
"నా కృష్ణుడు ఇంకా చిన్నపిల్లాడే" అని
యశోద అన్నప్పుడు
గోపికలు కృష్ణున్ని చూస్తూ
ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
*
ఈ నల్లపిల్ల కౌగిలింతలో నాకు
ఇల్లు ఇచ్చే చనువు
ఇంటి భోజనపు సుఖం లభిస్తాయి
*
దూరదేశం నుండి తిరిగొచ్చిన ప్రియుడు
నన్ను మోహావేశంతో ముద్దులాడుతూ
"అంతా బానే ఉంది కదా" అంటూ
అడిగిన రోజులు గొప్పవి
నా ప్రియుడు చెప్పాపెట్టకుండా
వచ్చినరోజు ధన్యమైనది
మధువు నిండిన ఆ రాత్రి పవిత్రమైనది
*
హాలుడు గాథాసప్తశతిని అమృతకావ్యమన్నాడని ఎక్కడో చదివాను. ఈ ప్రాచీన గాథలు చదువుతున్నప్పుడు ఎన్నిసార్లో ఆ మాట జ్ఞాపకం వచ్చింది. పన్నుగ దాని (సరసాన్ని) వర్ణింపలేనట్టి పదములేటి పదములే అన్న మాట ఈ పుస్తకాన్ని చదివితే నిజమనిపించి ఈ పదాల్లో ఇంకొన్ని సార్లు పడిమునకలేయాలనిపించింది. పరిచయానికిట్లా ఈ కాసిన్ని మాటలూ రాయడమే తప్ప, ఏ పుటా నన్ను నిరాశపరచలేదు. అక్కడక్కడా, అరుదుగా, కొన్ని పదాలు, ఇంకాస్త లాలిత్యంతో నిండి ఉంటే ఆ అపురూపమైన భావం మరింత గాఢంగా నాటుకునేదేమో అని మాత్రం అనిపించింది. ఈ వర్షం వెలిసిన సాయంత్రం, ఈ చలిగాలులు కోసేస్తున్న సాయంత్రం, ఇట్లా ఈ అందమైన కవిత్వాన్ని చదవడంలో...




సృజనకు దిక్సూచి



శ్రీ అవధానుల మణిబాబు కవిగా, విమర్శకునిగా మంచి పేరుతెచ్చుకొని, తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకొన్నారు. వీరి మూడు కవిత్వసంపుటులపై శ్రీ పెండ్యాల కామేశ్వరరావు గారు ఒక సమీక్షా గ్రంథం "అతడిలా అర్ధమయ్యాడు" పేరుతో రచించారు. దీనిని ఆత్మీయుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ గ్రంథాన్ని శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి ఆవిష్కరించగా, శ్రీ మాకినీడి సూర్యభాస్కర్, శ్రీ సి.ఎస్. శ్రీ రాజా రామవరపు లు సమీక్షించారు. ఇంకా డా.కాళ్ళకూరి శైలజ,శ్రీ రామకృష్ణ శ్రీవత్స శ్రీ మార్ని జానకిరాం చౌదరి, శ్రీ కాకరపర్తి, శ్రీ మేకా మన్మథరావు ప్రభృతులు తమ అభినందనలు తెలియచేసారు.
ఈ పుస్తకానికి నేను రాసిన బ్లర్బ్ ఇది....

***

సృజనకు దిక్సూచి
.
శ్రీ అవధానుల మణిబాబు కవిత్వం, విమర్శలో తనదైన ముద్రను ఏర్పరచుకొన్న సాహితీవేత్త. వ్యక్తిగా మృధు స్వభావి. కవిగా స్వాప్నికుడు, సున్నిత భావుకుడు. అంశాన్ని తులనాత్మకంగా తూకం వేస్తూ లోతుగా మూల్యాంకనం చేయగల విమర్శకుడు. నిరంతర అధ్యయనశీలి. శ్రోతలను తనతో పాటూ అనుభూతి పడవలో ప్రయాణం చేయించగల చక్కని వక్త. అది ఆథ్యాత్మిక ప్రసంగమైనా, ఆధునిక కవిత్వంపై ఉపన్యాసమైనా. వీరు రాసినపుస్తకాలు మొత్తం పది. వేటికవే వైవిధ్యభరితమైనవి. ఎంత గొప్ప రచన చేసినా అంతకంత ఒదిగి ఉండటం, ఆదరణ, ఆర్థ్రత లాంటి లక్షణాలు శ్రీ మణిబాబును ఉన్నతంగా నిలుపుతాయి.
ఈ పుస్తకరచయిత శ్రీ పెండ్యాల కామేశ్వరరావు నాలుగు దశాబ్దాలపాటు ఆధునిక ఆంగ్లసాహిత్య అధ్యయనం, బోధన చేసిన నిష్ణాతులు. సాహిత్యసభలలో శ్రీ కామేశ్వరరావు గారిని తరుచుగా చూస్తుంటాను కానీ, వారిలో సాహిత్యంపట్ల ఇంత అపారమైన అనురక్తి, లోతైన విశ్లేషణాశక్తి ఉన్నాయని తెలియదు. వారు శ్రీ మణిబాబు రచనలలోంచి “బాటే… తన బ్రతుకంతా”, “నాన్న…పాప”, “నేనిలా….తానలా”, “నింగికి దూరంగా… నేలకు దగ్గరగా” కవిత్వసంపుటులలోని కవిత్వంపై అద్భుతమైన ఆత్మీయపరామర్శ చేసారు. ఈ వ్యాసాలను “అతడిలా అర్ధమయ్యాడు” అనే పేరుతో పుస్తకంగా వెలువరిస్తున్నారు. ఈ విశ్లేషణాత్మక సమాలోచనలో శ్రీ కామేశ్వరరావు చేసిన పరిశీలనలు శ్రీ మణిబాబు కవిత్వంలోని తాత్వికతను, కవితాలక్షణాలను, సామాజిక స్పందనను ప్రతిబింబిస్తాయి.

శ్రీ మణిబాబు కవిత్వాన్ని శ్రీ కామేశ్వరరావు దర్శించిన తీరు వారి వాక్యాలలో….

• విషాదానికి తాత్వికత జోడించడం ఋషి లక్షణం. భారతియ చింతనా మర్మం అది. మణిబాబుకి ఆ చింతన బాగా వంటపట్టింది.

• కవితావస్తువు ఎంపిక విషయంలో ఈయనకో ప్రణాళిక ఉంటుందనిపిస్తుంది. పూలన్నీ రాశిగా పోసి కావలసిన పూలను, ఒకదాని తర్వాత ఒకటి ఏది ఉంటుందో, ఉండాలో ఎంచి అల్లినట్లు ఒకదండలా కవిత్వం చెప్పడం ఆయన కవితాలక్షణం.

• వేర్వేరు కార్యక్షేత్రాలలోని విషయాలను సమన్వయం చేయడంలో కవి విజయవంతం అయ్యాడు;
• కవి సమూహంలోను ఉంటాడు. తనకు తానుగానూ ఉంటాడు; కవి ముద్ర, సమాజపు బ్రతుకు బాటలో, బలంగా పడాలి. మార్గదర్శకం కావాలి

• మణిబాబు గారి కవితల పుస్తకం ముఖచిత్రం చూడండి. “బాటే… తన బతుకంతా”. ఏడు అడుగులుంటాయి. గుబురునీడలలో సాగే పయనమది. నిండారా పచ్చదనం. స్నేహం సప్తపదీనాం. మణిబాబుగారి వ్యక్తీకరణలన్నీ ఇలాగే ఉంటాయి.

పై వాక్యాలు శ్రీ మణిబాబు కవిత్వతత్వాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి. అవి ప్రశంసలు కావు, పరిశీలనలు.

ఏ కవికైనా సహృదయుడైన పాఠకుడు దొరకటం గొప్ప అదృష్టం. అలాగే ఒక విశ్లేషకుడు, కవి తన కవిత్వంలో నిగూఢంగా దాచిన అర్ధాలను, నిక్షిప్తం చేసిన రహస్యాలను, పొదిగిన సొగసులను విప్పిచెప్పి కొన్ని సార్లు ఆ కవినే విస్మయపరచినపుడు అలాంటి కవిత్వం ధన్యతనొందినట్లే. ఆమేరకు శ్రీ మణిబాబుకు అభినందనలు.
తన లోతైన విశ్లేషణల జోడింపుతో తెలుగు విమర్శనారంగానికి కొత్త వన్నెలద్దుతూ, సిసలైన సృజనకు దిక్సూచిగా నిలిచిన శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కారములు
భవదీయుడు

బొల్లోజు బాబా









Monday, September 1, 2025

చరిత్రపుటలలో – కోరంగి మహాపట్టణం

        కాకినాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరంగి గొప్ప చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఒకనాటి రేవుపట్టణం. క్రీస్తుపూర్వకాలం నుండి ఇరవయ్యో శతాబ్ద ప్రారంభం వరకూ కోరంగి ఓడరేవుగా, నౌకాపట్టణంగా, నౌకా నిర్మాణ కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది.


1. గత వైభవం

    సముద్రంలోకి నాలుక ఆకారంలో చొచ్చుకొని ఉన్న భూభాగాన్ని Cape (మూలాగ్రము) అని అంటారు. కోరంగి సహజసిద్ధంగా ఏర్పడిన ఒక Cape. క్రీశ మొదటి శతాబ్దానికి చెందిన రోమన్ చరిత్రకారుడు Pliny, గంగానదీముఖము నుండి 625 రోమన్ మైళ్ల దూరంలో Cape Calingon అనే ప్రముఖ రేవుపట్టణం ఉందని పేర్కొన్నాడు. దాన్ని కోరంగిగా Cunningham, Fergusson వంటి చరిత్రకారులు గుర్తించారు. కాలక్రమేణా తీరము విస్తరించటం, ఇసుక మేటలు వేయటం వల్ల ప్లీని వర్ణించిన కోరంగి రేవుపట్టణం నేడు సముద్ర తీరానికి దూరంగా జరిగింది.

    ప్లీని వర్ణించిన Cape Calingon అనేది నేటి కళింగపట్నం రేవు ఎందుకు కాకూడదని అనిపించవచ్చు. కానీ ఆ అవకాసం లేదు ఎందుకంటే గంగానదిముఖద్వారం నుండి కళింగపట్నం సుమారు 400 రోమన్ మైళ్ళు మాత్రమే ఉండగా (1 రోమన్ మైల్=1.47కిమీ). కోరంగి సుమారు 610 రోమన్ మైళ్ల దూరంలో ఉన్నది. ఇది ప్లీని చెప్పిన 625 రోమన్ మైళ్లతో సరిపోతుంది. అంతే కాక ఒకప్పుడు కళింగ సామ్రాజ్యం ఒరిస్సానుంచి గోదావరి వరకూ తూర్పు తీరం అంతటా విస్తరించి ఉండేది. కోరంగి కళింగ సామ్రాజ్యంలో ఒక భాగం ఆనాడు. కనుక Cape Calingon కోరింగ అనటం సబబుగానే అనిపిస్తుంది.

    ఒకటో శతాబ్దానికి చెందిన పెరిప్లస్ అనే గ్రీకు నౌకాయాన గ్రంథంలో ఒక గోదావరి రేవు నుంచి నిత్యం మలేషియాకు నౌకలు ప్రయాణంచేస్తున్నాయి, దానికి సమీపంలో అల్లోసినె (Allosygne) అనే పెద్ద పట్టణం కలదు అని వర్ణించాడు. Mccrindles అనే చరిత్రకారుడు ఆ రేవుపట్టణం కోరింగ కావొచ్చునని ఊహించాడు. [1] కోరంగికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఆర్యావటం అనే ప్రముఖ బౌద్ధ క్షేత్రం కలదు. బహుసా టొలెమి చెప్పిన అల్లోసినె పట్టణం ఆర్యావటం కావొచ్చు.

    కోరంగి రేవుపట్టణం నుండి రోమ్, ఈజిప్టు లకు భారీగా వర్తకం జరిగేది. ఎక్కువగా సుగంధపరిమళాలు, మిరియాలు, యాలకులు, నీలిమందు, ఉక్కు, వజ్రాలు, ముత్యాలు, పత్తి, ఏనుగుదంతాలు, చందనము ఎగుమతి జరిగేది. సముద్రవ్యాపారం కారణంగా అపరిమితమైన బంగారం రోము నుండి భారతదేశానికి చేరిపోతున్నదని ప్లీని, హిప్పాలస్ వంటి వారి చరిత్రకారులు ఆందోళన వ్యక్తం చేసేవారు. కోరంగి రేవుద్వారా జరిగిన విదేశీ వాణిజ్యానికి సాక్ష్యంగా కోరంగి సమీపంలో కల మట్లపాలెం వద్ద రెండో శతాబ్దానికి చెందిన రోమను నాణెములు లభించాయి [2]. రేవు పట్టణములలో రాజు తరపున సుంకకరణములు అనే రాజోద్యోగులు ఉండేవారు. వీరు విదేశీ ఓడలకు రక్షణ కల్పించినందుకు, వ్యాపారులమధ్య ఘర్షణలు రాకుండా చూసినందుకు, మోసములు జరుగకుండా ఖచ్చితమైన తూకములు అమలుజరిపించేందుకు, ఓడదొంగలనుండి కాపాడేందుకు సరుకుల విలువలో నూటికి పది వంతులు చొప్పున రేవు సుంకము వసూలు చేసేవారు.

    అయిదవ శతాబ్దంలో రోమను సామ్రాజ్యం పతనమయ్యాకా, కొంతకాలం భారతదేశం నుండి జరిగే విదేశీ వాణిజ్యం మందగించింది. కానీ ఈ ప్రాంత వ్యాపారులు కొత్త వ్యాపార అవకాసాలను వెతుక్కొన్నారు. కోరంగి నుండి చైనా, జపాను, బర్మా, మలేషియా, జావా సుమత్రా లాంటి తూర్పు దేశాలను చేరి అక్కడి వారితో తమ వ్యాపారాలను కొనసాగించారు.

    క్రీశ. పదవ శతాబ్దములో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన రాజరాజ నరేంద్రుడు వేయించిన నాణెములు బర్మా దేశములో ఇసుకలో కూరుకుపోయిన ఒక ఓడ శిధిలములమధ్య లభించటాన్ని బట్టి ఆ తరువాత కూడా కోరంగి రేవు ప్రముఖ వ్యాపారకేంద్రంగా ఉండేదని ఊహించవచ్చును [3]. పదమూడవ శతాబ్దములో ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయపాలకులు రేవులలో క్లుప్తశుంకమును (ముప్పదింట ఒకవంతు. అంతకుపూర్వం ఇది నూటికి పది వంతులు ఉండేది) ప్రవేశపెట్టి నౌకా వ్యాపారాన్ని ప్రోత్సహించారు. కాకతీయులు కృష్ణా తీర రేవులను ఎక్కువగా ప్రోత్సహించారు.
    ఈ కాలములో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపొలో కృష్ణా, గోదావరి రేవుల నుండి పెద్ద ఎత్తున విదేశీ వర్తకము జరుగుతున్నదని అన్నాడు. అంతే కాక ఇక్కడి ఓడలు చాలా బలమైనవని, పెద్దవిగా ఉన్నాయని; ఒక్కొక్క ఓడా అయిదారువేల మలగల (మలగ అనగా ఒక ఎద్దుమోయగల బరువు) మిరియములను మోయసామర్ధ్యము కలిగినవని; ఓడను నడుపుటకు మూడువందలమంది నావికులు ఉండాలని; ఓడ అడుగుభాగమున గదుల వంటి నిర్మాణములు కలవని, రాళ్లు లేదా తిమింగముల వలన ఏ గదికి దెబ్బతగిలితే ఆ భాగముమాత్రమే చెడిపోవును తప్ప ఓడ మునిగిపోయే ప్రమాదము లేదని అన్నాడు [4] . మార్కోపోలో కోరంగి అని ప్రత్యేకముగా ప్రస్తావించకపోయినా ఇక్కడకూడా నౌకా వ్యాపారం జరిగే ఉంటుందని ఊహించవచ్చును.

