Friday, April 14, 2017

ఎలుగెత్తి చాటుదాం

ఎలుగెత్తి చాటుదాం
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
అసంఖ్యాక హృదయాలలో
నిత్యం ప్రకాశించే మార్తాండ తేజుడని
చదువు సమీకరించు పోరాడు అన్న మూడు పదాలలో
మన జీవితాలకు దిశానిర్ధేశనం చేసిన
ఆధునిక భోధి సత్వుడని
వీధి కుళాయి నీళ్ళు తాగనివ్వని వివక్షా తిమిరంతో
జ్ఞానమనే కాంతిఖడ్గంతో సమరం చేసిన
అవిశ్రాంత యోధుడనీ, అలుపెరుగని ధీరుడనీ
"మేం హరిజనులమైతే మీరంతా దెయ్యం బిడ్డలా" అని ప్రశ్నించి
పోరాటాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని
ముక్కుసూటిగా ఎదుర్కొన్న ధీశాలి అని
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
ఎన్ని యుగాలైనా కొండెక్కని పరిమళ దీపమని
మనుస్మృతిలోని నిచ్చెనమెట్లని మొదటగా గుర్తించి దాన్ని
తగలెయ్యమని పిలుపునిచ్చిన గొప్ప సామాజిక శాస్త్రవేత్త అని
హిందూ భావజాలాన్ని ఒక చారిత్రాత్మక మలుపుతిప్పిన చరితార్ధుడని
దేశంలో సగభాగానికి సమానహక్కులు
పోరాడి సాధించిపెట్టిన గొప్ప మానవతా వాది అని
దేశ మహిళలందరకూ ప్రాతఃస్మరణీయుడనీ
తన జాతిపై జరుగుతున్న అణచివేతను లండన్ సమావేశంలో
నిప్పులాంటి స్పష్టతతో ప్రపంచానికి ఎరుకపరచి
తన ప్రజకు ప్రత్యేక అస్థిత్వాన్ని సాధించిపెట్టిన రాజనీతిజ్ఞుడనీ
దీన జనోద్దారకుడనీ
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కరు ఒక అస్తమించని సూర్యుడని
అంబేద్కరిజం అంటే ఆ మహనీయుని
వెన్నెముకతో చేసిన వజ్రాయుధమనీ
స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అనే మూడు సింహాలను
భారత రాజ్యాంగంగా మలచి సామాన్యుడికి కాపలాగా పెట్టిన
అనితర సాధ్యుడనీ, అపార విద్యాపారంగతుడనీ
మానవజాతికి వన్నెతెచ్చిన మేధో శిఖరమని
ఈ శతాబ్దపు మూర్తీభవించిన జ్ఞాన స్వరూపమని
దళిత బహుజనుల జీవితాలలో నీలికాంతులతో వెలిగే ఆరంజ్యోతి అనీ
ఎలుగెత్తి చాటుదాం అందరం
అంబేద్కర్ అంటే ఆత్మవిశ్వాసమనీ
జై భీమ్ అంటే దారిచూపే చూపుడు వేలని
ఎలుగెత్తి చాటుదాం అందరం
బొల్లోజు బాబా
(డా. బి.ఆర్. అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా)

No comments:

Post a Comment