Friday, November 27, 2015

చరిత్రకు కవిత్వరూపం – తుల్లిమల్లి విల్సన్ కుమార్ “మాకూ ఒక భాష కావాలి”


కొన్ని కవితల్ని చదివినపుడు గొప్ప ఉద్గ్రంధాన్ని చదివిన అనుభూతి కలుగుతుందికొప్పర్తి వ్రాసినచిత్రలిపిఅనే కవిత భారతదేశ చరిత్రపుస్తకాన్ని నలభై కవితాపంక్తులలోకి  కుదించినట్లు అనిపిస్తుంది. శ్రీశ్రీ వ్రాసిన దేశచరిత్రలు కవిత ఎప్పుడుచదివినామానవజాతి చరిత్రపై వ్రాసిన గ్రంధాన్ని తిరగేస్తున్నట్లుంటుంది.  
“మాకూ ఒక భాష కావాలి” పుస్తకం చదివినపుడు అదే అనిపిస్తుంది పుస్తకం లోని కవితలన్నీ, ఒక జాతి వేల సంవత్సరాల జీవనాన్ని ప్రతిబింబిస్తాయి, సమకాలీన సమాజంలో జాతి ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ వివక్షలను రికార్డు చేస్తాయి తారీఖులు దస్తావేజులతో సహా, జాతి నిర్మించాలనుకొంటున్న భవిష్యత్తును స్వప్నిస్తాయి
నేటి వరకూ జరిగిన, జరుగుతున్న దళిత జాతి చరిత్రకు కవిత్వ రూపం తుల్లమల్లి విల్సన్ సుధాకర్ గారు రచించిన  మాకూ ఒక భాష కావాలి అనే పుస్తకం.
ఒక రాజకీయకోణాన్ని ఆవిష్కరించటానికో లేక తాను నమ్మే సిద్దాంత భావాల్ని ప్రచారించుకోవటానికో కవిత్వాన్ని వాడుకోవటం శ్రీశ్రీ కన్నా ముందునించే ఉన్నా, శ్రీశ్రీ ద్వారా విధానం ఆధునిక కవిత్వంలో స్థిరపడింది. లేకుంటే తెలుగుసాహిత్యంలో రోజు మనకు కనిపించే అద్భుతమైన వివిధ అస్థిత్వసాహిత్య రూపాలు వచ్చిఉండేవి కావు.   రకపు కవిత్వంలో విషయం ఉంటే కవిత్వం ఉండదు, కవిత్వం ఉంటే విషయం ఉండదు అనే విమర్శను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ విల్సన్ సుధాకర్ కవిత్వంలో-   వస్తువు తాలూకు సిద్దాంతం, దాన్ని కవిత్వీకరించిన రీతి  జమిలినేతలా కలిసిపోయి చదువరికి మంచి కవిత్వ హాయిని కలిగిస్తుంది. చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా చెపుతూనే తమ కవితలలో చక్కటి కవిత్వాన్ని నింపిన గొప్ప కవులైన శ్రీ ముద్దూరి నగేష్, శ్రీ పైడి తెరేష్, శ్రీ శిఖామణి, శ్రీ ఎండ్లూరి సుధాకర్, వంటివారి సరసన శ్రీ తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ ను నిలుపుతుందీ కవితా సంపుటి.
కవి తత్వం
కవిత్వంలో దళిత, బహుజన దృక్కోణం వాక్యవాక్యానా కనిపిస్తుంది, ఆత్మగౌరవం ప్రతీ కవితలోనూ స్ఫుటితమౌతుంది, ఒక జాతి యొక్క భవిష్యత్ కార్యాచరణ పుస్తకంలో  అంతర్జలలా ప్రవహిస్తూంటుంది
భాష అంటె వ్యక్తీకరణ సాధనంఒకని వ్యక్తీకరణ ద్వారా వాని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాం.   మాకూ ఒక బాష కావాలి/అది మా హృదయ ఘోషకావాలి అంటూనే విల్సన్ సుధాకర్ తన జాతి అస్థిత్వాన్ని వ్యక్తీకరించటానికి కావలసిన బాష ఏమిటో, దాని స్వరూపమేమిటో  కవిత్వం ద్వారా చెపుతాడు గడుసుగా.   తుల్లమిల్లి విల్సన్ సుధాకర్ భాష మెత్తమెత్తగా, చక్కని ఉపమానాలతో, అందమైన పదచిత్రాలతో, తమలపాకుతో ఒకటనే వ్యంగ్యంతో సాగదు.
తగినంత  శోధన, మధనం జరిగాకే ఒక వస్తువు కవితగా రూపు దిద్దుకొన్నదన్న విషయం సుధాకర్ ప్రతీ కవితలోనూ కనిపిస్తుందిఇతని వాక్యం కర్ణాంతాలవరకూ నారి సారించి విడిచిన బాణంలా దూసుకొచ్చి, హృదయపు బుల్స్ ని తాకుతుంది లోతుగా.   ఇతని నుడికారం లోనే ఒక బాధ్యతాయుతమైన సామాజిక అవగాహన, తద్వారా సిద్దించిన తిరుగుబాటు కనిపిస్తుంది.
బూట్లకోసం అవర్ణులు ఆవు చర్మాలు ఒలుస్తారుఅన్నవాక్యం త్రిశ్రీ మాటల్లో చెప్పాలంటే  “ఒక సాదా సీదా డీలా వాక్యం”.  కానీ వాక్యాన్ని కవిత్వంగా మార్చినపుడు, కవి తత్వం, నైపుణ్యం తెలుస్తాయి
సవర్ణుల బూట్లకోసం
మా అవర్ణాలింకా
ఆవుచర్మాల్ని ఒలుస్తూనే ఉన్నాయి..... (దేవునిమీద ప్రమాణం చేసి). 
ముందు చెప్పిన వాక్యానికి అదనంగా సవర్ణుల” “ఇంకా అనే రెండు పదాలు మాత్రమే వచ్చిచేరాయిఫలితంగా ఒక శక్తివంతమైన కవితావాక్యం రూపుదిద్దుకొందిసవర్ణుల బూట్లకోసం అనటం ద్వారా, తమ ఉత్పత్తులని తమకోసం వాడుకోలేని ఉత్పత్తి వర్గాల సామాజిక, ఆర్ధిక అశక్తత వ్యక్తమౌతుందిఇంకా అనే పదం  ద్వారా, చరిత్రలో మొట్టమొదటగా బూట్లను తయారుచేసిన చర్మకారుని నుండి నేటి వరకూ మాకు సమాజంలోవెర్టికల్ మొబిలిటీ’ దక్కలేదు అన్న వేదన పలుకుతుంది.
పై ఒక్క వాక్యాన్ని నిశితంగా పరిశీలిస్తే కవి సత్యాల్ని కవిత్వీకరించటంలో నైపుణ్యం కలవాడని, సమాజంపై ఇతనిది అంబేద్కరిష్టు దృక్కోణమనీ అర్ధమౌతుందిఅలా సంపుటిలోని కవితలన్నీ చిక్కని కవిత్వంతో, తాను నమ్మిన సిద్దాంతాన్ని ప్రతిబింబిస్తూ సాగుతాయి.  
రాత్రయితే చాలు
ఆకాశం గడ్డి వామునుంచి
నక్షత్రాల పరకలతో ఎంట్లు పేనించి
అల్లిన హంసతూలికా తల్పంపై జోకొట్టి
నా ఆలోచనా సులోచనాలకు గంతలు కట్టేసి
ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తమంటుంది..... (ఆదివారం) అంటూ సెలవురోజు ఎలా ముగిసిందో చేసిన రమ్యమైన వర్ణణ ద్వారా  విల్సన్ సుధాకర్ కలం చండ్రనిప్పులు కురిపించటమే కాదు, రమణీయమైన ఊహలను  సుందర పదచిత్రాలుగా లిఖించగలదన్న విషయం గమనించవచ్చు.   

