Friday, November 29, 2024

ప్రార్థనా మందిరాల వివాదం: చట్టం, సమాజం, సమతుల్య దృక్పథం


ఇటీవలి కాలంలో మసీదులు, దర్గాలు, చర్చిల కింద శివలింగాలు ఉన్నాయని, వాటిని తవ్వి బయటపెట్టాలని, హిందువులకు ఆ ప్రదేశాల్లో పూజలు చేసుకోవటానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసే వాదనలు పెరుగుతున్నాయి. ఈ వాదనలు సాధారణంగా మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉండటం గమనార్హం.

ఈ రకమైన ప్రచారాల వెనుక అసలైన ఉద్దేశాలు ఏమిటి?

మతసామరస్యానికి చెక్ పెట్టడం: దేశంలో ఇప్పటికే మెరుగులేని స్థితిలో ఉన్న మతసామరస్యాన్ని పూర్తిగా చెరిపేయడం.

ప్రజల దృష్టిని మళ్లించడం: అసలు చర్చించాల్సిన ముఖ్యమైన ఆర్థిక, సామాజిక సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చి, నిరర్థకమైన వాదనలపై దృష్టి పెట్టించడం.

రాజకీయ లబ్ధి: మెజారిటీ మతాన్ని దేశపు అధికారిక మతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించడం.

చట్టం ఏమంటుంది?

1991లో భారతదేశ పార్లమెంట్ ప్రవేశపెట్టిన Places of Worship Act ప్రకారం,

1947, ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలం ఏ మతానికి చెందుతుందో, అది ఆ మతానికి మాత్రమే చెందుతుంది.

ఈ చట్టం ప్రకారం, ఎటువంటి ప్రార్థనా స్థలాన్నీ ఇతర మతాలకు మార్చడం నిషిద్ధం.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి.

చట్టం రామజన్మభూమి వివాదానికి మినహాయింపు ఇచ్చింది, కానీ దేశంలోని ఇతర అన్ని ప్రార్థనా స్థలాలకు ఈ చట్టం వర్తిస్తుంది.

చట్టాన్ని దాటి బయటకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితి

నేడు కొన్ని వర్గాలు చట్టాన్ని అవమానిస్తూ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను హిందూ మతంలోకి మార్చాలని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి. ఈ చర్యలు సమాజంలో విభజన, ద్వేషాన్ని పెంచడం తప్ప మరేమీ చేయవు.

ఈ తవ్వకాల పరిణామాలు

మన దేశం గొప్ప వైవిధ్యానికి నిలయం. మతం, సంస్కృతి, సంప్రదాయాలలోనూ ఈ వైవిధ్యం ప్రస్ఫుటమవుతుంది.

చరిత్రపరమైన సమస్య: తవ్వకాల్లో హిందూ మతానికి సంబంధించిన వస్తువులు మాత్రమే బయటపడతాయనే నమ్మకానికి ఆధారాలు లేవు.

సామాజిక విబేధం: ఇటువంటి చర్యలు వివిధ మతాల మధ్య విభేదాలను మరింతగా పెంచుతాయి.

సంస్కృతికి వ్యతిరేకం: వైవిధ్యానికి మించిన విలువ మనకు లేదు. మన దేశ సౌందర్యం ఈ వైవిధ్యంతోనే నిలబడింది.

మనకు కావాల్సినది ఏమిటి?

అన్ని మతాలకు సమానమైన గౌరవం, సమాన హక్కులు కల్పించడమే భారత రాజ్యాంగం మూలసిద్ధాంతం.

మతసామరస్యం: ప్రతి మతాన్ని గౌరవించడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం మన బాధ్యత.

చరిత్రను సరిదిద్దడం కాదు: చరిత్రను ఆధునిక రాజకీయ అవసరాలకు ఉపయోగించడాన్ని నిరోధించాలి.

ముగింపు

ఇటువంటి అనవసర వాదనలు మన దేశ బలం అయిన వైవిధ్యాన్ని దెబ్బతీయవచ్చు. మతసామరస్యాన్ని, మన సంప్రదాయ విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చట్టాన్ని గౌరవించడం, వివేకంతో నడుచుకోవడం, విభేదాలను పక్కన పెట్టి సమైక్యతను బలపరచడం అత్యవసరం.