    ఆ తరువాత వచ్చిన నిజాం పాలకులు మచిలీపట్నాన్ని ప్రముఖ ఓడరేవుగా ప్రోత్సహించటం వల్ల క్రమక్రమంగా కోరంగిరేవు ప్రాభవం కొంత మసకబారినా అది ఏనాడూ మూతపడలేదని అనేక ఆధారాలు లభిస్తాయి.

   1619 జూలై నెలలో మచిలీపట్నం నుండి కెప్టైన్ Martin Pling నాయకత్వంలో సూరత్ కు బయలుదేరిన ఒక ఓడ, వాతావరణం సహకరించక కోరంగిరేవులో కొన్ని వారాలపాటు నిలిపి ఉంచవలసి వచ్చిందట. ఈ ఉదంతం ద్వారా కోరంగి రేవు అప్పటికి ఓడలకు కొన్ని వారాలపాటు ఆశ్రయం ఇచ్చే ఒక రేవు పట్టణంగా ఉండేది అని అర్ధం చేసుకొనవచ్చును [5].

    1666 జూలై లో ఒక ఓడ లోని సరుకులు ఎవరికి చెందాలి అనే అంశంపై వచ్చిన ఒక వివాదంలో మచిలీపట్నం వ్యాపారులు బెంగాలులో ఉండే కంపనీ అధికారులకు వ్రాసిన ఒక లేఖలో కోరింగ ప్రాంతానికి ‘మహమ్మద్ బేగ్ అనే వ్యక్తి సుబేదారుడు’ గా ఉన్నాడు అని చెప్పటాన్ని బట్టి కోరంగి రేవు గోల్కొండ నవాబు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది [6]. (ఈ మహమ్మద్ బేగ్ 1670-1676 మధ్య రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకొని, నిజాం ప్రభువు ప్రతినిధిగా వేంగిరాజ్యాన్ని పాలించినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తున్నది)

    ఆ తదుపరి కాలంలో నెలకొని ఉన్న రాజకీయ అస్థిరతల వల్ల కోరంగి నుండి జరిగే నౌకా వ్యాపారం క్షీణించింది. ఓడదొంగల దుర్మార్గములు పెరిగిపోయినవి. విదేశీ నౌకలు రేవులను చేరుటకు భయపడే పరిస్థితి వచ్చినది.

       కోరంగికి సమీపంలో ఉన్న ఇంజరం బ్రిటిష్ వారికి ఒకనాటి ప్రముఖ వర్తక కేంద్రం. ఇంజరంలో నివాసముండే ఈస్ట్ ఇండియా కంపనీ ప్రతినిధి అయిన జాన్ సాండర్ సన్ 1731, ఏప్రిల్ 7 న వ్రాసిన ఒక ఉత్తరంలో కోరంగికి సమీపంలో డచ్చి వారు ఒక స్థావరాన్ని నిర్మించుకోనున్నట్లు తెలిసింది, మనం కూడా అక్కడ ఏదైనా గొడౌన్ నిర్మించుకోగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని పై అధికారులకు విన్నవించాడు [7] .

    1739 జూన్ 1 న ఇంజరం కంపనీ ప్రతినిధి Rich Prince వ్రాసిన ఒక ఉత్తరంలో బ్రిటిష్ వారు ఇంజరంలో కొనుగోలు చేసిన కాటన్ వస్త్రాలను రోడ్డుమార్గం గుండా కోరంగి రేవుకు చేరవేసి అక్కడ నుంచి ఎగుమతి చేయటం ఇబ్బందిగా ఉందని, వర్షాకాలంలో రోడ్డుమార్గంపై సరకులను చేరవేసేటపుడు తడిచిపోయి పాడయిపోతున్నాయని చెప్పాడు.

    1751, జనవరి 6 న ఇంజరంలో నివసించే ఈస్ట్ ఇండియా ప్రతినిధి వెస్ట్ కాట్ (Mr. Westcot) వ్రాసిన ఒక లేఖలో స్థానిక రాజు (పూసపాటి పెదవిజయరామరాజు) కోరంగిని సాలుకు 120 పగోడాల చొప్పున గోల్కొండ నవాబు నుండి కౌలుకి తీసుకొన్నాడు. అదే ధరకో కొంచెం ఎక్కువకో మనం తీసుకోగలిగితే మన వ్యాపారాలకు కోరంగి రేవు ఎంతో ఉపయోగపడుతుందని, తనకు అనుమతి ఇస్తే ముందుకు వెళతానని - అంటూ తన ఉన్నతాధికారులకు విన్నవించుకొన్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో వ్రాసిన మరో ఉత్తరంలో కోరంగిని కౌలుకు తీసుకోవటం విషయంలో తన ఆలోచనను సమర్ధించినందుకు వెస్ట్ కాట్ ధన్యవాదాలు చెప్పినట్లు ఉండటాన్ని బట్టి ఈస్ట్ ఇండియా గవర్నరు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఉంటారని భావించాలి.

    1753 ఫిబ్రవరి 1 వ తేదీన వెస్ట్ కాట్ ఉన్నతాధికారులకు వ్రాసిన ఒక లేఖలో - రాజుగారి నుండి కోరింగ రేవు పట్టణాన్ని ఏడాదికి రెండువందల అరవై పగోడాల మొత్తానికి కౌలుకు తీసుకొన్నానని, కోరంగి రేవును స్వాధీనం చేసుకొన్నానని; అంతే కాక ఇక్కడ దిగే ఓడలకు మూడు సంవత్సరాలపాటు సుంకం చెల్లించక్కరలేదని ప్రకటించానని, అలా చేయటం ద్వారా వివిధ దేశాలకు చెందిన నౌకలు ఇక్కడకు వస్తాయని తద్వారా ఎక్కువ వ్యాపారం చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు [8]. కోరంగి రేవుపట్టణాన్ని కౌలుకు ఇప్పించటంలో సహకరించిన వారికి 66 పగోడాల బహుమతులను ఇచ్చినట్లు 1756 నాటి కంపనీ జమా ఖర్చులలో ఉండటం ఆనాటి సమాజంలో ఉన్న అవినీతిని పట్టిచూపుతుంది [9] .

