Friday, February 17, 2012

మూడు సంసారాలు...


కొట్టునుంచొచ్చిన భర్తకు
వడకట్టిన చెరువునీళ్ళను
దోసకాయ చెంబుతో ఇచ్చి
మామ్మ మేనత్తల జడలు
ముడివేసిన ఘనకార్యానికి
గంతులువేస్తున్న పిల్లలను వారించి
కుంపట్లోని చల్లారిన వంకాయతో
పచ్చిపులుసు చేయటానికి
వంటింట్లోకి వెళ్ళింది -  నాయినమ్మ

పేపర్లు దిద్దుతున్న భర్తకు
స్టీలు ప్లేటుతో జంతికలు ఇచ్చి
ఎక్కడెక్కడో ఆట్లాడుకొని వచ్చిన పిల్లల్ని
కాళ్ళుకడుక్కొని పుస్తకాలు తియ్యమని చెప్పి,
స్టవ్ వెలిగించి టీ పెడుతూ
“రాత్రికి కూరేంచేయమంటారూ” అంది  -  అమ్మ

ఆఫీసు బడలికను విదిలించుకొని
పిల్లల రీడింగ్ రూమ్ డోర్ దగ్గరకు వేసి
ఫ్రీజర్ లోని కర్రీని ఓవెన్ లో ఉంచి
డ్యూటీకి వెళ్ళేముందు నేపెట్టిఉంచిన
గ్రీన్ టీ ని ఫ్లాస్క్ నుంచి కప్ లో ఒంపుకొని
సోఫాలో కూర్చొని తాగుతూ
రిమోట్ తో టీవి ఆన్ చేసింది  -  నా భార్య

బొల్లోజు బాబా

10 comments:

  1. చాలా బాగుందండి. మరి కూతురు పరిస్థితి ఏమిటంటారు?

    ReplyDelete
  2. మీ అమ్మగారికీ, నానమ్మ గారికీ,
    "అఫీసు బడలిక", లేదు. నాకెందుకో ఆ తేడా కూడా కనపడుతోంది.
    శారద

    ReplyDelete
    Replies
    1. సంసారాల్లో, సమాజంలో - ఏ మార్పు వచ్చినా వాటికి ప్రతీక గా ముందుగా చూపబడేది స్త్రీ పరమైన / స్త్రీ వైపుగా చూపుతూనో ముఖ్యాంశంగా. (ఈ మధ్య చాలా ఎక్కువగా ఇవే వ్యాసాలు, కథలు, కవితలు). అమ్మ/భార్య వంట గదికి దూరమవటం ఆరోపణ. ఇక్కడ నాయనమ్మ కాలానికి - ఆమెకి పుట్టినింటి ఆదరణ మెండు. అన్నదమ్ముల, తోడికోడళ్ళ అభిమానం కి కొడవ లేదు. సంసారాన్ని మోయాల్సిన అవసరం లేదు. కీర్తనో/పద్యమో వల్లే వేస్తూ కూర తరుక్కుంటే అదే పెద్ద రిలాక్సేషన్. తన ఊరి సాంప్రదాయాన్నో, ఒక తీర్థ యాత్ర పుణ్యాన్నో తలుచుకుని తృప్తిపడే ప్రపంచం ఆమెది. అప్పుడూ ఆరళ్ళు, అనాదరణ కొందరికి తప్పలేదు. ఇక అమ్మల నాటికి భర్త సహోద్యోగుల భార్యలు, స్నేహితులు - విహారయాత్రలు, బజారు పనుల్లో సగపాళ్ళు, సరదా ఆటలు ఉండేవి. కూనిరాగాలు తీస్తూ ఇంటి వెనక సన్నజాజి పందిరిమీద మొగ్గలు తుంచుతుంటే అదొక వెల కట్టలేని ఆనందం. తనకంటే పిల్లలు సుఖపడాలన్న తాపత్రయం, తపన పడేది. ఇక ఇప్పుడు - వస్తూనే నోటికి హితవయ్యో కానిదో పడేసి, పక్కగా సోఫాల్లో పిల్లలు ఆడే వీడియో గేమ్స్ మౌనంగా చూస్తూ, ఇంటి పని ఇక ఏమి చెయ్యాలో టెక్స్ట్ చేసిన భర్త కి వర్చ్యుయల్ గా "ఊ" కొడుతూ, నెల క్రితం వచ్చిన ఈ-మెయిల్ కి జవాబు ఇవ్వాలని మరొక్కసారి అనుకుంటూ - ఇలా అంతులేని యాంత్రికటని మోస్తూ. మళ్ళీ వేగు లోకి వెళ్ళాక తప్పదని పడక మీదకి చేరుతూ - ఎప్పుడైనా ఒక సినిమా పాట వింటూ. కొందరికి పిల్లలూ లేరు, అసలు పెళ్ళి కి తైమూ లేదు. వెకేషన్ సంగతి అపుడు చూద్దాములే అనుకునే నిర్లిప్తత. రేపటి ప్రణాళిక లేదు/కల రాదు. తరవాతి తరం అన్న ఊహకి తావు లేదు. వీళ్ళ పిల్లలకి బాట పరిచేసి ఉంది. వాళ్ళీ మాత్రం కూడా మనుషుల్లా మెసలారు - మీటలు నొక్కుతూ - మరల్లో మరమనుషుల్లా. కావచ్చు.