- బొల్లోజు బాబా

Saturday, November 2, 2024

స్వీయ అస్తిత్వం వైపు ....మురళీ కృష్ణ కవిత్వం


సుంకర గోపాల్, పాయల మురళికృష్ణ, అనిల్ డానీ, పుప్పాల శ్రీరాం, కంచరాన భుజంగరావు, లండ సాంబమూర్తి, బాల సుధాకర్ మౌళి, అవధానుల మణిబాబు, మానస చామర్తి, ఎమ్.ఎమ్. మహేష్, సురేంద్రదేవ్ చెల్లి (వీళ్ళు- ఈ సమయాన నాకు తడుతున్న పేర్లు) తెలుగు సాహిత్య రంగాన్ని మెరిపిస్తున్న యువకవి గళాలు. వీరి అభివ్యక్తి నవ్యం, వీరి వస్తు వైవిధ్యం అనంతం. వీరు కవితను నడిపించే శైలి వినూత్నం. ఇప్పటికే కొన్ని భవిష్యత్ కళాత్మక వ్యక్తీకరణ పుటలపై తమ పేర్లు లిఖించుకొన్నారు.
వీరిలో ముగ్గురు ఇప్పటికే శిఖామణి యువపురస్కారాలు అందుకొన్నారు. ఉత్తరాంద్ర కవిత్వ పాయ శ్రీ పాయల మురళీ కృష్ణ నేడు యానాంలో శిఖామణి యువపురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా నన్ను సభకు మురళిని పరిచయం చేయమన్నారు.
సమయం తక్కువ ఉంటుందని ఓ రెండు కవితలను తీసుకొని విశ్లేషించుదామని అనుకొన్నాను. పెద్ద సభ. ఒక కవిత చదవటానికే పరిమితం కావలసి వచ్చింది. నా సాహితీ గురువు శ్రీ శిఖామణి నాకు ఇచ్చిన అవకాశం ఏదైనా నాకు మహదవకాశమే. మొత్తం ప్రసంగ పాఠం. ఇది.
****

స్వీయ అస్తిత్వం వైపు ....మురళీ కృష్ణ కవిత్వం
.
పాయల మురళి కృష్ణ ఉత్తరాంధ్ర జీవితాన్ని ప్రతిభావంతంగా గానం చేస్తున్న యువకవి. ఇతని కవిత్వం సార్వజనీన మానవ ఉద్వేగాలను పదునుగా పలికిస్తాయి. తన ప్రాంతపు విధ్వంసం, పోరాటాలు, జీవన గాయాలు ఇతని కవితావస్తువులు. సమాజం పట్ల నిబద్దత కలిగిన కవి. పదాలతో, ప్రతీకలతో, భావచిత్రాలతో కవితను గొప్ప నేర్పుతో అల్లుతాడు మురళీ కృష్ణ.
శీతాకాలపు తెల్లవారు జామున…. అనే కవిత మురళి కవితా తత్వాన్ని సంపూర్ణంగా ఇముడ్చుకొన్న కవితగా నేను భావిస్తాను. ఈ కవిత శీతాకాలపు పొగమంచును ఒక ఉపమానంగా తీసుకొని, మానవజీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సమస్యలను, ఆశలను వర్ణించింది. చివరకు సూర్యుడు ఉదయించటం ద్వారా సమస్యలను అధిగమించటం అనే ఆశావహ దృక్ఫథంతో కవిత ముగుస్తుంది.