        అంతవరకూ ఇంజరంలో ఉంటూ వ్యాపారాలు చేసిన వెస్ట్ కాట్ కోరంగికి తన మకాం మార్చి 1759 లో కోరంగి కాలువకు తూర్పువైపున అనేక నూతనభవనములు, గిడ్డంగులు నిర్మించాడు. వెస్ట్ కాట్ అభివృద్ది పరచిన ఈ ప్రాంతం కొత్తకోరంగి గా పేరుగాంచినది. కోరంగి కాలువకు పశ్చిమఒడ్డున కల ప్రాచీన కోరంగిపట్టణాన్ని పాతకోరంగిగా ప్రజలు పిలుచుకొంటున్నారు.
    వ్యాపారనిమిత్తం భారతదేశం వచ్చిన ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు వర్తకుల మధ్య పద్దెనిమిదో శతాబ్దంలో విపరీతమైన పోటీ ఉండేది. ఒకరినొకరు బద్ద శత్రువులుగా చూసుకొనేవారు. ఆనాటి అరాచక పరిస్థితులను 1789 లో కోరంగిని సందర్శించిన Mr. Topping అనే బ్రిటిష్ వ్యాపారి కళ్లకు కట్టినట్లు వర్ణించాడు – “కోరంగిలో ఇంగ్లీషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు ఓడలు లంగరు వేసి ఉన్నాయి. చెడు ప్రవర్తన కలవారు ఇక్కడ విపరీతంగా సంచరిస్తున్నారు. ఎవరికీ భద్రత లేదు. రాత్రివేళల మద్యం మత్తులో ఎవరు ఎవరిని హత్యచేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఎవరు దోపిడీ చేస్తారో తెలియని పరిస్థితులు కోరంగిలో నెలకొని ఉన్నాయి” అంటూ Mr. Topping తనకు రక్షణ కల్పించమని కంపనీ అధికారులను కోరుకొన్నాడు [10]. పంతొమ్మిదో శతాబ్దం వచ్చేసరికి ఇంగ్లీషు వారు రాజకీయంగా బలపడటంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొన్నాయి.

    బ్రిటిష్ వారు కోరంగి రేవుకు తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొచ్చి, ప్రపంచ ప్రసిద్ధ రేవుపట్టణంగా అభివృద్దిచేసారు. 1802 లో Mr. Ebenezer Roebuck అనే వ్యాపారి ఓడలు నిలుపుచేసే స్థలాన్ని (Dock) ను నిర్మించాడు. Ebenezer Roebuck ఒక లండన్ వ్యాపారి. ఇతను వ్యాపారనిమిత్తం భారతదేశం వచ్చి కోరంగిలో స్థిరపడి వ్యాపారాలు సాగించాడు. ఇతను నిర్మించిన Dock లో 155 అడుగుల పొడవు, 51 అడుగుల వెడల్పు ఉన్న Albatros పేరుగల ఓడకు మరమ్మత్తులు చేయటం అప్పట్లో ఒక రికార్డుగా నిలిచింది ఎందుకంటే కలకత్తా నుండి శ్రీలంక మధ్యలో ఎక్కడా ఇంతపెద్ద ఓడలను నిలుపుచేసే సౌకర్యం ఉండేది కాదు [11]. 1855 లో ఈస్ట్ ఇండియా కంపనీ 62,638 రూపాయిలతో కోరింగ హార్బర్ ను ఆధునీకరించింది. కోరంగి రేవు ద్వారా 1877-78 మధ్య ఎనిమిదిలక్షల రూపాయిల వ్యాపారం జరిగింది [12]. 1845 కోరంగి లైట్ హౌస్ ను నిర్మించారు. దీని నిర్మాణానికి 73 వేల రూపాయిలు ఖర్చు అయ్యాయి. 1855 లో దీని ఎత్తు 20 అడుగులు పెంపుచేసి, ఎక్కువదూరం కనిపించటం కొరకు లైట్ హౌస్ దీపం సామర్ధ్యం పెంచారు. ఈ లైట్ హౌస్ నుంచి వచ్చే కాంతి సముద్రంలో పద్నాలుగుమైళ్లవరకూ ప్రసరిస్తూ నౌకలకు దారిచూపేది. 1902 తరువాత దీనిని వినియోగించటం నిలిపివేసారు. ప్రస్తుతం ఇది కోరంగి మడ అడవులను సందర్శించటానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఒక టూరిస్టు స్పాటుగా ఉంది.

    మద్రాసు గవర్నరుగా పనిచేసిన లార్డ్ కన్నెమెరా 19 డిసంబరు 1889 న మద్రాసులో Sirsa అనే ఓడపై బయలుదేరి మచిలీపట్నం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలను సందర్శన చేసాడు. ఇతను కోరంగిరేవులో దిగి కాకినాడ వెళ్ళిన వివరాలు ఇలా ఉన్నాయి "మచిలీపట్నం నుంచి బయలుదేరి ఆ రాత్రంతా ప్రయాణించి ఉదయానికల్లా కాకినాడకు పదిమైళ్ళ దూరంలో ఉన్న కోరంగి రేవుకు చేరుకొన్నాం. కోరంగి రేవు సందడిగా ఉంది. పెద్ద సంఖ్యలో ఓడలు, పడవలు లంగరు వేసి ఉన్నాయి. దూరంనుంచే యజమానులు తమ ఓడలను గుర్తించేందుకు వీలుగా ఓడలకు వివిధ రకాల రంగురంగుల జండాలు ఎగురుతూన్నాయి. జిల్లా కలక్టర్ Mr. Power వచ్చి ఓడలో గవర్నరుగారిని కలిసాడు. అప్పటికే సిద్ధం చేసిన ఆవిరి పడవ ఎక్కి కాకినాడ చేరుకొన్నాము [3]. " పై వివరాలనుబట్టి 1889 నాటికి కోరంగి రేవు ప్రధాన జలమార్గంగా, ఓడరేవుగా ఉన్నట్లు అర్ధమౌతుంది.

    1901 లో బ్రిటిష్ ప్రభుత్వం Mr. Brown అనే ఇంజనీరు ఆధ్వర్యంలో కోరంగి వద్ద తెరుచుకొనే వంతెన (Bascule Bridge) ను నిర్మించింది. ఓడలు వచ్చినప్పుడు ఈ వంతెన రెండుగా తెరచుకొని సుమారు 50 అడుగుల దారి ఇచ్చేది. ఈ వంతెన తలుపులను పైకిలేపటానికి ఎనిమిదిమంది అవసరపడేదట [14] .

    ఇరవయ్యో శతాబ్దం వచ్చేసరికి కోరంగి రేవులో ఇసుకమేటలు వేయటంతో దానిలోతు క్రమేపి తగ్గనారంభించింది. ప్రతి పదేళ్లకు ఒక అడుగుచొప్పున ఇసుక పేరుకుపోయేదట. పెద్దఓడలు వచ్చినపుడు అవి ఇసుకలో కూరుకుపోయేవి. అందుచేత ఓడల రాక నెమ్మదినెమ్మదిగా తగ్గిపోవటం జరిగింది. 1898-99 నాటికి కోరంగి రేవులోకి ఓడలరాక పూర్తిగా నిలిచిపోయింది. కోరంగి తన వైభవాన్ని కోల్పోవటంతో కాకినాడ నౌకాశ్రయం క్రమేపీ దీని ప్రాభవాన్ని అందిపుచ్చుకొని ప్రధాన రేవుపట్టణంగా ఎదిగింది.

2. కోరంగి ఒకనాటి నౌకా నిర్మాణ కేంద్రం

        పూర్వం నౌకల నిర్మాణం, మరమ్మత్తులకు కోరంగి ప్రపంచవ్యాప్త కీర్తి గడించింది. 500 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యం కల ఓడలు ప్రతీ ఏటా వందకుపైగా తయారయ్యేవి. అంతే కాక ఈ సంఖ్యకు నాలుగురెట్లు ఓడలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. నౌకానిర్మాణానికి ప్రధాన ముడిసరుకు టేకు కలప. గోదావరి జిల్లాలోని అడవులలో టేకు కలప విస్తారంగా కలదు. ఇది ఇతర ప్రాంతాలలో దొరికే టేకు కన్న తక్కువ ధరకు లభించటవల్ల కోరంగిలో నౌకా నిర్మాణ పరిశ్రమ బాగా అభివృద్ధిచెందింది. అంతే కాక కోరంగి నుంచి ప్రతీఏటా 2000-3000 టేకు దూలాలు కోరంగి ఇతరప్రాంతాలకు ఎగుమతి జరిగేది. 1793 లో Hamilton అనే ఈస్ట్ ఇండియా వ్యాపారికి కోరంగిలో వెయ్యి టేకుదూలాలను నిలువ చేయగలిగే గొడౌన్ ఉండేదంటే ఏ స్థాయిలో ఇక్కడ కలప వ్యాపారం జరిగిందో అర్ధం చేసుకొన వచ్చును [15]. నేటికీ కోరంగిలో వందగదుల బిల్డింగ్ పేరుతో కొన్ని శిథిలాలను చూపిస్తారు స్థానికులు అది ఒకనాడు ఇక్కడ జరిగిన లావాదేవీలకు జ్ఞాపకంగా మిగిలిన ఆనవాలు.

