Sunday, March 29, 2015

గాథాసప్తశతి 4 - రమణీ మనోహరులు


{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి  - రమణీ మనోహరులు
ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటపుడు దేహసౌందర్యం ప్రధాన పాత్రవహించటం, అదే పురుషుని వర్ణించవలసివచ్చినపుడు అది అతనిపట్ల మనసుపడ్డ ఒక స్త్రీ మనోచిత్రణ పరంగా ఉండటం ఈ గాథలలో చాలాచోట్ల కనిపిస్తుంది.

ఒక యవ్వనవతి తను మనసుపడ్డ యువకుని గురించి తన అత్తతో ఇలా అంటుంది

అత్తా!
ఆ యువకుడ్ని తదేకంగా 
ఎంతసేపు చూసినా అలుపైతే రాదు కానీ 
కలలో నీళ్ళు తాగినట్టు దాహం తీరదు. – 93

తన ప్రియుడు ఏ ఇంట్లో (ఎవరితో) ఉన్నాడో కనిపెట్టటానికి ఈ అమ్మాయి వేసిన పధకం బాగుంది చూడండి

పండగపూట కొత్తదుస్తులు ధరించి 
పిండివంటలు ఇంటింటికీ 
తిరుగుతూ పంచుతోంది పిచ్చిపిల్ల
నువ్వెక్కడయినా కనిపిస్తావన్న ఆశతో - 328

ప్రియుడి చేతిస్పర్శ పొందటమే భాగ్యంగా భావిస్తూ ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకొంటుందీ అమ్మాయి

నాకున్నవన్నీ మంటలకు బూడిదైనా
నాకు ఆనందంగానే ఉంది, ఎందుకంటే
మంటలనార్పేటపుడు
అతడు నా చేతుల్ని తాకుతూ 
నీళ్ళకడవ అందుకొన్నాడు. – 229

ఈ క్రింది గాథలో వర్ణించిన ఘటన అతిశయోక్తిగా అనిపించినా గాథాకారుని చమత్కారం అర్ధం చేసుకోవచ్చు.

నీ గొంతువినంగానే నిన్ను చూడటానికి
ఇంటినుండి పరుగులిడుతూ బయటకు వచ్చింది
నీవు వెళిపోయాకా ఆమెను 
మోసుకు తీసుకెళ్ళాల్సివచ్చింది. - 506

ఎట్టకేలకు కలుసుకొన్న ప్రియుడు మౌనంగా ఉంటే ప్రియురాలు అతన్ని ఎలా మాటల్లోకి దింపుతుందో చూడండి

చాలామంది నీ గురించి ఎంతొ చెప్పారు
ఈనాటికి నిన్ను కళ్ళారా చూస్తున్నాను
ప్రియతమా ఏదో ఒకటి మాట్లాడు
నా చెవులు కూడా తేనెను గ్రోలనీ! - 805

తాను అనుభవిస్తున్న భాదనంతా ఈమె ఎంత గడుసుగా చెపుతున్నదో చూసారా

ప్రియసఖుడా
నిన్ను చూడని స్త్రీలు మాత్రమే
సంతోషంగా ఉంటున్నారు
సుఖంగా నిద్రపోతున్నారు
చెప్పినది వింటున్నారు
మాటలుకోసం తడుముకోవటం లేదు. – 418

ప్రియుని చూసిన ఆనందాతిశయంలో చెమర్చిన నయనాలను దాచుకోలేకపోయిందట ఓ పడతి..... (వేరే అన్వయాలు కూడా చెప్పుకోవచ్చు)

నిన్నుచూచినపుడు
తల్లిదండ్రులు పక్కనున్నారని 
ఏ ఉద్వేగాన్నీ ప్రదర్శించలేదుకానీ
ఆమె రెప్పలు మూసినపుడు
ఓ కన్నీటి బిందువు జాలువారింది. – 367

ఈ గాథలోని వర్ణన నేటి సినిమా పాటలవరకూ విస్తరించి ఉందంటే అదెంత బలమైనదో ఊహించండి.

తమ ప్రియులను కనీసం స్వప్నాలలో 
దర్శించుకొనేవారు ధన్యులు
నీవు నా పక్కన లేకుంటే కలలమాట అటుంచు
నిదురే రాదు నాకు. - 397

ఈ క్రింది గాథ చాలా చాలా అందమైన ఊహ...

నిన్ను చుట్టుకొన్న నా చేతుల్ని 
బలంతో తొలగించుకొని దూరదేశానికి వెళుతున్నావు
నా హృదయం నుంచి నీ రూపు తొలగించి చూపు
అపుడు నీ బలాన్ని నేను గుర్తిస్తాను. - 749

ఇస్మాయిల్ గారు “తెరచుకొన్న పద్యం” అన్నది ఇలాంటి వాటిగురించే. పద్యం ముగిసాకా ఆ తొలుచూలు పడతి
మనసులో కోరుకునేదేమిటో పాఠకుడే పూరించుకోవాలి.

తొలిచూలు పడతిని సఖులు
నీ మనసులోని కోరిక ఏమిటని అడగగా
సిగ్గుపడుతూ భర్తను చూసింది. - 115

బొల్లోజు బాబా

No comments:

Post a Comment