శీతాకాలపు తెల్లవారు జామున….
.
తనమీద వ్యర్థంగా పడేస్తున్న
పాలిథీన్ సంచులు సమస్తాన్ని
గుండచేసి
నేల గాలిలోకి విసిరేసిందా
అన్నట్లుందీ పొగమంచు.
పల్లెను బంధించిన
కంపెనీలన్నీ కలిసికట్టుగా విసర్జిస్తున్న విషంలా
దేహాన్ని చుట్టుముట్టిన చలి
రోడ్డెక్కి ప్రయాణిస్తే చాలు
మింగేద్దామా అన్నట్టు ఎదురుచూస్తున్న మృత్యువు
కళ్ళపై మసక మసకగా
ముసుగులేస్తోంది
ఈ శీతాకాలపు తెల్లవారు జామున
ఎవరో ఆలమందల్ని రోడ్డుమీడకి తోలినట్లు
ఎక్కడికక్కడే అడ్డుతగులుతున్న మంచు తెరలు
ఎదురెదురు వాహనాలు
ఒకదానికొకటి
లాంతర్లు నుదిటిమీద కెక్కినట్లు
చిరుచీకట్లో కాంతులు చిమ్ముతున్నాయి
అడుగడుక్కీ
అవరోధాలు ఎదురవుతున్నప్పుడు
ఆగిపోకుండా సాగిపోవటం
అపాయమే కావొచ్చు
కానీ
కాసింత దూరంలో రానున్న వెలుగు
ఎందుకో నిలువనివ్వదు.
రోడ్డుపక్కనే పడి ఉన్న ఊరకుక్క కళేబరం
వెదజల్లుతున్న దుర్గంధం
ఇంకా చీకటిని గుర్తు చేస్తూనే ఉంది
నిరంతరాయంగా వెళ్తుంటే
ఓ ప్రభాతం ఎదురొచ్చింది
ప్రసరించే రవికిరణాలు
మంచుబిందువుల్ని పటాపంచలు చేసాయి.
అడ్డుతెరలు నమసిపోయి
రహదారి ఎప్పటిలాగే సాధారణం.
అప్పుడనిపించింది
నవజీవన యానంలో
మనసుకి మనసుకీ మధ్య
అడ్డుగోడల్లా నిలిచే
పగా ప్రతీకారాలనే పొగమంచు కురుస్తున్నప్పుడు
రవికిరణాల్లాంటివే కదా కవిత్వాక్షరాలని….


ఏం చెబుతున్నాడు ఈ కవితలో మురళి కృష్ణ

1.శీతాకాలపు పొగమంచు: పొగమంచును పాలిథీన్ సంచులను గాలిలో విసిరేసినట్లు కవి పోలుస్తున్నాడు. ఈ వర్ణన ద్వార మనిషి వాతావరణాన్ని కాలుష్యం చేసినట్లు సూచిస్తున్నాడు.

2.విషపు చలి: పల్లెలో కార్పొరేట్ సంస్థలు విస్తరించి కలుషిత వాతావరణం విషం లా మనిషిని చుట్టుముడుతుందని అంటున్నాడు.

3.రోడ్డుపై మృత్యువు ఎదురుచూస్తుంది: రోడ్డుపై ప్రయాణించే ప్రతి వ్యక్తి వేసే ప్రతి అడుగులో మృత్యువు ఎదురుపడుతుందని హెచ్చరిస్తున్నాడు. రోడ్డుపై ప్రయాణం జీవితానికి ప్రతీక.

4.వెలుగు-ఆశ: వెలుగులు ప్రసరించే రవి కిరణాలే జీవితానికి, కవిత్వానికి ఆశ అని చెబుతున్నాడు.
ఎంతో సరళంగా కనిపిస్తున్నా లోతైనా తాత్వికతను కలిగిన కవిత ఇది.
***

శ్రీ మురళి కృష్ణ బాధ్యత కలిగిన ఒక ఉపాధ్యాయుడు. ప్రతీ ఉపాధ్యాయ కవి తన వృత్తి గురించి ఏదో సందర్భంలో కవిత్వం రాసే ఉంటారు. అలా రాయటం ఒక అనివార్యత. ఒక ఉపాధ్యాయుని కోణం నుండి బడిని, పిల్లలను వారి ఆనందాలను, ఒక ఉపాధ్యాయుని రోజువారీ అనుభవాలను, అతని బాధ్యతలను ఈ కవిత వ్యక్తీకరిస్తుంది.
.
ఈ రోజేం కథ చెప్తారు మాస్టారు!