        నిజానికి భారతదేశ నౌకాయాన పరిశ్రమ అతి ప్రాచీనమైనది. వేదాలలో నావికా పరిశ్రమ, నౌకా వ్యాపారమును గురించి ప్రస్తావనలు ఉన్నాయి. భుజ్యురాజు ఓడ ప్రమాదమునకు గురయినపుడు అశ్విని సోదరులు తమ నూరుతెడ్ల ఓడలో అతనిని సంరక్షించిన కథ వేదరుక్కులలో కలదు. మహాభారతంలో రాజసూయయోగ సందర్భముగా సహదేవుడు అనేక ద్వీపములను జయించాడని ఉన్నది. వరాహపురాణములో గోకర్ణుడను వర్తకుడు నౌకాయానముచేస్తూ నౌకా భంగానికి గురయినట్లు తెలుపబడింది. నౌకానిర్మాణానికి అనుకూలమైన కలప గురించి, నౌకా లక్షణముల గురించి, వివిధ అవసరాలకు తగినట్లు సుమారు 25 రకాల వివిధ నౌకలనిర్మాణం వాటి మంచి చెడ్డల గురించి "యుక్తికల్పతరువు" అనే గ్రంథంలో మన ప్రాచీనులు విపులంగా వర్ణించారు. మనుస్మృతిలో నౌకా వ్యాపారం చేసేందుకు అనుకూలమైన కాలములు చెప్పారు. రేవుపట్టణంలో ఉండే రాజప్రతినిధి అయిన నావాధ్యక్షుని విధులు -పన్నులు వసూలు చేయటం, నౌకలకు కావలసిన సదుపాయములు కల్పించటం, ఎగుమతి దిగుమతుల్లో అక్రమాలు జరగకుండా చూడటం, ఓడదొంగలనుండి వ్యాపారులకు రక్షణ కల్పించటం- అని చాణక్యుని అర్ధశాస్త్రంలో చెప్పబడింది. శాతవాహనపాలకులు నౌకా చిహ్నాలను తమనాణాలపై ముద్రించుకొన్నారు [16].

        అంతటి ఘన చరిత్ర కలిగిన భారతీయ నౌకా పరిశ్రమ శాస్త్రీయంగా నిర్మించిన ఓడలను తొలిసారిగా చూసిన యూరోపియన్ లు అచ్చెరువొందారు. వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చారు కనుక ఇక్కడ నిర్మించిన నౌకలను విదేశాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున వ్యాపారం చేసారు. కోరంగిలో నిర్మించిన నౌకలు దేశవిదేశాలలో క్షణాలలో అమ్ముడు పోయేవి. ఉదాహరణకు 1814లో కోరంగిలో నిర్మించబడ్డ Lady Hood పేరుకల ఓడ ఫ్రాన్స్ దేశం లో విక్రయించబడింది. 1816లో తయారైన City of Edinurgh ఓడను ఇంగ్లాండు వ్యాపారులు కొనుక్కొన్నారు. 1818 నాటి Isabella ఓడను అమెరికా కు పంపించటం జరిగింది [17] .

        1833 లో కోరంగిలో నిర్మితమైన Charles Eaton అనే ఓడ ఎలా ఉండేదో వివరాలు ఇలా ఉన్నాయి.

        "Charles Eaton 350 టన్నుల బరువును మోయగలిగే సామర్ధ్యము కలిగి ఉన్నది. కోరంగి ఓడరేవు అధికారిగా పనిచేసి 1827 లో ఇక్కడే మరణించిన Charles Eaton పేరును ఈ ఓడకు పెట్టారు. ఈ ఓడ అత్యుత్తమ టేకు తో తయారయినది. రెండు అంతస్థులు కలవు. ఒక్కో అంతస్థు ఎత్తు ఆరున్నర అడుగులు. ఓడముందరి భాగము ఎత్తుగా అందముగా నగిషీలతో ఉన్నది. గదుల మధ్య నడవటానికి పొడవుగా, వెడల్పైన వసారా కలదు. ఓడ వెలుపలి భాగం దృఢంగా ఉండటం కొరకు చెక్కలకు సున్నం, తారులతో రాగిరేకులు తాపడం చేసి ఉన్నవి. ఈ ఓడకు చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, ప్రయాణికులు బసచేసే గదులు పెద్ద ఓడలలో ఉన్నట్లుగా చాలా విశాలంగా, విలాసవంతంగా ఉండి, ప్రతి గదికి ప్రత్యేకమైన Toilet కలిగి ఉండటం. ఈ ఓడను లండన్ మార్కెట్టులో అమ్మకానికి పెట్టగా Gledstanes & Co అనే కంపనీ కొనుగోలు చేసింది" [18].

        కోరంగి ఓడలకు ఉన్న డిమాండ్ కారణంగా నౌకానిర్మాణకారులకు ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చి తయారుచేయించుకొనేవారు. ఉదాహరణకు; 1854 లో Delacombe అనే ఫ్రెంచి వ్యాపారి మాసరయ్య అనే వడ్రంగికి 20 మీటర్ల పొడవైన నౌకను నిర్మించి ఇవ్వటానికి 350 రూపాయిలు అడ్వాన్సుగా ఇచ్చి ఎగ్రిమెంటు చేసుకొన్నాడు [19].

        పై వర్ణనలను బట్టి కోరంగి నౌకా నిర్మాతలు అంతర్జాతీయ ప్రమాణ నైపుణ్యాలను కలిగి ఉండేవారని అర్ధమౌతుంది.

        కోరంగి రేవు వద్దకు అనేక అంతర్జాతీయ నౌకలు మరమ్మత్తుల కొరకు వచ్చేవి. CPT Laplace అనే ఒక ప్రపంచ యాత్రికుడు 1830 జూలై నెలలో కోరంగిలో ఆగి తన 120 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పు కల La Favourite అనే నౌకను మరమ్మత్తు చేయించుకొన్న సంగతిని “Voyage autour du Monde” (Travel around the world) అనే పుస్తకంలో ఇలా గ్రంథస్థం చేసాడు.

        "కోరంగి వద్ద నైపుణ్యం కలిగిన వడ్రంగులు, కమ్మరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. La Favourite చెడిపోయిన చుక్కాని యొక్క లోహఅమరికను జాగ్రత్తగా విప్పి, దాన్ని కరిగించి ఎంతో ఖచ్చితత్వంతో, నైపుణ్యంగా పూర్తిగా కొత్తదానివలె తయారు చేసి తిరిగి ఓడకు బిగించారు. చాలా చవకగా, తక్కువ సమయంలో ఓడకు వీరు చేసిన ఇది ఇంకా ఇతర మరమ్మత్తులు నాకెంతో సంతృప్తిని ఇచ్చాయి" అంటూ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన లాప్లాస్ కోరంగి ఓడలు నిర్మించేవారి పనితనాన్ని గురించి చేసిన వ్యాఖ్యలు విలువైనవి.

