Tuesday, August 25, 2015

అనావృష్టి


పిట్టనోట్లో రెండు బొట్లు
ఆకుల నాలుకలపై
నాలుగు తుంపర్లు
విదిల్చిన మేఘాలు
కొండమలుపులో
అదృశ్యమయ్యాయి.

రెండు ఉతుకులకే
రంగువెలసిన వస్త్రంలా
ఆకాశం మిగిలిపోయింది.

బొల్లోజు బాబా

Wednesday, August 19, 2015

ప్రేమలేఖ


అమ్మా!
పెళ్ళికిముందు నువు నాన్నకు వ్రాసిన ఉత్తరం
భలేగా ఉందే అంటోంది మా అమ్మాయి
ఆశ్చర్యంగా చూస్తూ.
ఏయ్! అది నీకెక్కడ దొరికిందీ?
ఉత్తరాన్ని గబగబా లాగేసుకొంది మా ఆవిడ.


అవును మరి
బట్టలు ఉతికి ఉతికీ
కారేజీలు సర్ది సర్దీ
చీరకట్టుకొన్న కారేజీలా
మారిపోయిన అమ్మే తెలుసు వీళ్ళకు.

అయినా
ఆ ఉత్తరంలో ఏం కనిపిస్తాయి వీళ్ళకు
గుప్పెడు మల్లెలు
ఇదిగో ఇలాంటి సందర్భంకోసం
కన్న ఏవో కొన్ని కలలు తప్ప.

కానీ
ఆ అక్షరాల మధ్య ....
సగం చెక్కిన శిల్పాన్ని
పూర్తిచేస్తానని ఇచ్చిన మాట,
దినాంతాన
నన్ను పడవలో జాగ్రత్తగా పడుకోబెట్టి
పడవనడిపే వానికి
రెండు బంగారునాణేలు ఇచ్చి
భద్రంగా దాటించమని చెప్తానని
చేసిన ప్రమాణమూ
నాకు తప్ప మరెవ్వరికీ
కనిపించవు.

బొల్లోజు బాబా