      నిజమే, అమ్మ/భార్య అన్న ప్రధాన పాత్ర తో ఇలా ఉద్యోగి గా కూడా లక్షణం సంతరించుకుంది ఆడది - అందుకేగా పెళ్ళిళ్ళు చెయ్యలేని మధ్యతరగతి అమ్మానాన్నలు లేరు. అక్క పోతే బావ కి కట్టబడే మరదళ్ళు లేరు. చదువు మాని అన్నకి వండిపెట్టే చెల్లెళ్ళు లేరు. పెళ్ళి మాని తమ్ముళ్ళని కాచే ఉద్యోగి అక్కలూ లేరు.

      ఇంత వరకు సరే.

      తాతయ్య - నాన్న - నేను : మార్పు మాటో. పొలాలు వదిలి, ఊర్లు వదిలి ఉద్యోగాల్లోకి వలసలు, బెల్బాటంస్, క్లబ్స్, షేర్స్, రియల్ ఎస్టేట్, పబ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఐ పాడ్స్, సెల్ ఫోన్స్, 2 సంపాదనలు ఇస్తున్న సౌఖ్యాలు - ఇదొక వరవడి.

      అభివృద్ది కి తావు ఇస్తూ, సమతుల్యం చెడకుండా మార్గ రచన జరగలేదు కనుకా సంసారాలు, సాగుబాటు, జరుగుబాటు అన్నీ దెబ్బ తిన్నాయి - ఆరోగ్యాలు చెడాయి, అనుబంధాలు ముగిశాయి - ఎంత తరిచినా మరొక మార్గమూ లేదు. రాట్ హోల్ లో అంతా బందీలం.

      నిన్న రాత్రి 10 కి ఆశీఫు నుంచి వచ్చినది మొదలు వెంటాడిన మీ కవిత తాలూకు కొలిక్కి రాని ఆలోచనల సగ రూపుది.

      Delete
  3. వంశీ కృష్ణా, తెలుగుయాంకి, శారద గారలకు థాంక్సండీ
    కూతురి పరిస్థితి ఆలోచించటానికే భయంగా ఉంది. నిజానికి మరో తరాన్ని సూచిస్తూ .... మా అబ్బాయి హోం వర్క్ చేసుకొంటున్నాడు అని ఆఖరు లైనుగా ఉంచాలనిపించినా – ప్రయోజనం కనిపించక పెట్టలేదు.
    శారద గారు క్రింది వివరణ చూడండి

    అద్బుతమైన వ్యాఖ్య వ్రాసిన ఉష గారికి ధన్యవాదాలు
    కవితలో చెప్పలేకపోయిన, చెప్పని అనేక అంశాలను మీరు స్పృశించారు. థాంక్సండి.

    రాట్ హోల్ లో అంతా బందీలం
    ఎంచ చక్కగా చెప్పారూ! నిజమే ఆధునికజీవనం మనిషిని యంత్రాల్లా చేసేసి రాట్ హోల్స్ లో బంధించింది.
    బంధువులు లేరు, స్నేహితులు లేరు, (ఒక వేళ ఉన్నా అన్నీ అనుమానాలే), త్రిబుల్ బెడ్ రూం ఇల్లుకూడా పెద్దవాళ్ళను ఉంచుకోవాలంటే ఇరుకే.

    ఇక ఈ కవితలో స్త్రీ పైన విమర్శలేమీ చేయలేదు.

    ఆమెకు ఉద్యోగం, ఇంటిపనీ కూడా తప్పటం లేదు (ఫ్రీజర్ లో కర్రీని ఓవెన్ లో ఉంచటం), భర్తతో కలిసుండేదీ కాలం కూడా తగ్గిపోతుంది (కవితలో ఈమె వచ్చే సరికి భర్త డ్యూటికి వెళిపోయాడు) – ఒంటరితనం.

    చిన్న వెసులుబాటేమిటంటే చాలా చోట్ల ఇలాంటి సందర్భాలలో భర్తలు కూడా ఇంటిపనిని పంచుకొంటున్నారు (కాఫీ పెట్టటం)

    దీనికంతటికీ కారణం క్రమక్రమంగా పెరిగిన కన్య్సూమెరిజం. (మూడు తరాల్లో పెరిగిన వివిధ పరికరాలు).

    క్రమక్రమంగా పెరిగిన వర్క్ కల్చర్: (రెండోతరంలోనే ఇంటికి పేపర్లు తీసుకొచ్చి దిద్దటం. మూడో తరంలో ఇద్దరూ పనిచేయాల్సి రావటం)

    ఒక స్త్రీ సంసారం అనగానే – ఇల్లు భర్త, వంటిల్లు, తిండి, వస్తువులు అనే వాటికే ఎక్కువ ప్రాధాన్యత కనుక వాటినే తీసుకోవటం జరిగింది. (ఇక్కడ సంసారం అన్న పదం కొరకు, వ్యక్తిత్వం కాదు గమనించగలరు)

    మిమ్మలను ఇంత కలకలానికి గురిచేసిందంటే, నా కవితాజన్మ ధన్యమయినట్లే భావిస్తున్నాను.

    మరొక్క సారి ధన్యవాదములతో

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. బాబా గారు,

    అందుకే అది సగ భాగం అన్నాను. స్వీకరించినందుకు థాంక్స్. మరే ఫిల్టర్ లేకుండా యధాతధంగా రాసాను ఆ స్పందన. మిగిలిన ఆలోచనలు సాగగా - స్త్రీ ని ప్రతీక గా చూపుతూ యాంత్రికతని, ఏకాంత నిర్లిప్తతని చూపారా అనుకున్నాను. రెండో సగం లో మీ కవితాత్మాకి చేరువగా ఉంది నా ఊహ.

    సుజాత - థాంక్స్ ఆండీ.

    ReplyDelete