        తుఫానులు, వరదలు, ఉప్పెనల కారణంగా ఏర్పడ్డ ఇసుకమేటల వలన ఇక్కడి నౌకా నిర్మాణ, మరమ్మత్తుల వ్యాపారం కాలక్రమేణా క్షీణించింది. అంతేకాక ఆవిరి ఓడల రాకవల్ల తెరచాపలపై ఆధారపడి నడిచే ఓడలు తమ ప్రాముఖ్యతను కోల్పోవటం కూడా మరో కారణము. గతవైభవానికి చిహ్నంగా కోరంగి సమీపంలో కల తాళ్లరేవులో పడవల నిర్మాణం ఇంకా నేటికీ కొనసాగుతున్నది.

3. కోరంగిని ధ్వంశంచేసిన తుఫానులు ఉప్పెనలు

        కోరంగి తీరప్రాంతంలో ఉండటం వలన ఉప్పెనల తాకిడి ఎక్కువ. Topping అనే బ్రిటిష్ ఇంజనీరు 1789 లో కోరింగని సర్వే చేసేటపుడు, అతడు స్థానిక ప్రజలను చేసిన విచారణల ద్వారా 1706 లో కోరంగిలో వచ్చిన ఒక ఉప్పెన వల్ల స్వల్ప నష్టం జరిగిందని, ఆ తరువాత 1787 మే 20 న వచ్చిన ఉప్పెన మహా ప్రళయాన్ని సృష్టించిందని రికార్డు చేసాడు.

        ఈ ఉప్పెన వచ్చిన మర్నాడు ఇంజరంలో నివాసం ఉంటున్న ఇంగ్లీషు అధికారి తన పై అధికారులకు వ్రాసిన ఉత్తరంలో ... “ఉప్పెన వల్ల కోరంగిపట్టణం, చుట్టుపక్కల గ్రామాలు నేలమట్టం అయ్యాయి. బంధువులను కోల్పోయిన ప్రజలు అటూ ఇటూ పరుగులెడుతూ రోదిస్తూ తిరిగుతుండటం హృదయవిదారకరంగా అనిపిస్తుంది. నూతులు చెరువులు ఉప్పునీటితో నిండిపోయాయి. ప్రజలకు తాగునీరు ఎక్కడా లభించటం లేదు. కనీసం ఇరవైవేలమంది ప్రజలు, అయిదులక్షల పశువులు కనిపించటం లేదు. ఆహారనిల్వలు, పంటలు అన్నీ నాశనం అయ్యాయి” అంటూ ఆనాటి ఉప్పెన విధ్వంసాన్ని వర్ణించాడు.

        ప్రపంచయాత్రికుడు లాప్లాస్ తన పుస్తకంలో ఆనాటి విధ్వంసం గురించి ఇలా చెప్పుకొచ్చాడు "తుఫాను ఒక్క రోజులో విలయం సృష్టించింది. తాడెత్తు కెరటం కోరంగిపై విరుచుకుపడింది. ఇరవై వేలమంది ప్రజలు ఆ ఉప్పెనలో కొట్టుకు పోయారు. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. తుఫాను ముగిసాక కోరంగి పోర్టు ఆఫీసరు ఇల్లు, ఓడలు నిలుపు స్థలము తప్ప సర్వం మట్టిలో కప్పబడిపోయాయి. అంతవరకూ ఇక్కడ అన్ని యూరోపియన్ దేశాలకు చెందిన వర్తక స్థావరాలు ఉండేవి. 1787 లో వచ్చిన ఉప్పెనకు ముందు కోరంగిలో ముప్పై వేలమంది నివసించేవారు. అనేక ఎత్తైన భవనాలు ఉండేవి. ఈ రోజు ఏమీ లేదక్కడ " [20].

        1787 నాటి ఉప్పెనకు కోరంగిలో నిలుపుచేసిన ఓడలు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కల రాజమండ్రి వరకు కొట్టుపోయాయంటే ఎంత ఎత్తులో నీరు వచ్చిందో ఊహించుకొనవచ్చును.

        ఆ తరువాత కాలంలో కోరంగిని అతలాకుతలం చేసిన అతి పెద్ద తుఫాను 1839 నవంబరు 16, 17 తారీఖులలో వచ్చింది. ఈ తుఫాను అండమాను నుంచి మొదలై తక్కువ వ్యాసంతో, ఎక్కువ శక్తితో, సుడులు తిరుగే గాలులతో కోరంగిని తాకిందని వాతావరణ శాస్త్రవేత్త Henry Piddington అభిప్రాయపడ్డాడు. ఈ రకపు తుఫానులకు Cyclone అనే పదాన్ని సృష్టించి వాడుకలోకి తీసుకొచ్చాడు
    ఆనాటి రాజమండ్రి కలక్టర్ George Smith ఈ తుఫానుగురించి ”16 వ తారీఖు ఉదయం నుంచీ గాలులు తీవ్రంగా వీచటం మొదలైంది. ఆ రాత్రికల్లా సముద్రం అనేక తీరప్రాంత గ్రామాలను ముంచెత్తింది. సుమారు అయిదువేలమంది మరణించి ఉంటారని అనుకొంటున్నాను” అంటూ తుఫానుపై తన తక్షణ రిపోర్టును పై అధికారులకు తెలిపాడు [21] .

    నవంబరు 27వ తారీఖు Madras Herald అనే పత్రిక ఈ తుఫానును గురించి ఇలా వ్రాసింది “పదహారవ తారీఖు రాత్రి పదకొండు గంటలనుండి గాలుల తీవ్రత పెరిగి ఉదయం 4 గంటలవరకూ బీభత్సాన్ని సృష్టించాయి. ఆ సమయంలో కోరంగిలో కాస్త ఎత్తులో ఉన్న ఒకే ఒక పెద్ద బిల్డింగు, ఇంకా మూడు నాలుగు చిన్న ఇళ్ళు మాత్రమే మిగిలాయి. సర్వం ఆ ఉప్పెనలో కొట్టుకుపోయాయి. సుమారు 20000 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా శవాల కుప్పలు.

    కోరంగికి దానికి నాలుగైదుమైళ్ళ దూరంలో ఉన్న Onagalo ఆలయానికి మధ్య నివాసప్రాంతాలన్నీ నిర్జనమయ్యాయి. (బహుశా చొల్లంగి ఆలయం కావొచ్చు). లైట్ హౌస్ లాంతరు, ఫోకస్ అద్దం పగిలిపోయాయి [22] .

    1839 డిసంబరు 7 వ తేదీ "Bombay Courier" అనే పత్రిక "నవంబరు లో వచ్చిన తుఫాను కారణంగా యూరోపియన్, దేశీయుల ఇళ్ళన్నీ నేలమట్టం అయ్యాయి. కోరంగిలో నేడు చూడటానికి ఏమీ లేవు శిథిలాలు తప్ప. ఒక్క అయిదారు గంటలు మాత్రమే సాగిన విధ్వంసంలో సుమారు 20000 మంది పైగా మృతి చెందారు. ఎటుచూసినా మృతదేహాలు. పెద్ద పెద్ద ఓడలు నదిలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. వందలాది చిన్న పడవలు గల్లంతు అయ్యాయి. " అంటూ 1839 కోరంగి తుఫాను నష్టాన్ని రిపోర్టు చేసింది.

    1839 కోరంగి తుఫాను ఉగ్రత గురించి సమీప ఫ్రెంచి కాలనీ అయిన యానాం అధికారి Colin De Bar పాండిచేరీకి గవర్నరుకు వ్రాసిన లేఖలలో ఇలా తెలియచేసాడు. "ఆ రాత్రి 11 గంటలకు తుఫాను గాలులు తీవ్రతరం కావటంతో ప్రజలు భయాందోళనలకు గురయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవటం మొదలుపెట్టారు. నా అధికారిక నివాసంలోకి నీళ్ళు ప్రవేశించి చాలా రికార్డులు కొట్టుకు పోయాయి. నేనుకూడా నా నివాసాన్ని విడిచి మన్యం వారి మేడపైకి చేరుకొన్నారు. ఫ్రెంచి జండాను ఎగరేసే జండా స్థంభం మొదలులోకి విరిగిపడింది. యానాం, కాకినాడ రాజమండ్రి ప్రాంతాలలో సుమారు 130 నౌకలు ఎక్కడెక్కడికో కొట్టుకుపోయాయి. అనేక వందల పడవల ఆచూకీ లేదు. కొంతమంది వ్యక్తులు, శవాలు తమతమ ఇళ్ళకు కొన్ని కిలోమీటర్ల వరకూ విసిరివేయబడ్డారు. నాలుగొందలమంది తలదాచుకొన్న ఓ ఇల్లు కూలిపోవటంతో అందరూ అక్కడికక్కడే చనిపోయారు " [23]

    కోరంగిలో వచ్చిన ఈ రెండు తుఫానులు ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైనవిగా, గరిష్టస్థాయిలో నష్టాన్ని కలిగించిన వాటిగా నేడు గుర్తిస్తున్నారు. 1839 కోరింగ సైక్లోనులో మూడు లక్షల మంది చనిపోయారని, ఇది ప్రపంచ తుఫానులలో మూడవ అతి పెద్ద తుఫాను అంటూ అనేక ఇంటర్నెట్ సైట్లలో చెప్పబడుతూ ఉన్నది. కానీ ఈ సంఖ్యలకు సంబంధించిన సరైన చారిత్రిక ఆధారాలు కనిపించలేదు.

4. కోరంగి రేవునుంచి జరిగిన వలసలు

    గోదావరి జిల్లాలలో పద్దెనిమిదో శతాబ్దంలో ఆహారపంటలు బదులుగా ఎక్కువలాభాలను అందించే నీలిమందు, పత్తి, చెరకు, పొగాకు, నువ్వులు వంటి వ్యాపార పంటలను పెంచి వాటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే వారు. అలా సంప్రదాయ వ్యవసాయంలో వచ్చిన మార్పు వలన ఆహారధాన్యాలకు కరువు ఏర్పడింది. వ్యవసాయకూలీలకు పనులు లేక తిండిలేక కోరంగి కాకినాడ లాంటి రేవులలో కూలీలుగా మారి జీవనం సాగించేవారు. అనేకమంది కూలీలు ఇక్కడ విలయతాండవం చేస్తున్న కరువునుండి తప్పించుకోవటం కొరకు రంగూను, మారిషస్ ప్రాంతాలకు వలసపోయేవారు. ఎక్కువమంది అక్కడే స్థిరపడిపోయారు. ఇలాంటి వలసలు 1830 ల నుంచి మొదలైంది. కోరంగి రేవునుంచి రంగూను, మలేషియా వెళ్ళి అక్కడ స్థిరపడిన వారిని అక్కడి స్థానికులు నేటికీ కొరంగీలు అని పిలుస్తారు. 1850 ల తరువాత ధవళేశ్వరం ఆనకట్ట కారణంగా వేల ఎకరాలు సాగులోకి వచ్చి ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులు తగ్గాయి. ఆ కాలంలో ఈ ప్రాంతవాసులు మెరుగైన అవకాశాలకొరకు, వ్యాపారం చేయటానికి రంగూను వెళ్ళేవారు. అలా వెళ్ళినవారిలో కోరంగి గ్రామానికి చెందిన శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ ఒకరు. వీరు రంగూన్ వెళ్ళి, వ్యాపారాలు చేసి సంపాదించిన ఎనిమిది లక్షల రూపాయిలతో కాకినాడలో విద్యాసంస్థలు నెలకొల్పమని 1919 లో ఏర్పాట్లు చేసారు. వారి ఆశయాలకు అనుగుణంగా నెలకొల్పిన MSN Charities విద్యాసంస్థలు నేటికీ నడుస్తూ జిల్లాకి తలమానికంగా నిలిచాయి.

5. కోరంగి సాంస్కృతిక అంశాలు

    కోరంగి ఊరికి ఆ పేరెలా వచ్చిందో చెప్పే స్థలపురాణం ఒకటి మెకంజీ సేకరించిన సిద్ధాంతం కైఫియ్యతులో కలదు. "త్రేతాయుగములో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నపుడు గోదావరి తీరంపై కొంతకాలం నివసించాడు. ఒకనాడు సీత ముచ్చట పడిన బంగారు కురంగమును (జింక) పట్టుకోవటానికి దానిని చాలాదూరము వెంటతరిమాడు. అది ప్రాణము విడిచిన ప్రాంతములో ఆ పిమ్మట ఒక గ్రామము ఏర్పడినది. దానిని కోరంగి అని ప్రజలు పిలుచుకొంటున్నారు". ఈ కథ కోరంగి గ్రామనామానికి ఐతిహాస్య సంబంధాన్ని కల్పిస్తుంది.
ఏడవ శతాబ్దంలో కోరంగి కురంగేశ్వరపురము పేరుతో ప్రఖ్యాతిక్కెకిన పట్టణముగా ఉండెను. [24] నేడు కోరంగి సమీపములో ఉన్న తూరంగి వద్ద రాముడు ప్రతిష్టించినట్లు చెప్పబడే తురంగేశ్వర ఆలయము కలదు. కురంగేశ్వర నామం తురంగేశ్వరం గా కాలానుగుణ మార్పు చెంది ఉండవచ్చు.

    తూర్పుతీరంపై నవంబరు నుండి జనవరి మధ్య మధ్య ఉత్తరతూర్పు గాలులు బలంగా వీస్తాయి. భారతీయ పంచాంగం ప్రకారం ఈ రోజులు కార్తీకమాసంలో వస్తాయి. ఈ సమయంలో ఓడలు సరుకులు తీసుకొని తూర్పుదక్షిణ దేశాలకు వ్యాపారనిమిత్తం బయలుదేరేవి. ఓడలపై బయలుదేరివెళ్ళే పురుషులకు వారి కుటుంబస్త్రీలు తీరంవద్దకు వచ్చి ఆనందోత్సాహాలతో వీడ్కోలు చెప్పేవారు. తీరప్రాంతాలలో ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోళ్ళు జరుగుతూ ఒక పండగవాతావరణం ఉండేది. నేటికీ కార్తీకపౌర్ణమిరోజున నౌకాయానంతో సంబంధం ఉన్న ఒరిస్సానుంచి తమిళనాడు వరకూ స్త్రీలు బొమ్మపడవపై దీపాన్ని ఉంచి నదులలోకి విడిచిపెట్టటం ఒక ఆచారంగా పాటిస్తారు. దీనిని ఒరిస్సాలో బాలియాత్ర గా, తెలుగు, తమిళప్రాంతాలలో ఈ పండుగను కార్తీకపౌర్ణమిగా పాటిస్తారు. తెలుగు ప్రాంతాలలో కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే మార్గశిర పాడ్యమి నాడు నదీ స్నానం ఆచరించి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టడం ఆనవాయతి గా ఉన్నది.

