Friday, June 2, 2023

కాలిన్ మెకంజీ పై దుష్ప్రచారం అనుచితం


ఇటీవల ఒక వాట్సప్ పోస్టులో కాలిన్ మెకంజీ గురించి ఒక విచిత్రమైన కథనం చదివాను. అది ఇలా ఉంది
“””కల్నల్ కాలిన్ మెకంజి గుప్తనిధులకొరకు శ్రీశైల ఆలయంలో తవ్వకాలు జరిపించటానికి వెళ్ళగా అక్కడ ఆ ఆలయాన్ని సంరక్షిస్తున్న 500 మంది చెంచులు విల్లంబులు ధరించి మెకంజీని ఆ ఆలయంలోనికి అడుగుపెట్టనివ్వమని నిరోధించారట. దానికి కాలిన్ మెకంజీ ఆగ్రహోదగ్రుడయ్యాడట. ఈ హఠాత్పరిణామానికి మెకంజి అనుచరుడు బొర్రయ్య ఖంగుతిని మధ్యేమార్గంగా దర్పణాల సహాయంతో మెకంజీకి దైవదర్శనం చేయించి తెలివిగా అతన్ని అక్కడనుంచి తప్పించాడట. ఈ సంఘటన జరిగిన తరువాత మెకంజీ చెంచులపై పగబట్టి, దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా చెంచువారిని దొంగలు అని ప్రచారం చేసి, దరిమిలా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడిని ప్రేరేపించి అతనితో చెంచువారిని సామూహిక హత్యలు చేయించాడట.”””
పై సంఘటన ఎప్పుడు జరిగిందో చెప్పలేదు. ఏ రకమైన చారిత్రిక ఆధారాలు ఇవ్వలేదు రచయిత. ఫుట్ నోట్సులో మాత్రం “ఈ విషయం కాంబెల్ రచించిన ఒక పుస్తకంలో ఫుట్ నోట్సులో ఉన్నట్లుగా దాసు విష్ణురావు గారు వారి వంశచరిత్రలో వ్రాసారు” అని మాత్రం ఇచ్చారు. Campbell భారతదేశ గెజిట్స్ కి సంబంధించి ముప్పైకి పైగా సంపుటాలు కూర్పుచేసాడు. వీటిలో ఏ పుస్తకపు ఫుట్ నోట్సులో మెకంజీ అలా ప్రవర్తించినట్లు ఉందో పేజి నంబరుతో సహా చెప్పటం శాస్త్రీయం. కానీ ఆ వివరాలేమీ లేవు.
.
ఇక పై అభియోగం పై కొంత విశ్లేషణ
.
కల్నల్ కాలిన్ మెకంజి శ్రీశైల పర్వత ఆలయాన్ని దర్శించినప్పటి విశేషాలను, Account of the Pagoda at Perwuttum పేరుతో ఒక వ్యాసం వ్రాసి Asiatic Researches అనే జర్నల్ లో ప్రచురింపచేసాడు.[1]. అవి ఇలా ఉన్నాయి.
//మార్చ్ 14, 1794 – మీకు అభ్యంతరం లేకపోతే నేను శ్రీశైల మల్లికార్జున ఆలయాన్ని సందర్శించాలను కొంటున్నాను [2] అని పంపిన వార్తకు ఆ ప్రాంత రెవిన్యూ అధికారులు రావొచ్చునని వర్తమానం పంపారు. అధికారులు నన్ను పెద్దగా పట్టించుకోకపోయినా బ్రాహ్మణులు నాకు స్వాగతం పలికి నా వెంట ఉన్నారు. ఆలయ గోడలపై ఉన్న శిల్పాలకు చిత్తరువులు తీయించాను.
//వడగాడ్పులు ఎక్కువగా ఉన్నాయి. ఎండ తీవ్రత పెరగేలోపు ఈ ఎగుడుదిగుడు రోడ్డును దాటేయ్యాలనే ఉద్దేశంతో తెల్లవారుఝామునే నా టెంట్లు, ఇతర సామాగ్రి పంపించేసి మరికొన్ని శిల్పాల డ్రాయింగులు చిత్రించే నిమిత్తం నేను ఆలయంలోనే ఉండిపోయాను. సూర్యోదయం అయింది. ఇక బయలుదేరుదామని అనుకొంటూండగా ఆలయ బ్రాహ్మలు, అధికారులు నా వద్దకు వచ్చి- “అయ్యా ఈ ఆలయాన్ని సందర్శించిన మొదటి దొరవారు మీరు, నిన్న శుభకరమైన దినం కాదు కనుక ఆలయం మూసివేయడమైనది, ఈ రోజు పదిగంటలకు ఆలయతలుపులు తెరుస్తారు మీరు మల్లికార్జునిని దర్శనం చేసుకొని వెళ్ళండి” అని కోరారు. వారి కోరిక మేరకు అంతే కాక ఆలయ గర్భగృహంలోకి కాంతి ఏ విధంగా పడుతుంది అనేది స్వయంగా చూడాలనే ఆసక్తి ఉండటంచే ఆలయతలుపులు తెరిచే వరకూ అక్కడే ఉన్నాను.
ఆలయతలుపులు తెరిచారు. ఒక కుర్రవాడు రెండడుగుల వ్యాసం కలిగిన ఒక దర్పణ సహాయంతో సూర్యకాంతిని గర్భగుడిలోకి పరావర్తింప చేయసాగాడు. ఆ దర్పణం చుట్టూ సన్నని చట్రం, పట్టుకోవటానికి ఒక పిడి ఉన్నది.
గర్భగుడి గుమ్మంవద్ద నన్ను నిలిపివేసారు. ఎవరూ అడగకపోయినా గౌరవసూచకంగా నా చెప్పులను విప్పి అక్కడ నిలబడ్డాను. [3]
అనేకమంది నాలాగే గర్భగుడిలో ఏముందో చూడాలని ఆసక్తిగా నా చుట్టూ గుమిగూడారు. దర్పణం ప్రతిబింబించే కాంతిలో లిప్తపాటు వలయాకార నల్లని కంకణాలతో ఉన్న ఒక శివలింగం కనిపించింది. దానిని చూసాక నా కుతూహలం శాంతించింది//.
.
పై వ్యాసంలో– మీకు అభ్యంతరం లేకపోతే ఆలయాన్ని చూడాలనుకొంటున్నాను; స్వచ్ఛందంగా చెప్పులు విప్పటం; గర్భగుడి వెలుపలనుంచే దర్శించటం; లాంటి చర్యల ద్వారా కాలిన్ మెకంజీ - హిందూమతం పట్ల ప్రదర్శించిన గౌరవం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
.
పైన ఉదహరించిన వాట్సప్ కథనంలోని అసంబద్దతలు
.
1. 500 మంది చెంచులు దాడిచేయటమనే ఉదంతం దానికి మెకంజీ అగ్రహోదగ్రుడవటం మెకంజీ వ్రాసిన Asiatic Researches అనే జర్నల్ వ్యాసంలో ఎక్కడా లేదు. మెకంజీ ఆ విషయాన్ని దాచిపెట్టి ఉంటాడని అనుకోవటానికి ఆస్కారం తక్కువ, ఎందుకంటే Asiatic Researches అనేది ఆనాటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ జర్నల్. మెకంజీ స్థాయి అధికారులు సత్యాలను దాచిపెట్టి తమ క్రెడిబిలిటీ పోగొట్టుకొంటారని భావించలేం.
2. చెంచుల దాడిని ఊహించని బొర్రయ్య మధ్యేమార్గంగా మెకంజీకి దర్పణాలద్వారా దైవ దర్శనం చేయించటం.
మెకంజీ శ్రీశైల ఆలయాన్ని దర్శించింది మార్చ్ 14, 1794 తారీఖున. అప్పటికి బొర్రయ్య మెకంజీ సహాయకుడు కాడు. మెకంజీ వద్ద కావలి బొర్రయ్య సహాయకునిగా 1796 లో చేరాడు. [4]. లేని బొర్రయ్య తిరగబడ్డ చెంచులను చూసి ఖంగుతినటమేమిటో, మెకంజీని తెలివిగా తప్పించటమేమిటో ఆ వాట్సప్ మేధావి కల్పనాశక్తికే తెలియాలి.
దర్పణాల ద్వారా కాంతిని పరావర్తింపచేసి మూలవిరాట్టుని దర్శింపచేయటం ఒకనాటి ఆచారం. నేటికీ చాలా ఆలయాలలో గర్భగుడిలో మూలవిరాట్టువెనుక, బయట స్పష్టమైన దర్శనం కొరకు దర్పణాలు ఉండటం గమనించవచ్చు. మెకంజీ కూడా తనవద్ద అధికారం ఉందని అహంకరించకుండా సామాన్యవ్యక్తిలాగ మల్లికార్జునుడిని దర్శించుకోవటం గమనార్హం. (చూడుడు; మెకంజీ వేయించిన డ్రాయింగులు)
3. మెకంజీ చెంచులపై పగపట్టి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడిని ప్రేరేపించి అతనితో చెంచువారిని సామూహిక హత్యలు చేయించాడనటం మరీ విపరీతమైన ఊహ. ఇది అనక్రోనిజం కు చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
వెంకటాద్రినాయుడు చెంచుల సామూహిక వధ జరిపింది 1790 లో [5]. ఈ రచయిత ప్రకారం మెకంజీ పై శ్రీశైలంలో చెంచులు దాడిచేసినట్లు చెప్పిన తేదీ 1794 మార్చ్ 14 న. ఆ లెక్కన భవిష్యత్తులో చెంచులు దాడిచేస్తారని నాలుగేళ్లముందే మెకంజీ వారిని సామూహికంగా చంపించాడనటం హాస్యాస్పదం.
(నిజానికి ఆనాటి భారతీయ సమాజిక చరిత్రలో ధగ్గులు, పిండారిలు, బందిపోట్లు, వారి ఆగడాలు ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఇలా బందిపోట్లుగా జీవించటమే వృత్తిగా ఉండే కులం కూడా ఉండేది. వారి దురంతాల వివరాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకంలో విపులంగా ఉన్నాయి. సతీసహగమనం, బాల్యవివాహాల లానే ఇది ఒక సామాజిక రుగ్మత. ఆ రుగ్మతను రూపుమాపటంలో బ్రిటిష్ వారు చేసిన పని అప్పటికి సరైనదే అనిపించకమానదు)
మనం ఏదైనా చారిత్రిక విషయాలు వ్రాసేటపుడు మన వద్ద ఉన్న సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవటం అవసరం. మన పూర్వీకుల గురించి రాసేటపుడు కొంతస్వేచ్ఛ ఉంటుంది. ఉదాహరణకు మా తాత ఒంటిచేత్తో పులిని చంపాడని, మా ముత్తాత ఒక్క వేటుతో ఏడు తాడి చెట్లని పడగొట్టాడని చెపితే “పోన్లే పాపం…కామోసు” అని అంగీకరించొచ్చు. కానీ చారిత్రిక వ్యక్తులగురించి అప్పటికే స్థిరపడ్డ అభిప్రాయాలకు భిన్నంగా చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తరచిచూసుకోవల్సి ఉంటుంది.
మెకంజీని బొర్రయ్య లాంటి నిబద్దత కలిగిన అతని సహాయకులని గుప్తనిధుల ముఠాగా చిత్రీకరించటం దుర్మార్గం. చారిత్రిక ద్రోహం
(చూడుడు మెకంజీ గురించి ఇదివరలో రాసిన వ్యాసం. లింకు కామెంటులో)
.
బొల్లోజు బాబా
References
1. Asiatic Researches 1799, Vol.5, P.n 303-314
2. …….I was desirous of seeing the pagoda, provided there was no objection.(ibid. Pn 303)
3. having put off my shoes, to please the directors of the ceremony, though it would not have been insisted on ibid. p.no307
4. Origins of Modern Historiography by Rama Sundari Manthena, P.no 98
5. రాజా వెంకటాద్రినాయుడు, కొడాలి లక్ష్మీనారాయణ P.no 112








1 comment:

  1. వాట్సాప్ మెసేజులని సీరియస్ గా తీసుకునే మొదటి మానవుడు మీరే అనుకుంటాను :)

    ReplyDelete