ఎన్ని విషాదాలనైనా
ఒకపసినవ్వు కడిగి పారేస్తుంది
బడి ప్రాంగణంలో మాత్రమే
బ్రతుకు కల్మష రహితమై కనిపిస్తుంది
ఊరో పెద్దోల్లంతా
పనిగట్టుకొని చెప్పే ఉన్నవీ లేనివీ వినీ వినీ***
మోడు బారిపోతున్న మనిషితనం
ప్రతీ ఉదయం చిలుకలు వాలిన చెట్టులా పులకించే బడిలో
మళ్లీ చివుర్లు తొడుగుతుంది
చదివిన కతల్నీ
నేర్చిన పాటల్ని
పాల బువ్వలా మార్చి
తరగతి గదికి తీసుకెళ్తే
గింజలు తెచ్చిన తల్లి పక్షి చుట్టూ
చేరిన పిల్లల్లా
చిన్నారులంతా నా చుట్టూ
సందేహాలన్నీ
చిట్టి చిట్టి తీగల్లా మారి అల్లుకుంటుంటే
నేను సమాధానాల పందిరా విస్తరిస్తాను
గొంతు మోసుకెళ్ళిన
జంతువుల అరుపుల్నీ
పిట్టల కిలకిలల్నీ
సంచిలోని బొమ్మల అట్టముక్కల్నీ
అన్నీ ఒక్కొక్కటీ విప్పి
పసి కళ్ళల్లో కేరింతల దీపాలు వెలిగించుకోవాలి
అక్షరాలకీ అంకెలకీ
గులకరాళ్ళనీ, చింతపిక్కల్నీ తొడిగింపజేసి
ఆటల్లోనూ పాటల్లోనూ
అభ్యసనాన్ని పూయింపచేయాలి
పేదరాశి పెద్దమ్మలోకీ
అందాల రాకుమారుడిలోకి
పేరు మరచిన ఈగలోకి పరకాయ ప్రవేశం చేసుకుంటూ
పరమానందయ్యగాను
తెనాలి రామలింగడి గాను
మర్యాద రామన్నగానూ
రకరకాలుగా పరిచయం కావాలి
విరామంలో
వేమన పద్యాన్ని అంకెల ఆటనీ కావాలి
“మేకా నిన్ను చంపుతా” నంటూ
పులిలో క్రౌర్యాన్ని చూపించాలి
ఇప్పుడు బడి బాటలోకి
పెద్దోళ్ళెవరూ రానవసరం లేదు
కాన్వెంటు ఆటో ప్రకటన
ఇక్కడ తప్పని సరిగా మూగబోవాలి
బడి చివరిగంట తరువాత
బడి భవనం, నేనూ ఇద్దరం నిస్సహాయులమే
రేపటి ఉదయం వరకూ
రెక్కలు తెగిన పక్షులమే
ఉదయం తొమ్మిదౌతోంది
అదిగో నా బడి పిల్లలంతా
బడికి నాకన్నా ముందే వచ్చి
తప్పిపోయిన నా బాల్యాన్ని
వెదికి పట్టుకొచ్చి పదిలంగా అప్పజెప్పే
జీవన మాధ్యమాల్లా పలకరించారు
“ఈ రోజేం కథ చెబుతారు మాస్టారు…?”

మనం ఎన్నెన్ని ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ బడిప్రాంగణంలోకి ప్రవేశించగానే అవన్నీ ఒక్క పసినవ్వు కడిగిపారేస్తుంది అనే ప్రారంభం ఈ కవికి తన వృత్తి పట్ల ఉన్న పవిత్రభావనను తెలియచేస్తుంది.

ఈ కవితలో విద్యార్ధులు తెల్లని పలకలుగా, తల్లిపక్షి చుట్టూ చేరే పక్షి పిల్లల్లా, పందిరిని పెనవేసుకొనే చిట్టి తీగెల్లా కనిపిస్తారు.

ఉపాధ్యాయుడు- పరమానందయ్యగా, తెనాలి రామలింగడుగా, మర్యాదరామన్నగా, వేమన పద్యంగా, పులీమేకా ఆటలో పులిగా, మిమిక్రీ కళాకారునిగా, మెజిషియన్ గా రకరకాల వేషాలు కడతాడు. ఇవన్నీ ఉదరపోషణార్ధం కాదు, పసి "హృదయపోషణార్ధం".

ఇక బడి అంటే ఎన్ని విషాదాలనైనా కడిగేసే పవిత్ర స్థలం అట. తప్పిపోయిన కవి బాల్యాన్ని వెతికి పట్టుకొని బలవంతంగా అప్పజెప్పే జీవన మాధ్యమం అట.