    ఇదే విధంగా నీటిలో దీపం ఉంచిన పడవబొమ్మలను విడువటం అనే ఆచారం ఇక్కడ నుంచి మనవాళ్ళు బయలుదేరి ఎక్కడైతే వ్యాపారాలు చేసేవారో అక్కడి దేశాలలో కూడా ఉండటం గమనార్హం. థాయిలాండ్ లో స్త్రీలు నీటిలో బొమ్మపడవలో దీపం ఉంచి విడిచే పండుగను Loykrathong పేరుతో, బాలి లో Masakapan Ke Tukad పేరుతో జరుపుకొంటారు. ఈ సాంస్కృతిక సారూప్యతను వందల సంవత్సరాల క్రితం జరిగిన Cultural Exchange గా అనుకోవచ్చు.
కార్తీక మాసంలో ఆడపడుచులు తమ సోదరులకు భగినీ హస్తభోజనం పేరుట విందు ఏర్పాటు చేసే ఆచారం కూడా తెలుగునాట కనిపిస్తుంది. ఇది బహుసా వ్యాపారాల నిమిత్తం బయలుదేరుతున్న సోదరులకు శుభకామనలు చెప్పటం కొరకు లేదా ఎక్కువ ధనంతో తిరిగి వచ్చి తమకు మంచి బహుమతులు ఇవ్వవలసి ఉంటుంది అంటూ తమ బంధాలను దృఢపరచుకోవటం కావొచ్చు. కారణమేదైనా ఈ పండుగలు నౌకలు ప్రయాణించే నెలలలో రావటం వెనుక ఉండే చారిత్రిక కారణాలను విస్మరించలేం. [25]

        వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే కాలంలో సంక్రాంతి పండుగ జరుపుకోవటం ఎలాంటి ఆచారంగా పరిణమించిందో తూర్పుతీరంలో నౌకా వ్యాపారాలు జరుపుకొనే ఈ కాలంకూడా పండుగల రూపంలో మన సంస్కృతిలో ఒక భాగంగా స్థిరపడటం జరిగింది. ఈ పండుగలు ఒకనాడు ఈ ప్రాంతాలలో జరిగిన నౌకావ్యాపారాల అవశేషంగా భావిస్తారు.

ముగింపు

        కోరంగి సెమెటరీ లో బ్రిటిష్ అధికారులకు చెందిన ఏడు సమాధులు ఉన్నట్లు List of Inscriptions on Tombs in Madras Vol II లో సమాచారం ఉంది. అవి William Clark (1802), A. Meris (1804), Alexander Woodcock (1816), John Eaton (1819), Charles Eaton (1827), William Charles Eaton (1857) వ్యక్తులవి. వీరు కోరింగలో కంపనీ అధికారులుగా పనిచేసి ఇక్కడే గతించారు.

2009 లో ఈ సమాధులను మొత్తం పెకలించి ఆ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిసింది. వాటిని విక్టోరియా సమాధులు అని స్థానికులు పిలుచుకొనేవారట. స్థానిక మాజీ సర్పంచి శ్రీ బుజ్జి గారి సహాయంతో, అతి కష్టం మీద ఎవరో ఔత్సాహికుడు భద్రపరచిన ఒక సమాధి ఫలకం దొరికింది. దానిపై
.
        "Sacred to the memory of Alexander Woodcock, Esq, who departed this life on 19th May 1816, aged 46 and Mary Ann, his infant daughter, who died in March, 1810, aged 11 months" అని ఉన్నది.

        ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్ కోరంగి ఒక పెద్ద ఓడరేవుగా, నౌకా నిర్మాణకేంద్రంగా వెలుగొందిన కాలంలో ఓడరేవు అధికారిగా పని చేసాడు (Master attendant).
1817 నాటి Asiatic Journal and Monthly Register లో ఈ అలెగ్జాండర్ వుడ్ కాక్, Lark అనే ఓడపై కోరంగినుండి మద్రాసు వెళుతూ దారిమధ్యలో చనిపోయాడని ఉంది.
పైన చెప్పిన ఫలకం మద్రాసులో తయారైనట్లు క్రింద రాసి ఉంది. ఆ ఫలకంపై అలెగ్జాండర్ పేరుతో పాటు అంతకు ఆరేళ్ల క్రితం పదకొండునెలల వయసులో చనిపోయిన అతని కూతురు Mary Ann పేరు కూడా ఉండటం గమనార్హం. బహుశా అలెగ్జాండర్ మిత్రులో బంధువులో ఎవరో ఈ ఫలకాన్ని మద్రాసులో తయారుచేయించి ఆ తండ్రి కూతుర్ల జ్ఞాపకార్ధంగా పాతించి ఉంటారు.

        1915 లో గోదావరి జిల్లా చరిత్ర వ్రాసిన హెమ్మింగ్ వే "నేడు సముద్రంలో తీరానికి ఒక మైలు దూరంలో జాలరుల వలలకు ఏవో నిర్మాణాలు తగులుకొంటున్నాయి; పాటు సమయంలో అనేక ప్రాచీన నాణాలు బయటపడుతున్నాయి; సముద్రం లోపలేదో మునిగిపోయిన పట్టణం ఉండే ఉంటుంది" - అంటూ ఈ ప్రాంత ప్రాచీనతకు సముద్రాన్ని సాక్ష్యం చేస్తాడు. భారతదేశ చరిత్రలో జగజ్జేయమానంగా వెలుగొందిన ఒకనాటి కోరంగి, తుఫానులు, సునామీలు, వరదలు వంటి ప్రకృతివైపరీత్యాల కారణంగా పదుల అడుగుల మట్టి క్రింద కప్పడిపోయింది, కొంత సముద్రంలో కొట్టుకుపోయింది. ఏమో నేటి కోరంగి మట్టిపొరల క్రింద ఒకనాటి ఆంధ్రదేశ ఔన్నత్యాన్ని చాటే ఏఏ ఆధారాలు నిద్రిస్తున్నాయో! కానీ పైకి కనిపిస్తూ గతవైభవాన్ని సూచించే ఏ చిహ్నాలూ నేడు ఇక్కడ లేవు. సెమెటరీని కూడా ఇటీవలే పాడుచేసుకోవటం దురదృష్టకరం.

బొల్లోజు బాబా
8/9/2020


Footnotes

1.     1.     Ancient India of Ptolemy by Mccrindles, p.no 68

2.    సేకరణశ్రీ వెంకటేష్ కందులప్రముఖ ప్రాచీననాణెముల సేకర్త

3.    ప్రాచీనాంధ్ర నౌకాజీవనము - భావరాజు వెంకట కృష్ణారావు పే. 61

4.    ప్రాచీనాంధ్ర నౌకాజీవనము - భావరాజు వెంకట కృష్ణారావు 

5.    The English Factories in India 1618-1621

6.    The English Factories in India 1665-1667

7.    Letters to Fort St. George 1731

8.    Letters to Fort St. George 1752-53

9.    Dairy and Consultation book 1756

10.  Madras District Gazetteers, Godavari Vol I by FR Hemmingway p.211

11.   A descriptive & historical account of the Godavery District by Henry Morris, 

12.  Ibid p.40

13.  Narratives of Tours in India by JD Rees

14.  Madras District Gazetteers, Godavari Vol I by FR Hemmingway p. 126

15.  Economic Development of Andhra pradesh 1766-1957 by AV Ramana Rao.

16.  భారత నౌకాపరిశ్రమకర్రి సీతారామయ్య

17.  A Collection of Papers Relative to Ship Building in India By John Phipps p. 174

18.  Charles Eaton: wake for the melancholy shipwreck - Australian maritime history

19.  ఫ్రెంచిపాలనలో యానాంబొల్లోజు బాబా 

20.  Sailors Horn-book by  Henry Piddington

21.  The progress of the development of the law of storms Reid, William పే. 99

22.  Journal of Asiatic society, 1840 p.410

23.  ] ఫ్రెంచిపాలనలో యానాంబొల్లోజు బాబా p.32

24.  ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము చిలుకూరి వీరభద్రరావు పే.24

25.  https://www.ancient-asia-journal.com/articles/10.5334/aa.118/