నూతన పదబంధాలు
కవిత్వమొక మేధోప్రక్రియ అని నూతన పదబంధాల సృష్టి నిరూపిస్తుందిఅనిబద్ద కవికి ఉండే స్వేచ్ఛ వల్ల అతనికి నూతన పదబంధాల సృజన సులభతరమౌతుందిఒక సిద్దాంతంపట్ల కవికి ఉండే నిబద్దత కొన్ని సార్లు నూతన పదబంధాల సృష్టికి పరిమితులు గీస్తుంది. పరిమితులలోనే విల్సన్ సుధాకర్ - మదాంధజ్యోతి (ప్రముఖ పత్రికను ఉద్దేశించి), లేతమొగ్గల పరుపు (సెక్స్ వర్కర్), విప్లవమతనికి పులిగాయం (సత్యమూర్తి మరణంపై), కలలమగ్గాలు (చేనేతకార్మికుల వెతలను వర్ణిస్తూ), పాచిపోయిన స్వాతంత్ర్యం, విప్లవ జనగణమన,, నారింజ నాగుపాము(హిందుత్వం), ఆంధ్రమయూరం (జాషువా గురించి) వంటి  అద్బుతమైన పదబంధాలు సృష్టిస్తాడు.   అవి తళుక్కుమంటూ మెరుస్తూ ఆయా కవితా వస్తువులను  దేదీప్యమానం చేస్తాయి.