ఈ కవితలో ఉపాధ్యాయుడి పాత్ర, విద్యపట్ల కవికి ఉన్న సానుకూల దృక్ఫథం, విద్యార్ధులపట్ల ఉన్న అనుబంధం లాంటివాటిని గొప్ప భావోద్వేగ పూరితంగా ఆవిష్కరించారు శ్రీ మురళీ కృష్ణ.
****
ఈ మూడవ కవిత మురళి కృష్ణ రానున్న కవితా సంకలనంలోనిది.

దారిపక్క ఉన్న ఒక చెట్టుకు వేలాడుతున్న ఒక దృశ్యాన్ని ఆధారం చేసుకొని నిర్మించిన ప్రతీకాత్మక కవిత “ఒక చెట్టు – పగిలిన అద్దం.
.
ఒక చెట్టు- పగిలిన అద్దం

దారి పక్క ఏకాంత శోకంలా ఓ చెట్టు
దాని కొమ్మకు వేలాడుతున్న పగిలిన అద్దం
వెళ్తూ వెళ్తూ ఆ అద్దాన్ని చూస్తే
ఏం కనిపించొచ్చు
రాత్రంతా ఎడతెగక కురిసిన చీకటికి
గొడుగు పట్టిన గుడ్డ ముక్క కింద
వెలుగుతున్న ఒంటరి దీపమొక్కటి తప్ప
సౌకర్యమంటే తెలియని నగ్న జీవనం
ఈ చదును చేయబడ్డ మట్టిమీద లిఖించిన
బతుకు సంతకం కనిపిస్తుందా
వలతో కట్టిన దడిలో
జడివానకు నిలవలేక
రెక్కబలం లేని పక్షులు రాల్చిన
పింఛాల అంచున మొలిచిన కన్నీటి బిందువులు
ప్రతిబింబించే దుఃఖం కనిపిస్తుందా
రెండు తపేలాలు మూడు గిన్నెలతో
కాలాన్ని ఈదుతున్న ఆ కుటుంబం
ఆకాశం విసిరిన అగ్గిశకలం సాక్ష్యంగా
భద్రతపై ఎక్కుపెట్టిన ప్రశ్నార్ధకాల్లాంటి
దేహాల చెల్లాచెదురుతనం కనిపిస్తుందా
ఒకవేళ
ఇవేవీ కనిపించలేదూ అంటే
అద్దంతప్ప ఏ పగుల్లూ కనిపించనట్టే
****

దారిపక్క ఏకాంత శోకంలా ఓ చెట్టు అనే ప్రారంభంతోనే ఒంటరితనం, నిరాశాభరిత జీవితాన్ని స్ఫురింపచేస్తాడు కవి.

అద్దం పగిలిపోయినప్పుడు ఏ దృశ్యాలను చూపుతొందో ఒక్కో పదచిత్రాన్ని పేర్చుకొంటూ వెళతాడు.

రాత్రంతా ఎడతెగక కురిసిన చీకటి, ఒంటరి దీపం, మట్టిమీద లిఖించిన సంతకం, రెక్కబలం లేక పక్షులు, రెండు తపేలాలు, మూడు గిన్నెలతో కాలాన్ని ఈదే కుటుంబం, ప్రశ్నార్ధకాలలాంటి దేహాలు….. ఇవంట కనిపించే దృశ్యాలు.

ఈ దృశ్యాల వెనుక ఉన్న దుఃఖం, కష్టం, బాధా, అసమానతలు చూడ లేని చూపు చూపే కాదని చెబుతున్నాడీ కవి.
****

ఇతని కవిత్వంలో ఉత్తరాంధ్ర నేల పల్లవిస్తుంది. దుఃఖం పలుకుతుంది. పల్లెల్లో ఎండిపోయిన చెరువు; అంతర్ధానం అయిపోతున్న పాట;ఊరి మురికిని శుభ్రం చేసే సర్విసింగ్ సెంటర్;ఊరందరకీ సౌభాగ్యాన్ని పంచిపెట్టిన తాత మలారం సంచి; ప్లాస్టిక్ చేస్తున్న విధ్వంసం; సాయింత్రాన్ని ధ్వనించే పిచ్చుకలు; ఊరి మర్రిచెట్టు స్థానంలో మొలిచిన సెల్ ఫోన్ టవర్ లాంటి ఎన్నో వస్తువులు చక్కని కవితలుగా పోత పోసుకున్నాయి ఈ సంపుటిలో.

శ్రీ పాయల మురళీ కృష్ణ శిఖామణి యువ పురస్కారాన్ని అందుకొంటున్న ఈ సందర్భంగా అతనిని అభినందిస్తున్నాను. ఈ అవార్డుకి ఇతనిని ఎంపిక చేయటం సరైన నిర్ణయమని భావిస్తున్నాను. రెండవ పుస్తకం త్వరలోనే తీసుకురావాలని ఆకాంక్షిస్తూ......
ప్రేమతో

బొల్లోజు బాబా





Friday, November 1, 2024

వరహావతారం-గోళాకార భూమి

వరాహావతార శిల్పాలు గుప్తుల కాలంలో చెక్కబడ్డాయి. ఉదయగిరి గుహలలోని 4 వ శతాబ్దపు వరాహ అవతార పానెల్ లో గుప్తరాజులను విష్ణుమూర్తి/పృధ్వీపతి గా పోలుస్తూ ఉత్తరభారతదేశంలో గుప్తుల రాజ్యాధికారాన్ని స్థిరపరచే ఒక పొలిటికల్ మెటఫర్ అని జయస్వాల్ లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
 
భూమి నీళ్ళల్లో మునిగి ఉన్నప్పుడు వరాహావతారం ఎత్తి విష్ణుమూర్తి ఆ భూమిని పైకి తీసాడు. ఈ సందర్భంగా హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. భూమిని స్త్రీగా చెబుతూ వరాహస్వామి ఆమెను పెళ్ళి చేసుకొని ఉద్ధరించాడని పురాణ కథనం. అంటే అంతవరకూ భూమి హిరణ్యాక్షుడు అనే రాజుది అని, అతనిని సంహరించటం ద్వారా అతని రాజ్యాన్ని/భూమిని సొంతం చేసుకొన్నాడని అర్ధం వస్తుంది.
 
దేవాసుర యుద్ధాల ప్రయోజనం ఒకటే భూమి ఆక్రమణ, అధికార విస్తరణ, బడుగువర్గాల అణచివేత అంటారు డా. బి. విజయభారతి గారు. వరాహావతారం కూడా అలాంటిదే.
గుప్తులపాలనలో హిందూమతం రాజ్యమతంగా ఆదరణపొందింది. అందుకనే పండితులు గుప్తుల పాలనను స్వర్ణ యుగం అంటారు.
 
ఈ ప్రాచీన వరహావతార శిల్పాలలో భూమి గుండ్రంగా ఉండదు. వరాహస్వామి భూదేవి రూపంలో ఉన్న స్త్రీ మూర్తిని చేతులతో ఎత్తుకొన్నట్లు ఉంటుంది.

ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి- భూమి గుండ్రంగా ఉంటుందని ప్రపంచం అర్ధం చేసుకొన్నాక వరహావతారం గుండ్రని భూమిని ఎత్తుతున్నట్లు శిల్పాలు చిత్రాలు లిఖించారు. గోళాకార భూమిని ఎత్తుకొన్న వరాహ శిల్పాలు 18 వ శతాబ్దానికి ముందు లేవు. అలా గోళాకార భూమిని ఎత్తుకొన్నట్లు చూపటం చిత్రకారుల తప్పు కాదు. అది కళ.
 
కానీ, ఇటీవల సనాతన వాదులు గుండ్రటి భూమిని ఎత్తుకొన్న వరాహావతార శిల్పం ఫొటోని చూపించి మన పూర్వీకులకు వేలసంవత్సరాలకు పూర్వమే భూమి గుండ్రంగా ఉండేదని తెలుసని. మన సనాతనధర్మ గొప్పతనానికి ఈ శిల్పమే సాక్ష్యమని ప్రచారం చేసారు. అది మోసం.
తీరా చూస్తే అది బాలాసోర్ లో 2009 లో నిర్మించిన జగన్నాథ ఆలయశిల్పం.
 
మోసం, అబద్దాలతో ఎంతకాలం ఇలా మోసగిస్తారు ఈ సనాతనధర్మ అబద్ద ప్రచారకులు

బొల్లోజు బాబా