Thursday, October 28, 2021

మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పు గోదావరి జిల్లా' పుస్తక సమీక్ష

 మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పు గోదావరి జిల్లా' పుస్తక సమీక్ష - 24 అక్టోబరు 2021 సంచికలో ప్రచురితమయింది.

ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలుపుకొంటున్నాను
భవదీయుడు
బొల్లోజు బాబా
***
కొని, దాచుకొని, బహుమతిగా ఇవ్వదగ్గ "మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పుగోదావరి జిల్లా"
కవిగా, రచయితగా ప్రసిద్ధిపొందిన బొల్లోజు బాబాకు చరిత్ర పరిశోధన ఆసక్తికరమైన విషయం. వ్యక్తిగత ఆసక్తితో ఆయన చరిత్ర విషయాలపై పరిశోధిస్తూ చక్కటి విషయాలను ప్రకటిస్తూంటారు. ఆ పరిశోధనలో భాగమే "మెకంజీ కైఫియ్యత్తులు - తూర్పుగోదావరి జిల్లా" అన్న పుస్తకం.
కైఫియత్ అన్న పదానికి పలు అర్ధాలున్నాయి........
మిగిలిన భాగాన్ని ఈ లింకులో చదువుకోగలరు దయఛేసి
లింక్:

Friday, October 22, 2021

"ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" కవర్ పేజ్

 



నా తదుపరి పుస్తకం "ప్రాచీన పట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా" కవర్ పేజ్ ఇది.
అందమైన అర్ధవంతమైన ముఖచిత్రాన్ని, గెటప్ ను అందించినందుకు- థాంక్యూ గిరిథర్ గారు, బాల్యమిత్రుడు చిన్నారి ముమ్మిడి.
తూర్పుగోదావరిజిల్లాకు చెందిన నాలుగు ప్రధాన పట్టణాలు ఇంకా చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఇతర తొమ్మిది పట్టణాల గురించి ఆసక్తికరమైన సమాచారంతో ఈ పుస్తకం ఉంటుంది.
"మెకంజీ కైఫియ్యతులు -తూర్పుగోదావరి జిల్లా" పుస్తకాన్ని ఆదరించినట్లుగానే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
భవదీయుడు
బొల్లోజు బాబా

ఒక apocalypse అనంతరం.....

 ఒక apocalypse అనంతరం.....

అడవి మధ్య పెద్ద మైదానంలో
ఒక గుంపు పోగుబడి ఉంది
పూసలు ధరించిన ఓ ముసలి వ్యక్తి
రాళ్ల మధ్య అటూ ఇటూ తిరిగి
గుండ్రంగా నునుపుగా ఉన్న చిన్న రాయిని ఎంపికచేసి
శుభ్రం చేసిన నేలపై ఉంచాడు.
చుట్టూ నాలుగు పుల్లలు పాతి
పుల్లలపై ఏదో అడవి చెట్టు ఆకులు పేర్చి
ఎదురుగా కూర్చొని ఆ రాయినే చూస్తూ
ఏదో మాట్లాడుతున్నాడు
అతని చుట్టూ అందరూ ఒక వలయాకారంగా కూర్చొని
కనులు మూసుకొని మౌనంగా ఉన్నారు
రకరకాల హావభావాలతో అతనా రాయితో
మెల్లగా మాట్లాడుతున్నాడు- మధ్యమధ్యలో నవ్వుతూ,
ఏడుస్తు, ఒక్కోసారి గంభీరంగా, కొన్ని సార్లు అభావంగా
చివరగా నేలను ముద్దాడి,
తన మనుషులకు నవ్వుతూ సైగ చేసాడు
అందరూ గంతులు వేస్తూ, డప్పులు మోగిస్తూ,
ఆనందించటం మొదలెట్టారు
అతని వద్దకు నెమ్మదిగా వెళ్ళి అడిగాను
ఆ రాయేమిటని
మా దేవుడు
ఎం చేసావు ఇంతసేపూ
మాట్లాడాను
ఏం మాట్లాడావు
పోయినేడు పంపించిన పెద్దలను చల్లగా చూసుకోమని
అడవి పూలు విరగకాయాలని
పిట్టలు, జంతువులూ సంతోషంగా జతకట్టాలని అడిగాను
ఇంకా
జీవులన్నీ పంచుకోగా పళ్ళూ దుంపలు మిగలాలనీ
వానలతో కప్పల నోళ్ళు నిండాలనీ
పుట్టబోయే బిడ్డలకొరకు వారి తల్లుల గర్భాలు గట్టిపడాలని
దేవుడు ఏమన్నాడు?
అలాగేనన్నాడు
మీ దేవుడి పేరేమిటి?
దేవుడు
పేరు
దేవుడికి పేరేమిటి? దేవుడి పేరు దేవుడే!
ఇదిగో జీలుగు రసం తాగు అంటూ
చిన్న తాటాకు దొప్ప చేతిలో ఉంచాడు.
బొల్లోజు బాబా

స్త్రీ

 స్త్రీ

ఎంతకాలం
తన స్వప్నాల్ని
బతికించుకోగలడు
పాపం ఆ కుర్రాడు!
నేత్రాల్ని అమ్ముకొని అంధత్వాన్ని
హృదయాన్ని అమ్ముకొని అల్పత్వాన్ని
కొనుక్కోక తప్పదు ఏనాటికైనా
"నువ్వు ఇదివరకట్లా లేవు
చాలా మారిపోయావు" అంటుందామె ఓ రోజు
కాళ్ల క్రింద నేల కూలినట్లనిపిస్తుంది అతనికి
ఆమె ఒళ్ళో చేరి
వల వలా ఏడ్చేస్తాడు.
ఆమె, తన స్తన్యాన్ని అతని
నోటికి అందించి
ఓదారుస్తుంది.
బొల్లోజు బాబా

బొల్లోజు బాబా - సాహిత్య అనుశీలన

 నేను ఇంతవరకూ

• ఆకుపచ్చని తడిగీతం (2008), వెలుతురు తెర (2016), మూడో కన్నీటిచుక్క (2019) పేరిట మూడు కవిత్వ సంపుటులు
• కవిత్వ భాష పేరుతో కవిత్వ లాక్షణిక వ్యాససంపుటి (2018)
• యానాం విమోచనోద్యమం (2006), ఫ్రెంచి పాలనలో యానాం (2012), మెకంజీ కైఫియ్యతులు-తూర్పుగోదావరి జిల్లా (2020) పేరిట మూడు చరిత్ర పుస్తకాలు
• స్వేచ్ఛావిహంగాలు పేరుతో (2016) విశ్వకవి టాగూర్ స్ట్రే బర్డ్స్ తెలుగు అనువాదం.
ఇదీ దాదాపు పాతికేళ్ల నా సాహితీయానం.
ఈ ebook లో ఉన్నది నా పుస్తకాలపై వచ్చిన వివిధ వ్యాసాలు. చాలా మట్టుకు పత్రికలలో ప్రచురితమైనవి. మిగిలినవి ఆయాపుస్తకాలకు ముందుమాటలు.
ఈ వ్యాసాలన్నీ మరలా తరచిచూసుకొన్నాక నా రచనలన్నింటిలో కవిత్వ సంపుటులను ఎక్కువగా ఆదరించారని అర్ధమైంది.
ఈ వ్యాసాలు వ్రాసినవారికి, ఆయా రచనలను చదివి తమ తక్షణ అభిప్రాయాలను అక్కడకక్కడే తెలిపిన వందలాది మిత్రులకు సదా కృతజ్ఞతలతో
ఇక్కడనుండి దిగుమతి చేసుకొనవచ్చును