సామాజిక దృక్పధం
కవి సామాజిక దృక్పధం విశాలమైనదిబహుజనులలో కొన్ని కులాలు జంద్యాన్ని ధరిస్తారుఅలా ధరించే జంద్యాన్ని, సాంస్క్రిటైజేషన్ ప్రక్రియలో వారు సవర్ణులను అనుకరించాలని చేసిన ప్రయత్నంగా గుర్తించాలి స్పృహ కవికి ఉంది కనుకనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత కార్మికుల తరపున  “మెడలో పత్తిపువ్వుఅనేకవితలో.  
మెడలో జందెంగా వేసుకున్న నూలుదారం
సవర్ణ చక్రానికి ఇరుసు అవుతుందనుకున్నాం గానీ
మా సజీవమెడకది ఉరితాడౌతుందని తెలుసుకోలేకపోయాం// అంటాడు. 

మరో కవితలో  బహుజన సామ్రాజ్యంలో//గదపట్టుకొని నిలబడ్డ అంబేద్కర్ని దాటగలితే అనే వాక్యం ద్వారా కులదురహంకారం చూపే సవర్ణుల నుండి దళిత, బహుజనులను కాపాడే శక్తి, మార్గమూ అంబేద్కరిజమేనని స్పష్టపరుస్తాడీ కవి

పాదాభివందనం అనే కవితలో సుధాకర్
//బహుజన రాజ్యంలో
సమైక్యమై దళిత బహుజనులమై
సవర్ణుల కోట బురుజులమీద నీలిజెండా ఎగరేస్తాం// అనటం ద్వారా దళిత బహుజనుల ఐఖ్యతను వాంఛిస్తూ, చేయాల్సిన కార్యాచరణను ప్రకటిస్తాడు. కవి తాను రక్తనిష్ఠంగా చేసుకొన్న అంబేద్కరిజం ఇచ్చిన స్పూర్తి ఇది.

వ్యంగ్యం
సాహిత్యంలో వ్యంగ్యమనేది అప్పటికే స్థిరపడిన కొన్ని అభిప్రాయాలను తిరిగి ఆలోచించుకొనేలా చేస్తుంది. వ్యంగ్యం అత్యంత శక్తివంతమైనదిహేళనతో కూడిన హాస్యంతో పదునైన శత్రువును చీల్చి చెండాడవచ్చునంటారు డా.అంబేద్కర్.   సాహిత్యంలో వ్యంగ్యం కలిగించే ప్రయోజనాలను విల్సన్  సుధాకర్ తన కవిత్వంలొ అనేక చోట్ల సమర్ధవంతంగా వాడుకోవటం జరిగింది.  
కొన్ని కవితల్లో కనిపించే వ్యంగ్యం మొహాన ఛెళ్ళున కొట్టే యాసిడ్ లా ఉంటుంది ఘాటుకి ఉక్కిరి బిక్కిరి కాక తప్పదుకవి ఆశించేదీ అదే.   పాఠకుడిని  ఆలోచనలోకో, ఆచరణలోకో కదిలించలేనిది కవిత్వమెలా అవుతుంది?
 
