Monday, January 9, 2017

నిశ్శబ్ద ప్రపంచం ----- The Quiet World by Jeffrey McDaniel



ఒకరికళ్లలోకి మరొకరు  మరింత ఎక్కువసేపు
చూసుకొంటూ ఉండటానికి
ఇంకా మూగవాళ్లను సంతృప్తి పరచటానికి
ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ  రోజుకి  సరిగ్గా
నూట అరవై ఏడు పదాలను మాత్రమే
కేటాయించాలని నిర్ణయం తీసుకొంది.

ఫోన్ మ్రోగినప్పుడు ఎత్తి హలో చెప్పకుండా
చెవిదగ్గరపెట్టుకొంటాను
రెస్టారెంటులో చికెన్ సూపు ను వేలుతో చూపిస్తాను.
ఈ కొత్త విధానానికి కొద్దికొద్దిగా అలవాటు పడుతున్నాను.

బాగా రాత్రయ్యాకా నా సుదూర ప్రేయసికి ఫోన్ చేసి
"నేనీ రోజు యాభై తొమ్మిది పదాలు మాత్రమే వాడాను
మిగిలినవి నీ కొరకు దాచి ఉంచాను" అంటాను.
ఆమె స్పందించకపోతే
తన పదాలన్నీ ఖర్చయిపోయాయని అర్ధమౌతుంది
నెమ్మదిగా లోస్వరంతో "I Love You" అంటాను
ముప్పై రెండో సారి.
తరువాత అలా కూర్చొని ఒకరి శ్వాసను మరొకరు
అలా వింటూ ఉండిపోతాం.

తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment