Saturday, October 1, 2016

నా "వెలుతురు తెర" పుస్తకంపై శ్రీమతి జగద్దాత్రి గారు చేసిన సమీక్ష

నా "వెలుతురు తెర" పుస్తకంపై శ్రీమతి జగద్దాత్రి గారు చేసిన సమీక్ష శిరాకదంబం వెబ్ పత్రికలో వచ్చింది. ఎడిటర్, శ్రీ రామచంద్ర రావు ఎస్. గారికి, జగద్ధాత్రిగారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను (పే.నం. 29-33 లలో)

నేను సైతం : బొల్లోజు బాబా

నేటి తెలుగు కవితా జగతిలో బొల్లోజు బాబా పేరు వినని వారుండరు. ముంజేతి కంకణానికి అద్దమేలా? అని మీరనొచ్చు. కానీ ఒకోసారి ఇది అవసరం, అందుకే బొల్లోజు బాబా గురించి అతని కవిత్వం గురించి కాసిన్ని కబుర్లుచెప్పుకుందాం.

మెత్తని పారిజాత పూల పై ఆనుకుని చక్కన్ని టాగోర్ మధుర కవిత చదువుతుంటే ఎంత హాయిగా ఉంటుందో బాబా కవిత్వం అలాంటి అనుభూతిని ఇస్తుంది. బాబా ప్రకృతి ప్రేమికుడే కాదు తాను ప్రకృతిలో ఒక భాగమయి జీవించే మనిషి. ఇది ఇతని కవిత్వం బాగా తెలుపుతుంది. ఇతని మొదటి కవితా సంపుటి “ ఒక ఆకుపచ్చని గీతం”(2009) కి శిలపరసెట్టి శ్రీరాములు అవార్డ్ వచ్చింది. ఇటీవల బాబా తీసుకొచ్చిన మరో కవితా సంపుటి “ వెలుతురు తెర”. టాగోర్ రాసిన చిరు కవితలు “స్ట్రే బర్డ్స్” ను కూడా తెలుగు లోకి “స్వేచ్ఛా విహంగాలు” పేరిట అనువదించి పుస్తకంగా వెలువరించాడు. ఈ రెండు పుస్తకాలు ఇటీవలే ఆవిష్కరణ జరిగాయి. ప్రకృతిలో మమేకమయి పోయిన వాడు అయితే చిత్రాలు గీస్తాడు, లేదా కవిత్వం రాస్తాడు. చిత్రంగా బాబా చిత్రాల్లాంటి కవితలు రాస్తాడు. ఇతని తొలి కవితా సంపుటిలోనే ఈ అంశం మనకు అవగత మౌతుంది.

ఆర్తి ఆవేదన కవిత్వానికి మూల కారకాలు. అలాంటి ఆవేదనల నివేదనే బాబా కవిత్వం. ఇక వ్యక్తిగా బాబా గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. మెల్లగా మాట్లాడుతాడు , మెత్తగా నవ్వుతాడు. చూడగానే సహృదయత , జీవన మర్యాద ఉట్టి పడుతూ ఉంటాయి. నిత్య విద్యార్ధిగా తనని తాను భావించుకునే అతి సౌమ్యుడు, నిగర్వి. నచ్చిన మంచి పుస్తకాలు కవులు తాత్వికులను అనువదిస్తాడు. మనుషుల పట్ల మమతల పట్ల అధికంగా అనురాగం కలవాడు. ఇక బాబా కవిత్వం గురించి. మెరుపుల్లా వచ్చి తెగి పోతున్న ఆలోచనల్ని ఫ్రాగ్మెంట్స్ గా కవితలుగా నమోదు చేసిన ఓ దాన్లో అంటాడిలా :

“జీవితం అతని మోముపై
నర్తించి నర్తించి
అలసిపోయింది
ఆ ముఖం పై మూడుతలన్న
దాని పాద ముద్రలే” సున్నితమైన మాటల్లో జీవితాన్ని చెప్పే కవిత ఇది.

“ నేల సంకెళ్ళను
నిత్యం తడుముకుంటూనే
వెలుగును తరుముకుంటూ
నీలాకాశం లోకి చొచ్చుకొని
పోతుంటాయి తరువులు. చెట్టుని మించిన
వ్యక్తిత్వవికాస పుస్తకం ఏది?” మొదటి పంక్తుల్లో చెట్టుని వర్ణించడం సాధారణమే అయితే చెట్టును మించిన వ్యక్తిత్వ పుస్తకం ఏది అనడం లోనే బాబా తన ముద్రను చూపించాడు. గజల్ లో షేర్ లో రెండవ పంక్తి ముక్తాయింపులో కనిపించే మెరుపు చమత్కారం లాంటిది ఈ అంశం. చెట్టును మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం లేదన్న కవి భావనకి జోహార్లు.

కొత్త కవిత్వ సంపుటి శీర్షిక కవిత :
వెలుతురు తెర
చెట్టు నీడలో కూర్చొన్న
విద్యార్ధుల గుంపు
వెలుతురు తెరలో దూకి
వైఫై సముద్రం లో తేలింది
దారాన్ని స్రవించుకొని
కాళ్లతో పెనుకుంటూ తన చుట్టూ తానే
గూడు నిర్మించుకొనే పురుగులా
ప్రతీ విద్యార్ధీ తన చుట్టూ
ఓ మౌన పంజరాన్ని దిగేసుకున్నాడు.
వైఫై లింక్ తెగింది
ఒహా! షిట్....
గూడులోంచి సీతాకొక చిలుక
మెత్త మెత్తగా బయట పడినట్లుగా
ఒక్కో విద్యార్ధీ మాటల ప్రపంచంలోకి
మెల్ల మెల్లగా మేల్కొన్నాడు
కాసేపటికి కాంపస్ అంతా
రంగు రంగుల మాటల చిలుకలు
రెక్కలల్లార్చుకొంటూ ఎగురుతో!

ఈ కవితా చదివిన వెంటనే ఏమనిపిస్తుంది? టాగోర్ , చలం , ఇస్మాయిల్ గుర్తు రావడం లేదూ? మృదుత్వం, వేదన కలబోసుకున్న ఈ మాటల్లో ఆధునిక ప్రపంచం గురించిన అంశాన్ని నేటి పరిభాషలో అభివ్యక్తి చేయడం. ఇదే బాబా కవిత్వానికి గీటు రాయి. మాటలు పాతవే ఎవరు రాసినా , వాటికద్దే భావాల పరిమళాలే ఎప్పటికప్పుడు ఒక కవిని ప్రత్యేకంగా నిలపగలిగేవి. అలాంటి ప్రత్యేక కవి బాబా అనడం లో సదేహం లేదు. ఈ కవి భావలలోనే కాదు పదాల ప్రయోగం లోనూ చలానికి వారసుడు. చలం మాటలాడేటప్పుడు , రాసేటప్పుడు కూడా “ఎగురుతో’ అంటాడు ఎగురుతూ అనడానికి బదులు. బాబా కూడా అలాగే ఎగురుతో అని రాస్తాడు. ఇది మనకి భావుకత్వానికి ఒక ప్రతీకగా కనిపిస్తుంది.

బాబా కవిత్వం లో మరొక మంచి కవిత కేవలం స్త్రీలు మాత్రమే రాయగలరు అనుకున్న కవితా అనూహ్యమైన కవిత “ ఒక హిస్టోరెక్టొమీ” ప్రముఖ కవయిత్రి హిమజ చాలా కాలం క్రితం ఇదే పేరుతో ఇదే అంశంపై కవిత రాసేరు. మళ్ళీ ఇన్నేళ్లకి బాబా కలం నుండి ఈ కవిత రావడం ఆశ్చర్యం, ఆనందదాయకం కూడా. విచ్చలవిడి గా అవసరం ఉన్నా లేకున్నా జరుగుతున్నా హిస్టెరెక్టొమీ ఆపరేషన్లు చూసిన కవి సున్నిత హృదయం స్పందించింది ఇలా :

“కారణాలెమైనా కానీ
నెలకో రక్త పుష్పాన్ని రాల్చే
వృక్షాన్ని సమూలంగా
పెకిలించారు
నాగరీకుని
వైద్య ప్రయోగశాలలో
స్త్రీ దేహమేప్పుడూ ఓ గినియా పిగ్గే!” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. స్త్రీల దేహాలపై ఈ శాస్త్ర చికిత్స చూపే ప్రభావాన్ని కూడా ఆవేదనతో చెప్తాడు బాబా. మందులు మాత్రలు , ఇప్పుడిక అద్దె గర్భాలు అన్నీ ప్రయోగాలు స్త్రీ దేహం పైననే అని వాపోతూ చివరిగా అంటాడిలా

“జరాయురహిత దేహమిపుడో
సజీవ టంకశాల కదా!” ఆవేదన కలిగించే ఈ కవిత కు స్త్రీలందరు కృతజ్ఞతలు చెప్పాలి బాబాకీ. ఆ కోల్పోయినతనం ఆ బాధ స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి విషయాన్ని తీసుకుని హృదయానికి హత్తుకునేలా రాసిన బాబాకి స్త్రీలందరి తరపునా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా.

“యానాం విమోచనోద్యమం” కూడా బాబా రచించారు. అనుక్షణం మమతల హరివిల్లులా అనవరతం ప్రేమ పొదరిల్లులా జీవితాన్ని ఆస్వాదించే కవి తన చుట్టూ ఉన్న వారికి ఆ అనురాగ సంపదను పంచిపెట్టే బాబా లాంటి కవులు నేటి యాంత్రిక యుగం లో ఆశారేఖలు.
గాధా సప్తసతి , సూఫీ పద్యాలు ఇలా ఇంకా తనకు నచ్చిన వాటిని అనువాదాలు కూడా విరివిగా చేస్తున్న బాబా కలం నుండి హృదయాలు చెమరించే కవిత్వం మరింత రావాలని ఆశతో , ఆకాంక్షతో శుభాకాంక్షలు ....ప్రేమతో జగద్ధాత్రి

No comments:

Post a Comment