“హే ప్రభూ/రాళ్ళు జవరాళ్ళైన నీ పాలనలో ధర్మదేవత చక్కగా నర్తించిందా” అంటూ రామరాజ్యాన్ని ప్రశ్నించటం (గుడినుండి గూడెందాకా),  చిన డయ్యర్ కవనస్వామి’ అంటూ దళితులని ఊచకోతకోస్తుంటే ఏనాడూ స్పందించని పీఠాధిపతులను జనరల్ డయ్యర్ తో పోలుస్తూ  ఎద్దేవా చెయ్యటం, (నిద్రపోతున్న దేశమనే సుందరకన్యకు),  ఎవడో మనువు//టూరిస్టు గైడులా చెప్పినమాటలు వినేసి అంటూ బృతికోసం టూరిస్టు గైడు చెప్పుకొనే పిట్టకథలతో మనువాదాన్ని పోల్చటం  (ఇవాంజెలికల్ ఆంధ్ర), భిన్నత్వంలో ఏకత్వమని ఒట్టేసి బొంకిన జాతి మాది అంటూ ప్రస్తుతసమాజంలో భిన్నత్వం ఉందికానీ ఏకత్వం కొరవడిందని ఆక్షేపించటం (రొట్టెల తనిఖీ)- వంటి వివిధ సందర్భాలను వ్యంగ్యంగా వ్యక్తీకరించిన వాక్యాలు పుస్తకంలో అనేకం  కనిపిస్తాయి.

నిబద్దత
విల్సన్ సుధాకర్ కి ఉన్న దళిత, బహుజన నిబద్దతను నిప్పులాంటి స్పష్టతతో ఆవిష్కరిస్తాయి కొన్ని కవితలుకవితా వస్తువు ఏదయినప్పటికీ తాను నమ్మే సిద్దాంతాన్ని సందర్బోచితంగా, పాలు తేనె కలిపినరీతిలో,  ప్రస్తావించటం ఈ కవి కవిత్వ ప్రత్యేకత.  
దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతంపై వ్రాసిన  “గుడ్ బై ఇండియాఅనే కవితలో ఆమెకు గొప్ప  నివాళి అర్పిస్తూనే, ఒరియా కన్యస్త్రీలు, ఖైర్లాంజీ దళితస్త్రీలు, గోద్రాలో గర్భవతులపై దాడులనూ ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా కొవ్వత్తులు కాగడాలు వెలిగించలేదేం తల్లీ అని ప్రశ్నిస్తాడు సమాజం సహానుభూతి ప్రదర్శించటంలో సెలక్టివ్ గా ఉంటోందనీఅలాంటి సంఘటనలే దళిత బహుజనులకు జరిగినపుడు మౌనం వహిస్తోందనీ కుండ బద్దలుకొడతాడు.
ప్రముఖ కవి, నక్సలైట్ నాయకుడు సత్యమూర్తి మరణించిన సందర్భంగా వ్రాసిన, “కవి కుమారుడి విప్లవ సౌందర్యం”  కవితలో 
కులమిక్కడ అజరామరమే!
ట్రిగ్గర్ కొక కులం...
బుల్లెట్లు తగిలి చచ్చేదొక కులం
ట్రిగ్గర్ మీద వేళ్ళెంత పదిలం//....  అనటం ద్వారా విప్లవపోరాటాలలో ఉండే కులాధిపత్యాన్ని ఒకవైపు ప్రశ్నిస్తూనే, ఎన్కౌంటర్లలో బలవుతున్నది క్రిందికులాల పేదలేనన్న నిష్టుర సత్యాన్ని ఆవిష్కరిస్తాడు కవి.

క్రైస్తవ్యాన్ని స్వీకరించటాన్నిపరివర్తన నిజం” అనే కవితలో మీ తిరస్కారాల మాల ధరించలేక// మతమార్పిడి గరళాన్నే//అమృతంగా స్వీకరించాం అంటూ  చెప్పుకొచ్చినా (ఇక్కడ మతాన్ని గరళం అనటంలేదు కవిచరిత్ర పరంగా చాలా గొప్పవాక్యమిది), అక్కడా గూడుచేసుకొంటున్న వర్ణవివక్షతను సవర్ణక్రైస్తవ శ్మశానాల్లో మా శవాలకూ చోటెక్కడ!” (యూదులరాజే బీదరాజు) అని ప్రశ్నిస్తాడుఇది కవికి ఉన్నతనవర్గ హితాన్నికోరే తత్వాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పట్టిచూపుతుంది.
హైదరాబాద్ లుంబినీ పార్కులో ఉగ్రవాదులు బాంబులు పేల్చిన దుర్ఘటనకు స్పందిస్తూ
ముబారక్ మిత్రులారా!
హింసమతమైతే మతం మాకొద్దు//
పేల్చుకోండి మీ బాంబుల్ని
వీలైతే వివక్షమీద
స్పృశ్యాస్పృశ్యాల మీద
జనం గుండెల్లో దాగిన మనువుమీద......//
మేము జాతీయజెండా ఎగరేసేటప్పుడు
కాస్త విరామం ప్రకటిస్తే చాలు....... (థాంక్ గాడ్ మేమక్కడలేము) అంటాడుమత హింసను నిర్ధ్వంద్వంగా ఖండిస్తూనే, తన వర్గదృక్పధాన్ని మరువడు, తన దేశభక్తిని విడువడు. 

చారిత్రిక అవగాహన
విల్సన్ సుధాకర్ ప్రాపంచిక  దృక్పధం విశాలమైనదిఅది ఇచ్చిన అవగాహనతో  చరిత్ర ఘటనల పట్ల దళితులదృక్కోణం ఎలా ఉండాలో, ఆయా ఉదంతాలను నేటితరం దళిత,బహుజనులు ఎలా అర్ధంచేసుకోవాలో కవిత్వంలో సందర్భోచితంగా పొందుపరుస్తాడు.    క్లుప్తంగా కొన్ని ఉదాహరణలు ....
గోబాక్ సైమన్ అన్నంత దుర్మార్గులు వీరు.......   1928 లో డా.బి.ఆర్. అంబేద్కర్ తన ప్రజలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కావాలి అని కోరగా, సైమన్ కమిషన్ అంగీకరిస్తుందికానీ వేరే వేరే కారణాలతో అప్పటి ప్రముఖ రాజకీయపార్టీలు సైమన్ కమిషన్ ను వ్యతిరెకించి, రిపోర్టును అమలుకాకుండా చేసాయి.    
అలెగ్జాండర్ ను సీరియస్ గా తీసుకోలేకపోయిన జాతి గదా మనది....... (యుద్ధాన్ని కలిసే చేశాం...) నంద సామ్రాజ్యం శూద్రుడైన మహాపాత్ర నందుని చే స్థాపించబడి అత్యంత బలమైన రాజ్యంగా చరిత్రకెక్కింది. భారతదేశాన్ని ముట్టడించిన అలెగ్జాండర్, అప్పటి నందరాజ్య పాలకుడైన ధన నందుని శౌర్యానికి , సైనిక సంపదకు భయపడి వెనుతిరిగాడంటారు చరిత్రకారులు.
వాడు టయోటా రధమెక్కి//పుష్యమిత్రుడై మనవీధుల్లోకి రాకపోతాడా.... (పాదాభివందనం) పుష్యమిత్రుడు భారతదేశంలో బుద్దిజం విస్తరించకుండా చేసి, బ్రాహ్మనిజం వ్యాప్తికి దోహదపడిన రాజు. పుష్యమిత్రుడిని కథానాయకుగా చేసి రామాయణాన్ని రచించారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారు

ప్రతీకలు
చరిత్రనుంచి, పురాణాలనుంచి, బైబిల్ నుంచి, సమకాలీన సమాజంలో జరుగుతున్న సంఘటనలనుంచీ సుధాకర్ తన ప్రతీకల్ని నిర్మించుకొంటూ వెళతాడు. కొన్ని చోట్ల పాఠకుడు కూడా కొంత పరిశ్రమ చేయవలసి రావొచ్చు, బహుసా అందుకనే నేమో కవిత్వాన్ని ఇద్దరి సంభాషణగా పేర్కొంటారు
ఉదాహరణకు నిర్ధన లాజర్ ని రానివ్వని వైనం అనే వాక్యం వెనుక - పేదవాడైన లాజర్  భూలోకంలో ధనవంతులచే తృణీకరించబడినా, పరలోకంలో దేవదూత ఒడిలో కూర్చొనే అర్హత సంపాదించాడని తెలిపే బైబిల్ కథ ఉందిఇక్కడ లాజర్ ను సందర్భోచితంగా తన కవితలో దళితుడికి ప్రతీకగా వాడుకొంటాడు కవి
సొదొమో గొమొర్ర అనేవి, పాపం పెచ్చరిల్లగా దేవుడికి కోపంవచ్చి అగ్నికి ఆహుతి చేసిన రెండు నగరాల పేర్లువీటిని సమకాలీన సమాజానికి ప్రతీకగా  నిలుపుతాడుఆత్మలతో పోరాటంఅనే కవితలో.    
ఇలాంటి ప్రయోగాలు తెలుగు సాహిత్యపరిభాషను పరిపుష్టం చేస్తాయి, తద్వారా తెలుగు కవిత్వ కాన్వాసు  సుసంపన్నమౌతుందినేడు విస్త్రుతంగా చర్చింపబడుతున్న ఆలూరి బైరాగి కవిత్వంలో కూడా  బైబిల్ లోని కొన్ని ఉదాత్త భావనలను మనం చూడవచ్చు.  

సమకాలీనత
కులం, మతం ప్రాతిపదికన వివక్ష నింపుకొన్న సమకాలీన సమస్యలపై వ్రాసిన అనేక కవితలు సంపుటిలో ఉన్నాయిఅలాంటి ఘటనలు పత్రికా పేజీల కృష్ణబిలాలలోకి జారి కనుమరుగవ్వకుండా కవిత్వీకరించి కాలానికి సవాలు విసిరాడా కవి అనిపించక మానదు.   కోస్తాజిల్లాల్లో ఒక దళిత జాయింటు కలక్టర్ ను కులం పేరుతో దూషించిన ఘటనా, బేగరి శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ, కంధమాల్ జిల్లాలో క్రైస్తవులపై జరిగిన దాడుల గురించి, గ్రాహంస్టెయిన్స్ సజీవదహనం, కాకరపల్లి ఉదంతం, ఖైర్లాంజీలో మానభంగానికి గురైన దళితబాలిక గురించి, లక్ష్మింపేట దళితుల ఊచకోతపై, పొట్టిలంక మారణహోమాన్ని పై ప్రకటించిన నిరసనవంటి వివిధ సమకాలీన దళిత చారిత్రిక సందర్భాలకు, అద్భుతమైన కవిత్వరూపం కల్పించారు సుధాకర్   పుస్తకంలో
హృదయాన్ని కలచివేసే సంఘటనల పట్ల స్పందించి వ్రాసే కవితలు కాలంగడిచే కొద్దీ తమ ప్రాసంగితను కోల్పోవటం సహజంగా జరిగే ప్రక్రియఅట్టి కవితలలో దట్టించిన కవిత్వమే వాటి షెల్ఫ్ లైఫ్ ను పెంచుతుందన్న విషయం విల్సన్ సుధాకర్ కు బాగా తెలుసు.

సార్వజనీనత
నీకోసం నువ్వు న్యాయం కోరుకుంటున్నావు కాబట్టి ఇతరుల కోసం కూడా న్యాయం కోరుకోవాలి, ఇతరులకు నువ్వు న్యాయం చేయాలిఅనేది హేతుబద్దమైన వాదనఎందుకంటే న్యాయం అనే భావనే సార్వజనీనమైనది --- సాహిత్యంపై  బాలగోపాల్
సమాజంలోని ప్రతీ సమూహము తనచుట్టూ ఒక వృత్తాన్ని గీసుకొని జీవనం సాగిస్తుంది. కానీ ఒక సమూహంలో ఉన్న వ్యక్తి ఏక కాలంలో,  ఒక హిందువుగా, ఒక బహుజనుడిగా, ఒక కంసాలిగాఒక కార్మికునిగా, ఒక మగవాడిగాఒక నిరుపేదగా, ఒక ప్రాంతవాసిగా భిన్న సమూహాలలోకి విస్తరించిఉండవచ్చుబలవంతులు బలహీనులపై చేసే పీడన, ఆధిపత్యం వంటివి  అన్నిచోట్లా ఉంటాయిస్త్రీ, దళిత, బహుజన, మైనారిటీ, ప్రాంతీయత వంటి వివిధ అస్థిత్వవాద సాహిత్య ప్రక్రియలు పీడనను ఇతివృత్తంగా చేసుకొని,  బయటపడే పరిష్కార మార్గాల్ని వెతుకుతాయిన్యాయం కోసం గొంతువిప్పుతాయి. విల్సన్ సుధాకర్ కవిత్వం కూడా అదే చేసింది
కవిత్వమంతా ఒక సమూహం గురించి మాట్లాడుతున్నట్లు కనిపించినా, భావనలన్నీ పీడనకు గురవుతున్న మానవులందరికీ అన్వయించుకోవచ్చువారందరి తరపునా మాట్లాడుతున్నట్లు భావించాలిఉదాహరణకు ఈ వాక్యాలను గమనిస్తే.....
మేమిప్పుడు
వజ్రాల లోయలో రాక్షస గద్దలకు
ఆహారమౌతున్న మాంసపు ముద్దలం  ... (వజ్రాల లోయలో రాక్షస గద్దలు) అనే వాక్యాలలో మాంసపు ముద్దలుగా మారింది  పైన చెప్పిన  సమూహంలోని పీడితుడైనా కావొచ్చు
****
“ఈనాడు చరిత్రలో మనిషి ఎక్కడున్నాడన్న స్పృహలేనివాడు ఆధునిక కవి ఎట్లా అవుతాడు” అంటారు గుంటూరు శేషేంద్రశర్మ.  విల్సన్ సుధాకర్ తన కవిత్వం ద్వారా చెప్పింది అదే.  తన తోటిమనిషి సమకాలీన సమాజంలో ఎక్కడ ఉన్నాడు,  ఎలా ఉంటున్నాడు, ఏ రకమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం చేసిన అన్వేషణే ఈ “మాకూ ఒక భాషకావాలి” అనే కవిత్వ సంపుటి. 
కవితా సంపుటిలో మొత్తం 32 కవితలున్నాయివిల్సన్ సుధాకర్  తండ్రిగారైన శ్రీ తుల్లిమల్లి బర్నబాసు గారిపై మరియు డా.బి.ఆర్. అంబేద్కర్ పై వ్రాసిన మరో రెండు కవితలు కూడా ఉన్నాయి పుస్తకానికి ముందుమాటలు డా. ఎమ్.ఎమ్. వినోదిని గారు, డా. మేడిపల్లి రవికుమార్ గారు వ్రాసారుమంచి కవిత్వాన్ని, పదునైన అభివ్యక్తిని, సామాజిక స్పృహని ఇష్టపడే ప్రతిఒక్కరికీ పుస్తకం నచ్చుతుంది.

పుస్తకం కినిగె.కాం లో క్రింది లింకులో లభిస్తుంది.

రచయిత మెయిల్
wilsonsudhakar@hotmail.com



బొల్లోజు బాబా

3 comments:

  1. Bhayya nenu meela kavi kavalani vundi.Nenu o kavine ani

    ReplyDelete
    Replies
    1. హ హ ... మనిషిని కుదురులేకుండా చేసే తత్వమే అతన్ని ఆ యా రంగాల్లో ఉన్నత స్థానాలకు తీసుకువెళుతుంది. మీరు ఆంధ్రదేశం గర్వించదగ్గ జువాలజీ లెక్చరర్, ఉత్తమ ఉపాద్యాయులు, ప్రభుత్వ ఉన్నత విద్యపట్ల గొప్ప అవగాహనతో ఆచరణాత్మకమైన పనులు చేస్తున్న వ్యక్తి. మీ సేవలు ఏ రంగంలో ఉన్నా ఉత్తమంగానే ఉంటాయి.

      Delete