Thursday, April 6, 2017

నాలుగు స్తంభాలు


మొన్నో నలుగురు వ్యక్తులు
కొండపై రాత్రివిందుచేసుకొన్నాకా
ఉదయానికల్లా కొండ మాయమైందట
ఆ నలుగురే
నదీవిహార యాత్రజరిపిన మర్నాటికల్లా
నదీ, నదీ గర్భపు ఇసుకా అదృశ్యమయ్యాయని
ఆశ్చర్యంగా చెప్పుకొన్నారు
వాళ్ళే
చెట్టపట్టాలేస్కొని పంటచేలల్లో
తిరుగాడిన సాయింత్రానికల్లా
పచ్చని చేలన్నీ కనిపించకుండా పోయాయట
ఈరోజు వాళ్లకో కొత్త ఊహ పుట్టిందట
అందరూ గుసగుసలుగా చెప్పుకొంటున్నారు.
వివరాలింకా బయటపడలేదు
ఇంతలో…
"అలా జరగటానికి వీల్లేదు" అంటూ
రోడ్డుపై ఒకడు గొణుక్కుంటూ
గాల్లో ఏవో రాతలు వ్రాసుకొంటూ
అడ్డొచ్చిన నన్ను తోసుకొని సాగిపోయాడు
ఎలా జరగటానికి వీల్లేదటా? అని ఆలోచించాను
వెంటనే స్ఫురించింది
అవునవును
నాకూ అన్పిస్తోంది
ఖచ్చితంగా అలా జరగటానికి వీల్లేదు
బొల్లోజు బాబా

1 comment:



  1. ఆలా జరిగే దానికి
    వీలుందా ! యెందుకో కవి హృదయమవునం
    దీ! లావగుతీరు జిలే
    బీ లెక్కలు దేలు సూవె బెహతరు గానన్ !

    జిలేబి

    ReplyDelete