Friday, March 10, 2017

ఎప్పటికీ పుట్టని కొడుకు కోసం ప్రార్ధన - Prayer for the Son Who Will Never Be Born by Luis Rogelio Nogueras (క్యూబన్ కవి)


మనం చాలా పేదవాళ్లం బిడ్డా చాలా పేదవాళ్ళం
ఎలుకలు కూడా మనపై జాలి పడేవి.
ప్రతీ ఉదయం మీ నాన్న టౌనుకెళ్ళి
ఎవరైనా శక్తికలవారు పని ఇస్తారేమోనని చూసేవాడు
- గుప్పెడు బియ్యం కొరకు పసులకొట్టం శుభ్రం చేసే పనైనా సరే.
యాచనల్ని, మూలుగుల్ని వినకుండా, కనీసం ఆగకుండా
శక్తివంతులు ముందుకు సాగిపోయేవారు.
మురికిదుస్తులవెనుక బక్కచిక్కిన దేహంతో
రాత్రెపుడో మీ నాన్న వచ్చేవారు వెలవెలబోతూ
నేను ఏడ్చేదాన్ని.
అప్పుడే నేను ప్రార్ధించాను
మాతృత్వాన్ని, గర్భధారణ శక్తిని ఇచ్చే Jizo ని
నిన్ను ఈ ప్రపంచంలోకి పంపించవద్దని, నా బిడ్డా
నిన్ను ఈ ఆకలి, అవమానాలకు అప్పగించవద్దనీ.
దయగల దైవం నా మొర ఆలకించింది.
అలా ఏళ్లు గడిచిపోయాయి నిస్సారంగా.
నా రొమ్ములు ఎండిపోయాయి
మీ నాన్న చనిపోయాడు
నేను ముసలిదాన్నయిపోయాను.
నేనూ ముగింపుకొరకు ఎదురుచూస్తున్నాను
నల్లనిదుప్పటి విసిరి కనులు కప్పే రాత్రికొరకు
ఎదురుచూసే సూర్యాస్తమయంలా.
Jizo కు ధన్యవాదాలు
కనీసం నువ్వైనా యజమానుల కొరడా దెబ్బలు,
ఈ బాధాకరమైన కుక్కబ్రతుకు తప్పించుకొన్నావు.
ఏదీ, ఎవ్వరూ నిన్ను బాధించలేరు.
నేర్పుకల బాణం సుదూర గద్దను చేరలేకపోయింది
ఈ లోకపు బాధలు ఏవీ నిన్ను చేరలేవు.
అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment