Thursday, May 29, 2008

ఉదయగీతం

ఉదయగీతం

దినం యవ్వనంతో ఉన్నవేళ
పెదవులు హృదయ రహస్యాల్ని
దాచలేవు.

జాజుల వాసనకు తనువు
సాంద్రరూపమౌతుంది.

పేదవాని స్వర్గ ద్వారాలు
తెరచుకొన్నవేళ…….

ప్రణయ తేజం దేహాల్ని
ప్రకాశింపచేస్తూంటే,


జ్వలిస్తూ, దహిస్తూ,
తపిస్తూ, తరిస్తూ
వలపుల కొలిమిలో
జంటగా ద్రవించటం
సృష్టి రహస్య చామరం.

బొల్లోజు బాబా

Friday, May 23, 2008

అవసరమేనేమో?

కసాయివాడు రేపేది చేయాలనుకొంటున్నాడో
తెలియని గొర్రె పిల్ల ఆనందాలు మనవి.
తెలియక పోవటం ఒక వరం కాదూ!

దొరికిపోయే కాలానికి వేటగానివద్దకే కుందేలు పరిగెట్టినట్లు
మనమూ కృషీ బ్యాంకులు, పృడెంషియల్ బ్యాంకుల వైపే నడుస్తాం.

సముద్రపు ఒడ్డున రాసే రాతలు మన ఆలోచనలు.
ఇలా రాస్తూంటే అలా చెరిపేస్తూంటాయి
ఆధునిక కాల ఆర్ధికవిధానాలు, కారీరిజం,
గొర్రె చర్మం తొడుక్కున్న తోడేళ్లు.

నేను నీతిగా బతుకుతున్నాను అనెవడన్నా అంటే
వాడేదో రహస్యం దాస్తున్నాడన్నమాట.

చిన్నప్పుడు అద్దంలో చందమామను చూసి మోసపోయినట్లుగా
పెద్దయ్యాకా వెలిసిపోయిన కలల్ని మోసుకుంటూ ........


ఏకకాలంలో మంచుపూల వర్షాన్ని
వడగాడ్పుల ఉక్కపోతనీ సృష్టించగల
సంక్లిష్టతలజీవనాన్ని ఎదుర్కోవటానికి
ఇంత తెంపరితనం అవసరమేనేమో!


బొల్లోజు బాబా

Tuesday, May 20, 2008

అవని ఏమంది?

గ్లోబల్ వార్మింగుపై నేను వ్రాసిన కవితను ఈ క్రింది బత్తి బంద్ లింకులో చూడవచ్చు.

http://battibandh.wordpress.com/2008/05/20/


బొల్లోజు బాబా

Tuesday, May 13, 2008

స్వార్జితం

వనమంతా విచ్చుకున్న వసంతం,
తేనెలో ముంచితీసినట్లుండే కోకిల గానం,
యవ్వన నిగారింపుతో మిడిసిపడే సుమాలు,
పుప్పొడి పూసుకొని మత్తుగా తిరిగే తుమ్మెదలు,
ఇవన్నీ నావి మాత్రమేకావు,
నాకు మాత్రమే సొంతంకావు.



ఉదయాన్నే తలుపుతట్టే వెచ్చని లేతకిరణాలు,
మట్టివాసనను గుప్పుమనిపించే సాయింకాలపు వాన,
ఆకాశం అప్పుడప్పుడు పుష్పించే వరదగుడులు,
రాత్రికి తెరలేచింతరువాత చల్లగా వీచే వెన్నెల గాలి,
ఇవన్నీ నావి మాత్రమేకావు
నాకు మాత్రమే సొంతం కావు.



నాగుండెలో సుళ్లు తిరిగే
కలలు, కన్నీళ్లు, ఆశలు, ఆవేశాలు,
నాచుట్టూ మొలచిన
భాద్యతలు, బరువులు, బంధాలు, భయాలు,
ఇవికూడా పూర్తిగా నావి మాత్రమే కావు
వీటిలో దేవుడికి కూడా వాటా ఉంది.



అయితే
నీకై దాచిపెట్టిన నాప్రేమ మాత్రం
అచ్చంగా నాదే!
నీ పట్ల నేను చూపే సంకల్పం మాత్రం
స్వచ్చంగా నాదే!

స్వప్న లోకం


తెల్లారేసరికల్ల
ముత్యం భశ్మం అయినట్లు
స్వప్నం భళ్లుమంటుంది .
వృద్ధ కన్యని పరిణయమాడిన
రాకుమారుడూ లేడు,
మహాపతివ్రత మనోప్రపంచపు
శృంగార విహార యాత్రలూ లేవు.
బ్రహ్మచారితో అంతవరకూ
సరసమాడిన సినీతార
అమాంతం అదృశ్యమవుతుంది.
నిరు్ద్యోగి గ్రోలుతున్న
ఉద్యోగామృతధారలు ఆగిపోతాయి.
తెల్లారేసరికల్లా
స్వప్నం భళ్లుమంటూంది.
ముత్యం భశ్మం అయినట్లు.
సాయింత్రం నాన్న కొనని ఐస్ క్రీం తిన్న
కుర్రాడిచేతిలో కప్పు మాయమవుతుంది.
క్షుధార్తునికి వడ్డించిన విస్తరి
కన్ను తరచేలోగా కప్పుకొన్న గోనె సంచీ అయిపోతాది....
దేవుడినే ఓదార్చి, వీధి దాకా సాగనంపిన కవికి కూడా
తెల్లారే సరికల్లా
స్వప్నం భళ్లుమంటూంది.
ముత్యం భశ్మం అయినట్లు.


బొల్లోజు బాబా

Friday, May 9, 2008

కయితిన్నప్పుడు

కయితిన్నప్పుడు

కయితిన్నపుడు గుండొచ్చి
కొండనాలిక్కి చేప్ముల్లై గుచ్చుకోవాల.
కయిత చదూతూంటే లోపల్లోకం
చింతచెట్టుక్కట్టిన టైరుయ్యాల్లో
దేహంలా తేలిపోవాల.


ఇస్కూలు పిల్లగాడు బణ్ణుంచొచ్చి
అపచెప్పే సగంసగం పజ్జెంలా
పదిమందికీ చెప్పుకొనేదిలా ఉండాలి కైతంటే.

కయిత గుర్తొచ్చినపుడు
గుడ్డులోపలి కోడిపిల్ల పెంకును పొడిచినట్టు
గుండెలోపలేదో పొడిచినట్టుండాల.

కయితిన్నపుడు దేహం, దేహమంతా
తప్పెటై దరువెయ్యాల.
చెలకలో నీరంతా తాగేసే
పీతబొక్కలా ఉండాలి.
కమ్మిచ్చు గుండా గుండెని
తీగగా సాగదీసింట్టుండాల.

కయిత్తమంటే అపుడే పుట్టిన
దూడ గిట్టలంత మెత్తగా ఉండాల.
రాత్రేల నా ఆడదాని కళ్ల తడిలో
ఆపడే నా ముఖమంత మెత్తగా ఉండాల.
నామట్టీ, నీరు, గాలి, నిప్పు, ఆకాసం, అమ్మ
గుర్తుకురావాల.

బొల్లోజు బాబా

నాన్న మరణం

నాన్న మరణం పై

దేహాన్ని ఇంతకాలం ధరించిన దుస్తులు
చిలక్కొయ్యకు వేలాడుతున్నాయి.
"జనమిత్ర" ఈ రోజు రావాలి అని ఎదురుచూసే
నయనాలు నిస్తేజమై పోయినాయి.

"సాహితీ-యానం" కు దిశానిర్ధేశం చేసిన
"సువర్ణశ్రీ" నడక నిలచి పోయింది.

యానాన్ని భారతంలో విలీనంచేయటంలో
ఉరకలెత్తిన రక్తం, జ్జాపకాలని మాత్రమే మిగిల్చి పోయింది.

ఆలోచనలు ఆగిపోగా కలం మూగపోయింది.
రాలిపడ్డ అక్షరాలు మాత్రం తీపిగురుతులైనాయి.

ఫ్రాంస్ ను యానాన్ని ఇంతకాలం కలిపిన
కలంలో సిరా ఇంకి పోయింది.

దేహం దగాచేయగా "యానాం చరిత్ర" అనే పుస్తకం
సగం చెక్కి వదిలేసిన శిల్పమై విలపిస్తుంది.

"తెలుగు రత్నాన్ని" గర్భంలో దాచుకున్న
యానాం ఇపుడో "రత్నగర్భ".


బొల్లోజు బాబా

వివరణ
సువర్ణశ్రీ అనే కలం పేరుతో మానాన్నగారైన శ్రీ బసవలింగం గారు అనేక రచనలు చేసారు. జనమిత్ర అనేది ప్రాంతీయ వారపత్రిక . ఫ్రెంచ్ కాలనీగా ఉండిన యానాన్ని 1954 లో భారతావనిలో విలీనం చేయటానికి జరిపిన ఉద్యమమంలో వీరు పాల్గొన్నారు. వీరు ఫ్రెంచ్ భాషోపన్యాసోపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. యానంలో ఉండే ఫ్రెంచ్ సిటిజన్లు ఫ్రాంసు తో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలను వీరు వ్రాసి ఇచ్చేవారు. "యానం చరిత్ర" అనే పుస్తకాన్ని వ్రాయడం మొదలు పెట్టి పూర్తవకుండానే పరమపదించారు. వీరి సేవలను పుదువై ప్రభుత్వం గుర్తించి "తెలుగురత్న" అనే బిరుదును ప్రధానం చేసింది.



Thursday, May 8, 2008

మృత మన్ను


ఎన్నో భావాల్నిపలికించిన ఈ నేత్రాలు అభావమైన దృశ్యం.
గాలిని పదాలుగా, నవ్వులుగా, ఆశలుగా, ప్రేమలుగా
మార్చిన ఈ స్వరతంత్రులు నిర్జీవమైన వేళ.........
ఇక ఈ చెవులు తీతువుపిట్ట సుదూరగానం వినలేవు.
వానజల్లుల శబ్ధాలను స్పర్శించలేవు.
ఈ వీధిగాయకుని అస్థిపంజరమిక మట్టిపొరల క్రింద పడి ఉంటుంది.
తన నీడల్లోకే నా నేస్తం కనుమరుగయ్యాడు.

ప్రజలందరూ వెలుగు ప్రపంచంలోకి ప్రవహిస్తుండగా
ఈ ఖాళీ రాత్రి లోంచి నీ జ్జాపకాలు ఉదయిస్తాయి
ఆ నీడల మద్య తచ్చాడుతూ నేను ..........
హృదయంపై భోరున ఒకటే కుంభవృష్ఠి .

వయసుపెరగడమంటే మనం ప్రేమించేవాళ్లను
ఒక్కొక్కళ్లనూ కోల్పోవటం కాదూ.......
బాధపడుతూ కూర్చుంటే జీవితం ఆగిపోదట
సాగిపోతూనే ఉంటుందట - ఎవరో అంటున్నారు

బాధంటే లేకపోవటమే. లేకపోవటమే బాధ.
శూన్యంలో జ్వలించే అంతులేని నిట్టూర్పే బాధంటే
జ్జాపకాలు అస్ఫష్టం కానంతవరకూ
బాధ ఓ సర్పపరిష్వంగమే!
భావానికీ రూపానికీ మద్య పరచుకొనేదే వేదన
కలకూ వాస్తవానికీ దూరం చెరిగే వరకూ
వేదన ఓ దృతరాష్ట్రకౌగిలే!

నాకు తెలుసు ప్రతి క్రియా నిర్ధేశితమేనని
నాకు తెలుసు ఈ బాట ముగింపేమిటో
నాకు తెలుసు నేను క్షతగాత్రుల బృందంలో ఒకరినని
కాలం సముద్రంలా అన్నింటినీ తనలో కలిపేసుకోగలదని
అయినా జీవితమంటే సాయంకాలపు వ్యాహ్యాళి కాదుగా!

చాన్నాళ్ల క్రితమే సిగరెట్లు మానేసినా
ఇపుడు ఒకటి కావాలనిపిస్తుంది.


బొల్లోజు బాబా
( మిత్రుని మరణం పై)


Monday, May 5, 2008

తెలుగు మోనాలిసా

బుసాని పృధ్వీరాజ్ వర్మ గారి గీసిన మరొక అద్భుతమైన చిత్రానికి నా కవితా స్పందన





తెలుగు మోనాలిసా

అతడామెను

నడిచే చందమామ అనీ
పరచుకొన్న వెన్నెలనీ
నిలచిపోయిన వసంతమనీ
అని వర్ణించాడు.

ఆమె నవ్వును
పూల పరిమళంతోను
సెలయేటి స్వచ్చతతోను,
రత్న కాంతుల సవ్వడితోను పోల్చాడు.

ఆమె కళ్లను
బటర్ ఫ్లై విప్పారిన రెక్కల ద్వయమనీ
ఆత్మలోక ద్వారాలనీ
రెండు పున్నమిలనీ
మిగిలిన దేహమంతా
ఆ రెండు కళ్లకూ పొడిగింపనీ అన్నాడు.

ఆమె చూపుల్లో
ప్రేమలోక సంగీతముందనీ,
కాంతులీను కరుణా ఝురిలున్నాయనీ,
అమరత్వానికి ఆహ్వానాలున్నాయనీ అన్నాడు.

ఆమె మాటలు
నెరళ్లు తీసిన నేల అడుగున
ఉండే విత్తును మొలకెత్తించే ఆర్ధ్రతనీ,

పరాజితుడిని కూడా అజేయుడిని
చేయగలిగే మంత్రమోహన శక్తులనీ,

తేనె జలపాతాలు కుచించుకుపోయి ఆమె

పెదవులపై తారాడే శబ్ధ తరంగాలయ్యాయనీ,


ఎన్నో అన్నాడు
అతడామె గురించి చాలా చెప్పాడు

కానీ ఆమె మాత్రం
ఒక చిరునవ్వు శాపమిచ్చి సాగిపోయింది.
తెరచాటు మనిషి కదా!




బొల్లోజు బాబా



Saturday, May 3, 2008




యానం విమోచనోద్యమం పుస్తకం గురించి
యానం అనేది గొదావరి ఒడ్డున ఉన్న ఒక యూనియన్ టెరిటరీ. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచేరీ (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, 1954 లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి. భారత స్వాతంత్ర్యసంగ్రామం గురించి ప్రతిభారతీయునికి కొద్దోగొప్పో అవగాహన ఉంటుంది. కానీ 1947 లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత 7 సంవత్సరాలపాటు స్వతంత్ర్య భారతావని లోని కొన్ని ప్రాంతాలను ఫ్రెంచి వారు పరిపాలించారన్న విషయం, చరిత్ర చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి వారిని కూడా దేశం నుంది వెళ్ల గొట్టటానికి జరిపిన పోరాటాలు ఎట్టివి? వాటిలో హీరోలెవ్వరు? అసువులు బాసిందెవ్వరు? వంటి ప్రశ్నలకు శ్రీ వి. సుబ్బయ్య గారు వ్రాసిన సాగా ఆఫ్ ఫ్రీడం ఆఫ్ ఫ్రెంచ్ ఇండియా, శ్రీ పాంచ్ రామలింగం గారి ఆత్మకధ వంటి పుస్తకాలలో అనేక విషయాలు తెలుసుకోవచ్చు. కానీ వీరంతా పాండిచేరికి చెందిన వారు కావటంతో అందులోని విషయాలన్నీ పాండిచేరి స్వాతంత్ర్య పోరాటానికి చెందినవై ఉండటము, యానానికి సంబందించిన అంశాల ప్రస్తావన తక్కువగా ఉండటము జరిగింది.
యానంలో జరిగిన స్వాతంత్ర్యపోరాటము యొక్క విశేషాలను రికార్డు చేయాలనే ఉద్దేశ్యంతో నేను యానాం విమోచనోద్యమము అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది.
1954, జూన్ 13 జరిగిన యానం విమోచననేపద్యం, ఆనాటి భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే పుస్తకం. పుస్తకంలో ఉటంకింపబడిన విషయాల మూలాలను ( రిఫరెంస్లు) కూడా అక్కడే చెప్పటం జరిగింది.
యానం విమోచనం జరుగుతున్నపుడు ఇక్కడ జరిగిన సంఘటనలు జాతీయంగా అంతర్జాతీయంగా విధంగా ప్రస్తావించబడ్డాయి? మిగిలిన ఫ్రెంచికాలనీలను మరియు ఫ్రాంస్ ను యానం విమోచనం విధంగా ప్రభావితం చేసింది? యానం విమోచనాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం విధంగా పరిగణించింది? వంటి ప్రశ్నలకు జవాబులు పుస్తకంలో దొరుకుతాయి.

చిత్రానికి కవిత

బుసాని పృధ్వీరాజు వర్మ గారు తన బ్లాగ్ లో తాను చిత్రించిన ఒక అద్భుతమైన చిత్రాన్నుంచి దానిపై కవిత వ్రాయమని అడిగారు. దాన్ని చూసి స్పందించి వ్రాసినది.
http://pruthviart.blogspot.com/2008/04/blog-post_30.html




ఒక సన్నని గీత
మనో కాన్వాసుపై విస్తరించి
ఆకైంది, కొమ్మైంది, చెట్టైంది,
కొండమలుపు వద్ద నదీ నడుం వంపైంది.

ఒక వర్ణ బిందువు
మది తెరపై వలికి
తూలికైంది, పక్షయింది, పక్షి గూడైంది,
తల్లి హృదయమై ఆకలి తీర్చుతుంది,

చిత్రకారుడిది , కవిదీ కూడా!

బొల్లోజు బాబా

Friday, May 2, 2008

యానాం విమోచనోద్యమం

యానం విమోచనోద్యమం పుస్తకం గురించి

యానం అనేది గొదావరి ఒడ్డున ఉన్న ఒక యూనియన్ టెరిటరీ. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచేరీ (పాతపేరు పాండిచేరీ) తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచేరీ, కారైకాల్, మాహే మరియు యానంలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 శతాబ్ధాల పాటు ఫ్రెంచివారి పాలనలో ఉండి, పంతొమ్మిదివందల యాభైనాలుగులో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందాయి.

భారత స్వాతంత్ర్యసంగ్రామం గురించి ప్రతిభారతీయునికి కొద్దోగొప్పో అవగాహన ఉంటుంది. కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు లో బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత 7 సంవత్సరాలపాటు ఈ స్వతంత్ర్య భారతావని లోని కొన్ని ప్రాంతాలను ఫ్రెంచి వారు పరిపాలించారన్న విషయం, చరిత్ర చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి వారిని కూడా ఈ దేశం నుంది వెళ్ల గొట్టటానికి జరిపిన పోరాటాలు ఎట్టివి? వాటిలో హీరోలెవ్వరు? అసువులు బాసిందెవ్వరు? వంటి విషయాలతొ నేను యానాం విమోచనోద్యమము అనే పుస్తకాన్ని వ్రాయటం జరిగింది.
13-6-1954 న జరిగిన యానం విమోచననేపద్యం, ఆనాటి భావోద్వేగాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అప్పుడు జరిగిన వివిధ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం.

ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను క్లుప్తంగా ఈ క్రింది లింకులో పొందుపరిచాను. చదవండి।
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post.html